సీమ సాహిత్య విమర్శ మొదటి నించీ పదునే!

రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్న ఐదవదశ సాహిత్యం చాలా వైవిధ్యతతో కూడినది. సీమ నుండి పుంఖానుపుంఖాలు రాస్తున్నవాళ్లున్నారు.

‘తెలుగువిమర్శ ఎదుగుతున్నది. పదునెక్కుతున్నది. కట్టమంచితో ప్రారంభమైన ఈ ఎదుగుదల నేటిదాకా కొనసాగుతున్నది.’ అని రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి ఒక సందర్భంలో స్పష్టంగా తెలిచెప్పారు. ‘తెలుగులో సాహిత్యవిమర్శ ఎదగలేదు’ అన్న అపవాదుకు జవాబుగా రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి పై ప్రకటన చేశారు. తెలుగుసాహిత్యంలో రాయలసీమ నుండి వచ్చిన విమర్శ తెలుగువిమర్శను భారతీయసాహిత్యంలో అగ్రభాగాన నిలబెట్టింది. సాహిత్యచరిత్రను పరిశోధనాత్మకంగా గమనించినపుడు ప్రధానంగా రాయలసీమ నుండి ఐదు మంది వ్యక్తులు తెలుగుసాహిత్య విమర్శను భిన్నమైన ప్రతిపాదనలతో, సిద్దాంతాలతో, సూత్రీకరణలతో చెప్పగలిగారు.

రాయలసీమ నుండి ఆధునిక సాహిత్యవిమర్శ ప్రయాణాన్ని నిర్ణయించి కొత్తదారులు పరిచారు. అందుకే సీమ నుండి వచ్చిన సాహిత్యవిమర్శను ఐదు భాగాలుగా విభజించాను.

రాయలసీమలోని చిత్తూరు జిల్లా కట్టమంచి గ్రామంలో సంపన్న కుటుంబానికి చెందిన కట్టమంచిరామలింగారెడ్డి  పంతొమ్మిదేళ్ళ వయసులో అంటే 1914లో కళాపూర్ణోదయం మీద వ్యాసాన్ని రాశారు. ముప్పైమూడేళ్ళ వయసులో దాన్ని విస్తృతపరిచి కవిత్వతత్వ విచారం పేరుతో ప్రచురించారు. అయితే ఈ విమర్శ, కావ్యంలోని విషయాలు, పాఠకుని మనసులో ప్రతిబింబించే విధంగా ఉంది. భావనాశక్తి పరిధిలోనే విమర్శ సాగుతుంది.

అంటే ఆలోచనలూ, సంకల్పాలు మానవ స్వభావంలోని గుణాలని తన విమర్శలో సిద్దాంతీకరించగలిగారు. ఇది రాయలసీమ నుండి వచ్చిన విమర్శలో  సైద్దాంతికమైన తొలిపునాదిరాయి. సీమ ప్రాంతం నుండి కట్టమంచికంటే ముందు సాహిత్య విమర్శలేదా అంటే ఉంది. హిందూపురం ప్రాంతం రొద్దం గ్రామానికి చెందిన రొద్దం హనుమంతరావు 1894లోనే కొక్కొండ వేంకటరత్నం రాసిన బిల్వేశ్వరీయముపై, వావిలకొలను సుబ్బారావు రాసిన శ్రీకుమారాభ్యుదయంపై విమర్శరాశారు. ఈయన ఎక్కువభాగం శాబ్దికచర్చకే పరిమితం కావడం వల్ల ఈ విమర్శ సమగ్రకృతి విమర్శగా రాణించలేదు.

రాయలసీమ నుండి రెండోదశ విమర్శలో రారా(రాచమల్లు రామచంద్రారెడ్డి)ను చూడొచ్చు. రారాకంటే ముందు ముందు విమర్శ రాలేదా? రాయలేదా? అంటే వచ్చాయి. కానీ ఆయనలో రాజీలేని మార్క్సిస్ట్‌ నిబద్దత, నిర్భయమైన మానసికతత్వం వెరసి విమర్శలో మార్క్సిస్ట్‌ కోణాన్ని సాహిత్యసమాజానికి అందించి, విమర్శను పతాకస్థాయికి తీసుకెళ్లడంలో  సఫలమయ్యారు.

అతడికంటే ముందు అంటే కట్టమంచి తర్వాత రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గొప్ప విమర్శకులు వచ్చారు. ఇతడి విమర్శ మానసిక ఆనందం, చిత్తసంస్కారం పరిధిలోనే సాగింది. ప్రధానంగా ఈయన భాషావైరుధ్యాల పలకరింపుగా చేసిన విమర్శ. రాళ్ళపళ్లి శిష్యులుగా పేరొందిన పుట్టపర్తి నారాయణాచార్యులు విమర్శ రాశారు. ఈయన రాళ్ళపళ్లినే అనుసరించించినా విమర్శలో వివరణాత్మకతలోనికి ప్రవేశించి, సామాజికచరిత్రను అనుసంధానించగలిగారు.అయితే ఈ క్రమంలో వచ్చిన తిరుమలరామచంద్ర మాత్రం విమర్శను తులనాత్మక పరిశీలన చేశారు. అంటే విమర్శలో సమకాలీన సాహిత్యాన్ని చేర్చి విమర్శ చేశారు. ఈ విమర్శ కొత్తదారులు పరచడంతో విమర్శ దిశమారిపోయింది.

అయితే ఈ విమర్శను, ఈ సాహిత్యపరామర్శను సిద్దాంతస్థాయికి చేర్చినవారు మాత్రం నిస్సందేహంగా సర్దేశాయి తిరుమలరావు. రాయలసీమ నుండి కల్పనా సాహిత్యాన్ని విమర్శకులెవరూ పట్టించుకోకపోతే ఆర్‌యస్‌ సుదర్శనం కల్పనా సాహిత్యంలో లోతైనవిమర్శ చేయగలిగారు. ఇక్కడ రారాను ఎందుకు ప్రధానంగా ప్రస్తావించాల్సి వచ్చిందంటే ఎవరికివారు నిర్దిష్టత లేకుండా చెదురుముదురుగా ఉన్న సాహిత్య అభిప్రాయాలను మార్క్సిస్ట్‌ సాహిత్య సిద్దాంతంగా చెప్పారు. రారా మాత్రం సూత్రబద్దమైన సాహిత్యవిమర్శ చేయడం వల్ల ఆయన మార్క్సిస్ట్‌ విమర్శకుల్లో అగ్రగణ్యులు  కాగలిగారు.

సాహిత్యవిమర్శలో రారా వారసత్వాన్నే కొనసాగించిన వాళ్ళలో కేతు విశ్వనాథరెడ్డి ముఖ్యులు. ఈయన మార్క్సిజం దృక్ఫథం నుండి ఆధునిక సాహిత్యాన్ని, కల్పనా సాహిత్యాన్ని అధ్యయనం చేసి మార్క్సిస్ట్‌కోణంలో విమర్శచేయగలిగారు.

ఈ వొరవడినే కొనసాగిస్తూ దాదాపు ఇదే దారుల్లోనే, సూత్రీకరణలు భిన్నంగా ఉన్నా రాయలసీమ నుండి మార్క్సిస్ట్‌కోణంలో విమర్శరాస్తున్నవాళ్ళలో తెలకపల్లిరవి, శ్రీనివాసమూర్తి, వరలక్ష్మి, పాణి, డా.నాగేశ్వరాచారి, కెంగార మోహన్‌, పిల్లాకుమార స్వామి, జంధ్యాల రఘుబాబు తదితరులున్నారు. అయితే మార్కిస్ట్‌ కోణంతో పాటు సౌందర్యశాస్త్రాన్ని సమ్మిళతం చేసిన సూర్యసాగర్‌ను విస్మరించలేము. ఆ వొరవొడిలో సీమ ప్రాంతం నుండి మార్కిస్ట్‌ సాహిత్యవిమర్శను సౌందర్యశాస్త్రంతో కలిపి విమర్శ చేసిన కెంగార మోహన్‌ చెమటచెక్కిన వాక్యం అనే కవిత్వపరామర్శ గ్రంథంలోనూ చూడొచ్చు.

ఇక రాయలసీమ నుండి విమర్శకు సరికొత్త దారులు పరిచినవారు వల్లంపాటి వెంకటసుబ్బయ్య. ఈయన సాహిత్య సిద్దాంతపులోతుల్లోకి వెళ్ళి విమర్శ రాసినవారు. నవలాశిల్పం, కథాశిల్పం, విమర్శనాశిల్పం పేరుతో విమర్శనాసిద్దాంత గ్రంథాలనే కాకుండా కాల్పనిక సాహిత్యాన్ని గూర్చి వల్లంపాటి సాహిత్య వ్యాసాలపేరుతో రాసి, రాయలసీమ నుండి సాహిత్య విమర్శను ఉన్నతస్థానంలో నిలిపారు. అంతేకాక ప్రఖ్యాత మార్క్సిస్ట్‌ విమర్శకులు రాల్ఫ్‌ ఫాక్స్‌ రాసిన నావెల్‌ అండ్‌ ది పీపుల్‌ సిద్దాంత గ్రంథాన్ని తెలుగులోకి అనువదించారు. వల్లంపాటి కృషి విమర్శలో ఆయనజీవించిన కాలంలో ఎవరూ చేయలేకపోయారు.  ఆయనది ఇప్పటికీ ఒక ప్రామాణిక విమర్శ. ఇది మూడవదశగా పేర్కొనవచ్చు.

ఇక రాయలసీమ నుండి విమర్శను పతాకస్థాయికి తీసుకెళ్లిన విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి. విమర్శను అనేక భాగాలుగా విభజించి సాహిత్యం జ్ఞానవిశ్లేషణ చేసే ప్రక్రియగా నిర్వచించి మార్కిస్ట్‌ కోణంలోనే మార్క్సిస్ట్‌ దృక్ఫథాన్ని  విమర్శలో చెప్పి, సరికొత్త విమర్శసిద్దాంతాన్ని అందించారు. ఈయన విమర్శ సమగ్రసూత్రీకరణలతో సాగింది. కవిత్వం, కథ, నవల ఏ సాహిత్యప్రకియ ఐనా దానికి వొక పరిధిని గీచి, సైద్దాంతిక నిబంధనలు విధించి, ఏది సామాజిక ప్రయోజనాన్ని కాంక్షిస్తుంది, ఏది సమాజానికి అవసరం లేనిదో అని కుండబద్దలుకొట్టినట్లు చెప్పి, విమర్శకు ఈయన ప్రగతిశీలదారులను నిర్మించారు.

విమర్శకుడికి నిర్ధిష్టమైన సైద్దాంతిక భావజాలం, దృక్ఫథమూ ఉండాలని, ఏ దృక్పథం లేకుండా జీవితంలోకి ఎలా ప్రవేశించలేమో ఆ దృక్పథజ్ఞానం పటిష్టం చేసుకుంటేనే విమర్శ స్పష్టంగా ఉంటుందని భావించి విమర్శను రాశారు. విమర్శకునికి ప్రాపంచిక దృక్పథం స్పష్టమైతే, అతని సామాజిక పాక్షికత స్పష్టమైతే, శాస్త్రీయవిమర్శ ఏర్పడుతుందని భావించి ఇప్పటికీ అదే కోవలోనే విమర్శను కొనసాగిస్తున్న ప్రసిద్ద విమర్శకులు రాచపాళెం. ఈయన విమర్శలో రారా, కేతు, కొన్నిచోట్ల కట్టమంచి తదితర లబ్దప్రతిష్టులైన విమర్శకుల రూపం కూడా కనబడుతుంది. ఇంత స్పష్టమైన విమర్శవైఖరిని ఈ సీమప్రాంతం నుండి కొనసాగిస్తున్న విమర్శకులు ఈ వర్తమాన సాహిత్యవిమర్శకుల్లో లేరనే చెప్పవచ్చు. ఈ దశను నాల్గవదశగా అభివర్ణించవచ్చు.

రాయలసీమలో ప్రస్తుతం కొనసాగుతున్న ఐదవదశ సాహిత్యం చాలా వైవిధ్యతతో కూడినది. సీమ నుండి పుంఖానుపుంఖాలు రాస్తున్నవాళ్లున్నారు. ప్రామాణికంగా మాట్లాడాల్సివచ్చినప్పుడు పైన పేర్కొన్న నాల్గుదశలకు భిన్నంగా రాసిన విమర్శకులు బండినారాయణస్వామి. అతడు తీసుకొచ్చిన సాహిత్యం`సమాజం క్షేత్రస్థాయిలోకి వెళ్ళడంలో విఫలమైందిగానీ  ఆ విమర్శ రాయలసీమ సాహిత్యచరిత్రనే మలుపుతిప్పగలిగింది. ఈయన విమర్శ ప్రాంతీయ, బహుజనతత్వం ఆధారంగా సాహిత్యవిమర్శ చేయగలిగారు. పై వాదాలకు భిన్నంగా విమర్శను సాహిత్యంలోకి తీసుకొచ్చారు. కన్నీటిధారల ప్రవాహాన్ని విమర్శలో కొలతలేసి చూపారు. దీన్ని చరిత్ర ఎప్పుడూ విస్మరించదు.

ఈ కోవలోనే కొనసాగిన విమర్శకులు రాయలసీమలో జి.వెంకటకృష్ణ మాత్రమే కనబడతారు. అయితే వెంకటకృష్ణ విమర్శ మార్క్సిస్ట్‌కోణంలోనూ, ప్రాంతీయతాకోణంలోనూ విశ్లేషించి, విమర్శలో ఒక కన్ను మార్క్సిస్ట్‌ విమర్శగా మరోకన్ను బహుజన తాత్విక ప్రాంతీయకోణంగా పేర్కొనవచ్చు. ఇక ఈ ప్రాంతంలో ఉన్న ఇతరత్రా ప్రముఖవిమర్శకులందరూ కూడా పైన పేర్కొన్న ఐదు విమర్శవిభాగాల్లోని తొలి రెండు విభాగాల్లోనో, లేదంటి చివరి విభాగంలోనో ఇమిడిపోతారు.

వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాళెంల విమర్శ సిద్దాంతస్థాయిని అందుకునే సాహసం ఎవరూ చేయలేకపోయారు. అయితే సీమ నుండి వచ్చిన విమర్శకుల్లో త్రిపురనేని మధుసూధనరావు లేడా అంటే ఉన్నారు. ఆయనది సీమ కాకపోయినా తిరుపతిలో ఉండి ఉద్యోగం చేస్తూనే గొప్పవిమర్శరాశారు.ప్రగతిశీల ఉద్యమకార్యకర్తగా ఆయన తెలియని వారుండరు. అతన్ని తిరుపతి మావో అని కూడా అంటారు. మార్క్సిస్ట్‌ మానవతావాదాన్ని ప్రతిపాదిస్తూ రాశారు. ఇలా చాలా మంది కనబడవచ్చు.

*

కెంగార మోహన్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు