జనజీవనం దాదాపు స్థంభించిపోయింది. అప్రకటిత కర్ఫ్యూ అమలవుతున్నట్టే వుంది. రోడ్లమీద పిట్టపురుగు కనబడితే వొట్టు. కాలకృత్యాలు తీర్చుకోడానికి తప్ప ఎవరూ టీవీల ముందు నుండీ కదలడం లేదు. గ్రహశకలాలు భూమ్మీదకి దూసుకురావడమో, అణు రియాక్టర్ పేలిపోయి రేడియేషన్ ప్రపంచాన్ని కమ్మేయడమో లాంటి ఆషామాషీ విషయం కాదు మరి జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బోలెడంత ఫాలోయింగు, క్రేజు వున్న భూపతిరాజా గారి అబ్బాయి పర్వేష్ ఆత్మహత్యకి ప్రయత్నించాడు. అదీ అసలు విషయం!
భూపతిరాజా గారంటే అల్లాటప్పా మనిషి కాదు. భూరివిరాళాలతో రాజకీయ పార్టీలన్నిటికీ వెన్నెముకలా నిలిచినవాడు. కళాకారుల్ని పోషించినవాడు. అనేక పుస్తకాలు అచ్చొత్తించినవాడు. బోలెడన్ని పెద్ద సినిమాలకి ఫైనాన్సింగు చేసినవాడు. అలాంటి పే…ద్దమనిషి కొడుకు ఆత్మహత్య చేసుకోబోవడం కన్నా పెద్ద వార్త మరొకటుంటుందా? అయినా సరే, కనీసం కొంతమందైనా దీనిని తేలికపాటి విషయంగా కొట్టిపారేసి వుండేవాళ్లేమో. ఎందుకంటే, పక్క రాష్ట్రాల్లో భూపతిగారి కంటే పెద్ద స్థాయి వ్యక్తుల పిల్లలు కూడా ఆత్మహత్యకి ప్రయత్నించిన సందర్భాలు గతంలో కొన్ని లేకపోలేదు. కాని, అలాంటి వేటికీ రాని ప్రచారం, ప్రాధాన్యత యీ తాజా వుదంతానికి రావడం కాకతాళీయంగా జరిగిందేనా? కాదు! నిజానికి యిక్కడ అసలు వార్త ఆ పిల్లాడు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం కానే కాదు. ఆత్మహత్య చేసుకోడానికి అతగాడు ఎంచుకున్న మార్గమే అసలు వార్త.
భూపతిగారి కొడుకు మొన్న సాయంత్రం రన్నింగ్ లో వున్న షేర్ ఆటోలో నుండీ దూకి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. “వాట్ ద …” అనుకుంటున్నారు కదూ! ఈ వార్త విన్న ప్రతివొక్కరూ అలాగే అనుకున్నారు. కానీ, దురదృష్టవశాత్తూ జరిగింది మాత్రం అదే. ద గ్రేట్ భూపతిరాజా గారి కుమారుడు షేర్ ఆటోలోనుండీ దూకేశాడు. కొద్దిపాటి గాయాలతో బయటపడిన అతన్ని అదే ఆటోలో ఆసుపత్రికి తరలించడం, అతను శరవేగంతో కోలుకోవడం అనేది కూడా వార్తేలే గానీ, అది ఎవరి దృష్టినీ పెద్దగా ఆకర్షించలేదు.
*****
పాలగ్లాసు తీసుకోని భూపతిరాజా వున్న గదిలోకి వచ్చింది అతని భార్య సంధ్యారాణి. కిటికీ దగ్గర నిలబడి దూరంగా ఎక్కడో శూన్యంలోకి చూస్తున్నాడు భూపతి. భార్య వచ్చిన అలికిడి విని యిటువైపు తిరిగాడు. అతన్ని చూసిన సంధ్యారాణి వులిక్కిపడింది. నలభై ఎనిమిది గంటల్లో ఎంత మార్పు! అవమానభారంతో కందగడ్డలా తయారైన అతని మొహం చూస్తే అసలు పరిచయమే లేని కొత్త మనిషిలా అనిపిస్తున్నాడు.
“ఏవిటండీ యిది. మాకందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే యిలా అయిపోతే ఎలా? రెండు రోజుల్నించీ పచ్చిగంగైనా ముట్టలేదు. మీ ఆరోగ్యం ఏమైపోవాలి. కనీసం యీ పాలైనా తాగండి” బాధగా చెప్పింది.
“ఆరోగ్యం బాగుండి ఏం సాధించాలి నేను?” నూతిలోనుండీ వస్తున్నట్టు బలహీనంగా వుంది అతని స్వరం.
“మీ ఆవేదన నాకు అర్థం అవుతోందండీ. నాతోపాటు కిట్టీ పార్టీకి వచ్చే ఆరుగురిలో ముగ్గురి పిల్లలు సూసైడ్ చేసుకోని చచ్చిపోయినవాళ్లే. కానీ వాళ్లెవరూ యిలాంటి పరువు తక్కువ పని చేయలేదు. ఒకడు రన్ వే మీద పరిగెడుతున్న విమానం చక్రాల కిందపడి చచ్చిపోయాడు. ఇంకొకడేమో మెడిసిన్ చదవడానికి చైనా వెళ్లి అక్కడ బులెట్ ట్రెయిన్ కింద తలపెట్టి చనిపోయాడు. ఇక యింకో పిల్లేమో ఇంగ్లిష్ ఛానెల్ యీదుతూ మధ్యలో ముక్కుమూసుకోని బుడుంగుమని మునిగిపోయింది. ఆ పిల్లముండ యింట్లో వాళ్ల బడాయి చూడాలి. పైనబడితే పంటలుండవు, కిందబడితే వానలుండవు అన్నట్టుంది వాళ్లందరి పరిస్థితి. అసలు షేర్ ఆటోలో నుండీ దూకడం…” ఆమెకి దుఃఖం ఆగలేదు.
ఈసారి వోదార్చడం భూపతిరాజా వంతైంది. “ఊరుకో సంధ్యా. ఏదో మన దరిద్రం యీసారికి యిలా తగలడిందిలే కానీ, మనది మాత్రం తక్కువ చరిత్రా ఏవిటీ. ఆరొందల ఎకరాల్లో మిరపపంట వేసిన మా తాత వీరభూపతి ఏం చేశాడు. మిరప మీద కొట్టే పురుగుమందు అందుబాటులో వున్నా కూడా పక్క జిల్లాకి పోయి పత్తిపంటకి వేసే పెస్టిసైడ్ ని ప్రాన్స్ బిరియానీలో కలుపుకు తిని మరీ చచ్చిపోయాడు”. ఆ మాటలు చెపుతుంటే భూపతిరాజా చేయి అప్రయత్నంగా మీసం మీదికి వెళ్లింది. సంధ్యారాణి కళ్లలోనుండీ కిందకి రాలబోయిన కన్నీటిచుక్క చెక్కిలి మీదే ఆగి గర్వంగా సిగ్గుపడింది. “చూద్దాంలేండీ. నాలుగు రోజులు పోతే జనాలు మర్చిపోవచ్చు” పైకి అలా చెప్పిందిలే కానీ, అదంత తేలిగ్గా జరిగేది కాదని ఆవిడకి కూడా తెలుసు.
****
సంధ్యారాణి గారు చెప్పినట్లు నాలుగురోజులు కాకపోయినా, కనీసం నాలుగు వారాలకైనా పరిస్థితి కాస్త సద్దుమణిగి వుండేదేమో. పులిమీద పుట్రలా కొత్త వివాదం వొకటి చోటు చేసుకుంది. మీడియాలో వొక వర్గం ‘షేర్ ఆటో’ అనడానికి బదులుగా ‘సర్వీస్ ఆటో’ అని రాయడం మొదలెట్టింది. భూపతిగారు కోస్తా ప్రాంతం నుండీ వెళ్లి హైదరాబాదులో సెటిలైనవాడు కాబట్టీ.. ఆయన కుటుంబానికి సంబంధించిన వార్తలు ఏం రాయాల్సి వచ్చినా కోస్తా భాష వుపయోగించడమే కరెక్టు అనేది వాళ్ల వాదన. షేర్ ఆటో అనేది తెలంగాణాలో వాడే మాటట. ఆంధ్రాలో దాన్ని సర్వీస్ ఆటో అంటారట. ఈ తేడాని గతంలో ఎన్నడూ గమనించి వుండని వారు కూడా తాజా పరిణామాలతో కోపోద్రిక్తులయ్యారు. ఇది పక్క రాష్ట్రం వాళ్ల ఆధిపత్య ధోరణికి పరాకాష్ట అని విరుచుకుపడ్డారు.
ఇదిలా వుండగా, “ఎవరి సమస్యలని వాళ్ల భాషలోనే రాయాలనే అస్తిత్వ ఉద్యమ స్ఫూర్తి మీలో కొరవడిందా? మీరు మగవాళ్లు కాదా? మీరు ఆడవాళ్లు కాదా? మీరు హిజ్రాలు కాదా?” అంటూ వొక అజ్ఞాతవ్యక్తి రాసిన కరపత్రం వొకటి మీడియాలో హల్‌చల్ చేయడం మొదలెట్టింది. పత్రికల్లో సాహిత్యం పేజీలు ఫాలో అయ్యేవాళ్లకి తప్ప యీ ‘అస్తిత్వ వుద్యమం’ అనే పదం చాలామందికి పరిచయం లేకపోవడం రకరకాల అపార్థాలకి దారితీసింది. ఓల్డ్ మాంక్ స్పృహ, బ్లెండర్స్ ప్రైడ్ స్పృహ తప్ప సామాజిక స్పృహ పెద్దగా లేని వొకరిద్దరు మీడియా మిత్రులు ‘అస్తిత్వ’ అనడానికి బదులుగా ‘ఆస్తిత్వ’ అని రాయడంతో సమస్య యింకా పెద్దదైంది. ఆస్తి అనే మాట వినగానే యిదేదో క్లాస్ స్ట్రగుల్ కి సంబంధించి యిష్యూ అనుకొని కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు. ఆస్తికులు నాస్తికులు అనే గొడవేమో అనే భ్రమలో కొందరు భక్తాగ్రేసరులు కూడా నడుం బిగించారు. “మగవాళ్లనీ, ఆడవాళ్లనీ, హిజ్రాలనీ ప్రశ్నించిన అజ్ఞాతవ్యక్తి లెస్బియన్స్ నీ, గేస్ నీ ప్రత్యేకంగా నిలదీయకపోవడం వివక్షాపూరితం” అని మరొక వాదన బయల్దేరింది.
****
భూపతిరాజా గారికి వొక కూతురు కూడా వుంది. పర్వేష్ కన్నా రెండేళ్లు పెద్దది. ఇంజినీరింగ్ రెండో సంవత్సరం. తమ్ముడు షేర్ ఆటోలోనుండీ దూకిన సంగతి తెలిసిన మరుక్షణం నుండీ ఆ పిల్ల యింట్లోనుండీ అడుగు బయట పెట్టలేదు. కూతురిని చూస్తుంటే సంధ్యారాణి కడుపు తరుక్కుపోతోంది. సాయంత్రం అవగానే మహాలక్ష్మిలా తయారై బయటికెళ్లేది పిల్ల. “పబ్బుకెళ్లొచ్చి, బెబ్బన్నం తిని, బబ్బోడం” అనే త్రిముఖవ్యూహాన్ని వుక్కు క్రమశిక్షణతో అమలుచేసే వరాల తల్లికి యిప్పుడు రాకూడని కష్టం వచ్చిపడింది. పబ్బుకెళ్లడం అనే మొదటి పని మానేసి ద్విముఖ వ్యూహంతో సరిపెట్టాల్సివస్తోంది. తమ్ముడు చేసిన పనితో ఆమె స్నేహితులకి మొహం కూడా చూపించలేకపోతోంది. అంగుళం ఖాళీ లేకుండా వొళ్లంతా టాటూలు వేయించుకోవడం వల్ల (టెంపరరీవే లేండీ) ఏయే అవయవాలు ఎక్కడున్నాయీ అన్నది ఎవరికీ తెలిసే అవకాశం లేదు. కానీ మొహం అలాక్కాదే!
“ఏంటి మమ్మీ యిది నాస్టీగా. షేర్ ఆటోలోనుండీ దూకడమేంటి? ఈ లేబర్ బుద్ధి వాడికి ఎక్కణ్నించీ వచ్చింది? నా ఇన్స్టాగ్రామ్ ఫ్రెండు ‘డియ్యో అండర్ స్కోర్ డిసక్’ వాళ్ల తమ్ముడు కూడా పోయిన్నెలలో సూసైడ్ చేస్కున్నాడు. ఎలాగనుకున్నావ్? గుఫ్ గుఫ్ బ్రాండు ఆపకుండా ఆరుగంటల పాటు పీల్చీ పీల్చీ..”
అవునా అన్నట్టు అబ్బురంగా చూసింది సంధ్యారాణి. ‘డియ్యో అండర్ స్కోర్ డిసక్’ వాళ్ల పేరెంట్స్ ని తల్చుకుంటే అసూయతో లోపలెక్కడో భగ్గుమంటోంది ఆవిడకి.
“అప్పుడే షాక్ అవ్వకు. వాడు పీల్చింది ముక్కుతోనో నోటితోనో కాదు తెలుసా” బాంబు పేల్చింది పిల్ల. ఆ డియ్యో రాలుగాయి హుక్కాని దేనితో పీల్చివుంటాడో వూహించుకోలేనంత అమాయకురాలు కాదు తల్లి.
“అసలు వాడికి పర్వేష్ అనే పేరు ఎందుకు పెట్టామో తెలుసా? ప్రాణం కన్నా పరువుని ఎక్కువగా కాపాడుకోవాలని అనుక్షణం గుర్తు చేయడానికే. ఏం లాభం, దేనికైనా పెట్టిపుట్టాలి. నన్ను చూసి నవ్వుద్దనే భయంతో ఆ పనిమనిషి ముండని కూడా వారంరోజులు రావొద్దని చెప్పా. ఎంత కర్మ పట్టిందో చూడు నాకు” విరక్తిగా నవ్వుతూ బయటకి నడిచింది సంధ్యారాణి.
పర్వేష్ చీప్ గా షేర్ ఆటోలో నుండీ దూకి సూయిసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించడం అనే మొత్తం ఎపిసోడ్లో ప్రాక్టికల్‌గా ఎక్కువ నష్టపోయింది సంధ్యారాణి గారే. ఆవిడ పాతికేళ్ల క్రితం యీ యింటికి కోడలిగా వచ్చింది. ఏనాడూ అటు పుల్ల తీసి యిటు పెట్టాల్సిన అవసరం రాలేదు ఆవిడకి. ఏడాది మొత్తంలో వొక్కరోజు కూడా నాగా పెట్టకుండా, ఠంచనుగా టైముకి వచ్చేసే రంగి లాంటి పనిమనిషి దొరకడం దానికి వొక కారణం అయితే, రెండో కారణం సంధ్యారాణి గారి ఆడబడుచు వర్థనమ్మ గారు. చిన్నవయసులోనే భర్తని పోగొట్టుకున్న వర్థనమ్మగారు తన తమ్ముడైన భూపతిరాజా పంచనే పడివుంటోంది. రంగి పై పనులు చూసుకుంటుంటే, వంట చేయడం వంటి మిగిలిన పనులన్నీ వర్థనమ్మగారే చక్కబెట్టేది.
తన తమ్ముడి కొడుకు చేసిన సిగ్గుమాలిన పనితో వర్థనమ్మగారికి తల కొట్టేసినట్టు వుంది. ఫలానా ఆవిడ మేనల్లుడు షేర్ ఆటోలోనుండీ దూకేశాడని తెలిసిన దగ్గర్నుండీ తోటి వితంతువులు ఆమెని అసలు మనిషిలాగానే చూడడం మానేశారు. దానితో మనస్తాపం చెందిన వర్థనమ్మగారు పెట్టేబేడా సర్దుకొని తీర్థయాత్రలకి వెళ్లిపోయారు ఆరోజు ఉదయాన్నే. ఇప్పడు యింటిపనంతా చచ్చినట్టు సంధ్యారాణి గారే చేసుకోవాలి.
*****
భూపతిరాజా కుటుంబ వ్యవహారం తెలుగుజాతి మొత్తానికి సమస్యగా మారడం రాష్ట్ర ముఖ్యమంత్రికి పిచ్చపిచ్చగా నచ్చింది. వంద సమస్యలు, వెయ్యి ఆరోపణలతో వూపిరి సలపక గిలగిల్లాడుతున్న ఆయనకి రెండ్రోజుల బట్టీ సుఖంగా వుంది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు.
“దర్జాగా చనిపోడానికి కూడా అవకాశం లేదు ఈ రాష్ట్రంలో. చివరికి శ్రీమంతుల పిల్లలు కూడా షేర్ ఆటోల్లో నుండీ దూకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాగైతే మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయ్? మా పార్టీ అధికారంలో వున్న రాష్ట్రాల్లో ధనికులు పిల్లలు ఎంత దర్జాగా చచ్చిపోతున్నారో..” అంటూ ప్రతిపక్ష నాయకుడు చేసిన ప్రసంగం ప్రపంచమంతా వైరల్ అయిపోయింది. సీఎం ఆదేశాల మేరకి యిద్దరు ఎమ్మెల్యేల క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ హుటాహుటిన రంగంలోకి దిగింది. “అపోజీషన్ లీడర్ లఫూట్ అనీ, అందుకే మొత్తం మరణాల సంఖ్యని కాకుండా కేవలం మరణించిన తీరుని మాత్రమే పరిగణణలోకి తీసుకుంటున్నాడని” మొదటి ఎమ్మెల్యే దుమ్మెత్తిపోశాడు. “అపోజీషన్ లీడర్ లఫంగి అనీ, చనిపోయిన మొత్తం పిల్లలు గత ప్రభుత్వంలోనే ఎక్కువమంది అనేది నిజమే అయినా.. చనిపోయిన వాళ్లలో మైనారిటీల శాతం తమ హయాంలోనే ఎక్కువగా వుందనీ” రెండో ఎమ్మెల్యే తూర్పారబట్టాడు. లఫంగి, లఫూట్ అనే రెండు తిట్లలో ఏది ఘాటైనదీ అన్నది తేల్చడానికి వొక కమిటీ వేస్తున్నామనీ, నివేదిక వచ్చాక.. ద సదరు తిట్టుని ప్రయోగించిన ఎమ్మెల్యేని ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తాననీ సీఎం ముఖ్యమంత్రి ప్రకటించాడు. రెండో ఎమ్మెల్యేకి కూడా అన్యాయం జరగదనీ, అతన్ని అధికార భాషా సంఘం అధ్యక్షుణ్ని చేస్తారనీ వూహాగానాలు వూపందుకున్నాయి.
ఈ మొత్తం వ్యవహారాన్నీ సొమ్ము చేసుకోవడానికి ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు పోటీ పడసాగాయి. ముఖ్యంగా తెలుగు మార్కెట్లో మోనోపలీ కోసం కత్తులు దూస్తున్న అమీతుమీజాన్, క్లిప్ ఫార్ట్ కంపెనీలు కొత్త ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న పిల్లలు తమ సైట్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే వాళ్లని హెలికాప్టర్లో తీసుకెళ్లి దుర్గం చెరువులో పడేట్లు వదిలేస్తామనీ, వాళ్లు చనిపోవడాన్ని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తామని ప్రకటించాయి. కానీ, దుర్గం చెరువుని యిలాంటి పనులకి వాడడానికి వీల్లేదని కాండోమ్లు తయారుచేసే కంపెనీలన్నీకోర్టుకి వెళ్లడంతో ఆన్‌లైన్ సైట్లవాళ్లు వెనక్కి తగ్గాల్సొచ్చింది.
****
వారం రోజులు గడిచింది. పనిమనిషి రంగి ఎప్పట్లానే పన్లోకొచ్చింది. కానీ, యింట్లో ఎవరూ ఆమె మొహంలోకి చూసే సాహసం చేయడం లేదు. రంగి అన్నకొడుకు కూడా పర్వేష్ మాదిరిగానే షేర్ ఆటోలో నుండీ దూకి ఠపీమని చచ్చిపోయాడు ఆర్నెల్ల క్రితం. ఆ విషయం గుర్తొస్తే భూపతిరాజాకీ, అతని భార్యకీ, కూతురికీ తల కొట్టేసినట్టు వుంది. ఆ పని చెయ్యి, యీ పని చెయ్యి, అక్కడ మరకేంటి, యిక్కడ దుమ్మేంటి అని రంగిని అడిగేవాళ్లెవరూ లేరిప్పుడు. అందరూ తనని చూసి తప్పుకోని తిరగడం, ఆరామ్‌గా తనకి ఎప్పుడు ఏ పని చేయాలనిపిస్తే అప్పుడు ఆ పని చేసుకునే అవకాశం రావడం రంగికి కలలాగా వుంది. “రంగమ్మ హిత్తాహిత్తాందే…” అని పాడుకుంటూ, మధ్యమధ్యలో చీపురుని గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ వొక్కో గదీ తిరుగుతూ వూడవసాగింది రంగి.
దాదాపు అన్ని గదులూ వూడవడం అయిపోయింది. ఇంకొక్కటే మిగిలింది. ఆ చివరి గదిలోకి అడుగుపెడుతూనే రంగి నోట్లోంచీ వస్తున్న కూనిరాగం దానంతటదే ఆగిపోయింది. బెడ్ లైటు మాత్రమే వేసి వున్న చీకటి గదిలో గోడవైపు తిరిగి పడుకోనున్నాడు పర్వేష్. చప్పుడు చేయకుండా మెల్లగా పని కానిచ్చుకోని బయటకి వచ్చేసింది రంగి. ఆ గదిలోకి వెళ్లేముందున్న వుత్సాహం ఆమెలో కనబడ్డం లేదు. ఏదో చేయాలనుకొని కూడా, చేయాలా వద్దా తేల్చుకోలేనట్లు గుమ్మం దగ్గరే కాసేపు నిలబడిపోయింది. చివరికెలాగైతేనేం ధైర్యం చేసుకొని, వెనక్కి తిరిగి, గదిలోకెళ్లి మంచం పక్కన నిలబడింది. రంగి వెళ్లిపోయిన విషయం పర్వేష్ కి తెలుసు. మళ్లీ ఎవరొచ్చారా అన్నట్టు పక్కకి వొత్తిగిల్లి చూశాడు. దిగులుగా వున్న రంగి మొహం అతనికి చాలా అందంగా కనబడింది.
“సచ్చిపోయేంత కట్టం ఏవొచ్చింది బాబూ..”
రంగి నోట్లోనుండీ మాట బయటకి రాకముందే ఆమె అడగబోతున్న ప్రశ్న ఏంటో అతనికి అర్థమైపోయింది.
*
enjoyed reading
Thank you so much andee. Your encouragement means a lot 🙏🙏🙏
కృష్ణజ్యోతిగారూ,
కథ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺
భలే సరదా అయినా కధ ద్వారా దేశం లోను రాష్ట్రం లోను ఉన్న వ్యంగ్య మీడియా, రాజకీయ నాయకులు చిన్న విషయాల గురించి కొట్టుకోడం, మా సరదాగా రాసారు
Thank you so much sir 🙏
ముగింపు నాకు అర్థం కాలేదు.ఎవరైనా ఈ అజ్ఞానికి అర్థం చేయించి పుణ్యం కట్టుకోండి.
మీలాంటి పెద్ద రచయితకే అర్థం కాలేదంటే పొరపాటు నాదే అయ్యుంటుంది. పైన సుబ్రహ్మణ్యం గారు, కింద శైలజగారు పెట్టిన కామెంట్స్ చూడండి. నా వుద్దేశం అదే. ఆ అబ్బాయి అసలు ఎందుకు చనిపోవాలనుకున్నాడూ అన్నదానికి ప్రాధాన్యత లేకుండా అనవసరపు విషయాల గురించి జనాలు ఫీలైపోవడం అనేదే కథ. Hope I cleared your confusion.
ఆడంబరాలు,అహంకారాలు మానవసంబంధాలను ఎలా మారుస్తున్నాయో దర్పణం ఈ కథ. ఎంత హాస్యాత్మకంగా చెప్పినా వాళ్ళ ప్రవర్తనను మనసు accept చేయటం లేదు. రంగి ఒక్కతే ఆ ఇంట్లో ఏకైక మనిషి.వెర్రితలల evolution జాతికి ఏం పేరు పెట్టాలో…. ఒప్పుకోలేని నిజం… ఒక్కరు మారినా రచయిత కష్టానికి సరైన ప్రతిఫలం
You got my point madam. Thank you so much ❤
కథ రెండుసార్లు చదివాను. మీరు ఎప్పటిలాగే వాడిన పేర్లు హాస్యంగా అనిపించినా… కథ లోతుని అర్థం అవుతుంటే ఎందుకో బాధ అనిపించింది. కీర్తిప్రతిష్టలు, పరువుమర్యాదల పేరుతో పసిపిల్లల బాల్యం చిదిమేస్తున్నారు ఈ డబ్బున్న పెద్దవాళ్ళు. వాళ్ళ పిల్లల ప్రస్థుత పరిస్థితిని మీరు చెప్పినతీరుని అర్థం చెసుకుని ఆలోచింపజేసేలా ఉంది.
కథ లక్ష్యాన్నీ, స్ఫూర్తినీ అర్థం చేసుకున్నందుకు సంతోషం. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
Good read…great satire on present day media and society 😊.. looking for for more
Thank you mam. You have always been a great inspiration for me. 🙏
Your mark story… Enjoyed sir.
Thank you so much ❤
Very good social satire. With a little bridle on words, this would have become a much better story. Best wishes.
Thank you mam. I do agree with you. It could have been better. I discovered that fact only after reading the story in print.
Vety realistic
Thank you mam 🙏
అప్పట్లో దాసరిగారు కొన్ని ఆలోచింపచేసే సినిమాలు తీసి ఎండింగ్ కంక్లూస్ చెయ్యకుండా హింట్ ఇచ్చి వదిలేసేవాళ్ళు మీ కథలు అలానే ఆలోచింప చేసేవిగానే ఉంటున్నాయి , నా రియల్ ఫీలింగ్ అయితే చాలా సమస్యలమీద మీరు పెట్టె పోస్టింగ్స్ డీప్ కంటెంట్ తో ఉండి మీ కథల కన్నా చాలా బాగుంటాయి అనిపిస్తుంటుంది , ఆ డెప్త్ మీ కథల్లో మిస్ అయినట్టు ఉంటుంది
Sridhar garu, that you so much for your kind words. ఎఫ్బీ పోస్టులకి లేని చాలా లిమిటేషన్స్ కథలకి వుంటాయి కదా. అక్కడ రాసే విషయాలని ఆసక్తికరమైన కథలుగా మలచగలిగేంత చేయి తిరగలేదు మనకింకా. మేబీ ముందు ముందు సాధ్యపడుతుందేమో చూడాలి. Facebook అనుభవం పదేళ్లు. కథకుడిగా ఆరునెలలే కదా. బాలారిష్టాలు కొన్నుంటాయ్ కదా 😝
Thank you *
Typing error
రంగిలోనే ఎందుకు చనిపోయాడో అడిగే మానవత్వం ఉండడం చాలా మంచి ముగింపు. అది కూడా ఊరికే పేదరికం వల్ల అన్న క్లీషే కాకుండా ఆమె కొడుకు అలానే చనిపోవడం వల్ల కావడం మీ టచ్. ఇంత బరువైన విషయం అంత సరదాగా రాయడం ఇంకా ఇంకా డెప్త్ తీసుకువచ్చింది. 👌🏾🙏🏽
హమ్మయ్య.. విషయంలో బరువు రావడమేమో కానీ, నా గుండెల మీద బరువు దిగినట్లుంది మీ ప్రశంస వల్ల. Thank you so much ❤
మూడో పేరా ముగిసేలోగా ఇక నవ్వు ఆపుకోవడం నా వల్ల కాలేదు. ఇంట్లో వాళ్ళు నావంక అనుమానంగా చూసారు. “అస్తిత్వ వాదులు, భక్తాగ్రేసరులు, రకరకాల మానవ జాతుల వాళ్ళు అందరినీ ప్రత్యేకంగా నిలదీయకపోవటం వివక్షాపూరితం”. బాబోయ్ కామెడీ నెస్ట్ లెవెల్ ని దాటేసింది. ఈ హైప్ కి నవ్వి నవ్వి పొట్టనొప్పి వచ్చిందండి. సూసైడ్ చేసుకుంటే ఓ రేంజ్ లో పదిమంది గొప్ప గా చెప్పుకునేలా చేసుకోవాలి కానీ ఇలా షేర్ ఆటో లోనించి దూకడం లాంటివి చాలా చాలా చీప్ అని అర్థం అయింది 😂 మొత్తం సమాజాన్ని హాస్యం తో దెబ్బ కొట్టారు.
సమాజంలో వున్న ఒక అపసవ్య ధోరణి పట్ల ఆవేదనని కాస్తంత హాస్యం మేళవించి చెప్పడంలో కొంతమేరకైనా కృతకృత్యుణ్ని అయ్యాననే ధైర్యాన్నిచ్చింది మీ కామెంట్. Thank you so much andee 🙏
మంచి సెటైర్!
Thank you sir 🙏
అద్భుతం సోదరా. ప్రస్తుత సమాజ పోకడలను భూతద్దంలో చూపించిన చక్కటి రచన ❤
Satirical Story కాబట్టి హాస్యంగా, వ్యంగ్యంగా అనిపిస్తుంది గానీ ఇందులో మీరు స్పృశించిన నిజాలు, సమాజంలో వివిధ వర్గాల ప్రజలు కనీస విచక్షణ, విశ్లేషణ లేకుండా అశాంతితో, ద్వేషభావాలతో జీవిస్తున్న తీరు తోటి సమాజం పట్ల మీ ఆవేదనను తెలియజేస్తుంది.
ఇంత చక్కటి రచన చేసిన మీకు అభినందనలు.!
ఇలాంటి మంచి అర్ధవంతమైన కథను ప్రచురించిన ‘సారంగ’ పత్రికకూ. Afsar గారికి కూడా ఈ సందర్భంలో అభినందనలు 👍
మీ ప్రశంసల వర్షంలో తడిసి ముద్దైపోయాను. థేంక్యూ సో మచ్ 😍
ఏమి చెప్పి వుంటాడో సమాధానం
ఏం చెప్పాడనేదానికి ప్రాధాన్యత లేదు కదండీ. కారణం చిన్నదైనా పెద్దదైనా అసలది ఏంటో కనుక్కోవాలనే స్పృహ లేకపోవడం గురించి కదా మన అక్కర.
Satirical story. ఓ సీరియస్ అంశాన్ని ఇంత వ్యంగ్యంగా కథీకరించిన మీ ధైర్యానికి అభినందనలు. ఆఖరి వాక్యాలు ఆయువుపట్టు.
Thank you very much madam. మీ ప్రశంస నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ❤