1
దిగుడూరుపుల పసి వొణుకు
తన్నుకుబికొచ్చే
మణిగిన మొలకకోరిక
ఉక్కిరుక్కిరి మెదటి
ఇరుకు చావిట్లో
చలిమంట గాబు దూరిన పిల్లి
మబ్బురంగు పలవరింతల
పసి వొణుకు
ఎద దుడుకు
ఎదురొత్తుల మెత్తల
సుతిదూదుల విసుర్లు
దాగిన చలిచీమ కొండెకంటిన
అరపలుకు చక్కెర
తేమచుక్క
ఎక్కడక్కడ ఉప్పటి తేనె
తడిసిన ఒరుపుల
కావెరుపు
రానీ… చిట్టుడుకు
దిగుడూరుపులు
రేగనీ… నా జెబ్బనూగు
తూగు నీ… హొయల
లోవల ఊయల
దొంగ కనుకొలకుల మత్తుగుడ్లని
వొయ్యారి జావళీ ఆడనీ…
అటూనిటూ
- ••
2
చెంజీకటిదివ్వె
బూడిద ఆవలించిన నును ఉక్కగది
ఉసురు అంటుకున్న వేలికొసలూ
నులిదూదితోలి ఆవలూ
గరువు పొగరెక్కిన
అల్లిపళ్ళ వగరునూగు
తాకే బిడ్డనోరు
నేల ఈనే మబ్బుల
లోగింతల రొద
చిమ్మెటలనది పాడే
రేయి పాట
పొగతీగలు పాకే
ముద్దు మురిసే మూతి
చిలికిన జుంటితనువు
ఊరే నేతికంపు
వొక పాంబాత గుండెసద్దుల
మునిగిన జోడాట
ఉబికే కుదురుగుంత మాటేసి తిరగెక్కి
కళ్ళెం జాడించే
మబ్బు పాయల
కొండేరు తుంపర చెంపల
నల్లమందు బుర్ర ఇది.
*
Add comment