ఇప్పుడు అడవి దారిలో వస్తున్నా-
యుగాల క్రితం కూడా అడవిలో నడిచిన జ్ఞాపకం
ఇంకా నా లోపల వేలాడ్తూ వుంది
ఇపుడంటే ఈ అడవి దారి రహదారిలా వుంది కానీ
వేల యేళ్లుగా అడవి బాటల్లేకుండా వుందని
వున్నా కాలిముద్రలే బాటలని ఒక ఎరుక నాలో బతికే వుంది
సౌకర్యాల్లేని దట్టపు సంకీర్ణంలో
దినదినమూ ఒక యుధ్ధమైన ఆరాటమైన
ఉత్కంఠ ఐన వెరపూ తెగువా కలగలిసిన
ప్రయాణాలెన్నో సాగాయనే ఒక చరిత్ర నా లోపల గోడల మీద
పాఠంలా నిలిచి వుంది మసకబారక-
ఒకటి చూస్తే మరొకటి గుర్తుకొస్తుంది
ఇట నిటారైన టేకువాటాన్ని చూస్తుంటే వీరుడు గుర్తుకొస్తున్నాడు
పురివిప్పిన వెదురు వనాల్ని చూస్తుంటే పాటలు గుర్తుకొస్తున్నాయి
పాటలు గురుతుకొచ్చినపుడల్లా వెన్నెలలే కాదు
నెత్తురులూ గుర్తుకొస్తున్నాయి
పాటల రంగు ఆకుపచ్చనా ఎరుపా
ఆలోచన లేచి అడవిగాలిలో కలిసిపోతున్నది
ఎక్కడెక్కడి గాలులు ఇష్టపడి ఇక్కడికి చేరుతాయో
ఇక్కడి చిక్కదనపు సారంలో మాగి ఏ గాలులెక్కడికెళ్లి కవాతు చేస్తాయో
ఎట్లా చెబుతాం
మనుషులూ గాలుల్లా వీస్తారని నమ్మాలి కదా
ఎటెటు వీస్తున్నారో చెప్పడానికి!
ఇక్కడి నేల నేలేనా
ఆకుపచ్చ తివాచీల సమావేశస్థలా
బహూకరణ ఇంత ప్రేమాన్వితంగా వుంటుందని ఇపుడే తెలుస్తుంది
తివాచీల మీద ఎందరు కూర్చుని వెళ్లిపోయారో
నేలకు దండంపెడుతూ , నేల నుంచి దృఢత్వాన్ని ఎంతో కొంత అందుకుంటూ-
ఎవరూ కూర్చోకోకపోతే అడవినేల కూడా బావురుమంటుందేమో
వెళ్ళిన వాళ్ళే మళ్ళీ వచ్చి కూర్చుంటారా
వెళ్ళిన వాళ్ళను ప్రేమించిన వాళ్ళెవరో వచ్చి కూర్చుంటారా
లేక వాళ్ళ చివరి మాటల అంచులు ఈ పక్కన వెదురు వనాల్లో కదుల్తున్నాయా
దగ్గరికెళ్లి చూస్తే ఆనవాళ్ళు అందుతాయా
రహదారికి అటు అడవి ఇటు అడవి
అడవిని రహదారి విడదీసిందా నిలువునా
అడవినుంచి దాని అంతరంగ నాడుల్ని విడదీసిందా
నాడుల్లేని ఆడవులు అడవుల్లేని నాడులు
రహదారుల రాక అందుకేనా
చెట్ల నడుమ ఈ స్థూపం సుదీర్ఘదీక్షలో వున్న మనిషిలా వుంది
గడ్డకట్టిన రక్తపు ఆయుధంలా వుంది
ఎదురు తిరిగిన కాలానికి నివాళిలా వుంది
అడవి మాట్లాడనట్లే స్థూపమూ మాట్లాడదు
కాకపోతే ఆకుపచ్చ రంగు ఎరుపుగా రూపాంతరమైన చరిత్ర ముందు
నిల్చున్నానని నాకు తెలుస్తూనే వుంది
అడవి కొన్ని వేళల్లో సూర్యుడు కూడానని
ఈ శిలాజ్ఞాపకం చెప్పకనే చెబుతున్నది
బహులలితాలు ఇక్కడ, బహుదార్డ్యాలూ ఇక్కడే!
యుగాల వానప్రస్థాల అనుభవసారాల్తో పండిపోయివుంది అడవి
ఆకాశధూళిలో నిరంతరం తడిసి తడిసి
అమరసౌందర్యంతో వెల్గుతూ వుంది అడవి
శరణార్థుల శ్వాసలకు ఆవాసమై పరమదయామయిగా వుంది అడవి
కొమ్మకొమ్మకొక వ్యూహాన్ని రహస్యంగా కట్టి
వెళ్ళిపోయినవారి ధిక్కార గీతంలా వుంది అడవి
చూస్తూ చూస్తూ కాసేపు లలితమవుతూ మరికాసేపు దృఢమౌతూ
పునర్జన్మిస్తున్నాను, చూపుల్లోంచి ఎడారులు ఎగిరిపోతున్నాయి
చల్లని నీడలు కళ్ల మైదానాల మీద పరుచుకుంటున్నాయి
అడవి దారిలో వస్తున్నా-
మైదానానికి చేరాక మీరేది అడిగినా ఆకుపచ్చపదాల్తోనే బదులిస్తా
పదాల్ని మీరు తాకి ఛూడొచ్చు
మీ చేతులకు హరితంతో పాటు కొంచెం అరుణవర్ణమూ అంటుతుంది
అట్లా అడవి మీక్కూడా దక్కుతుంది
*
అడవి ని చాలా చక్కగా ఆవిష్కరించారు మహానుభావా.
మీ కవిత్వం అద్భుతంగా ఉంది ___డా.కె ఎల్ వి ప్రసాద్
Such a nice poem. Carrying memories and the stories of yore. Green music and the colour of blood that was shed on the woods and flowed in the streams , all came alive to the present. Love you Darbhasayanam.
Poem touched the variety of emotions as there are varieties in a forest.All encompassing …awesome.
evergreen forest with shed ofblood
కవిత్వం లాంటి అడవి, మళ్లీ ఫ్రెష్ గ