యెవుడ్రా పద్దుకు మాలినోళ్లందరికీ వోటు ఇచ్చినోడు?

వోనేట్రా…యెలక్సన్ కమీషన్లాగ ఒక దగ్గిర పడతంది, మరొక దగ్గిర మబ్బూ,మేఘం గర్జనా హడావిడి చేసి గాలితోటి తేలిపోతంది. అలాగ యెలిపోయి  అప్పోజిషనోళి ఊళ్ళల్ల కురిసెస్తంది. ప్రక్రుతి గూడా ధర్మం తప్పి నడిస్తే…ఇక రాజ్యాంగం  ఉండీ నాభమేటర్రా…? సూత్తన్రు కదా..? తొలి, ప్రధమం మన మడకల కేసి మేఘం దిగలేదా?  మబ్బులు కమ్మలేదా? మెఘాలు గర్జించలేదా? కొసకి యెన్ని రోజులయినాయి… నెలా పదిరోజులయిపోయినాయి- యెలక్సన్ కమీసనూ, వొర్సమూ కుమ్మక్కయిపోనాయి. కమీసనోళ్ళు రిజల్టు సెప్పరూ, వొర్సమేమో మన మడకన కురవదు! యెండ సంపెస్తంది. ఉక్కబోత ఉడికించెస్తంది. యేటవతాదోనని గుండె కాయ ఒక పక్క డబడబ కొట్టుకుంటంది.

వోన పడతాదో పడదో…వోట్లు పడ్డాయో,లేదో- ఇంత టెన్సనేటర్రా? ధరమ్మా? యేని మీద ముద్ర సూపుతాడే గాని ఒక్కడు దేనికి ఓటేసినాడో సెప్పడు. నోట్లిచ్చినోళికి యెయ్యిమా – అనంతాడు, మరి అవతలోడూ నోట్లిచ్చినాడుగా…? రెండుపక్కలా పుచ్చీసుకున్నారు. ఉంకోపక్క పసుపూ,కుంకమ పదేసి వేలు పడ్డాయి గావాల బ్యాంకు నించి…మరి యెవులికి యేసి ఉంతారు? సెప్పరు! వోన కురవదు. యెలక్సన్ కమీసన్ రిజల్టు ఇప్పదు.వోటరేమో గుట్టు ఇప్పడు…ధర్మం తప్పి నడస్తందర్రా లోకం – అని గత నెల పది రోజుల నుండీ మా దివాకర్ నాయుడు మాసెడ్డ గింజుకుంటన్నాడు. వోనంతాడు, రాజ్యాంగమంటాడు,యెలక్సన్ కమీషనంటాడు…కలగాపులగంగా మాటాడతాడు. ఇంట్లో ఉండడు. ఈధిలోకి వొస్తాడు. ఈధిల యెవుడు యెదురు పడ్డం తప్పు…ఆడ్ని పట్టుకుంటాడు- వోననీ, రాజ్యాంగాన్నీ,యెలక్సన్ కమీషన్నీ కలిపి దులుపుతాడు. యెదురుపడినోడు గానీ మెతకగా ఉంటే – నీకు ధర్మమేనా? వోటుకి నోటు అడగొచ్చా? అడిగినోడివి రెండు పక్కలా పుచ్చీసు  కోవచ్చా? ఇలాగయితే … ప్రజాస్వామ్యం యేమయిపోతాది? దేశం యేమయిపోతాది? ప్రపంచ దేశాలు మన దేశం గురిండి యేమనుకుంటాయి? యెటుమంటి దేశిమ్మనది? దానమడిగినోడికి శరీరం లోని కండ,కండా కోసి ఇచ్చిన శిబి సెక్రవొర్తి యేలిన దేశిమ్మనది! విద్య నేర్పక పోయినా అడిగినాడు కదా గురుదక్షిణ అని బొటన వేలిని నరికిచ్చిన యేకలవ్యుని నేల మనది. కాసాయిం కట్టుకున్న మునీస్పరునికి ఇచ్చిన మాట కోసరం రాజ్జేన్నీ,పెళ్ళం,పిల్లల్నీ పోగొట్టుకున్న హరిచ్చెంద్ర మారాజు తిరుగాడిన భూమ్మనది.( మారాజుకి రాజ్జెం వొచ్చిందనుకో, తరాత)

గోవుని పూజిస్తాం. గోవుని సంపినారని అనుమానం వొస్తే మాలమాదిగల కుళ్ళబొడిసి సంపీసి,ఇల్లు కూల్చీ గోమాతకి నేయిం సేసే మహనీయుల గాలి నీకు సోకలేదా? ఆడోళ్ళని దేవతల్ని సేసి గుళ్ళల్ల,  ఇళ్ళల్లా ఉండమని, బయటకి వొస్టే గుడి కూడా పదిలం కాదమ్మల్లారా ( అయేషా లాగ అయిపోరా?) అని  బుధ్ధి సెప్పి మహిళల భద్రతకు రుద్రాక్షమాలా కంకణాలు కట్టుకున్న రుషులు తారసపడలేదా? మేఘం యెత్తితే ఆకాశిమంతా యెత్తాల! వోన కురిస్తే భూమండలమంతా కురవాల! అంతే! అప్పోజిషనోలిదే ఆకాశిమా? యేటిది? కమీషనుకి అన్ని పార్టీలు సమానమ్ కాదా? రూల్సు లేవా? రాజ్యాంగం లేదా? సెప్పురా? ఇదేన్రా ధర్మం? సెప్పురా? సెప్పవు. యెంత తీసుకున్నావో సెప్పవు. యెవుళికి వోటేసావో సెప్పవు. ఆగు,ఆగంతావు. వొర్షాకాలం అయిపోయీదాకా ఈ మాటే సెపతావా? సెప్పురా అని వాడ్ని దమాయించుతాడు. వాడు బుర్రా,పిర్రా గోక్కొని, దివాకర్ నాయిడ్ని దీనంగా చూసి…పాపం యెలాంటి నాయుడు? యెలాంటి వాక్కు? యెలాంటి రూపురేకలు…! యెలక్షన్ యెంత పని చేసింది…నాయుడ్ని!

అనాదిమనాదోళ్ళతోటి మాటాడనోడు, అటు పదడుగులూ,ఇటు పదడుగులూ యెడం నిలబెట్టేవోడు మనుసుల్ని! యెదురుగ కళ్ళెత్తి సూసే మానవుడు ఊరిల లేడు. నాయుడు కళ్ళకి ఆనినదంతా నాయుడు ఇలాకాలోకి యెలిపోయీది! నాయుడి గొంతుక ఇనబడితే సెట్లమీద పిట్టలు యెగిరిపోయీవి! పాపం నాయుడు… ఇలాగయి పోయాడేటీ … అని మాసెడ్డ కనికారంగా సూసి – పర్లేదు బావూ, రెండు రోజులాగండి, వోనలొస్తాయి. కార్తిలు వొచ్చీదాకా ఆగాల బావూ. వోనలేటి…వూర్లోని అనాదిమనాదోళ్ళా…నువ్వు పిలగాన వొచ్చేస్తాయి? అని బహు వినయంగా చెప్పేవోడు. ఆ సమాధానం దివాకర్ నాయుడికి నచ్చేది కాదు. అతనికి కావాల్సింది అదికాదు. దాంతో చిర్రెత్తేది. నిత్యం చిరాకే అతనికి. అతని పార్టీ వాళ్ళు అతన్ని – చిరాకూ అని చాటుగా పిలుచుకుంటారు. పార్టీ అధినేత కూడా అతని చిరాకుకి భయపడతాడు. దివాకర్ నాయుడికి భయమంటే చిరాకు. భయపెట్టే వాళ్ళంటే చిరాకు. రూల్సు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారని, వ్యాపారం మూయించేస్తానని  ఓ అధికారి భయపెట్టాడు. చిరాకెత్తి దివాకర్ నాయుడు ఆ అధికారి ఆఫీసుకి వెళ్ళి అతగాన్ని కొట్టి, రూల్స్ పుస్తకాన్ని చింపీసి వొచ్చాడు. తర్వాత ఆ అధికారి రూల్స్ అనేవే మర్చిపోయాడు.                                   అసలకి యెవుడ్రా ఈ సిస్టం తెచ్చినోడు? యెవుడ్రా పద్దుకుమాలినోళ్లందరికీ వోటు ఇచ్చినోడు? యెవుడ్రా యెలక్సన్ కమీసనెట్టినోడు? యెవుడ్రా యెలక్టానిక్ వోటింగ్ పెట్టినోడు?  మాకు కావల్సిన వోట్లు మేము వేసుకోకుండా నువ్వు యెయ్యిడం యేట్రా? నీకు పవరివ్వడమేట్రా? ఇవ్వబట్టే గదా…వోటుకి నోటడిగేవ్? ఇవ్వబట్టేకదా…యేలికి ముద్రేసుకున్నావ్? ఇవ్వబట్టేగదా…రెండుపక్కలా డబ్బు లాగేవ్? కడాకి యెటేసినావో టెంషన్ పెట్టావ్? యెవుడ్రా? వోరెవుడ్రా…? అని యెర్రెత్తిపోయి వాడి మీద కేకలు వేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు అటువేపు రూల్సోడు వొచ్చాడు. అంతా విన్నాడు. యేదో తోచింది రూల్సోడికి. దాంతో రూల్సోడు –

నాయుడుగారూ…శాంతించండి,శాంతించండి. మీకొక సలహా ఇస్తాను. ఆ సలహా అమలు చేయించండి – మీకు ఈ టెంషన్ ఉండదు. ఈ వోట్లూ, నోట్లూ ఉండవ్ అనన్నాడు. దివాకర్ నాయుడు అనుమానంగా చూసాడు. యెందుకంటే రూల్సోడు… తిరకాసోడు. యేదీ తిన్నగా చెప్పడు. మర్మం అతగాని శిల్పం!

మరేమీ లేదు నాయుడుగారూ… అయిదేళ్ళకోసారి యెలక్షన్ పెట్టడం. అడ్డమయిన వోళ్ళనీ బతిమాలడం, డబ్బు,సారా ఇంకింకేవేవో కర్సెట్టడం…నానా పర్రాకులూ పడతన్నారుగదా? ఇన్ని పర్రాకులూ పడినా నెగ్గిన తరాత భోగమూ,భాగ్యమూ అనుబగిస్తన్నారనుకోమ్డి…అని అనగా దివాకర్ నాయుడు అడ్డు వచ్చొ – యేమి భోగమూ,భాగ్యం రా… యెమ్మెల్లే అయితే చాల్దురా…మంత్రి అవ్వాల. అప్పుడూ నువ్వన్న భోగభాగ్యాలు. లేనపుడు నష్టమేన్రా…పెట్టుబడి రాదురా- అనన్నాడు. దానికి రూల్సోడు వొప్పుకోలేదు. పెట్టుబడి రాక పోతే ఇంత బాధ పడరండీ మీరు. అసలకి పెట్టుబడి లేని యేపారం రాజకీయమండీ! నాకు అడ్డు సెప్పకండి. యే రంగం లా రాని రాబడి ఇందలోనే వొస్తాది. ఒకసారి నెగ్గినోడు… జీవితాంతం వోడిపోయినా తరగని ఆస్తి సంపాదిస్తాడు. లేకపోతే మీరు…అమ్మా,బాబూ అని పేదారోదని బతిమాల్తారా? చేసిన పనికే సరిపోని కూలి ఇవ్వని మీరు వోటుకి నోటిస్తారా? ఇల్లు ముచ్చు బేపి లాగ ఇంటింటికి తిరగతారా? నాకు సెప్పకండి…అని విసుక్కున్నాడు.                  సరే…సలహా యేటో…సెప్పి యేడు – చిరాకు పడ్డాడు దివాకర్ నాయుడు.

మరేమీ లేదండీ. యెలాగూ డబ్బు వున్న వాళ్ళే యెలక్షన్ లో నిలబడి,గెలవగలగతన్నారు. డబ్బు లేనోడికి ఇంతే సంగతులూ,చిత్తగించవలెనే కదా! ప్రజాస్వామ్యం నిలబడాలంటే , ప్రజలకి డబ్బిచ్చి చెడగొట్టే బదులు…ఒక పని చేయించండి. అయిదేళ్ళకు ఓసారి యెలక్షన్ కమీషన్ వారికి వేలాం పాట పెట్టమనండి. యే నియోజక వర్గం లో యెవరు యెక్కువకు పాడుతారో అతనికి ఆ నియోజకవర్గ ప్రాతినిధ్యం ఇచ్చెయ్యాలి. అప్పుడు…గవర్నమెంటుకి డబ్బు వస్తుంది. యెన్నికల నిర్వహణ ఖర్చూ ఉండదు. ప్రజలూ పనీపాటూ మానేసి సభలకూ,ఊరేగింపులకూ వెళ్ళడం ఉండదు. శాంతియుతంగా జరిగిపోతాయి. మీలాంటి వాళ్ళు యెంత యెక్కువకయినా పాట పాడగలరు..! మీకీ తిప్పలుండవ్ – అనన్నాడు.

యెక్కువ పాడేసి…దివాళా తీసీడానికా చెప్తున్నావు? పాడిన సొమ్ముకి రాబడి యెలాగ వొస్తాది? అది సెప్పు అనడిగేడు దివాకర్ నాయుడు.

యేముంది? ఊళ్ళంట భూములు అమ్మెస్తావు. నదుల్లోని ఇసక అమ్మెస్తావు. కొండల్లోని ఖనిజాలు అమ్మెస్తావు. పట్నాల్లోని,నగరాల్లోనీ స్తలాలు అమ్మెస్తావు. ఇంకా చాలకపోతే నియోజకవర్గాన్ని యే దేశానికో అమ్మెస్తావు. కొనడానికి కార్పొరేట్ కంపెనీలు గెద్దల్లాగ విమానాల రెక్కల్తోటి వాలిపోతాయి. అసలకి అయిదేళ్ళు ఆగక్కర లేదు,పదవెక్కిన యేడాదే అమ్మీవొచ్చు,మిగిలిన నాలుగేళ్ళూ కాలుమీద కాలు యేసుకొని కూచోవొచ్చు…అని చెప్పాడు. దివాకర్ నాయుడు ఆలోచనలో పడ్డాడు. ఆలోచనలోమ్చి – ఒప్పుకుంటుందా…యెలక్షన్ కమీషన్? ఒకవేళ…ఒప్పుకున్నా … అన్నీ అమ్మేస్తే…ప్రజలు వొప్పుకుంటారా- అనడిగేడు.                                                                                అప్పుడు బయటపడ్డాడు రూల్సోడు – ప్రజలు కళ్ళు మూసుకొనీ దాకనే మీ వేళాం పాటలండీ! ఇప్పుడు మీరు ఆడే వోటుకు నోటూ నాటకాలండీ. ప్రజలు కళ్ళు తెరిచాక…యెలక్షన్ యేరేగా ఉంటాది. దొంగనోట్ల,దొంగ వోట్ల రాజ్యం వుండదు…అనేసి వెళిపోయాడు.

*

అట్టాడ అప్పల్నాయుడు

4 comments

Leave a Reply to Attada appalnaidu Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మీ కధ చదివుతూండగానే చాలా సార్లు నవ్వు వచ్హిందండీ. కధనమూ, శైలీ అద్భుతం. I very much ppreciated he irony too.

  • “ ప్రజలు కళ్ళు మూసుకొనీ దాకనే మీ వేళాం పాటలండీ! ఇప్పుడు మీరు ఆడే వోటుకు నోటూ నాటకాలండీ. ప్రజలు కళ్ళు తెరిచాక…యెలక్షన్ యేరేగా ఉంటాది. దొంగనోట్ల, దొంగ వోట్ల రాజ్యం వుండదు… “

    అంటున్న రూల్సోడు కన్నా అట్టాడ అప్పాల్నాయుడు గోరు లాంటొరే ( శ్రీకాకుళ ఉద్యమ స్ఫూర్తితో, గిరిజన జాతుల జీవన సంస్కృతిని అవలోకనం చేసి, పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి రచయితగా తన బాధ్యతను నిర్వర్తిస్తున్న ) తెగ టెంషన్ పెట్టేత్తన్నారండీ బాబో.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు