1
నాన్నా నొప్పిగా ఉంది…
అప్పుడు కాదు
నిన్నునోరార
నా నాన్నా అని
పిలిచినప్పుడల్లా…నొప్పే….భరించలేని నొప్పిగా ఉంటుంది!
సంసారం తెలుసు
వ్యభిచారం తెలుసు
బలాత్కారం తెలుసు
అత్యాచారం కూడా తెలుసు
కాని నాన్నా, ఇప్పుడు
నువ్వాడే ఆటను ఏమనాలో తెలియని పసిమొగ్గను నాన్నా…
నాన్నా,
నీకేమో
క్షణికాల అనుభవం
ఒక చీమిడి
ఒక తుమ్ము
ఒక ఉమ్ము
నాన్నా,
నాకేమో
ప్రసవవేదన
రంపపు కోత
ఎండిన గొంతు
రాజవ్రణం
రక్తస్రావం
మరణపాసం
జవాబురాని అరుపు…..మొగ్గను నాన్నా…
ఇప్పుడిప్పుడే తొడిమకు తొడిగిన పసి మొగ్గను నాన్నా!
నాన్నా…..ఈ పిలుపు సరైనదేనా
లేదా నా బిడ్డకే నాన్నవి అనాలా
నన్ను చంపి మంచి పనిచేశావ్,
లేదా వావివరసలు చచ్చిపోయేవి!!
2
అమ్మీజాన్ – ఈద్ కా చాంద్
వరేయ్ రాజ్గా, నువ్వు పెద్దమోళి గాడివిరా కొడ్క
ఇదిగో ఈ ఒక్క ముద్ద తిన్పోరా, బిడ్డా.
సన్నని నెలవంక రానైతే వచ్చింది, కానీ వెన్నెలనింపే అమ్మేది. అమ్మీజాన్ లేని పండుగ ఊహించలేను.
నీ నోటికాడ కప్పులో నాకు పంచె గుక్కెడు ఆ టీనీళ్ళు, తినే తినే ఆ గిన్నెలో నాకోసం మిగిల్చిన బువ్వేది, ఆ అమృతమయి ఎంగిలి చెయ్యేది.
మాటల నవ్వుల మధ్యలో హఠాత్తుగా, ఒరేయ్ ఒక్క నిముషం మై నమాజ్ పడికె హాతుమ్ ..తూ కిదర్భి భాగోమత్ రే అని లేచి వెళ్లే నువ్వు, ఈసారి మళ్ళీ తిరిగి రానే రాలేదు అమ్మీ, క్యా బాత్ హై మెరెలీయే ఇత్తా దువా అడుగుతున్నవా ఆ అల్లాహ్ ను.
ఇసుకురాశి లాంటి ఇంత పెద్ద కుటుంబాన్ని ఇన్నాళ్లు నీ గుప్పిట్లో దాచావు, ఇప్పుడు మాకు ఆ ఖాళీ కుర్చీ, నీ చేతికఱ్ఱ ఇవేనా మాకు జ్ఞాపకాల దిక్కులు.
ఓయ్ బషీరా నీ తమ్ముడొచ్చాడే అనే గొంతు, ఇప్పుడు ఎక్కడో మా తరుపున అజాన్ వల్లిస్తూ ఉండొచ్చు
నీకేంది మహారాణివి, ఈ హైస్కూలు గ్రౌండ్ అంతా నీదే అంటే, కరణాన్ని పిలిపించి రాసివ్వరా అనేదానివి. హైస్కూలేకాదు, ఎలిమెంటరీ స్కూల్ తో పాటు ఈ ఊరు కూడా రాపిస్తా, ఓ సారి వచ్చిపోరాదే అమ్మీ.
ఎందమ్మో ఆ కళ్ళల్లో మెరుపులంటే, బెంగుళూరునుండి నీ బడే ఆపా, సాయిబాబా మాము ఆయేరే అని మురిసె దానివి.
తన కళ్ళముందే డోర్ డెలివరీ అంటూ నా భుజాన 25కేజీల బియ్యం మూట, రెండు సేతుల్లో చెరో ఆయిల్ ప్యాకెట్ సంచులు… కొడ్క అని దుఃఖపు ముసలి కళ్ళు.
పట్నంలో నా రాజసౌధం, నా సోకు, నల్గని నా చొక్కాకు ఆత్తిన అత్తరు పొగరు యాదొచ్చి గుండెలవిసేలా గొల్లెట్టి, వద్దు బిడ్డా నీకి కష్టం, పో కొడ్క హైదరాబాద్ పో, అమ్మకోసం ఎందుకురా ఇంతగన కష్టం పో బిడ్డ తిరిగి నీ కొల్వ్కు పో అన్ని ఎన్నిసార్లూ మొత్తుకుందో అమ్మీజాన్.
ఇప్పుడు మాకు కొసరి కొసరి ఖీర్ కౌన్ తినిపిస్తారు
మళ్ళీ ఎండిన ఈ డొక్కల్లో తీపిదనం ఎవరు నింపుతారు.
నాదేకులమో, నీదేకులమో, ఆ మురుమళ్ల రాఘవగాడిదేకులమో, కన్న బిడ్డలెక్క పెంచి
నువ్వు సచ్చినంక కూడా మాదే మతమో తెల్వకుండా సేస్తివి అమ్మీ.
నీ అన్న గపూర్, నీ తమ్ముడు సత్తార్ అంటూ తన పేగుకి నన్నుకూడా పెనేసుకున్న అమ్మీజాన్ లేని ఈ రంజాన్, నాకు మాకు రంగులు వెలసిన చొక్కానే.
ఒక నిమిషం తారసపడి మటుమాయమౌతాడు
నెలపొడుపు చంద్రుడు, అదే రంజాన్ సూచన ఈ లోకానికి, కానీ అమ్మీజాన్, నువ్వు నింగిలో మా కోసం ఓ సెకను కనిపిస్తే అదే మాకు నిజమైన రంజాను పండుగ.
అమ్మీ, నేను వేసే కుళ్లు జోకులకు, కొంగడ్డు పెట్టుకుని బిస్మిల్లా ఖాన్ సెహ్నాయ్ లెక్క పడి పడి నవ్వుతావ్వే, గట్లా ఓ సారి నవ్వి పోరాదే, రంజాన్ చేస్కుంటా.
ఇన్ షల్ల్లాహ్
సల్లగుండండ్రా అంటూ పండగపూట మా నెత్తిన పెట్టే ఆ చేతులేవి.
తెల్లరగట్లా సెహ్రీఖాన్ బృందం,
నిద్రపోతున్న వారు లేచి అల్లాను ఆరాధించండి అని వీధుల్లో గట్టిగా అరుస్తూ సంచరిస్తున్నారు. తిరునాళ్ళలో తప్పిపోయిన పసిపిల్లోడులా గపూర్ గాడు, నేను, ఆ బృందమెనక పరుగులెట్టి సెహ్రీఖాన్ కు చేతులు జోడించి మా అమ్మీజాన్ ను చూపెట్టావా అని ఉబికిన కళ్ళతో గోజాడుకున్నాము.
నాకు నేను గుల్దస్తాగ నీ సమాధి ముందు మోకరిల్లాను, కొడ్క అని ఓ పాలి పిలువే, ఈ పండుగ పూట.
సర్లే అమ్మీ,
నువ్వెక్కడుంటే అక్కడే రంజాన్,
నువ్వెప్పటికి ఈద్ కా చాంద్ వే , మా అమ్మీజాన్.
*
Add comment