వచనం, కవిత్వం, విశిష్టాద్వైతం

నిరాడంబరమైన అక్షరాల మధ్య నుంచి సన్నటి మానవీయ అంతర్వాహినిని ప్రసరింపజేయడానికి సాధన చేయాలనిపిస్తుంది.

సారి గొడవ వేరు. నేనెవ్వరని కాదు. నేనేమిటని.

తాత్వికం కాదు. పచ్చిభౌతికం.

అప్పుడెప్పుడో మిలీనియం మలుపులో డాట్‌ కామ్‌ బూమ్‌ లో తెలుగులో కూడా వెబ్‌ సైట్లు విరివిగా వచ్చాయి. ఆ కాలంలో,  ఒకానొక వెబ్‌సైట్‌ లో మిత్రుల కోరిక మీద ఏదో ఒకటి రాయవలసి వచ్చింది.  రచయిత పరిచయం కూడా ఇమ్మన్నారు. ఉద్యోగ హోదానో, ఎటువంటి రచయితో ఒక విశేషణంగా ఎడిట్‌ పేజీల వ్యాసాల క్రెడిట్ లైన్ తో పాటు  తగిలించడం, లేదా మేగజైన్లలో కథ, నవల రచయితలు తమ గురించి వివరంగా చెప్పుకోవడం ఉండేది కానీ,  తమను తాము అభివర్ణించుకునే అదృష్టం మాత్రం పాత్రికేయులకు మొదటిసారిగా వెబ్‌ సైట్ల వల్లనే పట్టింది.

రెగ్యులర్‌ ఉద్యోగం చేయక అప్పటికి అయిదారేళ్లయింది. ఆ కాలాన్ని మా అమ్మాయి బాల్యాన్ని ఆనందించడానికి, నా పిహెచ్‌. డీ పూర్తి చేయడానికి, అక్కడా ఇక్కడా రచనలు అచ్చువేయడానికి సద్వినియోగం చేసుకున్నాను. ఎన్ని పనులు చేస్తున్నా పనికి ఆహారం ఇచ్చే ఒక చిరునామా లేకపోతే, కష్టమే.  అడ్రసు లేని తనాన్ని ఘనంగా చెప్పుకోవడం ఎట్లాగో తెలియక, నా అభిరుచులను, ఆసక్తులను పరిచయం చేసుకుంటూ ఒక పేరాగ్రాఫ్‌ ఆ వెబ్‌ సైట్‌ వారికి పంపాను.

‘వచనంలో జీవిస్తున్నాను, కానీ, అప్పుడప్పుడు కవిత్వంతో కూడా విహరిస్తుంటాను” – ఇవే మాటలో, ఈ అర్థం వచ్చే మాటలో ఆ పరిచయంలో  రాసినట్టు గుర్తు.

నా గురించి నేను,  లేక లేక నాలుగు వాక్యాలు చెప్పుకోవలసి వస్తే, వాటి మధ్య ఈ కవిత్వ, వచన ద్వైధీభావానికి  పెద్ద పీట వేయాలా? అంత ముఖ్యమైనదా ఆ విషయం, నా జీవితంలో,  కనీసం ఆ కాలంలో?

ముఖ్యమా, అముఖ్యమా అన్న చర్చ అసంగతం కానీ, ఆ ద్వంద్వం మాత్రం నన్ను తరచు చిరాకు పెడుతూ ఉంటుంది. కవిని కాకపోవడం, నేను సంచరించే  ఒక బృందంలో నన్ను రెండో తరగతి పౌరుణ్ణి చేస్తూ ఉంటుంది.   మరొక బృందం నన్ను కవిత్వజాడ్యం అంటుకున్నవిచిత్రజీవిగా చూస్తుంటుంది. ఎక్కడా నాకు సంపూర్ణ ఐడెంటిటీ  లేక, మరీ  ముఖ్యంగా  సాహిత్యయౌవనంలో, బాగా సతమతమయ్యాను.  పతంజలి గారు అదేదో పెద్దకథలో రాసిన తీరులో, కవులు-కవులు బాధించేవారు అనే బైనరీలోనే ఈ సృష్టి అంతా జరిగిందేమోనని  అనుమానం కూడా వచ్చేది.

కవిత్వం కాదు కానీ, కవి మాత్రం నా జీవితంలోకి అతి చిన్న వయస్సులోనే ప్రవేశించాడు.మూడు నాలుగేళ్లు ఉంటాయోమో!  వేంసూరు అనేవూరిలో మా ఇంటికి ఐమూలగా ఉన్న ఒక మేడలో, ఆరుబయలు వసారాలో, ఓ పెద్దాయన ఒక స్తంభానికి ఆనుకుని ఏదో ఒకటి రాసుకుంటూ ఉండేవారు. బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి ఆయన పేరు. ఆయనెందుకు అస్తమానం అట్లాకూర్చుని రాసుకుంటారు అని అడిగితే, ఆయన కవి అని మా అమ్మ చెప్పింది.  ఆయనే కాదు, ఆయన కొడుకు కూడా కవి అని హెచ్చరించింది.  ఆ వసారాలో స్తంభాల మధ్య ఆడుకుంటూ అక్కడంతా గెంతిన జ్ఞాపకం ఉంది కానీ, ఆ శాస్త్రిగారితో నాకు పలకరింపులు జరిగిన గుర్తు లేదు.

నిద్రపుచ్చుతూ పాడిన జోలలూ, మంగళహారతి పాటలూ, ఆకాశవాణి  నుంచి వినిపించే సుప్రభాతాలూ ఈ మాసపు పాటలూ  చిత్రరంజని గీతాలూ కూడా సాహిత్యమే కాబట్టి, అటూ ఇటూగా అదే వయసులో నా చిన్న బుర్రకు కవిత్వ స్పర్శ సోకింది. నా అంతట నాకు అర్థమయిన మొదటి కవిత్వం ఏది అని బుర్రలోని చాట్‌ జీపీటీని అడిగితే, డేటా లేదు బేటా అని జవాబు చెబుతోంది.

నేను మాట్లాడిన మొదటి కవి ఎవరో గుర్తు తెచ్చుకోబోతే, సిధారెడ్డో, రఘునాథమో కావచ్చనిపిస్తుంది. వాళ్లు నా కంటె వయసులో మరీ ఎక్కువ కాదు కానీ, కొంచెం పెద్దవాళ్లు. కానీ, వారేదో   విశ్వరూపులన్నట్టుగా,  బాగా తల బాగా పైకెత్తి వారిని చూసినట్టుగా స్ఫురణ కలుగుతూ ఉంటుంది.  ఆ కాలంలో కేంపస్‌ కవిసమ్మర్దంలో నలిగి, నేను కూడా కవినేమోనని, అనుమానం వచ్చేది. కవులందరికీ అసంకల్పితంగా కొన్ని లక్షణాలు ఉంటాయి. వారు తమతో మెలిగేవారిని అయితే, తమ పాఠకులుగానో, లేదా మరో కవిగానో తీర్చిదిద్దుతారు.

అప్పటికే ఓరియంటల్‌ విద్యార్థినై  గైరికాది ధాతువులూ అటజనికాంచిన కలాపిజాలములూ బుర్రనిండా వెలిబూదివోలె నిండి మత్తులో మునిగిన నేను, ఆధునిక కవుల ఆలనాపాలనాలో కారుమొయిళ్ల కాటుకపొగలను,  కబీరును తాగిన రోషనారలను పలవరించసాగాను. అప్పుడే గమనించా, కవిత్వం తనంతట తానే ఒక మాదకమని.

కవిత్వం ఏదో పెద్ద విషయమైనట్టు, తమకే అనుభూతమై, తామే చెప్పగలిగే అద్భుతమైనట్టు కవులు పోజు కొడతారనిపిస్తుంది కానీ, వారి శక్తి మరీ అంత అబద్ధమేమీ కాదు, రసవిద్యను సాధన చేయవలసిందే కానీ, కవిత్వం నీలో నాలో అతనిలో ఆమెలో మనలో మీలో అందరిలోనూ ఉండే ముడిపదార్థం, అందరూ పాడి, వినగలిగే స్వేచ్ఛా సంగీతం –అని తెలుసుకునే లోపు అచ్చోసిన చాలా కవిత్వం చదవవలసి వచ్చింది. పనిలోపనిగా, ఎంతో కొంత రాయవలసి కూడా వచ్చింది!

చాలా సార్లు కవులకు కూడా తెలియని రహస్యం, నాకు ఆ కాలంలో తెలిసిపోయింది. కవిత్వం ఒక  ఖేచర విద్య ! రెక్కలు అల్లార్చి, నేలను తన్నేస్తే ఎగిరేయొచ్చు! మాటలు విసిరి, మరిన్ని ప్రపంచాలను ప్రతిసృష్టి చేయవచ్చు. ఆ విద్య తెలిసిన  కవులను చూసి ఆ రోజుల్లో మురిసిపోయాను. నేనూ ఆ శక్తి తెచ్చుకోగలనన్న ప్రలోభం కలిగింది.  యువగీతావరణానికే ముగ్ధుడినై పరవశించిన వాణ్ణి, తరువాత కాలంలో శ్రీశ్రీని కలుసుకున్నాను.  శివసాగర్‌ తో వేదికలు పంచుకున్నాను, గద్దర్‌ను ఆలింగనం చేసుకున్నాను, వంగపండును తన్మయించాను. మహాకవుల మధ్య తిరుగాడి అతిశయించాను.

ఆ కాలంలో క్లాస్‌ రూం నోట్‌ బుక్కుల వెనుక పేజీలన్నీ జుట్టు  చెదిరిన, కాళ్లో చేతులో విరిగిన, సగంలోనే ఆగిన పద్యపాదాలతో నిండిపోయేవి. మనసులోనుంచి రాస్తున్నా, దేన్నో చూసి కాపీ కొడుతున్నట్టు, కాయితం మడతపెట్టి, దానికి కూడా మనల్ని మనమే అడ్డం పెట్టుకుని, ఎంత చాటుగా రాయడమో? నాకు క్రమంగా తెలిసిరాసాగింది,  కవిత్వం చాలా ప్రైవేటు వ్యవహారమని! మనలో మనం చేసుకునే గుసగుసలని ఎట్లా బయటపెట్టడం? నాకిట్లా ఊహ కలిగింది, నేనిట్లా ఈ అనుభవాన్ని కల్పించుకున్నాను అని జనం ముందుకువచ్చి ఈ కవులు ఎట్లా చెప్పగలుగుతారబ్బా అనిపించింది. మడతపెట్టిన కాయితాన్ని జేబులోంచి తీసి చదివి, మిత్రుల మధ్య  పెద్దగా ఆలపించే కవిని చూసి, నాక్కొంచెం ఫన్నీగా అనిపించేది!

ఒకరిద్దరి మధ్యో, చిన్న గుంపులోనో మన చమత్కార పటిమను ప్రదర్శించడం వేరు, పదిమందిలో దాన్ని అభినయించడం వేరు.   ఎంత మొహమాటంగా అనిపించినా, చిన్నతనం కదా, సారస్వత పరిషత్‌ లో నెలనెలా జరిగే ‘వేదిక’ కార్యక్రమాల్లో ఉపన్యాసాల అనంతరం జరిగే స్వీయరచనా పఠనంలో పాల్గొనేవాడిని! మెప్పు పొందడంలో ఉండే మజా అప్పుడే నాకు మొదటిసారి పరిచయం అయింది! అంతకంటె ఇంకా ఘోరం, చెప్పుకుంటే పరువు చేటు కూడా, ఒక కవిత్వరచన పోటీలో  పాల్గొని బహుమతి కూడా గెలుచుకున్నాను.

ఆ రోజుల్లోనే కవిత్వం సాధన చేయాలన్న తపన వ్యసనంలాగా వెంటాడేది. గడియారం శ్రీవత్సతో కలిసి కొన్ని కవిత్వాలు రాశాను. పేరడీలు చేశాను. హతవిధీ! పత్రికలకు కూడా పంపాను.  కొన్నిట్లో అచ్చయ్యేవి కూడా. ఆగిపోయేముందు భారతిలో కూడా మా ఇద్దరి కవిత అచ్చయింది. కార్యకారణ సంబంధం ఏదో ఉండి ఉండాలి.

ఎనభైల మొదట్లో, దందహ్యమాన సాహిత్య దశాబ్దం గడిచి, కవిత్వంలోకి  అస్తిత్వాల ఆవేశాలూ, వ్యవస్థీకృత అమానవీయాలూ ఉధృతితో వరదలెత్తుతున్న కాలంలో, నేను భావకవిత్వాన్ని ఆసాంతం చదవడం మొదలుపెట్టాను. నవ్యకవిత్వాన్ని, ఆ తరువాతి అభ్యుదయ కవిత్వాన్ని, ఎవరో అసైన్‌మెంట్‌ ఇచ్చినట్టు, నిష్ఠగా చదువుకున్నాను. బ్యాక్‌ లాగ్స్‌ అన్నీ పూర్తిచేసి, బుద్ధిగా సమకాలీన కవిత్వాన్నిఅందుకున్నాను. కథలూ నవలలూ కుప్పలుతెప్పలుగానే చదివాను కానీ, ప్రతి  ఒక్కటీ వెదికి వెదికి చదివానని చెప్పలేను. కవిత్వ ప్రయాణం అర్థమయినంతగా, వచనంలో ఏమి జరుగుతూ వచ్చిందీ నాకు తెలిసిందని కూడా చెప్పలేను.

కానీ, నేను చాలా ఎక్కువగా, వ్యక్తిగతంగా ప్రేమించింది కవిమాత్రుడిని కాదు. ప్రధానంగా వచనరచయిత అయిన చెలం ని.   శ్రీశ్రీ మీద ఆరాధన ఉండేది, వ్యక్తిగత కనెక్ట్‌ ఉండేది కాదు. బుద్ధీజ్ఞానం కొద్దిగా అయినా సమకూరాయని తెలిసిన తరువాతే గురజాడ అప్పారావు  నచ్చాడు. నా ప్రాంతీయ అస్తిత్వపు ఎరుక కలిగిన తరువాతనే, ప్రతాపరెడ్డిని తెలుసుకున్నాను. వట్టికోట ఆళ్వారును కొత్తగా చదువుకున్నాను.

కవులను చదివిన వేళల కలవరాలను, కవులను పొగొట్టుకున్న విషాదాలను మరోసారప్పుడైనా రాస్తాను కానీ, వచనం నన్ను ఆసాంతం ముంచెత్తితే, కవిత్వం ఒక చిన్నదీవిలాగా నన్ను కాపాడుతూ వచ్చిందన్నది ఇప్పుడే చెప్పాలి. కవిత్వం నాకు ఏకాంత యవనికాభ్యంతరమే! ఎప్పుడైనా నేను అందరికీ వినిపించేట్టు చదివి ఉంటే అవి ఉట్టి పలవరింత లే! నాకు నేను చేసుకున్న నిద్రాభంగాలే!

తగినట్లు కూర్చెరా తాకట్ల బ్రహ్మ అన్నట్టు నా పాలిట పాత్రికేయ వృత్తి సంక్రమించింది. నేను కోరుకున్నదే, కానీ, వుట్టి వచనం లాంటి జీవితం. స్వగతాలు కాదు, జనాంతికాలు కాదు, వుట్టి మాటలను రాయలి.  గుండె గొంతుకలోన కొట్లాడితే, ఆ చప్పుడుని అక్షరాలలో రాయాలి. సంవేదనలను బిగ్గరగా పలకాలి. లోపలి సంగీతాన్ని  కట్టిపెట్టి, బయటి రొదలన్నిటినీ ఆలకించాలి. ఉద్వేగాలను, ఆవేశాలను తూకాలు వేసి చిలకరించాలి.

ద్వారక సాయంత్రాలకు ముగ్ధుడినై నేను కూడా శివారెడ్డి గారి సుదీర్ఘ కవిసమయాల్లో చిక్కుకుపోయి ఉండే వాణ్ణి కానీ, నా వృత్తికి సాయంత్రాలను గుండుగుత్తగా అమ్మేసి ఉండడం వల్ల అది కుదరకపోయింది.

1990 లలో త్రిపురనేని శ్రీనివాస్‌ స్నేహంలో, సహోద్యోగంలో కవిత్వం రాసే జోలికి పోలేదు. వచనాన్ని వార్తారచన దాటించాను. వచనం ఒక శాపగ్రస్త జన్మ అన్నట్టు త్రిశ్రీ రాస్తుంటే, గొడవ పెట్టుకునేవాడిని. బహుశా, అప్పుడే నేను గట్టిగా వచనవాదిని అయిపోయాను. అయినా, కవిత్వం రాత్రుళ్లు నన్ను రహస్యంగా కలుస్తూనే ఉండేది. 90ల నడిమి సంవత్సరాలలో చాలా రాశాను. దురదృష్టవశాత్తూ కొన్నిఅచ్చుపడ్డాయి కూడా.  ఆ కొంచెంలో అయినా ప్రపంచానికి నా మనోప్రపంచపు టావర్తాలను పరచిచూపినందుకు ఇప్పటికీ ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది. నా చిత్తు కాయిదాల్లో మిగిలిపోయినవే ఎక్కువ కావడం కొంచెం ఊరటగా ఉంటుంది.

ఇదంతా కవిత్వమనుకుంటూ నేను రాసిన దాచుకున్న ప్రకటించిన దాని గురించిన సంకోచమే తప్ప, ఇతరుల కవిత్వంతో నాకు ఏ క్రైసిస్సూ ఉండేది కాదు. కవిని కాకపోవడం వల్ల అసూయ అసలే లేదు. కవిత్వం మీద వ్యాసాలు రాయడం కూడా నలభై ఏండ్ల నించి చేస్తున్నాను. వాటిలో సాహిత్య విమర్శ ఉందని ఎవరన్నా అంటే, అంతరాత్మ చాలా గింజుకు పోతుంది.  కనీసం కవిత్వాన్ని అర్థం చేసుకోవడం, అంచనా వేయడం వచ్చు అనుకుంటాను. దాదాపు రెండు మూడు దశాబ్దాల పాటు పత్రికల్లో కవిత్వపు ఎంపికల బాధ్యత నిర్వహించాను.

వచనాన్ని, చాలా సందర్భాలలో రాజకీయ వచనాన్ని రాసేటప్పుడు కూడా అనేక ఆవేశాలూ ఉద్వేగాలూ నా అక్షరాలను వెలుగులతోనో, చీకటితోనో మెరిపించే  ప్రయత్నం చేస్తాయి. ఏ భావావేశమూ కలిగించక విఫలమైన వాక్యాలూ అనేకం ఉంటాయి! వచనంలోని నా ప్రయత్నాన్నే  కవిత్వలక్షణమని అనడానికి మిత్రులు ప్రయత్నిస్తారు. సూటి, సరళ వచనం ఒక్కోసారి అసాధ్య లక్ష్యం అనిపిస్తుంది.  నిరాడంబరమైన అక్షరాల మధ్య నుంచి సన్నటి మానవీయ అంతర్వాహినిని ప్రసరింపజేయడానికి సాధన చేయాలనిపిస్తుంది.

జ్ఞానవచనం నిరలంకారంగా ఉండవలసిందే, కానీ, అనేక ఇతర వచనాలలో  ఇంద్రధనస్సులు సంధించవచ్చు. మనసును జలదరింపజేసే క్షణాలన్నీ కవిత్వానివే కానక్కరలేదు. అవి కనుక కవిత్వం అనుకుంటే, కవిత్వం ఒక మౌలికపదార్థమే తప్ప,  వంకరటింకర పంక్తులలో మాత్రమే పరచుకునేది  కాదు. కవిత్వం ఒక ప్రక్రియ కాదు, ఒక రూపమూ కాదు. అది  సారం!

కష్టమే. అమూర్త ఆనందాల నుంచి, అకారణ విషాదాల నుంచి మనుసును మెలాంకలీల మైమరుపులోకి తోయగలిగిన కవిత్వాన్ని పక్కనబెట్టి, పచ్చి వాస్తవ భౌతిక జీవన నవరసాలలో ఓలలాడడం కష్టమే. కానీ, ఆ బాధ అంతా కష్టసుఖాల ఎరుక కలగనంత వరకే.  కీలకం కవిత్వంలో లేదు, హృదయం లో ఉంది. ద్వంద్వాల నిఘంటువు నిజం కాదు. కవిత్వం పచ్చికా కాదు, వచనం ఎడారీ కాదు!

ఒకప్పుడెప్పుడో,   అశాంతి నుంచి తప్పించుకోవడానికి చాలా దారులు వెదుక్కుంటూ, సంగీతం నేర్చుకుని చూద్దామని పిల్లలు ఆడుకునే కీబోర్డ్‌ ప్లేయర్‌ మీద ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. నేను వెదజల్లే కర్ణకఠోరతను భరించలేక, ఒక దగ్గరి కవి మిత్రుడు,  ఒక సత్యం చెప్పాడు. జీవితంలో సంగీతం ఉంటే శాంతి దొరకొచ్చు. కానీ, అందుకు నువ్వు ప్లే చేయక్కర్లేదు, పాడక్కర్లేదు. వింటే కూడా సరిపోతుంది- అన్నాడు. కవిని అయి తీరాలేమోనని నా మీద నేను, ప్రపంచమూ విధించబోయిన లక్ష్యాన్ని  ఆ మాటలు పటాపంచలు చేశాయి. జీవితంలో కవిత్వం ఉండడం ముఖ్యం. కవివి కానక్కరలేదు. బహిరంగ కవివి అసలే కానక్కరలేదు.

గాయం మీద కారం చల్లినట్టు, వాళ్లెవరో ఫాసిస్ట్‌ కేరక్టరిస్టిక్స్‌ అన్నట్టు, నా వచనం కవిత్వం లాగా ఉన్నదంటూ, నాలో కవిత్వపు పోకడలున్నాయంటూ, కన్సోలేషన్‌ బహుమతి తో  మిత్రులు బుజం తట్టడం కూడా ఇబ్బంది గానే ఉంటుంది.  నన్ను ఏ కేటగిరీలో నిలబెట్టాలో,  అర్థం చేసుకోవాలో,  తెలియక మిత్రులకు  ఎంతో కొంత అసౌకర్యం కలుగుతూనే ఉంటుందనుకుంటాను.మనుషులు  దూదిపింజల్లాగా, పలచటి మేఘాలలాగా కనిపిస్తూ,  సరిహద్దుల రూపురేఖలలో స్థిరంగా ఘనపదార్ధంగా కనబడనప్పుడు కలిగే ఇబ్బంది అర్థం చేసుకోవచ్చు. కానీ, మన రాతలకు తెలిసినపేర్లు లేకపోతేనేం?

నేను చాటుచేసుకున్న కవిత్వాలను  సభలోకి రాజేస్తామని మిత్రులు ఒమ్మి రమేశ్‌, నామాడి శ్రీధర్‌ మూడుదశాబ్దాల నుంచి బెదిరిస్తూనే  ఉన్నారు. ఆ క్షణం నిజంగానే వస్తుందేమోనని నిద్రలో కూడా ఉలిక్కిపడుతుంటాను!

*

కె. శ్రీనివాస్

కె. శ్రీనివాస్ సాహిత్య విమర్శకులు, తెలంగాణా సాహిత్య చరిత్ర గురించి ప్రామాణిక ప్రతిపాదనలు చేసిన సిద్ధాంత జీవి. పత్రికా రంగంలో నవీన యుగం జెండా ఎగరేసిన ప్రయోగవాది. "ఆంధ్ర జ్యోతి" దినపత్రిక పూర్వ సంపాదకులు.

20 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • భలే వ్యాసం. చాలా నచ్చింది.
    కె. శ్రీనివాస్ గారికి, ప్రచురించిన సారంగ సంపాదక వర్గానికీ ధన్యవాదాలు.

  • చాలా బాగుంది.. కె యస్ గారు. చదువుతున్నంత సేపు మనసు నిర్మలంగా హాయిగా వుంది.

    సూర్యకాంతం’ ఇంటికి కోడలిగా పోయి, అమాయకపు భర్తతో సంసారాన్ని ఈడ్చుకొస్తూ, నిస్సహాయ స్థితిలో ఎటూ తేల్చుకోలేని వో మనసున్న అమ్మాయి విప్పిన మనసులా వుంది మీ వచనం.

    బతుకు పద్మవ్యూహం లో ఇరుక్కున్న అభిమన్యుడు ఏంచేయాలో తెలిసీ, అట్లా చేయడం ఇష్టం లేక,
    తిక్కలేసి బాణాలను కింద పారేసి, పెన్ను పేపర్ అందుకొని రాసిన కవిత్వం లా వుంది మీ వచనం.

    మెదడు తో సమన్వయం చేసుకోవడానికి తిప్పలబడుతున్న మనసు.. గొంతులకు చేరి బయట పడలేక తన్లాడుతున్న గుండె.. రెండూ కలిసి డ్యూయెట్ పాడుతున్నట్టు అనిపించింది.

    కాళ్ళు చేతులు కట్టేసి నోరు మూసేసిన సంక్లిష్ట రాజకీయ సమాజిక సందర్భాల్లోనుంచి కట్లు తెంపుకుని బద్దలు కొట్టుకొని బళ్ళున రాలి గాయాల పాలైన అక్షరాలకు కట్లు గట్టి ఒక క్రమ పద్ధతిలో పేర్చినట్టుంది మీ వ్యాసం.

    లబ్ధ ప్రతిష్టులైన ప్రవచన కారులే పనికి ఆహార పథకంలో పాల్గొనకుండా ఉండలేని అనివార్య సందర్భాల తో పోల్చినపుడు మీ అసందర్భాలు లెక్కలోకి రావు . కానీ ఉడికిన అన్నం గిన్నెను దించేముందు స్లిమ్ లో పెట్టడం అమ్మ మరిచినపుడు మాడిన అన్నం గిన్నెలోంచి మంచి మంచి అక్షర మెతుకులు ఏరుకు తిన్న ఆనందం వుందీ అక్షరాల్లో.

    విస్కీ అలవాటైన ఫ్యాటీ లివర్ కు పొద్దాటి కల్లు నీరా పంచామృతాన్ని పంచిన మోదుగాకు సాంత్వన మీ వచనానిది. సార్…మీ వ్యాసాన్ని మింగేలా పొంగుకొస్తున్న స్పందనను ఇక్కడితో కట్టడి చేస్తున్న.

    మీ వచన హృదయానికి వందనాలు.
    మంచిని చెడును మీతో మనస్పూర్తిగా పంచుకునే మీ వచనాభిమాని … హజారి.

  • కె శ్రీనివాస్ గారి స్వగతం లో వచనం కవిత్వం క్యాంపస్ నుండి సాయంత్రాలు గంపగుత్తగా పాత్రికేయ వృత్తి కి అమ్మేసుకున్న దాకా పలవరింతలు

  • జీవితంలో సంగీతం ఉంటే శాంతి దొరకొచ్చు. కానీ, అందుకు నువ్వు ప్లే చేయక్కర్లేదు, పాడక్కర్లేదు. వింటే కూడా సరిపోతుంది- అన్నాడు. కవిని అయి తీరాలేమోనని నా మీద నేను, ప్రపంచమూ విధించుకోబోయిన లక్ష్యాన్ని ఆ మాటలు పటాపంచలు చేశాయి. జీవితంలో కవిత్వం ఉండడం ముఖ్యం. కవివి కానక్కరలేదు. బహిరంగ కవివి అసలే కానక్కరలేదు.- I FOLLOW THIS SRINIVAS GARU . ( suits to me as on date )

    • రహస్య కవిగా రాణించండి, రాజేశ్వర్ గారు!

  • అద్భుతమైన ఆవిష్కరణ మీ కవిత్వంలో జీవనం… మీరు రాసే ప్రతి దానిలో కవిత్వం ఉంటుంది. మీ వచనం కవిత్వం అద్దుకుని అచ్చేసుకుంది ఎప్పుడో.. ఎప్పుడూ.. ఇప్పుడూ… నిగర్వంగా… నిజాయితీగా.. రాసిన ఈ వ్యాసంతో సగర్వంగా సారంగకు ఒక సొబగు తెచ్చారు.. ధన్యవాదాలు సార్ 🙏🌿🪻 చాలా చోట్ల విషయాలు మమ్మల్ని మేము తడుముకున్నట్లు ఉన్నాయి. మొత్తానికి మీరు వట్టి వచనంలా ఉంటూనే కవిత్వం పూయిస్తారు అని చెప్పగలను.

    • కవిత్వం తో పోలిక తేకుండా వచనాన్ని పొగడలేము కదా! ఫలానా కవి రాసినవి వచన స్థాయికి అందుకోగలిగాయి అని అనగలిగితే?

  • ఈ మధ్య హాస్య వంగ్య రసాలు అలవోకగా ఓలుకుతున్నాయ్
    ఎంత కాదన్నా, కాదనుకున్నా మీరు కవిత్వపు వాసన వేయడం తప్పదు, వేయకా తప్పదు. ఆ అంతర్లయను వేరు చేసుకోడం మీ వల్లవుతుందా? అబ్బే. . అబ్బెబ్బే. .. ☺️

    • వాసన మాత్రమేనా? కవి అనిపించుకున్నారు మొత్తానికి!

  • సూపర్ సర్ ,చిత్తు కాగితాల్లో చెత్త కాగితాల్లో అక్షరాలుంటాయి అవి కాలిపోతు కళ్ళెర్ర చేస్తాయి.అక్షరాలన్నీ కవిత్వం కాకపోవచ్చు కొన్ని కన్నీళ్ళుకూడా అవుతుంటాయి

  • తొలి సారి సారంగ వెంట నా కన్నులను తోడ్కొని పోయినవి మీ అక్షరాలు … కాసేపు మాటలను మరిపించి మౌనాన్ని ఆశ్రయించేలా … కొంత సమయం మౌనాన్ని ధిక్కరించి మాటలు గోల చేసేలా అలా ఇలా సాగింది ప్రయాణం …
    శ్రీనివాస్ సార్ మీకు ధన్యవాదాలు చదవనిచ్చను పెంచే రాత మీది
    రుచి చూసి పెదవిరిచి వదిలే స్థితిలో నేను ఉన్న వేళ
    కన్నులే కలిపి ముద్ద పెట్టినట్లు చివరి మెతుకులా చివరి అక్షరం వరకు …

  • దేన్నైనా ఉన్మత్త స్థాయికో పతాకస్థాయికో తీసికెళ్లి మాట్లాడడం కవిత్వంలో భాగమైనట్టుగా కొందరు కవుల్లో కూడా భాగమౌతుందేమో అని సందేహం. సూపర్ లేటివ్స్ ఎప్పుడూ సమస్యే. నాకు ముందూ వెనుక అంతా శూన్యం లాగా! సరదాగా ఒకసారి అనుకోవడానికి బాగున్నవన్నీ సత్యాలే కానక్కర్లేదేమో. బహుశా వచనమై పుడతావు లాంటి త్రిశ్రీ శాపాలను కూడా అలా చూడాలేమో అని సందేహం. అసలు కవిత్వం వచనం అనే బైనరీనే చిత్రంగా అనిపిస్తుంది రూపం సారం లాగా. దేన్నైనా రెండు పక్షాలుగా చేసి ఒకవైపు నిలబడి మాట్లాడితే తప్ప మనిషిలోని అంతరాత్మ సంతృప్తిపడదేమో అనిపిస్తుంది. దేని అందం దానిదే. దేని తలం దానిదే. ఒకదాన్ని మరో దాని పైనో కిందో కూర్చోబెట్టనక్కర్లేదేమో! మంచి వచనం ఎంత హాయినిస్తుంది. కేవలం తమ వచనం వల్లే చదవాలనిపించే రచయితలున్నారు, వారి భావాలతో ఏకాభిప్రాయం లేకపోయినా. మంచి వచనం, సొగసైన వాక్యం ఎంతమంది రాయగలరు! చేతివేళ్లు కూడా పూర్తిగా అక్కర్లేదేమో! ఇదంతా ఎందుకు రాస్తున్నాను! మీకు తెలీదనా, పాఠకులకు తెలీదనా, మీ ఇంటెన్స్ వ్యాసం చదివాక రేగిన లౌడ్ థింకింగ్.

  • రచయితదీ, పాఠకుడిది వేరు వేరు ప్రపంచాలు కాదు. అలాగే వచనానిదీ, కవిత్వానిదీ కూడా అనిపిస్తుంది . భావజాలం మనకి నచ్చినా లేకున్నా చదవగలిగే వచనం కవిత్వం లాంటిదే .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు