ఎనిమిదేళ్ళ క్రితం రోజంతా అనేక పర్వతాలు ఎక్కి దిగి ఎట్టకేలకు సాయంత్రం నేను, జయతి, లోహి, జగదీష్ కుమార్ దామనాపల్లి చేరుకున్నాం. ఆ గ్రామంలోకి ప్రవేశిస్తున్నప్పుడు నాకు వెన్నులో సన్నగా వణుకు పుట్టింది. భయం కూడా కలిగింది. అదే గ్రామం. అవే ఇళ్ళు. ప్రారంభంలో ఉన్న అదే సంపంగి చెట్టు నుండి రాలుతున్న పెద్ద పెద్ద అడవి సంపెంగ పూలు.
బాల్యంలో మేము రెండేళ్ళు నివసించిన ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళాను. ఆ ఇల్లు అలాగే ఉంది. ఒక్కటే వ్యత్యాసం, పై కప్పు గడ్డికి బదులు ఇప్పుడు పెంకులతో ఉంది.
అక్కడ నెమళ్లకు గింజలు వేస్తూ ఒకామె ఇంటి బయట నిలుచుని ఉంది. ఆమె ముఖం సాత్వికంగా, దయాన్వితంగా ఉంది. కరుణతో నిండి ఉంది. “ఆమె సరస్వతి అయి ఉంటుందా!” అనుకున్నాను, ఆమె వదనంలోని grace చూసి.
ఈ సరస్వతి ఎవరని ఆలోచిస్తున్నారా? సరస్వతి నా మొట్టమొదటి ఆప్తమిత్రురాలు. ప్రెసిడెంట్ లింగయ్య గారి ఏకైక కుమార్తె. “ఆమె అందరిలాంటిది కాదు. ఆమె ఎంతో గౌరవనీయమైన అమ్మాయి” అని పదే పదే మనసులో అనుకునేవాడిని. 8 ఏళ్ళ వయసులో గౌరవనీయమైన అనే పదం నాకు ఎలా తట్టింది అనే కదా మీరు ఆశ్చర్యపోతున్నారు! బహుశా అప్పటికే విపరీతంగా బాల సాహిత్యం చదివి ఉండకపోతే నా హృదయంలోని భక్తి భావానికి సరిపోయే పదం దొరకక మౌనంగా ఆమెలోని ఉన్నతమైన ఆ తెలియరాని లక్షణం ఎదుట మౌనంగా మ్రోకరిల్లేవాడినేమో?
ఆ ఆరేళ్ళ గిరిజన పిల్ల నడిచే దీపంలా ఉండేది. అందరిలోనూ లేనిదేదో ఆమెలో ఉండేది. ఏదో తెలియని దివ్యత్వం. ఎంతో గౌరవనీయంగా, హుందాగా, ఔన్నత్యం గల వ్యక్తిత్వం ఉన్న అమ్మాయిలా నాకు తోచేది. అది నిజం కూడా. అప్పటికి నాకు స్నేహితులు, స్నేహితురాళ్ళు ఉన్నప్పటికీ ఇంకెవరూ ఆమెలా ఉండేవారు కాదు. మిగతా వారితో ఆడుకోవడం మాత్రమే ఉండేది. అంత వరకే…కాని సరస్వతి వ్యక్తిత్వం వేరు. ఆమె దేహ కదలికలు నిమ్మళం. మాట తీరు మధురం. ఎంతో మృదువైన, అర్థవంతమైన సంభాషణలు చేయడం ఆమె ప్రత్యేకత. ఏ విషయమైనా చాలా బాగా అర్థం చేసుకునేది. నెమళ్లకు ఇష్టంగా ఆహారం పెట్టడం ఆమె ప్రధాన వ్యావృత్తి.
ఆమె నా మొదటి శ్రోత, పాఠకురాలు, అభిమాని. ఆమె ఎంతో తెలివైనది. నేను చెప్పే జాతక కథలూ, రష్యన్ జానపదాలూ, కాశీ మజిలీ కథలూ, యూరోపియన్ జానపదాలూ, భేతాళ కథలూ, విశాఖపట్నం జగదాంబలో నేను చూసిన హాలీవుడ్ చిత్రాల కథలూ, ఇంకా నా స్వంత కథలూ…ఒకటేమిటి, అన్ని కథల్నీ ఆమె అంతే శ్రద్ధగా వినేది. అలా వింటున్నప్పుడు ఆమె ముఖంలోని ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని, వ్యక్తమయ్యే అనుభూతుల్ని చూడడం నాకు ఇష్టం. వాటిని చూడడానికే ఆమెకు అన్ని కథలు చెప్పేవాడిని. కథలను ఆమె అర్థం చేసుకునే విధానం, అనుభూతి చెందే విధానం లోతుగా ఉండేది. ఇతర స్నేహితులు ఎవరూ నా కథల్ని వినడానికి ఆసక్తి చూపేవారు కాదు. అటువంటి సంస్కారం ఎవరిలోనూ ఉండేది కాదు.
నాకు అందమైన కొత్త కొత్త ప్రదేశాలు చూపించడం సరస్వతికి ఇష్టంగా ఉండేది. ఒకసారి నేను చెప్పిన ఒక కథలోని కొరివి దయ్యాన్ని వెతుకుదాం అని ఆమె నన్ను అడిగింది. మేము ఒక వారం రోజులు అడవిలో కొరివి దెయ్యం కోసం వెతుకుతూ తిరిగాము. చివరికి మాకు కొరివి దెయ్యం కనిపించింది. వేటకు వెళ్ళి చీకటిపడే వేళకు దీపంతో అడవి నుండి తిరిగి వస్తున్న ఒక వ్యక్తిని మేము కొరివి దెయ్యంగా భావించి అంతులేని విజయోత్సాహంతో ఆ సాహస యాత్రను ముగించాము. ఇద్దరు స్వాప్నికులు కలిస్తే లోకం మరింత రంగులమయమవుతుంది. మరిన్ని పుష్పాలు వికసిస్తాయి. మరిన్ని సీతాకోక చిలుకలు గాలిలో ఎగురుతాయి.
ఒకే ఇంట్లో పక్కపక్క గదుల్లో ఉండే వాళ్ళం. ఉమ్మడి వరండాలో ఒక డస్క్ ఉండేది. సాయంత్రం చలి మొదలవగానే ప్రెసిడెంట్ గారు ఆయన ఇంటిలోని వెదురుతో చేసిన, చుట్టూ ఆవు పేడ పూసి గాలి చొరకుండా మూసివేసిన, పీపాలాంటి ఒక గాదెను పగలగొట్టి, బాగా ముదిరిన మొక్కజొన్న కంకులను బయటకు తీసి గింజలను ఒలిచి నీటిలో వేసి, పచ్చిమిరపకాయలు, రాతి ఉప్పు, కొన్ని మూలికలు కూడా వేసి, కుండలో బాగా మరిగించేవారు. ఆ జావ ఏ అర్థరాత్రో పొయ్యిలోని మంట కొడిగట్టి పెరిగిన చలికి నిప్పులు చల్లారే వరకూ మరుగుతూనే ఉండేది. రాత్రి 10 గంటల వరకూ కబుర్ల కోసం వచ్చిన వారందరికీ సొరకాయ డొప్పల్లో ఆ వేడివేడి మొక్కజొన్న జావ వేసి తాగిస్తూనే ఉండేవారు ప్రెసిడెంట్ లింగయ్య గారు.

సరస్వతి, నేను సొరకాయ డొప్పల్లో వేడివేడి సెగలుగక్కే ఆ జావను తెచ్చుకొని డెస్క్ మీద పెట్టుకుని, చలికి వణుకుతూ, వేడి కోసం కొద్ది కొద్దిగా తాగుతూ అలా కూర్చుని, ఆ చలిలో అర్ధరాత్రి వరకూ కబుర్లు చెప్పుకునే వాళ్ళం. నేను చెబుతుంటే ఆమె అలా ఎంతో శ్రద్ధగా, ప్రేమగా వింటూనే ఉండేది. అటువంటి దయాళువుతో స్నేహం బాల్యంలో ఒక వరం.
నెమళ్ళకు ప్రేమగా గింజలు వేస్తోంది కాబట్టి ఆమె సరస్వతియే అని ఉంటుందని నా మనసు చెబుతోంది. ఆమె సరస్వతి అయితే ఎంత బాగుణ్ణు అనుకున్నాను.
ప్రాథమికమైన పరిచయాల తర్వాత ఆమె పేరు సరస్వతి అవునో కాదో అడిగి తెలుసుకోవాలని అనుకున్నాను. ఇంతలో గ్రామస్తులు పెద్ద ఎత్తున నా దగ్గరికి వచ్చి పట్టరాని సంతోషంతో నన్ను దగ్గరికి తీసుకున్నారు. నన్ను చిన్నతనంలో చూసిన స్త్రీలు వంగి నా చేతులను వాత్సల్యంతో ముద్దాడారు. వార్త తెలిసిన గ్రామస్తులు పొలాల్లో నుండి పరుగుపరుగున నన్ను చూడ్డానికి వచ్చారు. ఇన్ని దశాబ్దాల తరువాత కూడా వారి జ్ఞాపకాల్లో నా చోటు చెక్కుచెదరకుండా అలాగే ఉంది. నగరాల్లో జ్ఞాపకాలు అన్ని సంవత్సరాలు చెదిరిపోకుండా మిగిలే అవకాశం లేదు. ఒకవేళ జ్ఞాపకాలు మిగిలినా వాటిలో ఉద్వేగం, జీవం, ప్రేమ ఉండవు. ఎందుకంటే నగరాల్లో మనసు అనవసరమైన విషయాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది. అనుభూతికి కావలసిన చోటు అక్కడ లభించడం దుర్లభం.
ఆ గ్రామస్తులంతా మరణించే వరకూ నా జ్ఞాపకాలు వారి హృదయాల్లో సజీవంగా ఉంటాయి. ఒకనాడు వారితో పాటూ అవి కూడా మరణిస్తాయి.
ఎనిమిది ఏళ్ళ బాలుడి పట్ల ఇన్ని దశాబ్దాల తరువాత కూడా వారి హృదయాల్లో ఇంత ప్రేమ ఉండడం ఎంత అద్భుతం! వారి జ్ఞాపకాలు ఇంత స్పష్టంగా, స్నిగ్ధంగా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడం ఎంత గొప్ప విషయం!
సరస్వతి ముఖంలో సంతోషం. నేనెవరో ఆమెకు తెలుసు. ఆమె సరస్వతియో కాదో నాకు తెలియదు. కొంతసేపటి తర్వాత గ్రామస్తులు నా వద్ద సెలవు తీసుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు.
“మీ పేరు సరస్వతియే కదా!” అని అడిగాను.
నా చిన్ననాటి స్నేహితురాలు నవ్వుతూ తల ఊపింది. ఇన్ని దశాబ్దాల తరువాత కూడా నన్ను గుర్తుపట్టింది. కాదు, కాదు అసలు నన్ను మర్చిపోతేనే కదా? మా బాల్యానికి సంబంధించిన ఉమ్మడి జ్ఞాపకాలలో ఒక్కదానిని కూడా ఆమె మర్చిపోలేదని తరువాత ఆమె మాటల్లో తెలిసింది.
నేను ఆమెను పేరు పెట్టి పిలిచేసరికి “ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నా పేరు గుర్తుందా?” అంటూ భావోద్వేగభరితురాలయ్యింది. ఆమె భర్తను, స్కూలు నుండి వచ్చిన పిల్లలను పరిచయం చేసింది. ఆమె భర్త రెండు మూడు తరగతుల్లో నా సహ విద్యార్థి. అప్పుడు ఆమె ఒకటో తరగతి చదివేది.
అదే సరస్వతి. అదే ఆత్మీయత. ఇన్నాళ్ల తర్వాత కూడా అలాగే ప్రేమగా మాట్లాడింది. చిన్ననాటి విషయాలను నేను చెబుతుంటే పట్టరాని ఆనందంతో మురిసిపోయింది.
నా కుక్క పిల్ల సోనీని పక్క గ్రామంలోని ఒక సహృదయుడు పెంచుకున్నాడనీ, చాలా ప్రేమగా చూసుకున్నాడనీ, 13 ఏళ్లు అది తన పూర్తి జీవితాన్ని సంతోషంగా గడిపి మరణించిందనీ ఆమె చెప్పినప్పుడు నా హృదయం బరువెక్కింది. అది ఆనందమో, దుఃఖమో తెలియదు. దాన్ని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చినందుకు నేను ఎన్ని ఏళ్ళు దిగులుతో కుమిలిపోయానో నాకు మాత్రమే తెలుసు.
ఇక నా ప్రియమైన గుర్రం ఏడేళ్లు మాత్రమే జీవించింది ఆమె అని చెప్పినప్పుడు గుండెలోని సన్నటి తీగల్ని ఎవరో బయటకు లాగి పుటుక్కున తెంపివేసినట్టు దుఃఖం కలిగింది.
నా అందమైన సోనీని ఎవరో ఎత్తుకుపోయినప్పుడు నేను ఎంతలా ఏడ్చానో గుర్తుకు వచ్చింది. నా దుఃఖం చూడలేక నాన్న గారూ, ప్రెసిడెంట్ లింగయ్య గారూ, మరి కొంతమందీ కలిసి విల్లంబులతో బయలుదేరి ఆ ఎత్తైన పర్వతాలలో అదృశ్యమయ్యారు. దుర్గమమైన అరణ్యాలను జల్లెడ పట్టారు. ప్రతి గూడెంని శోధించారు. 3 రోజుల తరువాత నాన్న గారు కుక్క పిల్లతో తిరిగి వస్తుంటే ఆ దృశ్యాన్ని చూసినపుడు నా ఆనందం వర్ణనాతీతం.
“She is my childhood friend” అని లోహికి సరస్వతిని పరిచయం చేశాను.
సరస్వతి డిగ్రీ చదివింది. అంగన్వాడి టీచర్ గా పని చేస్తోందట. ఆమె వ్యక్తిగత వివరాలను నేను ఎక్కువ అడగలేదు. ఆమె చెప్పనూ లేదు. నేను కూడా నా వివరాలను ఆమెకు చెప్పలేదు. ఆమె అడుగనూలేదు. బహుశా వాటికి ఆమె గానీ, నేను గానీ అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదనుకుంటాను.
సరస్వతి నేను చెబుతున్న చిన్నప్పటి విషయాలను ఎప్పటిలా అంతే శ్రద్ధగా, ఆసక్తిగా వింటోంది. మధ్యలో ఒకటి రెండు ప్రశ్నలు అడుగుతోంది. కొన్ని సంఘటనలను గుర్తు చేస్తోంది. వయసు ఎంత పెరిగినా మనం అదే మనుషులం! ఒక్కటే తేడా అప్పుడు “నువ్వు! నువ్వు!” అని సంబోధించుకునే వాళ్ళం. ఇప్పుడు “మీరు! మీరు!” అని సంబోధించుకుంటున్నాము. అది తప్ప వేరే తేడా ఏమీ లేదు.
నిజానికి మనుషులు ఎదగరు. కేవలం తమ స్వచ్ఛ హృదయాలకు దూరమవుతారు. హృదయం నిండా చెత్తను పోగేసుకుంటారు. కాని నాలాంటి వాళ్ళు, సరస్వతి లాంటివాళ్ళు, ఎప్పటికీ బాల్యంలోనే ఉండిపోతారు. అందరిలా ఎప్పటికీ ఎదగలేరు. బాల్యాన్ని మర్చిపోలేరు.
ఆమెతో మాట్లాడుతూ ఉండగానే నల్లని మేఘాలతో ఆకాశం నిండిపోయింది. కాంతి క్షీణించింది. “మనం బయలుదేరడం మంచిది” అని జయతి చెప్పడంతో సంభాషణను అర్ధాంతరంగా ముగించి సరస్వతి వద్ద సెలవు తీసుకుని వచ్చేసాను.
హృదయం దిగులుతో నిండిపోయింది. సంభాషణ అర్ధాంతరంగా తెగిపోయింది.
ఇదంతా జరిగి ఇప్పటికి ఎనిమిది ఏళ్ళు గడిచిపోయాయి. నా స్నేహితురాలిని మరలా నేను చూడలేదు. ఈ రోజు వరకూ తిరిగి ఆ గ్రామానికి వెళ్ళలేదు. ఈ రోజూ వెళ్ళలేదు. ఆ గ్రామంలోని అడవి సంపెంగ చెట్టు వద్దకు వెళ్ళి వెనక్కు వచ్చేసాను.
చింగిస్ ఐతమాతోవ్ నవల ‘తొలి ఉపాధ్యాయుడు’ లో altynai తన తొలి ఉపాధ్యాయుడు duishen ని కలుసుకోకుండానే దూరం నుండి చూసి వెనక్కి వచ్చేస్తుంది. అచ్చంగా ఆ రైల్లో నగరానికి తిరిగి వెళుతూ దిగులు హృదయంతో విలవిలలాడిన altynai లాగానే, “అతడిని చూడడానికి ఎప్పటికైనా తిరిగి వస్తాను. అతడిని కలుస్తాను, అతనితో మాట్లాడుతాను” అని ఆమె మధనపడుతూ అనుకున్నట్లుగానే, నేను నర్సీపట్నం తిరిగి వెళుతూ నాలో నేను అనుకున్నాను.
“ఏదో ఒక రోజు తిరిగి ఈ గ్రామానికి వస్తాను. సరస్వతితో ఒక రోజంతా తనివితీరా మాట్లాడుతాను.”
బహుశా తరువాతి కాలంలో altynai తిరిగి ఆ గ్రామానికి వెళ్ళి, తన ‘తొలి ఉపాధ్యాయుడు’ duishen ని కలిసుంటుందని అనుకోను. బహుశా నేను కూడా అంతేనేమో!
కారణం నాకు తెలియదు, అచ్చం altynai కి తెలియనట్లే!
*
Wow .. శ్రీరాం అద్భుతంగా రాశారు . 😍