విద్వేషాల సంతలో ఒక ప్రేమ పిలుపు

7న, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైద్రాబాద్ లో దర్డ్ ఆవిష్కరణ

‘దర్ద్’ అంటే నొప్పి.

దుఃఖం, బాధ, ఆవేదన , ఆక్రోషం, హృదయాన్ని అవమాన పరిచి గాయం చేసిన వేదన తాలూకు నొప్పి ఇది.

కవిత్వంలోకి తర్జూమా ఐన ముస్లిం జాతి దుఃఖం ఇది. రాజకీయ అధికారాల్లో ముస్లింలకు ఏ ఆనవాళ్లు లేకుండా చేసి పార్లమెంట్ , అసెంబ్లీ మొదలైన చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం లేకుండా ఒక పగతో , ఒక సుదీర్ఘ కుట్రలో భాగంగా బహిష్కరించిన బాపతుగా సభ్య సమాజంలో, పార్లమెంటరీ సాక్షిగా హిందుత్వ పోకడలను ఎత్తిపట్టే రాజకీయ సంకుల పోరాటంలో దేశప్రధాని సైతం  ముస్లింల మనోభావాలను , వారి ఆత్మస్తైర్యాన్ని నీచంగా నైతికంగా కించపరుస్తున్న తాలూకు ‘దర్ద్’ ఈ కవిత్వం.

పదేండ్ల రాజకీయ ప్రగల్బాలతో మూడోసారి నాలుగు వందల సీట్లకు ఎసరు పెట్టి ముస్లిం సమాజం మీద , ఈ దేశ మూలవాసుల రిజర్వేషన్ల మీద , ముఖ్యంగా రాజ్యాంగం మీద నీచాతి నీచమైన విధంగా దిగజారిన  వర్తమాన లోకసభ ఎన్నికల  ప్రచారార్భాటంలో పాలిత పార్టీని కాంగ్రెస్ ఇండియా కూటమి ఎక్కడికక్కడ నిలువరించే విధంగా ఏకమై అడ్డుకున్న జాతీయ , రాష్ట్ర నాయకులు ‘ బిజెపి కా నఫ్రత్ కీ బాజార్ మే ప్యార్ కా దుకాన్ ఖోలుంగా ‘ అని దేశమంతా ‘ భారత్ జోడో యాత్ర’ ను  మొదలుపెట్టిన రాహుల్ గాంధీ చేసిన పోరాటానికి , ఆ భావజాలాన్ని అందించింది మాత్రం దేశంలోని మూలవాసి ఉద్యమ కారులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజాస్వామ్య లౌకికవాదులు, కవులు, కళాకారులు మాత్రమే !

దర్ద్ వెనకాల దేశ స్వాతంత్రం కోసం అర్పించిన త్యాగాలు, కోల్పోయిన సర్వస్వం అక్షరాలై మండుతున్నవి.

‘ఎప్పటికప్పుడు ఎవడో ధోకేబాజ్ రాజేసే మంటను ఆర్పుకునుడే అయితాంది –

మానని పుండు మీదనే దెబ్బ మీద దెబ్బ తగులుతాంది గురిచూసి రాయి విసరడం వాడికి పైశాచిక రాజనీతి అనివార్యంగా గాయపడడం నాకూ ఆనవాయితీ’!

‘పుట్టినఊరు పీల్చిన గాలి పెరిగిన నేల నాది కాదని బలవంతంగా పరాయి దేశానికి వారసత్వాన్ని ఇచ్చి నా అస్తిత్వాన్ని ప్రశ్నించినపుడు సొంత ఇంట్లో కిరాయి బతికు బతకాల్సి వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా ‘…!

‘నన్నట్టా అనుమానంగా చూడకండి అవమానపు మాటలు విసరబాకండి అలవాటైన గుడ్డలు, అలవాటైన గడ్డం, అలవాటైన తిండి వీటినిలా ఉండనీయండి నన్ను నన్నులా బతకనీయండి

నా ముఖమ్మీద మీ చూపులు తేళ్ళలా పాకుతున్నాయి. నా కదలికలమీద మీ మాటలు ఈగల్లా ముసురుతున్నాయి. ఊపిరిమీద నిఘా, ఊహలమీద నిఘా, మాటలమీద నిఘా కదిలితే అనుమానం, మెదిలితే అపనమ్మకం’ –

‘మొన్నటి నా పేరు కంచికచర్ల కొటేశు. నిన్న అఖ్లాక్. యివాళ షమ్స్ తబ్రీజ్ అన్సారీ’.

‘నా రక్తంలో దేశం ఉంది దేశం నదుల్లో నేను పారుతున్నా నా నుండి దేశాన్ని వేరు చేయాలన్న నీ ప్రణాలికల పట్ల నన్ను కుదిపేస్తున్న ఆగ్రహమూ ఉంది అన్ని దిక్కులు ఆవహిస్తున్న ఏకాకితనం పట్ల నిట్టూర్పూ ఉంది ‘ –

‘ఉన్నట్టుండి నువ్వు పాకిస్తాన్ వెళ్ళిపో అంటాడు పక్కనోడు. గుండెలో చివుక్కు మంటుంది. అదెక్కడుందో ఒక్కసారైనా చూడనోళ్ళం. అదెందుకు ఏర్పడ్డదో కూడా తెలియని వాళ్ళెంతోమంది.

ఓట్ల కోసం సీట్ల కోసం మమ్మల్ని తరచూ ఇలా అవమానించడం సాధారణమైపోయింది ‘.

‘దర్ద్’ – అస్తిత్వ వేదనతో వొక జాతి ఆర్తనాదం. ఉనికి కోసం ఒక ప్రజ చేస్తున్న యుద్ధం ‘ దర్ద్ ‘ వేల సంవత్సరాలుగా అనేక విధాలుగా నలుగుతుతున్న జాతి అస్తిత్వ ఆక్రందన – దర్ద్. (33 మంది కవులు రాసిన సామూహిక దుఃఖ ప్రకటన”దర్డ్” కవిత్వం.

*

అన్వర్

8 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మూలవాసీల్లో ఒకరైన ముస్లిం ఆత్మఘోషను చక్కగా తెలియజేసారు.హృదయపూర్వక అభినందనలు.

  • క్లూప్తంగాకుండబద్దలు కొట్టారు భాయ్

  • ఈ దర్ద్ సాహిత్య లోకంలోకి తర్జుమా అవుతుందనే ఆశిద్దాం! ఆ పెయిన్ ని అందించావు అన్వర్! థాంక్యూ 💙

  • మనదేశంలో ఈ ఆక్రోశం చాలా మందిలో ఉంది. కాని అది అవ్యక్తం. వాళ్లలో చాలామంది అశక్తతలు కనుక. కాని
    మార్పు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. ఆశే జీవానికి మూలం కదా.

  • అస్తమానం సొంత గొడవ తప్పితే సమాజం లో స్త్రీల పట్ల, పిల్లల పట్ల, అమానవీయ సంఘటనల పట్ల ఈ సోకాల్డ్ ముస్లిం మేధావులు, రచయితలు కనీస ప్రతిస్పందన చూపగా నేను ఇంతవరకూ చూడలా, కనీసం మన తెలుగు నేలమీద

    • అన్నీ సమస్యల పట్ల స్పందిస్తూనే వున్నాం. మీరు కాస్త సమయం కేటాయించి పరిశీలిస్తే తెలుస్తుంది. మనసులో విద్వేషం పెట్టుకొని మాట్లాడడం, ఇంట్లో కూర్చొని బురదజాల్లడం సమంజసం కాదు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు