బహుశా తెలుగు నేలను పాలించిన రాజులు చేసిన యుద్ధాలలో జరిగిన చివరి ప్రధాన యుద్ధం తల్లికోట. ఆ యుద్ధం గురించిన చారిత్రిక రచనల నమోదుకు భిన్నంగా, అనునాదంగా సాగాలని ప్రయత్నించిన తొలి చారిత్రక కాల్పనిక నవల ‘ప్రణయ హంపి’ కావచ్చు.
దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం గ్రీకు కవి హోమర్ రచించిన ఖండ కావ్యం ఇలియడ్ మానవ సాహిత్య చరిత్రలో నమోదయిన తొలి యుద్ధ నవల. ఇలియడ్ ఏక కాలంలో పౌరాణిక కావ్యం, చారిత్రక కాల్పనిక కావ్యం కూడా. ఇక్కడ పోలిక రెండు నవలల్లో యుద్ధమే నేపథ్యం కావడం. అయితే ప్రణయ హంపి చారిత్రక కాల్పనిక నవల కోవకే చెందుతుంది.
కథకుడిగా బాణీని, సంతకాన్నీ స్థిరం చేసుకున్న మారుతీ పౌరోహితం రాసిన ‘ప్రణయ హంపి’ తన తొలి నవల. నిజానికి అన్నప్రాసన నాడే ఆవకాయలాంటి సవాలు ఈ నవలా రచన. తన తొలి రచనతోనే ఒక కొత్త చారిత్రక ప్రతిపాదనని బలంగా ముందుకు తెస్తున్నాడు మారుతి. అది హంపిని తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించడం. ఇది చరిత్ర కారులు తేల్చవలసిన, చర్చించవలసిన అంశం.
చారిత్రక కాల్పనిక సాహిత్యం కత్తిమీద సాము, పులిమీద స్వారీ ఏకకాలంలో. Historical Fiction రాసేందుకు చాలా నియమాలున్నాయి, సిద్ధాంతాలున్నాయి. అయితే Historical Fiction రాస్తున్నప్పుడు చరిత్రతో కల్పన పెనవేసుకుని సాగాలే కాని, చరిత్రలో కల్పన అస్సలు కూడదు. ఈ రెండవదే ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చాపకింద నీరులా కొద్దిసార్లు, బాహాటంగా ఎక్కువసార్లూ జరుగుతూ పోతున్నది. అయితే ఈ ప్రమాదంలో తనను పడేసుకోకుండా తన తొలి నవలలోనే మారుతి ఏ మేరకు జాగ్రత్తలు తీసుకున్నాడు? నవల చివర అతను పేర్కొన్న గ్రంథాల పట్టీ ఆ జాగ్రత్తను పట్టి చూపుతుంది.
రక్కసి, తంగడి అనే ఊర్ల మధ్య నెలలపాటు జరిగిన యుద్ధమే తల్లికోట. పాలనకు తల్లినీ, పాలకులకు కోటనూ మిగల్చని నాటకీయ యుద్ధం అదే! ఒక రకంగా ఈ యుద్ధమే దక్షణాదిన ముస్లిం పాలనను సంపూర్ణంగా స్థాపించేందుకు తెర ఎ్తతింది అని చెప్పవచ్చు. నిజానికి తల్లికోట యుద్ధం తర్వాత కూడా విజయనగర సామ్రాజ్య పాలన మిణుకుమిణుకు మంటూ సాగినప్పటికీ వైభవ హంపికి చరమగీతిని పాడింది తల్లికోట యుద్ధమే. ఆ చరమగీతి నేపథ్యంలో సాగే ప్రణయగీతమే ఈ నవల.
యుద్ధ నేపథ్యంలో ప్రేమ కథ చెప్పాలంటే భీభత్స రస ప్రధానంగా సాగుతూ శృంగార రససిద్ధిని కల్పించవలసి వుంటుంది రచయిత. ఈ ప్రయత్నంలో మారుతి తన తొలి నవలలో తడబాటును ప్రదర్శించినా పొరబాటుకు చిక్కలేదు. నవలానాయిక ముద్దుకుప్పాయి ఒక కూచిపూడి భాగవత నాట్య కళాకారిణి, నాయకుడు సంబజ్జ గౌడ ఒక యోధుడు. వీరిద్దరి ప్రేమకథలో రక్కసి తంగడి యుద్ధాన్ని జొప్పించి, జరిపించి విజయనగరకు అపజయాన్ని, ప్రేమకు జయాన్నీ రచియిస్తాడు మారుతి.
Detail is art, but not necessarily every detail knits the plot. అయితే ఏ వివరం కథను లోతుకు, ముందుకూ తీసుకుని ఉరకలెత్తిస్తుందో ఆ కిటుకు రచయితకు తెలిసి వుండటం కళ. ఈ నవలలో చారిత్రక నేపథ్యాన్ని వివరించే వివరాలతో పాటు ఆ కాలపు సాంస్కృతిక, సామాజిక రూపం పాఠకుడి కళ్ళ ముందు నిలిపేందుకు రచయిత చేసిన కసరత్తు ముచ్చట గొలుపుతుంది.
ప్రతి నాగరికతలో, సమాజంలో Fault Lines వుంటాయి, వున్నాయి. కానీ చరిత్ర రచనలో ఆయా Fault Linesని treat, deal చేసే పద్ధతిలో గణన, స్ఫురణ, చేతన ఆ చారిత్రక రచనలోని దృక్పథాన్నీ, లేదా నిబద్ధతనీ వెల్లడి చేస్తుంది. పంచ పాదుషాల వ్యూహాలు, అళియరామరాయల పరమతసహన జీవనం, సామరస్య గతం, అందుకు భిన్నమైన అతని దారుణ మరణం, రాజ్య విధేయత కోసం ప్రాణాలకు తెగించే సంబజ్జ గౌడ, ప్రేమను చాటేందుకు సరికొత్త నట్వాంగానికి మువ్వలు సవరించుకునే ముద్దుకుప్పాయి, యుద్ధ భీభత్సానికి పరాకాష్ట పతాకగా అవనతం అయిన వలంది పాత్రల నిర్వహణ రచయిత నిపుణతే కాదు, పరిణితి కూడా.
తల్లికోట అపజయం తర్వాత, అలియ రామరాయల హత్య తర్వాత రాజ్యంలో అల్లకల్లోలం (chaos) నెలకొంది. ప్రజలకు ఎలాంటి సూచనలూ, ఆదేశాలూ, భరోసా ఇవ్వకుండా ప్రజలనుంచి నానారకాల పన్నులు వసూలు చేసి కుప్పపోసుకున్న ఖజానాను ఏకంగా ఏనుగుల మీద తరలించి దొడ్డిదారిలో పారిపోయారు పాలకులు. ఇక విజయోత్సాహంలో మునిగితేలిన ముస్లిం సేనలు హంపిని నామరూపాల్లుకుండా చేయడమే కాకుండా యథేచ్ఛగా దోచుకోవచ్చని తమ సేనలను సామాన్య జనాలమీదికి కూడా పురిగొల్పారు. ఇట్లాంటి భయానక వాతావరణంలో నవలలోని ప్రధాన పాత్రలు కేవలం తమ ప్రేమను గెలిపించుకునేందుకు తాపత్రయపడతారు. నాయిక ముద్దుకుప్పాయి ఏకంగా శతృరాజుల మనసును కరిగించి తన ప్రియుడినీ, ఇతర బందీలుగా వున్న సైనికులనూ విడిపించుకుంటుంది. నాయికానాయకులిద్దరూ యుద్ధ భీభత్సానికి స్పందించిన దాఖలాలు లేకుండానే నవల ముగుస్తుంది. అట్లా ఇటు యుద్ధానికీ, అటు ప్రణయానికీ ఇవ్వవలసినంత పాత్ర, బాధ్యత ఇవ్వడంలో రచయిత మారుతి శ్రద్ధ తీసుకోలేదు.
హంపి విధ్వంసం తర్వాత 1565 నుంచి 1614 దాకా ఏలిన చివరి విజయనగర చక్రవర్తి వెంకటపతి రాయలు. మన దేశంలో దాదాపు ఎనిమిది వందల ఏళ్ళు సాగిన ముస్లిం పాలన చరిత్రలోని చివరి అధ్యాయాలలో తల్లికోట యుద్ధం మెరిసి వెలిసిన అధ్యాయం. దక్షణాదిని తమ హస్తాల్లోకి తెచ్చుకునేందుకు నానా తంత్రాలు రచించిన పంచ పాదుషాలకు చివరి నిరసనలు విజయనగర చివరి బలహీన చక్రవర్తి వెంకటపతి రాయలు నుంచే వచ్చాయి. మతం సార్వభౌమాధికారానికి ప్రధాన సూచికగా మారుతున్న కాలం దక్షిణాదిన తల్లికోట యుద్ధం ముందటి కాలం. శైవం నుంచి మొరటుగా వైష్ణవానికి రవాణా అవుతున్న కాలం కూడా అదే. ఈ grand picture మీద చూచాయగానయినా రచయిత దృష్టి నిలపలేదు ఈ నవలలో. నిలిపివుంటే నవల మరింత నిలిచివుండేది.
ఏ కాలపు రచయిత అయినా ఆ కాలంలోని 15-45 వయసు మధ్య వున్న పాఠకుల పఠనను సులువు చేసేందుకు తమ భాషను సవరించుకోవాలి. కాలిక, చారిత్రక రచనలు కూడా ఈ వయసు పాఠకులకే చేరువ కావాలి అనే లక్ష్యం, బాధ్యత వుండాలి. ఈ నియమంతో చూసినప్పుడు ప్రణయ హంపి నవల భాష పాఠకులను దూరం చేసుకునే భాషగానే మిగిలింది. ఈ నవలా రచనకోసం మారుతి జరిపిన పరిశోధనను ప్రతిఫలించే, ఆ కాలపు జనజీవిత ఆచారవ్యవహారాలను పాఠకులకు అందించే ప్రయత్నం నవలలో పుష్కలంగా వుంది. అయితే రచయిత వాడిన చాలా పదాలకు అర్థాల పట్టీ ఇవ్వకపోతే అందాల్సినంత మందికి నవల అందదు, చెందదు. చారిత్రక నవలా రచనలో ఆ కాలపు మ్యాప్ ఒకటి సూచన ప్రాయానికయినా పాఠకులకు పొందుపరచడం కూడా పాఠకుల ఊహకు చేదోడుగా వుంటుంది. అదొక లోపం. ముద్రారాక్షసాలు పాఠకుల పట్ల చిన్నచూపుకు నిదర్శనాలే. ప్రచురణ కర్తల మరింత జాగరూకత, బాధ్యత మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం.
But nothing is fair in love and war; even when war is lost, love wins.
*
ప్రణయ హంపీ: నవల : మారుతీ పౌరోహితం : ఛాయ రిసోర్సెస్ సెంటర్: వెల 150/- : కాపీలకు: 7093165151, 040-23742711: హైదరాబాద్.
Sir
Thank you so much for your critical analysis.
మంచి పరిచయం. గొప్ప ప్రయత్నం చేసినా మారుతి కి అభినందనలు.
Thank you sir