కట్టే -కొట్టే – తెచ్చే లాగ పిల్లల్ని కని పెంచేవాళ్లను నా చుట్టూ నేను చాలా మందిని చూసాను . కన్నారు కాబట్టి దానిని మాతృ ప్రేమ అని లోకం అంటుంది . కావచ్చునేమో . అలా కాకుండా తాను బిడ్డకి జన్మని ఇవ్వకున్నా ఆ బిడ్డకోసం తపన పడి ,ప్రాణాలు కూడా వదిలితే ఆ వ్యక్తి ఆ బిడ్డని కనక పోయినా ఆ బిడ్డకి అమ్మనే అని నేను అనుకుంటాను . అదే అసలయిన మాతృ ప్రేమ నా దృష్టిలో. అలాటి అమ్మ ఒకరు నాకు తెలుసు. ఆ వ్యక్తి కథ ప్రపంచానికి చెప్పకపోతే ప్రపంచానికి తప్పకుండా లోటు జరుగుతుందనే నా భావన.
నా పేరు రంతిదేవ్ దాస్. మా వూరు పేరు బావురియా. కలకత్తాకు ఆనుకుని ఉంటుంది. ఒకప్పుడు మా వూరు ఒక కుగ్రామం. కానీ ఏళ్ళు గడిచేకొంది కలకత్తా పెరిగి పెరిగి మా ఊర్లోకి వచ్చేసింది. కలకత్తా ఎప్పుడయితే మా ఊర్లోకి వచ్చిందో అప్పుడు మా వూర్లో వాళ్ళు, వూళ్ళో దొరికే పొలం పనులు మానేసి,మంచి జీతాలకి నగరానికి వెళ్లి పనులు చేసి సాయంత్రానికి ఇంటికి రావడం వంటి కార్యక్రమం మొదలు పెట్టారుట. మరికొంత కాలానికి కలకత్తా ఇంకొంచెం పెరిగి కార్ఖానాలు గీర్ఖానాలు వంటి వాటిని వెంటపెట్టుకుని మా ఊర్లోకి వచ్చి స్థిర పడిపోయింది. అప్పుడిక మా ఊరిని అందరూ కోల్కతా అనే అనడం మొదలు పెట్టారు.
మా నాన్నకి మా వూర్లో పెద్ద హార్డ్వేర్ షాప్ ఉంది. నేను ఒక్కడే కొడుకుని. అందుచేత నాకు బాగానే చదువు అబ్బినా నిలకడగా కూర్చుని చదవడం మీద విసుగేసి బోర్డు ఎగ్సామ్ ఫెయిలయ్యను. పదవ తరగతి చదివే వరకు, నాకు మా బడిలో వున్న వారంతా స్నేహితులే. ఎప్పుడూ తూనీగల్లా చెరువుల వొడ్డుల్లో ఎగురుతూ,చేపలు పడుతూ,ఈతలు కొడుతూ తిరుగుతూ ఉండేవాళ్ళం. ఎప్పుడయితే పదవతరగతి పూర్తయిందో అప్పటి నుండి నేను ఒంటరి వాడిని అయిపోయాను. నా ముఖ్యమయిన స్నేహితులందరూ కాలేజీలో చేరేశారు. అలా చేరని వాళ్ళు పనులకి పోవడం మొదలు పెట్టేసారు. నేను మాత్రం మా నాన్న దుకాణం లో అడ కత్తెరలో పోకచెక్క ఇరుక్కున్నట్లు ఇరుక్కు పోయాను. మా నాన్న నాకు పద్దు పుస్తకం ఒకటి ఇచ్చి పొద్దు పొడిచినప్పటి నుండి పొద్దుపోయేదాకా పని నేర్పించడంలో కొత్త కోడలు చేతికి దొరికిన అత్త లాగా ప్రవర్తించేవాడు. మా నాన్న నుండి తప్పించుకుని తిరగడానికి నాకు స్నేహ బృందం లేక పోవడంతో నేను కూడా బుద్ధిగా దుకాణం లో కూర్చునేవాడిని. అలా నేను దుకాణం లో వున్న ఒక మధ్యాహ్నం పూట దేనికోసమో మా దుకాణానికి వచ్చాడు అజీమ్.
మా వూర్లో సగానికి పైగా ముస్లిం కుటుంబాలు ఉంటాయి. బయట మీ బోటివారికి ఎంత మేరకు తెలుసో నాకు తెలియదు కానీ పశ్చిమ బెంగాల్ లో వుండే హిందువులకు తమతో కలిసి నివసించే ముస్లిములంటే చాలా చిన్న చూపు ఉంటుంది. తమ పిల్లలు ప్రేమ పేరుతో హిందూ మతం లోని ఏ కులం వాళ్ళతో లేచిపోయినా అభ్యంతర పెట్టరు కానీ,ముస్లిము మతస్థులతో మాత్రం చచ్చినా వియ్యమందరు. పశ్చిమ బెంగాల్ ని మతం పేరుతో విడదీయగలరు గాని కులం పేరుతో ఎవరూ విడదీయలేరు. మా అజీమ్ కూడా ముస్లిం మతస్థుడు. అజీమ్ కి తారక్ అని ఒక డాక్ నామ్ వుంది. డాక్ నామ్ అంటే ముద్దు పేరు, ఆ పేరు వాడికి ఎందుకుందో తరవాత చెప్తాను.
వాడు అలా మా దుకాణానికి వచ్చాక నేను వాడిని మామూలుగానే పలకరించాను. ఎందుకంటె వాడు నాకు మొదటినుండీ మా తరగతిలో ముఖ్యమైన స్నేహితుడు కాదు.ఎప్పుడయినా ఎదురుపడితే ముక్తసరిగా ‘ఏం రా’ అంటే ‘ఏం రా ‘అనుకునే బాపతు, అంతే. అందుకే వాడిని చూడగానే నాకు పెద్ద ఉత్సాహం గా ఏమీ అనిపించలేదు. కానీ వాడు అలా కాదు నాతో చాలా ఆత్మీయంగా మాట్లాడాడు. మా ఊళ్ళోనే వుండే కారు షెడ్డు లో పనికి వెళుతున్నానని,కార్ డ్రైవింగ్ కూడా నేర్చుకుంటున్నానని చెప్పాడు.ఏదయినా అవసరపడితే కబురు పెడితే వస్తానని కూడా చెప్పాడు.
అజీమ్ వెళ్లిన ఒక పది రోజులకి మా నాన్న బంధువుల పెళ్లికని అలీపూర్ దువార్ కి వెళ్ళవలసి వచ్చింది. అది దూరాభార ప్రయాణం. వెళ్ళటం రావటం అక్కడ ఉండటం అంతా కలిపి ఒక నాలుగు రోజులు పైనే పడుతుందని నాకు అర్థమయింది. కానీ ఏం చెయ్యడం పంజరంలో చిలకని హఠాత్తుగా బయటికి వదిలితే దానికి రెక్కలున్నాయనే విషయం వెంటనే జ్ఞాపకం రాదు చూడండి నాకు కూడా మా నాన్న లేని స్వేచ్చని ఏం చేయాలో అర్థం కాలేదు. దుకాణంలో కూర్చుని ఏదో చదువుకుంటూ ఉంటే నాకు హఠాత్తుగా అజీమ్ గుర్తుకు వచ్చాడు.పని కుర్రాడిని పిలిచి అజీమ్ ని పిలుచుకు రమ్మని చెప్పాను.
నా కోసం కేరేజ్ బాక్స్ లో చేపల కూర పెట్టుకుని మధ్యాహ్నం మూడున్నరకి వచ్చాడు అజీమ్. అజీమ్ తెల్లగా ఉంటాడు,కళ్ళు పెద్దగా ఉంటాయి. అవి కాదు అజీమ్ పట్ల మనం ఆకర్షితులమవడానికి కారణం,అజీమ్ అకారణంగా మనుషులను ప్రేమిస్తాడు. హృదయపూర్వకంగా అభిమానం చూపిస్తాడు. మనం నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు వాడు కూడా నవ్వుతూ కళ్ళు మెరుస్తుండగా మాట్లాడుతాడు. అలాగే మనం దుక్ఖం తో వున్నప్పుడు తన కళ్ళలో మన దుక్కాన్ని మనం చూసుకోవచ్చు. ఆ రోజు వాడు నాకోసం తెచ్చిన చేపల కూరను ముట్టుకోవడానికి నేను సంశయించాను. మా అమ్మకి తెలిస్తే నిశ్చయంగా నన్ను వీపు చీరేయగలదు. కానీ అజీమ్ తెల్లటి కళ్ళు,తెల్లటి నవ్వు చూస్తే వద్దని ఎలా చెప్పాలో అర్థం కాక ఆ డబ్బా పుచ్చుకుని కౌంటర్ లో పెట్టుకున్నాను. కాసేపు కౌంటర్ లో కూర్చున్నాక ఈత కొట్టడానికి వెళదామా అని అడిగాను . ఈత కి వెళ్లి ఎన్ని రోజులయిందో. అజీమ్ వెంటనే తల ఊపాడు. నేను ఇంట్లోకి వెళ్లి తువ్వాలు అవీ తీసుకుని అమ్మకి చెప్పేసి వస్తుంటే వాడు ”చేపల కూర తెచ్చుకోరా రంతి! ఈత కొట్టాక ఆకలేస్తుంది కదా, అప్పుడు తిందువు కానీ” అన్నాడు. వీడు నన్ను వదిలేలా లేడు అనుకుని,సరే అమ్మ చూడదు కదా అనే ధైర్యంతో డబ్బా పట్టుకుని బయల్దేరాను.
మేము ఈత మొదలు పెట్టిన కాసేపటికి వర్షం మొదలయింది. వర్షంలో ఈత కొట్టడంలో అదొక మజా ఉంటుంది. అలా ఈత కొట్టి పక్కనే వున్న మామిడి తోటలో కూర్చుని వాడు తెచ్చిన చేపల కూర డబ్బా విప్పాను. కూర రుచి అమోఘంగా అనిపించింది. ఆశ్చర్యపడి అదే విషయాన్నీ అజీమ్ కి చెప్పి ఎవరు చేశారని అడిగాను. అజీమ్ నా పొగడ్తలకు సిగ్గుపడి సన్నగా నవ్వుతూ ”నేనే వండాన్రా , రంతి! ,నాకు వంట చెయ్యడమంటే చాలా ఇష్టం” అన్నాడు. ఈ సారి నీకు మటన్ ఖోసా వండుకుని తెస్తాను,ఎప్పుడు రమ్మంటావో ఆ రోజు మూడు గంటల ముందుగా చెప్పు అన్నాడు. నేను ఈ సారి నిస్సిగ్గుగా తల ఊపాను. అలా మొదలయింది నాకు అజీమ్ కి మధ్య స్నేహం.
మా నాన్న బయట ఊర్లకు వెళ్తాడు అని తెలిసినప్పుడల్లా మేమిద్దరం ఏదో ఒక కార్యక్రమాన్ని ఆలోచించి పెట్టుకునే వాళ్ళం. అజీమ్ కి కార్ నడపడం చేతనయ్యాక మేమిద్దరం మా కార్ తీసుకుని ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళం. అజీమ్ నాకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తే అజీమ్ కి నేను బీర్ తాగడం నేర్పించాను. అలా మా స్నేహం కొనసాగుతుండగా ఒక సారి ఎవరో అజీమ్ ని ‘తారక్ ‘అని పిలవడం నేను గమనించాను. అలా ఆ పేరు ద్వారా అజీమ్ వ్యక్తిగత జీవితం లోకి నేను మొదటిసారి ప్రవేశించాను.
సన్నజాజి పువ్వుల తీగ ఏదో పిచ్చి ఇనుప కమ్ముల మీద పడి అల్లుకున్నదే అనుకోండి, కొంత కాలానికి ఆ అల్లికను ఆ కమ్ముల నుండి విడిపించడం మన తరం కాదు. అయితే మొదలంటా తీగను నరికేసి మళ్ళీ మనకు కావలసిన చోట నుండి అల్లించడం మొదలు పెట్టాలి.లేదా దాని యధాతథ స్థానంలో దానిమానాన దానిని వదిలివేయాలి. అజీమ్ పిచ్చికమ్ములపై పెరుగుతున్న సన్నజాజి తీగ అని నాకు అర్థమయింది. అజీమ్ తల్లి వేశ్య. వేశ్య అంటే వృత్తిగతంగా కాదు,వంశగతంగా ఆమె వేశ్య. ఆవిడ తల్లి కూడా వేశ్య. అజీమ్ తల్లి హిందువు. ఆమెకి మొదటిసారి గర్భం చేసిన వ్యక్తి ముస్లిం మతానికి చెందిన వాడు. అతను అజీమ్ తల్లి కన్యత్వాన్ని కొంత డబ్బు పెట్టి కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఆ చిన్న అమ్మాయి పై మోజు తీరక ఆ సంబంధాన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చాడు. ఆ క్రమంలోనే అజీమ్ తల్లి గర్భవతి అయింది. ఆమెకి అప్పుడు సరిగ్గా పదిహేను అంటే పదిహేను సంవత్సరాలు. పదవతరగతి మధ్యలోనే వదిలేసి కూతురు అలా గర్భవతి కావడం ఆమె తల్లికి సుతరామూ నచ్చలేదు. కానీ ఆమెను గర్భవతిని చేసిన నలభై ఆరేళ్ళ అసదుద్దీన్ కి, భగవంతుడు ఆ చిన్న అమ్మాయి గర్భంలో వదిలిన తన సంతానాన్ని ఛిద్రం చేయడం నచ్చలేదు. అది అతని మతానికి విరుద్ధం. అందుకని అతను అజీమ్ అమ్మమ్మ గొంతు మీద కత్తి పెట్టి బెదిరించాడు,అయినా ఆమె అలవి కాకుండా కేకలేస్తుంటే కొంచెం గాటు కూడా పెట్టి,వళ్లంతా రక్తసిక్తమయ్యేట్టు కొట్టి,అనేక విధాలుగా భయపెట్టి అజీమ్ ని భూమి మీదకు తెచ్చాడు. పుట్టిన బిడ్డకు తన మతాన్ని ఇచ్చి అజీమ్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. అజీమ్ తండ్రి కలకత్తాలో ఎక్కడో కార్ మెకానిక్ పనులు చేసేవాడు. అతనికి అంతకు ముందే సంసారమూ,పిల్లలూ వున్నా,అజీమ్ ని చాలా ప్రేమగా చూసేవాడు. అతను అలాగే కొనసాగి ఉంటే అజీమ్ జీవితం ఎలా ఉండేదో మనకు తెలీదు కానీ అజీమ్ కి నాలుగేళ్లు వచ్చేసరికి అతను చనిపోయాడు.
అజీమ్ తండ్రి ఒకనాడు హఠాత్తుగా,అర్థాంతరంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని కబురు అందుకున్నప్పుడు అజీమ్ తల్లి,ఆమె తల్లి ఇద్దరూ యెగిరి గంతులేస్తూ పండగ చేసుకున్నారు. నరకాసురుడు చనిపోయాడు కదా అని దీపాలు వెలిగించుకున్నట్లు,ఇల్లు శుభ్రంగా కడుక్కుని దేవుడికి దీపం పెట్టి తమ జీవితాలు ఇకపై ఏ నరకాసురుడి నీడా పడకుండా చల్లగా వుండాలని ప్రార్థించుకున్నారు. గొప్ప ఉత్సాహంతో తమ వృత్తిని ప్రారంభించారు. రాచపుండు లాగ అన్నాళ్ళు కరుచుకుని వుండిన అసదుద్దీన్ చచ్చాక అజీమ్ తల్లికి జీవితం మీద కొత్త ఉత్సాహం పుట్టుకు వచ్చింది . అతను పోయేనాటికి ఆమెకు పందొమ్మిదేళ్లే. బిడ్డపై ఉండాల్సిన మాతృ ప్రేమ అజీమ్ పై ఆమెకు ఏనాడు,ఏ కోశానా ఉండేది కాదు. ఆమె తల్లికీ ఉండేది కాదు. కాకపోతే తెల్లగా పాల బుగ్గలతో,రింగుల తలతో, గచ్చకాయ రంగు కను గుడ్డును మరింత ప్రదీప్తం చేస్తున్న అతి తెల్లటి కనుపాపలతో ముద్దులొలుకుతూ వుండే అజీమ్ ని చూసినప్పుడల్లా ఆ ఇద్దరు ఆడవాళ్లకి బాధతో గుండెలు అవిసి పోయేవి. వీడు అమ్మాయిగా పుట్టి ఉంటే,తమ వృత్తిలో దిగి ఎంత సంపాదించగలిగి వుండే వాడో చెప్పుకుని,నిట్టూర్చేవారు. ఆ అందాన్ని చూసి కాదు కానీ అజీమ్ తండ్రి మీద కక్షతో అజీమ్ అమ్మమ్మ వాడికి బిష్ణు తారక్ అని పేరు పెట్టింది అసదుద్దీన్ కి తెలియకుండా రహస్యంగా అతను పనికి వెళ్ళినపుడు మనవడిని తారక్ అని పిలిచేది. చుట్టు పక్కల వాళ్ళు బిడ్డ బుగ్గలు పుణికి పేరేమిటి అని అడిగితే ”బిష్ణు తారక్”అని చెప్పి అల్లుడుగాని అల్లుడి మీద మీద కక్షనంతా తీర్చుకుంటున్నట్లు సంతోషపడేది. ఒక వంక అజీమ్ అమ్మమ్మ అలా సంతోషపడుతూ ఉంటే, అజీమ్ తల్లి వాడికి ఆడ పిల్ల బట్టలు వేసి అందరికీ తనకు పుట్టింది ఆడపిల్లేనని,తన వృత్తికి వారసురాలని చెప్పుకుంటూ,అదొక చమత్కారమయినట్లు తనకు తనే పగలబడి నవ్వుకుంటూ సంతోషపడేది.
అజీమ్ తండ్రి చనిపోయాక అజీమ్ తల్లి తన వేశ్యా వృత్తి లోకి పూర్తి స్థాయిలో దిగిపోయింది. నెలలో మూడు వారాలు ఆమె కలకత్తా లోని సోనాగాచి వంటి ప్రాంతాల్లో తిరిగి ఒక వారం లేదంటే వారంలో రెండ్రోజులు చుట్టపు చూపుగా ఇంటికొచ్చి వెళుతూ ఉండేది. అజీమ్ అమ్మమ్మ స్వంత ఊర్లోనే ఉంటూ అడపాదడపా తనకోసం వచ్చే కస్టమర్లను కనిపెట్టుకుని కూతరు తెచ్చే డబ్బుల్ని కూడ పెట్టేది. తండ్రి చనిపోయే నాటికి అజీమ్ నాలుగేళ్లు నిండి అప్పుడప్పుడే ఐదులోకి అడుగు పెట్టేడు. ఐదో సంవత్సరం వచ్చాక వాడి జీవితానికి ఆలనా పాలన అన్నది లేకుండా పోయింది. అలిసిపోయేంతవరకు ఆడు కోవడం ఆకలేస్తే అమ్మమ్మ ఆ సమయానికి వుండి వాడి బొచ్చెలో అంత అన్నం వేస్తే సరే, లేదంటే తనే స్వంతంగా వంటింట్లో వెళ్లి అన్నం చట్టి ,కూర చట్టి దొర్లించుకుని తినడం నేర్చేసుకున్నాడు.వాడు ఆటలాడే గుంపులో సావాసగాళ్లు కొందరు బడిలో చేరితే వాడు కూడా వాళ్ళ వెనకాల వెళ్లి తనను తనే బడిలో చేర్చుకున్నాడు. పనికిమాలిన పనులతో క్షణం తీరికలేకుండా వుండే తన అమ్మమ్మకి తానే నాలుగు మెతుకులు ఉడకేసి పెట్టడం కాదు,ఏకంగా బిరియానీలు వండిపెట్టడం నేర్చేసుకున్నాడు. పదవ తరగతి తర్వాత కలకత్తా కి వెళ్లి కాలేజీ లో చేరుతానని వాడు చెప్పినప్పుడు,అజీమ్ అమ్మమ్మకి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు పొలమారింది. అమృత సమానమయిన అజీమ్ వంట రుచి ని తలచుకొన్న ఆవిడ అజీమ్ పైకి తోక తొక్కిన త్రాచులా లేచి బుసలు కొట్టింది. కాలేజీ గీలేజీ మాటలు కట్టి పెట్టి వున్న ఊర్లోనే కారు షెడ్డులో పనికి కుదరమని ఆదేశించింది. అలా చేస్తే తండ్రి పేరుని నిలబెట్టినట్లు కూడా అవుతుందని చెప్పింది.
అజీమ్ చాలా మెతక పిల్లవాడు. అతను, అతని తండ్రిలా అటు గయ్యాళి, తల్లిలా ఇటు చురుకూ కాదని,ఎక్కడో వట్టి వాజమ్మ పుట్టాడని అతని అమ్మమ్మ ఏదయినా విసుగు కలిగినప్పుడు అంటూ ఉండేది. అజీమ్ ది స్వతహాగానే ఎవరికీ ఎదురు చెప్పని తత్వం. అందుకే అమ్మమ్మ తనకు అస్సలు ఏ మాత్రం జ్ఞాపకం లేని తండ్రి పేరు చెప్పి తనని కాలేజీలో చేరకుండా చెయ్యాలని అనుకున్నప్పుడు కూడా వాడు ఎదురు మాట్లాడలేదు. మౌనంగా కార్ షెడ్డులో పనికి చేరాడు. అలా చేరి పొద్దున్నే అమ్మమ్మకి వండి పెట్టి మరీ పనికి పోయేవాడు. తల్లి చుట్టపు చూపుగా ఇంటికి వచ్చినప్పుడు ఎంతో ప్రేమతో తల్లికి ఏవేవో వండి కొసరి కొసరి తినిపించడం అజీమ్ కి ఎంతో ఇష్టమయిన పనులలో బహుశా మొదటిది.
ఒక సారి ఫాల్గుణ మాసం లో ”డోల్ పూర్ణిమ”కు శాంతినికేతన్ వెళదామని మేమిద్దరం అనుకున్నాం. అందుకని చాలా రోజులు ముందు నుండే మా అమ్మను నేను మానసికంగా సిద్ద పరచి వుంచాను. మా అమ్మ,మా నాన్నని ఎలాగోలా ఒప్పించింది. వసంతోత్సవం అదే ఈ ”హొలీ పండుగ”బయట చూడటం వేరే,శాంతినికేతన్ లో చూడటం వేరే. పండుగ రోజు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు పసుపు రంగు బట్టలు కట్టుకుని,టాగోర్ పాటలు పాడుకుంటూ,గుంపులు గుంపులుగా,ఒక్కో గుంపు ఒక్కో రకంగా,ఆ ప్రాంతాన్నంతా శోభితం చేయడాన్ని కళ్ళతో చూడాలి. అప్పుడు అక్కడి మట్టి, గాలి, చెట్టు చేమ అన్ని సంగీతంతో మేళవించబడి అలౌకిక తాదాత్మ్యంలోకి వెళ్లడం చెవితో వినాలి. నా మాటలు సరిపోవు. టాగోర్ తన పాటలో అంటాడు కదా ”ఆనంద లోకే /మంగళాలోకే/బిరాజో సత్య సుందరో ”[In the world of happiness, in the world of blessedness, dwell truth and beauty.] అని. అలాటి సత్య సుందర ఆనంద లోకం ఒకటి అక్కడ మనకి ఆరోజు ఇంద్రధనస్సు వర్ణాలలో కనిపిస్తుంది.
మేము డోల్ పూర్ణిమ ఉదయాన్నే శాంతినికేతన్ చేరుకున్నాం. మా గదికి వెళ్లి మా బ్యాగ్ ఉంచి,నాష్టా చేసి,తొలి సూర్య కిరణాలు పుడమికి చేరుతూ వున్నప్పుడు మేము విశ్వ భారతి యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నాం. మా లాగే ఎంతో మంది యాత్రికులు ఆ ఉత్సవాన్ని చూడటానికి అక్కడికి వచ్చి వున్నారు. వాళ్లలో విదేశీయులూ వున్నారు. ఉదయమంతా అటూ ఇటూ తిరిగి మేము మునిమాపు వేళకి మా గదికి చేరుకున్నాం.ఆ రాత్రి శాంతినికేతన్లో ఒక మేళా జరిగింది. ఆ మేళాకి ఎక్కెడెక్కడి గాయకులో వచ్చారు. రాత్రంతా పూర్ణిమ చంద్రుని కింద వెన్నెలలో ఆ వచ్చిన గాయకులు తమతమ ఘరానా ని అనుసరించి ఆలాపన చేసారు. ఘరానా ని అనుసరించి శ్రోతలు వారి చుట్టూ గుంపు కట్టారు. అలా ఆ రాత్రి మొత్తం ఆ మైదానమంతా గాన తారలతో నిండిపోయింది. పశ్చిమ బెంగాల్ విశిష్ట జానపద గాయకులూ,భవయ్యా,బౌల్,లాలన్ ఫకీర్ గీత గాయకులు,ఏకతారా నిపుణులు ఇలా ఒకరని చెప్పాలా .. ఆ రోజు ఆ మైదానమంతా గాన తారలతో కళకళలాడింది.
మేము మా గదికి వచ్చామని చెప్పా కదా. రంగులతో నిండిన మా బట్టలను విడిచి స్నానం చేసి వెళ్లి ఆ గానా బజానాలో పాల్గొనాలనేది మా ఆలోచన. అజీమ్ మొదట నన్ను స్నానం చేసి వెళ్లి ఎక్కడయినా మంచి సెంటు బుడ్డి దొరుకుతుందేమో కొనుక్కుని రమ్మన్నాడు. అప్పుడు అత్తరు అవసరమేమిటో నాకు అర్థం కాలేదు. కానీ ఎంత హిందువులతో పెరిగినా వాడి సగం రక్తం సాయెబులది కదా పాపం అందుకని అత్తరు మీద మోజు కలిగిందేమో అని నేను మారు మాట్లాడక సరే అని స్నానం చేసి బయల్దేరాను. వాడు నా వెనకాల గది తలుపు గడియ వేసుకోవడానికి వస్తూ నేను తలుపు బయట,వాడు తలుపు లోపల ఉండగా తల బయట పెట్టి,ఆ పాలుగారే అందమయిన ముఖాన్ని కొంచెం బుంగమూతిగా పెట్టి ”రంతి! నువ్వు వెనక్కి వచ్చాక నా బట్టలు,నన్ను చూసి దిమ్మెరపోతావు రా. కానీ ఈ ఒక్క రోజుకి నన్ను ఏమీ అనకు రా రంతి!” అన్నాడు. అజీమ్ మాటలకి,ఆ తలుపు దగ్గర నిలబడి అప్పటికప్పుడు నేనేమీ ఆలోచించ లేకపోయాను. ”సరేలే రా” అని బయటకి వచ్చాను. పశ్చిమ బెంగాల్ లో ముస్లిం లు తటస్థంగా,పాలలో నీళ్లలా, తమ ఉనికి మెజారిటీ హిందువుల కళ్ళలో పడే విధంగా కాకుండా శాంతిగా వుంటారు.అందుకని అప్పుడు వాడు తను వేసుకోబోయే బట్టలు గురించి మాట్లాడినప్పుడు నా మెదడు పశ్చిమ బెంగాల్ బయట ముస్లింలు వేసుకునే తరహా బట్టలు అయి ఉండొచ్చని నాపరిమితుల మేరకు ఆలోచించి ఉండవచ్చు.
నేను శాంతినికేతన్ లో వాడు చెప్పిన ”గులాబ్ అత్తర్” కోసం అక్కడా ఇక్కడా వెదికాను. కొందరు లేదన్నారు. కొందరు మేళా సందడిలో అమ్ముడయిపోయిందని అన్నారు. చివరికి ఒక దుకాణదారుడు వాళ్ళు వాడుతున్నది కొంచెం వుందని, కావాలంటే అది ఉచితంగా తీసుకెళ్లమని అన్నాడు. నేను ఆ ఒక్కరోజుకే కదా అనుకుని, అది పట్టుకుని వెనక్కి బయల్దేరాను. అప్పటికి అరగంట సమయం గడిచిపోయింది. అందుకే చకచకా నడుచుకుంటూ వెళ్లి తలుపు తట్టాను. తట్టిన వెంటనే బదులు పలికిన అజీమ్ తలుపు మాత్రం కాసేపటి తర్వాత తెరిచాడు. నా సాదా సీదా జీవితంలో నేను చాలా ఆశ్చర్యానికి లోనయిన మొదటి సంఘటన అదే. తెరిచిన తలుపు లోపల నా ఎదుట అజీమ్ బదులుగా సుందర సుకుమారమయిన ఒక అమ్మాయి నిలుచుని వుంది. నాకు నోటా మాట రాలేదు. ఆ అమ్మాయి నవ్వింది ”ఇలా బాగున్నానా రా ,రంతీ ?”నీకు కోపమొస్తుందా నన్నిలా చూస్తే ? ఏమీ అనుకోకురా నిన్ను ఇబ్బంది పెడుతున్నానని !,ఇంకెప్పుడూ నిన్ను ఇబ్బంది పెట్టను సరేనా?”ఆ మాటలు అలా సాగుతూ ఉండగా నా మెదడు ఆశ్చర్యం నుండి నెమ్మదిగా కోలుకుంది. నేను మంచం మీద కూలబడి ”ఏంట్రా అజీమ్ ఇదీ?”అన్నాను. అప్పటికి కొంచెం నాకు గొంతు పెగిలింది. అజీమ్ వెంటనే నా ఎదురుగా నేలపై మోకాళ్లపై కూర్చుని నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ దృశ్యాన్ని ఆనాడు ఎవరయినా చూసి ఉంటే కచ్చితంగా ఒక దేవకన్య నా లాటి సాదాసీదా మానవుడి ముందు ఎందుకు మోకరిల్లిందో,అది ఎలాటి మాయాజాలమో అర్థం కాక మూర్ఛపోయే వారు. అజీమ్ ఆ అలంకరణలో అంత అందంగా వున్నాడు. భుజాల వరకూ కవీంద్రుడు ఠాగూర్ లా ఎప్పుడూ వదులుకుని వుండే జుట్టును కొప్పులా మడిచి అందులో రజనీగంధ పువ్వులను అందంగా అమర్చి కొన్నింటిని భుజాలపై నుండి చీర మీదకి తెచ్చాడు. వాడు కట్టుకున్న ఆకాశ నీలం రంగు చీర,వాడి గచ్చకాయ రంగు కళ్ళలో పడి ప్రతిఫలిస్తూ కళ్ళు వేరే రంగులోకి మారి ఆనందాన్ని మరింత అందంగా ప్రతిఫలిస్తున్నాయి. పచ్చని వాడి శరీరం రంగు,ఆ పెద్ద పెద్ద కళ్ళు,నవాబులకి వుండే కోటేరేసిన ముక్కు.ఆ ముక్కుకు పెట్టిన బులాకి. నాకు మతి పోయింది. వాడు మాట్లాడుతుంటే సన్నటి పదునయిన రేఖల్లా వంపులు తిరుగుతున్న వాడి రంగు పెదాల మీద నా దృష్టి అతుక్కుని పోయింది,వాడి మాటలు నా చెబికి చేరడమే లేదు. చివరికి వాడు అన్నాడు ”నా మీద కోపం లేదు కదా,చెప్పు రంతీ?”అన్నాడు. నేను ఎంత పెకల్చినా గొంతు రాక పోవడంతో తల మాత్రం అడ్డంగా ఊపాను. వాడు ఎంతో సంతోషంతో నా చెయ్యి పట్టుకుని లేపి ”ఛలో చలో మరి బయటికి వెళదాం ,ఇక్కడెందుకు ఇక” అన్నాడు నవ్వుతూ .
మేమిద్దరం బయటకి వచ్చాము. ఆ రోజు నా హృదయం మొదటి సారి పుల్లటి నిమ్మ దబ్బని నోట్లో పెట్టుకున్న పసిబిడ్డలా ఒక్కసారిగా బోలెడు గందరగోళానికి లోనయింది. నా పక్కన నాజూకయిన శరీరంతో,తెల్లటి పాలుగారే ముఖంతో,నల్లటి ముంగురులతో నవ్వుతూ నడుస్తున్న ఆ శరీరం ఆడపిల్లది కాదంటే ఎవరయినా ఎలా నమ్ముతారో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎవరయినా నన్ను ఇలా అజీమ్ తో చూసి మా నాన్నతో ”రంతిని ఎవరో అమ్మాయి తో చూసాం”అంటే అప్పుడు మా అమ్మ నాన్నలకి ఎలా అర్థం చేయించాలి వంటి పలు ప్రశ్నలతో నా మనసు గందరగోళపడి కాసేపు నాకు ఊపిరి తిరగనీయకుండా చేసింది. అంతలోపలే మేము మేళా ప్రాంగణానికి చేరుకున్నాం. అజీమ్ నన్ను ముందే ఆలోచించి పెట్టుకున్నట్లు ఒక చోటకి తీసుకెళ్లాడు. హిందుస్తానీ సంగీతంలో ఘరానాలని ఉంటాయి కదా అటువంటి ఘరానాలలో ఒకటి అది. అక్కడికి ఆ రోజు ఎవరో ప్రముఖ గాయకురాలు కూడా వచ్చి వుంది. అజీమ్ ఆమె పాడుతూ ఉంటే తాళం వేయడం ఆమెతో పాటు రాగం అందుకోవడం చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. ఇవంతా నీకెలా తెలుసురా అంటే వాడు నవ్వి ”ఇష్టముంటే అన్నీ అవే తెలుస్తాయి రంతి”అన్నాడు తత్వ వేత్తలా. కాసేపటికి నన్ను అక్కడనుండి లేపి వాడిలాగే,అమ్మాయిల వస్త్రధారణలో వున్న అబ్బాయిల గుంపు వద్దకు తీసుకెళ్లాడు. వాళ్ళు ఇదమిద్దంగా ఫలానా సంగీతమని పాడటంలేదు. తమకు ఏది వచ్చో దాన్ని పాడుతున్నారు. అక్కడ ఈ సారి అజీమ్ కూడా పాడాడు. టాగోర్ పాట. వాడు ఆ పాట పాడిన రోజు ఆ పాట అర్థం నా మనసుకు చేరలేదు. ఆ తరువాత ఎప్పుడో దానిని పూర్తిగా ఆకళింపు చేసుకునేంత జ్ఞానం వచ్చాక నాకు తెలిసివచ్చిందేమిటంటే,వాడికి ఆ రోజే ఆ పాటకి పూర్తిగా అర్థం తెలుసనీ. ఆ అర్థం తెలిసి పాడాడు కనుకనే ఆ రోజు వాడి చెంపలపై కన్నీరు కాల్వలు కట్టాయని. ”ఎయి కోరేచ్చో భాలో నిటురహే ,నిటురహే” అనే ఆ పాటకు అర్థం ఏమిటంటే,”నీ కార్యం అద్భుతం! ఓ కరుణారహితుడయిన భగవంతుడా!నా హృదయాన్ని తీవ్రాగ్నితో దహిస్తున్నావు, మంచిదే ! /ఈ హృదయ ధూపాన్ని మండిస్తేనే కదా సుగంధం వెలువడుతుంది /నా శరీరాన్ని దహించి వేస్తున్నావు కరుణ రహిత భగవాన్!పరవాలేదు,దహించుకుపోతున్నప్పుడే కదా కాంతులు ప్రసరించగలుగుతుంది”…. ఎప్పుడూ మెరుస్తున్న చెక్కిళ్ళతో నవ్వుతూ కనిపించే అజీమ్ హృదయంలో అంత దుఃఖం ఒకటి ఉండేదని తర్వాతి కాలంలో నా బుద్ధి ఎదిగాక మాత్రమే నాకు తెలిసి వచ్చింది.
ఆ తర్వాతి రోజు అక్కడి నుండి వస్తున్నప్పుడు నా చేతిని తన చేతిలోకి తీసుకుని,తన పెద్ద పెద్ద కళ్ళలో నీళ్లు నింపుకుని వాడు అన్నాడు ”నిన్ను బాధ పెట్టాను,క్షమించురా రంతి!” అని. నాకు ఏం మాట్లాడాలో తోచలేదు కానీ ”అదేం లేదు రా అజీమ్! బాధ ఏం లేదు కానీ ఎందుకురా అట్లాగా?”అన్నాను ఎలా పూర్తి చెయ్యాలో తెలీక. వాడు నవ్వాడు. “నాక్కూడా తెలీదు,అదొక కోరికరా రంతి!అట్లా వుండాలని, ఆపుకోలేనంత కోరిక. త్వరలో ఇంటి నుండి వెళ్లిపోదామని అనుకుంటున్న. నాకోసం ఏడ్చేవాళ్ళు ఎవరున్నార్రా నాకు ?బహుశా నిజాయితీగా చెప్పాలంటే,ఎప్పుడన్నా.. నువ్వు అనుకుంటావేమో, ‘అజీమ్ అని, నాకొక స్నేహితుడు ఉండేవాడు ‘ అని ” అన్నాడు. వాడు చెప్పింది నిజమే రెండేళ్ల నుండి సాగుతున్న మా స్నేహం వాడితో నాకు ఒక అనుబంధాన్ని ఏర్పరచింది. అది నా పైలా పచ్చీసు తిరుగుళ్ళకి వాడు అనుకూలంగా ఉండడం చేత వాడి మీద ఏర్పడ్డ ప్రేమ కాదు. వాడి స్నేహపూర్వకమయిన స్వభావం చుట్టూ నాకు తెలియకుండానే నేను అల్లుకున్నఅనుబంధం.
శాంతినికేతన్ నుండి వచ్చిన తరువాత అజీమ్ తనను తాను నాకు మరింత దగ్గర చేసుకున్నాడు. ఇదివరకటిలా కాదు ఇప్పుడు తనకు నా దగ్గర దాచాల్సిన రహస్యాలేమీ లేవు. పైపెచ్చు ఇప్పుడు తనకు నేనున్నాను, మనసు విప్పి ఏదయినా నాకు చెప్పేయవచ్చు. నేను తిరిగి ఇదేమీ అదేమీ అని ప్రశ్నించను. వాడు తన రహస్యాలను,దుక్కాలను దాచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న రహస్యమైన చోటును నేను. అంతా అలా సాగుతూ వున్నప్పుడు ఒకసారి వాడు, తనకి ఆడవాళ్లపై ఆకర్షణ కలిగే బదులు మగవాళ్లపై కలుగుతుందని చెప్పినప్పుడు మాత్రం ఆ రోజు రాత్రి రాత్రంతా నాకు నిద్ర రాలేదు. ఒకవేళ అజీమ్ నన్నేమయినా ప్రేమిస్తున్నాడేమోనని అనుమానమొచ్చింది. ఆ రాత్రి నా పడక గది కిటికీ నుండి పడుతున్న వెన్నెల ఒక్కొక్క కిటికి కమ్మినీ దాటుకుంటూ వచ్చి,చివరికి అదృశ్యమై, ఆ ప్రదేశంలో ఉదయకాలపు వెలుతురు వచ్చి చేరినా నా ఆలోచన తెమల లేదు.
అజీమ్ నన్ను ప్రేమిస్తున్నానని చెబితే నేనేమని బదులియ్యాలి?. అదీ నను సతమతం చేస్తున్న ఆలోచన. ఆశ్చర్యంగా ఎన్నిరోజులు గడిచినా అజీమ్ ఎప్పుడూ ”నువ్వంటే నాకు అలాటి ప్రేమ” అని ఎప్పుడూ చెప్పలేదు. చివరికి నేనే వుండబట్టలేక ఒకరోజు అడిగాను ”ఏంరా!అజీమ్ నా మీద నీకు అలాటి ఇష్టం ఏమీ లేదా?”అని. అది వినగానే వాడు చాలా ముద్దుగా నవ్వాడు. నవ్వి నవ్వి కళ్ళలో నీళ్లు కారిపోతుండగా ”నాకు, దృఢంగా,బలంగా,మగవాళ్ళంటే ఇలా ఉండాలి అని చెప్తారు చూడు,అలాటి మగ వాళ్లంటే ఇష్టం రంతి, ఆడవాళ్లంటే ఇష్టం కదా అని కనిపించిన వాళ్ళందరూ నీకు నచ్చేయరు కదా! అలాగే ఇది కూడా. నాకు కూడా మనసుకి నచ్చాలి. నువ్వు నాకు స్నేహితుడిగా ఇష్టం,వేరేలా కాదు,భయపడకు! సరేనా?”అన్నాడు. ఎవరికీ తెలియకుండా వాడు కొంత డబ్బు చీటీ పాట వాళ్ళ దగ్గర నెలనెలా కట్టే వాడు. ఆ డబ్బు మాఘ మాసంలో చేతికి వస్తుందని,అది రాగానే ఇల్లు విడిచి వెళ్లి పోతానని చెప్పేవాడు. వాడు ఆ మాట చెప్పింది ఫాల్గుణ మాసంలో కనుక ,ఆ చీటీ డబ్బులు రావడానికి ఇంకా చాలా సమయం వుంది కనుక వాడు వెళ్లి పోవడం పై నేను అంతగా దృష్టి పెట్టలేదు.
అయితే మేము శాంతినికేతన్ నుండి తిరిగి వచ్చాక కొంత కాలానికి వాడొక రోజు హడావిడిగా మా ఇంటికి వచ్చాడు. మేమిద్దరం మామూలుగా వెళ్లే మామిడి తోటకి వెళదామని అన్నాడు. అప్పటికే బాగా పొద్దెక్కింది. ఆ సమయంలో మామిడి తోటకి వెళదామన్నాడంటే వాడి మనసు దేనికో చాలా అలజడికి లోనయింది నాకు అర్థమయింది . నేను పడుకోవడానికి నా గదిలోకి వెళుతున్నానని మా అమ్మ వాళ్ళని నమ్మించి దొడ్డి దారి గుండా బయటికి వచ్చి వీధి చివర నా కోసం ఎదురు చూస్తూ వున్న వాడిని కలుసుకున్నాను. ఇద్దరం కలిసి మామిడి తోటకి చేరుకున్నాం. మామిడి తోట నిండుగా పూత పూసి వుంది. మామిడి పూతలా చుట్టూ తేనెటీగలు ఝుమ్మని తిరుగుతూ ఉంటాయి ఈ కాలంలో. ఇద్దరం మా అలికిడి కానీయకుండా చెరువు కి దగ్గర వున్న మామిడి చెట్టు కింద కూర్చున్నాం. కీచురాళ్ళ తప్ప ఎక్కడా మరేం అలికిడి లేదు. జనాలకి పొద్దుపోయాక టీవీ ముందు కూర్చోవడం అలవాటు గనుక ఊరంతా నిర్మానుష్యంగా వుంది. మేమిద్దరం సర్దుకుని కూర్చున్నాక నేను నెమ్మదిగా అడిగాను ”ఏమయిందిరా అజీమ్,ఎందుకలా వున్నావ్” అని. వాడు మాటల్ని ఏరుకోవడానికి కాసేపు ఆగి,పేర్చుకుని అన్నాడు ”మా అమ్మకి ఆడ పిల్ల పుట్టింది రంతి,ఆ బిడ్డని వచ్చే లక్ష్మి వారం రోజు మా అమ్మ,అమ్మమ్మ కలిసి అమ్మేయ బోతున్నారు”అన్నాడు.
నాకు అజీమ్ ఏం చెబుతున్నాడో బుర్రకి ఎక్కలేదు ”ఏంటీ,ఏమన్నావ్?మళ్ళీ చెప్పు!” అన్నాను. వాడు ఈసారి గుండె దిటవు చేసుకుని పరిష్కారమయిన మాటల్తో వివరించాడు. ”పదిహేను రోజుల క్రితం అజీమ్ తల్లికి ఆడపిల్ల పుట్టింది,ఆ పిల్లని వాడి తల్లి,అమ్మమ్మ కలిపి ఎవరికో ఒక లక్ష రూపాయలకు అమ్మివేయడానికి బేరం కుదుర్చుకున్నారు. ఆ విషయం అజీమ్ కి తెలిసింది”అదీ సారాంశం.
నా వరకు నా ప్రపంచం చాలా భద్రమయిన ప్రపంచం కనుక నేను ఇలా బిడ్డల్ని అమ్మేయడం అనే మాటని ఎవరి ముఖతః వినలేదు. కానీ చాలాసార్లు దినపత్రికలలో చదవడం,టీవీలలో చూడటం చేసి ఉండటం వలన బిడ్డని అమ్మడం అనే ఆ వార్త నాకు ఆ రోజు అజీమ్ చీర కట్టుకున్నప్పుడు కలిగించినంత దిగ్భ్రమ ని కలిగించలేదు. అందుకనే పెద్దగా చలించకుండా ”అసలింతకీ నువ్వేం చెప్ప దలచుకున్నావ్” అన్నట్లు అజీమ్ వంక చూసాను. వాడు నా వంక చూడటం లేదు. ఎక్కడో చెరువు వంక,చెరువు అంచులలో పూసి, చంద్రుని వంక మోరలెత్తి చూస్తున్న కలువల వంక చూస్తూ ”గాలి బుడగల్లా ఉంటాయి బుగ్గలు రెండూ. ఆ బుగ్గలు పొంగేట్లు నిద్దర్లో నవ్వుకుంటుంది అమాయకంగా బుజ్జిగా,ఆ బుజ్జి పాపాయిని అమ్మేస్తారట రా రంతి !. దానికి నేను పేరు కూడా పెట్టాను తెలుసా,ఏం పేరో తెలుసా,అమల్ కాంతి రేఖ” అన్నాడు. అలా అంటున్నప్పుడు వాడి ముఖం వెన్నెల కాంతిలో మెరుస్తూ,చీకటిలో కలిసిపోతూ ఒక రేఖా చిత్రాన్ని నిర్మిస్తూ వుంది. అప్పుడు ఆ కాంతిలో వాడు నాకు ఎందుకనో భూమిపైకి ఎలాగో పొరపాటుగా వచ్చి వేసిన దేవుడి కుమారుడిలా అనిపించాడు. యవ్వనంలో వున్న దేవుడు. అందమయిన దేవుడు. కానీ ఆ దేవుడికి యేమని బదులియ్యాలో నాకు అర్థం కాలేదు. అలాగని మెదలకుండా ఊరుకుని ఉండలేక ”అజీమ్ !నువ్వు నీ చీటీ డబ్బు అందగానే ఇల్లు విడిచి వెళ్లి పోతాను అన్నావు కదరా,మరి ఈ ఆలోచనలంతా నీకు అవసరమే అంటావా” అన్నాను. అజీమ్ ఏమీ మాట్లాడలేదు. ఊరికే అలా కలువల కొలను వంక చూస్తూ కూర్చున్నాడు. రాత్రి చిక్కబడుతూ ఉండగా,అవీ ఇవీ శబ్దాలు మరీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేను వాడినేమీ ఇక కదిలించలేదు. వాడే హఠాత్తుగా లేచి,”పదరా రంతి !మరీ పొద్దుపోతుంది వెళదాం”అన్నాడు.
ఆ తర్వాత కొన్ని రోజులు వాడు కనిపించలేదు. హఠాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం మా దుకాణం దగ్గరకి వచ్చాడు. దాదాపు మూడు గంటల వేళ జుట్టంతా చెదిరి పోయి వుంది. పెదవి పగిలి రక్తం గడ్డ కట్టి అక్కడంతా వాసిపోయి వుంది. మా నాన్న అప్పుడే మధ్యాహ్నం నిద్రకు ఇంట్లోకి వెళ్ళాడు. నేను వాడిని దుకాణం లోపలి కి పిలిచి కూర్చో పెట్టాను. మంచినీళ్లు ఇచ్చాను. మంచి నీళ్లు కొంచెం తాగాక గ్లాసు చేతిలో పట్టుకుని కాసేపు తలవంచుకుని కూర్చున్నాడు. ఆ తర్వాత ”ఆడవాళ్లు అలా ఎలా ఉండ గలరు రా రంతి ?ఈ రోజు అమల్ కాంతి ని కొనుక్కొనే వాళ్ళు ఇంటికి వచ్చేసారు రా. నేను ఇంట్లో లేకుంటే నా బంగారు తల్లి ని అమ్మేసే వాళ్ళే” అని భోరుమని ఏడవటం మొదలు పెట్టాడు. కళ్ళ వెంబడి ముక్కు వెంబడి నీళ్లు కారి పోతున్నాయి. ఎక్కిళ్ళు పెడుతుంటే చాతి ఎగిరెగిరి పడుతుంది. ఎన్నో రోజుల నుండి ఎండల్లో పని చేస్తున్నా వన్నె తరగని ఆ ముఖపు పసిడిదనం అలవిమాలిన దుఃఖం,మెలికలు తిప్పేసేయడంతో కమిలి గులాబీ రంగులోకి మారింది. నేను వాడి దగ్గరకు వెళ్లి వాడిని మొదటి సారి దగ్గరకు తీసుకుని వీపు సవరించడం మొదలు పెట్టాను. ఆ తర్వాత దుకాణం పనివాడికి అప్పగించి వాడిని మా ఇంటి దగ్గర వుండే rmp డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. వాడి మనోస్థితి బాగోలేదని మా ఇంటికి రమ్మని అడిగితే వాడు రాను అన్నట్టు తలవూపి వాళ్ళ ఇంటికి బయల్దేరాడు. నేను వాడిని దింపడానికి అని మొదటి సారి అజీమ్ వాళ్ళింటికి వెళ్లాను.
అజీమ్ వాళ్ళ ఇల్లు రెండంతస్తుల భవంతి. ఆ విషయం వాడెప్పుడూ నాకు చెప్పలేదు. తరువాత నేను తెలుసుకున్నది ఏమిటంటే, ఈ భవంతి వాళ్ళు కొత్తగా అయిదేళ్ల క్రిందట కట్టుకున్న ఇల్లు. వాళ్ళ పాత ఇల్లు కూడా అలాగే వుంది. అజీమ్ తల్లి వేశ్యా వృత్తిలో బాగా సంపాదించింది. వాళ్లకి దేనికీ లోటు లేదు. ఇంట్లో అన్నీ వున్నాయి. డబ్బు కూడా వుంది. ఒక వేళ దేనికయినా లోటు వున్నా కాయకష్టం చేయడానికి అజీమ్ వున్నాడు. మరి ఎందుకని వాళ్ళు బిడ్డని అమ్మాలనుకుంటున్నారు?నాకు అర్థం కాలేదు. అజీమ్ నన్ను హాలు గదిలో కూర్చోబెట్టి లోపలికి వెళ్లి బుజ్జి అమల్ కాంతి ని తీసుకొచ్చాడు. తెల్లటి పొత్తిళ్ళలో హాయిగా నిద్ర పోతూఉంది. అజీమ్ కి వుండే నవాబు తరహా పోలికలు ఒక్కటి కూడా లేవు. మామూలుగా అందరిళ్ళలో వుండే మామూలు పాపలా వుంది. చామన ఛాయ రంగు,నల్ల జుట్టు అంతే. ఆ ఇంటికి వెళ్లి అక్కడ పాపని చూసాక నా మనసులో ఒక సందేహం వచ్చింది. కానీ అప్పుడు అజీమ్ తో నేనేమీ అనలేదు. నేను పాపను చూస్తున్నపుడు అజీమ్ అమ్మమ్మ కాబోలు వచ్చి నన్ను కొరకొరా చూసి వెళ్ళింది. నేను అజీమ్ కి వీడ్కోలు ఇస్తున్నప్పుడు ఇంకొక స్త్రీ బయటకి వచ్చింది. మా అమ్మ అని చెప్పాడు అజీమ్. ఆవిడ అజీమ్ తల్లి అంటే ఎవరూ నమ్మరు. ఆవిడకి ఇప్పుడు 35 సంవత్సరాలు ఉండొచ్చు కానీ అస్సలు అలా లేదు. పాతికేళ్ల కన్నా తక్కువ వయస్సు వున్న అమ్మాయిలా వుంది. ఆ ఇద్దరు ఆడవాళ్లు కలిసి అజీమ్ ని అలా కొట్టారు,బిడ్డని అమ్మేయాలి అనుకుంటున్నారు అంటే నాకు నమ్మ బుద్ధి కాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ‘నువ్వు స్థిమిత పడ్డాక ఒకసారి దుకాణం వైపు కి రా అజీమ్ ! నీతో మాట్లాడాలి’ అని చెప్పి వచ్చేసాను.
అజీమ్ ఆ సాయంత్రమే నన్ను కలవడానికి వస్తాడని అనుకున్నాను.ఎందుకంటే నేనెప్పుడూ అజీమ్ తో ‘నీతో మాట్లాడాలి’ అని ప్రత్యేకంగా చెప్పింది లేదు.నేను అనుకున్నది అజీమ్ కి చెప్పాలని మనసు తహతహలాడిపోతుంది. కానీ అజీమ్ రాలేదు. ఆ రోజే కాదు ఆ తర్వాత దాదాపు నెల రోజులు రాలేదు అజీమ్. నెల తర్వాత ఒకరోజు తారకలాగా ఒక నిమిషం కనిపించి వెళ్ళాడు. ఆ రోజు దుకాణం లో నాన్న నేను ఇద్దరం వున్నాం. దుకాణం నిండుగా కస్టమర్ లు వున్నారు. వాడు కౌంటర్ తలుపు తెరుచుకుని నా దగ్గరికి వచ్చి చేతిలో వున్న అమల్ కాంతి ని చూపించాడు. ఆ పసి గుడ్డును చూడగానే నాకు నేను వాడికి చెప్పాలనుకున్న విషయం జ్ఞాపకం వచ్చింది. ”ఆ రోజు ,ఒకసారి వచ్చి పొమ్మంటే రాలేదేం రా నువ్వు?”అన్నాను. వాడు నవ్వి అమల్ కాంతినే చూసుకుంటూ”నేను ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదురా రంతి !నేను లేకుండా చూసి నా బుజ్జి తల్లిని అమ్మేయాలని చూస్తున్నారు కదా వాళ్ళు” అన్నాడు. నాకేం చెప్పాలో తోచలేదు. సరేలేరా నేనే సమయం చూసుకుని వస్తాను. నీతో మాట్లాడాలి అన్నాను. వాడు ”సరే”అని ఆ బిడ్డని గుండెకి హత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్తున్న వాడిని వెనక నుండి చూస్తూ ఉంటే,ఆ భుజం పై బిడ్డ,ఆ బిడ్డని పొదవి పట్టుకున్న వాడి నాజూకు శరీర భంగిమ, మా ఇంటి ముందరి వేప చెట్టు వాళ్లిద్దరి మీద పరుస్తున్న వెలుగు నీడల వల అంతా కలిపి మొదటిసారి నాకు ”ఆ బిడ్డకి వాడు తల్లి ,అవును వాడు ఆ బిడ్డకి తల్లి ,అందుకే వాడికి ఆ బిడ్డపై అంత ప్రేమ” అనే భావాన్ని మొదటిసారి నా హృదయం నాకు స్ఫురింప చేసింది. అప్పుడు ఇక వాడి తాపత్రయం మొత్తం అంతా తేటతెల్లంగా అర్థమయిపోయింది.
ఆ రాత్రి నేను వాడి ఇంటి వైపు వెళ్లాను. వాడు ”బుజ్జి తల్లి నిద్ర పోతుంది” అనుకుంటూ వచ్చాడు. నేను వాడిని బయటకి వెళదాం వస్తావా అని సాహసం చేసి అడగలేక పోయాను. పసిగుడ్డు వున్నా తల్లి అలాయిబలాయిగా తిరగటం మనమెప్పుడయినా చూశామా?. అందుకని ”సరే మరి కాసేపు నీ గదిలో కూర్చుందామా అన్నాను” వాడు ”వూ” కొట్టి తీసికెళ్ళాడు. ఆమల్ కాంతి రేఖ వాడి గదిలోనే నిదర పోతుంది. ఆ గది మొత్తం ఒక లాటి బిడ్డ వాసన వేస్తుంది. బిడ్డకి సంబంధించిన వస్తువులతో ఆ గది నిండి వుంది. నేను కాసేపు ఆగి ”నేనొకటి చెప్పాలి అనుకుంటున్నారా అజీమ్” అన్నాను. వాడు నా వైపు కి తిరిగి కూర్చుని ”చెప్పరా రంతి !ఏంటది?”అన్నాడు. నేను కొంచెం సందేహంగా ”నువ్వు ఏమీ అనుకోకూడదు ఇలా అంటున్నానని”అన్నాను. వాడు నవ్వి ”నువ్వు ఏమన్నా నేనేమీ అనుకొనురా రంతి,నాకు ఈ ప్రపంచం లో ఇష్టమయిన ఒకే ఒక్క మనిషి ఎవరంటే నువ్వే !అర్థమయిందా ?కాబట్టి ఆలోచించకుండా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు” అన్నాడు. నేను ఈ సారి నసగకుండా చెప్పేసాను ”అజీమ్ మీ అమ్మమ్మ ,అమ్మ వేశ్యలు కదరా. అది మీ కుటుంబ వృత్తి కదా. రేపు అమల్ కాంతి రేఖ పెద్దదయినా అదే వృత్తిలోకి వెళుతుంది కదరా. పాపకి లక్ష రూపాయిలు ఇచ్చి కొనుక్కుంటున్నారంటే వాళ్లెవరో ధనవంతులై వుంటారు. వాళ్ళింటికి వెళితే పాప బాగా చదువుకుని సంతోషంగా ఉంటుందేమోరా,ఆలోచించకూడదా ఒకసారి” అన్నాను. అంత విని వాడు నా చేతిని చేతిలోకి తీసుకుని ”థాంక్స్ రా రంతి ఆమల్ కాంతి గురించి ఇంత ఆలోచించావ్. థాంక్యు సో మచ్ రా!కానీ ఆలోచించు రంతి ఎవరో వచ్చి నీ బిడ్డని రాణి లాగా పెంచుతాం మాకు ఇవ్వు అంటే నువ్వు ఇస్తావా?ఇవ్వవు కదా ?ఇది కూడా అంతేరా. వాళ్ళు ధనవంతులు అవచ్చు. కానీ ఆమల్ నా బిడ్డ. ఆమల్ ని నేను వేశ్యను కానివ్వను. బాగా పెంచి పెద్ద చేస్తాను”. అన్నాడు. నేను నిట్టూర్చి ”కానీ నువ్వు పుష్య మాసంలో ఇల్లు విడిచి పెట్టి వెళిపోతానన్నావు కదరా” అన్నాను. దానికి వాడు బదులిచ్చేలోపే ఆమల్ కాంతి రేఖ లేచి ఏడవటం మొదలు పెట్టింది. వాడు బిడ్డకి పాలు కలపడం మొదలు పెట్టాడు. పక్క గది నుండి పెద్దపెద్దగా అజీమ్ ని తిడుతున్న తిట్లు వినిపించడం మొదలు పెట్టాయి. నేను లేచి నిలబడి ”వెళ్ళొస్తారా ” అని చెప్పి వచ్చేసాను. వాడు నా వైపు కూడా చూడకుండా బిడ్డకి పాలు తాపుతూ ”సరేరా ,జాగ్రత్తగా వెళ్ళిరా” అన్నాడు.
ఆ తర్వాత నేను పుష్య మాసంలో మళ్ళీ అజీమ్ ని చూసాను. ఈ సారి కూడా వాడు వంటి నిండా గాయాలతో వచ్చాడు. పద్మ వ్యూహం నుండి వచ్చిన అభిమన్యుడిలాగా. ఆ సారి వాడిని తన్నించడానికి వాడి అమ్మ ఒక ఉంపుడుకాడిని తోడు తెచ్చుకుంది. బిడ్డని అమ్మితే వచ్చే డబ్బులలో వాడికి కూడా భాగం పెట్టింది. తల్లీ కూతుళ్లు,ఉంపుడుగాడు కలిసి అజీమ్ ని కుళ్లబొడిచారు. చివరికి అజీమ్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అమల్ కాంతి ని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో ఆ డబ్బు తానే ఇచ్చేస్తానని,ఇక బిడ్డ జోలికి ఎవరూ రాకూడదని. అజీమ్ అమ్మమ్మకి తల్లికి అజీమ్ ఆ డబ్బు తేలేడని గట్టి విశ్వాసం అందుకని ధీమాగా ”సరే,రెండు వారాలలో డబ్బులు తెచ్చి ఇస్తే,బిడ్డ జోలికి రాము” అని ఒప్పుకున్నారు. అజీమ్ నాకు అదంతా చెప్పి ”రేయ్ రంతి నువ్వు చెప్పింది నిజమేరా,మా ఇంట్లో పుడితే ఆడ పిల్ల వేశ్య అవ్వాల్సిందే రా,మా అమ్మమ్మ ఏమన్నదో తెలుసా రా,అమల్ కాంతి నాలాగా ఎర్రగా బుర్రగా పుట్టి ఉంటే ఉంచేసుకునే వాళ్ళట. అనాకారి పిల్లని పెంచిన గిట్టుబాటు ఉండదట. అందుకని వదిలించుకోవాలట రా రంతి” అన్నాడు. ఆ తర్వాత ”నా చీటీ డబ్బులు వున్నాయి కదరా అవి తెచ్చి వాళ్ళ ముఖాన కొడతాను. ఇక వాళ్ళు నా బిడ్డ జోలికి రారు” అన్నాడు. నేను ఏమీ బదులియ్యలేదు. వాడే ”నేను వెళుతున్నారా రంతి,నా చీటీ పాడేసి డబ్బు తెచ్చేసుకుంటా” అని వెళిపోయాడు.
ఆ రోజు రాత్రి అనుకుంటా పదకొండు గంటలప్పుడు వచ్చాడు. ”రేయ్ నీకో విషయం చెప్పాలని వచ్చారా,వాళ్ళు ఎవరికీ చెప్పవద్దు అన్నారనుకో,కానీ నాకు ప్రతి విషయం నీకు చెప్పడం అలవాటయింది కదా, ఆ చిట్ ఫండ్ వాళ్ళు అందరికీ డబ్బులు ఎగరకొట్టి పారిపోబోతున్నారు రా రంతి. నేను అనుకోకుండా వాళ్ళ మాటలు వినేసాను. ఆ టైం లో ఎవరూ రారని వాళ్ళు తలుపులు వేసుకుని లోపల మాట్లడుకుంటూ వున్నారు. నేను నా ఆత్రుత కొద్దీ గేటు దూకి లోపలి వెళ్ళాను రా. వాళ్ళు పారిపోబోతున్న సంగతి వినేసాను. నేను విన్నాను కనుక నాకు మొత్తం డబ్బు ఇస్తామని కాలనీ ఎవరికీ విషయం చెప్పొద్దని అన్నారు రా” అన్నాడు.మళ్ళీ వాడే ”కానీ అది అన్యాయం రా రంతీ !తినీ తినక మనుషులు చీటీలు కట్టుకుంటారు కదరా !వాళ్ళ డబ్బులు ఎగరకొట్టి వెళ్ళిపోతాననటం పాపం కదా,కానీ నాకేం తోచటం లేదురా ,నాకిప్పుడు నా డబ్బులు కావాలి ఆ డబ్బులు ఇచ్చేస్తే మా అమ్మా వాళ్ళు నా బిడ్డ జోలికి రారు” అన్నాడు. తగిలిన దెబ్బలతో అలిసిపోయిన ముఖంతో కమిలిపోయి డీలాపడిన ఆ నాటి అజీమ్ ముఖం నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం. అది చెప్పాక వాడు వెళిపోయాడు.
మరుసటి రోజు ఆరు గంటల వేళ నేను ఇంకా సరిగా నిద్ర కూడా లేవక ముందే మా నాన్న గదిలోకి వచ్చి చెప్పాడు. ”నీ స్నేహితుడు అజీమ్ ఆత్మ హత్య చేసుకున్నాడట రా” అని నాకు నిద్ర మత్తులో అర్థం కాలేదు. అజీమ్ ఆత్మ హత్య చేసుకోవడం ఏమిటి ?రాత్రే కదా వాడు నా దగ్గరకి వచ్చి వెళ్ళాడు. అంతా బాగానే వుంది కదా,తనకి ఎంతో ప్రియమైన అమల్ కాంతి రేఖ ను దిక్కు లేకుండా వదిలేసి వాడు ఆత్మ హత్య ఎందుకు చేసుకుంటాడు నాకేమీ అర్థం కాలేదు. హడావిడిగా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాడి తల్లి,అమ్మమ్మ అజీమ్ నిర్జీవ దేహం దగ్గర కూర్చుని వున్నారు. ఆమల్ కాంతి అజీమ్ తల్లి చేతుల్లో వుంది. నాకు హృదయం స్తబ్దుగా అయిపొయింది. మెదడు పనిచేయడం మానేసింది. అక్కడ ఎవరి కంట్లోనూ కన్నీళ్లు లేవు. అజీమ్ తల్లికి సంబంధించిన విటుడు శవాన్ని త్వరత్వరగా ఎత్తుబడి చేయడానికి కావలసిన కార్యాల గురించి అటూ ఇటూ తిరుగుతూ హడావిడి పడుతున్నాడు. అది తప్పించి అక్కడంతా నిశ్శబ్దం.
అజీమ్ కార్యం ముగిశాక ఆ సాయంత్రం నేను ఇంటికి వచ్చి తల స్నానం చేసి పడుకున్నాను . అజీమ్ ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడో నాకు అర్థం కాలేదు. ఏదో జరిగిందని తెలుస్తుంది కానీ ఏం జరిగిందో అర్థం కాలేదు. అమల్ కాంతి రేఖ జ్ఞాపకం వచ్చింది. ఎప్పటికో చాలా సేపటికి మగత వచ్చింది. ఆ నిద్రలో హఠాత్తుగా చాలా చలిగా అనిపించి మెలకువ వచ్చింది. పుష్యమాసపు చలి దినాలు,దుప్పటి కప్పుకోలేదు,కిటికీ తలుపు వేయలేదు అందుకనే మెలుకవ వచ్చిందేమో అనుకుని కిటికీ తలుపులు వేయడానికి కిటికీ దగ్గరికి వెళ్లాను.
ఆ రోజు చూసింది ఇన్ని రోజులయిన నాకు ఈ రోజే చూసినట్లు అనిపిస్తుంది. కిటికీ బయట అజీమ్ నిలబడి వున్నాడు. వాడికి నోట్లో కోరలు వున్నాయ్. కళ్ళు ఎర్రగా,ఉబ్బి వున్నాయ్. జుట్టు చెదిరి నుదురంతా పరుచుకుని వుంది. నన్ను చూసి శాంతిగా స్నేహంగా నవ్వాడు. నేను చూస్తూ ఉండగానే బయటి మంచులో కలిసిపోయి అదృశ్యమయ్యాడు. నాకు ఒక్కసారిగా వళ్ళు జలదరించింది. గడియారం వంక చూసాను. వేకువ ఝాము అయిదు అయింది. ఆ తర్వాతా నాకు నిద్ర రాలేదు. ఆ రోజు మధ్యాహ్నం నాన్న చెప్పేడు అజీమ్ వాళ్ళ అమ్మమ్మ పోయిందని,వేకువనే నాలుగున్నరకి అలా దొడ్లోకి వెళ్లి వచ్చి పడుకున్నదట,పొద్దున్నే లేచి చూస్తే మంచం మీద నుండి కింద పడి పోయి చనిపోయి ఉందట. ఎవరో గొంతుపిసికి చంపారేమో అన్నట్లు నాలుక బయటకి వచ్చి ఉందనీ ఇంకా ఏదో చెప్పాడు నాన్ . నాన్న చెప్పిన సమయం విన్నాక నాకు నేను చూసింది నిజంగా అజీమ్ నే అనిపించింది. అజీమ్ నాకు చెప్పడానికి వచ్చాడు. తను ఏం చేసి వచ్చాడో అలవాటుగా నాకు చివరిసారిగా చెప్పి వెళ్ళటానికి వచ్చాడు. అలా అనుకోగానే నాకు చాలా ఏడుపు వచ్చేసింది. నేను పెద్దగా ఏడవటం మొదలు పెట్టాను. ఎప్పుడూ కఠినంగా వుండే మా నాన్న నా ఏడుపు చూసి నన్ను దగ్గరకు తీసుకున్నాడు నా వీపు తట్టి “ఏంటి కొడుకా !చిన్న పిల్లాడిలా ఇలా ఏడుస్తున్నావేందిరా ,అందరం ఒక రోజు చచ్చి పోయే వాళ్ళమే కొడుకా”అని చెప్తున్నాడు. నాకు అజీమ్ చివరి నవ్వు జ్ఞాపకం వస్తుంది. తను సాధించిన చివరి విజయాన్ని చెప్పిన చివరి నవ్వు.
ఇదంతా జరిగి చాలా కాలమైంది . ఆమల్ కాంతి రేఖ బాగుంది . బడికి వెళ్తుంది . ఆ పిల్ల అమ్మ తన బిడ్డ అజీమ్ చావును ,తన తల్లికి వచ్చిన చావును ఒకేసారి చూడటం వల్ల మనసు చెదిరి జీవితం పట్ల దృక్పధం మార్చుకుని ఉండొచ్చు లేదా మరేదయినా బలమయిన కారణం వుంది ఉండొచ్చు మొత్తానికి ఆమె మేము చదివిన హై స్కూల్ ఎదురుగానే పుస్తకాల దుకాణం ఒకటి తెరిచింది . ఆ దుకాణం పేరు ”అజీమ్ బుక్ స్టోర్”. మీరు మా ఊరొస్తే ఆ పేరు గల బుక్ స్టోర్ మీకు కనిపిస్తే ,గుర్తు పెట్టుకోండి, ఆ అజీమే ఈ కధలో నేను చెప్పిన అజీమ్ !
*
Add comment