అటక మీది సంచి

నేను వెళ్లే సరికి అంజన్న చాలా కోపంగా ఉన్నాడు. వాడిని క్షమించకూడదనే పట్టుదలతో ఉన్నట్లు కనిపించాడు. అంజన్న ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ బదిలీ మీద వచ్చాడు. రాంనగర్‌లో ఇల్లు తీసుకున్నాడు. మొత్తం మూడు గదులుంటాయి. గడప దాటితే రోడ్డు. ఇంటి వెనక చిన్న సందు. దిడ్డి దర్వాజ తీసుకుని ఆ సందులోంచి ఎవరికీ కనిపించకుండా బయటకు వెళ్లిపోవచ్చు. ఒక రకంగా అది పేదలు ఉండే బస్తీ. పార్సీగుట్టకు దగ్గరగా ఉంటుంది. అది రాంనగర్‌ చౌరస్తా నుంచి దాదాపు కిలోమీటర్‌ దూరం ఉంటుంది. ఇంత లోపలికి ఇల్లు ఎందుకు తీసుకున్నావంటే నవ్వి ఊరుకునేవాడు.

నాకు ఫోన్‌ చేసి ‘‘అర్జంట్‌గా రా… వాడి సంగతేమిటో చూద్దాం’’ అని చెప్తే ఏమేందో ఏమోనని ఆఘమేఘాల మీద వచ్చా. అప్పుడు సెల్‌ ఫోన్లు లేవు. ల్యాండ్‌ లైన్లే. ‘ఏమైందో చెప్పు?’ అని అడిగితే చెప్పడం లేదు. కోపంలో మాటలు వంకరటింకరగా వస్తున్నాయి. ‘ముందు నువ్వు వస్తావా… రావా?’ అని దబాయించాడు. మామూలుగా అంజన్నకు కోపం రాదు. అంత కోపం వచ్చిందంటే ఏదో జరగరానిది జరిగిందని నాకు అనిపించింది.

అంతకు ముందు మాకు పరిచయం ఉంది. ఆయన హైదరాబాద్‌ వచ్చిన తర్వాత స్నేహం పెరిగింది. నేను ఉండేది కూడా రాంనగరే కాబట్టి ఒకరి ఇంటికి ఒకరు వచ్చిపోవడం సాధారణ విషయంగానే మారింది. ఆఫీసు నుంచి వస్తూ అప్పుడప్పుడు మా ఇంటి వద్ద ఆగి నేను ఉంటే టీ తాగుతూ ముచ్చట్లు పెట్టేవాడు. అంజన్న ఓ విప్లవోద్యమ పార్టీకి పని చేస్తూ ఉంటాడు. నేను కూడా ఆ పార్టీ సానుభూతిపరుడిని. అందువల్ల మా మధ్య స్నేహం గట్టి పడిరది. పాటలు రాస్తూ ఉంటాడు. వేదికల మీద పాడుతూ ఉంటాడు. సారంలో ఆయన పాటలు చాలా బాగుంటాయి. కానీ గద్దర్‌ పాడినప్పుడు వచ్చే ఊపు ఆయన పాడినప్పుడు వచ్చేది కాదు.

అంజన్న రాసిన పాటలను గద్దర్‌ చాలా వేదికల మీద పాడాడు. అవి గద్దర్‌ రాసినవే అన్నంతగా ప్రాచుర్యం పొందాయి. రాసిన తనకు కీర్తి రావాల్సిన అవసరం లేదు, సందేశం ప్రజల్లోకి వెళ్తే చాలు అనుకునేవాడు. గద్దర్‌ పాడడం వల్ల మరింత బలంగా తాను ఉద్దేశించిన భావజాలం ప్రజల్లోకి వెళ్తుంది కదా అని అనేవాడు.
అది నిజమేననిపించేది. పేరుప్రఖ్యాతుల కోసం, అవార్డుల కోసం, మెప్పు కోసం మనం రచనలు చేయడం లేదని, మనం చెప్పిన విషయాలు ప్రజల్లోకి వెళ్తే చాలు అని నేను కూడా అనుకునేవాడిని. ప్రజలను చైతన్యవంతులను చేసి విప్లవ సాధన కోసం చేయి వేయడం ముఖ్యమని అనిపించేది. అంజన్న నిరంతరం అదే ఆలోచించేవాడు. ఆదిలాబాద్‌ జిల్లాలో పనిచేసినప్పుడు యుద్ధవీరులకు చికిత్స చేసేవాడు. వైద్య శాఖలో ఉద్యోగం కాబట్టి ఏ మందులు ఎలాంటి వ్యాధులకు వాడాలో అభ్యాసం చేసినవాడు.

నేను ప్లాస్టిక్‌ కుర్చీలో కూర్చున్నాను. ఇంట్లో సోఫాల లాంటి హంగామాలు ఏమీ లేవు. తాను నిలబడే ఉన్నాడు. ‘కూర్చో అంజన్నా…’ అని చెప్పాను. నా మాట వినిపించుకున్నట్లు లేడు. నల్లని ముఖం ఎర్రబడిరది. పెదవులు వణుకుతున్నాయి. అసలే దొడ్డు పెదవులు.. బుసలు కొడుతున్నట్లున్నాయి.

‘వాడు ద్రోహి..’ అన్నాడు.
‘ఎవరు?’ అని అడిగాను.
కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అంజన్న భార్య రాములమ్మ టీ కప్పులతో వచ్చింది. నాకు ఒకటి అందించింది. అంజన్నకు ఓ కప్పు అందించింది.

‘అంత కోపం వద్దు. మనుషులు అట్లాగే ఉన్నారు. విప్లవోద్యమంలో పనిచేసేవారిలో కూడా చెడ్డవాళ్లు ఉంటారని చెప్తుంటే వినడం లేదు’ అని అంది.

‘ఇంతకు ఎవరతను?’ అని అడిగాను.
‘జమిలి శేఖర్‌’ అని చెప్పాడు అంజన్న.

జమిలి శేఖర్‌ నాకు బాగానే తెలుసు. ఓ విద్యార్థి సంఘానికి రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశాడు. అజ్ఞాతంలోకి కూడా వెళ్లాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం కాస్తా ఉధృతమైన తర్వాత బయటకు వచ్చాడు. నల్లకుంట ప్రాంతంలో ఓ బుక్‌ స్టాల్‌ తెరిచాడు. చాలా మందిమి దాన్ని స్వాగతించాం. హైదరాబాద్‌లో తెలంగాణకు సంబంధించిన ఓ బుక్‌ స్టాల్‌ ఓపెనైతే బాగుండుందనేది చాలా మంది కోరిక. ఆ కోరిక నెరవేరుతున్నందుకు సంతోషించాం. అందరూ తమ తమ పుస్తకాలు ఇచ్చారు. తెలంగాణకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటు చాలా పెరిగింది. దాని వల్ల బుక్‌ షాపు కూడా సందడిగా ఉంటూ వచ్చింది. శేఖర్‌ వ్యాపారం కూడా బాగానే సాగుతున్నది.

శేఖర్‌ మాటలు కూడా షాపు కలకలలాడినికి దోహదపడిరది. సన్నగా, పొడవుగా ఉంటాడు. ఛామనచాయ. చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు. మర్యాదకు మారుపేరుగా కనిపించేవాడు. తెలంగాణ సాహిత్యం పట్ల అత్యంత ప్రేమను కనబరిచేవాడు. అనతి కాలంలోనే అందరికీ ఇష్టమైనవాడిగా మారిపోయాడు. అయితే, ఆ రోజు అనూహ్యమైన సంఘటన జరిగింది.

రోహిత్‌ అనే రచయిత బుక్‌ షాపు వద్దకు వచ్చి, శేఖర్‌ను తిట్టడం సాగించాడు. నేను అప్పుడు అక్కడే ఉన్నా. రోహిత్‌ నాకు మంచి మిత్రుడు. అతన్ని వారించడానికి ప్రయత్నించాను. కానీ అతను నన్ను పట్టించుకునే స్థితిలో లేడు. రోహిత్‌ తిట్లను శేఖర్‌ పట్టించుకున్నట్లు లేడు. ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. తన పుస్తకాలు అమ్ముకుని అందులో తనకు రావాల్సిన డబ్బులు శేఖర్‌ ఇవ్వడం లేదనేది రోహిత్‌ ఫిర్యాదు. రోహిత్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శేఖర్‌ నుంచి ప్రతిస్సందన లేకపోవడం అతన్ని మరింత రెచ్చగొట్టినట్లుంది. రోహిత్‌ రాళ్లు తీసుకుని బుక్‌ షాపులోకి బలంగా విసరడం ప్రారంభించాడు. శేఖర్‌ మెల్లగా షెట్టర్లు మూసివేశాడు. రోహిత్‌ను తప్పించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కొన్నాళ్లకు నాకు శేఖర్‌ నుంచి ఓ చేదు అనుభవం ఎదురైంది. నా కారణంగా బుక్‌ షాపులో పనిచేసే కుర్రాణ్ని ఉద్యోగం నుంచి తీసేశాడు. నాకు రావాల్సిన డబ్బుల కోసం శేఖర్‌కు ఫోన్‌ చేయడం, షాపు దగ్గరకు వెళ్లడం నాకు నిత్యకృత్యంగా మారింది. ఆ డబ్బులతో తెలంగాణకు సంబంధించిన మరో పుస్తకం ప్రచురించాలని నా తాపత్రయం. అదే శేఖర్‌కు చెప్పుతూ వచ్చాను. దాంతో శేఖర్‌ ఓ ఉపాయం చెప్పాడు.
‘మీరు పుస్తకం రెడీ చేయండి. ప్రచురణకు అయ్యే ఖర్చు ఇస్తాను’ అని చెప్పాను. ఇదేదో బాగానే ఉందనిపించింది నాకు. పుస్తకం ప్రెస్సుకు ఇచ్చాను. బుక్‌ ప్రింటయింది. శేఖర్‌ డబ్బులు ఇవ్వడం లేదు. అయితే, నేను పట్టువిడవకుండా సాధిస్తూ వచ్చాను. చివరకు ప్రెస్సుకు సరిపడే డబ్బులు ఇచ్చాడు.

పుస్తకాలు అమ్ముడుపోవడం లేదా అంటే అదేం లేదు. వేడి వేడి బజ్జీల్లాగా అమ్ముడుపోతున్నాయి.
నాకు ఇంకా కొన్ని డబ్బులు రావాల్సి ఉన్నాయి. వాటి కోసం తిరుగుతూంటే షాపులో పనికి ఉన్న కుర్రాడు నాకు లెక్కలు చూపించాడు. నాకు ఇంకా 8 వేల రూపాయలు రావాల్సి ఉంది. అదే విషయం ఫోన్‌లో శేఖర్‌తో చెప్పాను.

‘మీకెవరు చెప్పారు?’ అని అడిగాడు
‘మీ షాపులో పనిచేసే కుర్రాడు’ అని చెప్పాను.
శేఖర్‌ అప్పుడేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు షాపు వద్దకు వెళ్తే ఆ కుర్రాడు లేడు. మరో కుర్రాడు కనిపించాడు. ‘ఎందుకు వెళ్లిపోయాడు?’ అని అడిగాను.
‘వెళ్లిపోలేదు, సార్‌. శేఖర్‌ సార్‌ ఉద్యోగం నుంచి తీసేశాడు.‘ఎందుకు?’ అని అడిగాను. ఆ కుర్రాడు జవాబు చెప్పడానికి ఇష్టపడలేదు. ర్యాకుల్లో పుస్తకాలు సర్దుతున్నట్లు నటించసాగాడు.
‘నేను ఎవరితో అనను గానీ కారణమేమిటో చెప్పు’ అని అడిగాను. అతను నా వైపు కొంత అపనమ్మకం చూశాడు. ‘నన్ను నమ్ము’ అని భరోసా ఇచ్చాను.

‘మీకు లెక్కలు చెప్పినందుకే సార్‌’ అని అన్నాడు. నా తల దిమ్మితిరిగింది. శేఖర్‌ మీద కోపం కూడా వచ్చింది. కానీ కొత్త కుర్రాడికి మాట ఇచ్చాను కాబట్టి ఆ విషయాన్ని మనసులోనే దాచుకున్నాను.
ఇటువంటి అనుభవమే అంజన్నకు ఎదురై ఉంటుందని అనుకున్నాను. దాంతో ‘శేఖర్‌ రచయితలకు డబ్బులు సరిగా ఇవ్వడం లేదు’ అని అన్నాను.
అంజన్న కోపం కొంత వరకు తగ్గినట్లు అనిపించింది. ‘అది కాదు. వాడు ఉద్యమ ద్రోహి. దొంగలాగా వచ్చి సంచీ అందుకుని పారిపోయాడు’ అని అన్నాడు.

‘అసలేం జరిగింది?’ అని అడిగాను. అంజన్న చెప్పడం ప్రారంభించాడు.
కొన్నేళ్లవుతున్నది. ఓ రోజు శేఖర్‌ హడావిడి మా ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు టైమ్‌ పదో పదకొండో అవుతుంది. నేను ముందు గదిలో కూర్చుని పాట రాసుకుంటున్నా. తలుపులు తెరిచే ఉన్నాయి. చాలా ఆందోళనగా కనిపించాడు. దుస్తులు దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. ఒళ్లంతా చెమటలు పట్టాయి. చప్పుడు చేయకుండా ఇంట్లోకి వచ్చేశాడు. భుజంపై ఓ సంచీ వెల్లాడుతూ ఉన్నది. అతని కళ్లలో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. అప్పుడు అతను అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నాడు.
‘కూర్చో’ అని చెప్పాను.

‘అంత టైమ్‌ లేదు. ఈ సంచీని భద్రంగా దాచి పెట్టు. నేను వచ్చి తీసుకుంటా’ అని భుజం నుంచి సంచీ తీసి నాకు ఇచ్చాడు. ఆ తర్వాత క్షణం కూడా నిలుచోలేదు. వెనక నుంచి వెనక్కే వెళ్లిపోయాడు. నేను సంచీని రెండో గదిలోని అటక మీద సంచుల కింద దాచి పెట్టాను.
అతను వెళ్లిపోయిన కొద్ది సేపటికి ముగ్గురు వ్యక్తులు వచ్చారు. బలిష్టంగా ఉన్నారు. రౌడీలో, మఫ్టీ పోలీసులో తెలియదు. ‘శేఖర్‌ ఎక్కడ?’ అని అడిగారు.

నాకు వణుకు పుడుతున్నది. అంత భయంలోనూ నా బుర్ర పాదరసంలా పనిచేసింది. కానీ తమాయించకూడదని ధైర్యం నటిస్తూ ‘ఏ శేఖర్‌?’ అని అడిగి, ‘రోడ్డు మీద అటువైపుగా ఎవరో పారిపోతున్నట్లు అనిపించింది. మీరు అంటున్న శేఖర్‌ అతనే కావచ్చు’ అని ఎటు వైపో తెలియకుండా చేయి చూపించి చెప్పాను. వచ్చినంత వేగంగా వాళ్లు వెళ్లిపోయారు. అది జరిగి చాలా ఏళ్లయింది.

బయటకు వచ్చిన తర్వాత చాలా సార్లు అతను కలిశాడు. కానీ ఆ సంచీ ప్రస్తావన రాలేదు. ఈ రోజు ఉదయమే వచ్చాడు. తాపీగా కుర్చీలో కూర్చున్నాడు. చాయ్‌ ఇస్తే తాగాడు. తన బుక్‌ షాపు గురించి, తెలంగాణ ఉద్యమం గురించి, తన భార్య గురించి చెప్పాడు. ఒక కొడుకు, కూతురు ఎక్కడ చదువుతున్నారో చెప్పాడు. కుటుంబ విషయాలు, సామాజిక విషయాలు కలబోసి మాట్లాడాడు. అన్నీ విన్నాను. చివరగా సంచీ గురించి అడిగాడు.

‘సంచేమిటి?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశాను. ఆ సంచీ గురించి నేను ఎప్పుడో మరిచిపోయాను. కొన్నేళ్ల కింద తాను హడావిడిగా వచ్చి ఇచ్చిపోయిన సంచీని గుర్తు చేశాడు. అప్పుడు గుర్తుకు వచ్చింది. కుర్చీ వేసుకుని అటక మీద దాచిన సంచీని బయటకు లాగాను. తాను కూడా అందుకు సాయం చేశాడు. అయితే, ఒక్కసారిగా సంచీ కింద పడిపోయింది. దాంట్లోంచి కాగితాలు చెల్లాచెదురుగా పడ్డాయి. అతను వాటిని వేగంగా ఏరుకోవడం ప్రారంభించాడు. నేను కిందికి దిగి కింద ఉన్న కొన్ని కాగితాలను చేతుల్లోకి తీసుకున్నాను. ఒకదాన్ని పరిశీలనగా చూశాను. వెంటనే శేఖర్‌ చేతుల్లో ఉన్న మిగతా కాగితాలను కూడా లాక్కున్నాను. అంత బలం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు.

నేను వాటిని చూస్తూ శేఖర్‌ ముఖంలోకి చూశాను. అతని ముఖం పాలిపోయింది. ‘ఏం లేదన్నా. ఇటు ఇవ్వు’ అని బతిమిలాడాడు. నేను ఇవ్వలేదు. వాటిని పరిశీలిస్తూ వెళ్లాను. చేసేది లేక అతను అలాగే నిలబడ్డాడు. అవన్నీ ల్యాండ్‌ అగ్రిమెంట్లు, ల్యాండ్‌ రిజిస్ట్రేషన్‌ పేపర్లు. నాకు ఒళ్లు మండిపోయింది. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. కోపంలో నోట మాట రాలేదు. ఆ కాగితాలను అతనిపైకి విసిరికొట్టి,. ‘దొంగ ముం.. కొడుకా’ అని తిట్టా. అలా తిడుతున్నప్పుడు నా మాటలు వంకరటింకరగా వచ్చాయి. నా కోపాన్ని పట్టించుకోకుండా వాటిని ఏరుకుని సంచీలో కుక్కుకుని గబగబా వెళ్లిపోయాడు. ఇదంతా మీ రాములక్క ప్రేక్షకపాత్రురాలిగా చూస్తూ ఉండిపోయింది.

‘సంచీ అతనిదే కదా!’ అని అన్నాను.

నా మాటను అంజన్న పట్టించుకున్నట్లు లేడు. ‘కొడుకు.. యుద్ధంలో ఉన్నాడు కదా… వర్గ శత్రువులకు గురిపెట్టడానికి సంచీలో పిస్తోలు పెట్టుకున్నాడు కావచ్చు. పోలీసులు కంట పడగానే ఆ సంచీని నాకు ఇచ్చిపోయడాని అనుకున్నా. ఇంత ద్రోహబుద్ధి ఉందని నాకు తెలియలేదు’ అన్నాడు.
‘పోనీలే అంజన్నా! ఇలాంటివాళ్లు ఉంటారు’ అని అన్నాను.

‘వాడిని వదిలేయకూడదు. పంచాయతీ పెడుతా’ అని ఒక నిశ్చయానికి వచ్చినవాడిలా అన్నాడు.
ఆ తర్వాత చాలా మందితో విషయం చెప్పాడు. పంచాయతీ పెడుదామని కూడా అన్నాడు.

అంజన్న మొరను ఎవరూ ఆలకించలేదు. కాలం గడిచిపోయింది. అంజన్న కూడా ఆ విషయాన్ని ఇక ప్రస్తావించలేదు.

*

కాసుల ప్రతాప్ రెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు