ఈ పక్షం కూడా విక్రమార్క బేతాళుడిలా ఒక కథతోనే మొదలుపెడదాం. కథ అంటే కథ కాదు. అందులో ఒక భాగం అనుకోండి. ఇది చదివేటప్పుడు మీకు కథలో చదవటానికి ఏదో అడ్డంపడినట్లు, ఇబ్బంది కలిగిస్తున్నట్లు అనిపిస్తోందా అని పరిశీలిస్తూ చదవండి.
శ్రమజీవి
ఆఫీస్ బస్ దిగిన వెంటనే వడివడిగా నడుచుకుంటూ సరిగ్గా ఐదు నిముషాలలో ఇంట్లో అడుగుపెట్టింది శాంత. అప్పటిదాకా టీవీ చూస్తున్న సుశీల టీవీ కట్టేసి ప్రసన్నంగా శాంత వైపు తిరిగింది.
“రా అమ్మా శాంతా! టైముకి బస్సు దొరకలేదా? ఈ రోజు లేటైనట్లుందే?” అన్నదామె.
“అవునత్తయ్యా! రెందు బస్సులు మారి రావాల్సి వచ్చింది” అంది శాంత చెప్పులు విప్పుతూ. రెండు క్షణాలు అలాగే కోడలి వైపు చూసి గట్టిగా నిట్టూర్చింది సుశీల.
“మీ మామగారికి రెండు సార్లు హర్ట్ ఎటాక్ వచ్చిన సంగతి నీకు తెలుసు కదా. పైగా ఆరేళ్లుగా షుగరు ఒకటి. సమయానికి భోజనం పడకపోతే అల్లాడిపోతారు. అందుకని ఇక నుంచి నువ్వు వచ్చేసరికి నేనే వండిపెడదామనుకుంటున్నాను” అంది ఆవిడ.
శాంతకు తెలుసు. ఇదంతా పై పై వ్యవహారమని. అయినా ఆమె అంటే కోపం లేదు.
“అయ్యో ఎందుకులెండి అత్తయ్యా. నేనే ఆఫీసు నుంచి ఇంకొంచెం త్వరగా వస్తాను. మీరు ఇబ్బందిపడకండి” అంది.
అత్తగారికి టీవీ సీరియల్ పిచ్చి. అది వదులుకోని ఆమె వంట ఎలాగూ చేయదు. అసలు అన్నీ బాగున్నప్పుడు కూడా మామగారికి వండి పెట్టింది లేదట. ఆడపడుచు గోపిక చెప్పింది. కాబట్టి ఇప్పుడు కొత్తగా సహాయం చేస్తుందనుకోవడం భ్రమ. త్వరగా వచ్చి వండిపెట్టు అని నేరుగా చెప్పకుండా ఇదొక డొంకతిరుగుడు వ్యవహారం. ఇదంతా శాంతకి అర్థమౌతూనే వుంది. అయినా ఏమీ అనలేని పరిస్థితి.
“నువ్వు ఎంత మంచిదానివి శాంతా. నీ పెళ్ళై మూడేళ్ళైంది. కట్నం మూడు లక్షలు తెచ్చావు. ఆ డబ్బు మొత్తాన్ని నా కొడుకు చెడు వ్యసనాలకు వ్యర్థం చేసినా క్షమయా ధరిత్రి అన్నట్లు వాడిని క్షమించి ఉద్యోగంలో చేరి నీ సంపాదనతో ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు.” అంటూ కళ్లు తుడుచుకుంది ఆవిడ. ఆ కన్నీరు కూడా ముసలి కన్నీరే అని శాంతకి తెలుసు. సమాధానం చెప్పేలోపే ఆవిడ మళ్లీ టీవీ పెట్టడంతో ఇంకేమీ మాట్లాడకుండా బట్టలు మార్చుకునేందుకు బెడ్ రూమ్‍లోకి వెళ్లిపోయింది.
చదివారా? ఈ కథలో ఉన్న లోపం మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. అత్తగారి సంభాషణలో ఎదో తేడా ఉంది. కొంచెం అసహజంగా ఉంది, కృతకంగా ఉంది. కదా? ఎందువల్ల? ఖచ్చితంగా ఇదీ కారణం అని చెప్పగలరా?
నాకు తెలిసి ఈ కథ చదివిన చాలామంది ఇందులో ఏదో అసహజంగా ఉంది కానీ అదేమిటో తెలియట్లేదు అంటారు. ఒకవేళ మీకు ఈ కథలో ఎలాంటి లోపమూ కనిపించకపోతే కూడా మీ తప్పేమీ లేదు. (నేను ఆ లోపాన్ని కథ రూపంలో మీకు సరిగ్గా అందించలేకపోవటం కూడా కారణం కావచ్చు). కానీ, ఎన్నో కథలలో ఈ తప్పుని చదివి చదివి, సీరియల్స్ లో సినిమాలలో ఇదే పొరపాటుని చూసి చూసి మనం అలవాటుపడటం కూడా ఒక కారణమని అనిపిస్తోంది. పెద్ద పెద్ద రచయితలే ఈ తప్పు చెయడం నేను చూశాను. ఇంతకీ ఏమిటా తప్పు?
అత్తగారు పైకి మాట్లాడుతున్నది ఒకటి మనసులో ఉన్నది ఒకటి. ఆ విషయం శాంతకి తెలుసు. అంతే కాదు. అత్తగారు పైకి మాట్లాడుతున్నది కూడా శాంతకి ముందే తెలుసు. అదే సమస్య. అర్థం కాలేదా? మళ్లీ ఒక్కసారి అత్తగారు అన్న మాటలు గమనించండి –
“నువ్వు ఎంత మంచిదానివి శాంతా. నీ పెళ్ళై మూడేళ్ళైంది. కట్నం మూడు లక్షలు తెచ్చావు. ఆ డబ్బు మొత్తాన్ని నా కొడుకు చెడు వ్యసనాలకు వ్యర్థం చేసినా క్షమయా ధరిత్రి అన్నట్లు వాడిని క్షమించి ఉద్యోగంలో చేరి నీ సంపాదనతో ఈ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నావు.”
“నీ పెళ్లై మూడేళ్లైంది” – ఈ విషయం శాంతకి తెలుసు కదా? తెలుసు
“కట్నం మూడు లక్షలు తెచ్చావు” – ఇది కూడా శాంతకి తెలుసు కదా? తెలుసు
భర్త వ్యసనాలు, ఉద్యోగం, సంపాదన, మామగారి హార్ట్ ఎటాక్, షుగర్ ఇవన్నీ శాంతకి తెలుసుకదా. మరి సుశీల ఎందుకు ప్రత్యేకంగా ఈ విషయాలని శాంతతో చెప్తోంది?
ఎందుకంటే ఆ విషయం మనకి (పాఠకుడికి) తెలియడం కోసం. అంటే అత్తగారు చెప్తున్నది శాంతకి కాదు పాఠకుడికి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రచయిత అత్తగారి పాత్రని అడ్డం పెట్టుకోని కథకి సంబంధించిన కొన్న విషయాలను పాఠకుడికి చెప్పడానికి అవన్నీ ఆ పాత్రతో పలికిస్తున్నాడు/పలికిస్తోంది. ఇందులో రచయిత గమనించికోనిది ఏమిటంటే అలా చేయడం వల్ల అత్తగారి మాటలు చాలా కృతకంగానూ, అసహజంగానూ తయారయ్యాయి.
దీన్నే ఇంకో రకంగా అర్థం చేసుకుందాం.
శాంత, సుశీలల కథ ఎక్కడ మొదలైంది? మనం క్రోనోలాజికల్ గా చెప్పుకుందాం
సుశీల భర్తకి హార్ట్ఎటాక్ వచ్చింది. టెస్టుల్లో షుగర్ కూడా ఉందని నిర్ధారణైంది. ఆ తరువాత రెండు సంవత్సరాలకి ఆమె కొడుకుకి శాంత అని ఒక అమ్మాయితో పెళ్లి జరిగింది. శాంత మూడు లక్షల కట్నం తెచ్చింది. రోజులు గడుస్తున్నకొద్దీ భర్త వ్యసనపరుడని తెలుసుకుంది శాంత. ఆమె తెచ్చిన కట్నం డబ్బంతా అతను వృధా చేశాడు. గొడవలయ్యాయి. అత్తగారు బాధ్యత తీసుకునే మనిషి కాదని ఆడపడుచు గోపిక మాటల్లో తెలుసుకుంది శాంత. ఇక తానే బాధ్యత తీసుకోక తప్పదని ఉద్యోగం చెయ్యడానికి సిద్ధపడింది. ఇంతలో మామగారికి షుగర్ ఎక్కువై రెండోసారి హార్ట్ ఎటాక్ వచ్చింది. అటు ఆఫీసు ఇటు ఇల్లు రెండింటినీ చూసుకోలేక సతమతమౌతోంది శాంత. అత్తగారు సుశీల టీవీలో వరుసగా సీరియల్స్ చూడటానికి అలవాటుపడింది. పని చెయ్యడం మానేసింది. ఒక రోజు ఆఫీస్ బస్ మిస్ అవడంతో శాంత రెండు బస్సులు మారి ఇంటికి ఆలస్యంగా వచ్చింది.
ఇదీ జరిగిన కథ. ఇందులో పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎప్పుడో మూడో నాలుగో ఏళ్ల క్రితం. మామగారికి మొదటి హార్ట్ ఎటాక్ ఎప్పుడొచ్చింది? ఇంకా ముందు. అయినా అత్తగారు శాంతతో ఆ సంఘటనలన్నీ ఆ రోజే జరిగినట్లు – “అమ్మాయి నువ్వు ఆఫీసుకు వెళ్లిన తరువాత అబ్బాయి వ్యసనపరుడై డబ్బు తగలేశాడు. మీ మామగారికి హార్ట్ ఎటాక్ వచ్చింది.” అని చెప్తున్నట్లు రచయిత రాశాడు. ఇదీ సమస్య.
ఈ కథ చదివి మనం నేర్చుకోవాల్సిందేమిటి?
కథ మొదలయ్యేది రచయిత కథ మొదలుపెట్టిన దగ్గర కాదు. కథ ఎప్పుడో మొదలై జరుగుతూ వుంది. రచయిత అందులో నుంచి ఒక శకలాన్ని మాత్రమే చూపించగలడు (అది బయోపిక్ అయితే తప్ప). అప్పుడు ఆ రచయిత ఆ కథ అప్పుడే మొదలైనట్లు, పాత్రలన్నీ జరిగిపోయిన విషయాలని తల్చుకునే నెపంతో పాఠకుడికి ఇన్ఫర్మేషన్ డౌన్ లోడ్ చేసే ప్రయత్నం చేస్తే ఆ కథలో సంభాషణలు అసహజంగా వుంటాయి. కథ కృతకంగా వుంటుంది.
తెలివైన పాఠకుడు ఈ అసహజత్వాన్ని వెంటనే పట్టేస్తాడు. పైన ఇచ్చిన కథలో “సుశీల టీవీ కట్టేసి ప్రసన్నంగా శాంత వైపు తిరిగింది” లాంటి వాక్యం ఏ కథలోనైనా కనిపించిందంటే నాకు గుండెల్లో రాయిపడ్డట్లు అనిపిస్తుంది. అంత తీరిగ్గా సుశీల శాంత వైపు తిరిగిందంటే కనీసం మూడు పెద్ద పేరాగ్రాఫుల లెక్చర్ ఇవ్వబోతుందని, లేకపోతే మరో పాత్రతో మాట్లేడే నెపంతో జరిగిన కథ ఒకటి మనకి చెప్పబోతోందని భయం పుట్టుకొస్తుంది. పాఠకుడు అలా ఎలా తెలుసుకుంటాడండీ అంటారేమో, దానికి సమాధానం చాలా సింపుల్. మనం నిజ జీవితంలో అలా మాట్లాడతామా? భార్య భర్త దగ్గరకి కాఫీ కప్పులు పట్టుకోని వెళ్లి – “మీరు ఐదేళ్లుగా రైల్వేలో కమర్షియల్ క్లర్కుగా పని చేస్తున్నారు…” అని సంభాషణ మొదలుపెట్టదు. ఎప్పుడైతే సంభాషణ పాఠకుడి ఇంట్లో, జీవితంలో జరిగే సంభాషణలా లేదు అని అర్థమౌతుందో ఆ పాఠకుడు ఆ కథలో నుంచి బయటికి వచ్చేస్తాడు.
మరి రచయితలు ఇలా ఎందుకు రాస్తారు? నేపథ్యంలో ఉన్న ఏదో సమాచారాన్ని త్వరత్వరగా పాఠకులకి అందించెయ్యాలి అనే రచయిత తొందరుపాటు వల్ల ఇలా జరుగుతుంటుంది. దాంతో సహజంగా అల్లాల్సిన సన్నివేశాన్ని సమాచరం నిండిన చెత్తబుట్ట చేసేస్తారు. రచయిత ఉద్దేశ్యం పాఠకుడికి ఆ సమాచారం చెప్పి సహాయపడటమే అయినప్పటికీ, ఫలితం కృతకంగా తయారౌతుంది. పాఠకులు వెంటనే ఆ పాత్రలు మామూలుగా మాట్లాడుకోవడం లేదని, ఏదో సమాచారం ఇవ్వడం కోసం ఒక ప్రదర్శన చేస్తున్నాయని గ్రహిస్తారు. ఇది పాఠకులని కథలో లీనం కానివ్వదు.
ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఒక్కటే సూత్రం – ఒక పాత్ర ఇంకో పాత్రతో మాట్లాడేటప్పుడు, ఎదుటి పాత్రకు ఆ సమాచారం అప్పటికే తెలిసి ఉంటే, దాన్ని వాచ్యంగా చెప్పకూడదు. ఆ విషయాన్ని పాఠకులకి వెల్లడించడానికి వేరే మార్గాన్ని వెతుక్కోవాలి. ఇంతే! ఇంతే అనిపిస్తుంది కానీ అంత సులభంఏమీ కాదు. ఆ మార్గాలేమిటో, ఎందుకా మార్గాలు సులభమైనవి కావో చర్చిద్దాం రండి.
మీరు ఏదైతే సమాచారం చెప్పాలనుకుంటున్నారో దాన్ని ఒక భావోద్వేగంగా మార్చి ఆ భావోద్వేగాన్ని పాత్రల మధ్య సంభాషణగా మార్చండి. ఆ భావోద్వేగం ద్వారా పాఠకులు పరిస్థితిని, సందర్భాన్ని, గతాన్ని ఊహించుకుంటారు. ఉదాహరణ చూద్దాం.
రమేష్ గట్టిగా తల విదిలించి గోపాల్ వైపు చూశాడు.
“నీకు తెలుసు కదా గోపాల్, మనం గత రెండేళ్లుగా ఉద్యోగం కోసం వెతుకుతూనే ఉన్నాము. కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే గత మూడు రోజులుగా మనిద్దరం కడుపునిండా భోజనం కూడా చెయ్యలేకపోయాం.”
సమస్య అర్థమైంది కదా? మీరే గోపాల్ అయితే ఏమంటారు? “అసలే నీరసంగా ఉంటే ఈ సోదేంట్రా?” అంటారు కదా? పాఠకులు కూడా అలాగే అంటారు. కానీ వాళ్లిద్దరిలో పేరుకున్న నిరాశ నిజం. ఆకలి నిజం. నీరసం నిజం. దాన్ని పట్టుకోవాలి.
“కడుపులో ఆకలి చచ్చిపోయి, వికారంగా ఉందిరా” అన్నాడు గోపాల్ కడుపు పట్టుకుని.
“మూడు రోజులురా! మనం ఇంత ముద్ద తిని మూడు రోజులైంది. ఎన్నాళ్లురా ఇలా?” రమేష్ గొంతు నీరసంగా ఉన్నా కళ్లలో ఎవరి మీదో తెలియని కసి కనపడుతోంది.
“వచ్చే నెలకి మనం బీయ్యే చేసి మూడేళ్లౌతుంది. పట్టభద్రులైన యువతకి మూడేళ్లైనా ఉద్యోగం ఇవ్వలేని సమాజంలో పుట్టినందుకు మనకి ఈ మాత్రం శాస్తి జరగాల్సిందేరా” అన్నాదు గోపాల్ అతని కూర్చున్న చోటు నుంచే దూరంగా ఉన్న కార్ల్ మార్క్స్ పుస్తకాన్ని తదేకంగా చూస్తూ.
పని జరిగిందా? పాఠకులకి మూడు రోజుల పస్తు గురించి, మూడు సంవత్సరాల ఉద్యోగప్రయత్నాల గురించి తెల్సిందా? తెల్సింది. అంతే కాదు, వాళ్ల గుండెల్లో బాధ, సమాజం మీద కసి కూడా కనపడింది. రేపో మాపో వాళ్లు “లాల్ సలాం” అంటారేమో అని కూడా చూచాయగా తెలిసిపోయింది. ఇదే కదా మనకి కావాల్సింది.
పాత్ర మధ్య భావోద్వేగం ఎలా పని చేసిందో, వాదన కూడా అలాగే పని చేస్తుంది. రెండు పాత్రలకి తెలిసిన విషయమే అయినా ఆ తెలిసిన విషయాల గురించి ఇద్దరివీ అభిప్రాయాలు వేరు వేరుగా ఉంటే ఆ విభేదాన్ని చర్చకి పెట్టి ఆ విషయాన్ని పాఠకులకి చేరవేయచ్చు. పాత్రల మధ్య వాదన, చదవడానికి కూడా బాగుంటుంది. ఎందుకంటే అందులో ఒకే అంశాన్ని వేరు వేరు దృక్కోణాలలో చూసే అవకాశం ఉంటుంది. పైన చెప్పిన కథనే వాదన వాడుతూ ఎలా చెప్పచ్చో చూద్దాం.
“తప్పురా” అన్నాడు రమేష్. “ ఏ సమస్యకైనా ప్రయత్నమే సమాధానం. పోరాటం కాదు”
“ఏ ప్రయత్నం గురించి మాట్లాదుతున్నావురా? మూడేళ్లుగా మనం చేస్తున్న ఉద్యోగ ప్రయత్నమా? ఆఖరికి కూలీ పనైనా చేద్దామని ప్రయత్నం కూడా చేశాం కదా? ఆ ప్రయత్నం గురించా? మనల్ని డిగ్రీ అనే ఉచ్చులో పడేసి కూలి చెయ్యడానికి కూడా పనికిరాకుండా చేసింది కదరా ఈ ప్రభుత్వం” ఆవేశంగా అరిచాడు గోపాల్.
“అందుకని ఆయుధం పడాతానంటావా? మనం ఎన్నుకున్న ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద?” అని రమేష్ అంటుంటే గట్టిగా నవ్వాడు గోపాల్.
“ప్రజాస్వామ్యమా? గోల్డ్ మెడల్ సాధించిన నీలాంటి వాడు మూడు రోజుల నుంచి తినడానికి తిండిలేకుండా ఉండాల్సి వచ్చిందంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదురా ప్రజాహంతక ప్రభుత్వం. సమాజానికి ఉపయోగపడాల్సిన యువ రక్తాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వం మారాలి…”
ఇప్పుడు కూడా పని జరిగింది కదా? పైన భవోద్వేగానికి ఇచ్చిన ఉదాహరణకు ఇది కొనసాగింపు అనుకోకండి. అలా అనుకుంటే పస్తుల గురించి, ఉద్యోగప్రయత్నాల గురించి మళ్లీ మళ్లీ చెప్పి విసిగించినట్లు అనిపిస్తుంది.
మూడో మార్గం ఇంకొకటి ఉంది. మనం చెప్పాలనుకున్న సంగతిని ఎంత తెలివిగా భావోద్వేగం, సంభాషణ, వాదనలతో కలిపి వడ్డించినా, ఎక్కడో ఉప్పుగల్లు తగులుతోందండీ అని పాఠకులు అనచ్చు. అలాంటప్పుడు ఇక తప్పదు అనేసుకుని వాచ్యంగా చెప్పడమే ఉత్తమం. కానీ సంభాషణలో కాదు. నరేషన్‌లో. మళ్లీ మనం రమేష్ గోపాల్ దగ్గరకే వెళ్దాం.
“ఏం చెద్దాంరా” అన్నాడు రమేష్ గోపాల్ పక్కన సర్దుకుని పడుకుంటూ. ఆ మెట్లకింద గది ఇరుకైనా అది వాళ్లకి అలవాటైపోయింది. ఆకలి మాత్రం మూడు రోజులైనా ఇంకా అలవాటు కాలేదు.
“రెండే మార్గాలు. ఆకలితో చావటం. లేదా ఓపిక తెచ్చుకుని తిరగబడటం.” గోపాల్ వాలుగా ఉన్న పై కప్పు వైపు చూస్తూ అన్నాడు.
“ఇంత చదువు చదివి…” ఓపిక లేక మాటలు ఆపేశాడు రమేష్. గోపాల్ నవ్వి ఊరుకున్నాడు. మూడేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కన్నా కసినే పెంచాయి అతనిలో. అంతకు ముందురోజు రాత్రే బియ్యే సర్టిఫికెట్లు తగలబెట్టాడతను.
మూడో రకంలో పాత్రలు ఏమీ చెప్పట్లేదు. ఆ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో మాత్లాడుతున్నాయి. రచయిత మాత్రం ఆకలి అలవాటు కాలేదనీ, మూడేళ్ల ఉద్యోగ ప్రయత్నాలు మిగిల్చిన కసినీ వర్ణిస్తూ మనకి విషయం చేరవేస్తున్నాడు.
ఇప్పుడు తెలుసుకున్న విషయాలను వాడుతూ మొదట్లో మనం చెప్పుకున్న శ్రమ జీవి కథని మళ్లీ రాస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా –
శాంత ఇంట్లోకి అడుగుపెట్టగానే హాల్లో టీవీలో సీరియల్ చూస్తూ కూర్చున్న సుశీల తల కూడా తిప్పకుండానే “ఏమ్మా బాగా ఆలస్యమైనట్లుందే” అంది.
ఆలస్యమైందని తెలుస్తూనే వున్నా అడగటంలో వ్యంగ్యం వుందా, నిజంగానే ప్రేమ వుందా అని క్షణం ఆలోచించింది శాంత. అంత ప్రేమే వుంటే నేను వచ్చేలోగా వంట చేసి పెట్టచ్చు కదా అనుకుంది కానీ బయటకి అనలేదు.
నేరుగా మామగారి గదిలోకి వెళ్లి ఆయన కోసం తెచ్చిన షుగర్ మందులు టేబుల్ మీద పెట్టింది. ఆయన మేలుకోనే వున్నాడు.
“హార్ట్ ప్రాబ్లంకి సంబంధించిన మందులు చెప్పడం మర్చిపోయానమ్మా. రేపు తెచ్చిపెట్టు” అన్నాడు. శాంతకి చిన్నగా నవ్వి “అలాగే మామయ్యా” అంది.
ఇలా నడుపుకుంటూ వెళ్లచ్చు. ఇందులో మామగారికి షుగర్ ఉందని పాఠకుడికి అర్థమైందా? ఆయన హార్ట్ పేషంట్ అని తెలుస్తోందా లేదా? ఈ రెండు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం వుంది. అసలు మన కథకి ఈ షుగరు, హార్ట్ ఎటాక్ అనేవి అవసరమైన విషయాలా కాదా అన్న ప్రశ్న రచయిత వేసుకోవాలి. కథకి పనికి రాని ఏ వివరమైన అది పాఠకుడికి ఇవ్వడం రాళ్లేరని బియ్యంతో అన్నం వండిపెట్టడం లాంటిది.
అది సరే, పైన మళ్లీ చెప్పిన కథలో అత్తగారికి టీవీ సీరియల్స్ పిచ్చి ఉందని తెలుస్తోందా?
“శాంత ఇంట్లోకి అడుగుపెట్టగానే హాల్లో టీవీ చూస్తూ కూర్చున్న సుశీల తల కూడా తిప్పకుండానే…”
ఇక్కడ తల కూడా తిప్పకుండానే మాట అందుకోసమే ఉంది. పాఠకులకి ఇక్కడ ఆ విషయం రిజిస్టర్ అవాలి. చాలా subtle గా చెప్పిన విషయం కాబట్టి ఇది అందకపోనూ వచ్చు. కానీ ఈ కథకి అత్తగారి సీరియల్ పిచ్చి అవసరమా? అవసరం లేని విషయం అయితే ఇచ్చిన సమాచారం చాలు. కాదూ ఇది కథకి చాలా ముఖ్యమైన సమాచారం, ముందు ముందు దీన్ని వాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఇది తెలియాల్సిందే అనుకుంటే ఇలా subtle గా కాకుండా నేరుగానే విషయం చెప్పచ్చు.
“డాక్టర్ ఎన్నిసార్లు చెప్పారత్తయ్య సీరియల్స్ చూడద్దని? అయినా మీరు మానట్లేదు” అని శాంతతో అనిపించచ్చు.
మందులు వేసుకుంటూ మామయ్య “వారం నుంచి తమిళ్ సీరియల్స్ కూడా చూడటం మొదలిపెట్టింది. చచ్చిపోతున్నా దీని సీరియల్ పిచ్చితో” అని అనచ్చు.
ఈ విధంగా, నేను ఇంతకు ముందు ఇచ్చిన మూడు పద్ధతులలో ఏదైనా ఉపయోగించి ఈ తప్పు నుంచి తప్పించుకోవచ్చు. అయితే, అలా రాయడం అంత సులభం కాదని కూడా చెప్పాను. ఎందుకంటే అలా రాయటానికి రచయిత పాఠకుడి మేధస్సుని, ఊహాశక్తిని నమ్మాలి. పాత్రల ద్వారా వాస్తవాలను నేరుగా చెప్పకుండా, రచయిత అవసరమైన సమాచారాన్ని తెలివిగా చొప్పించి రాయాలి, అదే సమయంలో స్పష్టంగా తెలిసేలా కూడా రాయగలగాలి. ఇలా రాయాలంటే కొంత తెలివి, కొంత సృజనాత్మకత, కొంత చాతుర్యంతో పాటు చాలా నియంత్రణ అవసరమౌతుంది. ఏ సంగతులు అలా చెప్పాలో ఆలోచించి ఎంచుకోవడం, వాటిని పరోక్షంగా వెల్లడించేలా సందర్భాన్ని కల్పించడం, ఇవన్నీ చేస్తూనే సంభాషణ సహజంగా సాగుతున్నట్లు ప్రేక్షకులని నమ్మించి ఒప్పించాలి. చాలా మంది ఓత్సాహిక కొత్త రచయితలు ఇక్కడే పొరపాటు చేస్తారు.
మీకు అర్థమయ్యేందుకు కథలను ఉదాహరణగా తీసుకున్నాను కానీ ఈ తప్పులు, ఈ సూత్రాలు, టెక్‌నిక్కులు – కథ, నవల, సీరియల్ లేదా సినిమాలాంటి అన్ని రకాల రచనల్లో పనికొస్తాయి. ఈ సమస్య నుంచి తప్పించుకోడానికి సినిమాలలో కొన్ని మార్గాలు ఉన్నాయి. (అవి కూడా లిఖిత సాహిత్యంలోనే పుట్టాయి కానీ సిన్మాలలో బాగా స్థిరపడ్డాయి. వాటిని అలాగే అర్థం చేసుకుందాం)
మొదటిది – enter midway, exit miday.
ఈ క్రింద ఉన్నది సన్నివేశం ఏదో ఒక సినిమాలో ఉందని అనుకుని చదవండి.
ఒక బార్ ముందు బైకులు ఆగాయి. కట్ చేస్తే ఆ బైకుల మీద వచ్చిన నలుగురు మనుషులు మసక చీకటిగా ఉన్న బారు గదిలో కూర్చుని మందు తాగుతున్నారు. వాళ్ల మధ్య ఏదో గొడవ మొదలైంది. కట్ చేస్తే హీరోయిన్ కన్నీళ్లు తుడుచుకుంటూ హాస్టల్‌లోపలికి వెళ్లగానే హీరో బైక్‌ని ముందుకు దూకించాడు. కట్ చేస్తే బార్‌లో ఇంతకు ముందు చూసిన మనుషుల్ని కొడుతున్నాడు. “ఎంత ధైర్యం ఉంటే నా పిల్లని ముట్టుకుంటార్రా” అని అరుస్తున్నాడు.
కథ చెప్పానా? చెప్పలేదు. నాలుగు షాట్స్ కలిపి చూపించాను. ఆ నాలుగు సన్నివేశాలను కలుపుకుని కథ మీ మనసులో పుట్టింది. ఇదే కథలో, నవల్లో వాడి చూడండి. పాత్రలు ఒకరికొకరు రచయిత చెప్పాలనుకున్న వివరాలు వివరిస్తూ నడిచే కథను ఇలా ఒక వాదన మధ్యలోకి, ఒక చర్చ మధ్యలోకి ఉన్నట్లుండి తీసుకువెళ్లండి. కొన్ని మాటలతో, కొన్ని సంజ్ఞలతో, భావోద్వేగాన్ని చూపిస్తూ పాఠకులే ఆ భావోద్వేగాన్ని, సందర్భాన్ని అర్థం చేసుకుని ఖాళీలను పూరించునేలా కథ చెప్పండి. పాఠకులకి ఇదంతా అర్థమైపోయింది అన్న అనుమానం వచ్చిన వెంటనే చర్చ, వాదన, అసంపూర్తి వాక్యాలను మధ్యలోనే వదిలేసి బయటికి వచ్చేసెయ్యండి. వాదన మొత్తం పూర్తై, వాదించుకున్న ఇద్దరూ తప్పులు ఒప్పుకుని, టీ తాగుతూ కాంప్రమైజ్ అయ్యేంతవరకు (కథకి అవసరమైతే తప్ప) ఉండక్కర్లేదు. మీ పాఠకులని నమ్మండి. వాళ్ల తెలివితేటలను నమ్మండి. ఆ తెలివితేటల పైన నమ్మకం ఉందని తెలిసేలా రాయండి. కొంత అసంపూర్ణంగా వదిలేయండి. అప్పుడే పాఠకులు మిమ్మల్ని, మీ తెలివితేటల్ని కూడా నమ్ముతారు.
రెండో టేక్నిక్ గురించి మళ్లీ కలిసినప్పుడు చెప్తాను. అందుకు ఆధారంగా ఒక కథా భాగం ఇస్తున్నాను. ఇందులో చెప్పుకోదగ్గ పెద్ద తప్పులు కానీ లోపాలు కానీ లేవు. కానీ ఈ కథని ఇంతకన్నా బాగా చెప్పచ్చు. మీరే ఈ కథకి రచయిత అయితే ఎలా రాస్తారో ఆలోచించండి. కథలో వున్న ముఖ్యమైన పాత్ర స్వభావం (కష్టాలలో వున్నవాళ్లను చూస్తే కరిగిపోతాడు) మార్చకుండా కథ ఎటు నడిపినా ఫర్వాలేదు. వీలైతే ఈ కథ ఎలా రాస్తారో కామెంట్ చెయ్యండి. కథ మొత్తం చెప్పాలని లేదు. ఈ ప్రారంభ వాక్యాలను ఎలా మారిస్తే కథ మరింత మెరుగ్గా వుంటుందో చెప్పండి.
కరుణ చూపే చేతులు
ఆయన పేరు కరుణాకర్. ఆయన ఎంత మంచివాడో చెప్పలేం. చెప్పాలని ప్రయత్నిస్తే కనీసం ఆరు పేజీల వ్యాసం అవుతుంది. బాధలో వున్నవాణ్ణి చూస్తే ఆయన మనసు కరిగిపోతుంది. ఎవరైనా వచ్చి ఇబ్బంది అని వస్తే డబ్బులు ఇవ్వడానికి వెనుకాడడు. ఎంతోమంది బంధువుల పిల్లల చదువులకి డబ్బులు ఇస్తున్నాడు. ఎంతో మంది ఆరోగ్య సమస్య వుందంటే సహాయం చేశాడు. జీతంలో యాభై శాతం అలాగే ఖర్చుపెట్టేస్తాడు.
ఇదే నచ్చలేదు అతని భార్య నళినికి. ముందు వద్దని చెప్పి చూసింది. గొడవపడింది. పుట్టింటికి వెళ్లిపోయింది. ఇప్పుడు విడాకుల నోటీస్ ఇచ్చింది. ఆ కేస్ విషయమై లాయర్ దగ్గరకు బయల్దేరాడు కరుణాకర్.
దారి పొడవునా ఆలోచనలే. నళిని గురించి కాదు. రెండు నెలల క్రితం అనాధ శరణాలయంలో కలిసిన పాప గురించి. ఆ పాపని దత్తత తీసుకుందామని నిర్ణయించుకున్నాడు కరుణాకర్. ఆ విషయంలోనే గొడవ మొదలై నళిని దూరమయ్యేదాకా వచ్చింది.
*
చాలా బాగా చెప్పారు సార్ . కొత్తగా కథలు రాస్తున్న నా లాంటి వాళ్లకు చాలా మంచి రిసోర్స్ ….థాంక్స్
మీరు అడిగినట్లు ప్రారంభ వాక్యాలను మర్చి ప్రయత్నించాను . 🙂
ఆయన పేరు కరుణాకర్.కరుణను నిలువెల్లా నింపుకున్న కరుణామయుడు. బాధలో ఉన్నవాడిని చుస్తే వెన్నెలా కరిగి నెయ్యి అవుతాడు.