चालू रे भाई चालू रे। ….. अपनी लड़ाई चालू रे
కోఠి నుంచి కాచిగూడా వైపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఆ బస్తీ ఉంది . ఛాదర్ ఘాట్ పెద్ద వంతెన దాటి కాచిగూడా వైపు కొంతదూరం వెళితే ఛోటా బ్రిడ్జి వస్తుంది . అది మలక్ పేట్ వెళ్ళే వన్ వే రోడ్. చిన్న వంతెన మీద ఒక కిలోమీటర్ దూరం వెళితే కుడి వైపున ముసానగర్ బస్తీ కనపడుతుంది. బస్తీ లోపలకు అడుగు పెట్టగానే చాయ్ బండీ ,గ్రీటింగ్ కార్డులు తయారు చేసే చిన్న ప్రెస్ ఉన్నాయి . ఆ ప్రెస్ ను ఆనుకొని పాత బిల్డింగ్ ఉంది . బిల్డింగ్ పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి . ఆ బిల్డింగ్ మొదటి అంతస్థు లో రెండు గదుల ఛత్రి ఆఫీస్ ఉంది . ఆఫీస్ ముందు పూల కుండీలు ఉన్నాయి . మొదటి గది హాల్ లాగా ఉంది . రెండొవది చాలా చిన్న గది . ఆ గదిలో అష్వా క్ గారు కూర్చొని ఉన్నారు . నన్ను ఎంతో సాదరంగా ఆహ్వానించారు. ఆయన వయస్సు 75 సంవత్సరాల కంటే ఎక్కువే ఉన్నా 60 సంవత్సరాల వయస్సు లాగా కనపడతారు . తెల్లని పైజామా ,తెల్లని కుర్తా ,తలపై తెల్లని టోపీ ఎంతో శాంత వదనం … బస్తీ పోరాటాలు చేసే అష్వా క్ భయ్యా ఈయనేనా అని మనసులో అనుకున్నాను .
నివాస హక్కుల పోరాట సంఘం ఛత్రి (campaign for housing and tenurial rights ) సంస్థాపకులు అష్వా క్ గారు.హైదరాబాద్ లోని ఒక బస్తీ అక్రమ తరలింపులకు గురవుతున్నప్పుడు ఆ బస్తీని కాపాడుకునే క్రమములో మానవ హక్కుల వేదిక నిర్వాహకులైన బాలగోపాల్ ,జీవన్ కుమార్ లతో కలిసి ఛత్రి అనే సంస్థను ఏర్పరిచారు. మొదట ఇస్లాం బజారులో ఛత్రి ఆఫీస్ ఉండేది . తర్వాత ముసా నగర్ కు మార్చారు . క న్నాభి రామ్ గారు ఆఫీసును ఓపెన్ చేశారు. జీవిత చరమాంకం దాకా పేదల నివాస హక్కులకై పోరాడుతూనే ఉన్నారు. క్షేత్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ,శంషాబాద్ విమానాశ్రయంలో బలవంతపు తొలగింపుల దగ్గర నుండి ఇప్పటి డబల్ బెడ్ రూమ్ పథకాల వరకూ లోటు పాట్లను ఎత్తి చూపుతూ పేదల నివాస హక్కుల విషయంలో గణనీయమైన పాత్రను పోషించారు .బస్తీలకు సంబంధించిన ఏ సమస్యకైనా ముందుండి పోరాడేవారు .బస్తీ సమస్యలకై ధర్నాలు జరిగినప్పుడు ధర్నా చౌక్ లో నినాదాలు ఇవ్వటంలో ఆయన తర్వాతే ఇంకెవరైనా ….
కమల్ టాకీస్ వచ్చిన కొత్తల్లో ఆయన అందులో పని చేశారు ఆ అనుభవాలనూ ,అలాగే బిల్డింగ్స్ పెయింటర్ గా తాను పనిచేసినప్పటి అనుభవాలనూ ఎంతో సహజంగా చెబుతూ మిత్రులతో ఇష్టంగా పంచుకునే వారు .ఆయనకు 8 మంది పిల్లలు . ఆయన అత్యంత ఇష్టపడే పాట . ” चालू रे भाई चालू रे। ….. अपनी लड़ाई चालू रे ” ఈ పాట ఆయన నోట్లో ఎప్పుడూ నానుతూ ఉంటుంది . పాత పేపర్ క్లిప్స్ ను ఫైల్స్ లో భద్రపరిచటం ఆయన అలవాటు . నిరాడంబరుడు ,స్నేహశీలి విలక్షణమైన వ్యక్తిత్వం కలవాడు . తనకు తెలిసిన విషయాలను ఎటువంటి అరమరికలూ లేకుండా చాలా సహజంగా చెబుతూ ఉంటారు .తనకు సాధ్యమైనంత వరకూ సహకరిస్తారు . ఫండ్స్ లేకపోయినా తాను బతికి ఉన్నంత కాలం ఛత్రి ఆఫీస్ ఉంటుందని చెప్పేవారు .బస్తీలకు సంబంధించిన విషయాలైనా ,మరే సీరియస్ విషయమైనా హాస్యాన్ని మేళవించి చమత్కారంగా చెప్పటం ఆయనకు ఆయనే సాటి .
భయ్యా ,,,షురూఆత్ కైసా హువా ?స్టార్టింగ్ కైసా కరే ?యే సభీ బతాయియెనా ?
—- మై స్టార్టింగ్ యహా పర్ కబ్ ఆయా . కబ్ సె ఇన్ లోగోమ్ కో జానతా హు ! యే సబ్ బోల్తా హు
ఆప్ తెలుగు మె బోల్ తె యా ఉర్దూ మె
—-మై తెలుగు మె బోల్తా హు!ఉర్దూ మె బోల్తా హు!హిందీ మె బోల్తా హు!తెలుగు మె బోలు (
బీచ్ బీచ్ మె హిందీ మె భీ బొలియె !
నేను 1958లో మూసా నగర్ కు వచ్చాను . నేను వచ్చినప్పుడు ఇక్కడ ఏడు గుడిసెలు ఉండె . ఆ కాలంలో మా దగ్గర బాతులు ,కోళ్ళు ,బర్రెలు అవీ ఇవీ ఉండేవి . వాటి గడ్డి కోసం ,మేత కోసం మేము ఇక్కడకు వచ్చాము .మసీదొల్లది ఈ భూమి . హయాతుల్లా మసీదులో పని చేసే ఆయనకు . ఇనామ్ లో ఈ భూమి ఇచ్చారు . ఆయన చనిపోయాక ఊరిలో వ్యవసాయం లేక సిటీ కి బతకనీకి వచ్చినోళ్ళు ఇక్కడకు వస్తుండె ఆయన కొడుకు చారణా ,ఆఠణా తీసుకొని ఒక గది ,రెండు గదుల గుడిసె వేసి ఇచ్చి ఏక్ అణా ,దో అణా రెంట్ తీసుకుంటుండె . కమల్ నగర్ భూమి కూడా ఆయనదె . ఆడ కూడా ఆయననే ఇట్ట నే ఇస్తా పోయిండు .1981 దాకా 168 ఇళ్ళు అయినాయి . అప్పుడు టి .అంజయ్య చీఫ్ మినిస్టర్ గా ఉండె cpi అజీజ్ బాషా పట్టాలిప్పిచ్చిండు . పట్టాలొచ్చినై ఈ భూమి మాదే అని ఈ భూమి గలాయనకు రూపాయి ,ఆఠ్ ణా ఇచ్చుడు బంద్ చేసేసిండ్రు .
గుడిసెలు మొత్తం తాటి కమ్మలే . 1982 దాకా గూడా గ్యాస్ నూనె డబ్బాలు పగులగొట్టి వెడల్పుచేసి ఆ రేకులు వేసుకుంటే అది మంచి ఇళ్ళు . ఆ తర్వాత సరోజినీ పుల్లారెడ్డి కౌన్సిలర్ గా ఉన్నప్పుడు రెండు మరుగు దొడ్లు కట్టించింది . అజీజ్ బాషా చాలా సాయం చేసిండు . ఒక నల్లా తెచ్చిండు . బోరింగ్ వేయించిండు . పట్టాలు ఇప్పించిండు . మంచి పనులు చేసిండు . ఆయన వస్తే ఇప్పుడు కూడా చానా సంబురం చేస్తారు . నేను అప్పుడు చీఫ్ సెక్రెటరీ గా ఉన్నాను . ఏరు బాగుండె . తాగటానీకి కాకుండా నీళ్ళు వాడుకోనీకి మంచి గుండె .మెల్లమెల్లగా డ్రైనేజీ నీరు కలిపేవారు .
మా పిల్లలకు ఎడ్యుకేషన్ లేకుండె . 1990 లో బ్రదర్ వర్గీస్ ఇక్కడకు వచ్చి చిన్న గది కిరాయికి తీసుకుండు . క్రిస్టియన్ మతం లోకి మారుస్తారని పగబట్టి కొట్టనీకి కూడా పోయిండ్రు . 1986 నుండి నేను బస్తీ ప్రెసిడెంట్ ను . 1990 లో కొన్ని దినాల తర్వాత బ్రదర్ తో పరిచయం అయ్యింది . నేను పోయి కూర్చుని బ్రదర్ తో మాట్లాడినా .. నేను మతం చెయ్యనీకి రాలేదు పిల్లలకు ఎడ్యుకేషన్ నేర్పాలి మనం మంచి గుండాలి అని బ్రదర్ అన్నాడు .
ఆయన ఎక్కడ నుండి వచ్చారు?
కేరళ మాలఘాట్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాడు . నేను ఆయనతో వెంట తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి “ఈయన మతం మారనీకి రాలేదు . పిల్లలకు చదువు చెప్పనీకి వచ్చారని “చెప్పాను . అప్పుడు GHMC కి బ్రదర్ ను వెంట తీసుకు పోయాను . బ్రదర్ నన్ను అన్నింటిలో ఇన్ వోల్వ్ చేసేవాడు . బ్రదర్ వర్గీస్ పిన్నీ స్కూలుకు గిరీష్ సంఘి వచ్చాడు . షాబాద్ బండలతో రోడ్ వేయిస్తానని , 5 బోరింగులు వేయిస్తాననీ చెప్పాడు . వేయించాడు . ప్రతి ఇంటికి సున్నం వేయించిండు . గుడికి స్లాబ్ వేయిపించిండు . మసీదు కాడ టాయిలెట్స్ కట్టిపించిండు .. పాపం అన్నీ చేసిండు . నేను 42 ఇయర్స్ cpi లో ఉన్నాను . ఇప్పుడు ఎల్త లేను .
మా బస్తీలో అందరూ దుక్కి పున్నమి రోజున గండిపేట దగ్గర మూసీ లో స్నానాలు చేసేటోళ్ళు .నీళ్ళు బాగుండే . ఆడనే వండుకుతినే టోళ్ళు 1985లో బ్రిడ్జి కట్టారు . కింద చేలు ఉన్నాయి . ఇటు గుడిసెలు అటు గార్డెన్ ఉండె . వీళ్ళకు ఈడనే భూమి ఇవ్వాలని అన్నాం . 1997లో ఆంధ్రజ్యోతి లో ఒక నోటీసు వచ్చింది . మూసీని టూరిజం చేస్తామని … ఫైవ్ స్టార్ హోటళ్ళు కడతామని నందవనం చేస్తున్నామనీ చెప్పారు . పేపర్లో వేశారు . 150,200 సంవత్సరాలకు ముందు ఉన్నవాళ్ళకు నోటీసు లు ఇచ్చారు . బాలగోపాల్ ,బ్రదర్ వర్గీస్ ,జీవన్ కుమార్ గార్లు చూసి చెప్పారు . దినాం పొద్దుగాల ఏడ ఏడ బస్తీలున్నాయో ?ఆడ మాట్లాడి నోటీసు వచ్చిందని చెప్పినాము . మొదలు 13 బస్తీలు ఉండె … 17 బస్తీలయినాయి . దినాం వాళ్ళ దగ్గరకు పోయి మాట్లాడాలి .మనం కొన్నాం …గవర్నమెంట్ భూమి కాదు . కొట్లాడుదాం అన్నారు . ప్రతి బస్తీ నుండి ఇద్దరు ,ముగ్గురిని తీసుకొని అన్ని బస్తీలలో కమిటీ వేశాము . దాంట్లో నుండి ఒక్కొక్కరినీ ఏరుకొని కోర్ కమిటీ లు వేసినాం . మూసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉండే నాది ఒక్కటే బస్తీ పేరు ఉండే కదా !అని . దానిని నందనవనం సంరక్షణ సమితి గా ఏర్పాటు చేశాం . మూసీ ఏడ దాకా పారితే అక్కడ దాకా వెళ్ళాం .. 40 గ్రామాలకు వెళ్ళాం . మూసీ పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి . ఆ నీళ్ల తో వ్యవసాయం చేస్తుండ్రు . చేపలు చచ్చిపోతున్నాయి … నీళ్ళు కలుషితమవుతున్నాయి అని అన్నారు . ఒక రోజు ర్యాలీ తీస్తున్నామని చెప్పి వచ్చాము . 1998లో గవర్నమెంట్ డెమోలిష్ చేసి వెళ్ళగొట్టాలని నోటీసు ఇచ్చింది . నందనవనం పంపించెయ్యాలనుకుంది 1999 లో మూసీ బచావ్ ఆందోళన ,2000లో ఒక ర్యాలీ … 12 నుండి 15 వేల మంది పాల్గొన్నారు .ఇందిరా పార్క్ నుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దాకా జనాలు ఉన్నారు. ఏడుకోట్ల ఖర్చు చేసి నాలా కట్టింది గవర్నమెంట్ . ర్యాలీ తర్వాత .మా వెనుక ఎవరున్నారని గవర్నమెంట్ దృష్టి సారించారు . అన్నల సపోర్ట్ ఉందన్న అనుమానంతో పోలీసులు వచ్చి ఆఫీస్ ,ఇల్లు తుక్కు తుక్కు చేశారు .మేము కూడా కేసు ఫైల్ చేసాము .’రామచంద్రయ్య జనరల్ అడ్వకేట్ గా ఉన్నాడు . మొత్తం బస్తీ తీసీయాలనుకుంటున్నారు . స్టే లో ఉన్నప్పుడు ఎలా తీస్తారు ?ఉదయాన్నే స్టే తీసుకొని బ్రదర్ వర్గీస్ దగ్గరకు వెళ్ళాము . 17 బస్తీల జనం .. మొత్తం పబ్లిక్ రెడీ అయ్యారు . తుక్కు తుక్కు చేయటానికి బుల్ డోజర్ లు వచ్చాయి MLA వచ్చిండు MRO ను “కలెక్టర్ ఆర్డర్ ఉండగా ఎట్లా తెచ్చినవ్ “అని అందర్నీ తిట్టిండు.
1998-99 లో మూసీకి వరద వచ్చింది . కమల్ టాకీస్ దగ్గర ప్రజలను ఉంచి భోజనం పొట్లాలు పెట్టాము . ఛాదర్ ఘాట్ బ్రిడ్జి కింద వాళ్ళకు వివిధ సంస్థల సపోర్ట్ తీసుకొని ప్లేట్లు ,దుప్పట్లు ,చీరలు ,బిందె ,బక్కెటు ఇచ్చినాం . అప్పుడు ప్రజలకు ఇలా వరదలు వస్తే ఏమి చేస్తారని అడిగారు ?సురవరం సుధాకర్ప రెడ్డి ఎం .పి ఉండే … ప క్కా ఇళ్ళ వాళ్ళు ఉండొచ్చు .. పక్కా ఇళ్ళు లేని వాళ్ళు నందనవనం లో ఉండొచ్చు అన్నారు . ఛాదర్ ఘాట్ కమాన్ కింద ఇళ్ళల్లో ఉన్న వాళ్ళు సగం మందికి పైగా సిద్ద పడ్డారు అక్కడకు వెళ్ళ టానికి . అప్పుడు గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు తీసుకొని నందనవనం భూమి చూపించటానికి తీసుకు వెళ్లారు . బిల్డింగ్ లు కట్టిస్తామన్నారు . అప్పటి నుంచే నేను cpi కి దూరం అయ్యాను . నందనవనం అడవి లెక్క ఉంది . అక్కడ టెంట్లు వేశారు .’మేము పోయి గొడవ పెడితే తడికలతో ‘1,300 గుడిసెలు గుడిసెలు కట్టారు . కలెక్టర్ భన్వర్లాల్ ,ఆర్డీఓ దేవసేన ఉండే .. 2001లో ఎలక్షన్లు ఉండే .. ఎల్ .బి నగర్ చౌరస్తా దగ్గర మంటలు కనపడుతున్నాయి . నందనవనం గుడిసెలు కాలిపోతున్నాయి .. అందరూ ఎంతో ఏడ్చారు … ఈళ్ళను రోడ్ పాలు చెయ్యాలని గోవేర్నమెంటే కాలబెట్టిందని నేను చెప్పేసినా .. రెండు దినాల తర్వాత ఆడ పేషీ ఉండే .. వాళ్ళైతే అన్నారు షార్ట్ సర్క్యూట్ అయ్యిందన్నారు . ఆ భూమి ఒక వంతు గవర్నమెంట్ మిగతాది Drdl /ప్రైవేట్ వాళ్ళది. 1,300 మందికీ 1,034 ఇళ్ళు కట్టారు .’ఆడవాళ్ళకు వాష్ రూమ్ లు లేవు . షెడ్ లాగా కట్టారు . లైట్ద్ లు కూడా లేవు . పెద్ద గొడవ చేసినాం .. నందనవనం ముసానగర్ కు 14 కిలోమీటర్ ల దూరంలో ఉంది . అక్కడ ఎక్కువ శాతం మంది కాగితాలు ఏరుకునే వాళ్ళు ఉన్నారు .. ముస్లీములకు ,వాళ్ళకు పడలేదు . రేప్ లు చేసి గోనె సంచులలో పెట్టేవారు .అక్కడ నుండి ముసానగర్ వాళ్ళు . అందరూ వాపస్ వచ్చేసిండ్రు . ముసానగర్ లోనే individual ఇల్లు అడిగినాం . 25 గజాలలో ఇళ్ళు 25 గజాలలో ఖాళీ స్థలంలో ఇక్కడ కట్టుకున్నారు ….”
ఇలా నందనవనం ,గౌస్ నగర్ ,తీగలకుంట ,సాయిబాబా నగర్ ,వాహెద్ నగర్ గురించి అంచెలంచలుగా అనేక విషయాలను చెప్తూ గవర్నమెంట్ ది ద్వంద నీతి అని అంటారు అశ్వాక్ భయ్యా ..ముసానగర్ లో ఇప్పటికీ తాగుడు లాంటి వ్యసనాలు లేవు . కుల మతాలకు ఆ బస్తీ ఎంతో దూరం … సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందింది ఆ బస్తీ … దానికి కారణం అశ్వాక్ భయ్యా లాంటి వ్యక్తి అక్కడ ఉండటమే …
—–అశ్రు నివాళులతో …
*
మంచి పరిచయం. Cpi నుండి వేరు పడిన పరిస్థితి వివరించిన తీరు బావుంది
thanq sir
పోరాట యోధుని గురించి వివరంగా రాశారు.బాగుంది
Nice ji 👏
thanq sir
మంచి ఆర్టికల్ సార్… థాంక్ యూ…