కాళ్ల క్రింద ఎండుటాకుల పద ధ్వని విని చూస్తే అకాల శిశిరాల్లా శిరస్సులు నేలరాలుతున్నాయి. కాలుతున్న చితిమంటలు శ్మశానాల్లోంచి దావానలమై ఊళ్లలోకి ప్రవేశించి మనసులను ధగ్దం చేస్తున్నాయి. పొద్దు వాలుతున్న నిరంతర దృశ్యాల మధ్య వెలుగును జయించిన ప్రేతాత్మల కళ్లలో చీకటి రేఖల ఆనందం విరజిమ్ముతోంది. అంతటా మృత్యు సంరంభం.. మనిషి పరాజయం చూసి విగ్రహాల పెదాలపై నిర్జీవ మందహాసం కొడిగట్టుతున్న దీప కాంతిలా వెలుగుతోంది.
శవాలపై ముసురుకుంటున్న ఈగల్లా సందేహాలు తిరుగుతున్నాయి. మార్చురీ నుంచి అప్పుడే వచ్చిన శవం తాజాదనంలా సరికొత్త భావాలు మెదులుతున్నాయి. గుర్తుతెలియని ఎన్నో మరణాల్లో మృత్యు రహస్యాలను ఎలా అన్వేషించను? మోదుగుపూలల్లా నిండిన నెత్తుటిసంధ్యలో వెన్నెల స్వప్నాల్ని ఎలా ఆస్వాదించను?
ఈ మృత్యు కాలుష్య నగరంలో కూడా అడవుల్లోంచి ఒకేసారి వేల చితులు రగులుతున్న చప్పుడు వినిపిస్తోంది. వేలాది గర్భస్రావాల వికృత కేరింతలు వెంటాడుతున్నాయి. శ్మశానాల నగరంలో సమాధులే సౌందర్య చిహ్నాలవుతున్నాయి.
గోదావరులు ప్రవహించడం లేదు. జైళ్ల నుంచి ప్రేమ లేఖలు రావడం లేదు. ఒళ్లు పిడికిళ్లు కావడం లేదు. జైత్రయాత్రలు చరిత్ర పుటల్లో కలిసిపోయినా అవి నాపై నా పాదాల నెత్తుటి మరకలు విడిచి వెళ్లాయి. పేగుల తీగలపై నా ఆకాంక్షల్ని మీటాలనుకున్నా ఏ శివుడో దిగివస్తాడన్న ఆశలేదు. వీరుల సమాధులు స్ఫూర్తిగీతాలు కావాలనుకుంటే నా సజీవ సమాధికి చెదపురుగులు పడుతున్నాయి.
ఏను మరణించుచున్నాను; ఇటు నశించు
నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు….అని కృష్ణశాస్త్రి ఏనాడో విలపించాడు.
ఎవరి నయనాలైనా ఎందుకు చెమ్మగిల్లుతాయి. ఆయనకు జరఠాంధకారం కనిపించింది. నాకు యవ్వనాంధకారం కనిపిస్తోంది. వారి చితులు వారు పేర్చుకున్నవారే, వారిపై వారే పడి రోదించే వారే తచ్చాడుతున్నారు.
నేను చనిపోయినప్పుడు నా కోసం దు:ఖించకు.. అని షేక్ స్పియర్ కూడా రాసుకున్నాడు. నీచమైన ప్రపంచం నుంచి ఆయనతో పాటు ఎందరో కవులు, మహానుభావులు పారిపోయారు. అందుకే దట్టమైన నీచత్వం మృత్యువులా పొగమంచులో కలిసిపోయిందేమో..
నేను నిన్నటి అగ్ని బూడిదను కాను.. ఒక కొత్త ఉషోదయపు కాంతిని అన్నాడొక కవి. అదే ఆశతో ఉదయమే తలుపు తెరిచాను. వార్తాపత్రిక నెత్తురోడుతూ కొనఊపిరితో కొట్టుకుంటోంది.
బాధాగ్ని లో పునీతుడైన మనిషి పాదధూళితో
మరణానంతరం నేను పాడే స్వేచ్చాగీతాన్ని రచిస్తా అన్న అజంతాలా నేను మృత్యువును ప్రేమించలేను.
జీవించిన సమయంలో నేను రాసే స్వేచ్చా గీతాల్ని నా మరణం తర్వాత కూడా ఎవరైనా పాడుకుంటారేమో…
చిదానంద రూపం శివోహం,శివోహం అంటూ నేను శంకరుడిలా నిర్వాణ శతకమూ రాయలేను. వెలుగురేఖలీనే ఉదయంపై ఎన్ని పద్యాలైనా రాయగలనేమో..
ఏదీ చెప్పకుండా మరణించిన వాడే గొప్పవాడు. అన్నాడు సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా. ఎందుకంటే ఎన్నో చెప్పిన వాడూ మరణించాడు. అతడు చెప్పిన ఎన్నో విషయాలూ అతడితో పాటు మరణించాయి. శబ్దాలు, స్వప్నాలు, వైఫల్యాలతో పాటు. అతడు లేడు, అతడి విగ్రహం మిగిలింది నిర్జీవంగా.. ఏం లాభం?
అమరత్వం ఒక గొప్ప పదం.. అది అందరికీ వర్తించదు. ఆత్మహత్యలకు అసలే వర్తించదు. నిప్పుల్లో దూకేవారు, నూతులు, గోతులు వెతికేవాళ్లు, ఆకాశహర్మ్యాలు కట్టుకుని ఎక్కి నేల కూలేవారూ, మృత్యువును భుజాన వేసుకుని నడిచేవారిలో అమరులకోసం ఎలా అన్వేషించను?
శ్మశానాలను నిర్మించుకుని, చితులు పేర్చుకుని మృత్యుదేవత సౌందర్యాన్ని ప్రేమిస్తూ ఆనందంగా వెళ్లేవారు ఒకవైపు. వారి జీవితాలను మహోజ్జ్వల చరితలుగా కీర్తిస్తూ పుస్తకాలు, ప్రసంగాల్లో మృత్యుగీతికలు ఆలపించేవారు మరో వైపు. కొన్ని దశాబ్దాలుగా పుస్తకాల్లో జీవితం చినబోతూ కనిపిస్తోంది. గోడలపై ఒకరి నెత్తురు ఆరకముందే మరొకరి నెత్తురు నినాదమై మెరుస్తోంది.
కళ్లముందు కనపడే స్వప్నాలకన్నా మళ్లిపోయిన వసంతాల గురించి తల్లడిల్లడం నాకిష్టం లేదు. దృశ్యాల్ని సూర్యోదయాలుగా మార్చుకోవడం కన్నా జ్ఞాపకాల్ని తడిమి వెళ్లిపోయిన వెన్నెల్ని స్పృశించడం నాకిష్టం లేదు. మరణం చిరస్మరణీయమే..కాని బూడిదను పులుముకోవడం నాకిష్టం లేదు.. అని నాలుగు దశాబ్దాల క్రితం రాశాను.
అప్పటి నుంచి అక్షరాల నుంచి బూడిద రాలుతూనే ఉన్నది.
*
excellent