‘దండకడియం ‘ లోని కవితల తర్వాత నాకు బాగా నచ్చిన కవితల్లో ‘నలుగురక్కలు ముగ్గురు తమ్ముండ్లు’ అత్యంత ఇష్టమైనది. ఆ ఇష్టానికి కారణం అక్కలకు తమ్ముండ్ల మీద ఉండే ప్రేమలను, మా నాయినల జీవితాన్ని చెప్పడమే.
**
మా నాయిన తోడ నలుగురు అక్కలు లక్ష్మమ్మ , సుబ్బమ్మ , నవనీత , దేవమ్మలు . ఒక అన్న , ఒక తమ్ముడు. నాయిన(కృష్ణయ్య ) , పెదనాయిన (పెంటయ్య ), చిన్నాయిన(సాలయ్య ) – ముగ్గురు చేయని పని లేదు. మా నాయినల పేర్లు చెబితే చేతిలో గొడ్డలి, భుజాన పచ్చి కట్టెలను మోస్తున్న రూపు కండ్ల ముందు కదులుతుంది. ఊర్లో ఎవరు ఏ పనికి పిలిచినా పోయేది. పునాదులు తీసిండ్రు. సపారాలు ఏసిండ్రు. తడకలు కట్టిండ్రు.
ఒకరి సొమ్మును ఏనాడు ఆశించ లేదు. ఒకరిని పల్లెత్తు మాట అనలేదు. ఎన్నడూ కొట్టుకున్నది లేదు, తిట్టు కున్నది .అక్కలంటే పానం ఎల్లగొట్టుకునేది. వాళ్ళకు తెలివొచ్చిందాక అక్కల దగ్గరనే పెరిగిండ్రు. వాళ్ళ గొర్ల మందను మలిపిండ్రు. పెద్దగైనంక కొన్ని రోజులు పటేండ్ల దగ్గర జీతాలున్నరు.
పొద్దూకినంక తినడానికి తిండి , తాగడానికి సార ఉంటే చాలనుకున్నరు. బండెడు కట్టెలు కొట్టించుకొని సారవోసి ‘ఇదే నీ కష్టం ‘ అన్న వాళ్ళు ఉన్నరు. పని దొరకని నాడు గొంగడి, గొడ్డళ్ళను కుదువబెట్టి తాగేటోళ్ళు. ఆ తాగుడే వాళ్ళ ప్రాణం తీసింది. రెండు మోపుల పచ్చికట్టెలను భుజాన వేసుకొని నడుస్తుంటే భూమే అదిరేది. అంతటి బలమున్నోళ్ళు. ఇంకా ముప్పై యేండ్లు బ్రతికేటోళ్ళు. తాగి తాగి ప్రాణాలను తీసుకున్నారు. ఊర్లలో ఇలా తాగి ఎంతో మంది ప్రాణాలను పొగొట్టుకున్నారు. పోలీసులకు చెప్పి ఈ ‘సారా’ను బందు చేస్తే బాగుంటుందని చిన్న తనంలో ఎన్నో సార్లు అనుకునేది.
***
నేను నాగార్జున సాగర్ హాస్టల్లో చదువుకునేటపుడు పెదనాయిన, కక్కయ్య , నాయినమ్మ కాళ్ళు మొక్కి సాగర్ పోయేవాడిని. ‘నా కొడుకుకు మంచి నౌకరి వస్తదని’ నెత్తి మీద చేయి పెట్టి పది రూపాయ ఇచ్చి బస్టాండు దాక వచ్చేటోళ్ళు. ఇన్ని ప్రేమల మధ్య పెరిగిన నా కన్న గొప్ప అదృష్టవంతుడెవరని ఎపుడూ అనుకుంటాను.
***
ఎప్పుడైన మా మేనత్తల ఊరికి పోతే ‘ఎప్పుడూ వాళ్ళ తమ్ముండ్లును యాజ్జేసుకుంటూ శోకం కడుతారని’ చుట్టు పక్కలోళ్ళు చెబుతుంటారు. తమ్ముండ్లు ముగ్గురికి ముగ్గురు కండ్ల ముందటే ఒక్కో ఏడాది ఒక్కరు కాలం చేస్తే ఆ అక్కల బాధ చెప్పతరం కాదు. సావు ఖర్చు, మూడోద్దుల ఖర్చు అన్ని పెట్టుకొని ధైర్యం చెప్పిండ్రు మాకు. మా నాయినలు తర్వాత నాయినలు మా మేనత్తలు.
***
మా మేనత్తల ఇండ్ల కాడికోయి ఎంత కష్టం చేసేది, ఎట్ల చూసుకునేది , చిన్నతనం నుంచి వాళ్ళ దగ్గర ఎట్లా పెరిగిండ్రో మా మేనత్తలు ఎప్పుడూ వలపోస్తుంటారు. ఆ వలపోతనే ఈ కవిత. రాఖిట్ల పున్నమి వస్తే ఒక్క తమ్ముడన్న లేకపాయేనని దేవుని మీద మన్ను వోస్తరు. ఒక్క వలపోతనే కాకుండా బహుజన కుటుంబాలలోని ప్రేమలను , సంస్కృతిని , అప్పటి సామాజిక స్థితిగతులను ఈ కవితలో చూపించిన.
పెదనాయిన వలదీసుకొని షికారుకోయి కౌజుపిట్టలు తెచ్చెటోడు. తేనె జోపుకొని వచ్చేది. ఊర్లలో భాగవతాలాట ఆడుతుంటే ఒకసారి శివుడి వేషం వేసిండంట పెదనాయిన. శివుడి వేషం గట్టినప్పుడు నిష్టగా ఉండేదంట. జంగమవేషం గట్టినప్పుడు మా పెదనాయినకు బిడ్డ పుడితే పార్వతమ్మ అని పేరు పెట్టుకున్నడు.
మా నలుగురు మేనత్తలు ఎప్పుడు మా ఇంటికొచ్చినా తెల్లవారు జామున నాలుగింటకే లేచి కాళ్ళు సాపుకొని ఆపతి సాపతి చెప్పుకునేవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళను తల్చుకొని కంటికి పుట్టెడు ఏడ్చేటోళ్ళు . మా తమ్ముళ్ళు కండ్ల ముందలుంటే చాలని
దేవునికి మొక్కుకున్నరే గానీ ఏనాడు తమ్ముండ్లతో గొడవ పడలే. అందుకే మా మేనత్తలు వాళ్ళ తమ్ముండ్లను తలుచుకుంటున్న గొంతుతో, మా మేనత్తలు మాతో మాట్లాడుతున్నట్టుగా ఈ కవిత రాసిన.
ఇన్ని ప్రేమలు ఇప్పుడెక్కడివి?
పండుగైనా, పబ్బమైనా ఫంక్షన్ హాల్ నుంచి చూసి రావడమే తప్ప రెండు రోజులు ఉండి పనిచేసి వచ్చే రోజులు పోయినయి. “మా తమ్ముండ్లు పోయినా మీరున్నరు .ఈ తొవ్వలు మర్వకుండి తమ్మీ ” అని ఎప్పుడూ వచ్చినా అనేది. వాళ్ళ మాటలే ఈ కవితను రాసేలాగ చేసినయి.
**
నిజానికి ప్రపంచ సాహిత్యం ఎక్కడో లేదు. మన చుట్టూ ఉన్న జీవితంలోనే ఉంది. చిన్నమ్మనో , మేనత్తనో కలుపు దీస్తూనో , వడ్లు తూర్పాల పడుతూనో మాట్లాడుకునే మాటల్లో ఉంది. వాటిని మన సాహిత్యంలో రికార్డు చేయడమే గొప్ప విషయం అనుకుంటాను. కథ, నవల రాసేంత విస్తృత జీవితమున్న సందర్భం ఈ కవిత. దేవక్క జీవితాన్నే ‘ఆరివారం’ కథగా రాసిన. ఇన్ని వాక్యాలలోనే రాయాలనే పరిమితులనేవి పెట్టుకోలేదు.మా మేనత్తలు మాతో మాట్లాడుతున్నట్టు సంభాషణాత్మకంగా రాసిన. తెల్వనోళ్ళు ఎవరైనా “మీరు ఎంత మంది ? ” అంటే నలుగురు అక్కచెల్లెళ్ళం , మా తోడ ముగ్గురు తమ్ముళ్ళు అని అంటుంటారు సహజంగా . ఆ మాటనే శీర్షికగా పెట్టుకున్న. తమ్ముడు లిఖిత్ కుమార్ గోదా ఈ కవిత మొత్తాన్ని ఒకసారి ఒక వాక్యం పొల్లు పోకుండా నోటికి చెప్పిండు. ఈ కవితకు దక్కిన గొప్ప గౌరవం ఇది. నాయిన , కక్కయ్య , పెదనాయినల జీవితాన్ని మళ్ళొకపారి తల్చుకునేలా చేసిన
సారంగకు నమస్కరిస్తూ…
నలుగురక్కలు,ముగ్గురు తమ్ముండ్లు
మా తమ్ముండ్లు పోయిండ్రు
మీరే మా తమ్ముండ్లనుకుంటం
తమ్ములారా
ఈ తొవ్వలు మర్వకుండి
మెత్తమెత్తని తున్కలు,కార్జాలు
ఏరి ఏరి తలెలో వెట్టి మీదంగ బువ్వగప్పేది
కౌజుపిట్టల్ని కాల్చుకొని తెచ్చి
పక్కన కూసొని తిన్నదాక విడువకపోయేది
మా తమ్ముండ్లలాంటి తమ్ముండ్లు
ఇంగ ఎవరికీ వుండరేమో
లోకానికి చూడ పేదొళ్ళు కావొచ్చు
మేము తినేదాక తినని
నిండుకుండ బువ్వలు
పదేండ్ల పిల్లలున్నప్పుడు మాకు పెండ్లీలైతే
అరుణమిచ్చిన మేకలోలె మా వెంబడొచ్చిండ్రు
దేవుడు బీరప్పను
అక్క మాంకాళి దేవి సాదుకున్నట్టు
సల్లలు వోసి సాదుకున్నం
సముడ్తముట్ల కాన్నుంచి కాన్పుల దాక
వాళ్ళు చెయ్యని పనిలేదు
మా నాయిన మూడుగొర్రెపిల్లలనిస్తే
వందనగలుగా పెంపుజేసిండ్రు
మా పిల్లల్ని సంకదించకుండ ఎత్తుకున్నరు
బండెడు కట్టెలను పల్గచీరి
పొయ్యిలకుమండె కట్టెలయ్యిండ్రు
ఎట్ల మరిచిపోదుమురా
ఆ దోరజామపండ్ల రూపాలను!
ఇంటిముందల కాకి మొత్తుకున్నప్పుడు
మా తమ్ముళ్ళే వస్తరనుకుందుము
కుడికన్ను అదురుతుంటే
వేయికండ్ల ఎదురుచూపుల పాటలైదుము
చాటలో ఇంకిన్ని బియ్యం బోసి
మెరికలేరుతూ తమ్ముండ్లరాగమెత్తుకుందుము
ఇప్పుడు మా దాపటెద్దులు గుర్తొస్తే
నోట్ల బుక్క నోట్లనే వుంటది
కమ్మని కూర గూడ చేదుగైతది
కల్లుసుక్క తాగనీక ఆకుపట్టుకున్నప్పుడు
తొలిధార మా తమ్ముండ్లకు వొంపుకుంటున్నం
కూలికోయిన కాడ మునుంబడుతుంటే
మా వెండికోడెలను ఆత్మల్ల తల్చుకుంటున్నం
ఇగో తమ్ముడా
గిప్పుడు గన్క మా తమ్ముండ్లుంటేనా
రెక్కలు కట్టుకొని మా ముందు వాలు
పిల్లికూనలోలె సుట్టుజేరి
మమ్మిడిసి పక్కకు జరుగకపోదురు
లేకలేక మా అక్కలొస్తే
పుంటకూర నూర్తవా అని
మీ అమ్మల మీద గుత్పలందుకుందురు
పుంటికూరదిన్నా పుట్టినిల్లుకావాలంటరు
మీ ఆడిబిడ్డలను చేసుకోలేదని
మా మీద క్రోధలు పెంచుకోకుండ్రి
అత్తలు మీ అత్తలైనా
మావలు మీ మావలు కాదు తమ్మీ!
మీరు మా మ్యానల్లుండ్లే కాదురా
మా ముగ్గురు తమ్ముల నోట్లనుంచి
ఊడిపడ్డట్టున్న ప్రేమముద్దలు.
మీ రక్తం గలిసిన మేము
మీ నాయిన తర్వాత నాయినలం
మా తమ్ముండ్ల మీద
మాకు ప్రేమలు లేవని అనుకోకుండ్రి
సంచుల్ల జొన్నలు వోసి
ఎవరూ కానకుండ మధ్యలో
గట్టి ఇప్పపూల సారను పంపినం
దారిలో ఆకలైతే తింటరని
రొట్టెలు మడిచి అంచుకుతొక్కేసి
తువ్వాలబట్టల్ల సద్దులబతుకమ్మలైనం
మా పెద్దతమ్ముడు పెంటయ్య
జంగమవేషం కడితే
శివుడు నేలమీదికి దిగినట్టుండేది
నా నడిపితమ్ముడు కృష్ణిగాడిది
తలుపంత ఎన్నుపట్టె
చిన్నోడు సాలయ్య బక్కపల్చగున్నా
ముగ్గురు మనుషుల పని ఒక్కడే చేసేది
ఓ సారి ఏమయ్యిందో ఎరుకేనా తానేషా?
నేను బాయిలవడ్డనని కలొస్తే
మోకాలంత కొట్టుకపోంగ
మూడు తాండలుదాటి
నాత్రికి నాత్రి కిందమీద పడుకుంట వచ్చిండురా
ఉడుకుడుకు నీళ్ళువోసి ,పెయ్యి రాసి
తానం చేపిచ్చినంక మనిషయ్యిండు
ఒరే గోపిగా ,ఇక్కడినురా
మీ నాయినను ఎవరైనా
ఒక్కమాటంటే అస్సలు పడకపోవూ
కోపమొచ్చి మీ మామ ఓ మాటంటే
యేడాది మళ్ళిజూడలే మా ఊరిదిక్కు
మా అక్క మీద ఒక దెబ్బ పడితే
మర్యాద దక్కదని
మీ మావలను వొణికిచ్చుకుండు
ఓ సారి గుట్టల్ల సితవోలపండ్లను కాల్చుతుంటే
నేను గుర్తొచ్చిన్నంట చిన్న తమ్మునికి
మ్యాకలను గుట్టలనే వొదిలి
పొద్దూకముందుకే మా గూట్లవడ్డడు
ఇంటికాడ ఎవరికేమయ్యిందో అని
పానాన్ని అరిసేతుల్ల పెట్టుకొని అడిగితే
కాల్చిన కాయలు నీకిష్టము కదక్కా అని
తువ్వాలమూట చేతిల పెట్టిండురా మహేషా!
చీరవెట్టకున్నా,సారెవోయకున్నా
మా తమ్ముండ్లపిల్లలు బాగుండాలని
కడపలు గడిగి బొట్లువెట్టి
కోటొక్క దేవునికి నూటొక్క మొక్కులైనం
పదిరూపాయాలు మావే అయినా
పండుగపూట కొత్తచీరలు కట్టుకొని పోయి
మా తమ్ముండ్లు పెట్టిండ్రని చెప్పుకుందుము
మా తమ్ముండ్లిప్పుడూ
పండుగపండుగకు మా ఇండ్లకొచ్చి
“పయనం గా అక్కా “పోదామంటారా?
ఇంటికాడ మేము కనబడకపోతే
మా చెల్కల్లకు దేవులాడుకుంట ఎదురొస్తరా?
మా కండ్లముందట పెరిగినోళ్ళు
మా కాళ్ళల్ల తిరిగినోళ్ళు
మమ్మల్నే సాగనంపేదిబోయి
మా చేతులతోటే మట్టిపోయించుకుండ్రు
మా కన్నీరు ఏ దేవుడికి ముడుతదో
మా బాధ ఏ భగవంతునికి చేరుతదో
రొమ్ములు కొట్టుకొని ఎంత ఏడ్చినా
తీరేదా తమ్మీ!మా దుఃఖం
(పాలపిట్ట, అక్టోబరు 2020 లో ప్రచురితం)
ఎంత బాగుందో ఈ కవిత. అక్కడ కూర్చుని అత్తల వలపోత నేనే విన్నట్లుంది.
ఒక బతుకు కథ లో తమ్ముళ్లకు అక్కలు ఇచ్చే భరోసా ఎంత గొప్పదో వివరించిన కవిత విశ్లేషణ💐 పదంతో చేసిన కష్టానికి పానం అలుస్తది అనుకున్నారు పానం తీస్తదనుకోలేదు( సారా) ఈ దుఃఖము వర్ణించడానికి అక్షరాలు సరిపోవు
మానవ సంబంధాలను ప్రతిబింబించే కోవలోనే కాక జీవన సంస్కృతి ని రికార్డ్ చేసే కవిత్వం కోణంలోనూ నేను దీన్ని భావిస్తాను.
తమ్ముడూ! కవిత్వం వెనుక కథ చెప్పడం కష్టం నా దృష్టిలో. హృదయపూర్వక అభినందనలు 💐
చాలా చాలా బావుంది.
అభినందనలు మంచి కవిత్వానికి!