యదేచ్ఛగా దేశంలో సంచరిస్తున్న
తోడేళ్ళ దాడిలో
చిరిగిన మా నగ్నదేహాలని చూసి
‘తప్పంతా మీదే’నని
సభ్యసమాజం తీర్పిచ్చినట్టు
ముమ్మాటికీ తప్పు మాదే !
ఒళ్ళు బలిసి ఒళ్ళు కనపడే
అరకొర బట్టలేసుకున్నాం.
పాపం! అమాయక తోడేళ్ళలో
కామ ప్రకోప రసాలు
కావాలనే పైకి తోడుతున్నాం.
కావాలనే తోడేళ్ళ పళ్ళకి చిక్కి
చీలికలుపేలికలయిన శవాలమవుతున్నాం.
మరి, పసి మొగ్గలేం పాపం చేసినియ్ ?
మరి, ముసలి ఒగ్గులేం వల వేసినియ్ ?
పిల్లల్ని నేలకేసి కొట్టినందుకు-
ఇంకా విప్పారని ఆడపిల్లల్నీ
పిల్లల తల్లుల్నీ పువ్వుల్ని చిదిమేసినట్టు
నలిపి నాశనం చేసినందుకు-
దండలేసి దండం పెట్టే దేశం మనది..
గర్భగుడిలో పిల్లని చెరిచి చంపేసిన
తోడేళ్ళ క్షేమం కోసం
రాస్తాల మీద ర్యాలీలు దీసిన-
రామరాజ్యం మనది..
చిందరవందరయి రక్తమోడుతున్న మానంతో
రోడ్డుమీద బరిబిత్తల పరిగెడుతున్నా
ఒక్క గుడ్డముక్క కప్పలేని-
కనికరం గల దేశం మనది..
పుస్తెకట్టి పస్తులుంచే మొగుడు చేసే
అత్యాచారం అపచారం కాదని-
సుద్దులు బుద్దులు చెప్పే పుణ్యభూమి మనది..
ఆడపిల్లని మహలక్ష్మని తలచే నేల మనది..
స్త్రీని దేవతని పూజించే జాతి మనది..
జై బోలో భారత్ మాతాకీ..
Proud to be a ‘Rape Nation’.
***
కష్టమొస్తే కన్నెర్ర చెయ్యకుండా
కళ్ళు దించుకోని తల వొంచుకొని
చలినీళ్ళలో మునిగి
గుళ్ళ చుట్టూ తిరిగి
పొర్లుదండాలు పెట్టమని నూరిపోసారు.
అగరు పొగల మధ్య
కళ్ళు పొరలు కమ్మించి
రాళ్ళకు మొక్కుతూనే వుండమని
పాతరాతి యుగంలోనే పడేసారు.
మధుర మీనాక్షి, కంచి కామాక్షి
కాశీ విశాలాక్షి, కలకత్తా కాళీ,
శాకాంబరి, నీలాంబరి, కాదంబరి
అంబ జగదంబ, జగములనేలే మూలపుటమ్మా..
పలుకు..అంబ పలుకు..జగదంబ పలుకు..
తోడేళ్ళ కోరలకి బలవుతూ
శరీరమంతా గిట్టలు దిగబడే బురదనేలవుతూంటే
ఆకాశం దద్దరిల్లేలా ఎంత మొత్తుకున్నా
ఏ అంబ పలకదు.
ఏ రాతి చెవులూ ఉలకవు.
ఏ అంబ కనులూ పలకవు.
ఏ అమ్మలగన్న అమ్మా
ఏ గుడిలోంచి లేచి రాదు.
ఈ భారత దేశపు నాలుగు స్తంభాల లాగ
ఆక్రోశించే ఆడపిల్ల కోసం
ఏ దేవరాతి స్తంభమూ పెగిలి రాదు.
భక్తి భావదాస్యాల సంకెల లోంచి
ఏ వెలుగూ రాలిపడదు.
***
నీకెన్ని పేర్లు ఉన్నాయో
అత్యాచార ఆర్తనాదాలకూ
అన్ని పేర్లు వున్నాయి.
మహదేవమ్మ, అలీసమ్మ, ఇందిర, సునీత
టేకు లక్ష్మీ,రిషితేశ్వరీ, ఫర్హా, బిల్కిస్ బానో..
నీకెన్ని గుళ్ళో
అంతకు రెండింతలు
నోళ్ళు నొక్కుకున్న ఊళ్ళున్నాయి.
ఊళ్ళలో గుడులు,బడులు,పడక గదులున్నాయి.
ఓయమ్మా..మాయమ్మా..
తోడేళ్ళ డొక్కల్లోకి శూలం విసురుతావని చూస్తన్నాం.
శీలాలు ఒలిచి
శూలాలతో గర్భాలు చీల్చి
వీథుల్లో కాలువలు కట్టిన రక్తకన్నీళ్ళలో
తోడేళ్ళ సంబరాలు చూస్తన్నాం.
***
అంబ అంటేనే అమ్మ కదూ..
అమ్మంటే కన్నుల్లో పెట్టుకొని కాచుకునేది కదూ..
ఆడపిల్లల మానాలు తేరగా తాగి
త్రేన్చి వచ్చిన తోడేళ్ళని
కాపుకాచేదీ తల్లులే కదూ..
అమ్మలారా..తల్లులారా..
ఆడపిల్లని అవయవంగా చూసే బుద్దిని
చిన్నతనంలోనే తుంచడం కదా పెంపకం..
ఇంకొకళ్ళ కన్నబిడ్డని
కాపుకాయడమే కదా మగతనం..
తల్లివేరులో మొలిచే పిల్లవేరుని
మనిషిదనంతో పేనడమే అమ్మతనం..
గుళ్ళలోని అమ్మ ఎలాగూ పలకదు
ఇళ్ళలోని అమ్మలూ..
మీరయినా పలకండి.
బలయిన ఆడపిల్లల్ని కాదు.
మద బలిసిన మగవాళ్ళని
ఇళ్ళల్లో నుంచి బహిష్కరించండి.
***
‘నిర్భయ’లు ‘దిశ’లు ఎన్ని చట్టాలొచ్చినా
కామ దమన కాండ ఆగిందా ?
షీ టీములు, 498ఏ లు ఎన్ని శిక్షలు పడినా
‘ఆకాశంలో సగం’ ఎదల మీద గాయాలు మానాయా ?
సంకటంలో సహాయం కోసం
అంబనో..అమ్మనో..అన్ననో నాన్ననో దేబిరిస్తాం.
ఆడపిల్లల దేహాలకి కాపలా
ఎవడో ఏ దేవుడో
ఏ దేవతో ఎందుకుంటుంది ?
చేతులున్నాయి. చేతనలున్నాయి.
మన దేహానికి మనమే రక్షణ సైన్యం.
మన దేహానికి మనమే శత్రు దుర్భేద్యం.
బేలతన్నాన్ని జయించే
బలం చేదుకుంటే చాలు.
గర్భగుడుల్లో వేలాడే గబ్బిలాలు కాదు
పంజరాన్ని బద్దలు కొట్టే పక్షులు కావాలి మనం.
గుడ్లెల్లబెట్టి నాలుక బయటపెట్టి
తోడేళ్ళ పంబ రేగ్గొట్టే
అంబలు కావాలి మనం.
చిలుం రాలేలా దిక్కులు పిక్కటిల్లేలా
ఆ అంబ పలుకు పలకాలి మనం.
*
బావుంది
వర్తమాన భారతీయ ముఖచిత్రాన్ని దర్శించిన కవిత ఎక్కడ చూసి అబలల మీద జరుగుతున్న దాడుల్ని ఖండిస్తూ అల్లిన గొప్ప కవిత. అభినందనలు అన్నగారు!!
పోయెమ్ బాగుంది అండి