కొమ్మలు వంగిపోతున్నట్లుగ నైరూప్య చిత్రం
ఆకాశంలోంచి మేఘాలు విచ్చుకుపోతున్న దృశ్యం
చినుకులు లేకున్నా వర్షం కురుస్తున్న వాతావరణం
పర్యవసానాలకూ ఎదురునిలిచే ఊహాగానం
ఎన్ని పరీక్షలనైనా మనసు ఎదుర్కోవాల్సిందే
ఎన్ని ఎక్స్ రే లకైనా దేహం సంసిద్ధమే
ఫలితాలను బట్టే సరిగమ పదనిసలు
పరిగడుపున రక్తం నమూనా ఇచ్చి వచ్చిన్నుంచి
అది మధుమేహమా మాధుర్య ప్రవాహమా !
రిపోర్టు వచ్చేదాకా అగులు బుగులు లోకం
రక్తంలోనూ మంచి కొవ్వు ,చెడ్డ కొవ్వులట
రెండింటి సమతుల్యతనే సరివేగం
నూనెలోనే లీనమైన ఎల్ డి ఎల్ ఏర్పడని ప్రమాదం
లిపిడ్ ప్రొఫైల్ లిపిలోనే ఆ జీవ రహస్యం
కళ్లెదుట కనిపించేదంతా కాంతిమంతమే
లోలోన బుస కొట్టే పామును పట్టుకోవాలి
సిరలు ధమనుల వేగం సరి సమానంగ నిలపాలి
జీవన యానంలో ఎదురుచూపుల ఘడియలెన్నెన్నో
ప్రశ్నలకు జవాబులు చక్కగానే రాసి
హాల్ టికెట్ సంఖ్య కోసం దినపత్రికలో విప్పారిన కనులు
పరస్పర పెళ్లిచూపుల నిట్టూర్పులయ్యాక
మోదమో ఖేదమో వార్త కోసం పరితపన
లేబర్ రూమ్ లోంచి ప్రతి సృష్టి శబ్దం
నూతన శిశువు కేక కోసం నిరీక్షణం
పొద్దు తనకు తాను అటు నుంచి ఇటు వాలడం ఖాయం
ఎండా వాన గాలి సమస్తం అనుభవాల సారం
మనిషికైనా కాలానికైనా పరీక్షలే ప్రవాహ గుణ శీలం.
*
Super sir…
కొత్త వస్తువు,వినూత్న అభివ్యక్తి..కవితా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.అభినందనలు
కవిత చాలా బాగుంది ఎప్పుడు ఇలాంటి కవితలు
అందించి మమ్ములను ఆనంద పరచాలని కోరుకొంటుంన్నాము.
జీవిత సత్యాల కలబోత ఈ కవిత. బాగుంది సర్
CONGRATS A good poem
nice Anna
ఆలోచింపజేసిన పరీక్ష పెట్టారు.
రక్తాన్ని పరీక్షకు కూచోబెట్టి ఫలితం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న మీ కవిత బాగుంది అన్నా. కొమ్మలు వంగక తప్పవు. మేఘాలు కురవక తప్పవు. కానీ కవులు, రచయితలు ఎంత ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటే అంత ఎక్కువ సాహిత్యం సమాజానికి అందుతుంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి.
అనుభవాల సంపుటి మీ కవిత్వం