విషాదమా?! వినోదమా?! తేల్చుకుందాం!

టీటీ యుగంలో పుష్ప-2 థియేరిటికల్ సెన్సేషన్ మళ్ళీ పాత రోజులని గుర్తుచేసింది. స్నేహితులతోనో, కుటుంబంతోనో కలిసి సినిమాకి వెళ్ళటం వెనక చాలా ఆనందాలు, అనుభవాలు, అనుబంధాలు పెనవేసుకుని ఉంటాయి. సినిమాఅంటే కేవలం ఒక కథ చూడటం కాదు అది ఒక అనుభూతి.
సినిమా రిలీజు చాలా ముందు నుంచే ఎదురు చూడటటం. ప్రమోలు చూసి ఆహా ఓహో అనుకోవటం ఒక ఎత్తైతే, అసలు సినిమా రోజు ఇంకో ఎత్తు. అందరు కలిసి వెళ్ళటం, కలిసి నవ్వుకోవటం, సినిమాలో సంభాషణలు, దృశ్యాల గురించి చర్చించుకోవటం, సన్నివేశాలతో సహానుభూతి చెందటం ఇలా అనేక భావేద్వాగాలతో ప్రేక్షకుడిని సినిమా కట్టిపడేస్తుంది. థియేటర్ ఆవరణలో ఉన్న  కటవుట్ లు, పోస్టర్లు వాటి ద్వారా వచ్చే దృశ్య ఉత్సాహం  మరో రకం. ఇదీ కాక, థియేటర్ దగ్గర జన సందోహాన్ని చూడటం, ఒక్కొక్కరిలో ఆనందాన్నీ, ఆతృతని  చూడటం, రక రకాల సంభాషణలు వినటం అది ఇంకో రకమైన అనుభవం. ఇక చిరు తిండొ, కూల్ద్రింకో జత అవుతే అది మరో అనుభవం. ఇలా సినిమా అనేది రకరకాల సమిష్టి అనుభవాలతో కూడుకున్నది.
ఒకవేళ ఈ కాలంలో సినిమాకి వచ్చినా, ఎవరి తల వాళ్ళ మొబైల్ ఫోనులో దూర్చుకుని అదో వింత లోకంలో అందరూ అక్కడక్కడే తచ్చాడుతూ ఎవరికి ఏమి పట్టనట్లు చాలా వింతగా ఉంటుంది కుటుంబంతో కలిసి వచ్చినా. మొత్తానికి సాంప్రదాయమైన సినీ అనుభవం తగ్గిపోయింది. ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలని ఓటీటీ తెరలు దూరం చేసాయి. ఇది సోషల్ సంబంధాలని దూరం చేసి, సినిమాని ‘ఏకాకి వినోదం’ కింద మార్చింది. ఎవరికి వీలున్నప్పుడు వారు ఎవరికి వారుగా చూస్తూ ఉంటారు.  థియేటర్  సమిష్టి అనుభూతిని కోల్పోయారు.
పుష్ప-2 పాత శోభని బయటకి తెచ్చింది అనుకోవాలో, అయ్యో ఇంకా నటుల కోసం ప్రాణాలు పోగొట్టుకునే వారు ఉన్నారని బాధపడాలో అర్థం కాదు. సినిమా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయేది బడుగు, మధ్యతరగతి వర్గాలు మాత్రమే. ఉన్నత వర్గం, మేధావంతులు వీటికి గురి అవ్వలేరు. ఆ వర్గాల్లోకి సినిమా వ్యామోహం, సినీ నటుల వ్యామోహం ఎక్కువగా చొచ్చుకుపోతుంది.  ఈ నాటి వ్యవస్థలో సినిమా శక్తికి పుష్పా-2 ఒక సంకేతంగా నిలుస్తోంది.
ఈ సినిమా కేవలం వినోదంగా కాకుండా సామాజిక మనోభావాలకు కూడా ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రజలకి ఏమి కావాలో దర్శకులు వాటినే తీస్తారు. ఒకప్పుడు సినిమా అంటే తప్పక ఒక ఫారెన్ లోకషన్లో షూటింగు, దూరపు అందాలు, నియో రిచ్ పీపుల్ ఉండే వారు. ఇప్పుడు వాటికి ఆదరణ తగ్గి, రస్టిక్, నేటివిటీ, సింప్లిసిటీ, మాచోఇజం అంటే ముచ్చటపడుతున్నారు. అయితే పుష్పా లాంటి సినిమా చూసి ఒక జాతి ‘తగ్గేదే ల్యా ‘ అంటే, ఇంకో జాతి, ‘నా సామి రా రా సామి ‘ అంటూ చిన్నా-పెద్దా, ఆడా-మగా ఊగిపోవటం సమాజంలో తెలియకుండానే సెక్సీజం ని సృష్టిస్తోంది. పుష్పా లాంటివి రీజనల్ డైలెక్ట్ తో, ఒక ప్రాంత సంస్కృతితో – ఇది మెయిన్ స్ట్రీం మీడియా అన్న భావనని తొలిగించి, వ్యావహారిక వైనంగా మారిపోతుంది. అలాంటి కథలు, పాత్రలు సమాజంలోకి సున్నితంగా చొచ్చుకుపోతాయి.  జెండర్ రోల్స్, మాస్కులినిటీ, మాచోఇజం, సొషల్ ఎక్స్పెక్టేషన్ ని సృష్టించి స్టీరియో టైప్ గా మారే ప్రమాదం ఉంటుంది.
సినిమాలు దిగువ మధ్యతరగతి వర్గాల ఆలోచన సరళిని, స్థాయిని పెంచితే బాగుంటుంది. సినిమా ఒక వినోదం అని కొట్టిపారేసేవారు ఉంటారు. సినిమా ఒక విషాదం చేసుకున్న వారు, సినిమాతో ట్రెండ్ మార్చుకున్నవారు, మరో ట్రెండ్ కోసం వేచిచూసే వారు ఉంటారు. ప్రతి ఒక్కరు సినిమాని ఒక వినోదంగా మాత్రమే చూడగలిగే స్థాయిలోకి వచ్చినప్పుడు నిజంగా సినిమా బాగుటుంది.
*

విజయ నాదెళ్ళ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సినిమా అంటే నిర్వచనమే మారింది. పాత నీరు, కొత్త నీరులా. వెండితెర పంథా మారింది. జనాలకి ఏం కావాలో అది అందించలేని పరిస్థితి. ఒకనాడు కీలుగుర్రం, మాయాబజార్, విప్రనారాయణ, భక్త ప్రహ్లాద, వగైరాలు పాత్రలో నటులు కనబడేవారు కాదు. వారి నటన మాత్రమే ఉండేది. సాంకేతికత వృద్ధి చెందుతున్న కొద్దీ నటనా వైభవం తగ్గి, భజన బృందాలు తయారయ్యాయి. అప్పుడూ ఉండేవి. ఐతే, పూర్తి సినిమా అభిమానులు. ఏ హీరో అభిమానులైనా మిగిలిన హీరోల సినిమాలు చూసేవారు, కనీసం పోలికచేసి విమర్శించడానికైనా. మళ్ళీ ఆ పాతరోజులు రావాలి అని కోరుకుంటున్నా.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు