స్త్రీల ప్రయాణాలు- ఓ కొత్త అధ్యాయం

ఈ రచనలు చదివితే ప్రయాణ ఉత్సాహం రాకమానదు. ఎప్పుడు బయల్దేరుదామా  అనిపించక తప్పదు. ఎక్కడెక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవడమే కష్టం.

మా చిన్నప్పుడు ప్రయాణం అంటే చుట్టాలింటికి వెళ్లడమే. వేసవి సెలవల్లో బట్టలు సర్దుకుని, రైలో  బస్సో ఎక్కి అమ్మమ్మ ఇంటికో, మామయ్యల ఇంటికో  వెళ్ళేవాళ్ళం. బంధువుల్లో ఏ పెళ్ళో అయితే అది బోనస్ ప్రయాణం. పెద్దవాళ్ళకి తీర్ధ యాత్రలు. అంతకు మించి ప్రయాణాలకు అవకాశాలు, సౌకర్యాలు ఉండేవి కాదు. సామాన్య ప్రజానీకానికి ఆర్ధిక వనరులూ అంతంత మాత్రమే. గత పాతిక ముఫై ఏళ్లలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో, ముఖ్యంగా భారత దేశ ఆర్ధిక వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. అవి కుటుంబ వ్యవస్థలోనూ మార్పులు తెచ్చాయి. డబ్బు సంపాదన పెరిగింది; దానితో సౌకర్యాలు పెరిగాయి. వాటిలో ఒక భాగం పెరిగిన ప్రయాణ సౌకర్యాలు.

పెద్దవాళ్ళు, చిన్నవాళ్లు, ఆడవాళ్ళూ, మగవాళ్ళు, దంపతులు, కుటుంబాలు, స్నేహితులు, ఒకరికొకరు అసలే తెలియనివాళ్ళు– ఇలా అనేకమంది జంటగానో, ఒంటిగానో ప్రయాణాలు చేయడం బాగా పెరిగింది. పూర్వం, ధనవంతులకు, ఎలా అయినా ప్రయాణం చేసి తీరాలి అనుకున్నవాళ్లకు మాత్రమే అందుబాటులో ఉండిన ప్రయాణాలు ఇప్పుడు మధ్య తరగతికి అందుబాటులోకి వచ్చాయి. అనేక రకాల హోటళ్లు రావడమేగాక, హోమ్ స్టేలు వచ్చాయి. రైళ్లు, బస్సులే కాక, విమానాలూ, కార్లూ అనేకమందికి అందుబాటులోకి వచ్చాయి. ఆర్గనైజ్డ్ టూర్లు ఏర్పాటు చేసే ఏజెంట్లు వచ్చారు. వెబ్ లో మనమే అన్నీ బుక్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. కానీ ఖర్చు లేకుండా ఫోన్లతోనే ఫోటోలు తీసుకునే అవకాశం; వాటిని ఫేస్బుక్ లోనో, ఇంస్టాగ్రామ్ లోనో పెట్టి మనవాళ్ళకి–వెంఠనే, ఎవరికీ ఖర్చు లేకుండా చూపించుకునే అవకాశం. ఇంతగా పెరిగిన సౌకర్యాలని మనవాళ్ళు బాగానే ఉపయోగించుకుంటున్నారు.

ఫేస్బుక్, బ్లాగులు, వెబ్ పత్రికల పుణ్యమా అని, గత పాతికేళ్లలో తెలుగులో రాయడం బాగా పెరిగింది. రాసేవాళ్ల సంఖ్యతో బాటు రాసే అంశాల విస్తృతి కూడా బాగా పెరిగింది. అట్లా పెరిగినవాటిల్లో ప్రయాణ సాహిత్యం ఒకటి.

ఇప్పుడు ఈ ప్రక్రియ తెలుగులో ఊపందుకుంటోంది. ప్రయాణ సాహిత్యం గురించి మాట్లాడాలంటే, మనం 1838 లో వచ్చిన ఏనుగుల వీరాస్వామి కాశి యాత్రతో మొదలు పెడతాము, పోతం జానకమ్మ – 1873లో “జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర” రాసింది. ఇంగ్లాండ్‌కి వెళ్లిన అనుభవాలను గురించి తెలుగు మహిళా రచయిత్రి చేసిన  తొలి రచన ఇదే. అదే పుస్తకాన్ని ఆమె ఇంగ్లీషులో కూడా ప్రచురించారు (“Pictures of England Travel”). వందేళ్ల తరువాత, నాయని కృష్ణకుమారిగారి కాశ్మీర దీపకళిక  1978 లో వచ్చింది. ఆ తర్వాత చాలా రోజులు కాలు ఎక్కడ వేయాలో తెలియని స్థితి ఉండేది. తరువాత, ఎం. ఆదినారాయణ తన “భూ భ్రమణ కాంక్ష” తో పాటు దేశ  విదేశాల్లో చేసిన అనేక ప్రయాణాల గురించి రాసి ప్రచురించారు. దాసరి అమరేంద్ర, నిమ్మగడ్డ శేషగిరి తాము చేసిన ప్రయాణాల గురించి రాస్తూ వచ్చారు. జయతి లోహితాక్షన్ రాసిన “అడవి నుండి అడవికి” ప్రయాణ రచనల్లో కొత్త తలుపులు తెరిచింది.

ఈమధ్య  ఈ ప్రయాణ సాహిత్య ప్రక్రియ సామాన్య చదువరులను కూడా బాగా ఊరిస్తున్నది అనిపిస్తోంది. ఫేస్ బుక్ లో, బ్లాగుల్లోనే  కాక, ఒక వ్యక్తి ఒక్కో యాత్ర ఒక్కో పుస్తకంగా వచ్చినవి ఉన్నాయి. కొన్ని యాత్రలు కలిపి వచ్చినవి ఉన్నాయి. ఈ మధ్య చాలా చెప్పుకోవాల్సిన యాత్రానుభవాల పుస్తకాలు రెండు వచ్చాయి:  ఇంతియానం -1, ఇంతియానం 2. స్వర్ణ కిలారి ఈ రెండు సంకలనాలకీ సంపాదకులు. ఇవి కేవలం స్త్రీల యాత్రా కథనాలు. ఉల్లాస యాత్రలు, తీర్థ యాత్రలు, సాహస యాత్రలు, విజ్ఞాన (academic) యాత్రలు, ఒంటరి యాత్రలు–ఇలా వంద మంది స్త్రీలు తాము దేశ  విదేశాల్లో చేసిన ప్రయాణాల గురించి, చూసిన ప్రదేశాల గురించి, ఆ సందర్భంగా తెలుసుకున్న విషయాల గురించి, ఆయా చోట్ల లోని ప్రజల వేష భాషలూ, ఆచార వ్యవహారాలూ, వాళ్ళ ఆహార పద్ధతుల   గురించి–ఇలా ఒక ఫ్రీ వెర్స్ లో, తమకేవి ముఖ్యమనిపించాయో అవి రాశారు. వీళ్లలో ప్రఖ్యాత రచయితలతో పాటు కొత్తగా రాయడం మొదలుపెట్టినవాళ్లు కూడా ఉన్నారు. అనేక దేశాలు తిరిగి చూసినవాళ్లతో పాటుగా మొదటిసారిగా ప్రయాణం చేసినవాళ్లున్నారు. ఈ రచనల్లో  కేవలం ఎలా వెళ్ళాలి, ఏమేం చూడాలి అని కాక, వాళ్ళ వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ కూడా పంచుకున్నారు.

కొద్దిగా ముచ్చటగా  అనిపించిన అంశం–బంధువులే గ్రూపులుగా ఏర్పడి, ఏటా విహార యాత్రలు చేయడం. ఒక పక్క బంధుత్వాలూ కొనసాగుతాయి, మరొకపక్క యాత్రలూ అవుతాయి. బంధుత్వాలు కొనసాగడానికి ఏ ఒక్క కుటుంబమో, ఇల్లాలో బాధ్యత వహించనక్కరలేదు. అలా అని, ప్రయాణాలు చేయడానికి తోడుగా బంధువులే ఉండనక్కరలేదు; స్నేహితులు, సహోద్యోగులూ, పరిచయస్థులూ, అసలు ఏమీ తెలీనివారైనా కావచ్చు–లేదు, మనం ఒంటరిగానైనా ప్రయాణం చేయచ్చు –కావలసిందల్లా ప్రయాణం చేయాలనే కోర్కె మాత్రమే అని ఈ రెండు పుస్తకాలూ చెపుతున్నాయి.

ఈ ప్రయాణాలు ఒకే జిల్లాలో ఉన్న పల్లెటూళ్ళ దగ్గరనించీ, దేశంలోని ఇతర రాష్ట్రాలకూ, విదేశాలకూ, ఇతర ఖండాలకూ కూడా విస్తరించాయి. కొత్త మనుషులు, కొత్త ప్రాంతాలు, కొత్త భాషలు, కొత్త సంస్కృతీ సంప్రదాయాలు, తెలుగు రాష్ట్రాలలో కంటే విభిన్నంగా ఉన్న ప్రకృతి, వాతావరణం, వాటికనుగుణంగా మారిన ఇళ్ల కట్టడాలు –ఇవన్నీ ఈ రచయితలని అలరించి, మురిపించాయి. కొందరు తాము చూసినవాటిని వర్ణిస్తే, మరికొందరు వాటి చరిత్ర మూలాలనీ, వాటి వెనక ఉన్న రాజకీయాలనీ కూడా సంక్షిప్తంగా వివరించారు. కారు, రైలు, బస్సు, పడవ, విమానం–ఇలా ప్రస్తుత కాలంలో ఉన్న అన్ని రకాల ప్రయాణ సాధనాలు ఇందులో చోటు చేసుకున్నాయి.

వీళ్ళు ఎక్కడికి ప్రయాణాలు చేసారో–ఆ పేర్లన్నీ రాయాలనుకున్నాను కానీ, ఒకటా, రెండా, ఎలా అవన్నీ రాయడం. కనీసం కొన్ని ఉదాహరణలైనా చెప్పాలి. చాలామంది హిమాలయాల్లో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లారు. అమరనాథ్, తుంగనాథ్, రిషికేష్ , డెహ్రాడూన్, వ్యాలీ అఫ్ ఫ్లవర్స్, హేమకుండ్, కైలాస పర్వతం, మానస సరోవరం, గంగోత్రి, గోముఖ్, సిమ్లా, లేహ్ లడక్, ఇంకొందరు తెలుగు రాష్ట్రాలు కాక అనేక బయటి రాష్ట్రాలకి, నగరాలకి  వెళ్లారు: ఢిల్లీ, ఆగ్రా, కలకత్తా, ఊటీ, వారణాసి, బుద్ధగయ, అండమాన్ నికోబార్ దీవులు, బెళ్లిగుండి  జలపాతం, లాండోర్, ఛత్తిస్ ఘడ్, గుజరాత్, అస్సాం, ఒరిస్సా లోని గంజాం జిల్లా అడవులు, జలియన్ వాలా బాగ్, అమృతసర్, రాజస్థాన్, మైసూర్, కేరళ, నాగాలాండ్, నాగపూర్, పాండిచ్చేరి లోని ఆరొవిల్లె, కేరళ అతిరపల్లి జలపాతం, తమిళనాడుధనుష్కోడి,  శ్రీరంగం, అరుణాచలం, అస్సాం, కర్ణాటక లోని మైసూరు, హంపీ, మొదలైనవి.

ఇక మన తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ లలో  పాపి కొండలు, సీలేరు, ఆసిఫాబాద్ అడవులు, తూర్పు గోదావరి జిల్లా గుర్రమంద అడవి, చిత్తూరు జిల్లా లోని ఎల్లారు బయలు, క్రిష్ణా జిల్లా లోని బౌద్ధ క్షేత్రం ఘంటసాల, కాకినాడ జిల్లాలోని ధారపల్లి అడవి, మంచిర్యాల జిల్లా లోని క్షీర జలపాతం–ఇలా ఎన్నెన్నో.

అమెరికా యాత్రలు సరేసరి; మలేసియా, కెనడా, జీలాండియా, టాస్మేనియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నమీబియా, నేపాల్, భూటాన్,స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, థాయిలాండ్, మెక్సికో, జపాన్, స్లొవాకియా, ఉఙ్కేబిస్తాన్, జర్మనీ, ఇటలీ, ఇలా అనేక విదేశ యాత్రల అనుభవాలు కూడా ఈ పుస్తకాలలో ఉన్నాయి.

యాత్రానుభవాల వల్ల మన ఆలోచనా, అవగాహనా పరిధులు పెరిగి, విశాల దృక్పధం ఏర్పడుతుందంటారు. ఇంతి యానం పుస్తకాలు రెండూ దీనికి దోహదం చేస్తాయి. వంద మందితో రాయించడానికి ఎడిటర్ స్వర్ణ కిలారి ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ, వందమంది స్త్రీలు రాసిన ప్రయాణానుభవాలు ఎదురుగా కనపడుతుంటే, చూట్టానికి ఎంతో ఆనందంగా ఉంది. అవి కేవలం యాత్రా సాహిత్యం మాత్రమే కాదు, గత 30-40 ఏళ్లలో స్త్రీలు సాధించిన పురోగతికీ, ఆర్ధిక స్వాతంత్య్రానికి, సామాజిక స్వేఛ్చకీ, కుటుంబ వ్యవస్థలో సమానత్వం దిశగా వచ్చిన మార్పులకీ కూడా ఈ పుస్తకాలు అద్దం పడతాయి. ఈ రచయిత్రులలో అనేక మంది ఒంటరిగా, ఎక్కడెక్కడికి వెళ్ళాలి అనే దాని గురించి ఒక నిర్దిష్ట ప్రణాళిక కూడా లేకుండా ప్రయాణాలు చేసారు, వాటి గురించి రాసారు. కొద్ది దశాబ్దాల క్రితం అది ఊహకి కూడా అందని విషయం. సామాజిక ప్రగతినీ, స్త్రీల పురోగతినీ కొలవడానికి అంతర్జాతీయంగా అంగీకరించిన కొలబద్దలు కొన్నిఉన్నాయి—ఉదాహరణకి, ఆరోగ్యం, విద్య, ఆర్థిక సాధికారత, రాజకీయ ప్రాతినిధ్యం, సమాజంలో సాధికారత వంటివి.  స్త్రీలు ఒంటరిగా ఏ ప్రమాదము లేకుండా ప్రయాణించగలడం కూడా వాటిలో చేర్చాలని ఈ పుస్తకాలు చదివాక నాకు అనిపించింది.

ఈ రచనలు చదివితే ప్రయాణ ఉత్సాహం రాకమానదు. ఎప్పుడు బయల్దేరుదామా  అనిపించక తప్పదు. ఎక్కడెక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోవడమే కష్టం.

ఈ పుస్తకాలు అమెజాన్, నవోదయ పబ్లికేషన్స్, పల్లవి పబ్లికేషన్స్, న్యూ విశాలాంధ్ర పబ్లికేషన్స్ లో దొరుకుతాయి.

*

గోపరాజు లక్ష్మి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు