అతన్ని నేనే పరాయి చేస్తున్నానేమో!

చరిత్రని విస్మరించేవారు కొత్త చరిత్రల్ని రాయలేరు. వారు గత కాలపు విషాద చరితలకి తిరిగి ప్రాణం పోస్తారంతే.

నిషిగా అతని మూలాలు, నా మూలాలు ఒక్కటే. ఒకే జాతికి, జాతీయతకి చెందిన వాళ్ళం.  అతనూ నాలానే ఈ భూమ్మీదనే పడ్డాడు.  ఈ వీధుల్లో అచ్చు నాలానే తిరిగాడు.  నే తాగిన నీళ్ళు, నే పీల్చిన గాలినే తనూ పంచుకుంటాడు.  నాలాగే కలలూ వుంటాయి, కన్నీళ్ళూ వుంటాయతనికి.  ఒక్క దేవుళ్ళు మినహా అతనికీ నాకూ అదే చదువు, అదే భాష, అదే కవిత్వం, అవే కళలు, అవే బలాలు, అవే బలహీనతలు….అంతా ఒక్కటే.  నాలాగే చట్టానికి భయపడతాడు.  ఏలిన వారి దయ కోసం ఎదురు చూస్తాడు.   ఉద్యోగాలు చేస్తాడు.  ఇంట్లో చికాకులు పడుతుంటాడు.  నాలాగే పిల్లల్ని ముద్దాడతాడు. విశ్వాసాలు, ఆచారాలు వేరేమో కానీ అతను కూడా ఈ దేశంలో నా అంతటి పౌరసత్వాన్ని కలిగి వున్నవాడే.  నాలాగే వోటు హక్కున్న వాడే.  నా అంత పన్నులు కట్టేవాడే.  కానీ అతను నా మనిషి కాలేక పోతున్నాడు. ఈ నేల మీద నా అంత ఆత్మ విశ్వాసంతో వుండలేక పోతున్నాడు.  మెల్ల మెల్లగా నాకు పరాయి అయిపోతున్నాడు.  కాదు కాదు, అతన్ని నేనే పరాయి చేస్తున్నానేమో.  అందుకే నేను దేశ భక్తుణ్ని కాగలిగాను.  అతని పేరు, తిండి, ఆహార్యం నాకు అభ్యంతరకమై పోయి అతను సందేహాస్పదుడిగా మిగిలి పోతున్నాడు.

నేనంటాను అతనితో ఎంతో దయగా “ప్రపంచంలో ఏ దేశంలోనూ నువ్వింత భద్రంగా వుండలేవు”.  అతని చూపులు బాధగా అడుగుతుంటాయి “కానీ నేను నీ అంత భద్రమా?” అని.  భద్రంగా వుండటమంటే చంపేయబడటం కాకపోవటమొక్కటే అనుకుంటారు కదా నాబోటి వాళ్ళందరూ!

అవును, నేను మెజారిటీ. అతను మైనారిటీ!

****

మనం నిజాల్ని దాచటానికి అలవాటు పడ్డాం.   అబద్ధాలు చెప్పటానికి వ్యసన పడ్డాం.  మనం పుకార్లకి బానిసలం.  చరిత్రని విస్మరిస్తాం. పురాణాలకి ప్రాచుర్యమిస్తాం.  హేతువుని పాతిపెడతాం.  నమ్మకాల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగింపు చేస్తుంటాం. జంతువుల్ని పూజిస్తాం. జంతువుల కోసం మనుషుల్ని చంపుకుంటుంటాం.   ప్రభుత్వం అంటే అధికారమనీ, ప్రజలంటే వొట్టి మూక అని భావిస్తుంటాం.  ప్రతి మనిషి గొప్పతనాన్ని వాడి కులమో, మతమో నిర్ధారిస్తుందని దుర్మార్గంగా నమ్మేస్తుంటాం.  మనిషి సామూహిక జీవితాన్ని హెచ్చు తగ్గులతో చిద్రం చేస్తుంటాం.  ప్రతి మనిషి ముఖం మీద ఏదో ఒక ముద్రల్ని గుద్దేస్తుంటాం.

దేశానికి, మతానికి, జాతికీ, సంస్కృతికీ, దైవ విశ్వాసాలకి తేడా చూడలేని వాళ్ళం.   మతం ఒక్కటే జాతిని నిర్ధారించదని, ఒకే మతాన్ని  ఒకటి కంటే ఎక్కువ జాతులు అవలంభించవచ్చని, ఒకే జాతి ఒకటి కంటే ఎక్కువ మతాల్ని అనుసరించవచ్చని, భాషల్ని పలకొచ్చని తెలియని స్వాతిముత్యాలం.  కొందరి హక్కుల్ని కాలరాసే హక్కుని మరి కొందరికి కట్టబెట్టాలని వాదిస్తుంటాం.  అందుకు రాజ్యాంగాలు, చట్టాలూ అడ్డం వస్తుంటాయని సణుగుతుంటాం.    భిన్న జాతులు ఒక దేశంగా మనగలగాలంటే వుండాల్సిన సహనం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే చిరాకు పడుతుంటాం.   భాష, సంస్కృతి, జాతుల పరంగా వైవిధ్య పూరితమైన సమాజంలో శాంతికి అవసరమైన ప్రజాస్వామిక ప్రవర్తనల గురించి ఏ ప్రతిపాదనొచ్చినా కసిగా పళ్ళు నూరుతుంటాం.   వ్యక్తి స్వేఛ్ఛని గౌరవించలేని మూక మనస్తత్వాన్ని పెంపొందించుకున్న వాళ్ళం. అన్నీ మనవే, అంతా మనదే అనుకునే స్వార్ధపరులం.   ఒక శాంతియుత ప్రజాస్వామిక వ్యవస్థకి అవసరమైనంత క్రమశిక్షణ లేనివాళ్ళం.  బహుళత్వాన్ని రాసుకున్నట్లుగా ఆమోదించే హృదయ పరిపక్వత లేని వాళ్ళం.

నిన్న మొన్నటి చరిత్రని కూడా పుక్కిటి పురాణాల్లా కొట్టి పారేస్తుంటాం. అదంతా ఏదో పురాతన కొట్లాటలా బుకాయిస్తుంటాం.    మంచు కొండల కింద నిప్పుల కందకాల్ని మండిస్తుంటాం.  యాపిల్ పండుని కోసినట్లు ఒక జాతిని మనం కూడా పొరుగింటోడితో కలిసి ముక్కలు చేసి పంచుకుంటాం.  ఒక జాతిని నిర్బంధించి వాళ్ళకి స్వాతంత్ర్యాన్ని ప్రకటించగలం.  ఒకరిని మలమలా మాడ్చి మనం సంబరాలు చేసుకోగలం.  మరొకరి వీధులకి అగ్గి పెట్టి అంతా ఉజ్వలంగా వుందని ఉర్రూతలూగుతుంటాం.  హింసకి, రక్తపాతానికి ఉత్తేజితులమయ్యే వాళ్ళం.  సర్వ నాశనాన్ని రోమాంచితంగా భావించే వాళ్ళం.  యుద్ధానికి క్రికెట్ మాచ్ కి తేడా తెలియని వాళ్ళం.  వినోదానికి విధ్వంసానికి తేడా తెలియని దేశభక్తులం.  సైన్యాల మీద తీసిన సినిమాలు చూసి సెల్యూట్ కొట్టే వాళ్ళం.  మరో ప్రాంతం రోడ్ల మీద మిలటరీ పదఘట్టనలకి మైమరిచిపోయే వాళ్ళం.  ఏదైనా మనదాకా వస్తే మాత్రం గుక్క పట్టి ఏడ్చేవాళ్ళం.
****

పదుల కొద్దీ మతాలు, వందల కొద్దీ జాతులున్న సమాజంలో ఏదో ఒక మతం మాత్రమే దేశ జాతీయవాదానికి ప్రతీకగా నిలవగలదా?  ఆశ్చర్యం!  మనం అచ్చు అదే మూర్ఖత్వాన్ని అవపోశన పట్టేశాం.  అంతే కాదు జాతీయవాదం నెపంతో సరిహద్దులు దాటి కూడా బైటకి దండయాత్రలు చేయాలన్న వాదనకి మురిసిపోతూ చప్పట్లు కొట్టేస్తున్నాం.  మనల్ని మనం ఎక్కడో ఊహించేసుకుంటున్నాం.  ఇన్నాళ్ళుగా ఎవరూ చేయ సాహసించలేని దుర్మార్గ కృత్యానికి పాల్పడి ఎవరూ చేయలేనిదేదో చేసేసామన్న అజ్ఞాన ఆవేశంతో ఉర్రూతలూగుతున్నాం.  మనకి సత్యంతో పనిలేదు.  వాస్తవంతో అసలు పట్టింపే లేదు.  భవిష్యత్తు గురించి అసలే మాత్రం జాగరూకతే లేదు.  దేశాలకి దేశాలు, జాతులకి జాతులు విడిపోవటాలు, ఐక్యమవటాల పట్ల ఎంత మాత్రం విషయ పరిజ్ఞానం లేని పరమానందయ్య శిష్యులం.  ఎవడో ఊగిపోతూ విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తే ఈలలేసే గోలరాయుళ్ళం.  మనకి మనమే హీరోలం.  మనకి మనమే దండలేసుకొని గంతులేసే వెంగళ్రాయుళ్ళం.  మనమంతా సామూహిక అజ్ఞానానికి వీర సైనికులం.

ఒక పౌరుడి మీద మరో పౌరుడి ఆధిపత్యం జాతీయవాదం అవుతుందా లేక దాష్టీక జాతివాదం అవుతుందా? ఆసలు ఒక వర్గం మీద మరో వర్గం పెత్తనం చేయటం ప్రజాస్వామికం అవుతుందా లేక ఫాసిజం అవుతుందా?   ఇక్కడ మైనారిటీ మతం మరో దేశంలో ఆధిపత్య మతమైతే ఇక్కడి ఆ మతస్తులు మెజారిటీ మతస్తుల మోచేతి నీళ్ళెందుకు తాగాలి?  అంటె నువ్వు ద్వేషించే వేరే దేశస్థులే నీకు ఆదర్శనీయులా?  అనుసరణీయులా?
****

మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవాలి.  మనం రూపాయి కంటే డాలర్ని ఎక్కువ ప్రేమిస్తాం.  రిక్షా కార్మికుడు కూడా పన్ను కట్టిన సొమ్ముతో ఉన్నత చదువులు చదివి డాలర్లిచ్చే ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయే దేశభక్తి మనది.  మనం లేదా మన పిల్లలు అక్కడికి చేరి ఆ ఆ అప్రాచ్యపు పాశ్చాత్య సంస్కృతిని ఎలాగోలా భరిస్తూ అయినా డాలర్ల రెపరెపల్లో  తరించిపోవాలనే అచంచల సాంప్రదాయ నిబద్ధత మనది.  కానీ అదే అమెరికాలో ప్రతి రాష్ట్రం ఒక ప్రత్యేక రాజ్యాంగాన్ని కలిగుంటుందనే విషయాన్ని పట్టించుకోం.  ఇక్కడ మాత్రం ఒక ప్రత్యేక చారిత్రిక పరిస్తితుల్లో ఒక ప్రాంతానికి ఇచ్చిన హోదా విషయాన్ని పట్టించుకోం. అదే రకమైన ప్రత్యేక హోదా దేశంలో మరికొన్ని ప్రాంతాలకూ వుందంటే వినిపించుకోం.  అంతర్జాతీయంగా సోవియెట్ యూనియన్ నుండి 16 రిపబ్లిక్స్ రక్తపాత రహితంగా స్వాతంత్ర్యం పొందాయని కూడా గమనించం.  ఒప్పందం ప్రకారం బ్రిటన్ చైనాకి హాంకాంగ్ ని ఇచ్చేసిందేంటని కూడా ఆశ్చర్యపోం.  బ్రెక్సిట్ దెబ్బకి యూకే మూడు ముక్కలవటాన్ని కూడా మనం పట్టించుకోం.  ప్రపంచంలో అనేక దేశాలు కొంత ఆందోళనల తరువాత, కొంత సంక్షోభం తరువాత సరిహద్దుల్ని సవరించుకుంటుంటాయి.  మనలాగా పట్టు విడుపుల్లేకుండా ఒకే రకంగా వుండే దేశాలు తక్కువ. టిబెట్, బెలూచిస్తాన్, పాలస్తీనా, శ్రీలంక ఈలం, బంగ్లాదేశ్ విభజన పోరాటాలకి బిగించిన పిడికిళ్ళతో మద్దతిచ్చేస్తుంటాం మళ్ళీ!

అసలు ఒక మాట చెప్పండి మతం కారనంగా ఒక పౌరుడి మీద మరో పౌరుడి ఆధిపత్యం జాతీయవాదం అవుతుందా లేక దాష్టీక మత వాదం అవుతుందా? ఏదో కారనంతో ప్రజల్లో ఒక వర్గం మీద మరో వర్గం పెత్తనం చేయటం ప్రజాస్వామికం అవుతుందా లేక ఫాసిజం అవుతుందా?   ఇక్కడ మైనారిటీ మతం మరో దేశంలో ఆధిపత్య మతమైతే ఇక్కడి ఆ మతస్తులు మెజారిటీ మతస్తుల మోచేతి నీళ్ళెందుకు తాగాలి?  అంటె నువ్వు ద్వేషించే వేరే దేశస్థులే నీకు ఆదర్శనీయులా?  అనుసరణీయులా?

ఈ భావోద్వేగాల వెల్లువలో మనం అనేక విషయాలు మరిచేపోతున్నాం.  శాంతికి, సామరస్యానికి, సంక్షోభాల శాశ్వత పరిష్కారానికి అవకాశాలు వెతక్కుండా కేవలం యుద్ధాలు, వైషమ్యాలు అనివార్యమనే కుతర్కానికి బలైపోతున్నాం.  మన పిల్లల భవిష్యత్తు తాకట్టు పెట్టి మరీ నాటకీయ ఉద్రేకాలకు లోనవుతున్నాం.  హింసకి, వినాశనానికి పెట్టే పెట్టుబడి ఎక్కడికి చేరుతున్నది?  సరిహద్దుల హింసాత్మక సంక్షోభంతో ఏ విదేశీ ఆయుధ బేహారి లాభ పడతాడు చివరికి?  అసలు ఈ హడావిడిలో పాలకుల వాగ్దాన భంగాలు, పరిపాలనా వైఫల్యాలు ఏమిటో ఏమైనా ఆలోచిస్తున్నామా?  సందు చివరే పొంచి వుందంటున్న ఆర్ధిక సంక్షోభ సంకేతాలు గమనిస్తున్నామా?  బావురమంటున్న వ్యవసాయ రంగం, కుదేలైపోతున్న మార్కెట్లు, చాప కింద పెట్రోల్లా పాకుతున్న నిరుద్యోగం, దుప్పట్లో మిన్నాగులా భయ పెడుతున్న రూపాయి పతనం…వీటన్నింటి గురించి పట్టించుకుంటున్నామా?
****

దేశాల్ని విఛ్ఛిన్నం చేసి, ప్రజల్ని చిన్నాభిన్నం చేసే మితి మీరైన జాతివాదంతో ప్రజల్ని రెచ్చగొట్టి, వాళ్ళని నాశనం చేసి తామూ దిక్కుమాలిన చావు చచ్చిన హిట్లర్, ముసోలినీల చరిత్ర మరీ పాతదేం కాదు.  ప్రకృతి, చరిత్ర ప్రసాదించిన వరాలు బహుళత్వం, భిన్నత్వం.  వాటిని కాపాడుకోవాలి.  చరిత్రని విస్మరించేవారు కొత్త చరిత్రల్ని రాయలేరు.  వారు గత కాలపు విషాద చరితలకి తిరిగి ప్రాణం పోస్తారంతే.

*

అరణ్య కృష్ణ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు