గోకరకొండ నాగ సాయిబాబా అంటే ఎంతమందికి తెలుసో లేదో కానీ ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా అంటే మాత్రం భారతదేశంలో తన చుట్టూ జరిగే పరిణామాల పట్ల అవగాహనతో వ్యవహరించే మానసిక అక్షరాస్యులైన ప్రతి ఒక్కరికీ తెలుసు. ప్రజలకి పాలకులకీ మధ్యనున్న వైరుధ్యంలో ఒక బుద్ధి జీవిగా ప్రజల తరపున మాట్లాడటమే కాదు పోరాడాడు కూడా! అందుకే రాజ్యం అతని మీద అనేక అక్రమ కేసులు మోపింది. ఆయన శారీరికంగా వికలాంగుడే అయినా ఆయన మెదడు శక్తివంతమైనదీ, ప్రమాదకరమైనదీ అని భావించిన భారత న్యాయ వ్యవస్థ ఆయనకి యావజ్జీవ కారాగర శిక్ష విధించింది. ఈ దేశంలో ఓ పౌరుడు మేధావి అయినందుకు కూడా కారాగార శిక్షని అనుభవించాలని సాయిబాబా విషయంలో రుజువైంది. ఈ రకంగా సాయి ఈ దేశంలో మానసిక అక్షరాస్యత కలిగిన… అంటే ఆలోచించగలిగిన ప్రతి ఒక్కరికీ తెలిసాడు.
90 శాతం వికలాంగుడిగా వున్న ఒక వామపక్ష మేధావి మీద అన్యాయంగా, దుర్మార్గంగా కేసులో నిర్దోషి అని తేల్చి చెప్పడానికి పదేళ్ల శిక్షా సమయం పట్టింది మన న్యాయ వ్యవస్థకి. “వందమంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదదు” అనే న్యాయ వ్యవస్థకి సంబంధించిన ఆదర్శం ఘోరమైన వంచనకి గురైంది. ఆ పదేళ్ల కాలంలో సాయిబాబా, ఆయన కుటుంబం ఎంతటి నరకయాతన అనుభవించి వుంటారు? ఈ ప్రశ్న ఆలోచనా శీలులందరిలోనూ అలజడి రేపే వుంటుంది. పదేళ్ల జైలు జీవితం ఆయన ఐదో వంతు జీవిత కాలాన్ని హరించి వేయడమే కాదు చివరికి ఆయన ప్రాణాన్ని కబళించడానికి కారణమైంది. ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వాలన్నీ ప్రజల జీవితాల్ని “కరి మింగిన వెలగపండు” మాదిరిగానే చేస్తాయి. సాయిబాబా ఆరోగ్యాన్ని మొత్తం గుజ్జులా పీల్చేసి చివరికి ఒక డొల్ల శరీరాన్ని జైలు బైటకి వదిలేసింది ఈ సర్కారు. ఒక రకంగా చెప్పాలంటే రాజ్య హింసలో భాగంగానే సాయి ప్రాణాలు కోల్పోయాడు. అన్ని వర్గాల ప్రజలతో పాటు ఇది ఈనాటి కవుల్ని కూడా కలిచివేసింది. ఆయన జైలులో వున్నంత కాలమూ ఆయన విడుదల కోసం ఎదురు చూసిన కాలంలోనే కవులు సాయి కోసం కలాలను ఎక్కుపెట్టారు. సాయి మరణించిన అనంతరం తెలుగు కవుల ఆగ్రహం, ఆవేదన, అశాంతి, దుఃఖం మిన్నంటింది. ఎన్నో గొప్ప కవితలు వచ్చాయి. ఈ కవితల్లో కొన్ని మంచివి ఎన్నుకొని అవయవదాన ఉద్యమకారిణి గూడూరు సీతామహాలక్ష్మిగారి మద్దతుతో కవి వైష్ణవిశ్రీ సాయిని ఉద్దేశిస్తూ “నువ్వెళ్లిన దారిలో” అనే కవితా సంకలనం తీసుకొచ్చారు.
సాయిబాబా స్వతహాగా కవి. చాలా మంచి కవి. ‘నేను చావుని నిరాకరిస్తున్నాను” అనే పేరుతో ఆయన కవిత్వాన్ని మిత్రులు ప్రచురించారు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వాన్ని తెలుగులోకి అనువదించారు. అఫ్సర్, ఖాదర్ ల విస్తృతమైన ముందుమాటలతో ఇది త్వరలో వెలుగు చూడబోతోంది.
అయితే సాయి కేవలం కవి కాదని, ఒక సామాజిక చింతనాపరుడని, మేధావి అని, కార్యాచరణశీలి అని దేశమంతా తెలుసు. ఈ లక్షణాలే కవుల మీద ఒక అచంచల ప్రభావం చూపించాయి. అతను అనుభవించిన శిక్ష మీద, దేశంలోని స్వేచ్ఛారాహిత్యం మీద, కనికరం చూపని రాజ్యం మీద అనేక కవితలు వచ్చాయి. కొంతమంది కవులు సాయిబాబా నేపథ్యంలో చేష్టలుడికి చూస్తున్న తమ నిస్సహాయత మీద, సమాజ నిస్తేజం మీద కూడా కవిత్వం రాశారు. ఈ కవితలన్నింటిల్లోనూ ఒక తట్టుకోలేనితనం, తమ స్వంత మనిషిని పోగుట్టుకున్న మానసిక అనుభవం, అందునుండి కలిగిన ఆవేదన, ఆ దుఃఖం ఆ అశాంతి అన్నీ కలగలిసిన వ్యక్తీకరణే ఈ కవిత్వం.
అనిల్ డ్యాని “ఉండడం ఎవరైనా ఉంటారు / వెళ్లిపోవడం గురించే మాట్లాడుకుందాం, తప్పదు / రాజ్యానికి పోరాటమంటే భయం / ఊహల్ని ఉరివేయడానికి / సంకెళ్లు సిద్ధం చేసి జైళ్లని ముస్తాబు చేస్తుంది” అంటారు.
సాయి మరణం కేవలం పురోగామివాదులనే కాదు మనసున్న ప్రతి ఒక్కరినీ దేశవ్యాప్తంగా కదిలించింది. కనుకనే ప్రసాదమూర్తి తన కవితలో ఇలా అనగలిగారు. “దేశమంతా చేతులు మొలిచి ఒక ఎలిజీ రాస్తే / దాని శీర్షిక సాయిబాబా- / దేశమంతా చేతులు మొలిచి ఒక చిత్రం గీస్తే / ఆ ఆకృతి సాయిబాబా-”
సాయిబాబా మీద ప్రేమతో ఈ సంకలనంలో కవిత్వం రాసినట్లు కనిపించినా నిజానికి ఈ కవిత్వమంతా సాయిబాబా ఏ ఆశయాలకి, పోరాటాలకి నిబద్ధుడో ఆ ఆశయాలకి, పోరాటాలకి మద్దతుగా వచ్చిన కవిత్వమే ఇది. కనుకనే తగుళ్లగోపాల్ “ప్రొఫెసర్ సార్… మీరొస్తరూ కదూ… / కాలు మీద కాలేసుకొని స్వేచ్ఛ పాఠం చెప్పడానికి / రాజ్యం చేసిన తప్పులను సరిచేసి ఎర్రని పెన్నుతో సంతకం పెట్టడానికి / ప్రొఫెసర్ సార్ , మీరొస్తరు కదూ …” అని ఆర్తిగా పిలుస్తారు.
“ఎన్నిసార్లని కలల్ని పొరలు పొరలుగా కప్పెట్టినా / ఎన్ని పేజీల కవిత్వాన్ని నిర్దాక్షిణ్యంగా నిప్పు పెట్టినా / ఆ చీకటి గదుల్లోంచి గడ్డకట్టే మంచు సరస్సులోంచి / దహించే నిరీక్షణలోంచి నెమ్మదిగా సుకుమారంగా / బయటి ప్రపంచపు గోడల మధ్య జ్ఞాపకాలు ప్రతిధ్వనిస్తున్నప్పుడు / అతను బయటకొచ్చాడు” అని పుప్పాల శ్రీరాం అతని రాకని వర్ణిస్తారు.
“మోస్తున్న మెదడు బలమైందైనపుడు / మేను అవిటిదైతే ఏం / అసలు ఖైదు ప్రకటించింది దేహానికి కాదు ఆ ఆలోచనకే”అని మహముద్ రాస్తారు.
“నీ దేహభాగం ఒక్కొక్కటీ వందై వెయ్యయి కోటై అసంఖ్యాఖమై / లక్ష్యమై విస్ఫోటనాలై మాతోనే అడుగులేస్తాయి / మమ్మల్ని తట్టి మేల్కొలుపు పాటలు పాడుతుంటాయి” అని ప్రసేన్ కవిత్వ గానం చేస్తారు.
“అధ్యాపకుడా… విప్లవకారుడా / వంద నిర్భంధాల సాక్షిగా
నువు నడిచెళ్లిన దారిలోనే రేపటి ఉదయం”అని సాబిర్ నిక్కచ్చిగా చెబుతారు.
“నలుదిక్కులూ అతని అక్షరాల కోసం చేతులు చాచి
జైలు దగ్గరే నిలబడి ఉన్నాయి / అనేకనేక చిక్కుముడుల్ని విప్పే కొత్త పొద్దుల్ని / మన దోసిట్లో కుమ్మరించిపోయాడు / వాటిని హత్తుకుంటే అడవి మాట్లాడుతున్నట్లుగా ఉంటుందిలే!” అని వైష్ణవిశ్రీ సాయి అక్షరాలు ఎంత శక్తివంతమో చెబుతారు.
“కొన్ని నల్లకోటుల పట్టుదలలు / కొన్ని వసంతాల ప్రేమలతలు అండా సెల్‌లో / పళ్ళ బిగువున ఒక చక్రాలకుర్చీ దివ్యాంశ యుద్ధం / జీవితాశల తరువుకి ఒక లేతాకులా / రోజు రోజు పుట్టుకురావడం చూస్తున్నాను” అని శ్రీనివాస గౌడ్ సాక్ష్యం చెబుతారు.
“నియంతల కుర్చీలకు / చరిత్రలో తావుంటదో లేదో / నీ చక్రాలకుర్చీ ఇపుడొక / చెరపలేని చారిత్రకగ్రంథం” అని మెట్టా నాగేశ్వరరావు తేల్చి చెప్పేస్తారు.
“పచ్చని నేలను కలగన్న పంటకాలువలాంటివాడు / రాజ్యహంకారపు కోరల్లో చిక్కిన దేహాన్ని / చిదిమిన కలల్ని చేసిన గాయాల్ని / దగ్దం చేసిన దశాబ్ద కాలాన్ని గుప్పెట పట్టుకుని / సూటిగా అడిగాడొక ప్రశ్న / “రాజ్యమా .. అసలు దోషులెవరూ? / ఆ ద్రోహులెక్కడా ..??” అని లావణ్య సైదీశ్వర్ నిగ్గదీసి అడుగుతారు.
“నిన్ను నేను అన్వేషించే దారుల్లో / ‘చావును నిరాకరించాను’ అని చెప్పిన
నీ ఆంతర్యపు వెలుగుల్లో / నన్ను నేను కలుసుకున్నానని / ఇలా ఋజువు పరుస్తున్నాను” అని తండ హరీష్ ప్రకటిస్తారు.
ఇలా నేను చెప్పుకుంటూ పోవడం కన్నా మీరే ఈ సంకలనాన్ని అనుభవించి పలవరించగలరు. ఇది చాలా అరుదైన కవిత్వ సంకలనం. వర్తమాన తెలుగు కవిత్వంలో అగ్రశ్రేణి కవులుగా చెప్పదగ్గ కవులు ఇందులో వున్నారు. తెలుగు కవిత్వ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోగల శక్తి ఈ సంకలనానికి వుంది. ముప్ఫై రెండు మంది కవుల ఆర్తి, ఆవేదన, రాజ్యహింస పట్ల నిస్సంకోచమైన ఖండన కలగలిసిన భావోద్వేగ మహా సముద్రం ఈ పుస్తకం అని చెప్పగలను.
కేవలం 32 కవితలే కాకుండా సాయిబాబా జీవన సహచరిగా వసంత గారు రాసిన ముందుమాట ప్రతి ఒక్కరి గుండె తలపుల్ని తడుతుంది. సాయిబాబా భౌతికంగా మరణించిన తరువాత ఒక ఆశగా, ఆశయంగా, ఉద్వేగంగా ఎలా అమరుడయ్యాడో వివరంగా రాసిన ఎన్.వేణుగోపాల్ ముందు మాట వుంది. ఇంత గొప్ప ప్రయత్నం చేసిన వైష్ణవిశ్రీని, ఆమెకి దన్నుగా నిలబడిన సీతామహాలక్ష్మిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. సాయి వెళ్లిపోయినంత మాత్రాన ఆ కుటుంబం ఒంటరి కాదని ఈ పుస్తకం భరోసా ఇస్తుందని కూడా నమ్ముతున్నాను.
“నువ్వెళ్లిన దారిలో” ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా స్ఫూర్తి కవిత్వ సంకలనం. సంపాదకురాలు వైష్ణవిశ్రీ ఫోన్ 8074210268. పేజీలు 88. వెల రూ.100. ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు)
*
వర్తమాన చరిత్రను రికార్డు చేసిందీ పుస్తకం. శ్రీ వైష్ణవి సాహస ప్రయత్నం చేశారు.
ధన్యవాదాలు
Good write up sir
ధన్యవాదాలు