విధ్వంసంలోంచి పుట్టిన వినిర్మాణ నవల!

ఛాయా పబ్లికేషన్స్ త్వరలో మనకి అందించబోతున్న అరుదైన కానుక ఇది. ప్రసిద్ధ శ్రీలంక రచయిత్రి గణేశానందన్ ‘Brotherless Night’ ఇప్పటికే ఒక సంచలనం. తెలుగులో ఇలాంటి నవల అనువాదం వెంట వెంటనే రావడం హర్షణీయం. ఈ సందర్భంగా ఈ నవలా పరిచయం. 

‘Brotherless Night’- గణేశానందన్ నవల – ఈ నవల విడుదలై ఇంకా ఏడాది కూడా కాలేదు.

అప్పుడే ప్రపంచసాహిత్య స్థాయిలో స్థానం సంపాదించుకుంది. ఇటీవలే దీని గురించి ఇంగ్లీషు లో పరామర్శ చదివేను. కానీ నవల చదివిన తర్వాత ఒకటి రెండు అంశాలు ప్రస్తావిస్తే బాగుండుననిపించింది. ఈ నవల గురించి ‘రచయిత్రి గణేశానందన్ గారితో హర్షణీయం వారు సంభాషణ జరిపి, రచయిత్రినీ,  నవలనీ  తెలుగువారికి పరిచయం చేశారు. తీరిక లేకపోయినా ఆమె లండన్ వెళ్ళే ముందు ఇటలీ నించి వారితో మాట్లాడింది. రచయిత్రి శ్రీలంక తమిళ మహిళ. 2023 లో విడుదలైన ఈ నవల నిజానికి ఆమె పద్దెనిమిది ఏళ్ళ క్రితం మొదలెట్టింది. నా సోదరి అనేక సంవత్సరాలు పరిశోధించి, అనేక మందిని కలుసుకుని చర్చించిన తర్వాత శ్రీలంక తమిళుల సమస్యనీ, ‘ఈలం’ ఉద్యమాన్నీ జీర్ణించుకుని అసాధారణమైన సంయమనంతో రచించిన నవల ఇది.  ‘Brotherless Night’  అర్థవంతమైన పేరు.

కానీ పేరు నాకు అంతగా  నచ్చలేదు. శ్రీలంక లేదా జాఫ్నా అంతర్యుద్ధం,  ఈ నవల నేపధ్యం. కానీ నవలలో ఎక్కడా జాఫ్నాలో జరిగిన కాల్పులు, విధ్వసం, మారణకాండ కనిపించవు. కానీ చదువుతున్నంత సేపు ఒక విశాల స్మశాన వాటిక మధ్య కూచున్న అనుభూతి బాధిస్తుంది. ఒక జాతి, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, తగలబడుతున్నప్పుడు వెలువడే ఒక ప్రత్యేకమైన దుర్గంధం మనసుని కమ్ముకుంటుంది.

శ్రీలంక సమస్య మనకందరికీ పరిచయమే. నవల ( 1983-2009) శశికళ అనే శ్రీలంక డాక్టర్ ఆత్మ కథ. అంటే ఆమె జాఫ్నా. నవలకి డాక్యుమెంటరీ చలనచిత్ర లక్షణం ఉంటుంది, కథనంలో.  శశి తల్లిదండ్రులతో నాలుగురన్నదమ్ముల మధ్యతరగతి కుటుంబం. ఈ కుటుంబం ఆమె కళ్ళముందే ఛిన్నాభిన్నం అయిపోవడం, విడిపోవడం నవల. తమిళ టైగర్లు శాసించిన ఉద్యమ నిజ స్వరూపం, ప్రజాస్వామిక ప్రభుత్వ కాపట్యం, ప్రపంచదేశాల నిర్లక్ష్యం నవల స్పష్టం చేస్తుంది. యుద్ధం ముగిసే నాటికి శశి డాక్టరు అన్నగారు మరణిస్తాడు. మరొక అన్న టైగర్ల దళంలో చేరి మరణిస్తాడు. మరొక అన్న దళం విడిచి పారిపోయి న్యూయార్కులో తలదాచుకుంటాడు. తల్లిదండ్రులు, అమ్మమ్మ ఆమెకి దూరం అయిపోతారు. ఇది ఒక కుటుంబం  కాదు. మొత్తం జాఫ్నా. శశి న్యూయార్కు వైద్యశాలలో పని చేస్తూ ఉంటుంది.

ఇది మూడు వందల నలభై పుటల క్లుప్తమైన నవల. క్లుప్తత పుటలకి సంబంధించింది కాదు. కథనం, అభివ్యక్తికి సంబంధించింది. నవల ప్రధాన ఆకర్షణ నిరాడంబరమైన నిరలంకారమైన వచనం. ఒక్క చోట కూడా, గుండె బీటలు వారే సందర్భంలో అయినా, బొమ్మ కట్టడానికి కానీ, వర్ణించడానికి కానీ ప్రయత్నించలేదు. దుఃఖం పాఠకుల వంతు. ఒక ప్రజాస్వామ్య దేశంలో కొన్ని లక్షల మంది పౌరుల రాజ్యాంగ హక్కుల్ని నియంతృత్వ హింసలో అంతం చేసిన హేయమైన అజ్ఞానం, దాన్ని ఎదిరించడానికి తలబడిన పోరాటంలో స్వార్థ రాజకీయం  వినిర్మాణంగా మనకి దృశ్యమానం అవుతుంది. అది రచయిత్రి సాఫల్యం. నవలలో సంఘటనలన్నీ వాస్తవాలు. ఒకసారి శ్రీలంక ప్రభుత్వం,  మలమూత్రాలు సేకరించి జాఫ్నాలో ఆలయాల మీదా, ఇళ్ళమీదా, వీధుల్లో, విమానం నించీ వెదజల్లేరు. నవల చదువుతున్నంత సేపూ నాకు ఇజ్రాయిల్ పాలస్తీనా అనవసర రక్తపాతం, నక్సలైటు తీవ్రవాదం. లాటిన్ అమెరికెన్ ‘బతిస్తా’ తీవ్రవాద కమ్యూనిస్టు హింసాకాండ జ్ఞాపకం వచ్చేయి. ఒక దశలో ఉద్యమాన్ని ఆయుధం శాసించడమే కాక, చివరికది సామాజిక హితం కంటే ఉద్యమాల అస్తిత్వమే ప్రధానం  అవుతుంది. ‘Red April’ అనే నవలలో లాటిన్ అమెరికన్ కమ్యూనిస్టు దురాగతాలు నియంతృత్వం కంటే అన్యాయంగా కనిపిస్తాయి. ఆ నవలని చాలా కాలం క్రితం పాలపిట్టలో పరిచయం చేసాను.

గణేశానందన్ నవలలో ప్రధాన పాత్రలు లేవు. కథ కొంతమంది జీవితాలను స్పృశిస్తుంది. జాఫ్నా విశ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ప్రొఫెసర్ ఒకామె, ఆమె భర్త ఈ నవలకి స్ఫూర్తి. ఈ తమిళ జంట నవలలో ప్రవేశించి, దాని స్థాయి పెంచడం చూస్తాం. వీరిద్దరూ శశికి నవలలో గురుతుల్యులు. వాళ్లిద్దరూ శశి తో సహా అంతర్యుద్ధ వాస్తవాన్ని నిష్పాక్షికంగా సమీక్షిస్తూ రహస్యంగా నివేదికలు ప్రచురించడం ద్వారా తమిళ టైగర్లకి శత్రువులౌతారు. చాలా కాలం నివేదికల రచయితల గురించి వాళ్లకి తెలీదు. భార్యని హత్య చేస్తారు టైగర్లు.

మరొక ఆసక్తి కరమైన విషయం, శశి ఎలా ఉంటుందో చెప్పక పోవడం. అందంగా ఉంటుందా, బాగుంటుందా తెలీదు. కానీ శశి తండ్రిలా పొడగరి. దీనివల్ల ఆమె, నేరేటర్ సమూహం అయింది. శశి అన్నలిద్దరూ తమిళ టైగర్ల దళంలో చేరతారు. వాళ్ళతో పాటూ చిన్నతనం నించీ స్నేహితుడైన ‘ K’ కూడా ఉద్యమంలో చేరతాడు. ఒకరకమైన ‘Bermuda triangle’ తయారౌతుంది. కొన్ని పాత్రలకి పేర్లుండవు. ‘K’ మంచి విద్యార్ధి. ఒక గొప్ప డాక్టరు కావలసిన వాడు. శశికి అతనంటే ఇష్టం. అతను మరణించినప్పుడు ఆమె అనుకుంటుంది ‘ తన మనసులో దగ్ధం అయిపోయాడు’ అని. ఒక రకంగా ‘K ’ తమిళ టైగర్ల ద్రోహానికి బలి అయిపోయిన వాడు. ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి అతను ఇష్టంగానే ఆమరణ నిరాహార దీక్షకి కూచుంటాడు. ఒక దశలో తనని టైగర్లు కాపాడతారని అతని నమ్మకం. శశి చేతుల్లో మరణిస్తాడు.

తమిళ టైగర్లు శ్రీలంక ప్రభుత్వం మీద దాడులు చెయ్యడమే కాక , సాటి ఉద్యమ కారుల్ని కూడా హత్యలు చేస్తారు. ఏకఛత్రాధిపత్యం కోసం. జాఫ్నా విశ్వవిద్యాలయాన్ని దహనం చేసిన సందర్భంలో నాటకీయం చెయ్యకుండా, మామూలు వాక్యాలతో రాసి మనం మరిచిపోలేని పరిస్థితి కల్పిస్తుంది రచయిత్రి. టైగర్ల హింసాకాండ వల్ల శశికి ఉద్యమం మీద ఏహ్యభావం ఏర్పడుతుంది. కానీ వాళ్ళు నిర్వహిస్తున్న వైద్య శిబిరంలో విద్యార్ధినిగా గాయపడ్డ పౌరులందరికీ సేవ చెయ్యడం తన ధర్మంగా గుర్తిస్తుంది. తన మనసులో బయటా జరిగే యుద్ధాన్ని శశి ఆశ్చర్యకరమైన సంయమనంతో , నిశిత దృష్టితో అర్థం చేసుకుంటుంది. ఒక దశలో శ్రీలంకను వదలి లండన్ లో స్థిరపడడానికి ఆమె విమానాశ్రయం వరకూ వెళ్ళి తిరిగి వస్తుంది. తన మనోధర్మాన్ని గుర్తిస్తుంది.

నవల గొప్పదనం, శ్రీలంక దురదృష్టానికి కారణమైన సింహళ ప్రభుత్వం, తమిళ టైగర్లు, భారతీయ శాంతి సేన, ఐక్యరాజ్య సమితిని నిష్పాక్షికమైన శల్య పరీక్షకు గురి చేయడం.

భారతీయ శాంతి సేన (IPKF) సైనికుల్లో ఉత్తరాది వాళ్ళు అధికం. వారికి జాఫ్నా తమిళులు అంతగా నచ్చరు. రంగుతో పాటూ, వాళ్ళ సమస్య కూడా అర్థం కాదు. భాష కూడా రాకపోవడం వల్ల , స్థానికులతో స్నేహం కుదరలేదు. వారెందుకు వచ్చారో , స్థానికులకీ , వారికీ కూడా అర్థం కానీ స్థితిలో ద్వేష భావం ఏర్పడింది. మినహాయింపులు అలా ఉంచి శాంతి సైనికులు అనేక అకృత్యాలకు పాల్పడ్డారు. తమిళనాడులో రహస్యంగా తమిళ టైగర్లకి శిక్షణ ఇవ్వడం, జాఫ్నా తమిళులకు రుచించలేదు. అనవసరమైన జోక్యంగా మిగిలింది. IPKF became a four letter word.

యుద్ధానంతరం, జాఫ్నా తీరంలో వేలాది మంది పౌరులు రక్షిత స్థలంలో తలదాచుకున్నారు. వారితో పాటూ పారిపోయిన తమిళ టైగర్లు అక్కడ జొరబడ్డమే కాక పౌరుల్ని రక్షణ కవచంలా వాడుకున్నారు. రక్షిత స్థలంలో వున్న పౌరుల్ని శ్రీలంక సైన్యం నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపి చంపింది. ఈ పరిస్థితుల్లో శశి న్యూయార్కులో వైద్యాలయంలో పనిచేస్తూ, మిత్రుల సలహా మేరకు, ఐక్య రాజ్య సమితి ఉన్నతాధికార్లని కలిసి జోక్యం చేసుకుని పౌరుల్ని కాపాడమని అడుగుతుంది. తాను “ఏమీ చేయలేను” అంటాడు. కొన్ని వేలమంది ప్రాణాపాయ స్థితిలో వున్నారని అంటుంది శశి. అప్పుడాయన ఒక మాటంటాడు “ ఆ సంఖ్య సరిపోదు” . అంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో పౌరులు మరణిస్తే కానీ సమితి జోక్యం కలిగించుకోదన్న మాట. వాక్యం చదవగానే ఊపిరాడదు. ఇప్పుడు సమితి ఇజ్రాయిల్, పాలస్తీనాల విషయంలో ఏం చేస్తోందిట?

రచయిత్రి బహుశా అనుకోని ఒక సూచ్యార్థం నాకు స్ఫురించింది. సందర్భానికి సరిపోయిందనుకుంటాను. ఆమె గురువైన డాక్టర్ గారు ( తమిళ జంట) చదువుకోడానికి పుస్తకాలు ఇస్తుంది. అందులో ఒకటి  గోర్కీ ‘అమ్మ’. రెండోది ‘ కాఫ్కా ‘కాజిల్’ . మొదటిది తెలుస్తూనే వుంది. రెండోది సుదూరస్వప్నం అనిపించింది. అప్పటి పరిస్థితి అది.

‘Brotherless   Night’ అమెజాన్ లో దొరుకుతుంది.  అతికొద్ది సమయంలోనే తెలుగులో ఛాయా ద్వారా దొరుకుతుంది.

*

తల్లావజ్ఘల పతంజలి శాస్త్రి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • శ్రీలంకలో జరిగిన తమిళుల పోరాటాలపై ఒక సరైన అవగాహన కల్పిస్తుంది ఈ నవల. ఛాయ ప్రచురణలకు అభినందనలు.

  • Wow.. తెలుగులోకి రావడం చాలా సంతోషం. ఇతర భాషలో రచనలు కొత్త అనుభవాన్ని, అనుభూతిని నూతన కోణాలని పరిచయం చేస్తాయి.థాంక్యూ..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు