“హల్లో సర్ ! “
బార్న్స్ అండ్ నోబుల్ లో స్టార్ బక్స్ కాఫీ చప్పరిస్తూ స్లావేజ్ జిజేక్ ‘ ద పారలాక్స్ వ్యూ’ ని తిరగేస్తున్న నేను ఎవరో పిల్చినట్టయి తలెత్తి చూసా!
యెదురుగా కూర్చున్న మా చిన్నమ్మాయి కూడా తను చేస్తున్న మాథ్ లోంచి తలెత్తి ఉత్సుకతతో చూసింది!
అవును నన్నే!
ఎదురుగా ఒక స్త్రీ – బహుశ 40 దాటాయేమో – అమెరికా లో చెప్పడం కష్టం – జీన్స్ షర్ట్ వేసుకుంది –
“హల్లో సర్ ! మీరు శ్రీనివాస్ సర్ కదూ! “ అడుగుతోందావిడ.
”అవును నేనే – మీరు?” ముఖం ప్రశ్నార్థకంగా మార్చి అడిగా.
మా అమ్మాయి వింతగా చూస్తోంది ఆవిడనూ నన్నూ!
“గుర్తు పట్టలేదా సర్ ! నేను మంజులని ! ఇంజనీరింగ్ కాలేజిలో లో మీ స్టూడెంట్ ని”
కొన్ని సెకండ్ల పాటు నా మెదడు శూన్యమయింది!
పొరలు పొరలు గా జ్ఞాపకాల్లోంచి – లోలోపల్నుంచి – దాదాపు 25 యేండ్ల నాటి విషయం – యెక్కడో అట్టడుగు పొరల్లో సమాధి ఐపోయిందనుకున్న మంజుల జ్ఞాపకం నీటి ఊటలా చివ్వున పైకెగసింది –
గుర్తుకొచ్చింది –
“ఆ ఆ! మంజులా – ఎలక్ట్రానిక్స్ – గుర్తుకొచ్చావు – ఎలా ఉన్నావు?” మామూలుగా అడిగే ప్రయత్నం చేసానే కానీ కళ్లలో ఆశ్చర్యాన్ని, దిగ్భ్రాంతినీ దాచలేక పోయా! నన్ను చూసి మా అమ్మాయి నివ్వెరపోతోంది.
“బాగున్నా సర్ ! మీరో? “ ఆమె కూడా మామూలుగానే అడిగే ప్రయత్నం చేస్తుంది. కానీ కళ్లల్లో సుళ్ళు తిరుగుతూ, కొంచెమాగితే చిట్లిపోయి దుంకుతదా అన్నట్టున్న నీటి పొరని దాచలేకపోతోంది.
”బాగున్నాను” అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని జవాబు చెప్పా!
“కాఫీ?” ఎదురుగా నా కాఫీ కప్పు కనబడుతున్నా పరిస్థితిని కొంచెం ఈజ్ చేద్దామని కాఫీ షాప్ వైపు చూపి లేచి నిలబడ్దా!
“సరే సర్ ! “ అంటూ దారి తీసింది! “ఇక్కడే కూర్చో నాన్నా” అని మా అమ్మాయికి చెప్పి “మా చిన్నమ్మాయి అరణి” అంటూ పరిచయం చేసా. “షి ఇజ్ మంజుల! వాజ్ మై స్టూడెంట్ బాక్ ఇన్ ఇండియా” అని మా అమ్మాయికి మంజులని పరిచయం చేసా. “హై!” అంది అరణి! “హై! యూ ఆర్ సో క్యూట్ “ అంటూ చెయి జాపింది మంజుల. “థాంక్యూ ఆంటీ” అని చెయ్యి కలిపి మళ్ళీ తన మాథ్ బుక్ లో తల పెట్టేసింది.
“పదండి” అంటూ కాఫీ షాప్ కు దారి తీసా.
“సో ఇక్కడే ఉంటున్నరా మీరు? ఎన్ని రోజులైంది అమెరికాకు వచ్చి ?ఎక్కడుంటున్నరు? ఎక్కడ వర్క్ చేస్తున్నరు? “ ఉత్కంఠ ఆపుకోలేక ఒకే సారి అడిగేసా.
”ఇరవై అయిదేడ్లు దాటింది సర్ ! ఇక్కడే ప్లేన్స్ బరో లో ఉంటున్నాము – నేనూ మా హస్బండూ ఇద్దరు పిల్లలూ. ఒక పాప బాబూ. పాపకు 17 బాబుకు 14. రమేష్ మా ఆయన, సిటి లో చేస్తాడు. నేను ఇక్కడే ప్రిన్స్ టన్ లో చేస్తున్నా!” అటువైపు ముఖం తిప్పుకుని కళ్ళు తుడుచుకోవడం గమనిస్తూనే ఉన్నా!
“మీకు రెగులర్ కాఫీ ఓకె కదా” అని ఆమె నడిగి ఆమె “ఊ” అనగానే
“టు టాల్ రెగులర్ కాఫీ ప్లీజ్ “ కాఫీ ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ తన వైపు చూసా!! “యేమయిపోయావు? కాలేజీ నుండి థర్డ్ యియర్ అవక ముందే పత్తా లేకుండా పోయావు. అందరినీ అడిగా నీ గురించి. యెవరూ నిర్దిష్టంగా చెప్పలేదు. వేరే వూర్లో కాలేజికి మార్పించుకున్నావని చెప్పారు. చాలా వెతికాను తెలుసా నీకోసం. నాకేమీ పాలు పోలేదు. నీ ఫోన్ నంబర్ కాలేజి ఆఫీసులో అడిగి ఫోన్ చేస్తే అవతలనుండి చాలా కటువుగా సమాధానమొచ్చింది మళ్ళీ నీ కోసం అడగొద్దని. కాలేజి నుండి అర్ధాంతరంగా ఎందుకు మాయమయ్యావు ? తట్టు కోలేనంత దుఃఖాన్ని మిగిల్చి ఎక్కడికి వెళ్ళి పోయావు “ అంటూ నాకు తెలవకుండానే యేకవచనం ప్రయోగిస్తూ సంవత్సరాలుగా నాలో దాచుకున్న శూన్యాన్ని ఒక్క సారిగా వెలికి తీస్తూ ప్రశ్నల వర్షం లో తనని తడిపేసా!
“అవును మాయమయ్యాను. మీ నుండి, కాలేజి నుండి, స్నేహితుల్నుండి! కానీ వెంటాడే జ్ఞాపకాల్నుండీ మాత్రం కాదు” పైన మెరుస్తున్న ఫ్లోరెసెంటు లైట్ల వెలుగులో తడితో మెరుస్తున్న పెద్ద పెద్ద కళ్ళతో అన్నది మంజుల. తన గొంతు రుద్దమై బరువు కావడం తెలుస్తూనే ఉంది.
“హియర్ ఇజ్ యువర్ కాఫీ ప్లీజ” కాఫీ షాప్ అమ్మాయి కాఫీ కప్పులు అందించింది మా సంభాషణ కి చిన్న బ్రేక్ వేస్తూ – “థాంక్యూ” అని కాఫీ కప్పు ఒకటి తనకి అందించి మరోటి నేను తీసుకుని పాలూ చక్కెరా ఉన్న చోటు కి కదిలాను. నా వెంటే తను .
“ఊ చెప్పు”అన్నా, 27 యేండ్ల నాటినుండీ తొలుస్తున్న జ్ఞాపకాలని దుఃఖాన్నీ అదుముకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ.
” అట్లా జరిగాక ఇంక నేను కాలేజి కి రాలేక పోయిన. విషయం మా ఇంట్లో తెలిసింది. తీవ్రంగా విరుచుకుపడ్డారు. నన్ను వేరే వూర్లో కాలేజీకి మార్పించారు. మీరు గుర్తుకొస్తేనే కన్నీళ్ళ ప్రవాహం కట్టలు తెగేది. మామూలుగా ఉండడం అసాధ్యమయ్యేది. ఒక్కొక్క జ్ఞాపకమూ వెంటాడి వేటాడి తరిమేది . వంటినిండా గుచ్చుకుని తూట్లు పొడిచేది . నావల్ల కాలేదు – …”
యెంతో కష్టంగా తన్నుకొస్తున్న దుఃఖాన్ని అదిమిపడుతూ యే క్షణమైనా బ్రేక్ డౌన్ అవుతుందేమో నని భయం గొలిపే తనని –
”మమ్మీ ! వేర్ హవ్ యు బీన్? డాడ్ అండ్ ఐ ఆర్ సర్చింగ్ ద హోల్ ఎంటైర్ స్టోర్ ఫర్ యు“ అంటూ చిరుకోపం నటిస్తూ పదిహేడేళ్ళ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది . “మంజూ యేమైపోయావు ఇంతసేపూ “ అంటూ వెనకే బహుశా తన భర్త అనుకుంటా కొంచెం అధికారం ధ్వనిస్తున్న గొంతుతో. అమ్మాయీ, ఆయనా నన్ను చూసి కించిత్తు ఆశ్చర్యమూ, కించిత్తు ప్రశ్నార్థకాలైన ముఖాల్తో మంజులని చూసారు. “మమ్మీ హూ ఇస్ దిస్ ?” గుస గుసగా అడిగింది. “రమేష్ ! తను శ్రీనివాస్. మా కాలేజీలో ప్రొఫెసర్ “ అంటూ అతన భర్త వైపు తిరిగి నన్ను పరిచయం చేసింది . “ హై! నేను రమేష్ “ అంటూ చేయి చాపాడు. తనకన్నా చాలా పెద్దవాడిలా అనిపించాడు . తలమీద జుట్టు దాదాపుగా లేదు. కొంచం లావూ, అంత పొడుగేమి కాదు. చూడగానే యెందుకో అంత గౌరవేమమీ కలుగలేదు
“హై! శ్రీనివాస్ హియర్ “ అన్నా చేయి చాస్తూ. “నైస్ టు మీట్ యూ! ఇన్నేళ్ళ కాపురం లో ఒక్క సారి మీ గురించి చెప్పలేదే తను. తన కాలేజి మేట్స్ గురించి చెప్పిందనుకోండి “ కొంచెం ఆశ్చర్యం ప్రకటిస్తూ అన్నాడు రమేష్ . “మంజూ మనం తొందరగా బయలు దేరాలి . గుర్తుందా శేఖర్ వాళ్ళింట్లో బర్థ్ డే పార్టీ. పద పద “ తొందర పెట్టాడామెను.
“యా యా! వెళ్దామండీ . సర్ మేము వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం” అని మంజుల అంటుండగానే “మమ్మీ లెట్స్ గో” అంటూ లాక్కెల్తోంది వాళ్లమ్మాయి . రమేష్ ముందే దారి తీసాడు. తొందరలో ఉన్నట్టున్నాడు బై కూడా చెప్పలేదు .
తనూ వాళ్ళ వెంటే.
నేనలా నిలబడి పోయా. యేమి మాట్లాడాలో తెలుస్తలేదు. తను వెళ్ళిపోతోంది. మూల మలుపు తిరిగి కనుమరుగయే ముందు నాకేసి వెనక్కి తిరిగి చూసిందా? యేమో? చూసిందేమో? ఆమె కళ్ల తడి తళుక్కుమందేమో?
అయ్యో మళ్ళీ ఎట్లా కలవడం? ఫోన్ నంబర్ అయినా తీసుకోలేదు? కనీసం ఈమైల్ అయినా… ఇన్నేళ్ల తరువాత కలిసి, ఒక్క నిమిషం లో మళ్ళీ అగాధమైన జ్ఞాపకం లోకి అట్ల్లా జారి పోయిందే. మళ్ళా యెట్లా ఆ జ్ఞాపకాన్ని సజీవంగా చూడడం? యెట్లా యెట్లా ….? కనుపాపల్ని చీల్చుకుని వస్తున్న నీటి సూదుల్ని ఆపలేకపోతున్నా. కళ్ళు మసక బారుతునయి. చెంపల మీదనుండి జారిపోతున్నయి వేడి కన్నీళ్ళు. బయటకు పరుగెత్తుదామా? ఆమెను ఆపుదామా? ఫోన్ నంబరయినా అడుగుదామా? వద్దు ఆమె భర్త రమేష్ యేమనుకుంటాడో? మంచులాంటి ఆయన చల్లని చేతి స్పర్శ గుర్తుకొచ్చింది . వద్దు. తనెక్కడో ఇక్కడే ఉంటుంది కాబట్టి మళ్ళీ కలవక పోదు. రెగులర్ గా బార్న్స్ అండ్ నోబుల్ కి వచ్చేటట్టుంది. చూద్దాం . తనని కనీసం ఫోన్ నంబరైనా అడగాల్సింది.
మళ్ళీ మా అమ్మాయి కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చేసా. నీరసంగా కూలబడ్డ నన్ను చూసి “ ఆర్ యు ఒకే డాడీ?” అడిగింది మా అమ్మాయి. అంతా ఒకె కాదని పసిగట్టింది వెంటనే . కొంచెం ఎర్రబడ్డ నా కళ్లనూ. చెంపల మీద చారికలనూ చూసిందేమో “ డిడ్ యు క్రై డాడీ? హు వాస్ షీ? వై వాస్ షి ఆల్సో ఇన్ టియర్స్?” ప్రశ్నల వర్షం కురిపించింది . “యేమీ లేదు. అంతా ఓకె ! నువ్వు చదువుకో” అన్నా.
అంతా ఓకే కాదని తనకూ తెలిసి పోయినట్టుంది. నా గొంతులో ఆజ్ఞని పసిగట్టి యేమి మాట్లాడకుండా మళ్ళీ తన మాథ్ బుక్ లో తలదూర్చింది . అప్పుడప్పుడూ తల ఎత్తి నాకేసి చూడ్డం గమనిస్తూనే ఉన్నా! మళ్ళీ జిజోక్ ‘ద పారలాక్స్ వ్యూ’ లో కి వెళ్ళే ప్రయత్నం మొదలెట్టా !
పేజీలు తిరగేస్తున్నానే కాని మెదడులోకి యేమీ ఎక్కడం లేదు . ఆలోచనలన్నీ గతంలోకే పరిగెడుతున్నయి . జ్ఞాపకాల్ని పదునైన పారతో తవ్విపోస్తున్నయి . సరిగ్గా 27 యేండ్లు వెనుకకు . ఇప్పుడే జరిగినట్టుంది… యేదో నిన్నో మొన్నో చూసినట్టుంది . వయస్సు తెచ్చిన మార్పుల వల్ల వెంటనే గుర్తుపట్టలేక పోయినా, ఒక్క సారి పోల్చుకున్నాక , మొక్కజొన్న మొవ్వులో పదిలంగా దాగిన మంచుబిందువు ఉదయపు సూర్యకాంతికి యేడు రంగులైనట్టు మంజుల జ్ఞాపకాలు ఒక్కసారిగా ఇంద్రధనుస్సుల పింఛాల్ని విప్పి నాట్యం చేయ ప్రారంభించాయి . ఈ 27 యేండ్లలో ఎప్పుడు మర్చిపోయాను గనక ….. ఇంకా లేతగానే, ఫ్రెష్గానే .. గాయాలింకా పచ్చిగానే . కాలం ఎంతటి గాయాలనైనా మాన్పుతుందంటారు . నా విషయం లో అదెందుకో అంత నిజం కాలేదు .
‘పారలాక్స్ వ్యూ’ పేజీలు ముందుకు కదుల్తున్నా, నేను వెనక్కి మరింత వెనక్కీ వెళ్ళిపోతున్నా —-
బాహ్య ప్రపంచాన్ని వదిలేసి అంతర్ ప్రపంచాల్లోకి లోలోపలికి వెళ్ళిపోతున్న నన్ను ‘డాడీ! షల్ వి గో! నా మాథ్ వర్క్ ఐపోయింది , అండ్ ఇట్స్ గెట్టింగ్ లేట్ ! “ అంటూ మా అమ్మాయి కుదిపి మరీ అడిగింది!
అలలలుగా, కలలుగా, మూసుకున్న కళ్లముందు కదుల్తున్న గతంలోంచి బయటికొచ్చినా అపస్మారక స్థితి ఇంకా పోలేదు. బార్న్స్ & నోబుల్ నుండి బయట పడి పార్కింగ్ లాట్ వైపు నడిచాము. పార్కిగ్ లాట్ లో నా కళ్ళు, మనసు వెతుకుతున్నాయి . తనేమైనా పొరపాటున ఇంటికి పోకుండా ఇక్కడే ఎక్కడో ఉందా? నవ్వొచ్చింది. నాలో నేనే నవ్వుకుంటుంటే మా అమ్మాయి వింతగా చూసి “డాడి వాట్ హాపెండ్ టూ యూ!?” అంటూ రెట్టించింది. కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపు తిప్పా!
గతానికీ వర్తమానానికీ మధ్య, కలకూ వాస్తవానికీ మధ్యా , జ్ఞాపకాలకూ ప్రస్తుతానికీ మధ్య సన్నని దారాలతో అల్లుకుంటున్న సాలెగూడు లాంటి ఆలోచనలని యెవరో పుటుక్కున తెంపేసినట్టౌతుంది. నిచ్చెన మెట్లు దిగుతున్నానో ఎక్కుతున్నానో తెలియడం లేదు. దిగుడు బావి లోకి జారిపోతున్నానో అంచులు పట్టుకుని పైకెక్కుతున్నానో అర్థం కావడం లేదు….
ఇంటికి చేరగానే సోఫాలో కూలబడి కళ్ళు మూసుకున్నా.
నాకు తెల్వకుండానే ఇరవైయేడేండ్లు వెనక్కి వెళ్ళిపోతున్నా. అప్పటిదాకా ఆపాలని చూసినా మనసు సహకరించడం లేదు. ఆలోచనలు నిలవనీయడం లేదు…..
నేను లెక్చరర్ గా పనిచేసిన ఇంజనీరింగ్ కాలేజీ రోజులు. అనేక జ్ఞాపకాలు గిర్రున తిరుగుతూముసురుకుంటున్నాయి . కళ్ళముందు సజీవంగా జ్ఞాపకాల్లోంచి యెవరెవరో నడిచివస్తున్నారు .
అందులో స్పష్టాస్పష్టంగా కరుణాకర్, మంజులా. …
ఇంజనీరింగ్ కాలేజీలో నా స్టూడెంట్ గా పరిచయమయ్యాడు కరుణాకర్ . లేలేత సౌకుమార్యమూ , కరుణా కలగలిపిన నవయవ్వనం , కళ్ళల్లో మెరుపులతో, చేతిలో కవిత్వపు కాగితాల కట్టలతో “సార్ ఈ కవితలెట్లున్నాయో చెప్పండి” అంటూ, నేను కవిత్వం రాస్తానని యెవరిద్వారానో తెలుసుకుని , నా రూమ్ లోకి దూసుకువచ్చిన హేమంత మాసపు పిల్లగాలి కరుణాకర్. మొదటి పరిచయం లోనే విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇంక అప్పట్నుంచి రోజురోజుకూ మా స్నేహం గాఢమైపోయింది . ఒక లెక్చరర్ స్టూడెంట్ లా కాకుండా, అన్నాదమ్ముల్లా .. “నిన్ను అన్నా అని పిలవొచ్చా” అని ఓ రోజు ఉదయాన్నే అమాయకపు కండ్లలో లేలేత సూర్యకాంతి మెరుస్తుంటే అడిగాడు తను.
గొప్ప స్నేహితులమైనం మేమిద్దరం, అంతకంటే మించి అన్నదమ్ములం. ఒకరినొకరు ఒక రోజైనా కలవకుండా ఉండలేని స్తితి .. యెంత సాహిత్యం, యెంత కవిత్వం మా మధ్య అపురూపమైన క్షణాల్లా ప్రవహించింది… ఎంత గాఢమైన ఆత్మీయత మా మధ్య… ఎంత తొందరగా చిగురించింది?
ఓ రోజు ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చాడు కరుణ. “అన్నా తను నా క్లాస్ మేట్ మంజుల. తనకూ సాహిత్యమన్నా కవిత్వమన్నా చాలా ఇష్టం” అంటూ మెరుస్తున్న కళ్ళతో పరిచయం చేసాడు. “సర్ గుడ్ ఆఫ్టర్నూన్ “ అంటూ విష్ చేసింది ఆ అమ్మాయి, మంజుల. మిలమిలలాడే కళ్ళతో, గుండ్రని ముఖం తో, ముఖం లో గొప్ప కళ, అద్భుతమైన చిరునవ్వు. చూడగానే ఇష్టమూ, ఆప్యాయతా కలిగినయి. .
“యేమేమి చదివావు పుస్తకాలు? యెవరి కవిత్వమంటే ఇష్టం?” అడిగాను తనను ఉత్సుకతతో.
తను చదివిన పుస్తకాలన్నీ గబ గబా యెకరువు పెట్టింది. తనకు నచ్చిన కవిత్వాన్నీ నోటికి చెప్పేసింది ధారాళంగా, స్పష్టమైన ఉచ్ఛారణ తో.
చివరికి కరుణ రాసిన కవితనొకదాన్ని చదివింది. పక్షి రెక్కలని అపురూపంగా అరచేతిలో పొదివిపట్టుకున్నట్టు ఒక్కొక్క పదమూ అతి ప్రేమగా చదివింది. అంతకు ముందే విన్న కరుణ రాసిన ఆ కవితను. నాకు చాలా నచ్చింది. యెంత కష్టపడ్డా యే సౌకర్యాలూ, యే హక్కులూ లేక అతి దుర్భర జీవితం గడుపుతూ, కనీసం మనుషులుగా కూడా గుర్తింపబడని, సమాజం లోని అత్తడుగు పొరల్లోని వారి గురించి రాసిండు కరుణ. అది ఆమెకు నచ్చడం, నోటికి రావడం చాలా ఆశ్చర్యమనిపించింది. తన చేతిలో కొన్ని పుస్తకాలు ఉండడం చూసి “యేమిటవి ?” అని అడిగిన. “కరుణ చదవమని ఇచ్చాడు సర్. ఇందులో మీ పుస్తకం మహాశ్వేతాదేవి నవల ‘ఒక తల్లి’ కూడా ఉంది సర్. చదవడం మొదలు పెట్టిన. చాలా గొప్పగా ఉంది. కన్నీళ్లు ఆపుకోవడం కష్టమవుతున్నది.” అన్నది మంజుల. యెంతో అబ్బురమనిపించింది నాకు .
తను మాట్లాడుతున్నప్పుడు కరుణ కళ్ళు మెరవడం గమనించాను.
కవిత్వమూ, చుట్టూ జరుగుతున్న అనేకానేక అన్యాయాలకు స్పందించే సున్నితత్వమూ కలిపినట్టుంది ఇద్దరినీ .. గొప్ప స్నేహం ఇద్దరి మధ్యా .. ఎప్పుడు చూసినా కలిసే కన్పించేవారు, కనిపించినప్పుడల్లా వాళ్ళ మాటల్లో సాహిత్యమూ, సమాజమూ ప్రవహించడం గమనించిన. క్రమక్రమంగా మంజుల కూడా పుస్తకాలు చదవడం ఎక్కువ చేసినట్టు తెలుస్తోంది ఆమె మాటల్లో.
మేము ముగ్గురమూ అతి తక్కువ కాలం లోనే ఎంతో సన్నిహితమైపోయినాం. ఎన్ని సార్లు నా రూమ్ లోనో , కాంటీన్ లో చాయి తాగుతోనో మా మాటల్లో , ముచ్చట్లలో, కలిసిన ఉద్వేగ క్షణాల్లో , కండ్లలో నీళ్ళతో తడిసిపోయామో …. యెన్ని క్షణాలు, యెన్ని రోజులు, అట్లా మా మధ్య గడచిపోయినయో …
మెల్లమెల్లగా మంజులా కరుణాకర్ల మధ్య స్నేహం మరింత గాఢమవడం గమనించాను. ఒకరినొకరు వదిలి ఉండలేని పరిస్తితి. ఎక్కడ చూసినా ఇద్దరూ కలిసే కనబడడం.. యెక్కడ, యెప్పుడు కనబడ్డా యేదో పుస్తకం గురించి మాట్లాడుకుంటూనో, యేదో కవిత్వం చదువుకుంటూనో….
నాతో ఇద్దరు ముగ్గురు అన్నారు కూడా. “అట్లాంటిదేమీ ఉండదు, వాళ్ళు మంచి దోస్తులు” అన్నా వాళ్ళతో. కరుణ, మంజులల మీద గొప్ప నమ్మకం నాకు …
నిజానికి నాకూ వాళ్ళను వదిలి ఉండలేని పరిస్తితి. ఒక్క రోజు కనబడక పోయినా కాలేజీ అంతా వెతుక్కునే పరిస్తితి.
మధ్యమధ్యలో కరుణాకర్ మంజులా హటాత్తుగా మాయమయ్యేటోళ్ళు. నాకు మాటమాత్రం చెప్పకుండా రోజులకు రోజులు కాలేజీకి, క్లాసులకూ వచ్చేటోళ్ళు కారు .. నేనూ చాలా ఆందోళన పడేటోన్ని .. యెదిరి చూసి యెదిరి చూసి అలసిపోయేటోన్ని. మూడు నాలుగు రోజుల తర్వాత ప్రత్యక్షమయెటోళ్ళు.. హైద్రాబాదులో ఏదో బస్తీ కి పోయినమనీ , అక్కడ ప్రజలతో గడిపి వాళ్ళ జీవితాలను చదవడానికి వెళ్ళినమని చెప్పేటోళ్ళు.
“రోజంతా కాలేజీకి పోతున్న అని ఇంట్లో చెప్పి బస్తీల్లో తిరిగి సాయంత్రం కల్లా ఇంటికి చేరుకుంటా సర్” అని చెప్పింది మంజుల నా ప్రశ్న ముందే పసిగట్టి.
బస్తీ ప్రజల బతుకు వివరాల్ని కథలుగా కవితలుగా మార్చిన నోటుబుక్కులు అందించి. ఆత్రంగా ఎట్లా ఉందో చదివి చెప్పమని అడిగేటోళ్ళు. వాటిలో కరుణ కవితలే, నోట్సే కాదు, మంజుల రాసుకున్న నోట్సూ, కవితా వాక్యాలు, కథలకు అవసరమైన ముడిసరుకూ కనబడేది.
“ఓ నువ్వు కూడా రాస్తున్నావా?” అని అడిగా మంజులను.
“యేదో సర్. ప్రయత్నం చేస్తున్న. ఇంకా యేమీ రాయలేదనుకోండి” అంటూ సిగ్గుపడేది తను. ఓ సారి కరుణ ఒక్కడే రెండు వారాలకు పైగా మాయమయ్యాడు. మంజులా నేనూ చాలా దిగులు పడినము. ఎక్కడ వెతకాలో కూడా తెలియదు. తెలిసినవాళ్ళనీ, తన ఇతర క్లాస్ మెట్ లను అడిగితే తెలియదన్నారు. రూమ్ కు కూడా రాక చాలా రోజులైందట.
రందితో కుమిలిపోతున్న మాకు ఓ రోజు హటాత్తుగా ప్రత్యక్షమై “అన్నా చీరాల పోయొచ్చిన. అక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత కార్మికుల బతుకు రికార్డ్ చేసుకొచ్చిన” అని కాగితాల కట్ట చేతికిఛ్చిండు. వాటినిండా కన్నీటి దొంతరలు. రాలి నలిగిపోయిన పూల లాంటి చేనేత కార్మికుల వ్యథాభరిత యథార్థ గాథలు. చదువుతుంటే నేనూ మంజులా అట్లా ఎంతసేపున్నమో తెలియదు. గుండెలు బరువెక్కిపోయినాయి. కరుణాకర్ మీద మరింత ప్రేమ. మరింత ఆరాధన.
“నువ్వెక్కడికి పోయినా దయచేసి చెప్పిపో కరుణా” అని నేనూ,
“ఇకనుంచీ నేను లేకుండా నువ్వెక్కడికీ పోవద్దనీ” మంజులా ప్రాధేయపడినం.
మంజుల కూడా కథలూ, కవిత్వమూ రాయడం మొదలు పెట్టింది. కల్సినప్పుడల్లా తను కొత్తగా రాసిన కవితనో, కథనో వినిపించేది. “చాలా బాగా రాస్తున్నావు మంజులా! అట్టడుగు ప్రజల జీవితాలతో మమేకమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది నీ రాతల్లో” అని నేనూ కరుణా మా అభిప్రాయం చెప్పాము. “థాంక్ యూ సర్. ఇంకా జీవితాలను చదవాలి సర్. అప్పుడే ఇంకా బాగా రాయగలను” అన్నది మంజుల. ఆమె ఆలోచనల్లో వచ్చిన మార్పునూ, , ఆమె వ్యక్తిత్వం లో వచ్చిన పరిణతినీ స్పష్టంగా గమనించాను. అదే అన్నాను కరుణ తో. మురిసి పోయాడు తను.
కాలేజీకి సెలవులొస్తే మా ముగ్గురికీ చెప్పలేనంత దిగులు. చాలా రోజులు కలవలేము కదా అని. ఎప్పుడెప్పుడు కాలేజీ తెరుస్తరా అని ఎదురుచూసేది. ఈ సారీ అంతే. ఎండాకాలం దాదాపు రెండు నెలల సుదీర్ఘమైన సెలవుల తర్వాత ఎప్పుడెప్పుడు కరుణను, మంజులను కలుద్దామా అనుకుంటూ కాలేజికెళ్లిన.
సెలవులైపోయినంక మొదటి రోజు కాలేజీలో తప్పక కలవాలి అని మేము పెట్టుకున్న నియమం. ఎట్టి పరిస్తితుల్లోనైనా మిస్ కావద్దు అని ముగ్గురం ప్రామిస్ చేసుకున్నాం కూడా. వాళ్ళతో నేనూ ఒక స్టూడెంట్ లా ప్రవర్తించడం నవ్వు తెప్పించేది నాకు. ఐనా ఎందుకో అది చాలా బాగుండేది.
రీఓపెనింగ్ రోజు కాలేజీకి పోయిన నాకు, ప్రిన్సిపల్ మీటింగ్ అనీ, డిపార్ట్మెంట్ మీటింగ్ అనీ మధ్యాహ్నం దాకా ఏవో మీటింగులతో బిజీ గా ఉండింది. మీటింగ్లో అంతా అన్యమనస్కంగానే గడిపాను. అయిపోగానే పరిగెత్తుకుంటూ పోయిన కాంటీన్ కు … కరుణా మంజులల కోసం వొంటినిండా కళ్ళతో వెతికాను. లేరు. క్లాస్ కు పరిగెత్తుకుంటూ పోయిన. అక్కడా లేరు. ఒకరిద్దరిని అడిగాను. ‘రాలేదు సార్’, ‘చూడలేదు సార్’ అన్నారు. నాలో ఆతృత పెరిగింది. కాలేజీ మొత్తం పరిగెత్తి చూసిన. ఎక్కడా లేరు. లోలోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది. ‘ఏమయ్యారు వీళ్ళు? ఎందుకు రాలేదు? యేమోలే మొదటి రోజుకదా రావడం ఆలస్యమైందేమో? మరి మా ప్రామిస్ మాటేమిటి?’ రోజంతా మనసు మనసులో లేదు. గుండె బరువెక్కిపోయింది. ‘రాకుండా ఎటుపోతారులే? రేపొస్తారు కదా’ అనుకుంటూ సరిపెట్టుకున్న.
తెల్లారి కూడా అందరికన్నా ముందే కాలేజీకి పోయాను. చాలా సేపు గేటు దగ్గర నిలబడి ఎదురు చూశా. నా మీద నాకే నవ్వొచ్చింది. ఒకరిద్దరు గమనించి ‘ఏమిటి సర్ ఎదురుచూస్తున్నారు’ అని అడిగారు. కొందరు గుర్తుపట్టారు. ‘కరుణాకర్ కోసమేనా సర్? మేము కనబడితే చెప్తము లెండి సర్’ అని కొంత ఊరట నిచ్చారు. రెండో రోజు కూడా రాలేదు. వెతికి వెతికి అలసిపోయిన. ‘ఏమైంది పిల్లలిద్దరికీ? చెప్పా పెట్టకుండా మాయమయ్యారు? ‘ అనుకుంటూ కాలేజి అంగుళమంగుళం వెతికిన. లాభం లేదు. ఇద్దరూ కనబడలేదు. నాలో ఆతృత ఎక్కువైంది. నాకు తెలియకుండానే కళ్ళలో నీళ్ళు దుంకుతున్నాయి.
‘సర్లే ఏదో పని ఉండి ఆగిపోయి ఉంటారు’ అనుకున్న. కానీ ఇద్దరూనా? నా మనసులో ఏదో కలుక్కుమంది.
అట్లా నాలుగు రోజులు భారంగా గడచిపోయినయి. కరుణా మంజులా ఇప్పటికీ పత్తా లేరు. ‘ఏమయ్యారు అసలు? ఎందుకిట్ల చేశారు? ఎట్టి పరిస్తితుల్లో ఐనా చెప్పి పోయేవాళ్లు కదా? ఎందుకిట్ల చేశారు?’ నాలో లోలోపల యేడ్పు తన్నుకొస్తున్నది. కడుపులో పేగులు మర్లబడుతున్నయి.. వాళ్ళ ఇంటి అడ్రసులు సరిగా తెల్వదు. ఇంటి ఫోన్ నంబర్లూ తెలియదు.
ఇంక ఉండబట్టలేక పోయి ఆఫీసు క్లర్కును వాళ్ళ వివరాలు అడిగిన. తను వాళ్ళ క్లాసు రెజిస్టర్ తీసి చూశాడు. కరుణాకర్ ది ఇంటి ఫోను నంబర్ వెతికి ఇచ్చాడు . మంజులది చూడమన్నాను. తను ఒకటికి రెండు సార్లు పేరు అడిగి నిర్ధారించుకుని రెజిస్టర్ లో వెతికి ఏదో కనుక్కున్నట్టు నొసలు ముడిచిండు.
“ఏమైంది?” అని ఆత్రంగా అడిగిన. “సర్. ఆ అమ్మాయి టీ సీ తీసుకుంది సార్. వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నది. ఒక పది రోజుల కింద” అని చెప్పిండు. “యేమిటీ? నిజమా? మరొక్క సారి చూసి వెరిఫై చెయ్యి” హతాశున్నవుతూ మాటలు కూడబలుక్కుని అడిగిన.
‘అవును సర్. ఇది చూడండి’ అంటూ తను చూపిస్తున్నరెజిస్టర్ మసకబారిన నా కళ్ళకు కనబడలేదు.
ఇద్దరి లాండ్ లైన్ నంబర్లు తీసుకుని ఫోన్ కలిపిన. ముందు కరుణ ఇంటికి చేస్తే ఎన్ని సార్లు చేసినా ఎవరూ తీసుకోలేదు. మంజుల ఇంటి నంబర్ కు కలిపిన. ఒకటి రెండు సార్లు రింగ్ అయినంక అవతల గొంతు “హలో ఎవరు కావాలి” అన్నాడు. నేను మంజుల అనగానే “ఎవరూ మాట్లాడేది” అని, నేను మా కాలేజీ పేరు చెప్పగానే “లేదిక్కడ. మళ్ళీ ఫోన్ చేయొద్దు” అని చాలా కటువుగా ఫోన్ పెట్టేసిండు.
నాకు ఒక నిమిషం అంతా బ్లాంక్ అయిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. ఆలోచనల్లో ఎగసిపడే తుఫాను కెరటాలు. కండ్ల ముందు అంతా చీకటైపోయింది. ఒక ఐదు నిమిషాలు అట్లే కూర్చున్నా. ఎవరో వచ్చి ‘సార్ సార్ ‘ అని పిలుస్తున్నారు. బలవంతంగా లేచి ఆఫీసు నుండి బయటకు నడిచాను.
ఎంత సేపటికీ మామూలు మనిషిని కాలేకపోయిన. గబగబా కరుణా క్లాస్ కు వెళ్ళి వాళ్ళిద్దరి గురించీ అందరినీ అడిగిన. “సార్ మంజుల టీ సీ తీసుకుని వేరే కాలేజీకి ట్రాన్సఫర్ పెట్టుకుందట. యే కాలేజీకి వెళ్ళిందో తెలుస్తలేదు. విజయవాడకు వెళ్లిందంటున్నారు సర్” అన్నాడు వాళ్ళ క్లాస్మెట్ రవి. కరుణ రూమ్ అడ్రస్ కోసం అడిగాను. ఎక్కడో లంగర్ హౌస్ లోపల సందుల్లో ఉంటదని చెప్పారు.
ఆ రోజు సాయంత్రం కరుణ రూమ్ వెతుక్కుంటూ లంగర్ హౌస్ కి వెళ్ళిన. హైదరాబాద్ లో పాత బస్తీగా పిలవబడే లంగర్ హౌస్ ఒక పద్మవ్యూహం లా ఉన్నది. చిన్న చిన్న గల్లీలు. మోటార్ సైకిల్ పోవడం కష్టమైంది. ఒక చోట పార్క్ చేసి లోపలికి వెళ్ళిన అడుక్కుంటూ. ఫలానా కాలేజీ పిల్లల రూమ్ కోసం, కరుణ అనే స్టూడెంట్ రూంకోసం అడుక్కుంటూ వెళ్ళి చిట్ట చివరికి కనుక్కున్న. తీరా చూస్తే రూమ్ కు తాళముంది. నా ప్రాణం ఉసూరు మన్నది. ఇంటి ఓనర్ ను అడిగాను. “ఎవరూ?” అని అడిగి ఫలానా అని చెప్పంగానే “ఏమో సార్? కరుణ ను చూడక చాలా రోజులైంది. వాళ్ళ ఇంకో రూమ్ మెట్ రెండు రోజుల కింద కనబడ్డు. ఐతే ఎందుకో సార్ పోలీసులు రెండు మూడు సార్లు వచ్చి రూమ్ లో ఇంకెవరెవరుంటరు అని అడిగి పోయిండ్రు. ఎవరన్నా వస్తే వెంటనే చెప్పమని బెదిరిచ్చిండ్రు సాబ్ ” అన్నాడు భయం భయంగా ఇంటి ఓనర్. నాకెందుకో మనసు కీడు శంకించింది. కడుపులో పేగేదో మర్లబడ్డట్టు అయింది.. అతికష్టం మీద ఇల్లు గుర్తు పెట్టుకుని నా రూమ్ కు వెళ్ళిపోయిన. కానీ నా మనసు మనసు లో లేదు. లోలోపల విపరీతమైన ఆందోళన మొదలైంది. తెలియని భయమేదో రక్తనాళాల్లో సరా సరా పాకినట్టైంది.
ఆలస్యంగా వెళితేనన్నా ఎవరన్న దొరుకుతరని, ఆ రాత్రే పన్నెండున్నర దాటినంక కరుణ రూమ్ కు మళ్ళీ వెళ్ళాను. అప్పుడే ప్రతాప్ టాకీస్ సెకండ్ షో వదిలినట్టున్నారు. రోడ్డు మీద జనం బాగానే ఉన్నారు. రోడ్డు పక్కన మెడికల్ షాప్ దగ్గర మోటార్ సైకిల్ ఆపి మెల్లగా గల్లీలకు లోపలికి పోయాను. మళ్ళీ రూమ్ కు తాళం ఉంది. “. యెంతసేపైన సరే అక్కడే ఎదిరి చూసి, ఎవరినన్న కలిసే పోవాలి” అనుకున్న మొండిగా. అసలెవరన్న వస్తరో రారో తెలవదు. ఒక పక్కన చీకట్లో అరుగు మీద కూర్చున్నా. దాదాపు రెండు దాటినంక ఏదో అలికిడి. చీకట్లోంచి బయటకు రాకుండా అట్లే నిలబడిన. స్టూడెంట్స్ లాగా ఉన్న ఇద్దరు రూమ్ తాళం తీసి లోపలికి పోయారు. మళ్ళీ తలుపు వేసుకున్నారు. రూమ్ లో లైట్ కొంచెం సేపు వెలిగి ఆరిపోయింది.
నేను మెల్లగా రూమ్ తలుపు కొట్టిన. రెండు సార్లు కొట్టినంక లోపల అలికిడి అయింది. యెవరూ తలుపు తీస్తలేరు. భయపడుతున్నట్టుంది. “నేను శ్రీనివాస్. కరుణ లెక్చరర్ ను. తలుపు తీయండి. భయం లేదు. కరుణ కోసం వచ్చిన” అని లోగొంతుకతో చెప్పిన. ఒక రెండు నిమిషాలాగి తలుపు తీసినరు. సగమే తెరిచి తొంగి చూసాడొక పిలగాడు. నన్ను చూసి ప్రమాదమేమి లేదని నిర్ధారించుకొని లోపలికి రానిచ్చినడు. నేను లోపలికి పగానే వెంటనే తలుపు మూసిండు. లోపల చిన్న దీపం మాత్రమే ఉన్నది. దాని గుడ్డి వెలుతురులో ఇద్దరి ముఖాలూ సరిగా కనబడడం లేదు. కానీ వాళ్ళ కళ్ళలో భయం మాత్రం క్రీనీడల్లో స్పష్టంగా తెలుస్తుంది. “కరుణ ఎక్కడ? కాలేజీకి ఎందుకు రావడం లేదు?? ఎన్ని రోజులైంది అసలు పతా లేక?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించిన. వాళ్ళిద్దరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకున్నారు. మా ముగ్గురి మధ్యా ఒక రెండు నిమిషాల భయంకరమైన నిశ్శబ్దం. బయట దూరంగా కుక్క యేడుపులు, కీచురాళ్ళ అరుపులు వినబడుతున్నాయి. క్రూరమైన నిశ్శబ్దం.
“యేమైందసలు చెప్పండి” అంటూ రెట్టించిన. అంతే “కరుణ లేడు సార్. ఇంక యెప్పటికీ రాడు సార్” అంటూ భోరుమన్నారు. ఇద్దరూ. నాకు కొన్ని క్షణాలు యేమీ అర్థం కాలేదు.. కళ్ల ముందు అంతా పెను చీకటి కమ్ముకున్నట్టైంది.
“యేమి మాట్లాడుతున్నారు మీరు? యేమి జరిగిందసలు? ” అంటూ వాళ్ళని బుజాలు పట్టుకుని బలహీనంగా కుదుపుతూ అడిగిన. దాదాపు ఒక ఐదు నిమిషాలు భోరుమని యేడ్చినంక కొంత సముదాయించుకుని వెక్కిళ్ళ మధ్య చెప్పారు. .
” గత కొన్ని నెలలుగా కరుణ ఉద్యమం లోకి పూర్తిగా వెళ్లిపోయిండు. నగర శివార్లలో ఉన్న పారిశ్రామిక వాడలో కార్మికులతో కలిసి పనిచేయడానికి పోయిండు. ఒక రెండు వారాల కింద ఒక కార్మికుని ఇంట్లో ఉన్న తనను, పోలీసులు అర్ధరాత్రి అరెస్టు చేసి రెండు రోజులు తీవ్రంగా చిత్రహింసలు పెట్టి, కాల్చి పారేసి, ఆత్మరక్షణ కోసం జరిపిన ఎంకౌంటర్ లో చనిపోయిండని కట్టుకథ చెప్పిండ్రు. తనని చంపేసినంక తన దోస్తుల ఇండ్ల మీదా , ఈ రూమ్ మీదా దాడులు చేసిండ్రు. చాలా మందిని అరెస్టు చేసి బాగా కొట్టిండ్రు. అదృష్టవశాత్తు మేము లేము. తర్వాత ఓనర్ చెప్పిండు మీ కోసం పోలీసులు వచ్చిపోయిండ్రని. మేము కూడా ఇట్లా దొంగచాటుగా వచ్చిపోతున్నం. ఓనర్ మంచోడు కాబట్టి ఏమీ అంటలేడు.”.
ఇంక నాకు వాళ్ళ మాటలు వినబడడం లేదు. కాళ్ళ కింద నేల పగిలిపోయినట్టు, పైన కప్పు చీల్చుకుంటూ నల్లటి ఆకాశం మీద కూలినట్టైంది. భూన భోంతరాళాలు దద్దరిల్లిపోయినయి. కడుపులోంచి సముద్రాలు తన్నుకుని కండ్లలోంచి దుంకుతున్నాయి. ఫక్కున పగిలిన పట్టరాని దుఃఖం తో.
జీవితాన్ని అమితంగా ప్రేమించిన కరుణ అమాయకపు చూపులు, ఉదయపు సూర్యకాంతిని వెలిగించే అద్భుతమైన అతని కళ్ళు , గుండెల్ని కదిలించే కవిత్వం రాసిన పూలమొగ్గల్లాంటి అతని లేత చేతివేళ్ల స్పర్శ , కష్టజీవుల జీవితాలను చదవడానికి వాళ్ళతో కలిసి బతికిన మహోన్నత మానవత్వం , ఎవరికింత కష్టమొచ్చినా తల్లడిల్లిపోయే సున్నితత్వం, తను ఇతరుల కోసం, వాళ్ళ కష్టాలు తీర్చడానికి బతకాలి అని జీవితాంతం నమ్మి ఆచరించిన కరుణను ఎట్లా చంపబుద్దైంది పోలీసులకు? కర్కశమైన పోలీసు బూటుకాళ్ళ, తుపాకి మడమల కింద నలిగిపోతూ, తీవ్రమైన చిత్రహింసల్లో నెత్తురోడుతూ బిడ్డ ఎంత తల్లడిల్లిపోయిండో? ఎంత అల్లాడి పోయిండో? చిగురుటాకులా ఎంత వణికిపోయిండో? “నాకు బతకాలని ఉంది” అని ఒడ్డుకు కొట్టుకునే కెరటాల్లా ఎంతగా ఘోషించాడో?
నాకు తెలవకుండానే కండ్ల నుండి చెంపలమీదుగా నీళ్ళు ధారలుగా కారిపోతున్నాయి. కండ్లు పూర్తిగా మసకబారిపోయినయి. కా ళ్ళలో సత్తువ పూర్తిగా ఏదో శక్తి పీల్చేసినట్టై అట్లే ఉన్నపళంగా కూలబడిన…
………..
‘డాడీ వాట్ హపెండ్? వై ఆర్ యూ క్రయింగ్?’ అంటూ మా అమ్మాయు బుజాలు పట్టుకొని కుదుపుతుంటే మగత లాంటి నిద్ర లోనికి వెళ్ళిపోయిన నేను హటాత్తుగా కండ్లు తెరిచిన. తను నాప్కిన్ తెచ్చిచ్చింది. “టెల్ మీ డాడ్ హూ వాస్ దట్ అండ్ వై ఆర్ యూ లాస్ట్ ఆఫ్టర్ మీటింగ్ హర్? ప్లీస్ టెల్ మీ” అని అభ్యర్థిస్తూ అడిగింది తను. “తర్వాత చెప్తా నాన్నా” అంటే వినలేదు తను. ఇప్పుడే చెప్పాలంటూ మొండికేసింది. “సరే కూర్చో, డూ యు హావ్ ఎన్ అవర్?” అని అడిగితే “ఓ ఎస్’”అన్నది నా ముందు కూర్చుంటూ. ఏదీ దాయకుండా మొత్తం చెప్పిన. వింటున్న తనూ చాలా ఏడ్చింది. “ఇట్ ఇస్ వెరీ మూవింగ్ డాడ్. నౌ వి నీడ్ టు ఫైండ్ వేర్ షీ ఇస్. షి మస్ట్ బీ హియర్ సమ్ వేర్” అన్నది తను చాల పట్టుదలగా. కరుణాకర్ కథ తనను కదిలించి వేసినట్టు తెలుస్తోంది స్పష్టంగా. “యా వీ విల్ సి” అని తనను మళ్ళీ తన వర్క్ చేసుకోమని పంపించా.
తర్వాత చాల సార్లు బార్న్స్ అండ్ నోబుల్ కు పోయినా మళ్ళీ తను కనబడలేదు. పోయినప్పుడల్లా స్టోర్ మొత్తం వెతికేవాణ్ని. నా బాధ చూసి మా అమ్మాయి “ఇట్స్ ఓకే డాడీ విల్ ఫైండ్ హర్ సం వేర్” అని ఓదార్చేది.
ఓ రోజు ఆఫీసు లో పనిచేసుకుంటూ అప్ డేట్స్ కోసం ఫేస్ బుక్ తెరిచినా. ఎవరో ఒక ఈవెంట్ కు ఆహ్వానించారు నన్నున్యూ యార్క్ లో యూనియన్ స్క్వేర్ లో నిరసన ఊరేగింపుకు . ఇండియా లో మతవాదుల దాడులకు వ్యతిరేకంగా ఆదివారం మధ్యాహ్నం ఊరేగింపు, ప్రదర్శన ఉంది. గోయింగ్ అని పెట్టిన. ఇది చాల మంచి కార్యక్రమం అనిపించింది. మా అమ్మాయికి చెప్పిన. “నాకు హోంవర్క్ ఉండి డాడీ. సారీ డాడ్ నెక్స్ట్ టైం ఐ విల్ బీ విత్ యూ” అన్నది. ఇటువంటి వాటికి రావడానికి ఉత్సాహం చూపించే మా ఆవిడ కూడా తనకేదో అర్జెంట్ పని ఉందని, రాలేనని అన్నది. సరే ఒక్కడినే పోవడానికి నిర్ణయించుకున్న.
ఆదివారం ఉదయం ట్రైన్ ఎక్కి బయలుదేరా న్యూ యార్కుకు. యూనియన్ స్క్వేర్ పోయే సరికి చాల మందే ఉన్నారు. అందరి చేతుల్లో మనువాద ఫండమెంటలిస్టుల దమననీతిని, ఆగడాలను, క్రూరత్వాన్ని, వ్యతిరేకిస్తూ ప్లకార్డులు బానర్లు ఉన్నాయి. దళిత ఆదివాసీ మైనారిటీ స్త్రీల మీద సర్వత్రా జరుగుతున్న మతవాదుల దాడులను వ్యతిరేకిస్తూ నినాదాలతో మొదలైంది ఊరేగింపు. ఎన్ ఆర్ ఐ లు రకరకాల వాళ్ళు వచ్చిండ్రు. ముక్త కంఠం తో నినాదాలు చేస్తుండ్రు. న్యూయార్క్ నగరం ప్రతిధ్వనిస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చుట్టూ చూస్తూ . అందరితో కలిసి గొంతెత్తి నినాదాలిస్తున్న. ఏదో పరిచయమున్న గొంతు విన్నట్టు నా ముందు ఒకామె వెనుకకు తిరిగి చూసింది.
అంతే ఒక్క సారి నివ్వెర పోయిన. కలనా నిజమా అర్థం కాలేదు
అటు ఆమె కూడా ఆశ్చర్యపోయింది. తనూ నమ్మలేక పోయినట్టుంది బహుశా రెండు అడుగులు వెనుకకు వేసి నేనున్న వరుసలో చేరి “సార్ మీరా?” అంది నమ్మలేనట్టు. నాకూ షాక్ నుండి బయటకు రావడానికి చాల సమయమే పట్టింది. “అవును మంజులా నేనే! మళ్ళా ఏమైపోయినావు? ఎంత వెతికానో తెలుసా నీ కోసం” అన్నా. గొంతులో దుఃఖం పూడుకుపోవడం తెలుస్తోంది నాకు. “చెప్తాను సార్ మీతో ఎవరైనా ఉన్నరా మీరొక్కరేనా?” అని అడిగింది. “నేనొక్కన్నే” అన్న నేను. “ఐతే ఊరేగింపు ఐనంక కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. మీరు ట్రైన్ కు వచ్చినరా?” అని అడిగింది. అవునన్నాను.
ఈ లోపల ఊరేగింపు ఐపోయింది. చాల విజయవంతంగా ఐంది. జనాలు వేలల్లో వచ్చిండ్రు. తెలుగు వాళ్ళు తక్కువే. తను ఇటువంటి ఊరేగింపు కు తను రావడం నన్ను విపరీతంగా ఆశ్చర్య పరిచింది.
అంతా అయిపోయాక , నేను మంజులతో “వెళ్దామా కాఫీ కి” అన్న. సరే అంటూ పక్కన స్టార్బక్స్ కు దారి తీసింది. చెరో కాఫీ తీసుకుని ఒక ఖాళీగా ఉన్న టేబిల్ దగ్గర కుర్చీలు లాక్కుని కూర్చున్నాం. “ఊ ఇప్పుడు చెప్పు ఏమయ్యావు ఎక్కడికి పోయావు? ఎందుకని కనీసం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చెయ్యలేదు? ఎంత వెతికానో తెలుసా నీ కోసం?” అంటూ గాద్గదిక మౌతున్న గొంతుతో ప్రశ్నలు కురిపించిన.
తను మౌనంగా కాఫీ సిప్ చేస్తున్నదల్లా ఆగింది. ఒక్క సారి పెద్దగా ఊపిరి తీసుకుంది. అంతే వెక్కి వెక్కి ఏడ్వసాగింది. ఎన్నాళ్ళ దుఖమో తన్నుకుని వస్తోంది. కట్టలు తెంచుకుంటున్నది. చుట్టూ చూసాన ఆమె నిశ్శబ్దపు ఏడ్పు విని ఒకరిద్దరు తల పైకెత్తి చూసిండ్రు. “ప్లీజ్ వద్దు మంజులా బాగుండదు ఇది పబ్లిక్ ప్లేస్. దయ చేసి నిభాయించుకో” అన్న నేను.
ఒక ఐదు నిమిషాలు అట్లా వెక్కిళ్ళు పట్టింది తను. నెమ్మదిగా కంట్రోల్ చేసుకుని నాప్కిన్ తో కండ్లు ముఖం తుడుచుకుంది. కొంత సేపు మౌనం తర్వాత మెల్ల గా గొంతు విప్పింది.
“సర్ కరుణ ఉద్యమం లో పనిచేస్తున్నాడని తెలిసినప్పటి నుండి అతన్ని వారించే ప్రయత్నం చేసిన. తను వినలేదు. తనముందు వద్దని ఏడ్చిన. నా బేల తనాన్ని తను చులకన చేయలేదు. అర్థం చేసుకున్నాడు. తను ఎందుకు ఉద్యమం లోపలి పోతున్నాడో చెప్పాడు వివరంగా. ఈ సమాజం లోని అణగారిన వర్గాల కోసం, తరతరాల ఆధిపత్యం కింద నలిగిపోతున్న వారి కోసం తను పూర్తికాలం ఉద్యమం లోకి వెళ్ళడం సరైంది అని ఖచ్చితంగా చెప్పాడు. నన్ను తన కోసం బాధ పడొద్దు అని, తనకేమైనా ఐతే తట్టుకునే ధైర్యం తెచ్చుకొమ్మనీ చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత రెండు మూడు సార్లు ఇంటికి వచ్చాడు. యేదో ఒక రాత్రి పూట వచ్చేటోడు. ఒక సారి నాన్న తీసాడు తలుపు. ఎదురుగా తను. మట్టి గొట్టుకు పోయిన బట్టలతో దుమ్ము పట్టిన వేషం తో. నాన్న షాక్ తిన్నాడు. లోపలి రానిచ్చి, నన్ను పిలిచిండు. ఎవరూ అని అడిగితె మా క్లాస్ మేట్ అని చెప్పిన. తను ఉన్నంత సేపూ పక్కనే నిలబడ్డాడు కరుణ ఏమీ మాట్లాడలేదు. కొంచెం సేపు ఉండి వెళ్లిపోయాడు. బహుశ బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాడు. నేను తినమని అడగడానికి భయపడ్డ. నిరాశ గా నా కండ్లలోకి చూస్తూ తను ‘వెళ్తా!’ అనుకుంటూ మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్ళిపోవడం నాకిప్పటికీ గుర్తు.”
చెప్తూ చెప్తూ, మళ్ళా దుఃఖకెరటం ముఖంమీద చరిస్తే ఒక్క సారి విల విల్లాడిపోయింది. తనతో పాటు నేనూ.
“పాపిష్టి దాన్ని తనను ఆ రోజు బుక్కెడు అన్నం తిని పొమ్మనడానికిధైర్యం చాలలేదు. అదే తన చివరి చూపని కలలో కూడా ఊహించలేదు. తను పోయినంక మా నాన్న నన్ను ఎవరతను అని తీక్షణంగా ప్రశ్నించి నేను చెప్పెలోపులే నాలుగైదు తగిలించాడు. శబ్దం విని మా అమ్మ పరిగెత్తుకొచ్చింది. తను ఆపక పొతే బాగానే పడేవి నాకు ఆ రోజు. తీవ్రమైన స్వరం తో హెచ్చరిస్తూ నన్ను తిట్టాడు. మరొక్క సారి తను నన్ను కలిసినా, నేను తనని కలిసినా తీవ్ర పరిణామాలుంటయని బెదిరించాడు. నేను ఆ రోజు చాల భయపడ్డ. నాకేమన్నా అవుతదో అని కాదు. కరుణ కు ఏదన్న ప్రమాదం సంభవిస్తదేమో అని. అమ్మ కూడా బాగానే తిట్టిపోసింది ‘నీకిదేం పోయే కాలమే? ఎవడే వాడు? ఏమి కులమే వానిది?’ అనుకుంటూ. తన కులం గురించి ఇద్దరూ గుచ్చి గుచ్చి అడిగారు. చెప్పిన. అంతే ఇక బ్రహ్మాండం బద్దలైంది. ‘ఇంత చేసి ఆ కులం తక్కువోని తోని తిరుగుతున్నవే’ అనుకుంటా తిట్టి, మరీ కొట్టారు అమ్మ, నాన్న.”
“ఇది మీకైనా ఎట్లా చెప్పాలో అర్థం కాలేదు నాకు. ఈ లోపల సెలవులొచ్చినాయి. సెలవుల్లో ఈ దారుణం జరిగిపోయింది. మా ఇద్దరికే తెలిసిన అమ్మాయి చెప్పింది. వారం రోజులు నేను మనిషి కాలేదు. ఏమిటి అని అమ్మ నాన్న అడిగిన ఏమీ చెప్పలేదు. ఏడ్చి ఏడ్చి నిద్రలేక ఉబ్బిన కండ్లను చూస్తే వాళ్ళకు యేమర్థమైందో తెలవదు కానీ నా మీద ఉన్న కోపం తో ఒక్క సారన్నా దగ్గరికి తీసుకుని ఏంటి సంగతి అని అడగలేదు” మళ్ళా తన గొంతు పూడుకుపోయింది.
నెమ్మదిగా గొంతు సవరించుకొని “కరుణ ‘ఎంకౌంటర్’ అయినంక రెండు రోజుల తర్వాత రాత్రి ఆకాశమూ నేలా పగిలిపోయి ప్రళయం వచ్చినట్టైంది. ఒక అర్ధ రాత్రి ఎవరో తలుపు తట్టారు. మా నాన్నే పోయి తలుపు తీసాడు ఎవరూ అనుకుంటూ. మళ్ళీ కరుణ నే వచ్చిండేమో అనుకున్నాడు. . కానీ వచ్చింది పోలీసులు. నా కోసం వచ్చారు. నన్ను అడిగారు. ఎందుకు అంటే ‘మీ అమ్మాయికి పార్టీ తో సంబంధాలున్నాయి. మొన్న దొరికిన ఒక పార్టీ మనిషి డైరీ లో మీ అమ్మాయి పేరుంది. ఎన్ని రోజుల నుండి తిరుగుతుంది మీ అమ్మాయి పార్టీ లో ?’ అని ఒక్క సారిగా డైనమట్లు పేల్చారు. మా నాన్న యేదో చెప్ప బోతే చాల కటువుగా ఆయనను పక్కకు నూకేసి సరాసరి లోపలి వచ్చారు.
అప్పటికే చప్పుడు విని ‘ఏమిటీ?’ అని హాలు లోకి వచ్చిన నన్ను అమాంతం చెయ్యి పట్టుకుని గొరా గొరా గుంజుకపోయారు. నివారించ బోయిన మా నాన్నను అమ్మను పక్కకు తోసేసారు. నన్ను సరాసరి నా రూమ్ లకు తీసుకపోయి ఇద్దరు కాన్స్టేబుల్స్ నా చేతులు పట్టుకుంటే ఎస్ ఐ ఆధ్వర్యం లో నా రూమ్ ను చిందరవందర చేసి సోదా చేసిండ్రు. ఎప్పుడో కరుణ దగ్గర తీసుకున్న ఒక పుస్తకం ఉండింది. మహిళా విముక్తి గురించి లెనిన్ పుస్తకం. దాని లోపల కరుణ పేరుంది. అదొక్కటే వాళ్ళకు మొత్తం నా రూమ్ లో దొరికిన సాక్ష్యం. ఇంకేముంది నన్ను మల్ల గొరా గొరా వాను దగ్గరికి ఈడ్చుకుపోయారు. మా నాన్న అడ్డం వస్తే ‘రేపు పొద్దున్న పోలీసు స్టేషన్ కు రా’ అని గద్దించి నన్ను గుంజుక పోయారు. వాన్ లో నానా బూతులు. ఓ ఐదారు దెబ్బలు. ‘నీకెంత కండ కావరమే పార్టీ ల తిరుగుతావ్!? చెప్పే మీ దళ సభ్యులు ఎవరు? మీ కమిటీ సభ్యులు ఎవరు?? ‘ అని ప్రశ్నలు. ఒక అరగంట వాన్ లో ప్రయాణం చేసినంక యేదో పోలీసు స్టేషన్ దగ్గర ఆపి దిగమన్నారు. లోపలకి పోంగానే ఒక పోలీసు మెడ పట్టి నూకింది లాకప్ లోపలికి. తర్వాత మళ్ళా వేరే రూమ్ లకు తీసుకపోయిండ్రు. లాఠీలతోటి కొట్టారు. జుట్టు పట్టి లాగారు . తలను గోడకేసి కొట్టిండ్రు. చెప్పనలవి కాని బూతులు తిట్టిండ్రు. వాళ్ళేమి అడిగిన నా సమాధానం ఒక్కటే నాకేమే తెల్వదని. నిజంగానే తెలవదు కదా. కరుణ తో నాకున్న స్నేహాన్ని చాల దారుణంగా బీభత్సంగా మాటలతోటి అవమానపరిచిండ్రు. అట్లా రాత్రంతా ఐతే ఏమయ్యేదో నా పని? రెండున్నరకు అనుకుంట పోలీసు స్టేషన్ కు నాన్న వచ్చాడు ఒక న్యాయవాదిని తీసుకొని. పేపర్ల మీద సంతకం పెట్టి నాకేమీ తెల్వదని అతను నా క్లాస్ మెట్ మాత్రమే అని చెప్పి బయటకు తెచ్చారు. పోతూ పోతూ నాన్న కరుణ ను బండ బూతులు తిట్టుడు మొదలు పెట్టాడు. పోలీసులు కొట్టినప్పుడు కూడా రాని దుఃఖం కోపం రేశం ఒక్క సారిగా ముంచుకొచ్చినయి. ‘నాన్నా ఈ లోకం లో లేని వాణ్ణి ఏమీ అనొద్దు మనకందనంత దూరం వెళ్ళిపోయిన వాణ్ణి నోటికొచ్చినట్టు తిట్టకు. తను నమ్మిన దానికోసం ప్రాణాలు లెక్క చెయ్యకుండా అమరుడైనాడు’ అని పెద్దగ అరిచిన. ఏడ్పు గొంతుకు అడ్డం పడి నా గొంతు నాకే సరిగా వినబడలేదు. విషయం అర్థమైన నాన్న, లాయర్ ఒక్క సారి నోరు మూసుకున్నారు. ఐన వాళ్ళ కోపం చల్లారలేదు. కరుణ మీద కోపం ద్వేషం ఎంత మాత్రం తగ్గలేదు. తెల్లారే నన్ను మా ఊరు భీమవరం కు తరలించారు. అక్కడే కాలేజికి ట్రాన్స్ఫర్ చేసారు. ఎవరితో మాట్లాడినా, ఫోన్ చేసినా కాళ్ళు విరగ్గొడత మని బెదిరించారు.’
‘వెంటనే ఈ వార్త మా బంధువుల్లో నిప్పు లెక్క వ్యాపించింది. అందరూ తలా ఒక సూటి పోటి మాటలు అనడం మొదలు పెట్టిండ్రు. వాటిని తట్టుకోవడం కష్టమైంది. ఎట్లైనా సరే వెంటనే నా పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు మా నాన్న. మా దూరపు బంధువుల అబ్బాయే నా కంటే వయసులో చాల పెద్ద, రమేష్ ను చూసిండ్రు. నాకు ఫొటో చూపించిండ్రు. మారు మాట్లాడే అవకాశం కానీ, నా అభిప్రాయం చెప్పే అవకాశం కానీ ఇవ్వలేదు. ఆ అబ్బాయి వాళ్ళకు ఇదంతా ఏమీ తెలవదు. నన్ను చూసి వెంటనే ఒప్పుకున్నారు. నా ఫైనల్ యియర్ ఎగ్జామ్స్ కంటే ముందే పెళ్లి ఐపోయింది. పెళ్లి కాగానే అమెరికాకు పంపించేసారు. మా నాన్న కాలేజి లో యేదో చెప్పి మానేజి చేసారు. మధ్యలో ఇండియా వచ్చి ఫైనల్ ఎగ్జామ్స్ రాసి మళ్ళీ మళ్ళీ అమెరికా కు వచ్చేసాను. ఎవరికీ ఏమీ చెప్పుకోలేని పరిస్తితి. నిజానికి ఒక్క నా ఫ్రెండ్ పావని కి తప్ప ఇంకెవరికీ నేను ఎక్కడున్నా, ఏమైనా అనేది తెలియదు. తెలిసిన కాలేజి వాళ్ళు ఎవరన్నా కలిసినా ముఖం తిప్పేసుకునే దాన్ని.
అట్లా గత 27 ఏండ్లుగా అజ్ఞాత వాసం లో బతుకుతున్న నాకు హటాత్తుగా మీరు కనబడ్డారు. నిజానికి వేరే ఎవరు కనబడ్డ నేను పలకరించేదాన్ని కాదు. కానీ నాకు మిగిలిన ఒకే ఒక్క కరుణ జ్ఞాపకం మీరు. మిమ్మల్ని పలకరించకుండా ఉండలేక పోయిన. మీకు నా కాంటాక్టు ఇద్దామనుకునే లోపల తనూ మా పాప వచ్చేసారు. తనకు నేను వేరే వాళ్లతో మాట్లాడడం ఇష్టముండదు, మరీ మగవాళ్లయితే. అందుకే అట్లా అర్ధాంతరంగా వెళ్ళిపోయిన. ఇంటికి పోయినంక మీ గురించి చాల ప్రశ్నలు అడిగిండు. మళ్ళా బార్న్స్ అండ్ నోబుల్ కు వెళ్తానంటే ఎందుకూ మీ సార్ ను కలిసేటందుకా అని దెప్పేటోడు. అందుకే అక్కడికీ రావడం మానేసిన. కానీ మీరెక్కడన్న కలవక పోతారా అని ప్రతి మాల్ లో, స్టోర్ లో వెతికేదాన్ని. ఇదిగో ఇప్పటికి కనబడ్డారు.”
అంటూ కండ్లు తుడుచుకుంది. కన్నీళ్లు ధారాపాతంగా వస్తున్నాయేమో నాప్కిన్స్ తడిచిపొయినాయి. చాల మంది మాకేసి చూస్తూ ‘ఇస్ ఎవిరీ థింగ్ ఓకే? ‘ అని అడుగుతూ వెళ్లిపోయిండ్రు. నేను కాం గా ఉండడానికి ప్రయత్నం చేసిన.
:మరి ఇప్పుడు ఇట్లా ఈ ఊరేగింపుకు? ఎట్లా ? ఎందుకు? “ ఇంకా ఎన్నో అడగాలని ఉన్నా తమాయించుకుంటూ అడిగిన.
‘ఇది నా కరుణ అపురూపమైన జ్ఞాపకం. ఈ చైతన్యం తను నాకిచ్చిన కానుక. నేను జీవితాంతం దాచుకోవాల్సిన కానుక. మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందొ లేదో కానీ గొప్ప స్నేహం ఉండింది. ఇది అతని స్నేహానికి గుర్తు. తన జ్ఞాపకాలను ఇట్లా సజీవంగా ఉంచుకుంటున్న . నా లోలోపల, పూల తోటలా కరుణ ను పెంచి విరబూస్తున్న “
అనుకుంటూ లేచింది ఇక ఆలస్యమైంది వెళ్దాం అన్నట్టుగా.
ఈసారి మరింత ఆశ్చర్యపోయాను. . నా కండ్లలో నీళ్ళు చిప్పిల్లాయి. తను ఎంత చూడొద్దు అనుకున్న చూసేసింది.
నీటితో మెరిసే కండ్లతో “సరే సార్ ఉంటాను. మళ్ళీ ఇట్లే ఏదైనా ఊరేగింపులోనో, ప్రదర్శనలోనో, సభలోనో, మళ్ళీ కరుణ జ్ఞాపకాల్ని పంచుకోవడానికి కలుద్దాం”
అంటూ ఖాళీ ఐన కాఫీ కప్ ను ట్రాష్ బిన్ లో పడేసి తలుపు తెరుచుకుని బయటకు నడిచి వెళ్ళిపోయింది.
ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిలబడ్డ నా కనుకొలకుల్లోంచి, ఒక నీటి బిందువు చెంప మీదికి వెచ్చగా జారిపోయింది.
*
Touching.
Thank you Kurmanath!
రాయడానికి, చెప్పడానికి, పదాలే, దొరకడం లేదు, నాకు బాగా నచ్చింది ఈ కధ, వాస్తవానికి దగ్గర గా, ఉద్యమాలు పేరు న, జీవితం నాశనం చేసుకోవడం, అప్పుడే కాదు, ఇపుడు నచ్చదు, నాకు మంచి కధ ని,రాసిన, మీకు అభివందనం. Sir!
రాయడానికి, చెప్పడానికి, పదాలే, దొరకడం లేదు, నాకు బాగా నచ్చింది ఈ కధ, వాస్తవానికి దగ్గర గా, ఉద్యమాలు పేరు న, జీవితం నాశనం చేసుకోవడం, అప్పుడే కాదు, ఇపుడు నచ్చదు, నాకు మంచి కధ ని,రాసిన, మీకు అభివందనం. Sir!
Thank you madam.
తెలంగాణ లో నక్సల్ ఉద్యమం , అన్నలూ… పల్లెల్లో వాళ్ళ హల్చల్, ఊరూరా రెడ్డీల కళ్ళలో వణుకు, అట్టడుగు ప్రజల్లో అన్నల పట్ల ఒక హీరో వర్షిప్…ఇవన్నీ చూస్తూ పెరిగాము.
వాళ్ళ గురించిన ప్రతీ విషయమూ ఎంతో ఆసక్తి గా ఉండేది..వాళ్ళ అజ్ఞాతవాసం.. గోడల పై రాతలు, పంప్లేట్లు అన్నీ…ఎంత మంది ‘ కరుణ’ ల నెత్తుటితో తడిసిందో ఈ నేల.. మంజుల అందిపుచ్చుకున్న ఆ చైతన్యం చాలా నచ్చింది..
అద్భుతమైన కథనం..మీరు దగ్గరగా ఆ జీవితాల్ని చూశారు కాబట్టి ఇంత హృద్యంగా రాశారు సర్..చాలా బావుంది.
Thank you Rajitha garu
కదిలించే కథ, బావుంది
Thank you Desharaju!
చాలా కదిలించేలా రాశారు సర్ . మంజుల పాత్ర చాలా విశిష్టమయినది . కరుణా తో స్నేహభావమే కాక అతని అణుగారిన ప్రజలకోసం చేస్తున్న ఉద్యమం పట్ల అవగాహన గౌరవం ఉన్న వ్యక్తి మంజుల. అందుకే మళ్ళీ శ్రీనివాస్ కు ఒక ప్రొటెస్ట్ దగ్గర కలిసింది. అంటే కరుణాకర్ తో స్నేహం (ప్రేమ) వల్ల ఆందోళన , ఉద్యమాల మీద కలిగిన గౌరవం ఇంకా మిగిలుంది.
ఈ కధలో కరుణాకర్ పట్ల స్నేహం, ప్రేమే కాక, బాగా చదువుకున్న స్త్రీ ని ఉద్యమం పేర రాజ్య యంత్రాంగం ఎలా హింస పెడతరో కూడా చూపించారు.
Thank you guroojee!
కంటనీరు తెప్పించింది అన్న.కరుణాకర్ పాత్రలో తమ్ముడు శ్రీనూ గుర్తొచ్చాడు.చాలా ఏండ్ల తరువాత ఒక వ్యక్తి కలిస్తే ఎంతలా కదిలిపోతామో అది మంజులను కలిసిన దృశ్యాలను బాగ చెప్పారు.బాగ గుర్తుండిపోయే కథ అన్న
Thank you thammudoo! karuna patraku sreenu prerana. kontavaraku ivi naa gnapakaale!
Sir
Maarxist drukpadhamlo payaninchina mee gurushishyula anubandhaanni vraasina theeru kanta kanneerolikinchindi.
Gnaapakaalu konni cheragavu. Tholusthuntaayi.thank you sir
Thank you Giriprasad garu… kannella lo sajeevangaa unde gnapakalivi..
కదిలించే కధ. ఒక్క మనిషిని స్పష్టంగా పోల్చుకున్నా, ఎందరెందరినో తలపుకు తెచ్చిన కధ. బాగుంది.
Thank you Kiran, nijame karuna namavachakm kontavarake – sarvanamame! aa sarvnamala chuttoo mana gnapakalenno – vatillo okaru, vatini munduku teesukeltoo manjula lanti vallu endaro…
Anna! Very touching story!
Thank you Chaitanya
ఇదేదో జరిగిన కథలా ఉంది నాస్వామీ.స్తంభింప జేశావ్
Thank you very much Krishnudoo!
Vammo..chaala naturalga undi…suspense and heart touching….
Thank you Sasidar garu!
నమస్తే స్వామి గారూ…
చాలా మంచి కథ. చెప్పకనే చెప్పిన గొప్ప ఉద్యమ నేపథ్యం. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇతివృత్తాలున్న కథలు ఎవరూ రాయడం లేదు. కథ కదిలించింది. కథనం సహజంగా ఉంది. కథ ఎత్తుగడ, ముగింపు బాగా కుదిరాయి. ఒకప్పుడు అల్లం రాజయ్య , తుమ్మేటి, మిడ్కో లాంటి వాళ్ళు రాసిన కథలు గుర్తుకొచ్చాయి. అయితే మీరు బేసికల్ గా మంచి కవి కాబట్టి , ఆ ప్రభావం కథపై (మీకు తెలయకుండానే) పడింది . సంభాషణల్లో “మీరు గుర్తుకొస్తేనే కన్నీళ్ళ ప్రవాహం కట్టలు తెగేది ..” / “ఒక్కొక్క జ్ఞాపకమూ వెంటాడి తరిమేది ..” వంటి వాక్యాలు రియల్ లైఫ్ లో మాటల్లో వాడము. కథలో ఇవి అసహజంగా అనిపిస్తాయి. అలాగే “కనుపాపల్ని చీల్చుకుని వస్తున్న నీటి సూదుల్ని ..” వంటి వాక్యాలు కవిత్వంలో తప్ప కథలో పొసగవు . (ఇలా రాశానని మరోలా అనుకోవద్దు)
మంచి కథ ఇచ్చినందుకు మరోసారి కృతజ్ఞతలు మీకు.
Thank you Tahiro garu. Good observation and great suggestion. Even I feel that sometimes (or is it all times?) the poet in me would dominate. In this case, however, since Manjula is also a poet may it is justified. But I will keep in mind your suggestions. Thanks again.
స్వామన్నా మంచి కథ మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసారో తెలియదు కానీ హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం వీరస్వామి నా కళ్ళల్లో మెదిలాడు. అతను నాకు పరిచయం లేదు.ఆయన స్ఫూర్తి నాలో ఉంది. ఆయన అంటే హీరో వర్షిప్. ఒక్క సారి ఎనభై లలో జంటనగరాల కేంద్రంగా అల్లుకున్న యాది కథ లాంటి జీవితం లో చూసుకున్నా. సిటీ ప్రభాకర్, మాయం అయిన మల్లేష్,మా కళ్ళముందే చరిత్ర లో కలిసిన వివేక్,విద్యాసాగర్ తెలంగాణ కల్లోల జీవితం మీరు రాసుకున్న “కల్లోల కలల మేఘం”లా కమ్ముకుంది. మీరు కథలు రాస్తారు అని తెలియదు. కానీ ఆపకుండా చదివిన కథ ఇది.కరుణ లాంటి ఎన్నో జీవితాలు దగ్గరగా చూసారు కనుకే ఇంతలా కదిలించే లా రాయగలిగారు. తెచ్చిపెట్టుకున్న చైతన్యం నాలుగు గోడల మధ్య ఈజీ చైర్ కథనాల మధ్య “అతని గుర్తు” నన్ను వెంటాడింది. కొంచం ఎడిట్ అవసరం కథనం అమెరికాలో జరిగినంత మాత్రాన ఇంగ్లీష్ కలవడం కథకు కొంచం అడ్డుకట్ట వేసినట్టు అనిపించినా ఇష్టమైన నేపధ్యం కనుక అంతే ఇష్టంగా ఉద్వేగంగా చదువుకున్న కథ. థాంక్స్.
Thank you thammudoo Seetaram! neeku nachinanduku chala santosham. Karuna patranu generalize cheyyalane prayatnam – Karuna manandari aashalaku, svapnalaku, ardhantaranga aarpeyyabadda anekaneka yuvayodhulaku chihnam. tanu sarvanamam.
nee soochanalu kooda bagunnayi – tappakunda teesukunta.. nenu nijaniki kathalekkuvaga rayaledu – kaanee idi chala yendlu naalo maagi, marigi vachina katha.
కథలో పాత్రలకు కన్నీళ్ళు వచ్చినప్పుడల్లా నా కళ్ళలోనూ కన్నీళ్ళు!
చాలా ఆద్రంగా వుంది. ఎన్నెన్ని జీవితాలు కరుణలా కరిగిపోయాయో!
Thank you Prasad garu. Karuna lanti vallevaroo ika mundu ardhantaranga aripovaddani korukundam.
అన్నా…
ఇది కథ కాదు. జీవితం. మానని గాయాల సలపరింత. దగాపడ్డ జిందగీల బతుకుచిత్రం. ఎంతమంది కరుణాకర్ లు నేలరాలిపోయిరో. ఎంత నెత్తురు ఈ నేలన గడ్డకట్టుకపోయిందో. తరం నుండి తరానికి పోరాటం మాత్రమే వారసత్వంగా అందించబడుతున్న నేల. ఈ నేల మీద రాజ్యాంగం కల్పించిన హక్కులు దక్కాలంటే పోరాడాలి. ఆ పోరాటంలో ఎందరి తల్లులు తమ బిడ్డలను కోల్పోయారో. అది విప్లవోద్యమమైనా, తెలంగాణ ఉద్యమమైనా కింది కులాల త్యాగాలు లేకుండా లేవు. నేను 2009 ఉద్యమ సందర్భంలో రాసిన ‘లడాయి’ దీర్ఘకవితను అంకితం చేస్తూ…చెట్టంత కొడుకులను ఉద్యమాలకు అంకితమిచ్చి, గుడ్డిదీపం వెలుగులో కుమిలి ఏడుస్తున్న నా తెలంగాణ తల్లులు దు:ఖానికి…అని రాసుకున్న.
ఈ కథలోని కరుణాకర్ వంటి లిఖించబడని త్యాగాలన్నీ బయటికి రావాలి. అక్షరాలకు ఎత్తబడని చరిత్రలన్నీ వెలుగు చూడాలి. అలా జరగాలంటే కిందికులాల మీద ముందు ఒక కన్సెర్న్ ఉండాలి. అది మీకుంది. అందుకే కరుణాకర్ పాత్రలోని వ్యక్తిని మీరింక మరిచిపోలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఆ దు:ఖమే కథైంది. నిజానికి చావుల చుట్టూ ఉండే కథలు సహజంగానే కదిలిస్తాయి. వెంటాడుతాయి. గుర్తుండి పోతాయి. అయితే మీ కథలో మాత్రం మంజుల మళ్లీ కరుణాకర్ ఆచరణను తలకెత్తుకొని, అతనికి నివాళులు అర్పించడం బాగుంది.
కథా సందర్భంలో ఆ నిరసన మా దళితుల మీద దాడులకోసం జరిగిందిగా చెప్పడం మరీ మరీ నచ్చింది. ఇంకా మీ గుండెలోతుల్లో ఎంత మంది కరుణాకర్ లు ఉన్నారో వారందరిని అక్షరాల్లో బ్రతికించండి.
బలంగా చిత్రించేదే మంచి కథ. అలా ఇది మంచి కథే.
ఈ కథా సందర్భంగా దళితులు ఇంకా ప్రాణత్యాగాలు చేసి, అగ్రవర్ణాలను నాయకులుగా మోయాల్సిన అవసరం లేదు. 1920లలో ఇండియాలో మొదలైన కమ్యూనిస్టు ఉద్యమానికి వచ్చే ఏడాది 2020తో వందేండ్లు. ఈ వందేండ్ల ఉద్యమ వైఫల్యాల మీద చర్చ జరగాలి. ముఖ్యంగా బహుజనులు అంబేద్కర్ మార్గంలోనే తమ హక్కులు సాధించుకోవాలి. మంచి కథను రాసినందుకు మీకు ధన్యవాదాలు అన్న. జై భీమ్.
-పసునూరి రవీందర్
కథ నచ్చినందుకు నెనర్లు తమ్ముడూ రవీ. ఉద్యమ ప్రయాణం లో కరుణ లాంటి దళిత బహుజనులెందరో అమరులయ్యారు. ఒక్కొక్కరిదీ ఒక్కో చరిత్ర. రికార్డ్ కావాల్సిన చరిత్ర. వాళ్ళ త్యాగాలు, ప్రేమలు, కుటుంబ జీవితాలు, కన్నీళ్లు, కష్టాలు అన్నీ చెప్పుకోవాలి… ఇప్పుడు దళిత బహుజనులు తమ చరిత్ర తామే ప్రకటించుకుని హక్కుల కోసం ఉద్యమిస్తున్న సందర్భం. దాన్ని మన సాహిత్యం మరింత బలోపేతం చెయ్యాలి… వివరమైన వ్యాఖ్య రాసినందుకు చాల సంతోషం.
నారాయణస్వామి గారూ… వేరే పనుల్లో పడి కధ ఆలస్యంగా చదివాను. మీరు మంచి కధకులు కూడా కాగలరని తెలిపే కధ ఇది. సరే…కధావస్తువు యెలాగూ గొప్పది, అవసరమయినది. అనేక త్యాగాలగురించీ,గాయాల గురించి రాయాల్సే ఉంది. రాయాల్సినంత రాయలేదు . యెన్ని కలాలో వాటిని రాయాలి. అవి కేవళం గత వలపోతలో,తలపోతలో కావు…వర్తమాన కార్యాచరణలు…మీ కధ అదే యెరుక చేసింది. అభినందనలు .
Thank you so much Appalnayudu garu. Your comment is very valuable and highly encouraging for me. Thank you for your support.
Superb narration ….. moved a lot ….!!!
Thank you very much Raghavendra Prasad garu!
Narayana swami ,
Very touching and well written story close to reality. I’m reminded of my days in the movement , good friends Jcs Prasad ,Madhusudanraj encounters and their sacrifice for the cause.I felt nostalgic.
Chalapathirao.
Dear Chalapathirao garu – thank you so much for your hearty comments. As you are aware I was greatly inspired by Madhu mama and JCS and George of course. I believe Karuna is a pronoun rather than a noun representing all those who sacrificed their lives for a better tomorrow.
గుండెల్ని మెలిపెట్టే కథ…..ఓ కవి కథ ఇంతబాగా చెప్పగలడా.. .అద్బుతమైన వర్ణన…చాలా బాగా నచ్చింది….నమస్తే
Thank you Swamy Naidu garu. Meeku nachinanduku Chala santosham
అలాంటి మనిషి ఒక్కరు తారసపడి, కొంత కాలం పెనవేసుకుపోతే చాలు దుఃఖంతో అయినా సరే విలువైన అనుభవాలతో, జ్ఞాపకాలతో బతికేయొచ్చు. కదిలించే జీవిత కథ. గుర్తుంచుకోదగ్గ కథనం. అభినందనలు స్వామీ.
Thank you very much Aranya
Very tou ching guru
Thank you Guroojee