వెలుతురు పళ్ళతో
వాన వల కొరుక్కుంటూ
చీకట్లోకి చొచ్చుకుపోతూంది బస్సు,
సృష్టి రహస్యంలోకి
మానవ మేధలా.
బస్సు నిండా మనుషులు
మెదడు నిండా ఊహల్లా.
ఉద్ వేగంతో బస్సు ఒళ్ళంతా
కంపించిపోతూంది.
చుట్టూ లోకం
చల్లారిన ఏకాంతంలో ములిగిపోగా
బస్సులో మాత్రం
వెచ్చటి సంఘీభావం నిలబడింది.
చిక్కటి సంపెంగ తావి
పడగవిప్పి, పైకి సాగి,
ప్రయాణీకుల తలల మీద
చుట్ట చుట్టుకు కూచుంది.
బట్టతలలాంటి బస్సు నెత్తిమీద
చీకటి చినుకులు చిందులు వేశాయి.
హఠాత్తుగా చైతన్యానికి
బ్రేక్ పడింది.
రైలు గేటు పడింది.
బస్సు గురక పెడుతూ
నిలబడే నిద్రకుపక్రమించింది.
నుదుట పట్టిన చెమటని
వైపర్ల చేతుల్తో తుడుచుకుంటూ.
వాన విడవకుండా
బస్సు తల మీద
తబలా వాయిస్తూంది.
దించిన పరదా సందుల్లోంచి
పొంచిన సంపెంగ తావి
పాక్కుంటూ వానలోకి వెళ్లిపోయింది.
నిద్రలోకి జారుకుంటున్న
మనుషుల ఉచ్ఛ్వాస నిశ్శ్వాసాలు
దెయ్యాల గుసగుసల్లా ఉన్నాయి.
బస్సంతా చల్లారిపోయి
చెమ్మగిల్లిన అగ్గిపెట్టిలా ఉంది.
కడుపునిండా పిల్లల్తో
ఈనడానికి సిద్ధంగా ఉన్న
తేలు తల్లిలా ఉంది.
ఎంతో సేపు అలాగే
నిశ్శబ్ద సరసులో తేలియాడాక
అప్పుడు పెనుశబ్దంతో
రైలు వచ్చి
దాన్ని నిద్ర లేపింది.
రోడ్డు తన అడుగులకి
నల్లని మడుగులొత్తుతూండగా,
ఒక్క తుమ్ము తుమ్మి
బయలుదేరింది బస్సు,
విసుగులేని వాన వెంటరాగా.
(కె. గోదావరిశర్మ గారి “అంతర్వాహిని” కవితా సంపుటి నుంచి)
రాత్రిపూట వానలో బస్సు ప్రయాణం మనలో చాలా మందికి అనుభవంలో ఉన్న విషయమే. ఈ కవి రాత్రి పూట వానలో తాను చేసిన ఒకానొక బస్సు ప్రయాణానుభవాన్ని చక్కని కవితగా మలిచారు.
ఒక కవి తన అనుభవంలోనికి వచ్చిన విషయాల్ని అంతే సాంద్రతతో పాఠకుల అనుభవంలోనికి తీసుకు రావడానికీ, తాను చూసిన, తాను దర్శించిన దృశ్యాలను పాఠకుల మనసుల్లో బొమ్మకట్టించడానికీ, సరియైన శబ్దాల ద్వారా చిత్రరచన చేయడాన్ని భావచిత్ర రచన అంటున్నారు విమర్శకులు.
కవి పొందిన పంచేంద్రియ సమన్వితమైన అనుభవం అతని సంస్కారం చేత అతనికొక అనుభూతిగా పరిణమిస్తుందని, ఆ అనుభూతికి ఆకృతినివ్వడానికి కవి భావచిత్ర రచనకు పూనుకుంటాడని అంటారు కవిత్వ విమర్శకులు. “రాత్రి బస్సు ప్రయాణం” అనే ఈ కవితలో ఈ కవి చక్కని భావచిత్ర రచన చేయడాన్ని గమనించవచ్చు.
ఈ కవితను అనేక భావచిత్రాల సమాహారంగా నిర్మించారు కవి. తద్వారా తన అనుభవాన్ని మన అనుభవంగా మార్చగలిగారు. బస్సు ప్రయాణంలో తాను చూసిన దృశ్యపరంపరను పాఠకులకు ప్రత్యక్షం చేయగలిగారు. తన ప్రయాణానుభవపు సమగ్ర చిత్రాన్ని చక్కని భావచిత్రాల ద్వారా ఆవిష్కరించారు.
చక్కని భావచిత్రాలున్న రచనగా ఈ కవిత కవితా ప్రియులను మిక్కిలి అలరిస్తుంది.
*
Add comment