అకాల మరణ రుతువుల్లోంచి…

సంపుడు పంజెం కథ చదివి మూసేసిన తరువాత మన రక్త నాళాల్లో ఒక దళిత దృక్పథం నిశ్శబ్దంగా పరుచుకుంటుంది.

               దేశానికి స్వతంత్రం  వచ్చి డెబ్భై వసంతాలు దాటిపోయింది. ఐనా ఇంకా ఈ దేశ ప్రజల జీవితాల్లో, ముఖ్యంగా దళితుల జీవితాల్లో వెలుగు లేదు. పాతికేళ్లలోపున్న విధవరాళ్ళు దళితుల్లోనే ఎక్కువంటే ఆశ్చర్యం కలుగుతుంది. మెరుగైన జీవన నైపుణ్యాన్ని, కొనుగోలు శక్తిని కల్పించాల్సిన రాజ్యం సబ్సీడిలు ఇస్తూ, రెండు రూపాయలకే కిలో బియ్యం లాంటి ఉదార పథకాల్నిప్రవేశపెడ్తూ వీధికో వైన్స్ షాపు, ఊరికో బెల్ట్ షాపు తెరిచి ప్రజల నాలుకల మీదికి మద్యాన్ని ఏరులై పారిస్తుంది. ప్రజల ఆకలి కెరటాల పదును తగ్గించడానికి ఏటా నూరు దినాల పని లేదా సీజనేబుల్ ఎంప్లాయ్ మెంట్ చూపించి మిగతా రోజుల్లో పస్తులుండేలా తయారు చేస్తుంది. గొర్రె తోక లాంటి బెత్తెడు ఆదాయంతో జీవికను సాగించలేక ప్రతి యేటా ఎంతో మంది దళితులు మృత్యువును కౌగిలించుకుంటున్నారు. మెల్ల మెల్లగా రాజ్యం ప్రజా సంక్షేమం నుండి తప్పుకొని దళితుల నుదిటిపై మరణ శాసనాన్ని లిఖిస్తోంది. ఏ మనిషీ ఈ నేలకు ఎక్కువ కాలం అక్కరలేదు. కానీ ఇంకొన్ని సూర్యోదయాలు మిగిలుండగానే జీవితం అర్దాంతరంగా ముగిసిపోవడం చాలా విషాదం. తెలంగాణ తొలి దళిత కథా సంపుటి ‘అవుటాఫ్ కవరేజ్ ఏరియా’ తో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన డా. పసునూరి రవీందర్ ఈ అకాల మరణ రుతువును సంపుడు పంజెం SAMPUDU PANJEM KATHA పేర ఒక అద్భుతమైన కథగా రాసి తెలుగు కథా సాహిత్య చరిత్రకు మరో కథను జోడించారు. ఈ కథ 13 జూలై 2014న నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధం ‘బతుకమ్మ’ లో ప్రచురితం అయింది.

హైదరాబాద్ లో ఒక ప్రైవేటు జాబ్ చేస్తూ బతుకుతున్న కథకుడు ఒక్క రోజు సెలవు పెట్టి ఎక్కడో పల్లెలో యాభై ఏళ్ళు కూడా లేని తన చిన్నాయిన జనయ్య (జనార్ధన్) చనిపోతే అంత్యక్రియలకు వస్తాడు. బొంద దగ్గరకు పోయి వచ్చి స్నానం చేసి ఇంట్లో కూర్చోగానే అంతకు ముందు బొంద దగ్గరకు పోతున్నప్పుడు తన చిన్న మామ కొమ్మయ్యకు తనకు జరిగిన సంభాషణ గుర్తుకొస్తుంది. నేను చనిపోతే కూడా ఇలాగే అందరూ రావాలంటాడు కథకుని మామ కొమ్మయ్య. ఇప్పుడు నీకేం కొంప మునిగిందే అప్పుడే చావు గురించి మాట్లాడుతున్నావ్ అని ప్రేమగా తిడతాడు కథకుడు.

ఇంతలో బొంద కాడికి పోయివచ్చిన బంధువులందరు ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లకు దిగుతారు. “నీయవ్వ ఏడేడు తరాల దరిద్రానికి ఇంతమంది పిల్లల కనుడెందుకని ఒక్కసారన్న ఆలోచించకపాయే. ఒక్కనాడన్నా కడుపునిండ తిన్నది లేదాయే. కంటి నిండ పన్నది లేదాయే. పోరగాళ్లకు అంగి ఉంటే లాగుండదాయే. లాగుంటే అంగి ఉండదాయే. ఈ బాధకే కావచ్చు పోతకు (తాగుడుకు) మరిగిండు. ఒక్క దినం పని జేసుడు రెండు దినాలు తాగుడు. ఇగేడ నడుస్తది సంసారం. జనయ్య ఒక్కడేంది మాదిగ వాడ మీద అందరిదీ ఇదే కత. ఎవలదైనా పొక్కిలైన బతుకే” అని కథకుని పెద్దయ్య… జనయ్య మరణించడానికి గల పరోక్ష కారణాలను వల్లిస్తుంటాడు. కథకుడు తన చిన్నాయిన జనయ్య బతికి ఉన్నప్పుడు తాను కొంచెమైనా ఆదుకోకపోతినని పశ్చాత్తాపపడుతాడు. కానీ తన చిన్న జీతంతో అదెలా సాధ్యపడుతుందని ప్రశ్నించుకుంటాడు. ఇంతలో కథకుని పెద్దయ్య కథకుని వైపు తిరిగి తన కంటే చిన్న వాడైన జనయ్య మరణాన్ని తల్చుకొని బాధపడుతాడు.

“అవును జనయ్య కంటే ముసలోల్లు ఎందరో బతికే ఉన్నారు. కానీ జనయ్య మాత్రం బతక లేక పోయిండు. జనయ్య కంటే ముందు ఈ నడ్మ మా సుట్టాలల్ల ఒకలిద్దరు ఊరి పెట్టుకొని సచ్చిన్రు. తిండి లేక మంచాన పడుడు. మనసిరిగిన్నాడు జీవిడుసుడు. సావెంత అగ్గువైంది. తలుసుకుంటేనే మనసంతా నీళ్ళు నీళ్ళు అయితది.”అని కథకుడు లోలోన బాధ పడుతుంటాడు. అప్పుడప్పుడు నువ్వు మమ్మల్ని చూసిపోవాలి అని పెద్దయ్య కథకుడిని ఆవేదనతో వేడుకుంటాడు. కానీ ఒక్క రోజు సెలవు దొరకడమే కష్టమైన కథకుడు ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. ఇంతలో కథకుని అమ్మకు, పెద్దయ్యకు జరిగిన సంభాషణలో కథకుని మరో పెద్ద నాయిన దుర్గయ్య కూడా బాగాలేడని తెలుస్తుంది. దుర్గయ్య ఊర్లో మంచి నాటక కళాకారుడు. ఆయన ఇప్పుడో అప్పుడో అన్నట్లుంటాడు. మనమంతా పోయి రేపు వాణ్ని చూసొద్దామని పెద్దయ్య కథకునితో చెప్తాడు. కానీ కథకునికి మరో రోజు సెలవు దొరకక చీకటితోనే హైదరాబాద్ కు రైల్లో బయలుదేరుతాడు. పోతుంటే అన్నీ దుర్గయ్య గురించిన ఆలోచనలే కథకునికి. దుర్గయ్యను అడిగి తను వేసిన వేషాలేమిటి? తమ పూర్వీకుల చరిత్ర ఏమిటి? అంతా తెలుసుకొని రికార్డు చేయాలి. రేపటి తమ పిల్లలకు తమ వంశ చరిత్రంతా చెప్పాలి అని కథకుని ఉబలాటం. వారం పది రోజుల తరువాత కథకుని అమ్మ ఫోన్ చేస్తే దుర్గయ్య పెద్దనాయిన ఎట్లున్నడని అడుగుతాడు. నువ్వు పోయిన తెల్లారే సచ్చిపోయిండు బిడ్డా. అంత దూరం నుంచి నువ్వు మల్లేడ వస్తవని నీకు చెప్పలేదు  అని ఏడుస్తుంది. ఆమె దుక్కంలో కథకుని దుక్కం కూడా కలిసిపోతుంది.

ఉపరితలంలో ఇవి ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితులు బాగాలేక జరిగిన మరణాలుగానే కనిపిస్తాయి కానీ నిజానికి ఇవి  రాజ్యం చేస్తున్న హత్యలే. కూలి దొరికిన్నాడే నోట్లెకు ఇన్ని మెతుకులు పోతాయి. లేదంటే ఆ బాధ తోని తాగుడుకు బానిసలవుతారు. కుటుంబాలు వీధిన పడుతాయి. పిల్లలు ఆకల్ని కప్పుకొని నగ్నంగా రోడ్డెక్కుతారు. మార్కెట్ డిమాండ్ చేసే నైపుణ్యమున్న యువతకే పని కల్పించలేని ప్రభుత్వాలు ఇక ఒట్టి చేతులకు ఏ పని చూపిస్తాయి? పనికి ఆహారం లాంటి ఉపాధి హామీ పథకాలు ఎంత కాలం పొయ్యి మీదికి గిన్నెను ఎక్కిస్తాయి? పట్టించుకోకపోవడం కూడా ఒక కుట్రే. వ్యవసాయ రంగంలో నూటికి అరవై శాతం దళితులే ఉన్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి వెన్ను దన్నుగా నిల్చుంటే ఈ దేశంలో ఎన్నో ఆత్మహత్యలు ఆగుతాయి.

దేశ వ్యాప్తంగా రోజూ జరిగే కొన్ని వేల మరణాలు సహజ మరణాలు కావని గుర్తించాలి. ఉత్పత్తి కులాలను ఆత్మహత్యల వైపు నెడుతూ వారి జీవించే హక్కును కాల రాస్తున్నాం. పసునూరి రవీందర్ ఈ కథ ద్వారా దేశంలోని దళితుల దీన స్థితితో పాటు, వ్యవసాయ రంగ సంక్షోభాన్ని కూడా చర్చకు పెట్టారు. రవీందర్ రాసిన మిగతా నయా నగర దళితవాద కథల్లో  ఈ కథ వైవిధ్యమైంది. ఈ కథ పైకి రెండు దళిత మరణాల్ని చిత్రించిన కథగా కనిపించినా ఇది ఈ దేశ దళితుల జీవితాన్ని, స్థితిగతుల్ని విప్పి చెప్పిన కథ. అంతే కాదు ఏ పరిస్థితులు దళితులను అకాల మరణం అంచులకు తోసేస్తున్నాయో చెప్తూనే దళిత యువతరం పట్టణాల్లో ఎంతటి అభద్రతాపూరితమైన జీవితాల్ని గడుపుతుందో చిత్రించిన కథ కూడా. దళితుల జీవితాల మెరుగుదలకు ఏం చేయాలో ప్రభుత్వాలకు ఒక రోడ్ మ్యాప్ ను చూపించే కథ. సంపుడు పంజెం కథ చదివి మూసేసిన తరువాత మన రక్త నాళాల్లో ఒక దళిత దృక్పథం నిశ్శబ్దంగా పరుచుకుంటుంది. పచ్చీసు ఆటలో సంపుడు పంజెం దొరికితేనే ఆట ముందుకు పోతుంది. మరి దళితుల బతుకాటలో ఎన్ని చావు పందేలు పూర్తి ఐతే దళితుల బతుకులు వెలుగు దారి పడుతాయో కాలమే చెప్పాలి.

                  *

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పట్టణీకరణ తెచ్చినవి: కూలిపనుల అదృశ్యం, వేగవంతమైన జీవితం, అరకొర చదువులు, ఖరీదైన నిత్యజీవిత విధానం,ముఠారాజకీయం- ఆ ప్రాపకం కోసం ఆరాటం… ఇందులో చిక్కిన ఎన్నో కుటుంబాలు… పెద్దలు కొందరైతే… యువకులు కూడ ఉన్నారు… ఇతివృత్తపు లోతును చెప్పి వ్యవస్థను ప్రశ్నించారు. బాగుంది.

  • తిండి లేక మంచాన పడుడు. మనసిరిగిన్నాడు జీవిడుసుడు. సావెంత అగ్గువైంది.

    వాస్తవానికి పుట్టిన కథ ఇది…
    సూపర్ మామా…

  • ఇది కథకాదు కొట్లాదిమంది మాదిగల జీవన సత్యం .పనిలేక తాగుడుకీ బానిసలైనా మాదిగల రోజువారి బతుకుపోరు గాధ . బతుకుదెరువు కోసం గ్రామం ఇడ్చి పట్టణాలకు వలసపోయి పనిజేస్కుంటున్న వారికి తమవాళ్ళ ఆకరి చూపు తీరలోటుగానే ఉంటది ..ఇక్కడ ఒక్కకథకుడే కాదు ప్రైవేట్ గా ఉద్యోగాలు చేస్కుంటున్న అనేకుల పరిస్థితి కార్పోటు సంస్థల పనిభారంతో బంధాల ఎడబాటు ఎత తీవ్రమైనా విషాదాన్నీ మింగుతూ బతుకుతున్నదో తెలుస్తుంది.పరిమితులకు మించి ఉండనీ సెలవులు యేమిజరిగిన ఆదుకోలేని సంపాదనలో తను బతకడమే సోకం సాగుతున్న దళితుల జీవితాలను డా”పసునూరి ఒడ్చిపట్టుకున్నడు స్వతహగా దళితుడు కావడం ఈ జీవితం స్వీయ అనుభవమై ఉంటుంది.ఇదొక్క కథకుడి మాత్రమే కాదు దళిత యువకుల రోధన.

    తన చరిత్రను అక్షరంబద్దం చేయతల్సిన కథకుని ఆరాటాన్నీ ఇక్కడ మనం గమనించాలి.ఊహకథల్లో తేలిన తెలుగు సాహిత్యానికి తనజాతి శ్రమైక జీవితగాధలను రాబోవు తరాలకు అందించాలనే తపన ఎంతో స్పూర్తిదాయకంగా కనిపిస్తుంది.ఆకలి చావులతో వేలాధి సంవత్సరాలుగా తమ కళలను బతికిస్తూ వస్తున్న మాదిగల మౌఖిక కళారూపాలకు అక్షరరూపంతో రాబోవు వేలసంవత్సరాలకు అందించాలనుకోవడం ఒకరకంగా ఇది మనువాద కల్పిత బ్రహ్మణ అక్షరాలకు సవాలు విసరడమే.
    నేటి దళితయువకులు సైతం అంటరానిదిగా భావించబడిన తమ జీవితాలనే సాహితిప్రపంచానికి అందివ్వాలనే కథకుని ఆవేధన మనకు ఇ కథలో బోధపడుతుంది.

    డాక్టర్ పసునూరి రవిందర్ గారి రచనలు తనజాతి ఈప్రపంచానికి అందించిన శ్రమను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మాత్రమేకాక కళకు పుట్టినిల్లు తనమాదిగజాతేననీ సగర్వంగా రాస్తున్న దమ్మున్న కలం.వెతలకు గురైనా తనమాదిగ జాతికి అక్షరం జీవనం పోయడం వలనే ఆయనకు తెలంగాణ రాష్ట్రం నుండి తొలి కేంద్రసాహిత్య యువపురస్కాని అందుకున్నడు.డాక్టర్ పసునూరి గారియొక్క తపన ఆయన జాతిపట్ల ప్రతి అక్షరంలో కన్పించడమే అందుకు నిదర్శనం.

    • ధన్యవాదాలు వర. మీ స్పందనను ఇంత విపులంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు. రెండు నవలలు రాసిన రచయిత గా మీ కృషి తెలుగు సాహిత్యానికి ఇంకా తెలియజేయాల్సి ఉంది.
      జైభీం

  • డాక్టర్ పసునూరి రవీందర్ ఒక నిత్య చలనశీలి.. ఒక ప్రజ్వలిత సమాజాన్ని కాంక్షిస్తూ బలమైన వ్యక్తీకరణలతో సాహితీ సేద్యం చేస్తున్న విప్లవ శ్రామికుడు .తన జాతి అణచివేతకు ఎలా గురి అవుతున్నదో ..మైక్రో లెవెల్స్ లోకి వెళ్లి సమాజ దుర్నీతిని వెలికితీస్తూ , తన జాతిని జాగృతపరుస్తున్న తెలంగాణా యువ మేధావి.. పోస్ట్ గ్లోబల్ ప్రపంచంలో ఇక అంటరానితనమెక్కడున్నది అనే కుహనా సంస్కరణ వాదులకు పసునూరి సూటి సమాధానం ” అవుట్ అఫ్ కవరేజ్ ఏరియా ” లో తను సృజించిన సాహిత్యం ..ఎక్కుపెట్టిన ఏకలవ్యుని పదునైన బాణం పసునూరి పరిశీలన .
    సమాజంలో మెజారిటీ ప్రజలు తమ తమ జీవితాల్లో అన్ని సందర్భాలలో , ఎదుర్కొంటున్న ఒక కుల పీడనను తిప్పి కొట్టే ప్రయత్నం పసునూరి కథా రచన . దళితస్పృహ అన్నది , జాతి సముద్ధరణకు ఒక రాజకీయ కోణంలో ఉపయోగపడే విధానమైనా…దళితవాదం – మానవతావాదం రెండూ ఒకటే అన్నది ప్రతి కథా చదువుతుంటే, మనస్సంతా మెలిపెట్టినయ్యి , కళ్ళు చెమర్చి మసకబారుతుంటే అర్థమవుతుంది. డాక్టర్ పసునూరి రవీందర్ కతలు దళితుల రాజకీయ అధికారానికి ఒక బలమైన తొవ్వ చూపెట్టాలని మనసారా కోరుకుంటూ.
    జై భీం . వేద ప్రకాశ్ మంగు

    • అన్న జైభీం. థాంక్యూ సో మచ్

  • డెబ్బయి వసంతాలు గడిచిన …మా దళితుల జీవితాలు ఎంత దుర్బరంగా ఉన్నాయో ..రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని మా తాతల తండ్రుల జీవితాల్ని,ఈడ్చుకొస్తున్న మా జీవితము లోని వ్యయ,ప్రయసాల్ని,నాటి తరము నుండి నేటి తరం వరకు ఫాలిష్డ్ జీవన విధానము గా కనిపించొచ్చు కానీ పని అదే,అదే కటిక దారిద్ర్యము,అదే అజ్ఞానము,అదే అంటరానితనం,అదే వివక్ష,మా దళితుల జీవితంలో భాగమై పోయింది…అనేక రోగాల బారిన పడ్డ ఈ దేశానికి రాజ్యాంగము అనే మందు ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ చికిత్స చేయడము వలన కొంత మెరుగుపడ్డది ఈ దేశము కానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ,అత్యవసర చికిత్స అవసరము ఈ దేశానికి…ఏది ఏమైనా మా డాక్టర్ పసునూరి రవీందర్ అన్న లాంటి మేధావి,నిత్యము దళితుల హక్కుల కోసము,అభివృద్ధి కోసము,చైతన్యం కోసము,నిరంతరం ఆలోచిస్తూ,దళితుల అభ్యున్నతికీ మార్గదర్శనం చేస్తున్నాడు….ఈ రోజుల్లో కాసింత కళ (కలం) అంగట్లో అంగడి సరుకుగా అమ్ముకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, కానీ గుర్రం జాషువా వారసుడిగా ,తన కలాన్ని సామాజిక స్పృహతో,సామాజిక బాధ్యతతో ,సమాజము కోసము ఉపయోగిస్తున్న,అన్న రవిందరన్న కు పాదాభివందనం చేస్తూ… మీ కలం కోట్లాది మంది దళితుల గొంతుక కావాలి ,మున్ముందు మీ రచనలు మరింత స్ఫూర్తిని,చైతన్యాన్ని రగిలించాలని,ఎంతో మంది దళిత యువకిశోరాలని ఉతేజపరచి,మనలో కనుమరుగవుతున్న సామాజిక స్పృహ ని,చైతన్యము ని తట్టి లేపాలని… మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్న మన జీవితాన్ని ఆవిష్కరించినందుకు……జై భీమ్…

  • డెబ్బయి వసంతాలు గడిచిన …మా దళితుల జీవితాలు ఎంత దుర్బరంగా ఉన్నాయో ..రెక్క ఆడితే కానీ డొక్కా ఆడని మా తాతల తండ్రుల జీవితాల్ని,ఈడ్చుకొస్తున్న మా జీవితము లోని వ్యయ,ప్రయసాల్ని,నాటి తరము నుండి నేటి తరం వరకు ఫాలిష్డ్ జీవన విధానము గా కనిపించొచ్చు కానీ పని అదే,అదే కటిక దారిద్ర్యము,అదే అజ్ఞానము,అదే అంటరానితనం,అదే వివక్ష,మా దళితుల జీవితంలో భాగమై పోయింది…అనేక రోగాల బారిన పడ్డ ఈ దేశానికి రాజ్యాంగము అనే మందు ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్ చికిత్స చేయడము వలన కొంత మెరుగుపడ్డది ఈ దేశము కానీ పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేయాల్సిన అవసరం ,అత్యవసర చికిత్స అవసరము ఉంది..ఈ దేశానికి…ఏది ఏమైనా మా డాక్టర్ పసునూరి రవీందర్ అన్న లాంటి మేధావి,నిత్యము దళితుల హక్కుల కోసము,అభివృద్ధి కోసము,చైతన్యం కోసము,నిరంతరం ఆలోచిస్తూ,దళితుల అభ్యున్నతికీ మార్గదర్శనం చేస్తున్నాడు….ఈ రోజుల్లో కాసింత కళ ఉంటే (కలం) అంగట్లో అంగడి సరుకుగా అమ్ముకుంటున్నారు కొందరు ప్రబుద్ధులు, కానీ గుర్రం జాషువా వారసుడిగా ,తన కలాన్ని సామాజిక స్పృహతో,సామాజిక బాధ్యతతో ,సమాజము కోసము ఉపయోగిస్తున్న,అన్న రవిందరన్న కు పాదాభివందనం చేస్తూ… మీ కలం కోట్లాది మంది దళితుల గొంతుక కావాలి ,మున్ముందు మీ రచనలు మరింత స్ఫూర్తిని,చైతన్యాన్ని రగిలించాలని,ఎంతో మంది దళిత యువకిశోరాలని ఉతేజపరచి,మనలో కనుమరుగవుతున్న సామాజిక స్పృహ ని,చైతన్యము ని తట్టి లేపాలని… మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్న మన జీవితాన్ని ఆవిష్కరించినందుకు……జై భీమ్…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు