అతని ఇంటి పేరు వీ… అంటే విజయం

వాళ్లిద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఒకరి ముఖాన్ని మరొకరు పరికించి… పరిశీలించి చూస్తున్నారు. ఇద్దరిదీ సమానమైన వయసే. వారిలో ఒకరు వేయి వెన్నెలల నవ్వుకు ప్రతీకలా ఉన్నాడు.

అతని ఎదురుగా  కూర్చున్న అతను వేయి అమావాస్య చీకట్లకు ఆనవాలుగా ఉన్నాడు.

“ నేనే గెలుస్తాను. అవునే నేనే గెలుస్తాను. ఇంతకు ముందు ఎంతమందిని గెలవలేదు. ఇక్కడా నాదే గెలుపు “ అన్నాడు అమావాస్యలాంటి మనిషి.

అలా అంటున్నప్పుడు అతని కళ్లలో ఓ కసి కనపడుతోంది.

అలా అంటున్నప్పుడు అతని ముఖంలో ఓ కోపం ప్రస్పుటమవుతోంది. అలా అంటున్నప్పుడు అతని కదిలికల్లో విజయం తప్పదన్న ధీమా కనిపిస్తోంది.

“ఈసారి నీ గెలుపు అంత సులభం కాదు. ఇంతకు ముందు నువ్వు విజయం సాధించిన వారంతా ఒకింత భయస్తులు. అంత పట్టుదల లేని వాళ్లు. ఇతను అలా కాదు. ఈసారి నన్ను నిలబెట్టడం కోసం అతను విజయం సాధిస్తాడు. అతను గెలుపు సాధించడమంటే అతని చుట్టూ ఉన్న వందలాది మంది విజయం సాధించడం. అంటే నేనే గెలవడం “ అన్నాడు వెన్నెల వంటి మనిషి.

అలా అంటున్నప్పుడు ఇతని కళ్లలో ఓ ప్రశాంతత కనిపిస్తోంది.

అలా అంటున్నప్పుడు ఇతని ముఖంలో చిరు దరహాసం తొణికిసలాడుతోంది.

అలా అంటున్నప్పుడు ఇతని కదిలికల్లో ఈసారి అమావాస్య ఓడిపోవడం ఖాయం అనే నమ్మకం కనిపిస్తోంది.

***                                            ***                                                  ***

1984 సంవత్సరం మే నెల 29వ తేదీ. మధ్యాహ్న వేళ. అమలాపురంలో ఎస్.కే.బీ.ఆర్. కళాశాల ఎదురుగా ఉన్న గురవయ్య హొటల్ ముందున్న బెంచీ మీద కూర్చున్నాం అతనూ…. నేను.

“ ఓరేయ్ బుజ్జిగా సిగరెట్ కావాలిరా. అలాగే ఓ కాగితం కూడా“ అతను అడిగాడు.

నేను గురవయ్య హొటల్ పక్కనే ఉన్న కిళ్లీ కొట్టులో సిజర్స్ సిగరెట్ తీసుకొచ్చి అతనికిచ్చాను. కాగితం కోసం వెతికితే దొరకలేదు. సిగరెట్ పెట్టెని నాలుగు భాగాలలో చింపి అతనికి ఇచ్చాను.

అతను ఏదో రాసుకోవడం ప్రారంభించాడు.

అలా రాసుకుంటున్న వ్యక్తి గుండు చేయించుకున్నాడు. వెనుక భాగంలో చిన్న పిలక ఉంది. గుండు చేయించుకుని నాలుగైదు రోజులే కావడం వల్ల శరీరపు రంగులోనే ఉంది ఆ గుండు. కళ్లలో ఓ వేదన కనిపిస్తోంది. మనిషి నాలుగైదు రోజులుగా కవిలిపోయినట్లుగా ఉన్నాడు.

కన్నీళ్లకు ఎత్తు ఉంటే అవి ఐదు అడుగుల పదకొండు అంగుళాలు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు

బాధకి బరువుంటే అది 60 కేజీల బరువు తూగుతుందన్నట్లు ఉన్నాడు.

చెంపలు వాలిపోయి…ముఖం పీక్కుపోయి ఉన్నాడు.

నాలుగు రోజులుగా తిండి తింటున్నా వంటబట్టని మనిషిలా ఉన్నాడు.

నిద్రకు దూరమైన కళ్లు ఆ నిద్ర ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ఉన్నాయి.

బట్టలు మాసిపోలేదు కాని….. శుభ్రంగా మాత్రం లేవు.

అతను రాసుకుంటున్నాడు. అలా ఓ ఇరవై నిమిషాలు రాసిన తర్వాత

“ ఒరేయ్ బుజ్జిగా వింటావా “ అని అడిగాడు. అలా అడుగుతున్నప్పుడు కళ్ల రెప్పల మధ్య ఇరుక్కున్న రెండు కన్నీటి బొట్లు నాకు స్పష్టంగా కనిపించాయి.

నేను “చెప్పు” అని ముక్తసరిగా అన్నాను. కారణం అతడ్ని చూస్తే నాకు భయంగా ఉంది. బాధగా ఉంది. ఆవేదనగా ఉంది. అతను తాను రాసింది ఇలా చెప్పడం ప్రారంభించాడు

“ చుట్టూ ఎక్కడా వాన జాడే లేదు. ఆకాశంలో మబ్బులూ లేవు

మెరుపులూ లేవు. అంతా ప్రశాంతంగా ఉంది.

అయినా మా ఇంటి కప్పు ఎగిరిపోయింది “ అని ఇలా రాసిన కవితని వినిపించాడు అతడు. ఆ కవిత పేరు “నాన్న పోయినప్పుడు” అన్నాడు. అలా కవిత్వం రాసిన అతనే అగ్రహారీకుల్లో ఒకడైన వక్కలంక సీతా రామారావు అనే వసీరా. నాన్నమ్మ వక్కలంక సీతారావమ్మ గారి పేరు పెట్టిన అతనికి ఆవిడ గొలుసు మీద ఉన్న వసీరా అనే పొడి అక్షరాలే  కలం పేరుగా మారాయి.

అప్పటికే…

“కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటిన మేథావి కూడా

కళ్లు తడవకుండా జీవితాన్ని దాటలేడు “ అంటూ రాసి తెలుగు సాహిత్యంలో ఓ వెలుగు ప్రవేశించింది అనిపించుకున్నాడు.

***                                            ***                                          ***

అమావాస్య  వంటి మనిషి నర్మగర్భంగా నవ్వాడు. ఆ నవ్వు చూశావా నా విజయ పరంపర ప్రారంభమైంది అన్నట్లు ఉంది.

వెన్నెల వంటి మనిషి చిరనవ్వు నవ్వాడు. ఆ నవ్వు అప్పుడే పూర్తి కాలేదు అన్నట్లుగా ఉంది.

***                                            ***                                          ***

1984 సంవత్సరం మే 24వ తేది. ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. జన్మలో పరీక్ష పాస్ కారు అనుకున్న ఇద్దరు కుర్రాళ్లు పరీక్షలో విజయం సాధించారు. ఆ ఇద్దరిలో ఒకరు నేను. మరొకరు వక్కలంక సత్తిబాబు. అంటే వసీరా తమ్ముడు. నా ప్రాణ స్నేహితుడు. మా విజయాన్ని తోటి ఉద్యోగులకు పార్టీతో పంచుకున్న వసీరా తండ్రిగారు ఆ రోజే లారీ ప్రమాదంలో కన్నుమూశారు. ఆ విషాదం ఆ కుటుంబాన్నే కాదు మొత్తం అగ్రహారాన్ని ఓ కుదుపు కుదిపింది.

హెల్త్ డిపార్ట్ మెంట్ వారు తండ్రి చేస్తున్న ఉద్యోగాన్ని బీఎస్సీ పాస్ అయిన వసీరాకి ఇస్తామన్నారు. ఆ ఉద్యోగంపై తర్జనభర్జనలు.

“నేను బీఎస్సీ చదివాను. నాకు ఎక్కడైనా ఎలాంటి ఉద్యోగమైనా వస్తుంది. వీడికి చదువురావడం లేదు. అల్లరిగా ఉన్నాడు. సత్తిబాబుకి ఈ ఉద్యోగం వచ్చేలా చేద్దాం “ అని తన మనసులో మాట బయటపెట్టాడు వసీరా.

“ఆలోచన మంచిదే. కాని వాళ్లు ఒప్పుకోవాలి కదా “ అన్నారంతా.

“నే మాట్లాడతా వాళ్లతో“ అన్నాడు వసీరా. జిల్లా వైద్యశాఖాధికారితో  మాట్లాడాడు. వాళ్లు ససేమిరా అన్నారు.

ఇదంతా దూరం నుంచి గమనిస్తున్నారు వెన్నెల, అమావాస్య వంటి మనుషులు.

అమావాస్య వంటి మనిషి మళ్లీ నవ్వుతున్నాడు.

ఆ నవ్వులో “చూశావా మళ్లీ నాదే గెలుపు. ఉద్యోగం రాకుండా చేస్తున్నాను” అన్న గర్వం తొణికిసలాడుతోంది.

వెన్నెల వంటి మనిషి ఏం మాట్లాడలేదు. ఊరికే నవ్వాడు. అంతే.

ఆ నవ్వు పాల నురుగులా హాయిగా ఉంది.

ఆ నవ్వు నదిలో నీళ్లలా శుభ్రంగా ఉంది.

ఆ నవ్వు పసిపాప బోసి నవ్వులా స్వచ్ఛంగా ఉంది.

“పోనీ ఓ పని చేయండి. మీరు ఉద్యోగానికి అర్హులు కారని ఓ సర్టిఫికెట్ తీసుకురండి. అప్పుడు చూద్దాం “ అన్నారు ఆ అధికారి కొంతసేపటికి మెత్తబడిన వాడిలా  ముఖం పెట్టి.

వారం రోజులు గడిచాయి. ఎక్కడ ఎలాంటి తంటాలు పడ్డాడో కాని తాను ఉద్యోగానికి పనికి రానంటూ ప్రభుత్వాధికారుల నుంచే ఓ సర్టిఫికెట్ తెచ్చాడు వసీరా.

డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో చేరి అప్పుడే క్లాసులకు వెళ్తున్న మాలో ఒకడైన సత్తిబాబుకి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది.

వసీరా మళ్లీ నిరుద్యోగిగా మారాడు. కాని ఆ కళ్లలో ఓ తృప్తి కనిపించింది.

ఆ కళ్లలో తమ్ముడికి ఉపయోగపడ్డాను అనే ఆనందం కనిపించింది.

వెన్నెల వంటి మనిషి ఏం మాట్లాడలేదు. ఊరికే ఓ చిరునవ్వు నవ్వాడు.

అమావాస్య వంటి మనిషి చిన్నబుచ్చుకున్నాడు.

***                                            ***                                          ***

విశాఖపట్నంలో జర్నలిస్టుగా జీవితం ప్రారంభించిన వసీరా 15 సంవత్సరాల తర్వాత బదిలీపై హైదరాబాద్ వచ్చాడు. ఇన్నాళ్లూ ఆ ఇద్దరు మనుషులు వెన్నెల, అమావాస్య దూరం నుంచి గమనిస్తూనే ఉన్నారు.

భార్యా, ఇద్దరు పిల్లలతో కూకట్ పల్లిలో నివాసం. సికింద్రాబాద్ లో ఉద్యోగం. మధ్యలో కవిత్వం. ఇది వసీరా జీవితం. సాఫీగా సాగుతోంది.

అమావాస్య వంటి మనిషి మళ్లీ ఓ వెకిలి నవ్వు నవ్వాడు.

ఆ నవ్వులో “ ఇప్పుడు చూపిస్తా నా తడాఖా“ అన్న అర్ధం ఉంది.

ఆ నవ్వులో “ఇప్పుడు అవకాశం వచ్చింది” అన్న అర్ధం కూడా ఉంది.

ఆ నవ్వులో “ఇప్పుడు విజృంభిస్తా” అన్న అర్ధం కూడా ఉంది.

చూపించాడు. అవకాశం తెచ్చుకున్నాడు. విజృంభించాడు.

ఓ అమావాస్య రాత్రి పది గంటలకు ఉద్యోగం ముగించుకుని ఇంటికి వెళ్తున్న వసీరాని లారీ గుద్దేసింది. ఆ ప్రమాదం చూసిన వారంతా అయిపోయిందనుకున్నారు. ఉత్తరాదికి చెందిన ఆ లారీ డ్రైవర్ నల్లగా అమావాస్యలా ఉన్నాడు.

ప్రాణానికేం ప్రమాదం లేదు.  ఎడమ టైరు కింద కుడి చేయి ఇరుక్కుపోయి నలిగిపోయింది. బతికే ఉన్నాడు. కాకపోతే స్పృహలో లేడు. అమావాస్య వంటి డ్రైవర్ ని అక్కడున్న వారంతా కొట్టడంతో అతను కోపంతో రగిలిపోతున్నాడు. టైరు కింద చేయి ఇరుక్కుపోవడం చూసిన వారు డ్రైవర్ ని కొట్టడం ఆపి లారీని కాస్త ముందుకి నడపమన్నారు.

డ్రైవర్ లారీ ఎక్కాడు. స్టార్ట్ చేశాడు. ముందుకి గేరు మార్చకుండా రివర్స్ గేరులో కాసింత వెనక్కి లారీని కదిపాడు.

అక్కడున్న వారంతా “ కాదు… కాదు… ముందుకి “ అంటూ కేకలు వేసారు. ఉత్తరాది వాడు కదా తెలుగు రాదనుకుని ముందుకి తీయమన్నట్లుగా సైగలు కూడా చేశారు.

అమావాస్య వంటి లారీ డ్రైవర్ అంత కోపంలోను చిన్నగా నవ్వాడు.

నాకు తెలుసు అన్నట్లు చూశాడు. నన్నే కొడతారా అన్నట్లు కూడా చూశాడు. ఈ సారి మళ్లీ ముందుకి గేరు మార్చి లారీని రెండోసారి చేతి మీద నుంచి ముందుకి నడిపాడు. మళ్లీ చేయి నలిగింది.

తెల్లటి బట్టలు వేసుకుని తెల్లగా ఉన్న ఓ మనిషి కాసింత విచార వదనంతో అంబులెన్స్ కి  ఫోన్ చేశాడు. వసీరా జేబులో ఉన్న ఐడీ కార్డు చూసి ఆఫీసుకి ఫోన్ చేశాడు. వాళ్లు ఇంట్లో వాళ్లకి విషయం చెప్పారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స ప్రారంభమైంది.

డాక్టర్లు వచ్చి వసీరా ఇంట్లో వాళ్లతో “ప్రాణాపాయం తప్పింది. కాకపోతే కుడిచేయి ఇక ఎప్పటికీ పని చేయదు” అన్నారు.

“చేతికేముందిలే. మనిషి దక్కాడు“ అనుకున్నారు ఇంట్లో అంతా.

అపోలో ఆసుపత్రి ఆవరణలో తచ్చాడుతున్నఅమావాస్య, వెన్నెల వంటి మనుషుల్లో అమావాస్య మళ్లీ విషపు నవ్వు నవ్వాడు.

వెన్నెల వంటి మనిషి ముఖంలో ఏ మార్పు లేదు. అలా నిర్వికారంగా చూసాడు.

***                                            ***                                          ***

ప్రమాదం నుంచి మెల్లిమెల్లిగా కోలుకున్నాడు వసీరా. అయితే డాక్టర్లు చెప్పినట్లుగా కుడి చేయి ఉన్నాను అన్నట్లుగా ఉంది కాని దేనికి పని చేయడం లేదు. వేళ్లు కదలవు. చేయి ముడుచుకోదు. ఆ చేతితో ఏ పని చేయలేడు. అంతా కంప్యూటర్ యుగంగా మారుతున్న దశ. ఏ ఉద్యోగమైనా, ఏ పనైనా కంప్యూటర్ తోనే చేయాల్సిన కాలం ప్రారంభమైన దశ.

ఇది వసీరా రెండో కవిత్వ సంకలనం పేరులా అతనికి మరోదశ.

ఈ దశలోనే పట్టుదల పెరిగింది. ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని కుడిచేతితో చేసే కంపోజింగ్ కూడా ఎడమ చేత్తో చేస్తూ మళ్లీ నేర్చుకోవడం ప్రారంభించాడు వసీరా.

తొలి వారం రోజులు నరకం. అయినా వదలలేదు

తొలి నెల రోజులు భయం. అయినా పట్టు వీడలేదు.

తొలి రెండు నెలలు వేదన. అయినా నీరసించలేదు.

ఇదంతా దూరం నుంచి చూస్తున్నారు అమావాస్య, వెన్నెల వంటి మనుషులు. ఎవరి ముఖాల్లోనూ ఎలాంటి మార్పూ లేదు. చూస్తున్నారంతే.

***                                            ***                                          ***

ఆరు నెలలు గడిచింది. ఒంటి చేత్తో కంప్యూటర్ నే కాదు ప్రపంచాన్ని కూడా నడిపించగలను అన్నంత ధీమాగా ఉన్నాడు వసీరా.

కంప్యూటర్ మీద ఎడమ చేతి వేళ్లు పియానో మెట్లు మీటుతున్నట్లుగా చకచకా పరుగులు పెడుతున్నాయి

కంప్యూటర్ మీద ఎడమ చేతి వేళ్లు జాతీయ వార్తలకు హెడ్డింగులు పెడుతున్నాయి.

కంప్యూటర్ మీద ఎడమ చేతి వేళ్లు కవిత్వాన్ని వొంపుతున్నాయి.

మళ్లీ పాత వసీరా. జవజీవాలే కాదు… పట్టుదల కూడా నడిచి వస్తున్నట్లుగా ఉన్నాడు.

మళ్లీ జర్నలిస్టుగా ఉద్యోగం. మళ్లీ కవిగా ఆవిర్భావం. మళ్లీ తండ్రిగా బాధ్యతల స్వీకరణ.

ఈసారి తొలిసారి నవ్వింది వెన్నెల వంటి మనిషి. నవ్వే. ఇంకేం లేదు. కేవలం నవ్వే.

అమావాస్య వంటి మనిషి కాస్త తలదించుకున్నాడు. భూమిని చూస్తున్న అతని కళ్లలో మాత్రం ఓ కసి ఉంది.

***                                            ***                                          ***

దశాబ్ద కాలం గడిచిపోయింది. వసీరా పిల్లల చదువులూ అయ్యాయి. పెళ్లిళ్లూ అయ్యాయి. జీవితం పూర్తిగా స్థిరపడింది.

ఇలా అందరూ హాయిగా ఉన్న వేళ అమావాస్య వంటి మనిషి ముఖంలో మళ్లీ చీకటి నవ్వు. ఆ నవ్వు చూస్తున్న వెన్నెల వంటి మనిషి కాస్త దిగులుగా ముఖం పెట్టి “ ఇక వదిలేయ్. పాపం చాలా దూరం ప్రయాణించాడు“ అన్నాడు.

దానికి అమావాస్య వంటి మనిషి “ లేదు. బహుశా ఇదే ఆఖరు. అతనో, నేనో తేలిపోతుంది “ అని మళ్లీ పాములాంటి నవ్వు నవ్వాడు.

***                                            ***                                          ***

ఓ రోజు ఉదయాన్నే వసీరా వంట్లో నలతగా ఉంది.

ఓ రోజు ఉదయాన్నే వసీరా కడుపులో గాబరాగా ఉంది.

ఓ రోజు ఉదయాన్నే వసీరా వళ్లంతా తిప్పుతున్నట్లుగా ఉంది.

అలా వారం రోజులుంది. తెలుసున్న డాక్టర్ని కలిస్తే మందులిచ్చారు. వాడాడు. ఊహు లాభం లేదు. అదే నలత. అదే గాబరా. అలాగే వొళ్లు తిప్పుతోంది. ఇలా కాదని, పిల్లల బలవంతం మీద అపోలోకి వెళ్లాడు వసీరా సతీసమేతంగా.

అక్కడ డాక్టర్లు ప్రశ్నలు వేశారు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేశారు.  “ఓ వారం రోజులు ఈ మందులు వాడండి. ఈలోగా రిపోర్టులు వస్తాయి. కంగారేం లేదు. నయం అవుతుంది“ అన్నారు.

ఈ వారం రోజులూ మందులు వాడాడు వసీరా. ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అనిపిస్తోంది. కాని మళ్లీ కడుపులో నొప్పి. మందులు వాడడం, నొప్పి భరించడం. ఈ నొప్పి కంటే అసలు ఏం జరిగింది అన్న వేదన రోజురోజుకు కుంగదీస్తోంది.

వసీరాకి చిరాకుగా ఉంది. వసీరాకి ఆందోళనగా ఉంది. వసీరాకి ఆవేదనగా ఉంది.

“ నా జీవితం ఏమిటి ఇలా“ అని ప్రశ్నించుకునేలా కూడా ఉంది.

ఇలా వారం గడిచిన తర్వాత రిపోర్టులు వచ్చాయి. అపోలో నుంచి ఫోన్ వస్తే వసీరా దంపతులిద్దరూ అక్కడికి వెళ్లారు.

“ అబ్బే పరవాలేదు“ అన్నారు.

“కాస్త రెస్టు తీసుకోవాలన్నారు “ అని సలహా ఇచ్చారు.

“కంగారు పడకండి అన్నారు“ అని ధైర్యం చెప్పారు.

మళ్లీ వాళ్లే “ఇప్పుడే తొలి దశలోనే ఉంది. తగ్గిపోతుంది. మీరు బసవతారకం ఆసుపత్రికి వెళ్లండి. అక్కడి డాక్టర్లతో మేం మాట్లాడతాం“ అని కూడా అన్నారు.

బసవ తారకం ఆసుపత్రి ఏమిటీ…. అంటే నాకు…

విషయం పిల్లలకు తెలిసింది. చాల దగ్గరి బంధువులకు చేరింది. ఆలస్యం చేయకూడదని బసవ తారకం ఆసుపత్రికి వెళ్లాడు వసీరా.

అక్కడ రిపోర్టులు అన్నీ చూసి… “భయపడకండి. ఫస్ట్ స్టేజీలోనే తెలుసుకున్నారు. తగ్గిపోతుంది. మందుల కంటే మీకు మానసిక ధైర్యం అవసరం“ అన్నారు.

వసీరా నవ్వాడు. చిరునవ్వు నవ్వాడు. పగలబడి నవ్వాడు. కన్యాశుల్కం నాటకంలో పెళ్లికి లొట్టిపిట్టలు తీసుకుని రండంటూ ఉత్తరం వచ్చినప్పుడు  మధురవాణి నవ్వినట్లుగా నవ్వాడు.

ఆ నవ్వుకి అర్ధం ఎవరికీ తెలియలేదు.

ఆ నవ్వుకి పరమార్ధం ఎవరూ గ్రహించలేదు.

ఆ నవ్వుకి నిగూఢార్ధం ఎవరూ ఊహించలేదు.

***                                            ***                                          ***

బసవ తారకం ఆసుపత్రి గేటు దగ్గర నిలబడిన అమావాస్య వంటి మనిషిని చూసి వెన్నెల వంటి మనిషికి చంపేయాలనుంది. పీక నొక్కేయాలనుంది. కాని శాంతమూర్తి కదా. అలా చేయలేదు.

***                                            ***                                          ***

వసీరాకి బసవ తారకంలో వైద్యం ప్రారంభమైంది. కీమో అన్నారు. మరొకటి అన్నారు. ఇంకోటి అన్నారు. చాలా అన్నారు. చాలా చేశారు.

ఐదు నెలల సుదీర్ఘ వైద్యం తర్వాత…

ఓ రోజు ముగ్గురు డాక్టర్లు వెలిగిపోతున్న ముఖాలతో… చేతిలో కొన్ని కాగితాలతో వసీరా బెడ్ దగ్గరకి వచ్చి “ కంగ్రాట్స్. రిపోర్ట్స్ వచ్చాయి. మీకు చాలా వరకూ నయం అయ్యింది. ఇక మందులు వాడితే చాలు. ఇరవై ఏళ్లు వెనక్కి చూసుకోనవసరం లేదు“ అన్నారు.

కోటి దీపపు కాంతుల నవ్వుతో… కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు రాలుతూండగా వసీరా “థాంక్స్ డాక్టర్స్. ఇదంతా మీ పుణ్యమే“ అంటూ చేతులు పట్టుకున్నాడు.

దానికి డాక్టర్లు “ కాదు కాదు. మీ మనోబలమే. మీ ఆత్మస్థైర్యమే. మీ సంకల్పమే. మందులు శరీరం మీద మాత్రమే పని చేస్తాయి. అది కూడా మనసు ప్రశాంతంగా ఉంటేనే. ట్రీట్ మెంట్ జరిగిన ఇన్నాళ్లూ చాలా ప్రశాంతంగా… హాయిగా ఉన్నారు. పైగా మాకు చాలా సహకరించారు. ఫస్ట్ లోనే తెలుసుకోవడం వల్ల కూడా అది సాధ్యమైంది“ అన్నారు.

వసీరా పక్కనే ఉన్న శ్రీమతి కొంగుతో కళ్లు వొత్తుకుంటూ “డిశార్జి అవ్వచ్చాండి“ అని అడిగారు.

“మీ ఇష్టం. సాయంత్రమే వెళ్లిపోవచ్చు. కాని ముందు ముందు పదిహేను రోజుకొకసారి రండి. డాక్టర్ని కలిసి వెళ్లిపోండి“ అని వెళ్లిపోయారు.

వసీరా ఎడం చేతితో భార్య కుడిచేయిని గట్టిగా పట్టుకుని

“ నీ అదృష్టం. పిల్లల పుణ్యం“ అన్నాడు రెండు కన్నీటి బొట్లు రాలుస్తూ.

***                                            ***                                          ***

క్యాబ్ మాట్లాడుకుని బసవతారకం నుంచి ఇంటికి బయలుదేరారు భార్యాభర్తలు. కారుని నల్లటి అమావాస్యవంటి మనిషి నడుపుతున్నాడు. ఇతని ముఖం చేతిలో చీదేసిన తారాజువ్వలా ఉంది. పక్క సీటులో వెన్నెల వంటి మనిషి కూర్చున్నాడు. ఇతని ముఖం చిరునవ్వులు చిందిస్తూన్న దీపపు దివ్వేలా ఉంది.

“తగ్గిపోయిందాండి. ఇంటికి వెళ్లిపోతున్నారండీ“ అని చాలా ఆనందంగా అడిగాడు వెన్నెల వంటి మనిషి.

“అవునండి. తగ్గిపోయింది. చాలా ఆనందంగా ఉన్నాం“ వసీరా

“మీరు మంచోళ్లండి. దేవుడు మిమ్మల్ని బాగా చూస్తాడండి. మీరు నాకు చాలా కాలంగా తెలుసండి“ అని కూడా అన్నాడు.

“నేనెలా తెలుసు“ వసీరా అడిగాడు.

“అంటే మీలా గెలిచినోళ్లన్నమాటండి. నా పేరు పి. విజయ్. పీ అంటే పట్టుదల అండి“ అంటూ ముఖం నిండా నవ్వుతో పక్కనే ఉన్న డ్రైవర్ వైపు చూశాడు.

“అవును డ్రైవర్ గారు మాట్లాడడం లేదు. మీ పేరేంటండి“ వసీరా సతీమణి అడిగింది.

“అమ్మా. నమస్తే. నా పేరు శనీశ్వరరావు  సమాధానం చెప్పాడు డ్రైవర్.

ఈలోగా ఇల్లు వచ్చేసింది. ఇద్దరు ఇంటి ముందు కారు దిగారు. ఇంట్లో నుంచి కొడుకు, అల్లుడు వచ్చారు. వెనుక కూతురు, కోడలు పళ్లెంలో హరతి పట్టుకుని చెంబులో నీళ్లు తీసుకుని విజయగర్వంతో వచ్చారు.

వసీరాకి దిష్టితీసి హారతిచ్చారు. పళ్లెంలో వెలుగుతున్న కర్పూరాన్ని దూరంగా పడేశారు. కాళ్లు కడుక్కుని ఇంట్లోకి రమ్మన్నారు. వసీరా అలాగే చేశాడు. ఇంట్లోకి వెళ్లాడు.

వసీరా కొడుకు ఇచ్చిన డబ్బులు తీసుకున్న శనీశ్వరరావు వెళ్తూ వెళ్తూ ఇంటి ముఖద్వారం దగ్గరికి వచ్చి లోపల కూర్చున్న వసీరాతో

“క్షమించండి. మిమ్మల్నీ చాలా దూరం నుంచి గతుకుల్లో పడేసి మరీ తీసుకువచ్చాను. అయినా మీరు ఏమనలేదు. పైగా నవ్వుతూ నేను సిగ్గుపడేలా చేశారు“ అన్నాడు.

“అయ్యో తప్పండి. అలా అనకండి. మీరు నన్ను గతుకుల్లో తీసుకురాలేదు. గతుకుల్లోనూ గెలవడం నేర్పారు“ అని రెండు చేతులతో నమస్కారం చేశాడు వసీరా.

***                                            ***                                          ***

(కొండంత ధైర్యం  కాసింత కూడా ఒరిగిపోకుండా తమ చేతులు అడ్డుపెట్టిన వసీరా సతీమణి లక్ష్మిగారికి, పిల్లలు జాబిల్లి, రవితేజలకు……)

*

ముక్కామల చక్రధర్

21 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇది వ్యక్తి గత జీవితానికే కాదు వికాసానికి కూడా. గొప్ప ఉత్తేజాన్నీ ఇచ్చే దర్శనం.
    మధుర వాణి లా నవ్వాడు అనే వాక్యం గొప్ప గా రాశావు చక్రధర్… బాగా తెలిసిన వసీరాని కొత్త గా పరిచయం చేశావు…

    • ఒక పాత్రికేయ వీరుడి విజయాన్ని, దుఃఖాన్ని, అక్షరాత్మని అక్షరబద్ధం చేసిన నీ స్నేహితం గొప్పది. నీ స్నేహం వసీరా అదృష్టం. వసీరా స్నేహం నీ అక్షరాలు చేసుకున్న పుణ్యం. నువ్వు అక్షరాలా మనిషివిరా బుజ్జీ! నీ చదువుని ఇలా ఆత్మీయ స్నేహాక్షరాలు చేసినందుకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. వసీరా వంటి కవులు నీలాంటివారి వల్ల చరిత్రలో నిలుస్తారు. వసీరాకు, నీకు ముద్దులు. God bless you.👏👏👏🤝🤝🤝🤗🙏🌹⚘

  • చాలా బాగుంది బుజ్జి… సీతారాం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడా….బాగా రాశావు కథనం

  • ఒక కవిత లాగ సాగింది మొత్తం కధనం అంతా. చాలా బాగుంది

  • వక్కలంక సీతారాం……వసిరా….
    అంటే అగ్రహారపు సాహితీ జెండా

    ముత్యాల కోవల్లాంటి అక్షరాలు
    అందమైన కవితలకు తగ్గట్టే వ్రాతలు
    నాకు ఇంకా గుర్తు

    సంతకంలో కూడా తనదైన శైలే
    ఏదో అందం ఆ వంకర కూర్పులో
    ఏదో దర్జాతనం ఆ చేవ్రాత పొందికలో

    ఊహ తెలిసిన దగ్గర నుండి వారి ఇంట్లో అందరితో సహచర్యం.
    వయసుభేదాలు లేకుండా కలిసిపోయిన మిత్రత్వం.

    రోజుకు వంద క్యారం బోర్డులు ఆడిన క్షణాలు,
    రెడ్ కాయిన్ వేసేదాక నిద్రపోని ప్రయత్నాలు……
    వాళ్ళ ఇంటిల్లి పాదీ ఆదరించిన మధుర జ్ఞాపకాలు…
    ఒకటా రెండా ఎన్నో ఏళ్ల వెలకట్టలేని అనుబంధాలు,

    రాముడు…భీముడు అంటూ ఆటపట్టించిన వసిరా తండ్రి గారి పలకరింపు,
    నిత్య పద్మావతిలా నవ్వుతూ వాళ్ళ అమ్మగారి ఆప్యాయపు లాలింపు

    నెరేటి పళ్ళ కోసం నేనూ , సత్య(వసిరా చిన్న చెల్లెలు) చిటారుకొమ్మదాకా ఎక్కేసిన రోజులు
    విసిరేసిన ప్రతీ పండు మింగేస్తూ, ఎందుకు ఎక్కారంటూ తిట్టేస్తూ పెద్దలంతా చెట్టు కింద పడిగాపుల క్షణాలు

    క్రికెట్ బోర్డ్ ఒకసారి అమలాపురంలో సర్వే చేసుంటే, సెలక్షన్ కావించి ఉంటే సత్తిబాబు ఉండేవాడేమో,
    ఏదో ఒక స్థాయిలో ఎదిగి ఎంతోమంది వర్ధమాన ఆటగాళ్లకు ఆదర్శ ప్రాయంగా నిలుచేవాడేమో

    వాళ్ళ తండ్రిగారి అకస్మాత్తుగా మరణం
    అదే రోజు సత్తిబాబు ఇంటర్ పాస్ ఆయన వైనం…
    ఒక్కసారిగా కళ్ళ ముందు రీలులా తిరిగింది.

    నాకు తెలీని ఎన్నో సుడుగుండాల వసిరా జీవితాన్ని పరిచయం చేశావ్,
    అందంగా కవితలు అల్లే ఆ మనసు వెనుక దాగి ఉన్న కొండంత నిబ్బరాన్ని పదిల పరుచావ్

    ఎన్నో విషయాలు కూచిమంచి వారి అగ్రహారపు కడలిలో నువ్వు ఒక్కడివే సాగరమధనం చేస్తూ జ్ఞాపకాల మధురామృతాన్ని అందరికీ అందింస్తున్న నీకు శుభాబినందనలు

    అన్నా…ఇలాంటివి ఎన్నో ఈ తరానికి తెలియని , తెలిసికోవలసిన వృత్తాంతాలు మరెన్నో నీ కలం రంగులు అద్ది భవిష్యత్ లో తీసుకువస్తుందని ఆసిస్తూ……శుభాకాంక్షలతో ,నమస్కారాలతో

    ❤️❤️🌹ఉషారం🚩❤️

    • Chaala beautiful ga cheppaaru babai. Really proud of my dad.. chemo sessions ayinappudu eppudu adigina… maa naanna same navvutho baane undhi anevaaru thappithe ah pain ni eppudu choopivvaledhu.

  • Hello Bujji, Good morning.
    It’s very nice and superb. The way you have narrated Sri VASERA’s life and his
    achievements and pitfalls and waves, is
    very good and excellent. It reveals your
    hidden talents in expressing a journalist’s
    life story. Please keep it up. God bless you with more and more talented stories of Great people. Thank you so much.

  • Vaseeraa ni pogidithe vaadu paadaipothaadu. Vaadini thidithe vaadante istam lenivaallu anamdamtho baagupadi pothaaru. Ee 2 istaalu naaku istam ledu.
    Andarikee kastaaluntaay, Andarikee bhaavaaluntaay. Kastaalunna vaallanthaa raayaleru, Baagaa raasevaallu maatram baagaa kastalani daatina vaalle ayivuntaaru.
    Vaseeraa goppa aashani, goppa dairyaanni kaligimche Goppa kavitvam raayaalsi vundi.
    Naaku 50 yaella nundi kavitvaanni yentha thaaguthunna daaham theeratam ledu. Naa daaham theerchamani Vaseeraaki vinnapam.
    -pemmaraju gopalakrishna, hyd
    Jeevitham baagaa pindabadithene Goppa rachanalu pudathaay. Bujji Chakram, kudi chupudu veli nunna mee Saahithee cahakram alaa thiruguthune vundaali. Manchi kadhalu, Manchi vaakyaalu raasthunnamduku abhinandanalu.

  • వసీరా అనే మంచి వ్యక్తి ని ఆవ్యక్తి నిబద్ధత నిష్ఠ త్యాగనిరతి తన కుటుంబ మునకై తపన తన కవితా పటిమ సాహిత్య సౌరభం తన అందమైన దస్తూరి లాగ జీవితం సాగకున్న తన మొక్కవోని దీక్ష ప్రశాంతమైన చిరునగుమోము తో స్వాగతించిన విధంబు ముక్కామల నీ రచనా ప్రాంగణాన నల్వురికి విశ్వమునకు ఉత్తేజ పరచి దారి చ

    చూపు విధంబున నీ శైలి సాగినది

  • స్ఫూర్తి దాయకం వసీరా గారి మనో నిబ్బరం.

    మీ అమావాస్య. వెన్నెల పద ప్రయోగ విన్యాసం అద్భుతం.

  • నా సోదరుడు వసీరా గురించి నాకు తెలియని ఎన్నో ముఖ్యమైన విషయాలు ఈవ్యాసంలో తెలిపావు. బుజ్జికి మంచి రచనా పఠిమ ఉందని ఇప్పుడు తెలిసింది. S.రామారావు expression excellent.vow he is also a good poet not only SBI C.M

  • ఆత్మ విశ్వాసం ఉన్న మనిషి కష్టాల కడలి నుంచి ఎంత అవలీల గ దాటగలడో అద్భుతం గా చూపించారు సార్. కమనీయంగా కవితాత్మకంగా ఉంది మీ కథ.

  • ముక్కామల చక్రధర్ గారి కధ” ఇంటి పేరు V అంటే..”
    ఒక నూతన ఒరవిడి సృష్టిచిన మానసిక విశ్లేషణ.జీవిత జయాపజయాల కధ. అంతిమవిజయం మనోబలం కలిగిన వి. దే అని చెప్పే అధ్భుతమైన కధ-T.T.N.Rao, San Jose.U.S

  • వసీరా గారి విజయగాథ స్ఫూర్తిదాయకం. చక్కని శైలి, వినూత్న రీతిలో సాగిన మీ రచన మహా అద్భుతం.

  • “ చుట్టూ ఎక్కడా వాన జాడే లేదు. ఆకాశంలో మబ్బులూ లేవు
    మెరుపులూ లేవు. అంతా ప్రశాంతంగా ఉంది, అయినా మాఇంటి కప్పు ఎగిరిపోయింది” నాన్న పోయినప్పుడు అనే అద్బుతమైన కవితతో వసీరా గారిని పరిచయం చేయడం అద్భుతంగా వుంది. ఈ కథలో వసీరా గారి గెలుపుకు వారి పట్టుదల, మనోధైర్యంతో పాటు వారి శ్రీమతి గారి ఓర్పును పాఠకులకు తెలియడం హైలైట్ గా నిలిచిపోయింది. గెలుపు ఓటములను వెన్నెల అమావాస్యలతో పోల్చి రెండు ప్రతీకాత్మక పాత్రలను ప్రవేశపెట్టడం కూడా అభినందనీయమే! Good going Bujji All the best.

  • వసీరా ఈ ప్రపంచానికి ఓక మంచి రచియితగా,పత్రకారుడుగానే పరిచయం.అతని జీవితం మెత్తం ఆవిష్కరించావు. అన్ని కష్టాలు నాకుతేలిసి మనలో ఎవరుా పడలేదు.వివరణాత్మక జీవితావిష్కరణకి అభినందనలు

  • Excellent pen down once again. Narrated such wonderfully as if live demonstration is on.
    Shri.Vaseera ji u r wonderful and great person.Though I didn’t see you,the author portrayed such wonderfully that I got lively feeling.Thank you once again….

  • ప్రతి కష్టం అంచున వెన్నల వానుంటుంది.
    వాన వెల్సాక షరా మామూలుగా అమావాస్య చీకటి!
    వెన్నెల్లోను, చీకటిలోనూ కళ్లు తడిచినా కాళ్లు తడబడకుండా భవసాగరాన్ని ధైర్య,స్థైర్యాలతో
    ఈది యీది ఓ ఒడ్డుకు వసీరా చేరడంలోని గొప్పదనం ఏనాటికీ స్మరణీయం.
    ఆ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని ఇంకా గొప్పగా అందించిన చక్రి కథనం ముమ్మాటికీ రమణీయం

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు