ఆదిమ రూపం గానం. వర్గాధునికత మీద యుద్ధాలపన నవీన గానం. ఈ పురా, నవ స్వభావమే విప్లవ వాగ్గేయం. సమతా సమాజ నిర్మాణమే ఒక పురాతన స్వప్నం. ఆ పురా స్వప్నాన్ని గానం చేసే ఆధునిక స్వరం అరుణోదయ నాగన్న. వలసవాదానంతర కాలం ప్రసవించిన విప్లవ స్వాప్నిక గళం అరుణోదయ నాగన్న. ఆదిమ స్వరతంత్ర విన్యాసం అరుణోదయ రామారావు. అనాది యుద్ధ గర్జనా జ్వాల నాగన్న. తెలుగు సమాజ హృదయాంతరాళంలో నర్తించే అనిర్వచనీయ సంగీత జలధి తను. కాలం కడలిమీద చెరిగిపోని అలలగానం నాగన్న. నాగభూమి మీద నృత్యించిన జన చైతన్యం తను. కవిగా, గాయకుడిగా, పూర్తికాల విప్లవ కార్యకర్తగా నాగన బహుముఖీన కృషిని ఈ సమాజం సరిగా గుర్తించలేదనే చెప్పాలి. సంగీతానికొక ప్రమేయం వుంది. గాయకుడికొక సామాజిక పాత్ర వుంది. ఈ ప్రమేయ, ప్రయుక్తాలను అర్థం చేసుకొనే ఒక వైధానికత ఏర్పడాలి. విప్లవ గాయకుల నిరుపమానమైన త్యాగాలను, వాళ్లు సమాజానికి సమకూర్చిన నూత్న వెలుగులను మూల్యాంకనం చేయడానికి అరుణోదయ నాగన్న ఒక ఆలంబన.
చలనశీలత వ్యక్తి ప్రాకృతిక స్వభావం. వ్యక్తి కేంద్రిత సంఘ పరిణామ అవగాహన అసమగ్రమైనదనే సూత్రీకరణతో ఎవరికీ అభ్యంతరం లేదు. అయితే, సమాజం వ్యక్తుల సమిష్టి జీవనంతో మొదలవుతుందనేది ఎంత వాస్తవికమో, వ్యక్తి క్రియాశీలత, కార్యదక్షత, సృజనాత్మకత ఆ సమాజం పురోభివృద్ధిని ప్రభావితం చేస్తుందన్నది కూడా అంతే నిజం. అయితే, ఉత్పత్తి సాధనాల ఆవిష్కరణలో వ్యక్తి సృజనాత్మకత, క్రియాశీలతను తక్కువ చూడకూడదు. సమాజంలో అనేక మంది వ్యక్తుల అనుభవ సారం, కార్యశీలత, చలనశీలత, క్రియాశీలత కారణంగా ఒక సామూహిక జ్ఞానం రూపొందుతూ వుంటుంది. అది జఢమైనది కాదు. అది నిశ్చలమైనది కాదు. అది నిరంతరం రూపొందే ఒక సజీవ ప్రవాహం.
వ్యక్తి తన పూర్వీకులందించిన జ్ఞాన ఆలంభనతో కొత్త ఆవిష్కరణలకు పూనుకుంటూ వుంటాడు. అది సంఘాన్ని, ప్రకృతిని, మొత్తంగా సమాజంలోని అన్ని రకాల సంబంధాలను పరివర్తింప చేస్తూ వుంటుంది. అందువల్ల సమాజంలోని ఆధిపత్య సంబంధాలను రద్దు చేసి, ఆధిపత్య రహిత మానవ సంబంధాలను నెలకొల్పడానికి ఒక సమిష్టి పోరాటం నిరతం కొనసాగుతూ వుంటుంది. ఆయా సమాజాల స్వభావ ఆధారితంగా పోరాట రూపం నిర్ణయం అవుతూ వుంటుంది. ఆ పోరాటానికి ఒక పురాతన స్వప్నం సాకారం కావాలనే లక్ష్యం వుంటుంది. సమానత్వమే మానవ సమాజ పురా స్వప్నం. ఆ పురా స్వప్నమే మనిషిని చలశీలిగా మారుస్తుంది. సంఘాన్ని ప్రగతిశీలిగా రూపొందిస్తుంది. నాగన్న అందుకు ప్రబల సాక్ష్యం.
వలసవాదానంతరం మన దేశ దశదిశను మార్చే చింతన వేగవంతం అయ్యింది.
బ్రిటన్ సామ్రాజ్య వ్యతిరేక పోరాటం స్వతంత్రం సిద్ధించటంతో ముగియలేదు. అది స్వతంత్రానంతరం మరింత పదునెక్కింది. వర్గ రహిత సమాజాన్ని నిర్మించాలన్న ఆశయానికి ప్రజల మద్ధతు పెరిగింది. ముఖ్యంగా ఆధునిక పూర్వసమాజాలు ఈ ఆశయానికి ఎక్కువ స్పందించాయి. ఆధునిక పూర్వ వ్యవస్థను కూలదోసి, సమానత్వం దిశగా పయనించే జనతా ప్రజాస్వామిక విప్లవాలు, నూత్న ప్రజాస్వామిక విప్లవాల యుగం ఆవిష్కృతమైంది.
అలాంటి ఒక ఉద్విగ్నత, అలజడి నిండిన వాతావరణ నేపథ్యంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి పరకాల నాగన్న పయనం మొదలైనది. వర్గ వైరుధ్యాలను పదును పెడుతున్న కాలం అది. సాయుధ పంథా, పార్లమెంటరీ పంథాలలో ఏది సరైనదో తేల్చుకోవడానికి మేధో సంఘర్షణ జరుగుతున్న కాలంలో ఆయన కమ్యూనిస్టు పోరాటాలకు ఆకర్షితుడయ్యాడు. తన గానం, అభినయం ద్వారా ప్రజాయుద్ధ కాలాన్ని పరుగెత్తించిన యోధుడు పరకాల నాగన్న. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల మధ్య సంచరిస్తూ, పాడుతూ ఆడుతూ పూర్తికాల కార్యకర్తగా అడవుల వెంట తిరిగాడు. అమరుల నెత్తుటి త్యాగాలను ఆకాశమంత ఎత్తు ఎత్తిపట్టాడు. కాంచనపల్లి అడవులలో కనుమూసిన అమరులను తలచి గేయమయ్యాడు. అన్న అమరుడురా మన రామనరసయ్య అంటూ శోకాన్ని ఆలపించాడు. రామ నరసయ్య అమరత్వం ప్రజల్లో వర్గ కసిని పెంచిందనే చెప్పాలి.
నాగన్న పాటల్లో ఆ వర్గ కసి స్పష్టమవుతుంది. నాగన్న గొప్ప పాటలు రాశాడు. అయితే, అంతకన్న ఇతర కవులు రాసిన పాటలను ఎక్కువగా పాడాడు. తన సహచరుడైన రామారావు స్వరపర్చిన అన్న అమరుడురా రామనరసయ్య అనే గీతం నాగన్న గొంతులో ప్రవహించి జీవనదిలా ఉనికిలో వుంది. దొరన్న పాట అజరామరమైనది. వీరగాధల పాడరా అనే పాటలో ఆయనలోని ఒక క్లాసిక్ నేచర్ ను చూడవచ్చు. విప్లవోద్యమంతో పాటు, తెలంగాణ ఉద్యమంలో కూడా నాగన్న మమేకమయ్యాడు. నిప్పులే గర్భాన్ని దాల్చి అనే పాట అద్భుతం. అరుణోదయ కవుల పాటలకు జీవం పోసిన గొప్ప గాయకుడు తను. కానూరి నుండి వై.వెంకన్న, ఎల్.వెంకన్న, కొమిరె వెంకన్న, యోచన వరకు ఎందరో రాసిన పాటలకు తన గాత్రంతో రక్తమాంసాలిచ్చి జీవం పోశాడు.
ఇంటిని వదిలేసి అరుణోదయ సంస్థనే ఇంటిపేరును చేసుకున్నాడు. అరవై యేండ్ల సుదీర్ఘ విప్లవ జీవితంలో వ్యక్తిగత ఆస్తి లేని అసలు సిసలైన కమ్యూనిస్టు నాగన్న. ఎంతోమంది నిరుపేదలకు గుడిసెలు వేయించి, వాటికి పట్టాలు ఇప్పించే పోరాటంలో భాగంగా చాలా కొత్త గ్రామాలకు ఆయన పాటలు పునాదులు వేశాయి. కానీ, తనకే తల దాచుకోవడానికి యిల్లు లేక, రోడ్డు పక్కన పార్టీ బ్యానర్లతో ఒక గూడు కట్టుకొని అందులో బతికిన నిఖార్సయిన యోధుడు నాగన్న. తనకున్న విలువను ఆయన ఏ మార్కెట్లోనూ అమ్మకానికి పెట్టలేదు.
ఆయన ఏ చిన్న గౌరవాన్నీ ఆశించలేదు. ఏ సన్మానాల వాసనకూ ఆయన లొంగిపోలేదు. మార్క్సిజం, లెనినిజం, మావోయిజం పట్ల అచంచల విశ్వాసం ఆయనకు కటిక పేదరికాన్ని కూడా లెక్కచేయకుండా బతకడానికి అవసరమైన శక్తిని ఇచ్చింది. కమ్యూనిస్టుగా బతకలేనివాళ్లను ఆయన నిర్మొహమాటంగా విమర్శించేవాడు. నిర్వచించుకున్న పద్ధతికి భిన్నంగా పార్టీ నాయకులైనా, కార్యకర్తలైనా కట్టబడి జీవించక పోయినా, ఆచరణలో లేకపోయినా ఆయన కఠినంగా విమర్శించేవాడు. ఆ కచ్చితత్వం, మిలటరీ స్వభావం కారణంగా నాగన్న అనేక మంది సహచరులకు ఆయన దూరమయ్యాడు. శత్రువుగా మారిపోయాడు. నాగన్నను ప్రధాన స్రవంతి చర్చ నుంచి కనుమరుగు చేయాలని చూశారు. కానీ నాగన్నది చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు. ఈ సమాజం నాగన్నను నిరంతరం గుర్తు చేసుకోవడమే కాదు, ఆ స్వరాన్ని పదేపదే మననం చేసుకుంటూ ఆ సంగీత సంద్రంలో ఓలలాడుతూనే వున్నది. అరుణోదయ నాగన్న కీర్తిపతాకం రెపరెపలాడుతూనే వుంటుంది.
(ఆగష్టు 24 గద్దర్ గాన తేజం అవార్డును నాగన్నకు ప్రదానం చేస్తున్న సందర్భంగా)
Add comment