వారధి వేదవతి ఉరఫ్ వేగావతి ప్రముఖ స్త్రీవాది గారి గురించి మీకు తెలుసా? తెలియదా? అయితే చదవండి.
“వేగావతి స్త్రీ స్వతంత్రం కోసం పాటుపడుతున్న సంఘసేవకురాలు ఆమె వ్యాసాలు వ్రాసింది. కథలు వ్రాసింది. కవితలు వ్రాసింది. రేడియోలో, టీవీలో ఉపన్యాసాలు ఇచ్చింది. స్త్రీవాదం ఆమె ఊపిరి. ‘నరనరాన, అణువణువున, నా రక్తంలో కణకణాన స్త్రీవాదం నిండివున్న స్త్రీవాదిని’ అని ఆమే తన గురించి చెప్పుకుంది. ఒక వారపత్రికలో ఆవిడ స్త్రీల కోసం ‘నేను- నా ఇష్టం.’ శీర్షిక నడుపుతుంది. స్త్రీలకు ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆమెకు వ్రాస్తే జవాబు ఇస్తుంది.
ఉదయం వరండాలో కూర్చొని నిన్న వచ్చిన ఉత్తరాలను ఒక వరుసలో చదువుతోంది. అప్పుడే పెళ్ళైన ఓ ఇరవైమూడేళ్ళ యువతి రాసిన సుదీర్ఘ ఉత్తరం.
‘వేగావతిగారూ, నేను మీ వీరాభిమానిని. స్కూలు రోజులనుండి మీరు వ్రాస్తున్న ప్రతిదీ చదువుతున్నాను. నా శరీరం, నా బట్టలు, నా హక్కు నా ఇష్టం అని మా నాన్నతో వాదించి, మా పాతకాలపు అమ్మను సాధించి, నాకు నచ్చిన అన్ని రకాల బట్టలు వేసుకొని తిరిగాను. ‘ఇంటిలో బంగారంలో, భూమిలో, సగం నాది” అన్నానని అని ఆశ్చర్యపోయే అమ్మానాన్నలకి మీరు వ్రాసిన వ్యాసాలు చూపించి ఒప్పించాను. యూరప్ వెళ్ళాను. నాకిష్టమైన జండర్ ఈక్వాలిటీ కోర్సు చేశాను.
ఇండియావచ్చి ఒక ఎన్జీఓ మొదలు పెట్టాను. మీలానే స్త్రీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నాను. ఆడది మాత్రమే గర్భం దాల్చడం ప్రకృతి చేసిన అన్యాయం, శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి మొగవారు కూడా గర్భం దాల్చే ఏర్పాటు చేయాలని వ్యాసాలు వ్రాసి, వాదించి తనకంటూ ఒక ప్రత్యేకతని తెచ్చుకున్న స్త్రీవాద రచయిత ‘వనిత’ (వంకాయల నిత్య తరుణ్) నా భావాలకు ఆకర్షితుడై నన్ను ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. అన్ని పనులలో, అన్ని విషయాలలో ఇద్దరం సరిసమానంగా మా బాధ్యతలను రెండేళ్ళు నిర్వర్తించాం. కానీ అతను రాను రాను మారిపోతున్నాడు.
‘వివాదాలతో విడగొట్టే వాదాల పంథా సరైంది కాదేమో, ఆలుమగల మధ్య వచ్చే సమస్యలకి పరిష్కారాలు ఇచ్చే విధానాల కోసం వెదుకుదాం అని మొదలు పెట్టాడు. కాలేజీ అమ్మాయిలని వారి హక్కుల కోసం పోరాడమని రెచ్చగొట్టడం కంటే పనిమనిషి సంఘాలని పెట్టి వాళ్ళకు కొంత శిక్షణ యిచ్చి వాళ్ళ ఆదాయం పెంచే మార్గం మంచిదని అతని ఆలోచన. అతను స్త్రీ వాదాన్ని ప్రక్కన పెట్టడమే కాకుండా రోజురోజుకీ అతను నా స్వేచ్ఛని ప్రశ్నిస్తున్నాడనిపిస్తుంది. అందుకని ముందుగానే మేలుకొని విడాకులు ఇవ్వాలని అనుకొంటున్నాను. మీ సలహా నాకు తెలిసిందే అయినా ఒక్కసారి మిమ్మల్ని అడిగి…’ అని ఆపింది.
ఎంతమందిని చూడలేదు పెళ్ళి అయ్యేదాకా ప్రేమ కబుర్లు చెప్పి పెళ్ళి అయిన తర్వాత నుండి మామూలు మగాడిలా అంక్షలు పెట్టి ఆడదాని స్వాతంత్ర్యాన్ని అణచివేసే మగాళ్ళని. వాళ్ళకోవలోకి చెందినవాడే మరొకడు అని అనుకొంటూ ఉత్తరాలను టేబుల్ పైన పెట్టి ….
“కమలా కాఫీ” అని గట్టిగా కేక వేసింది. కాఫీ రాలేదు.
“కమలా ఎన్నిసార్లు చెప్పాలి నీకు, అడగ్గానే కాఫీ తెమ్మని” అరిచింది.
పెరటిలో గిన్నెలు తోముతున్న కమల మొగుడు రావుడు పరిగెత్తుకుంటూ వచ్చి ‘కమల మీ బెడ్ రూంలో బట్టలు సర్దుతోంది ‘ అని చెప్పాడు.
“కిందకి తగలడి కాఫీ ఇవ్వమను”అంది
కమల మొగుడు రావుడు కమల మీద అధికారం చెలాయిస్తాడు. తాగుతాడు, తిడతాడు, కొడతాడు. ఇది తెలుసుకొన్న కొత్తలో వేగావతి కోపంతో ఊగిపోయి వాడిని కొట్టినంత పనిచేసింది. కమలకి వాడితో విడాకులు ఇప్పిస్తానంది. కమల ఒప్పుకోలేదు. కమల మీద కోపం వచ్చింది వేగావతికి. కానీ తలలో నాలుకలా ఇంట్లో పనిచేసుకుని పోయే కమలని వదులుకోలేకపోయింది. పురుషాహంకారాన్ని సహించలేని తన ఇంట్లోనే తన పనిమనిషి భర్త వాడి పెళ్ళాం మీద అధిక్యత చూపడం తను చూస్తూ ఊరుకోలేదు. వాడికి తగిన శిక్ష వెయ్యాలి అనుకొంది. నీ మొగుడుకి కూడా మన ఇంట్లో పని యిప్పిస్తానంది వేగావతి కమలతో.
“అమ్మగారి దయవల్ల నాకు ఇక్కడే పని అయితే కమల రోజంతా నా కళ్ళ ముందే ఉంటుంది. దాన్ని చూసుకుంటూ ఎంత పనైనా చేసేస్తానమ్మగారు” అన్నాడు రావుడు.
“అంట్లు తోమాలి” అన్నది వేగావతి.
“బమ్మాండంగా చేస్తాను”.
“అంతేకాదు బట్టలు ఉతకాలి, ఇల్లు తుడవాలి” అన్నది వేగావతి పురుషాధిక్యతను గెలిచానన్న భావంతో.
“నానా పనులన్నీ సిటికలో సేస్తాను….. నా కళ్ళ ముందు కమల సిలకలా తిరుగుతూ ఉండే…” – అన్నాడు అతనికేదో గొప్ప పదవి దొరికినట్టు.
అలా రావుడు అంట్లు తోముతూ, బట్టలుతుకుతూ, ఇల్లు తుడుస్తూ, కమల ఇంటిలోని మిగిలిన పనులు చేస్తూండగా కుదిరినప్పుడల్లా సరసాలాడుతూ హాయిగా గడిపేస్తుంటారు.
కమల వచ్చి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ వుంటే ఫోన్ వచ్చింది.
“ఇది విన్నావా?” అంది బాధతో కూడిన గాభరాతో ఫోన్ చేసిన స్నేహితురాలు కాంతి.
“ఏమిటి?”
“మంగ భర్త సుబ్బారావు నిన్న రాత్రి చనిపోయాడుట”
“ఆ! అదేం? గుండులా చక్కగా ఆరోగ్యంగా…”
“అతని ఆరోగ్యానికేం? హిమాలయాలకు కూడా వెళ్ళి వచ్చాడు క్రిందటి నెలే”
“మరి…”
“మంగ చనిపోయిందన్న బాధతో అయ్యుండాలి”.
“అది పోయినప్పుడే నేననుకున్నాను. అతను ఎంతోకాలం బతకడని.” అంది వేగావతి నవ్వుతూ.
“అనుకున్నావ్?”
“ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకునే దాకా పెళ్ళాం అన్ని పనులు చేస్తూ ఉంటే హాయిగా బతికిన మొగాడు, పెళ్ళాం పోతే కాలు చేయి విరిగినట్లు విలవిలలాడిపోతారు. అది తట్టుకోలేక కాబోలు, పోయాడు…”
“ఛా… అలా కాదే. పెళ్ళికి ముందు నుండీ అదంటే అతనికి ఎంతో ఇది. దానితోనే అతని బతుకు అన్నట్టు ముప్పై ఏళ్ళు సంసారం చేశాడు. ముభావంగా ఉండే అతను రెండేళ్ళ కిందట మీ ఆయన పోయినప్పుడు ‘అదృష్టవంతుడు, ఆమెకంటే ముందే పోయాడు’ అన్నాడు.”
“భార్య కంటే ముందు పోవడంలో అదృష్టం ఏమున్నది?”
“భార్యను ప్రేమించినవాడికి, ముప్పై ఏళ్ళు కలిసి బ్రతికినవాడికి ఆలోటు భరించడం కష్టమే కదే!”
“నేను నమ్మను”.
“మా ఆయనలా తన డబ్బు గొడవలోనో, మీ ఆయనలా రీసెర్చిలోనో తనది అని వుండే వాడు కాదు మంగ భర్త. నీ కెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు….
“దానికెప్పుడైనా స్వతంత్రంగా మాట్లాడే అవకాశం ఇచ్చాడా?” అంది వేగావతి అలా చెప్పుకుపోతున్న కాంతి మాటలకి అడ్డువచ్చి.
“నువ్వలా అడుగుతావని నాకు తెలుసు. కానీ, అది చీకూ చింతా, స్టైస్సు గిస్సు లేకుండా హాయిగా బ్రతికింది. దానికి నీలా నాలా సుగరు, బీపీ లేవు. ఎలా వచ్చిందో కానీ దానికి కేన్సరు వచ్చింది. దానికి కేన్సరని తెలిసిన నాటినుండి పోయేదాకా పసిపిల్లని చూసుకున్నట్టు చూసుకున్నాడు – ఇప్పుడివన్నీ ఎందుకు? దాని పిల్లలు రామ, రత్న ఎంతో బాధలో వుంటారు. మనం వాళ్ళ పక్కన ఉండాలి. నేను, మా ఆయన వెంటనే వస్తున్నాం. మనం కలిసి మంగా వాళ్ళింటికి వెళ్ళాలి. నీ స్త్రీ వాదాన్ని పక్కనపెట్టి బయలుదేరు” అని ఫోన్ పెట్టేసింది కాంతి.
తనకి డయాబెటిస్ అని పంచదార లేకుండా ఏళ్ళ తరబడి తాగిన కాఫీలోని చేదంతా ఒక్కసారి నోట్లోకి వచ్చినట్టు అనిపించింది వేగావతికి.
కాంతి, మంగ-వేగావతికి చిన్ననాటి స్నేహితురాళ్ళు. చదువులు, పెళ్ళిళు అయి సంసారంలో స్థిరపడినా చిన్నప్పటి లాగే స్నేహితురాళ్ళుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వేదవతి. పల్లెటూళ్ళో స్కూల్లో అన్ని తరగతులూ చక్కగా చదివింది.
కనబడిన ప్రతి పుస్తకం విడిచిపెట్టకుండా చదివేది. స్త్రీవాద రచనలవైపు ఆకర్షించబడింది. వాటివల్ల వేదవతికి ఆలోచనలన్నిటిలో తనకి తాను మాత్రమే ముఖ్యం. పెద్ద మనిషి అయ్యేదాకా తమ పల్లెటూరిలో తాను ఎక్కడికి వెళ్ళినా అడ్డుచెప్పని అమ్మానాన్న ‘ఆడపిల్లవి అలా తిరగకూడదు’ అనడంతో వేదవతి ఒక్కసారిగా ఎదురుతిరగడం మొదలుపెట్టింది .
తండ్రి చెప్పే ప్రతిమాటా అంక్షగా తోచేది. పురుషాధిక్యతకి ప్రతీకగా అనిపించేది. తల్లి చెప్పే ప్రతి మాట పితృస్వామ్యంలో అణిగివున్న ఆడదాని మాటలా తోచేది. పద్దెనిమిదేళ్లు రాగానే మొట్టమొదట ఛాందసాన్ని ఎదిరించడానికి చేసినపని తన పేరు మార్చుకోవడం. వేదవతి పేరు ఛాందసాన్ని సూచిస్తోందని, తన వూరి దగ్గరలో వున్న వేగావతి నది పేరుని అమ్మా నాన్నలతో దెబ్బలాడి మరీ తన పేరుగా మార్చుకుంది.
ఆడది మగాడికి ఏ విషయంలోనూ తక్కువ కాదు అనే సిద్ధాంతాన్ని నమ్ముతుంది. ప్రచారం చేస్తుంది. ‘తన స్నేహితురాలైన మంగ అమాయకురాలని, పాతకాలం మనిషని, దాని మొగుడు సుబ్బారావు పురుషాధిక్యతకి లొంగిపోయి గుడ్డిగా అతడు తనను ప్రేమిస్తున్నాడు అని నమ్మి సంసారం చేస్తున్నదనీ’ పదేపదే వాదించేది.
‘ఆయన ఏం చేసినా నా మంచి కోసమే చేస్తారే, నన్ను చీమ కుట్టినా భరించలేరు. విలవిలలాడిపోతారు. నీకేం తెలుసు…!’ అనేది మంగ సగం సిగ్గు, సగం ఆనందం నిండిన గొంతుతో.
‘అవును, ఉదయం లేచిన దగ్గర నుండి ప్రతిదీ అందిస్తూ, అన్ని పనులు చేసి పెడుతూ అణిగిమణిగి ఉండేదాన్ని బుట్టలో వేసుకునేందుకు ఏవైనా చేస్తాడు మగవాడు…’ అని తను అన్నమాట ఇంకా గుర్తుంది.
‘నేను చెయ్యగలిగింది నేను చేస్తాను. ఆయన చెయ్యగలిగింది ఆయన చేస్తారు’ మంగ.
“కానీ అంతా అతని ఇష్టమే…”
“అందరి భార్యాభర్తల మధ్య సంబంధాలని పడికట్టు పదాలతో, రంగు కళ్ళద్దాలతో చూడొద్దే. కాళ్ళే ఎందుకు నవాలి, చేతులు కూడా నడవచ్చు కదా అంటే ఎలా ఉంటుందో నువ్వనది కూడ అలానే ఉందే” అనేది.
***
కాంతి, ఆమె భర్త వచ్చి వేగావతిని కారులో తీసుకెళ్ళారు.
మంగ చనిపోయిన వెంటనే మంగ మొగుడు చనిపోవడం వేగావతి ఆలోచనలలో కొత్త తలుపు తెరిచింది.
మంగ సంసారం, మంగ మాటలు పదేపదే గుర్తుకొస్తున్నాయి. ఏదైనా వాదించడం మొదలు పెడితే ‘నీ యిష్టం నీది’ అని ఒక్క ముక్కలో వాదనలని ఆపేసేది. ఏ పనికైనా ‘మా నాన్నగారితో చెప్పాలే’- అనేది. ‘నీ స్వాతంత్ర్యాన్ని మీ నాన్న అణచేస్తున్నాడే’ – అని వివరించబోతే, ‘నువ్వెన్నైనా చెప్పు, నాన్న నా మంచికోసమే ఏదైనా అంటారు. చేస్తారు.
‘నిన్ను మార్చడం నా వల్లకాదే’ అంటే నవ్వేసేది.
ప్రతీదానికి ‘మా ఆయన్ని అడగాలి’ అంటూ వుంటే, ‘మరీ అంత అణిగిమణిగి ఉండక్కర్లేదే’ అంటే.
‘మొగుడులాంటి భార్య, భార్యలాంటి మొగుడు హాయిగా బతకడానికి బాగుండదే’ అనేది.
సంసారాన్ని ఆస్వాదిస్తూ ఆనందించడంలో తలమునకలవుతున్న మంగని చూసి ‘ఇలా ఎలా ఉండగలవే’ అని అడిగితే
‘సంగీతానికి మనని మనం ఇచ్చుకుంటేనే ఆ సంగీతం ఇచ్చే ఆనందం ఎలాంటిదో, సంసారం కూడా అంతేనే‘
చనిపోయిన మంగ మాటలు, అట్టే మాట్లాడని మంగ మొగుడి చూపులు, చేతలు తనకి తెలియని కొత్త భాష అన్న స్పృహ కలిగింది – అందులోని అక్షరాలూ, గుణింతాలూ బోధపడుతున్నాయి.
సృష్టిలో ఆడ, మగ వేర్వేరు జాతులు కావని, ఒకే జాతిలోని అర్థ భాగాలని స్ఫురించింది. స్త్రీ పురుషుల ఐక్యంలో సంపూర్ణత్వం, ఆ సంపూర్ణత్వంలో సమస్థితి అర్థమయ్యింది. తనలోని అహంకార మూలాలు తనకి కనిపించాయి.
వేగవతి, కాంతి-మంగ ఇల్లు చేరారు. మంగ పిల్లల్ని ఓదార్చారు. రోజంతా అక్కడే ఉండి జరగవలసిన పనులని జరిపించారు.
ఇంటికి వచ్చి మంగ ఫోటో చూస్తూ మౌనంగా కూర్చొంది, వేగవతి.
…
మర్నాడు నిన్నటి ఉత్తరాలకి జవాబులివ్వడం మొదలుపెట్టింది వేగావతి. తన భర్త ‘వనిత’లో మార్పు భరించలేక విడాకులిద్దామనుకుంటున్న భార్య ఉత్తరానికి జవాబు రాసింది.
‘మీ పరిస్థితి నాకర్థమయింది. ప్రస్తుతం మీరున్న ఆలోచనా ధోరణిలో మీకు విడాకులు తీసుకోవడమన్న ఆలోచన సహజమే! మీరు ఈ దాంపత్య జీవితాన్ని మరో కోణంలో చూడండి. జీవితం నిండుకుండ అనుకుంటే, సగం కుండ, కుండకాదు, మీ శ్రేయోభిలాషిణి – వేదవతి.
స్త్రీవాద ఉద్యమం ద్వారా విడిపోయి వివాదాల బరిలో పడిపోయిన ఇరువర్గాలకి ఇకనుండి దాని వారధి కావాలి అని నిశ్చయించుకుంది. తన పేరు వేదవతిగా మార్చుకుంది తన ఇంటిపేరు వారధి. ఆమె అలా వారధి వేదవతి.
Add comment