1
చుట్టూ ఒక వృత్తం
అంతకంతకూ కుంచించుకుపోతూ
కొండ చిలువలా బిగుసుకుటుంది
ఇరవై నాలుగు గంటలూ
మెదడును గుచ్చే
గడియారపు ముండ్ల పరిభ్రమణం
వర్తమానం బయటికి దారిలేని
నయా పద్మవ్యూహం
నిత్యం
కొత్తగాయాల మోదుగ పూలవనం
యవ్వనానంతర జీవనం
ఏదో వ్యాపార క్రీడ
మెడ మీద కత్తిలా
దీర్ఘ రాత్రుల కనురెప్పల కింద
గరగరమంటూ
రేపటి అవసరాల కీచురాళ్ళ రొద
బాల్యాన్ని
బెత్తంపట్టుకొని భయపెట్టిన లెక్కలే
ఇప్పటికీ
చాలీచాలని జీతాన్ని వెంటాడుతుంటాయి
ఖర్చుల తీసివేతలో
అప్పుతెచ్చుకొన్న అంకెలు
ఏవో అంచనాలు నిచ్చెనలెక్కి
చివరికి అబాసు పాముల నోటికి చిక్కి
మళ్లీ మొదటికి వస్తుంది ఆట
వెంటే నడుస్తూ
వెక్కిరించే ఓటమి
తోడు వీడని బాల్య మిత్రుడు
ఎప్పుడో
అర్దచేతన అడుగున దాచిన భయాలు
కలత నిద్రను తరుముతున్న కలలు
పీడ కలలోంచి మెలకువలోకి
జారినప్పటి క్షణమంత నిశ్చింతే
శేషం సున్నాలా మిగిలేది!
అర్థంకాని లెక్క లాంటి బాధ్యతల
భాగహారపు బతుకు
ఓ వ్యాపార గణితం !
*
2
ప్రతీ పద్యం విశ్వ సుందరి కాదు!
అందమైన పద్యం మహా మోసపూరితమైనది
అది కన్నీటి బొట్టులో కూడా
మెరిసే ముత్యాన్నే చూపెడుతుంది
హృదయవిదారక దుఃఖానికి కూడా
ఏదో రాగాన్ని అన్వయిస్తుంది
రసరమ్య పద్యం మహా కసాయిది
ఆకలి దేహంలో కూడా
అవయవ సౌష్టవాన్ని అన్వేషిస్తుంది
మెళకువలు తెలిసిన పద్యం
మహా బతుక నేర్చినది
అది జీవితాలు తగలబడి పోతుంటే
ఆ బూడిదను విభూతిలా అమ్మేస్తుంది
మనసు నిండా గాయాల తడిని మోస్తున్న పద్యం
నిరంలకారమైనది
అది ముడతల్లేని విశ్వ సుందరి ముఖచిత్రం కాదు
తల్లి లాంటి ఆ పద్యం
పగిలిపోయిన జీవితాలకు
దయను లేపనంగా రాస్తున్న
మదర్ థెరీసా చిత్రపటం!
3
జడత్వ జంతువు
ఇన్నిన్ని మురికి కాల్వలు
లోపలికి ఇంకి పోతున్నయి
ఆత్మ పరిశీలనకు సుస్తీ చేసింది
ఇంక ఈ రక్తాన్ని
ఏ మూత్ర పిండాలూశుభ్రం చేయలేవ్!
ఇంతకు ముందెన్నడూ చూడని రంగులతో
చీకటి గొట్టం
అమాంతం లోపలికి పీల్చుకుంటున్నది
చూపుల మునివేళ్లు
ఆకర్షణీయ తెరమీద తచ్చాడుతున్నయి
చుట్టూ ఏం జరుగుతున్నా
పట్టని ఇరుకుతనం
అదునుజూసి
ఎక్కడికక్కడ విడగొడుతూ
వ్యూహాత్మక మౌఢ్య దాడి!
సమూహంలో ఏకాకి మునక
నిలబడ్డ ప్రతీ చోటా సొరచేపలా మింగేస్తున్నది మాయా సముద్రం
ఈ మగత మీద ఇన్ని నిప్పులు జల్లి
నిద్రలేవక పోతే!
మనిషితన్నాన్ని మేసే జడత్వ జంతువుకు
బలికాక తప్పదు!
*
అది కన్నీటి బొట్టు లో కూడా మెరిసే ముత్యాన్ని చూపిస్తుంది
Thank you sir.
Thank you sir.
శుభాకాంక్షలు అన్న..కవితలు మూడూ చాలా బావున్నాయి💐💐💐
ధన్యవాదాలు తమ్ముడు.❤️
బావున్నాయి… ముఖ్యం గా మదర్ థెరిసా చిత్రపటం కవిత… Lines బావున్నాయి…
థ్యాంక్యూ సర్.🤝
పద్యం విశ్వసుందరి కాదు కవిత చాలా బాగా నచ్చింది అన్న
చాలా సంతోషం తమ్ముడు.ధన్యవాదాలు తమ్ముడు