సాల్ట్ & స్నో

సాయంత్రం ఫిలడెల్ఫియా నగరం తెల్లటి విభూతిలో కూరుకుపోయింది.  చాక్పీస్ పౌడర్ రోడ్లను దాచేసింది.

భూపాలపల్లి లో  కాళ్ళకు చెప్పుల్లేకుండా తిరిగిన వసంత  ఇప్పుడు మోకాలి పొడవున్న స్నో బూట్లతో భారంగా నడుస్తోంది. అది సిటీ ఆఫ్ లిబర్టీ. కానీ వసంత ఇప్పుడు legally expired, academically alive.

ఇప్పుడామె ఇక్కడుండకూడదు. ఈ నేల, ఈ గాలి, ఈ మట్టిపై  ఆమెకు చట్టబద్ద హక్కుల్లేవు.

ఆమె స్టూడెంట్ వీసా మూన్నెల్ల క్రితమే ముగిసింది. బాక్ లాగ్ జాబితాలో ఆమె renewal డాక్యుమెంట్స్ ఎక్కడో మిస్ అయ్యాయి. యూనివర్సిటీ వాళ్ళు క్షమాపణలతో పాటు లాయర్ల జాబితా పంపారు. లాయర్లు ఇన్వాయిస్ లు పంపారు. సైన్స్ స్టూడెంట్ వసంత ICE వాళ్ళ దృష్టికి వెళ్లకూడదని ప్రార్ధనలు చేసింది.

ఆమె చేసింది అందరూ చేసే ప్రార్ధన కాదు. జేజమ్మ చేసే ప్రార్ధన.

వంటింట్లో మంట వెలిగించి ఆ నిప్పు చెవి లో జేజమ్మ పేరు పలికింది ఆర్తి తో.

ఒకసారి  జేజమ్మ,  ఉడికించిన పప్పును గుత్తి తో చిదుముతూ: “ పుట్టుకే లేనప్పుడు కూడా పాటుంది. దాన్ని మాత్రమే మన రక్తం యాదికుంచుకుంటుంది బిడ్డా. ఆ పాటెప్పుడు పాడాలో నీ రక్తం చెప్తుంది. యాది కుంచుకో బిడ్డా.”

జేజమ్మ చాలా కనికట్లు  చేసేది.  పాము కరిస్తే మట్టి తీసి ఉఫ్ అంటే,  విషం కక్కెయాల్సిందే.

అన్నం ఉడికే గిన్నె చెవి లో ఏదో రహస్యం  చెప్పేది. అంతే.  ఎంత మందొచ్చినా ఆ గిన్నెడు అన్నం సరిపోయి ఇంకా గిన్నెలో అన్నం మిగిలుండేది.

చలికి కప్పుకునే బొంతలు అడిగితే  కథలు చెప్పేవట తన చిన్నప్పుడు.

జేజమ్మ అలా చెప్పినపుడు, వసంత నమ్మలేదు. నవ్వుకుంది. నమ్మశక్యం కాలేదు, సైన్స్ స్టూడెంట్ కదా.

జేజమ్మ కదా, భూపాలపల్లె కదా అనుకుంది లోపల నవ్వుకుంటూ. యూఎస్ లో ఆమె రీసెర్చ్  క్వాంటమ్ కెమిస్ట్రీ లో.  సైన్స్ కి,  జేజమ్మకి లంకె కుదిరెదెలా? జేజమ్మని ప్రేమించగలదు కానీ ఆ మాటల్ని నమ్మలేదు కదా. పాటని ఆస్వాదించగలదు కానీ పాడలేదు కదా!

కదా !

*

          మొదటిసారి అది జరిగినప్పుడు సాయంత్రం 5.17 ని. ఆమె స్టేటస్ ముగిసిన రెండు వారాల తర్వాత అది. అందుకే అంత బాగా గుర్తుండిపోయింది. ఆ తర్వాత ఎన్నో మర్చిపోయింది కానీ దాన్ని కాదు.

టక్ …టక్.. నెమ్మదిగా కాదు బడబడా బాదేశారు. తలుపు లు బద్దలు కొట్టే అవసరం లేకుండా తలుపులు తెరుచుకున్నాయి. భయం కూడా.

వసంత అప్పుడే కిటికీ తలుపు తెరిచింది. పారిపోవటానికి కాదు. గాలి పీల్చుకోవటానికి. ఓ పక్క చలి, మరో పక్క వేడి. లోపల నుంచి మంటలు, వొళ్ళంతా వొణుకు. గాలి లేదో, ఉన్నది సరిపోవటం లేదో. ఉక్కపోత.

మంచు కురవటం మళ్ళీ మొదలయింది. ఓ మంచు పువ్వు వసంత చేతి మీద వాలింది. ఏదో రహస్య సంకేతం మోసుకొస్తున్నట్లు. అపురూపంగా ఆ మంచు పువ్వు చెవి లో గుసగుసలాడింది “ యే తల్లి బిడ్డవు?”

ఆ పువ్వు కరగలేదు కానీ కదిలింది వసంతకి సమాధానం చెపుతూ.

జేజమ్మ గొంతు లోని పాట వసంత గొంతు లో కదలాడింది.  రాగం లేని పాట. పదాలు లేని పాట. భావం తప్ప భాష లేని పాట. జ్ఞాపకానికి శ్వాస కలిసి జీవమొచ్చిన పాట. ఆమె పాటకి కాలం ఆగిపోయింది. నిజంగానే ఆగిపోయింది. కురుస్తున్న మంచు ఆకాశ భృకిటిలో నిలిచిపోయింది. ఆగిన వాక్యంలో పంక్చుయేషన్ మార్క్ లాగా!

తలుపు కొడుతున్న శబ్దం ప్రతిధ్వనించటం ఆగిపోయింది.

వసంత కిటికీ వైపు నుంచి వెనుతిరిగింది.

ఆమె చేతులు మెరుస్తున్నాయి కాంతి గోళాల్లాగా! కానీ అది పసుపుపచ్చ కాదు. ఆకుపచ్చ కూడా కాదు. రాగెరుపు. పల్లె మట్టి లాగా. తుఫాన్ తర్వాత బురదమట్టి లాగా.

*

కాంపస్ లైబ్రరీ కి ఆ రాత్రి నడిచి వెళ్లింది. ఆ చలిలో, ఆ మంచులో. ప్రపంచాన్ని, పంచ భూతాలను లెక్క చేయనట్లుగా. లైబ్రరీ ద్వారం దగ్గరున్న  గార్డు కి తెలియలేదు ఓ వ్యక్తి ద్వారం దాటి వెళ్ళిందని. ఆమె చేతులు, కళ్ళు ఒక్కో వరుసని దాటుతూ వెళ్ళాయి. కాలప్రయాణ రహస్యం పుస్తకాల్లో దాక్కుంటుందా? అయినా ఆమె అన్వేషణ ఆగలేదు.

ఆ రాత్రి ఆమె కలలో జేజమ్మ కనిపించింది. పచ్చటి పొలాల్లో చేతిలో ఉప్పు పొట్లం తో.

“ తీసుకో”

“ ఏంటది?”

“ నువ్వు పోగొట్టుకునేది”

కాలాన్ని వంచితే ఎవరైనా మూల్యం చెల్లించాల్సిందే. వసంత మినహాయింపు కాదు.

మొదటి సారి పాట పాడిన తర్వాత , అమ్మ కాల్ చేస్తే, ఆ గొంతు గుర్తుపట్టనే లేదు.

ప్రతి పాట తర్వాత వసంత ఒకొక్కటిగా కోల్పోతూవచ్చింది. ముందు అమ్మ గొంతు, తర్వాత తమ్ముడి జ్నాపకం, తర్వాత ఊరి పేరు. నెమ్మదిగా ఆమె భూపాల పల్లె వసంత నుంచీ ఫిల్లీ వసంత లాగా కొంచెం కొంచెం మారుతూ వచ్చింది.

 

*

          వసంత మరో సారి కలిసింది అతడిని. యూనివర్సిటీ బేస్మెంట్ లో archives విభాగం దగ్గర.

జానిటర్ జేమ్స్ వైట్ ఎల్క్. చూడటానికి అతని వయసుని బట్టి పల్లెలో అయితే తాతా అని నోరారా పిలిచేది. ఇక్కడ బంధుత్వాలు అక్కరలేదు మనిషిని గౌరవించటానికి.

అడుగుల బట్టే గుర్తుపట్టి “ నువ్వు పాట పాడావు” అన్న ఎల్క్ మాటలు వింటూనే ఆమె అడుగులక్కడే ఆగిపోయాయి.

అక్కడికి రావాలని రాలేదు వసంత. రెస్ట్ రూమ్ పైపుల నుంచి వస్తున్న  జేజేమ్మ పిలుపును బట్టి అక్కడకొచ్చి చేరింది. శరీరం, మనసు ఆమె అదుపులో లేవు. ఆ ధ్వని ఆమెను తన లోపలకి లాక్కుంటోంది.

ఎల్క్ ఆమెకు ఓ మూల చూపించాడు. ఎవరూ చూడని భౌగోళిక మ్యాపుల మీద మట్టి పేరుకుపోయి కనిపించింది.

“ నీకొక్కదానికే పాటల రక్తం వుందనుకుంటున్నావా? పూడ్చిపెట్టిన పాటల మీద కట్టిన దేశం ఇది.” తల దించుకునే, నేలను తడి గుడ్డతో తుడుస్తూ మాట్లాడాడు జేమ్స్ వైట్ ఎల్క్. ఒకప్పుడు “చీఫ్” మరోసారి “ క్లీనింగ్ గై” “జేమ్స్ వైట్ ఎల్క్” పేరు పే రోల్ కోసమే.

“ ఏ పేరు లేకపోయినా నేను, నువ్వు, మనందరం బంధువులమే, బాధితులమే. మనలో కొంత మంది పాడటం మానేశారు. కొంత మంది స్వచ్ఛందంగా నాలుకలు కోసేసుకున్నారు.

“ అదృశ్యమైపోతున్నా” అతనికి మాత్రమే వినిపించేలా గొణిగింది.

“ ఆ కనికట్టు ప్రతిసారి నా నుంచి ఏదో ఒకటి లాగేసుకుంటోంది. దాన్ని నేను ఆపలేకపోతున్నా.”

అడ్డంగా తలూపాడు ఎల్క్, అది అసంభవం అన్నట్లు.

‘ ఏదీ పోగొట్టుకోకుండా దేన్నైనా ఎలా పొందగలము?’

“ మరిసోల్. చిన్నపిల్ల. Undocumented. ఆ  పిల్లను చర్చిలో దాచేశారు వాళ్ళ అమ్మానాన్న. కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేసి వాళ్ళను తిరిగి పంపేశారు . ఆ పిల్లను కాపాడా. కానీ ఇప్పుడు నాకు బాపూ మొహం గుర్తు రావటం లేదు. అసలేం జరుగుతోంది?మొదటిసారి అమ్మ గొంతు గుర్తుపట్టలేకపోయా.” ఆ నేల మీద కూలబడి రెండు చేతుల్లో మొహం దాచుకొని భోరున ఏడవటం మొదలెట్టింది వసంత.

ఆమె పక్కన కూలబడ్డాడు ఎల్క్.

“ నువ్వు కాలానికి వంతెన కడుతున్నావు. నీ ఆత్మ తోటి. అది కనికట్టు కాదు. సంప్రదాయం. నీ వారసత్వం.”

తన జాకెట్టు లోంచి ఓ చిన్న మూట తీశాడు.  ఎండిన సేజ్ ( తులసి లాంటిది), పక్షి రెక్క, పూసల దండ,  ‘ టిపి’ పక్కన నిలబడి వున్న “ ఉంచి( అమ్మమ్మ)” పాత ఫోటో.

“మనల్ని మనం రక్షించుకునే  క్రమంలో మనందరం  ఏదో ఒకటి కోల్పోతూనే వుంటాం. అదెందుకు ముఖ్యమో గుర్తు పెట్టుకోవడమే మనం చేయాల్సింది.”

*

          49th వీధిలోని చర్చి కింద బేస్మెంట్ లో పియానో ముందు కూర్చొని ఏవేవో మెట్లు నొక్కుతోంది మరిసోల్. వసంత చివరిగా పాడిన తర్వాత నుంచి మరిసోల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మరిసోల్ సురక్షితం. వసంత చూసిన ప్రతి సారి మరిసోల్ కళ్ళు కిందకు వాలిపోతాయి కృతజ్ఞతతో.  వెనుక నుంచి మరిసోల్ కళ్ళు తాకిన ప్రతిసారి వసంతకి సందేహం వస్తుంది తానొక భూతమేమోనని.

“¿Estás bien?”  నువ్వు ఓకేనా? వచ్చీ రాని స్పానిష్ లో అడిగింది మరిసోల్ ని.

“Tu voz…cambia el aire.” నీ గొంతు….గాలి ని కూడా మారుస్తుంది. ఎంతో కాలం తర్వాత గొంతు పెగుల్చుకొని ఆ మాట మాట్లాడింది.

మరిసోల్ ని ప్రేమగా దగ్గరకు లాక్కుంటూ, “ అది బహుమతి కాదు. నేను చెల్లించాల్సిన మూల్యం.”

మరిసోల్ కి అర్థం కాలేదు. అర్థమవ్వాలని చెప్పలేదు వసంత.

“ నాకు నేర్పిస్తావా?”

వెంటనే,” నో. అది నువ్వు కోరుకునేది కాదు”

“ అమ్మా వాళ్ళు కావాలి. కానీ నేనిక్కడే ఉండాలనుకుంటున్నా”

వసంతకి అర్థమైంది. అన్నింటికన్నా, అందరికన్నా వసంతకే ఎక్కువ అర్థమవుతుంది ఆ ఫీలింగ్. ఆ కోరిక.

నిన్ను వెళ్లిపో అని పదేపదే చెప్తున్న దేశంలో ఉండిపోవాలనుకోవటం గురించి.

అనుమతి అక్కరలేకుండానే ఉండగలగటం గురించి.

కరిగిపోవటానికి ముందే మంచులో తన పేరు రాసుకోవటం గురించి.

*

          అదొక చలికాలం రాత్రి. ICE ఓ కమ్యునిటీ సెంటర్ని చుట్టుముట్టింది. వందల సంఖ్యలో undocumented.

పిల్లలు, వృద్ధులు, స్టూడెంట్స్ అందరూ బోనులో చిక్కిన ఎలుకల్లాగా ముడుచుకుపోయారు. నిష్క్రమణ ద్వారాలు లేని సెంటర్. కాలం టిక్ టిక్ మంటుంది వాళ్ళ రాతల్ని చెరిపెయ్యడానికి. వాళ్ళ జీవితాల్ని తుడిచిపెట్టేయడానికి.

ఎల్క్ వంక చూసింది వసంత.

“ ఎప్పుడూ ఏదో ఒక ఛాయిస్ వుంటుందని చెప్పావు నువ్వు” నెమ్మదిగా గొణిగింది.

అతను తల ఊపాడు.

“ ఇప్పుడు కూడా”

మరిసోల్ వంక తిరిగి, “ నేనెళ్లిపోయాక టేప్ ఆన్ చేయి. అందరి కోసం” అంది వసంత.

సెంటర్ మధ్యలోకి నడుచుకుంటూ వెళ్లింది . తలకు చుట్టుకున్న స్కార్ఫ్ తీసెసింది. కళ్ళు మూసుకుంది. పాడటం మొదలుపెట్టింది. కానీ ఈసారి దేన్ని వెనక్కు తీసుకోలేదు.

ఆమె గొంతు ప్రెషర్ కుక్కర్ నుంచి వచ్చే కేక లాగా ఉంది. ఆ గొంతు ఆమె ఒక్కర్తిదే కాదు. జేజమ్మ ది, ధాన్యం దంచే మరెందరో స్త్రీలది,  ఎల్క్ నానమ్మ ఉంచి దీ. ఆమె లాగా గ్రహణమప్పుడు ఆకాశానికి పాటలు పాడిన అనేక మంది స్త్రీల గొంతు అందులో కలిసిపోయింది.

ఆకాశం నుంచి మంచు కిందకు రాలకుండా  త్రిశంకుస్వర్గం లాగా ఆగిపోయింది.

కాలం పంచదార గ్లాసు లాగా పగిలిపోయింది.

సెంటర్ లో ఉన్న వారంతా అదృశ్యులై, అపరిచితులై నడుచుకుంటూ వెళ్ళిపోయారు.

ఆకాశాన ఓ కొత్త చుక్క సుదూరంగా !

 

*

కల్పనారెంటాల

కల్పనా రెంటాల

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రస్తుత అమెరికా సమాజాన్ని గుంభనగా సూచిస్తూ పరిష్కారం లేని సమస్యని వివరిస్తూనే పరిష్కారం ఉందో లేదో తెలియని సంగిధావస్త…కథ చదువుతూనే ఆలోచించవలసి వచ్చింది. ఎటూ తేలని సమస్య, పరిష్కారం…నాబోటి వాడికి ఈ కథ అర్ధం అవడం కష్టం.

  • ప్రస్తుత అమెరికా సమాజంలో ఇమిగ్రెంట్లు ఎదుర్కొంటున్న దీన/హీన స్థితిని, వారి వ్యథను గొప్పగా వ్యక్తీకరించారు… కథలోని పారా నార్మల్, మెటాఫిజికల్ అంశాలు మరింత సాంద్రతను చేకూర్చాయి.
    “…అర్థమవ్వాలని చెప్పలేదు వసంత..”, “పూడ్చిపెట్టిన పాటల మీద కట్టిన దేశం ఇది..” వంటి వాక్యాలు – breathtaking!
    సాహిత్యకారుల/సృజనకారులు బాధ్యత ఏవిటో మరోసారి చాటారు…
    అభివందనాలు!

  • కథ ఆలోచింప చేసేదిగా వుంది.అమెరిక స్థితి గతులను అంచనా వేసేలా వుంది. త్రిషంకుస్వర్గం లో వేలాడుతున్న ఇండియన్స్ మానసిక ఊగిసలాటను చక్కగా వివరించారు. .అభినందనలు మీకు

  • కథ ఆలోచింప చేసేదిగా వుంది.అమెరిక స్థితి గతులను అంచనా వేసేలా వుంది. త్రిషంకుస్వర్గం లో వేలాడుతున్న ఇండియన్స్ మానసిక ఊగిసలాటను చక్కగా వివరించారు. .అభినందనలు మీకు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు