‘‘ఏవయ్యా… అగ్నిహోత్రుడు… ఇదేనా బావుందా..? పద్దతేనా….? విస్తళ్లు వేసే వరకూ కనిపించకుండా పోతే ఏమిటర్ధం… ఇంటికొచ్చిన వారికి ఏం చెప్పాలి…’’
‘‘నే చెబుతూనే ఉన్నా… మీకే చెవికెక్కలేదు. మీకు చెవుడు.. అసలు మీకు చెవులే లేవు. ఈ అగ్నిహోత్రుడు వద్దండీ అంటే
వినకుండా ఆ అల్లప్పచ్చడి మోజులో పడి పిలిచారు. ఏం చేస్తాం. తద్దినం పూటా ఇంటికి వచ్చిన వారందరినీ అభోజనం
చేయిస్తామా…? నే చేసేస్తాలెండీ ఆ మిగిలిన వంట’’
ఈ మాటలు వింటున్న అగ్నిహోత్రుడు ఏం మాట్లాడలేదు. ఓ నవ్వు నవ్వేశాడు. ఆ నవ్వులోంచి ఓ మత్తు నుంచి వచ్చే వాసన
గమ్మత్తుగా గాలిలో కలిసిపోతోంది.
కుడిభుజం మీద టీకా వేసిన అర్ధరూపాయి బిళ్లంత మచ్చ పక్కన తెలతెల్లగా… కనిపించీ కనిపించకుండా ఉన్న సున్నాల వంటి ఓ మచ్చ పైనే ఎడం చేత్తో గోక్కుంటూ.. కళ్లలో ఓ అద్భుత ఆనంద పరవశాన్ని అనుభవిస్తూ నోట్లో ఉన్నసిగరెట్‌ని అటు ఇటు తిప్పుతూ నిలుచున్నాడు అగ్నిహోత్రుడు.
దంపతులిద్దరూ ఆ నవ్వుని చూసి నవ్వాలో…. లోపల విస్తళ్ల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న బంధుజనాన్ని చూసి
ఏడవాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నిలబడ్డారు.
‘‘ అయ్యిందా.. ఇంకేమైనా ఉందా… ఇదో పేద్ద వంట.. దీనికే.. ఓ రాగాలు… పది నిమిసాలు అలా వెళ్లి వాళ్లతో మాట్లాతూండండి.
చేసే పడేస్తా. అయినా అంతా అయిపోయింది. కాకాపోతే ఆ గారెలు మూకుడులో వేయించడం… కంద కూరకి పోపు పెట్టడం… . చిక్కుడుకాయ కూరకి బెల్లం తగిలించడం… అరటికాయకి ఆవ పెట్టడం. అదిగో… బెండకాయ మూకుట్లో సిద్ధంగా ఉంది. ఇక పచ్చళ్లంటారా…. నూ పచ్చడి, కొబ్బరి పచ్చడి, ఆవ పెరుగు పచ్చడి ఎప్పుడో చేశాసాను. అల్లప్పచ్చడి కుంచెం ఎక్కువ చేయాలి. అది భోక్తల కోసమని ముందు కుంచెమే చేశాను. ఇంకుంచెం చేస్తే అదీ అయిపోతుంది. అన్నం, పెసర పప్పు ఉడికిపోయి వడ్డనకి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఆకులు తుడిచి.. పంక్తి సిద్ధం చేస్తే మిగిలినవి విస్తళ్లలోకి నడిచి వచ్చేస్తాయి. ఊరికే అరవడం కాదు…’’ అగ్నిహోత్రుడు కుడి చేయి నాలుగు వేళ్లతో ఎడం తోడలోని ఇరుకిరుకు ప్రదేశాలని గోక్కుంటూ చెప్పాడు.
‘‘ అదే అల్లప్పచ్చడి గురించే చెప్పేది. అది కాలేదు. భోక్తల భోజనాలు అయ్యాయి. వాళ్లకి తాంబూలం, దక్షిణ ఇచ్చేస్తే వాళ్లు
వెళ్లిపోతారు. మంత్రం చెప్పిన బ్రహ్మగారు ఎప్పుడెప్పుడు నాలుగు మెతుకులు తినేసి సైకీలు ఎక్కేదావా అని కూర్చున్నారు. ఇక బంధువులూ నకనకలాడుతున్నారు. భోజనాలకు లేవడమే. నువ్వా… గాడి పొయ్యి దగ్గర కనపడలేదు. నాకు కాళ్లూ చేతులు ఆడలేదు. సరే… త్వరగా కాని… ’’
అగ్నిహోత్రుడు. సన్నంగా… వెదురు బద్దకి బట్టలు తొడిగినట్టు ఉంటాడు. అంత ఎరుపు కాదు కాని కాసింత పరికించి చూస్తే తాగినట్టుగా స్పష్టంగా కనిపించే కళ్లు. నుదిటి మీదా… చెంపల పైనా…. తెలతెల్లటి తామర మచ్చలు. గడ్డానికి… కంఠానికి మధ్యలో ఎనిమిదో తరగతి సాంఘీక శాస్త్రం టెక్ట్స్ బుక్కు మూడో పాఠంలో ఉన్న భారతదేశం పటం కింద కనపడే శ్రీలంక పటంలా చిన చిన్నగా ఉండేవి ఆ మచ్చలు. అగ్నిహోత్రుడు ప్యాంట్ వేసుకోవడం నేనే కాదు అగ్రహారంలో ఎవ్వరూ చూడలేదు. ఎవరింట్లోనూ వంట పని లేకపోతే పంచె కట్టుకునేవాడు. అక్కడక్కడా మాసిపోవడమే కాదు పై బోత్తం కింద కాజాకి… కింద బొత్తం పై కాజాకి పెట్టుకున్న చొక్కాతో చూడగానే ‘తాగేశాడు’ అనుకునేలా అగ్రహారంలో తిరుగాడేవాడు.
వంట పనికి వచ్చాడా… అగ్నహోత్రుడి రూపం మారిపోయేది. బొడ్డు కనిపించేలా కిందకి, మెకాళ్ల మీదకి… తొడల వరకూ మాత్రమే ఉన్న తెల్లంచు ఎర్రటి అంగవస్త్రం కట్టుకునే వాడు. అగ్నిహోత్రుడి భుజం మీద చంద్రుడికి అక్కడక్కడా మచ్చల్లా… కొనప్పుడు తప్ప ఆ తర్వాత అసలు రూపం మారిపోయన ఓ తువ్వాలు ఉండేది.
అల్లప్పచ్చడి చేయడం అగ్నిహోత్రుడికి అసలు పెద్ద పనే కాదు. శుభ్రం చేసిన అల్లాన్ని ముక్కలుగా కోసి ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, కొద్దిగా మినపప్పు వేయించి పొడి చేసి చింతపండు, బెల్లంతో కలిపి రుబ్బడమే. అంతే అల్లప్పచ్చడి సిద్ధం అవుతుంది. ఈ పచ్చడి అగ్రహారంలోనే కాదు… ఆడవాళ్లందరికీ చిటెకెలో పని. కాని అగ్నిహోత్రుడి చేతి మహత్యం ఏమిటో తెలియదు కాని ఇత్తడి గిన్నెలో ఉన్న లేత మామిడి చివురు రంగు అల్లప్పచ్చడిని గిన్నె అంచుకి చూపుడు వేలుతో కాసింత అద్దుకుని నాలిక ముందు భాగంలో కాని అలా రాసుకున్నారా…. అగ్నిహోత్రుడికి ఆస్తి రాసిచ్చేయాలనిపిస్తుంది.
అగ్రహారంలోని వీధుల్లో ఓ వీధి అయిన నారాయణపేటలో శెట్టిబలిజల పాకలో రెండు గదుల అద్దె ఇంట్లో భార్యతో కలిసి ఉండే వాడు అగ్నిహోత్రుడు. వంట పని లేనప్పుడు ఆ ఇంటి అరుగు మీద ఎడం కాలు లోపలకి ముడుచుకుని కుడి కాలుని సగానికి మడిచి పక్కనే సిగరెట్టు పెట్టే, అగ్గిపెట్టే పెట్టుకుని కూర్చునే వాడు. అలా కూర్చున్న అగ్నిహోత్రుడి చుట్టూ పది మంది వరకూ చిన్న పిల్లలు నిత్యం గుమిగూడి అతనితో ఆటలాడే వారు. తన దగ్గరున్న డబ్బుల్లో కొన్నింటిని ఆ పిల్లలకి ఇచ్చి దగ్గర్లో ఉన్న బడ్డీ దగ్గరకు వెళ్లి ఏమైనా కొనుక్కోమనే వాడు. అలా ఆ పిల్లలు కొనుక్కుని తెచ్చుకున్న వేరుసెనగ
ఉండలో…., నూపప్పు ఉండలో…, మిఠాయుండలో తెస్తే వాటిని తాను కూర్చున్న నేలపై పెట్టి ఎడం చేత్తో ఆ ఉండ పడిపోకుండా పట్టుకుని కుడి చేయి గుప్పిటతో కొట్టి లాఘవంగా ముక్కలు చేసేవాడు.
ఆ ముక్కల్లో ఓ ముక్క తానూ నోట్లో వేసుకుని ‘‘వీడికి పాకం పట్టడం రాదు. వేరు సెనగ ఉండకీ, నూవుండకి తేడా తెలీదు. ఈసారి నే చేసి పట్టుకొస్తా ’’అని పిల్లలకి సంజాయిషీ ఇచ్చేవాడు. ఇది అగ్నిహోత్రుడికి తన వంటపై ఉన్న సాధికారితను చూపించేది. ఇలా పిల్లల కోడిలా వారిని తన చుట్టూ తిప్పుకోవడం, వారి చుట్టూ తాను తిరగడం వెనుక ఓ విషాదం దాగి ఉంది. అగ్నిహోత్రుడికి పిల్లల్లేరు. ఇక పుట్టరనే
నిజం ఆ దంపతులకి తెలుసు. దీంతో పిల్లలని చేరదీసే వాడు. వంటకు వెళ్లిన ప్రతిచోటా కూడా పిల్లలని పిలిపించుకుని పెద్దవాళ్లకి కనిపించకుండా వంట మధ్యలో గార్లు, అప్పాలు, బూరె ముక్కలు ఇచ్చేవాడు. అవి తినడానికి చిన్నపిల్లలకి ఆ ఇంట్లో రహస్య ప్రదేశాలని చూపించే బాధ్యత కూడా అగ్నిహోత్రుడిదే. పులిహోరా, అన్నం పరమాన్నం, దద్దోజనం, ఉప్పుడుపిండి, పిండి పులిహార వంటివి మాత్రం పిల్లలకు పెట్టే వాడు కాదు. దీనికి కారణం బియ్యంతో వండినవి అంటు. ఆ పదార్ధాలని ముట్టుకోవడం, బయటకు తీసుకొచ్చి తినడం బ్రాహ్మల ఇళ్లలో నిషేధం.
గాడి పొయ్యి దగ్గర రెండు మూడు గంటలు కూర్చోవడంతో పాటు పొయ్యిలో వేసిన తడి దుంగల కారణంగా వచ్చే పొగకు కళ్లు మంటలు పుట్టి నీళ్లు కారేవి. భుజం మీద తుండుతో కళ్లని, ముఖాన్ని మార్చి మార్చి తుడుచుకునే వాడు అగ్నిహోత్రుడు. చార్మినారో, డెక్కనో సిగరెట్లు కాలుస్తూ నడుం మీద చేయి వేసుకుని నిలబడే వాడు. గోల్డుఫ్లాక్ ప్లెయిన్ సిగరట్లో, క్యాప్‌స్టన్ ఫిల్టర్ సిగరెట్టో ఇస్తే ‘‘వద్దు. డబ్బులేస్టు. ఈ పెట్టె డబ్బులతో నాకు రెండు పెట్టెల చార్మినార్ వస్తాయి’’ అనే వాడు. ఎలాగో తెలియదు కాని అందరూ చూస్తుండగానే గాడి పొయ్యి నుంచి హఠాత్తుగా మాయం అయ్యే వాడు. కట్టుకున్న అంగవస్త్రం, భుజాన తువ్వాలుతోనే నడి వీధిలో పరుగులాంటి నడకతో ప్రసాదు (ప్రభుత్వ సారాయి దుకాణం) దగ్గరకి వెళ్లే వాడు. అక్కడ ఓ సారా ప్యాకెట్‌ని మునిపంటితో తెంపి బుడుంగున నోట్లో పోసుకునే వాడు. అంగవస్త్రంలో ఓ వైపున మరో సారా ప్యాకెట్‌ని లాఘవంగా ముడేసి చెవిలో ఉన్న సిగరెట్ వెలిగించి మళ్లీ గాడి పొయ్యి దగ్గరికి పరుగు పెట్టేవాడు. గాడిపొయ్యి దగ్గర అగ్నిహోత్రుడు కనిపించక కంగారు పడుతున్న ఇంటి యజమాని ‘‘వెళ్లిపోయాడా… చచ్చేం…ఈ వంట ఇక అయినట్లే’’ అని కంగారు పడుతూంటే…
‘‘ఎక్కడికి వెళ్లడం నా శార్ధం. కాలు కూడా ముడుచుకోవద్దా… మీకు గాడి పొయ్యి దగ్గరేం పని. లోపలికి వెళ్లండి. వంట కాగానే పిలుస్తా’’ అని లేని కోపాన్ని తెచ్చుకుని మహా నటుడికి తీసిపోనట్లుగా తన అలవాటు తెర మీదకు రాకుండా జాగ్రత్త పడే వాడు. పైకి ఎన్ని తిట్టుకున్నా…. అతని అనారోగ్యాన్ని దగ్గర నుంచి చూసినా… అగ్రహారంలో ఏ కార్యక్రమానికైనా అగ్నిహోత్రుడ్నే పిలిచే వారు వంటకి. శుభ కార్యాల సమయంలో వంట మధ్యలో రెండు మూడు ప్యాకెట్లు గొంతులో పోసుకునే వాడు. అదే అశుభ కార్యాల వంట అయితే మాత్రం భోక్తలు భోజనాలు ముగించి విస్తళ్ల మీంచి లేచే వరకూ ‘‘ఆ జోలికి’’ వెళ్లే వాడు కాదు. ఇది తనకు తాను విధించుకున్న వృత్తి నియమం. ఈ నియమం తెలుసు కనుకే అగ్రహారంలో చాలా మంది అగ్నిహోత్రుడ్ని ‘‘ఆ వంట’’కి పిలిచే వారు. అందరికీ తలలో నాలికలా మెలిగిన అగ్నిహోత్రుడికి అగ్రహారంలో శత్రువులు లేరు.
తన జీవితాన్ని ప్రత్యేక ఆకర్షణగా కాపాడుకున్న అగ్నిహోత్రుడు ఆ జీవితం నుంచి, అగ్రహారం నుంచి నిష్క్రమించడం కూడా అలాగే జరిగి పోయింది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలకని రాజమండ్రి వెళ్లాడు అగ్రిహోత్రుడు. గోదావరిలో పుణ్యస్నానం ఆచరించాడో లేదో ఆ గోదారమ్మేకే తెలియాలి. అగ్రహారం నుంచి చేతిలో సంచితో రాజమండ్రి వెళ్లిన అగ్నిహోత్రుడు ఇక తిరిగి అగ్రహారంలో కాలు పెట్టలేదు. రాజమండ్రి వెళ్లిన అగ్నిహోత్రుడు వారం అయినా అగ్రహారం రాలేదు. ఇద్దరు, ముగ్గురు రాజమండ్రీ వెళ్లి పుష్కరాల రేవు దగ్గరా, కోటి లింగాల రేవు దగ్గర వాకబు చేశారు. పోలికలు విన్న వారంతా ‘‘చూసావ’’న్న వారే కాని ఎక్కడ ఉన్నాడో చెప్పలేక పోయారు. అగ్నిహోత్రుడ్ని వెతకడం కోసం వెళ్లిన వారు తిరిగి అగ్రహారం వచ్చేశారు. అగ్రహారానికి అలప్పచ్చడిని ఓ జ్ఞాపకంలా ఇచ్చిన అగ్రిహోత్రుడు ఇంకా రాలేదు. ఇప్పటికీ రాలేదు. అమ్మా.. గోదారమ్మా… నీ దగ్గరికి వచ్చాడు కదా… నీలో మునిగి.. నీ దగ్గరే పునీతమయ్యాడు కదా…? తల్లీ.. మా అగ్నిహోత్రుడ్ని ఏదో ఒకరూపంలో మాకు దగ్గరకు పంపించవా…!?
*
Though i dont know about him but the narration of you made me feel liveexperience with Agnihotrudu garu in the past.Superb and excellant.Expecting from your beautiful pen many a more like this…Congrstulations..
Agnihotruni lanti characters ippudu vunnara? Godavari talli
ippudu puttinchu talli.
చక్రధర్ గారూ…! సారూ…!!
మీకు మీరే సాటి…
అగ్నిహోత్రుడు… అల్లప్పచ్చడి… బాగుంది…
ఈ కథనాలు చదువుతుంటే మీతోపాటు అగ్రహారం ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోంది…
చూడాలనిపిస్తోంది…. మిత్రమా..!
ఎప్పుడు తీసుకెళ్తావు…. మరి….
మీ….
పటేల్ మధుసూదన్ రెడ్డి
సీనియర్ జర్నలిస్టు
హైదరాబాద్
బాగా దగ్గరగా నేసిన మంచి వస్త్రం నేత లా నడిచింది కథనం. పితృ శేషం తిన్నంత తృప్తి కలిగించి అగ్నిగోత్రుడు అల్లం పచ్చడి చేయడంలో చూపించిన నేర్పు కథనం లో కూడా చూపించావు. 👍
“అగ్నిహోత్రుడు అల్లప్పచ్చడి” కథ చదువుతుంటే కథ కంటే కథనం బాగుంది ! గోదావరి యాసతో పాటు ఆగ్రహారాల్లో శుభ కార్యాలకు అశుభ కార్యాలకు వండే వంటల వివరాలు చాలా బాగున్నాయి. అగ్నిహోత్రుడి గురించి రచయిత వివరించిన మాటలు ఇంకా బాగున్నాయి అతడి psychological dimensions, Sociological dimensions, aesthetics, attitude వివరించిన తీరు అమోఘం ఆవిధంగా ‘అగ్నిహోత్రుడు’ మన ముందు ప్రత్యక్షమై పోయాడు. మనం
రచయిత లాగా నిశితంగా గమనించినట్లైతే ఊరికో ‘అగ్నిహోత్రుడు’ లాంటి వారు వుంటారు. ‘చిట్టి’ అభినందనలు!!
“అగ్నిహోత్రుడు అల్లప్పచ్చడి” కథ చదువుతుంటే కథ కంటే కథనం బాగుంది ! గోదావరి యాసతో పాటు ఆగ్రహారాల్లో శుభ కార్యాలకు అశుభ కార్యాలకు వండే వంటల వివరాలు చాలా బాగున్నాయి. అగ్నిహోత్రుడి గురించి రచయిత వివరించిన మాటలు ఇంకా బాగున్నాయి అతడి psychological dimensions, Sociological dimensions, aesthetics, attitude వివరించిన తీరు అమోఘం ఆవిధంగా ‘అగ్నిహోత్రుడు’ మన ముందు ప్రత్యక్షమై పోయాడు. మనం
రచయిత లాగా నిశితంగా గమనించినట్లైతే ఊరికో ‘అగ్నిహోత్రుడు’ లాంటి వారు వుంటారు. ‘బుజ్జి”అభినందనలు!!
చాలా బాగుంది బుజ్జి,అగ్నిహోత్రుడు అల్లం పచ్చడి లో వేసే అధరువులు అన్నీ నీ naration లో సమతూకంలో పడి ఆ ఘాటును గుర్తుచేసే యి.keep it up
Aa kaala vyavhara varnana adbhutam kadha vishayam ramai badha kaliginchindi kadha taravata taravata ani kuda teesukellindi. Rachayita dhanyudu. Na Mitrudu kuda
Kadha vishaadantamai badha kaliginchindi
అగ్రహారంలో కనిపించిన అగ్నిహోత్రుడు నీ అక్షరాల్లో మెరిసాడు. జ్ఞాపకాల జడివాన లో తడిపాడు. చిన్నప్పుడు మా తాతగారు చనిపోయినప్పుడు ఆ పక్షం రోజులు మాకు వంటచేసినది అగ్నిహోత్రుడే. ఒక్కసారి అవన్నీ గుర్తుకొచ్చాయి. అగ్రహారానికి అల్లం పచ్చడి జ్ఞాపకాన్ని అగ్నిహోత్రుడు ఇస్తే, అగ్నిహోత్రుడ్ని నువ్వు మాకు గుర్తు చేసావు. సెహబాష్ బుజ్జి ! అగ్రహారం ముఖచిత్రాన్ని ఆపకుండా అవిష్కరించు.
బాగుoది .
చాలా బాగుంది
Excellent narration chakradhar. Really good olden memories are comming back to my mind. Thanks to Saranga for bringing such nice stories by Chakradhar. Waiting for next episode eagerly. Keep on Chakradhar.
అగ్నిహోత్రుడు తనవంటలతో ఎలా అలరించాడో నాకు తెలియదుకానీ,నీరచనతో చదువరులకి పసందైన రచనా శైలితో విందు చేసావు ,ఆయన చేసిన వంటలా నీవర్ణన గుభాళింప చేసావు. నీకివే అభినందనలు. మరో కుాచిమంచి అగ్రహారపు జ్ఞాపకంకోసం ఎదురుచుాస్తుా…….వెంకు
అల్లప్పచ్చడి అంటే నాకెంతో ఇష్టం. మీరు అగ్నిహోత్రుడి అల్లప్పచ్చడి గురించి చెబితే నాకూ నోరూరుతోంది. గోదారమ్మ కనికరించి అగ్నిహోత్రుడు తిరిగిరావాలనీ, అతడి చేతితో తయారైన అల్లప్పచ్చడిని మనం రుచి చూడాలనీ నా కోరిక….
super
విస్తట్లో గారెల్లో అల్లప్పచ్చడి నంచుకుంటూ, ఎదురుగుండా పొయ్యి పక్కన ఉన్న అగ్ని హోత్రుడితో కబుర్లు చెబుతున్న భావన కలిగింది….రచయిత కు అభినందనలు…
బావుంది సార్….
చక్రధర్ గారు .. అతి రుచికరమైన అల్లం పచ్చడిలా ఉంది మీ అగ్నిహోత్రుడు రచన. అరుదైన గత స్మృతులను అద్భుత వర్ణనలతో అక్షరీకరించిన తీరు అనన్యసామాన్యం అనిపించింది. మీ కల కరవాలం నుంచి కత్తిలాంటి రచనలు మరిన్ని రావాలని ఆశిస్తూ మీకు అభినందనలు.
బాగాచదివించారు
touchy
Excellent, sir. Please keep writing. Every time you are taking us to your beautiful Agraharam and the gentle people you met. Thanks for a refreshing reading.
చాలా బాగా రాసావు రా బుజ్జి…….కర్రా సుబ్బన్న మూల సుబ్బన్న నీ కథలో అగ్నిహోత్రుడు అందరూ ఒకే తానులో ముక్కలే……మా అమ్మ మమ్మల్ని వాళ్ళకి కాపలా కూర్చో పెట్టేది..వాడు వుండ రా బుడ్డి అని వెళ్ళి పోయేవాడు…
కళ్ళ ముందు నిలబెట్టావు వాళ్ల ని ఎంతో టాలెంట్ వాళ్ళలో కానీ వ్యసనం పాడుచేసింది….
తన టాలెంట్ ని కంటిన్యూ చెయ్యడానికి , స్పిరిట్ తెచ్చుకోవడానికి, స్పిరిట్ హెల్ప్ తీసుకున్నాడు ఆయన.
పెద్ద వాళ్ళు తాగితే social drinking.
చిన్న వాళ్ళు తాగితే bad habit.
Very well written as per sri sri nothing is useless to a poetry or a story if the writer is capable and skillful undoubtedly you have good writing skills…
Excellent narration andi…..కథంటే ఇలా చదివించాలి అనిపించింది….Keep going with different subjects….
ఇ త్త డి గుం డె గ లో వేసిన పోపు ఘుభాలింపు లా
సాగిన అగ్ని సాక్షి కథనం..
ఎరిగిన వారికి మధుర స్మృతి.
ఎరగని వారికి అద్భుత అగ్ని స్తుతి .
హృదయ పూర్వక అభినందనలు బుజ్జి కలానికి.
🌹❤️🌹