రచన, ఆచరణకు తేడాలేని వెంకట్‌

చిన్న వయసులోనే కన్నుమూసిన కొంపెల్లి వెంకట్ గౌడ్ కి నివాళి

ఆంధ్రాధిపత్యం ఏ రూపంలో ఉన్నా ధిక్కరించిన ఉద్యమజీవి. ఉక్కు సంకల్పంతో తెలంగాణ హక్కుల కోసం కొట్లాడిండు. ఉద్యమ యోధుల యాదిని చరిత్రగా రికార్డు చేసిన బయోగ్రాఫర్‌ కొంపెల్లి వెంకట్‌ గౌడ్‌. చరిత్రను బహుజన దృష్టి కోణంతో వెలుగులోకి తేవాలని గత రెండున్నర దశాబ్దాలుగా తపన పడ్డాడు. కవిగా మొదలయిన వెంకట్‌ గౌడ్‌ జీవితచరిత్ర కారుడిగా రాటుదేలిండు. వెంకట్‌ గౌడ్‌ ఇవ్వాళ తుదిశ్వాస విడవడంతో బహుజన చరిత్రకు, సబాల్టర్న్‌ దృక్కోణ అధ్యయనానికి తీరని లోటు ఏర్పడింది. ధిక్కార గొంతుక మూగవోయినట్టయింది. నా మట్టుకు నాకు బహుజన చరిత్ర మూలాలు ఎరిగి, ఆ రచనల్లోని మంచి, చెడ్డలను ఎరుక చెప్పే చారిత్రక విమర్శక మిత్రుణ్ణి కోల్పోయినట్టయింది.  నల్లగొండ నడిచే విజ్ఞాన సర్వస్వం నోముల సార్‌ అనుభవాలను ‘నోముల సార్‌ అన్‌టోల్డ్‌ లెసన్స్‌’ (2010) పేరిట పుస్తకంగా తెచ్చిండు. (దివాకరుని కృష్ణమోహన శర్మతో కలిసి). ఈ పుస్తకాన్ని ఎడిట్‌ చేస్తూ ‘‘సార్‌ యాక్సెంట్‌ను (బహుభాషలు) యథాతథంగా అక్షరీకరించడం పూర్తిగా సాధ్యం కాదు.’’ అంటూ రాసిండు. అంటే భాషకు అందునా తెలంగాణ భాషకు అత్యంత ప్రాధాన్యత నిచ్చేవాడు.
సాహిత్య మర్మాలు, పదాల యొక్క మూలాలు, మనుషుల యొక్క స్వభావాలు, కవుల లౌల్యాలు, రచయితల లాలూచీ, మిత్రుల మద్యపాన బలహీనతలు, చరిత్రపట్ల మక్కువ, ఓటర్ల చైతన్యం పట్ల ఆసక్తి ఇట్లా అన్నింటి గురించి తెలిసిన మానవత్వమున్న మనిషి. తన బలం, బలహీనత అన్నీ తెలిసినవాడు కావడంతో ప్రతి విషయాన్ని అధ్యయనం చేసి అందించేవాడు. విమర్శించాల్సి వచ్చినప్పుడు ఎవ్వరినీ స్పేర్‌ చేసేవాడు కాదు. కరాఖండిగా, ఖుల్లం ఖుల్లా విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేవాడు.
దాశరథి, కాళోజి అవార్డులు ఎక్కువగా ఉత్తర తెలంగాణ వారికే వస్తున్నాయి. దక్షిణ తెలంగాణ కవులు, రచయితలు ఈ ఆధిపత్యాన్ని నిరసించాలి. ఈ ప్రాంత కవులు రచయితలను కూడా ప్రభుత్వం గుర్తించి, గౌరవించాలి అని ఇటీవల మా మధ్య జరిగిన సంభాషణల్లో తేల్చి చెప్పిండు. ఏ విషయమైనా మొహమాటం లేకుండా తనకు లాభమా? నష్టమా? అని లెక్కలేసుకొని గాకుండా ముక్కుసూటిగా చెప్పటం అతని నైజం. అందువల్ల అతనికి సాహిత్యంలో (ఫేసు బుక్ ద్వారా) చాలా మంది శత్రువులైనారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా పత్రికలు ‘తెలుగు రాష్ట్రాలు’, ‘తెలుగమ్మాయి’ పేరిట రాయడాన్ని తీవ్రంగా నిరసించిండు. ఇట్లా తెలంగాణ ప్రతిభను ఆంధ్రా మీడియా వెలుగులోకి రాకుండా తొక్కిపెడుతుందని చెప్పేవాడు. తెలంగాణ అమ్మాయి ప్రతిభ చూపించినపుడు మీడియా తెలుగు అమ్మాయిగా చెప్పి, ఆంధ్రా ప్రాంతం వారు రాణిస్తే ఆ జిల్లా పేరు లేదా, ఆంధ్రా అమ్మాయి అని రాయడం ద్వారా ఆంధ్రా మీడియా ‘ఆంధ్రప్రదేశ్‌’ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నదని వందల ఆధారాలు ఎత్తి చూపించిండు. స్వయంగా ఒక లిస్ట్‌ తయారు చేసి తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఆంధ్రా పదంతో చలామణి అవుతున్న సంస్థలను, సంఘాలను తప్పుబట్టిండు. వాటి పనిబట్టాలన్నాడు.
ఉమ్మడి నల్లగొండ జిల్లా కలుకోవ గ్రామంలో అంతమ్మ, లింగయ్య దంపతులకు మొదటి సంతానంగా జన్మించిన (1973, మార్చి 15) వెంకట్‌ గౌడ్‌ పదమూడేండ్ల వయసు వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత తాతతో పాటు నల్లగొండకు వచ్చి అక్కడే చదువుకున్నాడు. డిగ్రీలో నోముల సారు ప్రోత్సాహం, సహాయ, సహకారాలతో సాహిత్యంవైపు మొగ్గిండు. ఆ తరువాత ‘నీలగిరి సాహితి’ సంస్థ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. అంతేగాదు ఆ సంస్థ ప్రచురించిన ‘బహువచనం’లో ధిక్కార గొంతుకను వినిపించాడు. షార్ప్‌గా, నిర్భీతిగా బహుజన జీవితాలను ముఖ్యంగా గౌడ జీవితాల్లోని వెతలను కైగట్టిండు.
తాను గౌడ జీవితాలను కైగట్టడమే గాకుండా మొత్తం గౌడ సాహిత్యాన్ని చరిత్రకెక్కించేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం ఎన్నో ఊర్లు తిరిగి పాతతరం వారి రచనలు సేకరించిండు. వాటిని భద్రపరచడం కష్టమయితుందని నాతో ఇటీవల వాపోయిండు. ఇట్లా సేకరించిన వాటిలో మామిండ్ల రామాగౌడ్‌ రాసిన ‘గౌడ ప్రబంధం’ లాంటి అనేక రచనలున్నాయని చెప్పిండు. అయితే దురదృష్ట వశాత్తు ఈ పుస్తకాలు రిటైరైన ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తీసుకొని తిరిగి ఇవ్వలేదని చెప్పిండు. అట్లాగే కొలనుపాక ‘గౌడ మఠం’ని పునరుద్ధరించి, అప్పటి తాళపత్రాలను, శాసనాలను పరిశీలించి బహుజనుల ఉమ్మడి చరిత్రను తిరగరాయాలని అభిప్రాయపడ్డాడు.
నూనూగు మీసాల యవ్వనంలో, డిగ్రీ విద్యార్థిగా ‘నీలగిరి సాహితి’ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నాడు. ఈ సంస్థ తరపున సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ ‘బహువచనం’లో వెంకట్‌ గౌడ్‌ కవిత ‘ముస్తాదులు కదులుతున్నాయి’ కవిత చోటు చేసుకున్నది. అయితే ఈ సంస్థలో అగ్రకుల ఆధిపత్యం కొనసాగుతున్నదని నిరసిస్తూ దానికి ప్రత్యామ్నాయంగా మిత్రులతో కలిసి ‘గోసంగి’ సంస్థను ఏర్పాటు చేసిండు. దీని ద్వారా ‘మేమే’, ‘మొగి’ లాంటి విలువైన కవితా సంపుటాలు వెలువడ్డాయి.
ఆధిపత్యాలను నిరసించడానికి ఎన్నడూ వెంకట్‌ గౌడ్‌కు సెకండ్‌ థాట్‌ లేకుండే. తన సామాజికవర్గంలోని వారి నిర్బాధ్యతను కూడా స్పేర్‌ చేసేవాడు కాదు. అదే సమయంలో తన గౌడ కులంపై అత్యంత ప్రేమను ప్రకటించేవాడు. ఈ సందర్భంగా ‘ముస్తాదులు కదులుతున్నాయి’ అని వెంకట్‌ గౌడ్‌ రాసిన కవితను గుర్తు చేసుకోవడం అవశ్యం. ఆ కవిత ఇలా ఉన్నది.
“మొలకు ముస్తాదు కట్టి
చెట్టుకు మోకేసి
బతుకులో ఒక్కొక్క ఆశ
ఒకొక్కక్క అంగై పాకుతూ రక్తం ముద్దవుతున్నాం
మెట్టు తాడు మీద ఆగి
గీసకత్తి నూరుకొని
గెలల్లో కల్లువూటని తడుముకొని
మెరల్ని తీసి
రేపటికి పదును పెడతాం
మా పటవలోని కల్లులో
ఆ రోజు జీవితాన్ని చూసుకుంటాం
గాలి దుమారం…
ఉరుముల జడిలో
చెట్టు కూలిన చప్పుడేమోగాని
వెంకయ్య తాతే ఫెళ్ళున విరిగిపడ్డ శబ్దం
ఆకాశంలో మృత్యువుతో యుద్ధం చేసే కులవీరులం మేము
రకం కట్టేది మేమైతే
చెట్టు మీద జులుం వాడిది
కల్లు గీసేది మేమైతే
ముంతమీద ధర ముద్రించేది వాడు
ఆపై అబ్కారోడి నిఘా
కాటమయ్య పెదవి విప్పకుంటే
కులపెద్దకు మేం… రాజకీయ మెట్లవుతుంటే
గీతకు పనికిరాని చెట్లలా మిగిలిపోతున్నాం
కల్తీ చేసేది దళారోళ్ళయితే
కల్తీ కులమని పేరు మోసేది మేము
మాలో కసి తాటి పీచై రగులుతుంది
‘ఎండ’ని
చల్లని ముంజలతో చల్లబరిస్తే
మూతి తుడుచుకొని
తాటిమొద్దుగాళ్ళనీ, కల్లుకంపుగాళ్ళనీ
ఎగతాళీ చేస్తుంటే
మా ‘కల్పవృక్షం’ ధారలతో
అలసటనో, జల్సానో తీర్చుకున్నోళ్ళు
మా ఆడోళ్ళని వొళ్ళమ్ముకున్నోళ్ళుగా
పరాచకాలాడుతుంటే
చిరత బద్దలతో కుల్లబొడవాలనిపిస్తుంది
ముంజకొడవళ్ళతో
ముక్కలు, ముక్కలుగా నరకాలనిపిస్తుంది.” అంటూ గౌడన్నల వెతలను, ధిక్కారాన్ని లెక్కగట్టిండు.
నిజానికి వెంకట్‌ గౌడ్‌ ఆరోగ్యంపై పెట్టాల్సినంత శ్రద్ధ పెట్టక పోవడంతోనే నడీడులో ఇవ్వాళ మనకు దూరమయిండు. ఉద్యమకారులు తమ ప్రాణాలను కాపాడుకున్నప్పుడే సమాజానికి మరింత ఎక్కువగా సేవ చేయడానికి వీలవుతుంది. ఇది సాహిత్యోద్యమకారుల బాధ్యత కూడా. నేను చేస్తున్న పరిశోధన, రచనలను ఇష్టపడే ప్రేమైక మూర్తి కొంపెల్లి వెంకట్‌గౌడ్‌కు కన్నీటి వీడ్కోలు.
*
ఫోటో: కందుకూరి రమేశ్ బాబు 

సంగిశెట్టి శ్రీనివాస్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు