లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
క్షీర సముద్ర మధనం లోనూ దొరికింది సొమ్ములే
సొమ్ములు పోలేదండి!
ఎవరన్నారో, ఎందుకంటున్నారో తెలియదు.మహాత్మా గాంధీ తనకి తానే తగలబడి ఆత్మహత్య చేసుకున్నాడో హస్తినాపురాన హోలీ వేడుకలలో నిప్పంటుకుని కాలిపోయాడో నిజం మాత్రం నిజంగానే తెలియదు.
సొమ్ములు పోనే పోలేదండి!!
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం
దాస దాసీ జనులకు, సమస్త దేవ వనితలకు లోకాలను వెలిగించే దీపం లక్ష్మీ దేవే
దీపైక లోకాంకురాం!
సొమ్ములు పోలేదండి!
తైలం లేకుండా లోకంలో దీపం వెలుగుతుందా? దీపం అన్నాక వెలుగూ, నీడా ఉండకుండా పోతాయా?
న్యాయానికి దీపం, దీపానికి కరెన్సీ తైలం. తైలాన్ని తర్కిస్తే దీపాన్ని అవమానించినట్టు కాదా?
సొమ్ములు మాత్రం పోనే పోలేదండి!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
శివ, బ్రహ్మ, ఇంద్రాదులు సైతం లక్ష్మీ కటాక్ష వైభవాన్ని పొందినవారే
సొమ్ములు పోలేదండి!
ఇల్లన్నాక లక్ష్మీదేవి ఎక్కడైనా అడుగుపెట్టవచ్చు కదా? ఏం తాళాలు లేని అవుట్ హౌస్ గదిలోకి శ్రీ మన్మంద కటాక్ష వీక్షణాలు ప్రసరించకూడదా? ఆ మాటకొస్తే లక్ష్మీదేవి గోనెసంచులలో సంచరించకూడదా? తీవ్రవాదులో, కుట్రదారులో ఆ గోనెసంచులకి నిప్పంటిస్తే అది న్యాయ సంహిత నేరం కాదా? లక్షీదేవిని అవమానించినట్లు కాదా?
సొమ్ములు అసలు పోనే పోలేదండి!
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం
ముల్లోకాలూ లక్ష్మీదేవి కుటుంబంలో భాగమే.
సొమ్ములు పోలేదండి!
లక్ష్మీదేవి తన కుటుంబ సభ్యుల ఇంటికి వస్తే, అలా రావడాన్ని సైతం ప్రశ్నిస్తే అది మహా పాపం. చుట్టపు చూపుగా వచ్చి, అదిగో ఆ వారన ఉన్న గదిలో కూర్చుంటే, అనుకోకుండా అగ్ని ప్రమాదంలో గాయపడితే, బంధుత్వాలని అనుమానించడం అమానుషం కాదా?
సొమ్ములు మాత్రం నిజంగానే పోలేదండి!
తగలబడిన గాంధీ సాక్షిగా,
తైలం సాక్షిగా, దీప ఛాయల సాక్షిగా,
కృపా కటాక్ష వీక్షణాల సాక్షిగా
సొమ్ములు మాత్రం పోనే పోలేదండి!
పదిహేను కోట్లు గోనెసంచులలో ఊపిరాడని పొగలో ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఇంతే సంగతులు చిత్తగించగలరు.
(మార్చి 14, 2025 న హోళీ పండుగ రోజున రాజధాని ఢిల్లీ నగరంలో ఒక న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదంలో కరెన్సీ కట్టలు తగలబడినట్లు వార్తలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గోనెసంచులలో పదిహేను కోట్ల రూపాయలదాకా తగలబడ్డాయని ధృవీకరించని వార్తలు గుప్పుమన్నాయి. ‘మహాత్మా గాంధీ మే ఆగ్ లగ్ గయీ మేరే భాయ్‘ అనే మాటలతో తీసిన వీడియో వైరల్ గా మారింది.)
Add comment