మాదిగల చెమటతో ఆరిన అగ్గి

అలా వూరంతటికీ నిప్పు పాకకుండా ఒక ఒక యింటితోనే ఆగిపోవడం ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతం ఎలా జరిగిందో నాకు తర్వాత అమ్మలక్కల మాటల ద్వారా తెలిసింది.

నబైల్లో అనుకుంటా.. ముప్పై ఏళ్ల పైమాటే! చలి మొదలైన రోజులు కూడా. ఎలా గుర్తుంది అంటే చెనక్కాయ అప్పటికి పండి కళ్ళాలలో వాములుగా వుంది. చెనక్కాయ చేలు పండాక చెట్లను పీకి అలానే చేల మీద రెండుమూన్నాళ్ళు ఎండనిస్తాం. ఆ ఎండిన చెనిగిచెట్లను వుదయాన్నే మంచు వుండగా కుప్పలేస్తాం. ఆ కుప్పలను ఎద్దులబండ్ల మీద ఇంటికి దగ్గరలోని వామిదొడ్లకు చేరుస్తాం. వామిదొడ్డిలో చెట్లకున్న కాయలను వేరు చేసి దాన్నంతా వామిగా కుప్పపోస్తాం. ఒక్కోసారి చేలోనే కాయలను వేరు చేసి చెత్తను వామికి చేర్చి వామి వేస్తాం కూడా. ఆ ఏడు కాయలతోనే చెనిగి చెట్లు వామిదొడ్డిలో వున్నాయి. ఇక దొంగలనుండి, దొంగావుల నుండి, పందుల నుండి కాపాడుకోవడానికి నాన్న రాత్రిళ్ళు అక్కడే పడుకుంటున్నాడు. నేనూ ఆయనకు తోడుగా అక్కడే పడుకుంటున్నాను. మా వామిదొడ్డి ఇప్పుడున్న బడికి ఎదురుగా వున్న స్థలమే. వూరి చివరి యిల్లుకు అరఫర్లాంగు దూరం.

అలానే ఓరోజు నాన్న, నేను రాత్రి భోజనాలయ్యాక కాపలా పడుకోవడానికి ఆ వామిదొడ్డి చేరాం. బాగానే రాత్రయింది అనుకుంటా మంచి నిద్రలో వున్నాం. అర్ధరాత్రప్పుడు ఎవరైనా వచ్చి మమ్మలని లేపారో, వూర్లో హడావుడికి నాన్నే లేచి నన్ను లేపారో తెలియదు గానీ… పరుగు పరుగున వూరు చేరుకున్నాం. జీలగ మల్లయ్యోళ్ళ యింటి ఎదురుగా వున్న బంట్రోతు సుబ్బరాయుడు ఇల్లుకు నిప్పంటుకుంది. అప్పట్లో ఆలస్యంగా భోజనాలు చేసేది మా యింట్లోనే. తొమ్మిదింటిదాకా మేము చదివాక గానీ నాన్న భోజనాలకు లేవరు. అప్పటికి చాలామట్టుకు వూరంతా నిద్రపోతూ వుంటుంది. సాధారణంగా వంట అయిపోయాక అందరూ పొయ్యి ఆర్పేసే పడుకుంటారు. మరి ఈ నిప్పు ఎలా వచ్చిందో తెలియదు గానీ, అదీ అర్ధరాత్రప్పుడు అందరూ నిద్రపోతున్నవేళ భగ్గుమంది. అంతవరకూ ఆవూరు కాలింది, ఈ వూరు కాలింది అని వినడమే గానీ మావూర్లో చిన్న అగ్నిప్రమాదం జరగడమూ నేను చూడలేదు. వూరంతటికీ అప్పుడున్నది నాలుగే పక్కా యిళ్ళు. జీలగ మల్లయ్య, రాచమ్మ, వెంకటప్ప మరియు నారాయణమ్మోళ్ళవి. మిగిలినవి అన్నీ మట్టి గోడలు, బోద గడ్డి(రెల్లు?)తో కప్పబడినవే. అప్పట్లో మా చుట్టు పక్కల వూర్లన్నింటిలో యిలాంటి యిళ్ళే ఎక్కువ. అందువల్ల ఒక యింటికి నిప్పంటుకుంటే అది వూరంతటినీ తగలెట్టకుండా ఆగదు. అప్పట్లో వేసవి వస్తే ఇలా వూరంతా కాలిపోయిన వార్తలు వస్తూ వుండేవి.

ఆ అరుపులకూ కేకలకూ వూరంతా క్షణాల్లో మేల్కొంది. ప్రతి యింట్లోని వారూ తమ చేతికందిన కడవనూ, బిందెనూ, బకెట్టునూ తెచ్చారు. వూర్లో నీటిని అందించే బావి ఒక్కటే. మరోబావి వున్నా అందులో నీళ్ళు వుప్పునీళ్ళు, దాని నీళ్ళను ఎవరూ సాధారణంగా తోడరు. అందులో నీళ్ళు లేవో ఏమో గానీ దానికెవరూ చేద వేసిన గుర్తులేదు. అప్పట్లో బోర్లు లేవు. ఆ ఒక్క మంచినీళ్ళ బావికీ చేంతాళ్ళు వేసి నీళ్ళు కొందరు తోడుతుంటే మరికొందరు మోసుకొస్తుంటే ఇంకొందరు యింటిపైకి చల్లుతున్నారు. వామి దగ్గరి నుండీ పరుగెత్తుకుంటూ వచ్చిన నేను కూడా చేతికందిన ఏదో చెంబుతో నీళ్ళు చల్లడం మొదలెట్టాను. మంటలు ఎగుస్తున్నాయి తప్ప అదుపులోకి రావడం లేదు. అప్పుడు మా అమ్మో, అమ్మమ్మో నా చేయి పట్టి గుంజి “అది ఆగదురా తెలివిలేనోడా.. ముందు మనింట్లో వున్నవి కాపాడుకోవాల. పద యింటికి” అని తరిమాక గానీ నాకు తత్వం భోధపడలేదు. ఎప్పుడయితే మంటలు పైపైకి ఎగబాకడం మొదలెట్టాయో..ఒక్కరొక్కరూ అక్కడనుండి జారుకొని ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ యింటిని నీళ్లతో తడపడం, అగ్గి రవ్వలు పడకుండా కాపాడుకోవడం, దూడలను, ఆవులను, ఎద్దులను, ఎనుములనూ తలుగులు తప్పించడం, కోళ్ళను గంపకింద నుండి వదిలెయ్యడం, యింటి చూర్లలోనో, గూళ్ళ లోనో దాచుకున్న డబ్బును బయటకు తీయడం, యింట్లోవున్న ధాన్యపు బస్తాలను ఆరుబయల్లో వేయడం.. ఇలా ఎవరింట్లో వాళ్ళు బిజీ అయిపోయారు. ఏ ఒక్కరూ మరొక్కరికి ఆసరా వచ్చే సమయం కాదది. ఎవరింట్లో ధృడమైనవాళ్ళుంటే వాళ్ళకు మరొకరి సాయం అక్కర్లేదు. కానీ లేనివాళ్ళ గతి?! మా అమ్మ చేసిన కర్తవ్యభోధతో యిల్లు చేరిన నేను యింట్లో కాస్తా విలువైనవి అనుకున్నవి బయటకు తీసుకొచ్చి పడేస్తున్నాను. అప్పుడు మళ్ళీ మా అమ్మే అంది..”ఆ చిల్లరవి పోతే పొయినాయి నాయనా.. ఆ బియ్యం మూట బయట వేయాలి.. లేకపోతే రేపు తినడానికి గింజలు వుండవు” అని. అప్పట్లో గోనెసంచులు బాగా పెద్దవి, డృడంగా వుండేవాటిని పచ్చ సంచులు అనేవాళ్లం. వాటికి నిలువుగా ఆకుపచ్చ గీత వుండేది. అలాంటి పచ్చసంచి అరబస్తా పైనే బియ్యంతో యింట్లో ఓ మూల వుంది. దాన్ని ఒక్కన్నే వంగి రెండుచేతులతో ఎత్తి రొమ్ములకు ఆనించుకొని బయటకు తీసుకొచ్చి ఆ వుప్పునీళ్ళ బావి అంచున పడేశాను. ఆ తర్వాత ఇంకా చాల చిన్న వస్తువులను బయటకు తెచ్చాను. కాసేపటికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ ఒక్క యిల్లుతోనే అగ్నిదేవుడు శాంతించాడు.

అలా వూరంతటికీ నిప్పు పాకకుండా ఒక ఒక యింటితోనే ఆగిపోవడం ఒక అద్భుతం. కానీ ఆ అద్భుతం ఎలా జరిగిందో మా యింటి వస్తువులను కాపాడుకోవడంలో మునిగిపోయిన నాకు తర్వాత అమ్మలక్కల మాటల ద్వారా తెలిసింది.

మా శూద్రుల వూరికి ఫర్లాంగు దూరంలో మాదిగల యిళ్ళుంటాయి. ఆ యిళ్ళకు మా శూద్రుల యిళ్ళకు మధ్యన రాసమ్మ చేను అడ్డం. ఆ మాదిగలు వున్న వూరికి పేరు లేదు. మా వూరిపేరుతోనే “అగ్రహారం మాదిగపల్లె” అంటారు. మా వుర్లోవాళ్లయితే “మాదిగ పల్లె” అంటారు. చదువుకున్నోళ్ళు “హరిజనవాడ” అంటారు. మా వూర్లో అరుపులు, కేకలకు ఆ వూరూ మేల్కొంది. అయ్యో అంటూ పిల్లాజెల్లా, ఆడా, మగా పరుగెత్తి వచ్చారు. ఆ వూరి బావినీళ్ళు వాళ్ళకు నిషిద్దం. బకెట్లనూ, బిందెలనూ, కడవలనూ తాకడం నిషిద్దం. ఎలా తాకాలా అని వాళ్ళు, తాకితే ఎలా అని వీళ్ళు సందిగ్దంలో కొట్టుమిట్టాడుతూ వుంటే మాదిగ గంగులు “మీ బిందెలూ బకెట్లు మేము తినము లేమ్మా, ఇటియ్యండి” అని శూద్రుల చేతిలోని బిందెను లాక్కున్నాడట! అంతే.. శూద్రుని యింటి నిప్పు ఆర్పే భాధ్యతను మాదిగపల్లె స్వచ్చందంగా నెత్తినేసుకుంది. పిల్లా పెద్దా, ఆడామగా తేడా లేకుండా బావినుండి నీళ్ళు కొందరు తోడితే, కొందరు మోసుకొస్తే, మరికొందరు నీళ్ళు చళ్ళారు. ఆ మాదిగల సమిష్టి శక్తికి నిప్పు తలవంచింది. ఆ ఒక్క యిల్లుతోనే సరిపెట్టుకుంది.

ఇక నిప్పు ప్రమాదం లేదని నిక్కంగా తెలిశాక నేనొక్కన్నే బయటకు మోసి తెచ్చిన ఆ బియ్యం మూటను ఎంత ప్రయత్నించినా మళ్ళీ యింట్లోకి మోయలేకపోయాను. ఆ మూటను యింట్లోకి మోయడానికి సాయం పట్టిన మా యింటి మాదిగ సుబ్బరాయుడు గడప దాకా సాయం పట్టి అక్కడ ఆగిపోయాడు.

*

ప్రసాద్ చరసాల

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు