ప్రేమ కథలు అందరికీ ఇష్టమే. అలాగే నాకూనూ.
కానీ ఈ ప్రేమకేమీ విలువ లేదంటాడు గౌతమ బుధ్ధుడు తమ్ముడు నందుడితో. బలవంతంగా ప్రియ భార్య సుందరినుంచి విడదీసి లాక్కుని వచ్చి భిక్షువు గా మార్చేస్తాడు. కానీ నందుడు అంగీకరించడు. సున్నితంగా ఇలా తిరస్కరిస్తాడు
ఎలదేటి రెక్కతుద పై
పొలసిన కసుకందు మల్లెమొగ్గకు తులయై
తొలిసంజ నూత్నరుచులన్
కలకలమని నవ్వు వలపు కాదనతగునే
ప్రేమ తాలూకు సున్నితమూ, తాజాదనమూ, నిత్యో ల్లసనమూ ఈ మూడూ ప్రేమ లక్షణాలని చెప్తున్నాడు. తుమ్మెద రెక్క కొస ఆనినా కందిపోయే మల్లెమొగ్గ లాంటిది. రాత్రి విడచినా తొలిసంజ కు కూడా కొత్త వెలుగులతో విప్పారేది వెలుగులు కారణంగా కిలకిలా నవ్వుతూ ఉండేది మాత్రమే ప్రేమ అని కూడా అంటున్నాడు.
అలాంటి ప్రేమను కాదని ఈ కాషాయం గొప్పదని ఎలా అంటావని అన్నగారిని నిలబెట్టి అడుగుతున్నాడు నందుడు.
సౌందరనందం ఆధునిక పద్యకావ్యాలలో అద్వితీయం. కాటూరివెంకటేశ్వర్రావు పింగళిలక్ష్మీకాంతం గార్లు ఇద్దరూ కలిసి రాసిన మహోద్విగ్నభరమైన ప్రణయ కావ్యం. ప్రణయం ప్రేమ గా మారడం గురించి దేనినీ తగ్గించకుండా రెండింటినీ ఉన్నతంగా చూపిస్తూనే సమాజహితం వేపు తల తిప్పించి, తల ఊయించిన కథనం.
లోకం తెలియకుండా ఒకరి ప్రేమలో ఒకరు కలగలిసిపోయి, ఏకమై పోయి ఉన్న సుందరీ నందులను బలవంతంగానే కాకుండా దుర్మార్గం గా కూడా విడదీసేసేడు బుధ్ధుడు. అలాంటి బుధ్ధడి ముందు నిలబడి తెగించి
“నీకు ప్రణయం గురించి ఏం తెలుసు. ఇదీ ప్రణయమంటే” అని ఇలా చెప్తాడు నందుడు.
చింతల్ చేరని తావు,
ఉదారగుణముల్ శిక్షించు ఆచార్యకమ్ము, అంతశ్శత్రుసమాజమున్ దొలచు
దివ్యాస్త్రమ్ము,
అద్వైతభావ అంతేవాసి,
కృపాలతల్ మొలచు పాదు,
ఆనందనిష్యంది, సర్వాంతర్యామి కదా మహాప్రణయభావావేశము
ఓ గౌతమా
మహాప్రణయం తాలూకు భావావేశం ఇలాంటిది అని కొన్ని రూపకాలంకారాల తో కూడిన ఉపమానాలు చెప్పేడు.
ఈ కథని కాసేపు ఇక్కడ ఆపి ఈ ఉపమానాలకి సరిగ్గా సరిపోయే మరో కథ చెప్తాను.
మునిసిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ గా నిలబడ్డ శ్రీధరానికి ఓటెయ్యమని అడగడానికి లేడీ కౌన్సిలర్ మధురం ఇంటికి వెళ్లారు మిత్రులు శ్రీధర్ తో కలిసి. శ్రీధర్ అన్ని విధాలా పురుషోత్తముడనే మాటకు తగిన వ్యక్తి. కుటుంబీకుడు. పోటీ లేకుండానే ఛైర్మన్ కాగలడు.
మధురం భర్త ఆమెను నిలబెట్టాడు కౌన్సిలర్ గా.
అందువల్ల వారి ఇంటికి ఆమెను కలవడానికి.
మాటలయ్యేక మధురం వచ్చి ఎదురుగా కూర్చుంది. ఒకరినొకరు ఎప్పటినుంచో ఎరిగిఉన్నట్టు చూసుకున్నారు.అప్పుడు అక్కడ ఏదో జరిగింది. అది చుట్టూ ఉన్నవాళ్ళకు కూడా అనుభవమైంది అంటాడు రచయిత.
ఈ మాటలు చూడండి
“అతను తినడం లేదు. ఉప్మా నిండిన చెంచా అతని చేతిమధ్య అట్లానే నిలిచిపోయింది. తిరుగుతున్న ఫిల్మ్ మధ్యలో ఆగిపోయ్నట్టు. అతను ఆమెను చూడడం కాదు, ఆమెలో లగ్నం అయిపోయి, స్తంభించి పోయి, లోపలికీ అర్ధం వెతుకుతో ఏదో జ్ఞాపకం తెచ్చుకో డానికి ప్రయత్నిస్తే. ఆమే అంతే అట్టానే సరిగా అందరూ చూస్తూ ఉండగా పైగా లేచి అతనివేపు అడుగులు వేస్తూ “
అక్కడ ఏదో జరిగిందని అందరికీ అర్ధమైందిట. మెరుపులు మెరిసినట్టు ఒక అసాధారణత అందరి అనుభవానికీ వచ్చిందట.
ఇలా మొదటి సమాగమం. మిత్రులు బలవంతంగా లాక్కెళ్లిపోయారు. కానీ ఇద్దరూ ఈ లోకంలో లేరు అతను మళ్లీ వారి ఇంటికి పోయి ఆమె చెయ్యిపట్టుకుని తనకూడా తేబోయాడు. తన్ని తోసేశారు. ఆమెనూ బంధించారు.
కానీ ఇద్దరూ అందరినీ అన్నీ కాదని ఆస్థి అంతా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయారు
తెలుస్తోంది కదా చలం గారి కథ అని.
కానీ అసలు కథ ఇక్కడి నుంచే ఉంది. ఇలాంటి కథ చెప్పడానికీ వినడానికి చలంగారు బహుముఖ్యమైన సందర్భాన్ని కల్పించారు. మైదానం చదివి వందమంది రకరకాల ప్రజలు ఏదైతే మాట్లాడతారో అలాంటి వంద మంది మధ్య వెటకారాల వ్యంగ్యాల మధ్య దూషణ తిరస్కారాల మధ్య ఈ కథను అంచెలంచెలుగా ముగ్గురిచేత చెప్పిస్తాడు.
మొదటి సమావేశంలో అపరిచితులైన వారిద్దరూ విచిత్రంగా ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై దూరంగా నిలవలేక ఒకటి కావడం కోసం కుటుంబాలు ధనధాన్యాలూ వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.
రెండవ ఎపిసోడ్ లో మరో మిత్రుడికి ఎక్కడో ఒక పల్లెలో పడవనడుపుకుంటూ కనిపించేరు వాళ్ళిద్దరూ. ఏమిటి ఈ జీవితం అంటే శ్రీధర్ చాలా చెప్పేడు. నీ మాటలు అర్ధం కావడం లేదంటే మధురమే ఇలా అంటుంది. చాలా చిక్కువి క్లిష్టమైనవి ఎప్పటికైనా అర్ధమౌతాయిగానీమనకు చాలా స్పష్టం అనుకునేవి ఎప్పటికీ అర్ధం కావు అంటుంది.
అంటే ఇలా సంసారాలను వదిలి రావడం ఘోరమైన తప్పు అని భావిస్తున్నది ఎప్పటికీ అర్ధం కాని విషయం అని.
జీవితంలో శాంతీ, అందం కావాలని తెలిసిందనీ అవి ఇక్కడ ఒకరిలో ఒకరికి దొరికేయని చెప్పేడు.
మనసుకి స్థిమితం కావాలి. ఏది అనుభవించడానికైనా శుభ్రమైన అద్దమల్లె కావాలి మనసు. ఒకరికొకరం మనసుల్ని స్థిరం చేసుకునేందుకు జీవితంలో అటూఇటూ చూడక్కరలేని తృప్తి ని ఇచ్చుకునేందుకు సాధనమైనాము అంటాడు.
అలా వాళ్ళని చూసివచ్చిన మిత్రుడు “మాటలతో ఇదీ అని చెప్పలేను వాళ్ళని చూసిన అనుభవం. వాళ్లిద్దరినీ చూస్తే ఏదో విశేషాన్నీ, స్థిరత్వాన్నీ, శాంతినీ, హాయినీ చూసినట్టనిపించింది. అంటాడు వెటకారం చేసే మిగిలిన మిత్రులతో.
అలా వాళ్లు మరోసారి స్నేహితులకు ఆశ్చర్యాలుగా మిగిలేరు
మూడవ అంకంలో మరికొన్నేళ్లకు మరో మిత్రుడికి వాళ్ళిద్దరూ గంగాతీరంలో పాంచజన్యపురంలో ఒక వైష్ణవ మఠం లో కనిపించారు. అక్కడ ఉన్న స్త్రీపురుషులందరి మధ్య వారి ఆదరణకు పాత్రులుగా, ఎంతోఆనందంతో , ఒకరిని ఒకరు ఆనందింపజేసుకుంటూ.
తిరిగి ఆ మూడోమిత్రుడు అవే ప్రశ్నలడిగేడు. మీరు సమాజంలో అప్రదిష్ట పాలై ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, చివరికి ఈ ఆశ్రమాలూ భక్తీ ఏమిటని.
“చూడు కోసల్ ఏదన్నా సరే ప్రపంచంలో అర్ధం కావాలంటే సానుభూతితో దానిలో ఐక్యమై ఆ దృష్టితో యోచించాలి. ఎక్కిరింపూ, ఏమీలేదని కొట్టిపారెయ్యడమూ సులభం”
జీవితంలో అన్నిటా సామర్ధ్యాలు నిరూపించుకున్న తను ఇక్కడ ఇలా అన్నిటికీ అతీతంగా ఆమెతో జీవించడం వెనక గల కారణం నోటితో చెప్పేదీ, విని తెలుసుకోగలిగినదీ కాదని ఇలా చెప్పేడు మిత్రుడు కోసవరావుకి శ్రీధర్
అతనికి ఎంతో కొంత అర్ధమైంది
అందుకే చివరికి ఇలా అంటాడు. వారిరువురికీ శరీరాలు చాలా అప్రధానమనీ ఒకరి సహాయంతో ఒకరు మనమెరుగలేని లోకసంచార విద్య నేర్చుకున్నారనీనూ.
అయినా మళ్లీ మరెందుకు పారిపోయారు అలా అంటే ఇదీ సమాధానం
పారిపోలేదు వెళ్లారు. వెళ్లలేదుఅక్కడికి. ఇక్కడ బదులు అక్కడ ఉన్నారు అంటాడు
ఎందుకంటే
ఎందుకు చుక్కలు మిణుకు మిణుకు మంటాయో
ఎందుకు పువ్వులు విచ్చుకుంటాయో
ఎందుకు శిశువులు నవ్వుతాయో
ఎందుకు మేఘాలు తేలిపోతాయో
అందుకు
అని సమాధానం చెప్తూ చలంగారు ఆత్మార్పణ అనే ఈ పెద్ద కథ ముగిస్తారు.
మళ్లీ సుందరీ నందుల దగ్గరకొస్తే నందుడు తమ ప్రేమ గురించి ఇదే చెప్తాడు.
వసివాళ్వాడదొకప్పుడు
కసుకందదు, మేనిఛాయ కగ్గదు తావుల్
కొసరు, మరందము చిలుకును
విసువక ఎద దాల్తునట్టి ప్రేమ సుమమ్మున్
అంటాడు. ప్రేమ సుమం ఎప్పుడూ వాడదు, కందదు, కగ్గదు, పైగా నిత్యపరీమళభరితం. తేనెలవాకలు కురుస్తాయి. అలాంటి ప్రేమ సుమాన్ని విసుగు విరామం లేకుండా హృదయంలో నిరంతరమూ ధరిస్తానంటాడు.
బుధ్దుడై వచ్చిన సిద్ధార్ధుడి ముందు అతని బోధలను లెక్కించక తన ప్రణయ కీర్తనం చెయ్యడం చూస్తే” జబ్ ప్యార్ కియా తో డరనా క్యా” అన్నమాట మూర్తిమంతమై నందుడి రూపంగా అనిపిస్తుంది
బౌద్ధ ధర్మబోధల ముందు ప్రేమ యొక్క అనవరతత్వాన్ని ఏమాత్రమూ తగ్గనివ్వలేదు కాటూరిపింగళి కవులు
సరే నువు చెప్పే ఆ బౌద్ధధర్మం అంతగొప్పదైతే ఆమెతో కలిపే ఆచరిస్తాను. ఆమె కి కాని ఏ ధర్మమూ నాలోకి ఇంకదు. ఆమెకూ దీక్ష ఇప్పించు అని సుందరిని కూడా బౌద్ధభిక్కును చేయిస్తాడు నందుడు.
కానీ నందుడిగురించిన వార్తలు వింటూ ఆమె అప్పటికే మనసా కర్మణా ఆ ధర్మం లోకే ప్రవేశించింది
చలం గారి కథలో ప్రేమికులు కుటుంబాల బాదరబందీల నుంచి పరువుప్రతిష్టలూ, లోకపరత్వాల నుంచి బయట పడడం మొదటి దశ. డబ్బూ, సౌకర్యాలను, గుర్తింపులను నిర్లక్యం చేసి, సాధారణజీవనాన్ని ప్రేమించడం రెండవదశ.
తిరిగి ఇవేవీ పట్టని మనసులతో మనుషుల మధ్యకి రావడం మూడవ దశ.
ఈ మూడు దశల లోనూ ఉన్న వారి గురించి తీవ్రమైన హేళనలతో, వెటకారంతో మాటాడే మనుషుల మధ్య చెప్పిస్తాడు చలం ఈ కథ.
ఇలాంటి ప్రేమ కథ వింటే మామూలుగా మన చుట్టూఉన్న ప్రజాసమూహం మాటాడే మాటలు అవి. ఇది కిందిస్థాయి.
కానీ సాక్షాత్తూ బుద్ధభగవానుడు కూడా ఒక అంతస్థు నుంచి చూస్తూ ఈ ప్రణయం ఉత్త మిధ్య అంటాడు.కానీ కాదని నందుడు నిరూపిస్తాడు
అక్కడ చలం గారు, ఇక్కడ కాటూరి పింగళి కవులూ కూడా ప్రేమ ఆ ఇద్దరి వ్యక్తులమధ్య సంభవించిన ఆకస్మిక అద్భుతం అంటారు. ఐనా సరే పరిణతి మాత్రం వారి మధ్య ఉన్న ప్రేమతో పాటు వారి వ్యక్తిత్వ సంస్కారాల కారణం గానే వెలుగుల వెల్లువగా వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నింపిందని చెప్పినట్టు కాకుండా చెప్పారు.
చిరకాలం గుర్తుండిపోయే ఈ పరిణయగాధలే ప్రేమ అనే పదాన్ని ఎప్పటికీ ముక్తి కన్న ఉన్నతంగా చేస్తుంటాయి. అందుకే ప్రేమ కథలంటే నాకు ఇష్టం
*
ప్రేమకథ లంటే, మాకు ఇష్టమే,. మేడం..ఉన్నత మైన, ఉదాత్తమైన, ప్రేమ గురించి రాసిన,sepalika బాగుంది,👌👌మేడం .ధన్యవాదాలు!
థాంక్యూ వెరీమచ్
ప్రేమ కథలు బావుంటాయి, కానీ చలం గారు రాసిన ప్రేమ ను నేను అర్థం చేసుకోలేకపోతున్నా, ఎంతమంది పైన ఎన్ని సార్లు కలుగుతుంది నిజమైన ప్రేమ(మైదానంలో).బహుశా నాకు అంత పరిపక్వత రాలేదేమో.బహుశా అన్ని బాధ్యత ల నుంచి పారిపోయి, వాళ్ళ సుఖం చూసుకోడమే పేమ అనా.
మీ వ్యాసం చాలా బావుంది. ధన్యవాదాలు.
చలం కామం, మోహం,ప్రేమ వేరు వేరు అనీ వాటిగురించి వివరంగా నవలలు కథలూ రాశాడు. చలం రచనలు ఒకపట్టాన అర్ధం కావు. కష్టమే
మీకు వివరించే పనిలోనే మా లాంటి వాళ్లంఉన్నామండీ
చాలా చక్కగాా అనలైజ్ చేశారు మీరు. ముఖ్యంగా చివరి పేరా essence of the whole thing,. What you said is absolutely true.
థాంక్యూ వెరీమచ్
చలం గారి కథలో ఆకలుండదు,దాహముండదు అనే మోహం నుంచి నిజంగానే అన్నీ వదిలేసుకోగలిగిన స్థాయికి ప్రేమ పరిణితి చెందటం.చాలా బాగా చెప్పారు. నందుడు,సిద్ధార్థుని మధ్య సంభాషణలు మీరు మాత్రమే అలా సాధికారంగా రాయగలరు. సంభాషణ ఇంకొంచెం జరిగితే ప్రేమగురించి బుద్ధుని విశ్వవ్యాప్త దర్శనం,నందుని యొక్క నిబద్ధత ఇంకొంచెం మా బోంట్లకు అవగతం అయ్యేది కదా అనిపించింది.అభినందనలు,కృతజ్ఞతలు మీ ఈ ప్రేమపూర్వక పారిజాతాలకు
థాంక్యూ వెరీమచ్ వసుధ గారూ
లక్ష్మి! కాటూరి – పింగళి గార్ల ‘సౌందరనందా’నికి చలంగారి ‘ఆత్మార్పణకు’ వారిధి మీరే నిర్మించగలరు! ఆ రెండింటికి ‘అతుకు ‘ కనిపించక అందంగా అల్లగలరు!
‘ ప్రేమ’ ఈ రెండక్షరాల లో ఉన్న మహిమ అనుభవించాలి! మాటల్లో చెప్పలేము. ” “ఇష్టం అంటే ఏమిటంటే పేరుండదు దానికి. గాలివీచి చెపుతుందే ఆ హాయిని .అదే. ‘ FB లో పెట్టినది నాకు share చేశారు.గాలి కనిపిస్తుందా ! అనుభవించాలి! అంతే !
ఆ ప్రేమ ఒక స్త్రీ పురుషుల మద్యనే ఉండాలని లేదు! ఇద్దరు వ్యక్తుల మద్య ఎవరైన కావచ్చు!
నేను ప్రైవేటుగా BA చదువుతున్నపుడు special Telugu తీసుకున్నాను.అందులో ‘సౌందరనందం ‘పాఠం ఉండింది. బుద్దుడు నందుడ్ని ఆశ్రమానికి రమ్మని పిలుపు పంపినప్పుడు సుందరిని వదలి వెళ్ళలేడు.కానీ సోదరుల పిలుపు.అది జవదాటలేడు. అప్పుడు వారి విరహాన్ని వర్ణిస్తారు! సుందరి చెప్తుంది” నేను నుదుటిపై బొట్టుపెట్టుకొంటున్నాను.ఆ తడి ఆరకమునుపే నీవు వచ్చేయాలి”! నిన్ను విడిచి ఉండలేనంటుంది. ఆ వాక్యం చదివి కళ్ళలో నీరు చిమ్మింది ! ఎంత ఘాటు ప్రేమ! బుద్దునిపై కోపం వచ్చింది!! మళ్ళీ ఇదంతా గుర్తుకొచ్చింది!!
శ్రీధర్ , మధురం ల నడుమ ప్రేమను మూడు దశలలో ఎంత బాగా విశదీకరించారు!!!! మొదటి కలయిక వారిద్దరి నడుమ ఎలాంటిది! విద్యుల్లత సోకినట్లు!
ప్రేమ సున్నితం! తాజాతనం! నిత్యోల్లాసనం! ప్రణయం ప్రేమగా మారటం!!!” ఆనందనిష్యంది, సర్వాంతర్యామి కదా మహాప్రణయభావావేశము”!
మూడుదశలను ఎంత చక్కగా చిక్కగా చెప్పారు!
మొదటిదశ ! వారి ఆకర్షణ ధనధాన్యాలు బంధాలను త్యంజించింది!
రెండవదశలో! “చిక్కువి క్లిష్టమైనవి ఎప్పటికైనా అర్ధమౌతాయిగానీ మనకు చాలా స్పష్టం అనుకునేవి ఎప్పటికీ అర్ధం కావు ” శాంతి , అందం ,తృప్తి ఎలా ఒకరినుంచి ఒకరు పొందటం!
మూడవదశ!” అర్ధం కావాలంటే సానుభూతితో దానిలో ఐక్యమై ఆ దృష్టితో యోచించాలి” ఐక్యం ! అంతే !
చివరికి ముగింపు ! “ఇద్దరి వ్యక్తులమధ్య సంభవించిన ఆకస్మిక అద్భుతం” Accident and Amazing!
“పరిణతి మాత్రం వారి మధ్య ఉన్న ప్రేమతో పాటు వారి వ్యక్తిత్వ సంస్కారాల కారణం గానే వెలుగుల వెల్లువ” అని .
అందుకే ప్రేమ కథలంటే ఇష్టం! ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది! అంతా ప్రేమమయం! జగమంతా ప్రేమమయం!!!చదివి మనసు ప్రేమలో మునిగి పోయింది!!!
సుశీల గారూ మీ పెద్ద విశ్లేషణ కి ధన్యవాదాలు
చిన్ని, చిన్ని ఆనందాలను పొందడానికి శ్రమించే దానికన్నా, శాశ్వత బ్రహ్మానందాన్ని పొందడానికి ప్రయత్నిస్తే, శ్రమకి తగిన ఫలితం లభిస్తుంది అని తెల్పేదే ‘తుషావఘాత న్యాయం.’
ఆనళినాక్షి, యాయువకుఁ డవ్విధి రక్తికిమాఱు భక్తినిన్
మానసమందుఁ గీల్కొలిపి మాధవుఁ గొల్చుచు సంతతంబు, రా
మానుజు నాశ్రమంబున నిరామయులై వసియించుచున్, రమా
జానికృపావిశేషమున జన్మవిముక్తినిఁ గాంచి రిమ్ముగన్.
(తిరుమల దేశికాచార్యులు… ధనుర్దాసు)
మోహానికి, ప్రేమకూ మధ్య గీతని ఎలా గుర్తించగలం? హార్మోన్ల ప్రకోపానికి అతీతమైన అనుభూతిని పొందగలగడం సాధ్యమా?
చలంగార పైన నాకు ఉన్న అభిప్రాయాలను మీ మాటలు విన్నాక, మీ ఈ వ్యాసం చదివాక మార్చుకున్నాను. Prejudice తోనో, preconceived ideas తోనో ఆయన రచనలను judge చెయ్యకూడదని, పూర్తిగా చదివి అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలని నిర్ణయించుకున్నాను.
ఈ మంచి పరిణామానికి కారకులైన మీకు ధన్యవాదాలు.