వూండెడ్ సోల్

న్ను రెక్కలు   పట్టుకుని బలవంతంగా  తీస్కెళుతున్నారు. నేను రాను అని ఎంత మొండికేస్తున్నా ఆగడం లేదు. నన్ను వదలడం లేదు. జ్యోతి ఆంటీ అడ్డం వచ్చారు.
‘ఏంటి పిల్లను   చంపేస్తారా..? ఇష్టం లేదంటుందిగా, ఎందుకు తీసుకెళ్తున్నారు’ అని అడిగారు గట్టిగా.

నా చేయి వదిలేసి ‘మీకేం తెలుసండి …మా బాధ? ఎవరింటికి ఏ కార్యానికి వెళ్ళినా మీ అమ్మాయి పెళ్ళి చేశారా? ఇంకా చేయలేదా..? ఏ తలకు  మాసిన వెధవతోనో లేచి పోకముందే పెళ్ళి చెయ్యండి’ అని ఉచిత సహాలిస్తున్నారు. ఎవరింటికి వచ్చినా ‘వయసయిపోయాక చేస్తావా బిడ్డ పెళ్ళి’ అని ఎద్దేవా చేస్తున్నారు. వీధిలోకి వెళ్తే చాలు  నా బిడ్డ గురించిన మాటలే.. వినలేక విరక్తి వస్తుంది… అందుకే మొన్ననే ఒక సంబంధం చూశాను. రెండో పెళ్లివాడు.. కొంచెం వయసు పెద్దదయినా మమ్మల్ని బాగా అర్ధం చేసుకున్నవాడు.. కుదుర్చుకున్నాము. అమ్మాయిని తీసుకెళుతున్నాను. ఇది మా కూతురు… ప్రేమ ఉన్నచోట బాధ్యత కూడా ఉంటుంది. మేం కన్ను మూసేలోగా పెళ్లి చూడాలి అని మాకుండదా ఏంటి? అందరికీ చెప్పేవాణ్ణి నేను… ఎవరితోను చెప్పించుకోవాల్సిన అవసరంలేదు..’  విసవిసా నా చేయి పట్టుకుని  కోపంగా అడుగు వేస్తూ లాక్కెళుతున్నాడు అబ్బా.

జ్యోతి ఆంటీ బలం  సరిపోలేదు నన్ను తీసుకెళ్లడం ఆపడానికి. అమ్మీ అబ్బా ఇద్దరూ పట్టి ఆటోలో కుదేశారు…! భయంతో వళ్ళంతా చెమటలు   పట్టినయి.. దెబ్బకు మెలకువ వచ్చింది. లేచి కూర్చుని సెల్‌లో టైమ్‌ చూస్తే మూడవుతుంది. మళ్ళీ నిద్ర పట్టలేదు చాలాసేపు. తెలతెలవారుతుండగా పట్టింది నిద్ర. లేచేసరికి ఆలస్యమైంది.

***
హడావుడిగా లేచి తయారై ఆఫీసుకు వెళుతుంటే ఆంటీ పిలిచింది.
‘‘ఏంటి ఆంటి.. టైమ్‌ అవుతోంది ఆఫీసుకి’’ అంటూనే వెళ్ళి కూర్చున్నా. జ్యోతి ఆంటీ చాలా మంచిది. వాళ్ళమ్మాయిలానే చూస్తుంది నన్ను.
‘‘సాయంత్రం రా.. నీకో సర్‌ప్రైజ్‌ న్యూస్‌’’ అంది.. చేతికి స్నాక్స్‌ ఉన్న చిన్న డబ్బా ఇచ్చి.
‘‘ఏంటి ఆంటీ సాయంత్రం వరకూ నేను టెన్షన్‌ పడాలా..’’ అంటూ చిరుకోపంతో నవ్వుతూ,
‘బై ఆంటీ’ అని చెప్పి చేయి ఊపుతూ ఆఫీస్‌కి వెళ్ళిపోయాను.

***
కొత్త ప్రదేశాలు  చూడాలని తిరగాలని ఉండేది. ఏ చిన్న కొత్త విషయం విన్నా ప్రదేశం గురించి లేదా దేశం గురించి విన్నా మైమరిచి చదివేదాన్ని. చిన్నప్పుడు తెలుగు  పాఠాలు  బాగా ఇష్టంగా చదివేదాన్ని. వాటిని ఆకళింపు చేసుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని.

అప్పుడే మొదటిసారి కాశ్మీర దీప కళిక పాఠం తెలుగు   మేడం చెప్తున్నప్పుడు విన్నాను. ఆమె పాఠం చెప్తున్నంత సేపు అల్లా ఉద్దీన్‌ మాయా తివాచీ ఎక్కి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళినట్టు నేను నా మనసునెక్కి కాశ్మీరం వెళ్ళేదాన్ని.

మా మేడం రచయిత్రిని పరిచయం చేస్తూ నాయని కృష్ణకుమారి గారి గురించి చెప్తుంటే  ‘ఆమె ఎంత నసీబీనో కదా’ అనిపించింది. పాఠం విని ఊరుకుంటే నేను నర్గీస్‌ ని ఎందుకయిత..!  మనసు మీద ముద్రించుకున్న అక్షరాలు..

‘కాశ్మీర్‌ ఒక్కసారన్నా వెళ్ళాలి!’

***
టీవీలో న్యూస్‌ చూడాలంటే భయం! వాళ్ళ మాటలు… నిర్మానుష్యమైన రోడ్లు… నగరాలు.. నవ్వు కోల్పోయిన మొఖాలు.. పువ్వులు  కోల్పోయిన దాల్‌ సరస్సులా.. కమిలిన దేహాలు..  గాయపడిన మనసులు  మనుషులు…. కశ్మీర్‌ జీవం కోల్పోయింది. విపరీతమైన బాధ.. ఎన్ని కలలు ఊహలు … కశ్మీరం గురించి… ఎంత ఉబలాటం చూడాలని…
“ఒక్కసారైనా కశ్మీర్‌ వెళ్ళాలి!”
***
కాశ్మీర్‌ మీది పొయెటిక్‌  వాక్యాలు   వెంటబడి నన్ను నిద్రకు దూరం చేశాయి చాలా రోజులు.. కొందరు మనుషుల్లాగ.

‘‘మంచు ముసుగు వేసుకుని అకుంఠిత శిరస్క అయిన కులీన స్త్రీకి మల్లే కించిద్వినమ్రభావం వెలారుస్తూ ఓ పర్వత శిఖరం’’…. ఆ పర్వతసానువు పక్కనే ఉన్నట్లు అనుభూతి. చూస్తేనే కదా ఇట్లా రాయగలరు..!

నిద్ర లేకుండా చేసిన ఆ పర్వత శిఖరంలా  తెల్లవారు  ఝామున లేచి గులాబీ పొద పక్కన కూర్చొని  కమ్ముకున్న పొగ మంచులో తడుస్తున్న గులాబీ మొగ్గలను చూస్తూ కాశ్మీర్‌లో ఉన్నట్టు… ఓహ్ ..! ఎన్ని కలలుండేవి కశ్మీర్‌ గురించి తనకి?

అట్లా… తెల్లవారు ఝామున మంచులో కరిగే నన్ను ఒకరోజు అమ్మీ చూసి ‘ఏంటే షైతాన్‌ పిల్లలా  అక్కడ కూర్చున్నావు.. వచ్చి పడుకో’ అని గద్దించడంతో ఆ రోజుకి నా కాశ్మీరీ పర్యటనను రద్దు చేసుకోవల్సి వచ్చేది. నేనంతే, నాకిష్టమైనదానికి, నేను చేయాలనుకున్నదానికి ఎవరైనా ఆటంకం కలిగించినా విమర్శించినా తట్టుకోలేను. ఎందుకో కొంచెం స్వేచ్ఛ అంటే ఎక్కువిష్టం. మట్టిలో ఆడుకోవడం.. వర్షంలో తడవడం… లాంటివి ఇంకొన్ని.. కొన్ని డిజైర్‌లు  వెంటాడుతుంటాయి.. లేదా వాటిని మనం వెంటాడుతుంటాం!

‘జిందగీలో ఒక్కసారన్న కాశ్మీర్‌కు వెళ్లాలి!’
‘‘జిందగీమే ఏక్‌ బార్‌ తో భీ ఉస్‌ జన్నత్‌ కు జాకే ఆనా..’’

***
సాయంత్రం ఇంటికొచ్చి కొంచెం ఫ్రెష్‌ అయి ఆంటీ దగ్గరకు వెళ్ళాను.. నేను తెచ్చిన కివీస్‌ ముక్కలను చిన్న గిన్నెలో వేసుకుని. ఇద్దరం సోఫాలో కూర్చున్నాం.

‘‘ఏంటో గెస్‌ చెయి’’ అంది ఆంటీ..
‘‘ఏమో ఆంటీ, తెలియదు… మీరే చెప్పండి’’ అన్నాను.
‘‘కాశ్మీర్‌లో మా అల్లుడి  బంధువులది పెళ్ళి ఉంది. పెళ్ళి కొడుకుది కూడా ఇక్కడే యాంటిక్‌ పీసెస్‌ షాప్‌ మా అల్లుడి లాగే … మేమంతా వెళ్తున్నాం.. నువ్వెప్పటి నుంచో అడుగుతున్నావు కదా.. వస్తావా..? వస్తానంటే చెప్పు, అహ్మద్‌ భయ్యాకి చెప్పి నీకూ టికెట్‌ బుక్‌ చేయమని చెప్తా’’ అంది నవ్వుతూ..

ఆంటీ మామూలుగానే బావుంటారు. నవ్వితే మరీ బావుంటారు. నిజం చెప్పొద్దు, నాకు మా అమ్మా నాన్నలే గుర్తొస్తారు ఆంటీని అంకుల్‌ని చూస్తే. కానీ ఆలోచనా విధానంలో ఎంత తేడా ఉంటుంది?
జ్యోతి ఆంటీ వాళ్ళు చౌదరీలు. రాయలసీమ. హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం. కర్నూల్లో ఇళ్ళు భూములున్నాయి. కమ్యునిస్టు ఫామిలి. వాళ్ళ అమ్మాయి శైలజ కింద ఫ్లాట్‌లో ఉంటున్న కశ్మీరీ పిల్లాడు అహ్మద్‌ను ప్రేమించింది.
ఇద్దరూ ఇంట్లో చెప్తే బంధువులంతా గొడవ చేశారు. కానీ వీళ్లు వినలేదు. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నరు. ఇద్దరు పిల్లలు. నౌరీ… ఇశాంత్‌. ఎంత ముద్దుగా ఉంటరో. నౌరీని చూస్తుంటే మళ్ళీ నాకు సలీమా గుర్తొస్తుంటుంది. కశ్మీర్‌ను చూసినట్టుం టుంది. అహ్మద్‌ శైలజా వాళ్ళు వేరే ఇంట్లో ఉన్నా తరుచుగా ఇక్కడికి వస్తుంటారు. అలా నాకు బాగా పరిచయమయ్యారు. ఇప్పుడు అహ్మద్‌ కజిన్‌దే పెళ్ళి. టికెట్స్‌ బుక్‌ చేశారు.

మనసు నిండా కాశ్మీర్‌ను చూడబోతున్న ఆనందం. మనసంతా నిండిన చల్లదనం!
***
నాంపల్లిలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ‘నుమాయిష్‌’ జరుగుతుంది. తెలంగాణలో ఏంటి మొత్తం సౌత్‌లోనే బహుశా పెద్ద ఎగ్జిబిషన్‌ ఇదే అయింటుంది.. నాకున్న జ్ఞానం ప్రకారం. కొలీగ్‌ షబానా ‘టాప్స్‌ సారీస్‌ ఎంత బావుంటయో… దేశం అన్ని మూలల్నించి తీసుకొస్తరు, ఎన్ని వెరైటీస్‌ ఉంటయో తెల్సా ..!’ అంటూ నన్ను బలవంతంగా బయల్దేరదీసింది. సరే ఎటూ ఎప్పుడూ చూడలేదు కదాని ఇద్దరం క్యాబ్‌ బుక్‌ చేసుకుని ఎగ్జిబిషన్‌కి వెళ్లాం.

కాలు  పెట్టే సందులేదు… వంద స్టాల్స్‌. ఏ దుకాణం దగ్గర చూసినా గుంపులు  గుంపులు  జనం. ఇద్దరం కాటుకలుస్త మనిపించింది నాకు. నల్లటి పావురాల  గుంపుల్లా బురఖాల్లో ఆడవాళ్లు.. కొన్ని షాపుల  వద్ద కొంచెం ఖాళీగా ఉంటే అటు వెళ్లాం. అక్కడ కశ్మీర్‌ వస్త్రాలున్న షాపులున్నాయి రెండు మూడు వరుసగా. తను చెప్తోంది, ‘కశ్మీర్‌ సిల్క్‌ సారీస్‌! మస్తు కాస్ట్‌లీ..’  అని చూస్తే మామూలుగానే అనిపించాయి.. పట్టుకుంటే చాలా మృదువుగ అమన్‌ స్పర్శలా. అందమైన అల్లికలు   చూస్తుంటే ముచ్చటేస్తుంది…ఎంత కష్టపడాలో..  కొంచెం ముందుకెళితే కాశ్మీరీవే మరో రెండు మూడు షాపులున్నయి.  పాలపిట్ట రంగు నేవీ బ్లూలో చిన్న అల్లిక ఉన్న చీరలు  తనొకటి నేనొకటి తీసుకున్నాం.

అతను మాతో చాలా విషయాలు   మాట్లాడాడు. అక్కడినుంచి ఇక్కడికొచ్చి తిండికి నిద్రకు ఎన్నెన్ని పాట్లు పడతారో వివరించాడు. వచ్చే కొంత సంపాదన కోసం అందర్నీ వదలి వస్తారట. కానీ ఎక్కువ గిరాకీ లేక చివరికి ఎంతకు అడిగితె అంతకు ఇచ్చి పోతారట. మళ్ళీ లగేజ్‌ టికెట్స్  పెట్టలేక. జాలేసింది. వచ్చేటప్పుడు మాకు థాంక్స్‌ చెప్పాడు.

అలా మొదటిసారి కాశ్మీరీలను చూడడం. వాళ్ళ భాష వినడం.

***
చిత్రలహరిలో ‘ముక్కుపచ్చలారని కాశ్మీరం..’ కవ్విస్తుంది.

సిటీకి వచ్చింతర్వాత ఫ్రెండ్‌ బలవంతంతో థియేటర్‌కి వెళ్లి చూసిన సినిమా రోజా. అక్కడి అందాల  కంటే హీరో హీరోయిన్‌ అందం కంటే తనను అమితంగా భయపెట్టి గుర్తుండిపోయింది సినిమాలో చూపెట్టిన టెర్రరిజం.

మిగతా సినిమానంతా మస్తిష్కం మర్చినా ఆ అమ్మాయి భర్త కోసం పట్టుదలగా చివరి వరకు ఉన్న విషయం నన్ను కుదిపేసింది.
భాష రాకున్నా ఆ అమ్మాయి మొండితనం.. ఒంటరిగా చేసే పోరాటం నన్ను కదిలించాయి.. సినిమా చూస్తున్నంత సేపు!
***
ఒకబ్బాయిని ఇష్టపడ్డాను. మొదట జాబ్‌ చేసిన ఆఫీసులో కొలీగ్‌, మంచి వ్యక్తి. అదాటున చూస్తే అచ్చమైన కాశ్మీరీలా కనిపిస్తాడు. ముందుగా అతను పేరు చెప్పినప్పుడు అతను ఇక్కడి ముస్లిమా.. కాదా అర్ధం కాలేదు. అదే అన్నాను. నవ్వి,
‘మీరు ఏమీ దాచుకోకుండా ఫ్రాంక్‌గా అడగడం నచ్చింది నాకు. మా అమ్మ దళిత.. అఫ్కోర్స్‌ షి ఈజ్‌ జాబ్‌ హోల్డర్‌. నాన్న ముస్లిం. అందుకే నా పేరు అమన్‌…’ అన్నాడు నవ్వుతూ.

ఇక్కడ పబ్‌ కల్చర్ ‌ డేటింగ్‌ కల్చర్ అన్నీ చూసి విసుగేసిన నాకు అమన్‌ స్నేహం నచ్చింది. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకుందామనుకున్నాను.

అమ్మీ అబ్బాను హైదరాబాద్‌ పిలిపించి తనను పరిచయం చేసి చిన్నగా విషయం చెప్పాను. వాళ్ళు ఒప్పుకోలేదు నేను ఊహించినట్టుగానే. అతనే కావాలంటే మమ్మల్ని వదులుకో అన్నారు. అమ్మీ అబ్బా మీద అలిగాను కానీ రోజూ వాళ్ళిద్దరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో చూస్తే కానీ నాకు నిద్ర రాదు. ఫోన్‌ చేసి మాట్లాడితే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు.

అమన్‌కు చెప్తే ‘కాలం  చాలా ముందుకెళ్లింది… ఫారినర్స్‌ని పెళ్లాడుతున్న ప్రపంచం ఇది. ఇంకా చెప్పాలంటే మనోళ్లు ఏలియన్స్‌నీ వదలట్లేదు.. మీ వాళ్ళను వదులుకో.. నిన్ను నేను పూలల్లో పెట్టి చూసుకుంటాను’ అని సునాయాసంగా  చెప్పేసాడు.

నాకు ఇరువురి మాటలు  నచ్చలేదు. ప్రేమికుడు అయినా సరే నా భావాలకు గౌరవం ఇవ్వకపోతే నేను అతడిని కూడా యాక్సెప్ట్‌ చేయను! అలాగే నన్ను కని పెంచి పోషించి నా మీద సర్వాధికారాలు  ఉన్నా సరే నా వ్యక్తిత్వానికి భంగం కలిగితే నేను భరించలేను!

నాకు స్వంత వ్యక్తిత్వం ఉంది. పుట్టిన తరువాత అమ్మీ అబ్బాను వదిలి వెళ్ళాల్సిందే… అలా అని మొగుడి తోక పట్టుకు వేళ్ళాడాల్సిన పని కూడా లేదు. వాళ్ళ అభిప్రాయాలను అలా వదిలి నేను ఎవరి బంధాలలోనూ చిక్కకూడదని ఒంటరిగా ఫ్లాట్‌లో ఉంటున్నాను.

‘‘అయ్‌ అజ్‌నబీ తూ భీ కభీ ఆవాజ్‌ దే కహీ సే…’’ పాట వింటున్నప్పుడల్లా అమన్‌, ఆమనికి వీడ్కోలిచ్చి.. ఆకులన్నీ రాల్చుకుని   బోసి పోయిన అడవిలా ఒక పురా జ్ఞాపకంలా.. ఒక నీడలా..

అవునూ మనీషా కొయిరాలా ఎందుకు టెర్రరిస్ట్‌ అవుతుంది.. ఆమెను షారుఖ్‌ ఖాన్‌ ఎందుకు ప్రేమిస్తాడు..? ఎందుకు ఇద్దరూ ధ్వంసమవుతారు..? దిల్‌ సే పరిష్కారాలుండవా..? అంతటా విధ్వంసమే..? ప్రేమతో సహా!

***
మొదట అక్బర్‌ పరిపాలనలో ఉన్న ఆ స్వర్గం.. తరువాత షాజహాన్‌ పరిపాలనలోకి వచ్చి ‘భూమి మీద స్వర్గం ఎక్కడైనా ఉంది అంటే అది ఇదే’’ అని అనిపించుకున్న కాశ్మీర్‌!

అమితంగా ప్రేమించి కశ్మీర్‌ను అస్సలు  వదలలేకపోయిన నెహ్రూ! ఒక ప్రదేశాన్ని ఇంత మంది ఇష్టపడడం… వహ్..! ఆ అందం తెచ్చిపెట్టుకున్న అందం కాదు సహజ సిద్ధం! ప్రకృతిని గౌరవించాలి.. ప్రకృతికి గాయం చేయకూడదు.. అమ్మకు మల్లే ప్రకృతి అని నేర్చుకున్న మనం ఎందుకు ఆ బిడ్డల్ని కన్నీళ్ల పాలు  చేస్తున్నం? అభివృద్ధి అవసరమే.. కానీ వాళ్లనే అదృశ్యం చేసే అభివృద్ధి వాళ్ళకెందుకు?

అక్కడ పండిట్స్  ముస్లింలు  బౌద్ధులు  కలిసి ఉంటారని చదివినప్పుడు కూడా భిన్నత్వంలో ఏకత్వ తత్వమేదో గోచరించింది. కానీ అక్కడ ఎనభై ఎనిమిది నుంచి రెండువేల  మధ్యకాలంలోనే  నలభై ఐదువేల  మందికి పైగా అమాయకుల  ప్రాణాలు   గాల్లో కలిసిపోయాయని చదివినప్పుడు భయం వేసింది.. అందులో పండిట్లున్నారు ముస్లింలు  ఉన్నారు.. అందరూ అమాయకులైన మనుషులు.
ముఖ్యంగా పండిట్లు కూడా అక్కడి ముస్లింలు  తినేటువంటి ఆహారాన్నే తింటారని చదవగానే విపరీతంగా ఆశ్చర్యపోయాను. కాకపోతే ముస్లింలు  పెద్ద గొర్రెను తింటే వీళ్లు గొర్రె పిల్ల  మాంసాన్ని మాత్రమే తింటారట. పండిట్లు బీఫ్‌ మాత్రం తినరట, మిగతా అక్కడున్నందరూ తింటారట. అక్కడ విందు వినోదాల్లో  పప్పుధాన్యాలతో చేసిన వంటకాలు  పెట్టడం గౌరవంగా చూడబడుతుందట…  ఇవన్నీ చదువుతున్నప్పుడు చిత్రంగా అనిపించింది.

నెట్‌ ఓపెన్‌ చేసి కాశ్మీర్‌ను చూస్తున్నాను. దాల్‌ సరసులో రంగురంగు పూలు  అమ్ముతున్న కశ్మీరీ ముస్లిం అమ్మాయిలు  పడవ నడుపుతూ వెళ్తున్న దృశ్యాలు  కంటికింపుగా అనిపించాయి. నాకెందుకో నా క్లాస్‌మేట్‌ సలీమా గుర్తొచ్చింది. ఆ పూల  వెనుక ఎన్నెన్ని ముళ్ళున్నాయో  అని కొంచెం బాధగా అనిపించింది.

పిల్లలతో  సహా వాళ్ళంతా అవలీలగా పడవలు  నడపడం చూస్తే అబ్బురమేసింది. ఎన్ని హిందీ పాటల్లో కనిపించాయి ఈ దృశ్యాలన్నీ… ఎన్నెన్ని సినిమాల్లో ఎన్నెన్ని యాపిల్‌ తోటలు  తులిప్‌ తోటలు  చూపించి ఉంటారు..! అయినా స్క్రీన్‌ మీద చూసింది చూసినట్టు కాదు.. వెళ్లి చూడాలి!

మనసు చాలాసార్లు నియంత.. నియంత్రి స్తుంటుంది..
అవును ఒక్కసారన్నా కశ్మీర్‌ వెళ్ళాలి..!
***
జ్యోతి ఆంటీ హడావిడిగా వచ్చింది, ‘‘అమ్మాయ్‌ పరిస్థితులు   చూస్తున్నావా…  ఎలా ఉన్నాయో! మనం వెళ్ళలేము ఇంక పెళ్ళికి’’ అంది విచారంగా.  నేనూ వింటున్న న్యూస్‌ కానీ అంత ఘోరంగా ఉంటుందని అనుకోలేదు.

‘‘మరి ఇప్పుడు ఎలా ఆంటీ’’ అనడిగాను నిరుత్సాహంగా.
‘‘విమానాలు  ఆపేశారు.. పెళ్ళికొడుకు పనులున్నాయని ముందు వెళ్ళాడు కాబట్టి సరిపోయింది.. ఏదోలా నిఖా చేస్తారు.. ఇంక ఇక్కడున్న బంధువులెవరూ పోవడానికి లేదు. అసలు  మాట్లాడ్డానికే లేదు… ఫోన్లు  కలవడం లేదు. అక్కడనుంచి ఏ సమాచారం లేదు. అహ్మద్‌ పాపం చాలా బాధపడుతున్నాడు…’’ నిరాశగా జ్యోతీ ఆంటీ.

‘‘ఏం చేస్తాం, మళ్ళీ ఎప్పుడయినా వెళ్దాంలే రా..’’ ఓదార్పుగా జ్యోతీ ఆంటీ..!

పూల  కిరీటానికి రుధిరమంటుకుని నా కళ్ళకు కాశ్మీర్‌ భయం గొలుపుతోంది…!

***
టీవీలో 24/7 న్యూస్‌…

కాలికింద ఉండాల్సిన రాళ్లు ఆకాశంలో మనుషుల  తలపై క్రూరంగా ఎగురుతూ గాయాలుగా మారుతున్నయి..! నీటిలో ఉండాల్సిన రాళ్లు రక్తంతో తడుస్తున్నయి! మనుషులనే ఇంగితం లేకుండా రబ్బర్‌ బుల్లెట్స్‌ వాటర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు.. అంతటా ఆవరించిన మంచు, భయంలా! నా లోనూ..!
ఎంతటి భయంకరమైన పరిస్థితినైనా చానల్‌ను మార్చేసినట్టు మార్చేసుకోవడమే ఆధునిక’త లక్షణం!
నెట్‌ఫ్లిక్స్‌ ఆన్‌ చేశాను. ఆ పిల్లాడు.. అచ్చం అన్న కొడుకు సోఫియాన్‌లానే ఉన్నాడు. ఎంత అమాయకత్వం ఉంది ఆ మొహంలో, అచ్చం కశ్మీర్‌ భూభాగంలా! అమాయకత్వంలోనే నిజాయితీ నిండి ఉంటుందేమో..! ఆ చిన్ని హృదయం వాళ్ల నాన్న కోసం పడ్డ తపన మొండితనం.. అచ్చం రోజా సినిమాలో హీరోయిన్‌కు ఉన్నంత మొండితనం..! అదే వెదుకులాట! ఎలాగైనా నాన్నను కలుసుకోవాలి.. ఎలాగైనా భర్తను కాపాడుకోవాలి.. ఎవరూ.. హమీద్‌.. నా.. ఆమెనా.. నాకేంటో ఇద్దరూ ఒక్కరై కనపడుతున్నారు.. ఒక్కలాగే ఉంది పోరాటం..! ఎవరిది పోరాటం.. ఎవరు బలవుతున్నారు..?

వాడి చిన్న చిరునవ్వు ఎంత బాగుంది? ఎంత స్వచ్ఛత! వాడి భూమి నవ్వినట్టుంది! లేతగా ఉంది..చల్లగా  ఉంది.

పరువం వానగా కురిసిన సమయంలో హీరోయిన్‌ భుజంపై చిట్లిన నీటి బిందువు వేలై లక్షలై ఆమె కంట్లోంచి జపాతాలై.. అందమైన కాశ్మీర్‌ మంచుపొగ తెర వెనుక దాగిన రహస్యాలు  ఏమై ఉంటాయి? అందమైన వైట్ రోజ్ లా  కాశ్మీర్‌ యువకుడి వలె  కనిపించిన అరవింద్‌ మొహంపైన భయంకరమైన ఆ గాయాలు..?
హమీద్‌ వాళ్ళమ్మ ఒంటరి దు:ఖం కాశ్మీరంతా మంచుపొగై కమ్ముకుందా..? హమీద్‌ వాళ్ల  నాన్న తయారు చేసిన పడవలు .. కనీసం కత్తిపడవలు  కాదే..? ఇద్దరు అమాయకమైన మొండివాళ్లు… గెలిచారా.. ఓడారా..  అదీ వెండితెర మీద..? కానీ కశ్మీర్‌లో ఓడిన వాళ్ల లెక్క ఎవరు చెప్తారు?
***
‘ఆకాశం మీద విచ్చలవిడిగా పరచుకున్న మబ్బు ముక్కలు  నీలివీ, తెల్లవీ  ఆ నీళ్లలో ప్రతిఫలిస్తున్నాయి.. వెండి రేకుల  మీద నీలాలు, ముత్యాలు  పొదిగినట్లు అందాలు   చిందిస్తుంది సరస్సు….’  కృష్ణకుమారి గారు ఎంత అదృష్టవంతులు .. కశ్మీర్‌లో కరిగిపోయారు.. కలిసిపోయారు! కశ్మీరీ అమ్మాయిలు  వారి భూమికి ప్రతిబింబాలా..? సలీమా కూడా ఎర్రగా అలాగే ఉంటుంది.  వాళ్ళ ఇంట్లో పరిస్థితులు  చదువు మధ్యలోనే ఆమెకు పెళ్ళి చేసేశాయి.  చాలా సార్లు అంది, ‘నీలాగే చదువుకుని ఉద్యోగం చేయాలని ఉందే’ అని. కానీ ఆ తర్వాతెప్పుడూ నాకు తన ముఖం కనపడలేదు. నల్లటి  నీడ ఒకటి ఆమెను అమాంతం  పరుచుకుంది. ఇప్పుడెలా ఉందో..? బలహీనులకు స్వేచ్ఛ ఉండదు!

గలగల  పారే ఆ సెలయేళ్లలో.. రాళ్లు రాళ్లుగా అడుగు కనపడే ఆ చల్లని  నీటిని తాకాలి..! చెట్లలో పూలతోటల్లో దాల్‌ సరసులో పూలమ్మాయిలతో పాటు షికారు చేయాలి!

మనసెప్పుడూ ఎవరి మాటా వినదు!
మనిషి మనసుకు బానిస!
జీవితకాలంలో ఒక్కసారన్నా కశ్మీర్‌ వెళ్ళి తీరాలి!
***
ఆఫీస్‌ లంచవర్‌! గోల గోలగా ఉంది! అందరూ ప్రపంచం ఈ మూల  నుంచీ ఆ మూల  వరకూ జరిగే అన్నీ విషయాలు  మాట్లాడతరు,

‘‘ఇక నుంచీ కాశ్మీర్‌లో ఎవరైనా ఉండొచ్చట.. ఎవరైనా భూములు  కొనుక్కోవచ్చట!.. మనిద్దరం ట్రై చేద్దామేమిటి?’’ క్రీగంట నావేపు చూస్తూ వెటకారం కలగలిపి వ్యంగ్యంతో కూడిన వెగటు హాస్యం!

లంచ్‌ పూర్తి చేసి పేపర్‌ చూస్తే హెడ్‌లైన్స్‌ సారాంశం “భారత్‌ వాసులకు వీసా జారీ ఆలస్యం.. హెచ్‌ ఒన్‌ వీసాపై నిషేధం..! ఇకపై గ్రీన్‌ కార్డ్‌ అంత సులభం కాదు”.. ఇలాంటివే మరికొన్ని! నిట్టూరుస్తూ పనిలో నిమగ్నమైన.
***
ఊర్లో మా ఇంటి పక్కన ఉండే రెడ్లు బాగా ధనవంతులు. వాళ్ల ఇంటి కోడలు  నీళ్లోసుకుంటే వాళ్ళు పట్నం నుంచి కుంకుమ పువ్వు తెప్పించారు. నేను మొదటి సారి అదే చూడ్డం.  పాలలో కలిపి ఆమెకు తాపిస్తారట. అప్పుడు పుట్టేవాళ్ళు తెల్లగా  ఎర్రగా పుడతారట… అని ఆమె చెప్పింది.

కానీ ఆ చిన్న పెట్టెలో నాలుగు పోచలు  కూడా లేని ఆ కుంకుమ పువ్వు చాలా ఖరీదయిందని ఆవిడ చెప్తే విని కశ్మీర్‌లో అందరూ బాగా డబ్బున్నోళ్ళు ఉంటరేమో అనుకునేదాన్ని. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది నాకు. అక్కడ అందరూ డబ్బున్నోళ్ళే అయితే అలా పడవల్లో రకరకాల పూలు  ఎందుకు అమ్ముకుంటారు..?

సగం సగం కలత నిద్ర.
***
వద్దు అనుకుంటూనే టీవీ ఆన్‌ చేశాను..!
ఏ చానలో చూడకుండా తిప్పేస్తున్న రిమోట్‌ చేతిలో ఉంది కదా అని అహంకారం!

ఎవరో అమ్మాయి వార్తలు  చదువుతుంది.. బహుశా కాశ్మీర్‌పై స్పెషల్‌ స్టోరీ అయుంటుంది! తెల్లగా  ఉంది కాశ్మీర్‌ అమ్మాయా.. కాదు కాదు కాశ్మీర్‌ను చూపిస్తు న్నారు.

‘‘అందమైన కాశ్మీర్‌ భూభాగం మధ్యలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు  వస్తాయని, ఇక నుంచీ వ్యాపారస్తులంతా కాశ్మీర్‌ను ఆక్యుపై చేస్తారని, కాశ్మీర్‌ కాశ్మీర్‌లోనే ఉంటుంది కానీ రిమోట్‌ విదేశీయుల  చేతిలో ఉంటుందని.. కాశ్మీర్‌ యాపిల్‌పై విదేశీ లేబుల్స్‌ అతికిస్తారని.. కాశ్మీర్‌ను ధారదత్తం చేశారని’’ ప్రతిపక్షాలు  ఘాటుగా విమర్శిస్తున్నాయని అనర్గళంగా రిపోర్ట్‌ చేస్తుంది! కాశ్మీర్‌ అమ్మాయి కాదు.. న్యూస్‌ రిపోర్టర్‌! వార్తల్ని చలిలో చకచకా వండి వార్చేస్తుంది! ఎవరి బాధ్యత వాళ్లు నిర్వరిస్తున్నారు! అయినా న్యాయం అన్యాయం అవుతుంది ఎందుకు?
ఏ కాశ్మీరీ సినిమా చూసినా.. ఏ నేషనల్‌ చానల్‌ చూసినా పిల్లల  ఫొటోలు  పట్టుకుని తిరుగుతున్న తల్లులు .. భర్త ఫొటోలు  పట్టుకుని తిరుగుతున్న భార్యలు .. కొడుకుల  ఫొటోలు  పట్టుకు తిరుగుతున్న తండ్రులు.. అయ్యో.. జీవితాలిట్లా ఎందుకు అదృశ్యం అవుతున్నయి..?
ఫేస్‌బుక్‌లో ఎవరో పోస్ట్‌ పెట్టారు.. దారుణంగా యాపిల్‌ తోటలను నరుకుతున్న దృశ్యం!
‘‘మేమిక్కడ స్థానికులం.. వందలేళ్ళుగా సాగు చేస్తున్నం.. మేము ఈ భూమి బిడ్డలం..! ఇప్పుడు కాదంటున్నారు.. అసలు  చెట్లను నరకడం ఎందుకు.. ఎవరిదో ఒకరి ఆకలి తీరుతుంది కదా…’’ పది లైకులు .. ఒక కామెంట్‌.. ఆకలి విలువ! దు:ఖం విలువ! కన్నపేగు విలువా ..! స్వేచ్ఛ విలువా!

నాకు తెలంగాణ పోరాటమంతా గిర్రున మదిల మెదిలింది!
ఫలానా సినిమా తారకో.. రాకీ నాయకుడికో కాలు మీద చీమ పాకినా లేదా కుట్టినా పోస్ట్‌ కింద 5 కె లైకులు..!
గోడుగోడున దు:ఖం! బతుకు పోరాటం! భూమికోసం భుక్తి కోసం మరల  మరల  అదే దృశ్యం!

కాశ్మీర్‌లో యుద్ధం ఎన్నటికీ ఆగదా..? శాంతి కేవలం  చిహ్నమేనా..?

***
‘‘ఇప్పుడు వెళతావా కశ్మీర్‌..?’’
ముడుచుకున్న మనసు మంచులా గడ్డగట్టినట్లు ఆన్సర్‌ ఇవ్వలేదు..! నేనే తర్జుమా చేసుకున్న.. ‘‘పోరాటంలో అమరత్వాన్నైనా చూడొచ్చు కానీ బానిసత్వాన్ని చూడలేను, నిర్భంధాన్ని అస్సలు  చూడలేను!’’

అవును స్వేచ్ఛగా నవ్వే కశ్మీర్‌ను ఇక ఎప్పటికీ చూడలేను.. పంజరంలో పెట్టిన నెత్తురోడే రాజహంస వలె ఉన్న కశ్మీర్‌ను ఇప్పుడిక అస్సలు  చూడలేను..

జన్నత్‌ ను జహన్నుమ్‌ గా మార్చేశారు!

అమ్మా కృష్ణకుమారీ.. నువ్వు నిజంగా నసీబ్‌వాలీవి!
ఇంకిప్పుడు మాలాంటి వాళ్లం వెళ్లినా అక్కడ ఏముంటుందో..  ఏమి రాయాలో..?

అల్ల కల్లోలంగా ఉంది.. మనసు.. కశ్మీర్‌లా ఉంది!

*

షాజహానా

2 comments

Leave a Reply to స్కై Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఏముంటుందో, ఏమి ఉందో, ఏమి లేదో వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది? ఎవరి రాతలో ఆధారంగా చూడాలనుకోవటమూ, మరెవరి అభిప్రాయాలు చూసో వద్దనుకోవటమూ….. … ఏంటో ఈ కథ. ఇంత పెద్దగా.
    అసలు శాంతి ఎప్పుడుందనీ, అక్కడ? కల్లోల కాశ్మీరమే. పుట్టి బుద్ధెరిగాక కాశ్మీరాన్ని శాంతియుతంగా ఎన్నడూ చూసింది లేదు. ఈ కథలో అమ్మాయి స్వాతంత్రానికి ముందు పుట్టిందా?

  • షాజహానా కథలు విభిన్నంగా ఉంటాయి.. మనం ఊహించని నేరేషన్, సెన్సిటివిటీ అబ్బురపరుస్తుంటుంది. అలాగే వెలువడింది వూండెడ్ సోల్ కథ!

    మన దేశంలోనే ఒక రాష్ట్రాన్ని నిర్బంధించి.. అక్కడి ప్రజలను నానా హింసలు పెడుతూ.. చంపుతూ.. నిరసన తెలిపితే దేశద్రోహ కేసులు పెడుతూ.. ఓహ్! తలుచుకుంటేనే ఒళ్ళు గగురుపొడుస్తుంది..

    అలాంటి సబ్జెక్టు ని షాజహానా నాచురల్ గా కథగా ఎలా చెప్పిందో ఒకసారి చూడాలి కదా!

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు