నా దేశమెప్పుడూ పావురాల గుట్టే
ఇప్పుడీ నేలపై తుపాకీలు మొలిచాయి.
మతోన్మాద గుళ్ల వర్షానికి
మసీదు మీనారుల ముఖాలన్నీ
అజా దుప్పట్ల మాటున తలదాచుకుంటున్నాయి
అజా అంటే
ఎప్పుడు ఎవరి సొంతమూ కాని కోకిలమ్మ తియ్యని పాట,
హానిచేయడం తెలీని అమ్మతనపు జోలపాట
ముళ్ల దారుల్లో
ఎడారంటి జీవితం దప్పికను ఓడించే నీటిఊట
ఇప్పుడా
అమ్మతనానికి రుజువులు రివాజులు వెతకాలంటావు
తుపాకి గుండ్లతో తడిచిన
నెత్తుటి జెండాలను
మోసుకుని తిరగమంటావు
వంటింట్లో అలసిన దేహాలపైనుండి
జారిపడే చెమటచుక్కల చప్పుడు
నీ చెవులకు ఎప్పుడు వినిపించాయి కనుక
ఆకలి తీర్చే ఆమె కొంగు
ఓ సముద్రాన్ని మోస్తుందని నీవెపుడు గమనించావ్ గనుక
ఇప్పుడా పాలసముద్రాన్ని వీధిలోకి మోసుకొచ్చింది నువ్వే
రేపటి రోజును ప్రశ్నగా మార్చింది నువ్వే
నీ పన్నాగమంతా దేశం ముఖాన్ని
నీ మతం రంగులోకి మార్చడమేగా
నువ్వన్న చోటులో శాంతి గీతాలాపనలు నిషేధం
ప్రశ్నంచడం నేరం
రక్తచరిత్రలో తడిసిన పావురాళ్ల సాక్షిగా
నా దేశమిపుడు
ధృతరాష్ట్రుడి కౌగిలిలో
విలవిలలాడుతున్న మువ్వన్నెలపతాక!!
*
విరుచుకు పడ్డ కలం
ధన్యవాదాలు సర్