అచ్చంగా రాయలసీమ బిడ్డ…

నిఖార్సైన రాయలసీమ తనమే కథకుడిగా కేతు విశ్వనాథరెడ్డి గారి వ్యక్తిత్వం.  నేరుగా మాట్లాడటం. నిర్మొహమాటంగా వ్యవహరించడం ఆయన శైలి . అందుకు ఉదాహరణ గా ఒక విషయం చెప్పొచ్చు , 2013 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయాక, కేతు విశ్వనాథరెడ్డి గారు హైదరాబాద్ వదిలేసి కడపకు వచ్చేసాడు . ఆ విషయం గురించి అడిగితే , ” వాళ్లొద్దన్నాక  వాళ్ల మధ్యా ఎందుకుండాలమ్మా , మన ప్రాంతంలో మనం వుండాల కదా…” అన్నాడు.  ఎంతో ఆత్మగౌరవం ధ్వనించిందా మాటల్లో. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లినట్లు  లేదు.

మరణం దాకా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్ లోనే వుండిపోయాడు.  కడప కేంద్రంగా  సీపీ బ్రౌన్ లైబ్రరీలో  ఎన్నో సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటూ స్థానీయ సాంస్కృతిక ప్రతినిధిగా నిలబడ్డాడు. ఎందరో  సాహిత్య వేత్తలకు స్ఫూర్తి గా నిలిచాడు. ఈ విశిష్టత తన కథల్లో కూడా కన్పిస్తుంది. కథనంలో వస్తు ఎంపిక లో యీ కొట్టొచ్చినతనం కన్పిస్తుంది .  తను అధ్యాపకుడూ పరిశోధకుడూ అయినందు వల్ల విషయం యొక్క విశిష్ట కోణం నుంచి వస్తువును ఆవిష్కరించడం , నిర్వహించడం చేసాడు . అదే విమర్శకుల నుంచి ప్రశంసలకు కారణం మయ్యింది.

‘వానకురిస్తే’ కథ 1971 లో రాసాడు . ఆ కథలోని రైతు పాపయ్య అతని కొడుకు మల్లయ్య , యిద్దరూ కరువు వ్యవసాయం చేస్తూ కూడా, ఎట్లయినా అప్పు తీర్చాలనే ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తారు. అదొక్కటే కాదు యీ కథలో విశిష్టత యేమంటే , రాయలసీమ కు అత్యవసరంగా కావాల్సిన డిమాండ్లను పట్టాభి అనే నిరుద్యోగి తో చెప్పించడం.
” యీ చెక్క భజన్లు చేయడం కంటే మంచి పని చెయ్య కూడదా? యింతకు ముందు చేసిన భజనలు చాలవా? యితర దేశాల్లో యిన్నూరు మున్నూరడుగుల లోతు నుంచీ నీళ్ళు బయటికి తెస్తున్నారు, తాలూకాకు పది రిగ్గులు దించమను. అగ్గువగా   బావులు తవ్వించమను. పోనీ మన చెరువును మర్యాదగా కట్టి వుంటే కనీసం బావుల్లో నైనా నీళ్లుండక  పోయేవా,  పోసిన మట్టి కొట్టుకొని పోతుంటే దీన్ని పట్టించుకోరు, ఆ    చెరువే వుంటే, ఆ గండికోట ప్రాజెక్టు కట్టివుంటే , పోనీ తుంగభద్ర యెగువ కాల్వ వచ్చి వుంటే మనకిన్ని బాధలుండేవా?..” అంటాడా యువకుడు.

డెబ్బైల దశకంంలోనే యీ డిమాండ్ చేయగలిగాడు కేతు విశ్వనాథరెడ్డి గారు. తర్వాత కాలమంతా రాయలసీమ యిలాంటి డిమాండ్లను చేస్తూనే వస్తూంది.

‘జప్తు’ కథ 1972 లో రాసాడు . భూమి శిస్తు కట్టడానికి జత కోడె ఎద్దల్ని అంకిరెడ్డి అనే వడ్డీ వ్యాపారికి అమ్ముకుంటాడు రైతు గంగయ్య . అతని కొడుకు శివుడు బియీడీ చేసిన నిరుద్యోగి యీ కథలో యాంగ్రీ యెంగ్ మాన్ గా రెబెల్ గా కన్పిస్తాడు .’ లక్షలూ కోట్లూ పన్నులెగవేస్తే అడిగే దిక్కులేదు గానీ నోరూవాయీ లేని బక్క రైతుల మీద మాత్రం అధికారులు పడతారని ఎద్దేవా చేస్తాడు . అంతటితో ఆగకుండా మొత్తం వ్యవస్థ లో వున్న మూలం గురించి మాట్లాడుతూ, ” యింత తెలివిగా వుచ్చులు బిగించారే – ఆ మహా నాయకులందరూ కలకాలం అధికారంలో వుండాలనీ అంకిరెడ్లకు తోడ్పడాలనీ మొక్కుకోండి. ఆ మొక్కుకోవడం యే తిరుపతిలోనే అయితే యింకా బాగుంటుంది. ఈ  లోపల మేము యే రాక్షసులుగానో తయారైతే చూసి సంతోషిద్దురు గానీ..”  అంటాడు.

యువకులు ‘రాక్షసులుగా ‘ మారడమనే వైయ్యక్తిక, సామాజిక విధ్వంసకత్వం రాయలసీమ లో ఒక వైపు ఫ్యాక్షన్ గా మరో వైపు విప్లవ దళాలుగా మారడం మనం చూసాం . దాన్ని పసిగట్టడం రచయిత విశిష్టత.

‘గడ్డి’ కథ 1981 లో రాసాడు. ఈ  కరువు కథలోని అచ్చమ్మ, ఒక పేద స్త్రీ . వూర్లోని పెత్తందార్లకు యీమె బహిరంగంగా తిరగబడడం,  మునసబుకు వ్యతిరేకంగా ఫ్యాక్షన్ కట్టొచ్చని కొందరు ఆలోచించడం కథలోకి సహజంగా వచ్చాయి. గడ్డిని కేవలం పశువుల మేత సమస్యగానే మిగల్చకుండా సామాజిక చైతన్య సంకేతంగా పరిగణించి రాయడం రచయిత విశిష్టత.

ఇక ‘ నమ్ముకున్న నేల ‘ కథ (1982) విశ్వనాథరెడ్డి గారు రాసిన కథల్లోకి విశిష్టమైన కథ .  ఇదొక తడి లేని మనుషుల, తడి అందని భూముల కథ.  ఊర్లో వున్న రెండెకరాల భూమినమ్ముకోవడానికి వచ్చిన కథకుడికి తన దగ్గరి బంధువైన వీరన్న పతనం, మరో బంధువు మునిరెడ్డి అవకాశ వాదం , దళారీ సుబ్బారాయుడి  జిత్తులమారితనం అవగతం చేయిస్తూ రాయలసీమ పల్లెటూరి దైన్యం చెప్తుందీ కథ. అంతటితో ఆగకుండా అభివృద్ధి అనే ప్రక్రియ యెక్క విశ్వరూపాన్ని కూడా చూపిస్తుందీ కథ. పారిశ్రామికీకరణతో  పల్లె భూములు ఫాక్టరీలకు క్వారీలుగా మారడం , రైతులు కూలీలుగా మారడం జరుగుతుందని , అక్కడ ఆకాశం సిమెంటూ ఎముకల పొడి కలిపిన రంగులో వుంటుందని చెప్పడం ద్వారా అభివృద్ధి స్వభావాన్ని వివరిస్తుంది.

వ్యవసాయ, వ్యవసాయేతర భూములు క్వారీలుగా మారడం ఒక అభివృద్ధైతే , అలాంటి భూముల్లో కొంత పేదలకు యిల్లపట్టాలుగా మార్చాలని ప్రయత్నించిన సిధ్ధారెడ్డి అనే ఫ్యాక్షననేదే  లేని నాయకుడ్ని హత్య చేసే కథ ‘మాయపొరలు’  . తండ్రి హత్యను స్వప్రయోజనాలకు వాడుకునే కొడుకులూ వున్నారీ కథలో . చిన్న కొడుకు వైపు నుంచి కథ నడుపుతాడు కథకుడు. ఆ చిన్న కొడుకు ఫ్యాక్షన్ రాజకీయాల మూలాల అన్వేషణలో మునిగిపోయినట్లు చెప్తూ కథ ముగుస్తుంది.  తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాలతో ఫ్యాక్షన్ ను ముడిపెట్టుకున్న రాయలసీమ వారసుల ఆటగా కథను చెప్పడం , ఫ్యాక్షన్ కథల్లో విశిష్ట కోణం.

‘కూలిన బురుజు’, ‘స్వస్తి ‘ లాంటి ఫ్యాక్షన్ కథలను కేతు విశ్వనాథరెడ్డి గారు రాసి వున్నప్పటికీ ‘ మాయపొరలు ‘ కథ వర్తమాన పరిణామాలను పట్టుకున్న విశిష్ట కథ.

కేతు విశ్వనాథరెడ్డి గారు ‘ ఒక జీవుడి వేదన ‘ ( 1997) అనే కథ రాసాడు . ఈ కథలోని కథకుడిని మధ్య తరగతి మనుషుల్లో అప్పుడప్పుడూ తలెత్తే అశాంతి బాధిస్తూంటుంది . ఒకానొక ఒంటరితనం వెంటాడుతూ ఉంటుంది. శ్రమను నమ్మే , భౌతిక వాస్తవికతలో జీవించే అతని భార్య భూదేవి తో  దాన్ని పంచుకున్నప్పుడు, ‘ మన వేదాంతులు ఆత్మాన్వేషణ అంటారు కదా, ఇంకా కొన్నాళ్ళు మధనపడు నీకే తెలుస్తుంది ‘ అంటుంది. ఈలోగా సాహిత్య జీవి అయిన యీ కథకుడు , దయానిధి అనే నవలా రచయిత నవలల మీద ఒక వ్యాసం రాసి అతని దృష్టిలో పడి , అతడిని ఒక సాయంత్రం మందుపార్టీలో కలుస్తాడు . (ఈ దయానిధి  చివరికి మిగిలేది నవల రాసిన బుచ్చిబాబు గా మనకు తోస్తుంది) మనిషికి ఏది సుఖం అనే విషయం మీద  కథకుడు దయానిధి నవలలోని అన్వేషణ గురించి అబ్బురంగా ప్రశ్నిస్తాడు.

అందుకు సమాధానంగా, ‘అందంగా నీ అంతశ్శక్తి ఎటుమళ్లిస్తే అటు జీవించటమే ఒక గొప్ప కళ’ అంటాడు దయానిధి. మరి జీవితంలో మార్పులు ఎందుకు వస్తున్నట్లు అని అడుగుతాడు కథకుడు. మార్పులన్నీ అసంబధ్ధమైనవే అని  అర్థంపర్థం లేని సమాధానంతో చర్చ ముగిస్తాడు దయానిధి.  ఇదే విషయాన్ని భూదేవి తో పంచుకున్నప్పుడు , ఆ శుష్క వేదాంతాన్ని కొట్టి పడేస్తుంది . చాలా  నిష్కర్షగా మీవన్నీ సుఖజీవుల అన్వేషణలని ( సుఖం మరగిన దాసప్ప పదం మరిచిపోయాడంటారని) తేల్చిపారేస్తుంది . దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న తన తల్లినీ , వదిననూ ఉదాహరణగా చూపిస్తూ , ఏ అంతశ్శక్తులు వాళ్లను బతికేలా చేస్తున్నాయో ఆలోచించమంటుంది. అప్పుడు కథకుడికి తన అశాంతి మూలాలు తన దుర్భరమైన బాల్యంలోనే వున్నాయనే సత్యం తెలిసివస్తుంది.

ఇట్లాంటి శుష్కమైన వేదాంతాలే వళ్లిస్తూ జీవిత వాస్తవికతను మరచి దగా చేసే మనుషులను తన ‘సతి’కథలోనూ  బోనులో నిలబెడతాడు కేతు విశ్వనాథరెడ్డి.

సతి (1992) కథలో  నారాయణ రెడ్డి సంసారాన్ని వదిలేసి సన్యాసుల్లో కలిసి సాధు నారాయణ గా దేశ సంచారి అయిపోతాడు. భార్య ఈశ్వరమ్మ బిడ్డను తన కూలీ కష్టంతో పెంచుకుంటుంది. ఉన్నదున్నట్టుగా వూర్లోకి వూడిపడ్డ సాధు నారాయణ , వూరవతల కొండ మీద ఆశ్రమం యేర్పాటు చేసుకున్నాడు. ఊర్లో ఈశ్వరమ్మ వుంటున్న ఇంటిని అమ్మి ఆ డబ్బు  ఆశ్రమానికి పెట్టాడు.

నిరాశ్రయమైన ఈశ్వరమ్మ బిడ్డను తీసుకెళ్ళి , భక్తుల ఎదురుగా సన్యాసిని కడిగి పారేస్తుంది. పెండ్లిండ్లు  చేసుకోకుండా మీ వేదాంతాలు మాట్లాడండి. ముందు యీ బిడ్డ బతుకేంగావాలో చెప్పండని నిలదీస్తుంది. తాను మతం తీసుకుని మాలిండ్లలో వుంటూ బిడ్డ ను క్రిస్టియన్ స్కూల్లో చదివించుకుంటానని తెగేసి చెప్తుంది. నిష్క్రియా పరులైన పురుషుల మెట్ట వేదాంతాల నోట మాట లేకుండా చేస్తుంది.

కేతు విశ్వనాథరెడ్డి గారి  కథా రచనలో స్త్రీ పక్షపాతం స్పష్టంగా కనిపిస్తుంది. ‘దాపుడు కోక ‘(1972), ‘ తారతమ్యం ‘(1977), ‘ రెక్కలు ‘(1991), ‘సతి'(1992), ‘ ఇఛ్ఛాగ్ని ‘(1995), ‘ నిప్పూనివురూ'(1994), ‘అంతరం'(1996), ‘ నిజం కాని ఒక్క నిజం కథ ‘(1995)’అంత్యాక్షరి'(1996), ‘అంతర్మఖం'(1994)  ‘సంకటవిమోచని'(2003) లాంటి కథల్లో స్త్రీల వైపు నిలబడి వారి సమస్యలను సానుభూతితోనూ , ప్రతిఘటనాత్మకంగానూ చిత్రించాడు.

ఈ కథలను చదివినప్పుడు కేతు విశ్వనాథరెడ్డి గారు స్త్రీ వాదం వల్ల ప్రభావితుడయ్యాడనీ , ఆ వాద సమర్థకుడనీ అర్థం చేసుకోవచ్చు. ఇఛ్ఛాగ్ని కథ స్త్రీలకు పెళ్లికి మించిన జీవితం వుందనే సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. సంప్రదాయ అడ్డంకులను దాటుకొని సృజనాత్మక దారులలో స్త్రీలు నడవాల్సిన అగత్యాన్ని చెప్పే రచయిత దృక్పథం విశిష్టమైనది.

కేతు విశ్వనాథరెడ్డి గారిలో మరో విశిష్ట కోణం ఆయన హిందూ – ముస్లిం సహజీవనం చుట్టూ రాసిన కథలు . 1980లో రాసిన ‘ పీర్లసావిడి ‘ కథ , ఎన్నికల రాజకీయాల్లోకి ఒక మత గుంపును ( దూదేకుల సాయెబులు) లాగి  లబ్ది పొందడం, వాళ్ళని పావులుగా వాడుకొని విసరివేయడమనే ధోరణిని చిత్రించింది. ఈ కథలోని మస్తాన్ , అశ్శథ్థరెడ్డీ, పుల్లారెడ్డీ నెరిపిన కుట్రలో కొంత స్వయంకృతాపరాధం తోనూ కొంత అమాయకత్వంతోనూ దెబ్బతిని పీర్లసావిడి లో కూలబడతాడు. మళ్లీ ఎన్నికలు రాకపోతాయా, యిదే పీర్లసావిడిని వుపయోగించి లబ్ధిపొందకపోతానా అనుకుంటాడు. ఇట్లా కులమత విశ్వాసాలతో రాజకీయాలు చేయడం భారతీయ వ్యవస్థలో అలవాటయ్యాక దాన్ని అధిగమించడానికి హిందూత్వ శక్తులు ముస్లిం ద్వేషాన్ని తలకెత్తుకున్నాయి. అందుకు ఉదాహరణ ‘S2బోగి’ ( 1991) కథలోని రామస్వామి పాత్ర. రామస్వామి గుండుగుత్తుగా ముస్లింల నందరినీ ఒకే గాట కట్టడాన్ని ఆ కథలోని చంద్ర ( చాంద్ బాష)ఆక్షేపిస్తాడు.  అగ్రవర్ణ హిందువులు కింది కులాల వాళ్లని చెండాడుతున్నట్లే ముస్లింలలో షియాలూ, సున్నీలూ యింకా సవాలక్ష గుంపులు డబ్బూ,అధికారం కారణంగా పరస్పరం ధ్వేషించుకుంటాయనీ , అవన్నీ ఒకటి కాదనీ చెప్తే రామస్వామి, చాంద్ బాషాను తిట్టుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడు వర్తమానాన్ని చూస్తే అంతా రామస్వాములే రాజ్యమేలుతున్నారు. అసహనాన్నీ, ధ్వేషాన్నీ పెంచి పోషిస్తున్నారు.

హిందూ ముస్లింల మధ్య మతాతీతమైన స్నేహమొక్కటే యీ దేశానికి మేలు చేస్తుందని చెప్పడానికి కేతు విశ్వనాథరెడ్డి గారు ‘ అమ్మవారి నువ్వు ‘ కథ రాసారు . చాలా అద్భుతమైన ఇమేజరీ వున్న కథ యిది. శంకర రెడ్డి, జాఫర్ల స్నేహ పుష్పం విరిసి పుష్ప ప్రతిమలుగా బహిర్గతమైన సన్నివేశమది. ఆ కథలోని సుందర రామానందులనబడే హిందూత్వ వాదికి మింగుడుపడని బంధమది. సర్వసంగపరిత్యాగులుగా పేరొందిన సుందర రామానందుల లాంటి వారి అపరిపక్వతను సూక్ష్మంగా బట్టబయలు చేసిన కథా కథనం విశ్వనాథరెడ్డి గారిది. ఈ కథలోని హిందూత్వ మీద సునిశితమైన వ్యంగ్యం   రచయిత లో   పేర్కొనదగ్గ  విశిష్టత.

పైన పేర్కొన్న కథలన్నీ కేతు విశ్వనాథరెడ్డి గారి బాహ్య నేత్రం అందించిన చిత్రాలు. తన చుట్టూ సమాజం గురించీ తన బయటి ప్రపంచం గురించీ ఆలోచనాపరుడెవరికైనా రాదగిన ఆలోచనలూ చేయదగిన విశ్లషణలూ యీ కథల్లో కన్పిస్తాయి. ఒక రాయలసీమ ప్రాంతీయత  నిండిన ఆలోచనాపరుడిగా కేతు గారి అంతర్దృష్టి యేమిటి? తననూ, తన ప్రాంతాన్నీ యెట్లా అంచనా వేసుకుంటాడు ? తన నేల సారం , నేలపుత్రుల చరిత్ర యేమిటని అనుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు 1990లో రాసిన ‘ తేడా ‘ అనే కథలో దొరుకుతాయి.

ఈ కథలో కోస్తాంధ్ర లోని తెనాలి తో రాయలసీమ లోని కడప జిల్లా రాజంపేట పరిధిలోని ఒక మారుమూల పల్లెను  పోల్చుతూ, పరిసరాలలోనూ , వనరులలోనూ , మనుషుల స్వభావాలలోనూ , శ్రమలలోనూ గల తేడాను వివరిస్తాడు .  ఈ కథలో శ్రీలత ( ఎంఏ చదివిన తెనాలి అమ్మాయి)  ఎంకాం చదివిన రాఘవ ( నిజానికి రాఘవరెడ్డి, రెడ్ల కుటుంబమని కథలో తెలుస్తుంది) ను ప్రేమించి పెళ్లి చేసుకుంది . ఇద్దరూ హైదరాబాద్లో టెంపరరీ వుద్యోగాలు చేస్తుంటారు . పెళ్లైన ఏడాదికి అత్తగారింటికి వచ్చి వారం రోజులు వుండాల్సివస్తుంది. ఆ సందర్భంలో శ్రీలతకు అత్త పడే నిరంతర శ్రమ తెలుస్తుంది . ఏ పనీ చేయకుండా బీడీలు తాగుతూ గప్పాలు కొట్టే మామా , సిగరెట్లు తాగుతూ పనే చేయకుండా రాజకీయాల్లో వుండే బావా, ఎంతో బాధ్యతగా వ్యవహరించే మరదీ కన్పిస్తారు . తమ తెనాలిలో అమ్మా నాన్నా ఒక ఎకరంలోనే పాడి పశువులతో, కోళ్లతో,  కాయగూరలు పంటతో శ్రమ పడుతూ సౌకర్యాలు అమర్చుకుంటే , యిక్కడ రెండెకరాల తోటా ఏడెకరాల మెట్ట వున్నా పంటలేమీ లేక అప్పులు పెరుగుతుంటాయి.

ఈ కథలోని మరిది దివాకర్ పాత్ర రాయలసీమ కొత్త తరం యువకుడు . ఇంటి పరిస్థితుల వల్ల ఇంటర్ మధ్యలోనే ఆగినా బాధ్యతగా వుంటూ అమ్మకు చేదోడువాదోడుగా వుంటూ శ్రీలత అభిమానం పొందుతాడు . శ్రీలత విశ్లేషణలో రాయలసీమ వెనుకబాటుతనానికి కాలానుగుణంగా మారకపోవడం, ఒళ్లు వంచి కష్టపడి సంపాదించుకోక పోవడం కారణం. దీనికి దివాకర్ చెప్పిన సమాధానం, తన తండ్రిది పాత తరం రెడ్ల దర్జా. యాభై ఎకరాల వ్యవసాయం , ఇంట్లో జీతగాళ్లూ , నలుగురు మనుషులూ , మందీమార్బలం. ఇప్పుడు అంతా కరిగిపోయి ( అప్పులూ ) దర్పం మిగిలింది .  పెద్దన్న సులభంగా డబ్బులు సంపాదించాలని రాజకీయాల్లో తిరగడమే కానీ దానికి కావలసిన పెట్టుబడీ , మోసాలు చేసే శక్తి లేకపోవడం. కోస్తాలోలాగా నీటి వసతి లేకపోవడం.

ఈ కథలో రాయలసీమ, కోస్తా తేడాలే కాదు , ఒకే యింట్లో, ఒకే పరిస్థితుల్లో వున్న ముగ్గురన్నదమ్ముల మధ్యా తేడాలు కూడా శ్రీలతకు ఆశ్చర్యం కల్గిస్తాయి . ఈ కథలోని యింకో కోణం, కోస్తా కోడలు రాయలసీమ పట్ల ఆదరణతో
ఆలోచించడం . వాస్తవికతతో సానుభూతిని చూపడం . వీలైతే చిన్న మరిదికి సహాయం చేద్దామని అనుకోవడం.
కేతు విశ్వనాథరెడ్డి గారు కోస్తాంధ్ర ప్రజల నుంచి రాయలసీమ పట్ల దీన్నే ఆశించారేమో మరి. ఆయన కథల్లో యిదొక విశిష్ట కోణం.

*

వెంకట కృష్ణ

ఇంటర్మీడియట్ చదివే రోజులనుండి కవిత్వం రాస్తున్నా.నా తరం అందరిలాగే శ్రీశ్రీ ప్రభావం నామీదుంది.అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల రా.వి.శాస్త్రి రుక్కులూ, రంగనాయకమ్మ బలిపీఠం హైస్కూల్ దినాలకే చదివున్నాను.యండమూరీ,చందూసోంబాబు,తదితర కమర్షియల్ సాహిత్యం కూడా ఇంటర్ రోజుల్లో విపరీతంగా చదివున్నా సీరియస్ తెలుగు సాహిత్యం తోనే నా ప్రయాణం కొనసాగింది.1994 నవంబర్ నెలలో మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వారపత్రికలో అచ్చైంది . అప్పటిదాకా రాసుకున్న అచ్చు కాని కవిత్వాన్ని 2000 సంవత్సరం లో లో గొంతుక గా నా మొదటి కవితా సంపుటి.1994నుండీ 2000 దాకా నెమ్మదిగా రాసాను.2000 తర్వాత రెగ్యులర్ గా రాస్తున్నా.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అఫ్సర్ కూ సారంగ టీం కూ , ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు