అంతర్జాతీయ ప్రేమ!

న్యూజెర్సీలోని హొబొకెన్‌లో తన ఫ్లాటు బాల్కనీలో కూర్చుని ఎదురుగా ప్రవహిస్తున్న హడ్సన్‌ నది వంక తదేకంగా చూస్తున్నది గీతిక. నది అందాలను చూస్తూ ఆనందంగా గంటలు గడిపే ఆమెకు ఈరోజు అవేమి పట్టడం లేదు. అన్యమనస్కంగా దీర్ఘాలోచనలో మునిగివుంది. దానికి కారణం ఈమధ్య జరుగుతున్న లేఆఫ్స్‌ వలన తను పనిచేస్తున్న సాఫ్ట్ వేర్‌ కంపెనీ పది రోజుల క్రితం తనని ఉద్యోగం నుంచి తీసివేయడమే! హఠాత్తుగా జరిగిన ఈ సంఘటన వలన ఆమె మనశ్శాంతిని కోల్పోయింది. ఏం చెయ్యాలో తెలియక దిక్కు తోచనట్లయింది.

ఇంతలో సెల్‌ మ్రోగింది. నైజీరియన్‌ ఫ్రెండ్‌ అజానీ మూసా. ఇండియాలో బి.టెక్‌. చేసి అమెరికాలో ఎమ్‌.ఎస్‌. చెయ్యడానికి ప్రయత్నాలు చేసింది గీతిక. న్యూయార్క్ లోని కొలంబియా యూనివర్సిటీలో అడ్మిషన్‌ వచ్చింది. తనతోపాటు అదే యూనివర్శిటీలో ఎమ్‌.ఎస్‌. చేసిన తన క్లాస్‌మేట్‌ అజానీ మూసా. ముదురు గోధుమరంగుతో, ఆరడుగుల ఎత్తుతో, ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ముఖంతో కనపడతాడు. అన్నిటికంటే గీతికకు అతనిలో నచ్చే విషయం అతను స్నేహానికిచ్చే విలువ, తోటివారికి సహాయపడాలనే సహృదయత, ఆడవాళ్ళ పట్ల గౌరవంగా ప్రవర్తించే తీరు.

అతనికి మూడేళ్ళప్పుడు అతని తల్లిదండ్రులు నైజీరియాలోని కానో పట్టణం నుంచి అమెరికా వలస వచ్చారు. ఎన్నో కష్టాలు పడి, పలురకాల పనులు చేసి, నిలదొక్కుకుని, అజానీని చదివించి పైకి తీసుకొచ్చారు. చివరికి గ్రీన్‌ కార్డ్‌ సంపాదించుకుని శాశ్వత నివాసులుగా ఫ్లోరిడా స్టేట్‌లో స్థిరపడిన ఆఫ్రికన్‌ అమెరిన్లు వాళ్ళు. అజానీ న్యూయార్క్ లో పేరున్న సాఫ్ట్ వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

‘‘హలో!’’ అంది గీతిక.

‘‘హల్లో గీతికా! ఈమధ్య బిజీగా ఉంటున్నావా? నీ దగ్గరి నుంచి ఫోన్లే లేవు. ఆల్‌ వెల్‌?’’ మామూలుగా అడిగాడు అజానీ.

కొంచెం సేపు మౌనంగా ఉండి, ‘‘బాగానే ఉన్నాను’’ అంది నీరసంగా.

ఆమె గొంతులో మార్పు వెంటనే గుర్తుపట్టి ‘‘ఈజ్‌ సమ్‌థింగ్‌ బాదరింగ్‌ యూ?’’

అతని మాటల్లోని మార్దవానికి చలించి, గొంతులో ఏదో అడ్డం పడినట్లు మాట్లాడలేకపోయింది. అతను వెంటనే గ్రహించాడు ఏదో జరిగిందని.

‘‘లెటజ్‌ మీట్‌! హొబొకెన్‌లో 508 స్ట్రీట్‌లో మనం అపుడపుడు కలుసుకునే కాఫీహౌస్‌కి సాయంత్రం ఆరింటికి రావడానికి ప్రయత్నించు. మనం అక్కడ మాట్లాడుకుందాం! సరేనా?’’

‘‘సరే!’’ అంది గొంతు పెగుల్చుకుని.

ఆమెకి తన మనస్తాపాన్ని ఎవరితోనైనా పంచుకుందామని అనిపించింది. దానికి ఒకప్పటి తన క్లాస్‌మేట్‌ అయిన అజానీయే సరైన వ్యక్తి అని కూడా అనుకుంది.

*  * *

సాయంత్రం ఆరు తర్వాత కాఫీహౌస్‌కి వెళ్ళింది. అప్పటికే అజానీ ఆమె కోసం ఎదురుచూస్తూ కనపడ్డాడు. ఆమెను చూడగానే లేచి కుర్చీ వెనక్కి జరిపి, ఆమె కూర్చోడానికి వీలుగా ముందుకు జరిపాడు. ఆడవాళ్ళ పట్ల అతను కనపర్చే నమ్రతకి అప్పుడప్పుడూ నవ్వుతూ వేళాకోళం చేస్తుంటుంది గీతిక. కానీ ఆ రోజు అవన్నీ పట్టించుకునే స్థితిలో లేదు. బంగారు ఛాయతో, పెద్ద కళ్ళతో కళకళలాడుతూ, అందాలు ఉట్టిపడే ఆమె ముఖం వాడిపోయి దిగులుగా ఉంది.

ఆమె ముఖం చూసి, ‘‘ఎనీథింగ్‌ సీరియస్‌ హేపెన్డ్‌?’’ అడిగాడు అజానీ.

ఆమె ఏదైనా చెప్తుందేమోనని మౌనంగా ఆమె వంక చూడసాగాడు. ఆమెకి ఎలా మొదలుపెట్టాలో తెలియలేదు. చివరికి ఎలాగో,

‘‘అజానీ! మా కంపెనీలో లేఆఫ్స్‌ జరిగాయి. నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు. పది రోజులయింది.’’

‘‘వాట్‌! రియల్లీ! పదిరోజులవుతుంటే నాకింతవరకూ ఎందుకు చెప్పలేదు?’’

‘‘నేను షాక్‌లో ఉండిపోయాను! ఏం చెయ్యాలా అన్న ఆలోచనలతో సతమత మవుతున్నాను! లేఆఫ్‌ తర్వాత రెండు నెలలు మాత్రమే నేనిక్కడ ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకో జాబ్‌ దొరక్కపోతే ఇండియా వెళ్ళిపోవాలి.’’

‘‘ఇండియాలో జాబ్‌ సిట్యుయేషన్‌ ఎలా ఉంది?’’

‘‘అక్కడ కూడా జాబ్‌ వెంటనే దొరక్కపోవచ్చు! నా కుటుంబ పరిస్థితులు నీ కెప్పుడూ చెప్పలేదు. మా నాన్నగారు ఇండియాలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌లో ఉన్న కర్నూల్‌లో స్కూల్‌ టీచరుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. రిటైర్‌ అవకముందు అతి కష్టం మీద చిన్న ఇల్లు కట్టుకున్నారు. నా అక్క పద్మజ పెళ్ళిలో కట్నం ఇవ్వాల్సి వచ్చింది. ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి పెళ్ళి చేసారు. నన్ను చదివించడానికి, అమెరికా పంపడానికి కూడా ఆ డబ్బు ఖర్చు చేశారు. అమ్మకి కోవిడ్‌ వచ్చింది. లంగ్స్‌ బాగా దెబ్బ తిన్నాయి. ఆమె మందులకి కూడా ప్రతినెలా డబ్బు అవసరం అవుతుంది. నా సంపాదనే నా కుటుంబానికి ఆధారం! నాకిప్పుడు ఏం చెయ్యాలో తెలియడం లేదు’’ అంది దిగులుగా.

అజానీ ఆలోచిస్తూ కొంచెంసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఆమె చెయ్యి మీద ఆప్యాయంగా చెయ్యివేసి, ‘‘గీతికా! బాధపడకు! ఏదైనా పరిష్కారం తప్పక దొరుకుతుంది. ముందు నువ్వు సీరియస్‌గా జాబ్స్ కి ప్రయత్నిస్తూ వుండు. దానికి నేను కూడా సహాయపడతాను. తొందర్లో ఏదో ఒకటి దొరక్కపోదు. మా అమ్మ ఫ్రెండ్‌ కెసాండు ఆంటీ పెద్ద హాస్పిటల్లో నర్స్ గా చేసి రిటైర్‌ అయింది. తన ఫ్లాట్‌లో ఒక్కతే ఉంటుంది. నువ్వు నీ ఫ్లాట్‌ ఖాళీ చేసి ఆమెతో ఉండు. నేను ఆమెతో మాట్లాడుతాను. దాని వలన నీకు ఇంటి అద్దె కట్టే బాధ తప్పిపోతుంది. ఆంటీ చాలా మంచిది. నిన్ను సాదరంగా ఆహ్వానిస్తుంది. అక్కడ నువ్వు వేరుగా వంట చేసుకునే సదుపాయం కూడా ఉంది’’ అన్నాడు.

ఊహించని అజానీ మాటలు ఆమెకి ఎంతో ఊరటనిచ్చాయి.

‘‘థాంక్యూ అజానీ! నీ మాటలు నాకెంతో ధైర్యాన్నిస్తున్నాయి. నీలాంటి ఫ్రెండ్‌ దొరకడం నా అదృష్టం!’’

‘‘డోంట్‌ బి సిల్లీ! నువ్వు నా మంచి స్నేహితురాలివి. ఈ సమయంలో నీకు సహాయపడటం నా కర్తవ్యం! ఈ దేశంలో మైగ్రెంట్స్ గా నా తల్లిదండ్రులు పడ్డ బాధలు చిన్నప్పటి నుంచీ నాకు తెలుసు. నీకు సహాయపడటానికి అది కూడా ఒక కారణం!’’

‘‘అజానీ! నీకు తెలుసా? అమెరికాలో లేఆఫ్స్‌ వలన ఉద్యోగాలు పోయినవారిలో 41% ఆడవాళ్ళేనట! ఆ ఆడవాళ్ళలో చాలా మంది ఆఫ్రికా, ఆసియా మహిళలు ఉన్నారట!’’

‘‘అలాగా? ఎంత అన్యాయం! ఎనీ వే నువ్వు దిగులు పడకు. బి ఇన్‌ రెగ్యులర్‌ టచ్‌!’’

*  * *

ఆ తర్వాత గీతిక కెసాండు ఆంటీ ఫ్లాటుకి షిఫ్ట్‌ అయింది. జాబ్స్ కి అప్లయ్‌ చేస్తూ ఉంది. దానికి అజానీ కూడా ఆమెకు ఇన్‌ఫర్‌మేషన్‌ ఇస్తూ సహాయం చేస్తున్నాడు. అవసరమైనప్పుడల్లా కెసాండు ఆంటీ ఫ్లాట్‌లో కల్సుకుని మాట్లాడుకుంటున్నారు.

గీతిక ఉద్యోగం పోయి నెల మీద పదిరోజులవుతోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమెకి జాబ్‌ దొరకలేదు. ఇండియాలో తల్లిదండ్రులకి తన పరిస్థితి తెలియనివ్వలేదు. వాళ్ళ ఖర్చుల కోసం అదివరకు తను కూడబెట్టిన డబ్బు పంపుతుంది. అదైనా ఎన్ని రోజులు పంపగలదు? నెమ్మది నెమ్మదిగా ఆమె ధైర్యం సన్నగిల్లసాగింది. ‘‘ఇంకా ఎన్నాళ్ళిలా?’’ అని దిగులు పడసాగింది.

కొన్ని రోజుల తర్వాత అజానీ గీతికతో, ‘‘నేనొక పరిష్కారం చెబుతాను, నువ్వు ఏమనుకోవుగదా?  నేను అమెరికన్ సిటిజన్.ను కాబట్టి మనిద్దరం రిజిస్టర్‌ మారేజ్‌ చేసుకుందాం! అపుడు నువ్వు నా భార్యగా ఇక్కడ ఉండిపోవచ్చు! జాబ్‌ కోసం నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యవచ్చు. కాకపోతే మనం మన స్వప్రయోజనాల కోసం పెళ్ళి చేసుకుంటున్నామన్న అనుమానం అమెరికన్‌ అధికారులకు రావొచ్చు. అది తొలగించడానికి నాతో ఇంకా టచ్‌లో ఉన్న మన క్లాస్‌మేట్స్‌ ఇద్దరినీ, కెసాండు ఆంటీని మనం ఎప్పటినుంచో పెళ్ళి చేసుకుందామన్న ఆలోచనలో ఉన్నట్లు సాక్ష్యం చెప్పే విట్‌నెస్‌లుగా పెట్టుకుందాం. పెద్ద ఆస్పత్రిలో పనిచేసిన ఆంటీకి చాలామంది అమెరికన్‌ ప్రముఖులతో పరిచయం ఉంది. ఆమె మనకి అన్నివిధాలా సహాయం చేస్తుంది. కానీ మనం పెళ్ళయిన తర్వాత లీగల్‌ ప్రాసెస్‌ ప్రకారం కలిసి ఉండాలి. నువ్వు నా ఫ్లాట్‌లో ఉండొచ్చు! నీ ప్రైవసీకి నేను అడ్డురాను. నీకు జాబ్ దొరికిన తర్వాత ఏం చెయ్యాలన్నది మనం ఆలోచిద్దాం! ఏం అంటావు?’’ అన్నాడు.

కెసాండు ఆంటీ కూడా అదే సరైన నిర్ణయం అని సమర్థించింది. గీతికకు ఏం చెప్పాలో తెలియలేదు. కొద్దిగా టైం ఇవ్వమని అడిగింది. రెండు రోజులు తీవ్రంగా ఆలోచించింది. ఆమెకి అమెరికా వదిలి వెళ్ళాలని లేదు. అజానీ మీద ఆమెకి పూర్తి నమ్మకం. అలాంటి స్నేహితుడు తనకు అండగా నిలబడి సాయపడటం అదృష్టంగా భావిస్తుంది. దీనికి మించిన పరిష్కారం ఏమీ కనపడక అజానీ ప్రతిపాదనకి అంగీకరించింది.

*  * *

గీతిక, అజానీల రిజిస్టర్‌ మారేజ్‌ జరిగిపోయింది. ఆమె అజానీ డబల్‌ బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌కి షిఫ్ట్‌ అయింది. జాబ్‌ కోసం తన ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. నాలుగు నెలల తర్వాత ఆమెకి వాషింగ్టన్‌ డి.సి.లోని ఒక స్టార్ట్అప్‌ సాఫ్ట్ వేర్‌ కంపెనీలో ఉద్యోగం దొరికింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. తన తల్లిదండ్రులకి ఎటువంటి మనస్తాపం కలిగించకుండా ఈ సమస్య ఇలా పరిష్కారం అవడం ఆమెకి ఎంతో సంతృప్తిని కలిగించింది. అందుకు అజానీ ఇచ్చిన సపోర్ట్‌ జీవితాంతం మర్చిపోలేను అనుకుంది. వాషింగ్టన్‌ డి.సి. వెళ్ళి జాబ్‌లో జాయిన్‌ అయింది.

కొన్ని నెలలు గడిచాయి. గీతికలో నెమ్మదిగా మార్పు రావడం మొదలయింది. అజానీ సాన్నిధ్యాన్ని ఆమె కోరుకోసాగింది. ఎట్టి పరిస్థితులలోనూ తన పట్ల అతిగా ప్రవర్తించడంగానీ, ఎడ్వాంటేజ్‌ తీసుకోవడంగానీ అతడు చెయ్యలేదు. ఆ టూ బెడ్‌రూమ్‌ ఫ్లాటులో ఆమెకి ఎటువంటి అసౌకర్యం, అనుమానం రాకుండా అతను వ్యవహరించేవాడు. ఆమె కోసం రోజూ ఉదయం కాఫీ, బ్రేక్‌ఫాస్ట్‌ చేసిచ్చేవాడు. ఇండియన్‌ కర్రీస్‌ చెయ్యడం నేర్చుకుని ఆమె కోసం వంట చేసేవాడు. కొన్నిసార్లు అతడు చూపించే ప్రేమ, ఆత్మీయత చూసి అతను తనని ప్రేమిస్తున్నాడేమోనని ఆమెకు నమ్మకంగా అనిపించేది. అతన్ని విడిచి వాషింగ్టన్‌ వస్తున్నప్పుడు ఎంత దాచుకోవాలన్నా దాగని దిగులు అతని ముఖంలో ఆమెకి కనపడింది. బస్సెక్కేముందు తన చేతిని మృదువుగా పట్టుకుని, ‘‘గీతికా! అపుడపుడు న్యూయార్క్‌ వస్తుంటావు కదూ?’’ అని బేలగా అతను అన్నమాటలు పదే పదే ఆమెని వెంటాడసాగాయి. జీవితాంతం అతనితో ఉండిపోవాలన్న కోరిక ఆమెలో క్రమేణా బలపడసాగింది. తన నిర్ణయం తెలిపే తరుణం కోసం చూడసాగింది.

ఇక ఆగలేక ఒక వీకెండ్‌లో న్యూయార్క్‌ ప్రయాణమయింది. ఆమెని చూసి అజానీ ముఖం ఆనందంతో వెలిగిపోవడం ఆమె గమనించింది. బస్‌స్టాప్‌ నుంచి ఆమెను తన కారులో ఇంటికి తీసుకొచ్చాడు అజానీ. ఇద్దరూ ఎన్నో ఏళ్ళ తర్వాత కలుసుకున్న స్నేహితుల్లా కబుర్లు చెప్పుకున్నారు. అజానీ ఆమె కోసం డ్రింక్‌ కలుపుతున్నప్పుడు ధైర్యం చేసి తన మనసులోని మాట అతనికి చెప్పేసింది. అజానీ ఆమె వైపు తిరిగి విభ్రాంతిగా చూస్తుండిపోయాడు. చివరికి,

‘‘నిజమేనా?’’ అడిగాడు ఆమె వంక లోతుగా చూస్తూ.

‘‘నిజమే!’’ అంది.

ఆమె కళ్ళలో కనపడే అనురాగాన్ని గుర్తించాడు. హఠాత్తుగా ‘‘హుర్రే’’ అని ఆమె దగ్గరికి వచ్చి ఆమెని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు. గీతిక పడిపోకుండా అతన్ని గట్టిగా పట్టుకుంది. తర్వాత ఆమెని తన హృదయానికి హత్తుకొని,

‘‘ఈ రోజెంత మంచిరోజు! నా కలల రాణి నాదయ్యింది. గీతికా! నీకు తెలుసో తెలియదో మన స్టూడెంట్‌ డేస్‌ నుంచి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు నా మీద ప్రేమ కలిగే వరకూ ఓర్పుగా వేచి చూడాలని అనుకున్నాను. ఒకవేళ నీకు కలగకపోయినా నిన్ను నా హృదయంలో పదిలం చేసుకుని, ఈ రహస్యాన్ని జీవితాంతం నాలో దాచుకోవాలని అనుకున్నాను. గాడ్‌ ఈజ్‌ గ్రేట్‌! గీతిక నా సహచరి అయింది’’ అన్నాడు ఉద్వేగంగా.

గీతిక అతని మాటలకు ఎంతగానో చలించిపోయింది. అతని కౌగిలిలో మరింత ఒదిగిపోతూ, ‘‘అమ్మానాన్నలకి ఈ విషయం నెమ్మదిగా చెప్పాలి. అజానీ ఎంత ఉన్నతుడో వాళ్ళకి తెలియజెయ్యాలి. మొదట్లో ఓవర్‌గా రియాక్ట్‌ అయినా నెమ్మదిగా సర్దుకుంటారులే!’’ అనుకుని తననితాను సమాధానపరుచుకుంది.

*

శాంతిశ్రీ బెనర్జీ

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ
    జీవితాన్ని అందందంగా మలచుకుంటూ
    విశాల గగనంలో హాయిగా విహరిస్తో
    తృప్తిగా జీవన నౌకను నడుపుకు పోయే
    ఈతరం అమ్మాయి

  • కథలా లేదు. ఇలాటివి జరుగుతాయి అన్న నమ్మకం వస్తుంది. గీత నిర్ణయం నచ్చింది 👏🏼👏🏼

    • నా కథ చదివి స్పందించినందుకు మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు