అజయ్, నేనూ

గొప్ప ఆశ్చర్యమేసింది. ఆరవ తరగతి చదువుతున్న చిన్న పిల్లాడి వూహాశక్తికి గొప్ప ఆశ్చర్యమేసింది. కుండతో నీళ్లు మోస్తున్న స్త్రీ బొమ్మ, గొర్రెలు తోలుతున్న గొర్రెల కాపరి బొమ్మ, పూలమొక్కలకి నీళ్లు పోస్తున్న పాప బొమ్మ.. చిట్టి చిట్టి చేతులతో ఒక్కో దృశ్యాన్ని మలిచిన తీరు గొప్పగా వున్నాయి. పెన్సిల్ తో వేసి వాటికి రంగులద్దేడు.

వెనక నుంచి నన్ను పట్టేసుకుండు. ఒగల్లే. రెండు చేతుల్ని ముందుకి తీసుకొచ్చి నా నడుం చుట్టూ వేసి అల్లేసికుండు. తలని నా వీపుకి ఆనించేడు. వొగలట్లేదు.

‘ఎవరూ… !’ ఆశ్చర్యమేసింది. ఆనందమూ వేసింది.

నా రెండు చేతుల్ని వెనక్కి మళ్లించి వాడి భుజాల్ని పట్టుకున్ను. ‘ ఎవరు! ‘ అలగ పట్టుకునే తలని వెనక్కి తిప్పేను. కుడికి తిప్పేను. నేను యెడంకి తిరిగితె వాడు కుడికి ముళ్లుతండు. నేను కుడికి తిరిగితె వాడు యెడంకి మళ్లుతండు.

‘ ఎవరు! ‘ యింకా యింకా ఆశ్చర్యమేస్తంది.

నా రెండు చేతుల్ని వాడి తలపైనేసి వీపుకు మరింత అదుముకున్ను. అలగ అదుముకోడం చాలా యిష్టమయింది.

‘ ఎవర్రా… ! ‘ నవ్వేను.

చెప్పట్లేదు.

ఆట బాగుంది.

ఇంకాసేపు ఆట సాగింది.

చివరికి ముందుకొచ్చేడు. వాడి ముఖంలో గొప్ప నవ్వు.

‘ అజయ్.. నువ్వేట్రా…… ! ‘ నా ముఖం నిండా నవ్వు మెరిసింది. వాడూ నవ్వాడు. నవ్వుకి తోడు నా కళ్ల నిండా కన్నీళ్లూ ముత్యాల్లా మెరిసాయి.

చాలా రోజుల తర్వాత పాత బడికెళ్లేను. పిల్లలంతా నా చుట్టుతా గుమికూడేరు. అందరి కళ్లల్లో మెరుపు. నా హృదయం లబ్ డబ్ కొట్టుకోడం మానీసింది.

బడి నుంచి దూరమైన తర్వాత ఏదో వొక కారణం చేత దగ్గరౌతున్న ప్రతిసారి యేదో తెలియని ఆప్యాయత, అనురాగం చుట్టుముడతాయి. ఈ రోజుక్కూడా ఇంకా వాటిలో మునిగితేలుతూనే వున్నాను.

అజయ్ నా నడుం చుట్టూత యెందుకు చేతులేసేడు. నా నుంచి తనేం పొందేడు. తన నుంచి నేనేం పొందేను.

ఎంత గొప్ప జ్ఞాపకం! నాలుగు నెలల తర్వాత కూడా తాజాగా వుంది.

ఇద్దర్నీ అంతగా కలిపిందేమిటి ?

* * *
తరగతి గదిలో ఖాళీ సమయాల్లో పిల్లలేం చేస్తుంటారో గమనించటం ఇష్టం. ప్రత్యేకంగా అందుకోసమే నా పీరిడు లేకపోయినా ఖాళీగా వున్న తరగతిగదుల్లోకెళ్లి నిశ్శబ్దంగా కూర్చుని వొక్కో పిల్లాడ్ని గమనిస్తుంటాను. కొందరు పిల్లలు నిశ్శబ్దంగా రాసుకుంటుంటారు. మరికొందరు పిల్లలు దేనికో వాదులాడుకుంటారు. పెన్ను పోయిందనో, పుస్తకం అవుపడటం లేదనో మిగిలిన పిల్లల పుస్తకాలని చెక్ చేస్తుంటారు ఒకరిద్దరు పిల్లలు. కొందరు పిల్లలు ఏ పని చేయక ఖాళీగా అలా కూర్చుని ఏమాలోచిస్తారో ఆలోచిస్తారు. ఆశగా ఆసక్తిగా – ఒకరిద్దరు పిల్లలు మాత్రం బొమ్మలేస్తూనో, కవితలు రాస్తూనో నిమగ్నమై వుంటారు. వూహల్లో తేలుతుంటారు. అలాంటి పిల్లలు ఆ స్థితిలో వున్నప్పుడు చూడటం మహా ఆనందంగా వుంటుంది.

ఎప్పట్లాగే ఒక ఖాళీ పీరిడ్ లో క్లాస్ లో యే టీచర్ లేపోతే వెళ్లాను. ఎప్పట్లాగే కుర్చీని వొక మూలకి జరిపి నిశ్శబ్దంగా కూచున్నాను. అది ఆరవతరగతి తరగతిగది.

హైస్కూల్లో చేరిన కొత్త పిల్లల్ని గమనించటం మరీ ఆశ్చర్యకరంగా వుంటాది. ఇళ్ల కాడ, ఎలిమెంటిరీ స్కూళ్లలో నేర్చుకున్న కొత్త కొత్త విషయాలని వాళ్లే మనకి మప్పుతారు.

నేను తరగతి గదిలోకి వెళ్లడంతో పిల్లలు నిల్చున్నారు. కూర్చున్నారు. ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. స్కూల్ మొత్తంకి చిన్నపిల్లలు కావటం మూలాన బెరుకుబెరుకుగా కనిపిస్తున్నారు కొందరు. కొందరు నన్ను చూసి ముసిముసిగా నవ్వుకుంటున్నారు. కొందరు పిల్లలు సీరియస్ గా ముఖం పెట్టి రాసుకుంటున్నారు.

” మీరు మాకు తెలుసండీ… ” అని ఒక పిల్లాడు నా దగ్గరికొచ్చి గడుసుగా అన్నాడు. చిన్నగా నవ్వేను.

” ఎలారా… ! ” అన్నాను – ఆశ్చర్యంగా ముఖం పెట్టి.

” రోజూ మా దుంపల బడి ముందు కాంచే యెల్తంటరండీ మీరో.. ” అన్నాడు.

” ఓహో.. అయితే నేను నీకు ముందే తెలుసన్న మాట.. బాగుంది ” అన్నాను.

వాడు ఆనందంతో ఇంకా ఇంకా చాలా చెప్తున్నాడు.

వాడి చుట్టూ నలుగురైదుగురు పిల్లలు గుమికూడేరు.

నలుగురైదుగురు పిల్లల్లో ఒక పిల్లాడు గుండ్రని కళ్లతో, చామన చాయ రంగుతో చేతిలో డ్రాయింగ్ బుక్, పెన్సిల్ తో వున్నాడు.

” నీ పేరేట్రా అబ్బాయ్… ? ” అన్నాను.

” …… అజయ్ ”

” బాగుంది. ఏది డ్రాయింగ్ బుక్ ఇలా ఇవ్వు.. ”

ఇచ్చేడు.

నేను అజయ్ వేసిన బొమ్మల్ని డ్రాయింగ్ బుక్ లో చూస్తున్నంతసేపూ నేనేమంటానోనని నా కాసి,  బొమ్మల కాసి మార్చి మార్చి తదేకంగా చూస్తున్నాడు.

ఒక్కో షీట్ లోని బొమ్మల్ని చూసేను.

అజయ్ ముఖంలోకి చూసేను.

గొప్ప ఆశ్చర్యమేసింది. ఆరవ తరగతి చదువుతున్న చిన్న పిల్లాడి వూహాశక్తికి గొప్ప ఆశ్చర్యమేసింది.

కుండతో నీళ్లు మోస్తున్న స్త్రీ బొమ్మ, గొర్రెలు తోలుతున్న గొర్రెల కాపరి బొమ్మ, పూలమొక్కలకి నీళ్లు పోస్తున్న పాప బొమ్మ.. చిట్టి చిట్టి చేతులతో ఒక్కో దృశ్యాన్ని మలిచిన తీరు గొప్పగా వున్నాయి. పెన్సిల్ తో వేసి వాటికి రంగులద్దేడు.

డ్రాయింగ్ బుక్ తెరిచే వుంచేను. అజయ్.. నావైపే నేనేం చెప్తానోనని… అలా చూస్తూ వున్నాడు.

నా కళ్లు, పెదవులు, నా ముఖమంతా నవ్వింది. ఆ నవ్వు వెనుక అర్థం అవి నాకెంత నచ్చాయోనని.. అజయ్ కి అర్థమైంది. లోలోన మురిసిపోయేడు.

” చాలా సహజంగా వేశావురా అజయ్.. ” అన్నాను.

అజయ్ నవ్వు ముఖం చెదిరిపోలేదు.

అజయ్ భుజం మీద చెయ్యి వేశాను.

” …… మరి నువ్వు శ్రద్ధగా చదువుకోవాలి. చదువుతో పాటూ బొమ్మలూ వేయు. బొమ్మలు వేయటం ఎప్పుడూ మరిచిపోవొద్దు. అవి గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. అలాగేనా.. ? నేను చెప్పినట్టు చేస్తావా?  ” అన్నాను.

” అలగే మేసారూ.. ” అన్నాడు.

నాతో మాటాడుతున్నతసేపూ అజయ్ లో గొప్ప ఆనందాన్ని చూసేను. పిల్లల్ని మనం యెంతగా ప్రేమిస్తే వాళ్లూ మనల్ని అంతగా ప్రేమిస్తారనేదానికి అజయ్ వొక ఉదాహరణ.

” పిల్లలకి ప్రేమ తప్ప ఇంకొకటి తెలియకూడదు ” అని వొక కవి అంటాడు. ఎంత గొప్ప మాట.

* * *
పాఠం చెప్తున్నప్పుడు అజయ్ చాలా ఏకాగ్రతగా వింటాడు. బోర్డ్ మీద ఏదేనా రాస్తే వాటిని శ్రద్ధగా తన నోట్సులో రాసుకుంటాడు. పాఠం మధ్యలో ఏవేనా ప్రశ్నలు వేస్తే ఠక్ మని జవాబు చెప్తాడు. చాలా గడసరి కూడా. పాఠం మీద తిరిగి మనల్నే ప్రశ్నలడుగుతాడు. చాలా జాగ్రత్తగా జవాబునివ్వాల్సి వుంటుంది.

* * *

ఒక రోజు పాఠం చెప్తున్నప్పుడు –

ఎవరో పిల్లాడు ఏదో వస్తువు పోయిందని హెడ్ మాస్టార్ కి ముందే చెప్పడం వలన – పిల్లల్ని బెదిరించాలనే, భయపెట్టి తిరిగి ఆ పోయిన వస్తువును రప్పించాలనే వుద్దేశంతో – హెచ్.ఎం క్లాస్ రూంలోకొచ్చి..

” ఎవర్రా.. దొంగిలించింది?  మర్యాదగా చెప్తారా.. లేదా… నన్నే చెప్పించమంటారా…. ” కోపంగా అన్నారు.

పిల్లలు కిమ్మనలేదు.

ఒకరి ముఖాలు ఒకరు చూసుకోనూలేదు. అసలే చిన్నపిల్లలు.. కళ్లు తేలేసి.. బిక్కచచ్చిపోయేరు.

హెచ్. ఎం –

” తెలుసురా నాకు.. ఎవరు తీసారో తెలుసురా… ఆ హాస్టల్ పిల్లలే మహా దొంగలు.. కర్రకి పని చెప్తే గానీ చెప్పర్రా మీరూ…. ” ఏదో కక్షగా మాటాడినట్టు అన్నారు.

కర్ర తీసుకుని – హాస్టల్ పిల్లలందరికీ చేతులకు అటు ఇటూ కొట్టారు.

హాస్టల్ పిల్లలు ఎందుకో ఏడ్వలేదు.

” చెప్తా.. తర్వాత చెప్తా మీ పని… ” అని హెచ్. ఎం వెళ్లిపోయేరు.

నేను తరగతిగదిలోనే వున్నారు. తరగతిగదంతా నిశ్శబ్దమైపోయింది. ఒక్కరి దగ్గర నుంచి కిక్ మన్న శబ్దం రాలేదు. ఆశ్చర్యమెయ్యలేదు నాకు. చిన్న పిల్లలు బెదిరిపోయేరు. బయపడిపోయేరు.

ప్రేమకి బదులు ద్వేషాన్ని తొలిసారి చూసినట్టున్నారు.

” అజయ్.. ! ” పిలిచేను.

తల దించుకుని వున్న అజయ్ నేను పిలిచీసరికి చూసేడు గానీ పలకలేదు.

గాయపడ్డాడు.

నేనూ గాయపడ్డాను.

తరగతి గదంతా గాయపడింది.

అజయ్ హాస్టల్లో చదువుకుంటున్నాడు. ఎస్.సి. హాస్టల్. స్కూల్లో చదువుకుంటున్న నాలుగొందల మంది పిల్లల్లో ఎనభైతొంభై మంది హాస్టల్ పిల్లలే. అమ్మానాన్నలకు అన్నం పెట్టి బడులకు పంపే స్తోమత వుండదు. అమ్మ వొక్కాడుంటే, నాన్నొక్కాడ – జీవితమే విస్థాపనకు గురయ్యే మనషుల బిడ్డలు. అదీ ఆడపిల్లలయితే వాళ్లతోపాటూ పనులకు తీసికెళిపోడమే. చదువుండదు.

” ఆ.. హాస్టల్ పిల్లలే మహా దొంగలు ” అనే మాట మాటిమాటికి అజయ్ గుండెల్లో గుచ్చుకుంటున్నట్టుంది. గాయపడి విలవిలలాడే పావురం పడే బాధలాంటిది వాడిలో కనిపించింది.

కొద్దిరోజులు అజయ్ ముభావంగానే వున్నాడు. తర్వాత నెమ్మదిగా మునుపటిలా మాటాడ్డం మొదలెట్టేడు.

* * *

మరొకనాడు – తరగతి గదిలో పాఠం చెప్తున్నాను.

ఎవరో వొక నడీడు మహిళ నేను పాఠం చెప్తున్న గది కాడికొచ్చి తలుపుకాడ నిల్చున్నారు.

నా తరగతి గదికాడకి అలా యెవరొచ్చినా నవ్వు ముఖం పెట్టి పలకరించటం రివాజుగా చేసుకున్నాను. అదే పిల్లల తల్లిదండ్రులైతే చాలా గౌరవంతో మెసలుకోవాలని నాకు నేను చెప్పుకున్న పాఠం. ఒక్కోసారి అనాధ స్త్రీలు యిలాగే వస్తుంటారు. చెంకలో పసిబిడ్డనెత్తుకుని వస్తుంటారు. ఎక్కడో దూరాలు వెళ్లాల్సివుంది.. పదో ఇరవయ్యో సాయం చెయ్యండని ప్రాధేయపడ్తారు. బాధేస్తుంది. ‘ అనాధులంతా అశాంతులంతా తీవ్రస్వరంతో దీర్ఘధ్వనితో విప్లవశంఖం వినిపిస్తారోయ్..’ శ్రీశ్రీ కవిత్వపాదం నిజమవటానికి యింకెంత సమయం పడ్తుందో.. !

వచ్చినావిడ నిల్చునే వున్నారు.

” ఎవరు కావాలమ్మా… ! ” అడిగేను.

” అజయ్… ” అన్నారావిడ.

అమ్మ గొంతు విని అజయ్ తన చోటులోనే నిల్చున్నాడు. ముఖంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

” మీ అమ్మ గారొచ్చారు.. వెళ్లురా….. ” అని తలూపేను.

ఎగిరిగంతేస్తాడనుకున్నాను.

అజయ్ అమ్మని హాస్టల్ కి తీసుకెళ్తానన్నాడు. నవ్వి.. తలూపేను.

మర్నాడు క్లాస్ రూంలో –
అమ్మ గారు ఏం పని మీదొచ్చారని అజయ్ ని అడిగేను.

‘ పండుగ పప్పలు ‘ తెచ్చారన్నాడు.

” మరి నాకు… ” అడిగేను.

నవ్వాడు.

ఆనందాన్ని ముఖంలో దాచుకోకుండా మనసు నిండుగా నవ్వుతూ –

” మేసారూ.. మా అమ్మ తెచ్చిన చేగొడీలనూ, సున్నుండలనూ మా హాస్టల్ ఫ్రెండ్సందరికీ పంచీసేనండి.. తిన్నోలంతా చాలా బాగున్నాయిరా అని అన్నారండీ… ” అని అమాయకంగా చెప్పుకొచ్చేడు.

అజయ్ మాటతీరుకి, హాస్టల్లో తను చేసిన పనికి చాలా ఆనందమేసింది.

నలుగురు కలిసి బతకటంలోని ఆనందం పిల్లలకి అలవడాలనుకుంటాను. పక్కవాడి కష్టంలో భాగమయ్యే గుణం పిల్లల్ని గొప్ప మానవులుగా తీర్చిదిద్దుతుంది. హాస్టల్ – వొక సామూహిక కార్యక్షేత్రంగా నాకు కనిపించింది. అజయ్ వాళ్లమ్మగారు తెచ్చిన తినుబండారాలని హాస్టల్ పిల్లలందరికీ పంచడంలో వొక గొప్ప మానవగుణం వుంది. సామూహిక జీవన విధానం హాస్టల్లో వెల్లివిరియడం గొప్ప ఆనందం, ఉత్తేజం.

హాస్టల్ పిల్లలు హాస్టల్ పిల్లలకే సాయం. ఒక పిల్లాడికి గాని ఒంట్లో బాగోపోతే ఆ పిల్లాణ్ణి ఆసుపత్రికి తీసుకునివెళ్లేది వాళ్లే. ఒంట్లో బాగోలేని పిల్లల బట్టలు స్నేహితులే ఉతుకుతారు. ఆరబెడతారు. అన్నం తీసుకొచ్చి తినిపిస్తారు. ఇంటివద్ద తల్లిదండ్రుల వద్దలేని పిల్లలకు ప్రేమానురాగాలను అందించేది తోటి హాస్టల్ పిల్లలే.

ఆలోచిస్తున్నకొద్దీ కళ్లు చెమ్మగిల్లేయి.

అజయ్ భుజం మీద చరిచాను. దగ్గరకు తీసుకున్నాను.

” ఈసారి.. అమ్మ ఏవేనా తెచ్చినప్పుడు… మీ కోసం కొద్దిగా దాస్తానండీ…… ” అన్నాడు.

అజయ్ అలా అనడం నచ్చింది
* * *
ఎన్నెన్ని గొప్ప జ్ఞాపకాలు!

ఆ రోజు.. అజయ్ నా నడుం చుట్టూ ఎందుకు చేతులేసాడో.. నా నుంచి తనేం పొందాడో.. తన నుంచి నేనేం గ్రహించానో…

ఇన్ని రోజుల తర్వాత కూడా జ్ఞాపకాలు ఎందుకు అంత తాజాగా వుంటాయి.

అజయ్ ని నన్నూ, నన్నూ అజయ్ ని అంత గాఢంగా కలిపిందేమిటి – ఇంకా ఇంకా అన్వేషించే ప్రయాణంలోనే వున్నాను.

బాల్యం చిగుళ్లను బతికించుకుంటున్నాను.

బాలసుధాకర్ మౌళి

జూన్ 22, 1987 లో పోరాం గ్రామం, మెంటాడ మండలం, విజయనగరం జిల్లాలో పుట్టాను. ఎనిమిదిన్నరేళ్లుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. సమాజం తరగతిగదిలో సకల అంశాలతో ప్రతిబింబిస్తుందని నా నమ్మకం. కవిత్వమంటే ఇష్టం. 2014 లో 'ఎగరాల్సిన సమయం', 2016 లో 'ఆకు కదలని చోట' కవితా సంపుటాలను తీసుకుని వచ్చాను. కథంటే అభిమానం. మొదటి కథ 'థింసా దారిలో' 2011లో రాశాను. మొత్తం ఐదు కథలు. ఇన్నాళ్ల నా పాఠశాల అనుభవాలను విద్యార్థుల కోణంలోంచి రాజకీయ సామాజిక ఆర్థిక అంశాలను చర్చిస్తూ కథలుగా రాయాలని ఆకాంక్ష. గొప్ప శిల్పమున్న కథలు రాస్తానో లేదో గాని - ఇవి రాయకపోతే వూపిరాడని స్థితి.

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నడుం చుట్టూ చేతులేసి మారాం చేసిన పసి విద్యార్థి స్పర్శ వదలడం లేదు మౌళీ! తొలి ఉపాధ్యాయుడు గుర్తుకు వచ్చింది.

  • కథ చాలాబాగుంది!
    బాల్యపుచిగుళ్ళను బతికించుకోవడం ప్రతి ఉపాధ్యాయుడు చేయాల్సిన పని. అప్పుడే
    చిన్నారులతో పయనం రక్తికడుతుంది. నిజంగా మీరు మంచి ఉపాధ్యాయులు మిత్రమా!

  • మా తెలుగు సర్ …రెడ్డి సర్ గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్ళు.ఇంగ్లీష్ మీడియం లో అటూ ఇటూ కాకుండా కాపాడి ఈ మాత్రం తెలుగు పట్ల ఇష్టాన్ని పెంచింది ఆయనే. తెలుగు క్లాస్ లో కొద్దిమందిమే ఉండేవాళ్ళం.చాలా ఆత్మీయంగా ఉండేవారు. చాలా ప్రోత్సహించేవారు డ్రాయింగ్స్ నీ , పద్య నాటికలనూ .అవన్నీ గుర్తొచ్చాయి. అభినందనలు మంచి మనసుకి ఇలా మాతో పంచుకున్నందుకు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు