మానవీయ అనుభూతి సాహిత్యం:బల్లెడ

సాహిత్యానికి మానవ జీవితమే కొలమానం అనేది నిజమే. అయితే దానిని ఎంత సృజనాత్మకంగా, సున్నితంగా చిత్రీకరిస్తే అంత మేలు.

నారాయణ మూర్తి బల్లెడ ఉత్తరాంధ్ర  రచయిత. నాటక కర్త. సీనియర్ జర్నలిస్టు. ఇప్పుడు  సల్వాజుడం ప్రేరణతో  సినిమా తీస్తూ తెలుగు తెరకు  దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఉద్దానం సమస్యలపై  కళింగాంధ్ర వ్యాసాలు పేరిట పుస్తకం వెలువరించారు. కొన్ని నాటకాలు రాసారు.  ఉద్దానం లోని తన మిత్రులతో కలసి ఉద్దానం ప్రచురణలు  స్థాపించి పుస్తకాలు ప్రచురిస్తున్నారు.  నారాయణ మూర్తి బల్లెడ  రాసిన ఉద్దానం కథల సంకలనం వెలువడాల్సి  ఉంది.

1 చిన్నప్పటి నుంచి పుస్తకాలు అందుబాటులో ఉండటం వలన మీకు చదవడం మీద ఆసక్తి కలిగిందా?

జవాబు : చదవదగ్గ సాహిత్యం  చిన్నప్పుడు అందుబాటులో లేదు. కాకపోతే  సాహిత్యం కాదగ్గ జీవితం నా చుట్టూ ఉండేది. ఆంధ్రా -ఒడిషా సరిహద్దులోని ఉద్దానంలో బైరిపురం అనే  పల్లెటూరు మాది. కళింగ యుద్ధ తదనంతరం ఈ  నేలలో బౌద్ధం వర్ధిల్లింది. తరువాత కాలంలో శ్రీవైష్ణవం ఈ ప్రాంతం నిండా పరుచుకుంది. ఇక స్వాతంత్య్రానంతరం ఉద్దానం పల్లెలను నక్సల్బరీ ఉద్యమవ్యాప్తి తీవ్రంగా కుదిపేసింది.  ఈ నేపధ్యాలు.. వైవిధ్యాలతో కూడిన  ఉద్దానపు కళలు, జానపద సమ్మేళనాలు నా బాల్యాన్ని సుసంపన్నం చేసాయి. జాతరలు, సంబరాలు, వేడుకలు, విషాదాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ  ఉద్దానపు శ్వాసనిశ్వాసలు.  సమీపం లోని సముద్రం  మాకు అతి పెద్ద ఆటస్థలం. చిన్నప్పటి నుంచీ  నాన్న వాసుదేవ్, అమ్మ పద్మ ఇచ్చిన ఆంక్షలు లేని స్వేచ్ఛ వీటన్నిటితో కూడిన  జీవితాన్ని అనుభూతిలోకి తీసుకోవడానికి  ప్రేరకమైంది. శ్రీకాకుళంలో డిగ్రీ చదివే రోజుల్లో కా. రా.  మాస్టారు పరిచయం అయ్యాక కథానిలయం నా  సాహిత్య సాధనా  కేంద్రమైంది.
 
2  మీరు ఎప్పటి నుంచి రాయటం ప్రారంభించారు? రాయటానికి ప్రేరకం ఏమిటి?
జవాబు : డిగ్రీ చివరి ఏడాది నుంచి నా రచనలు ముద్రితం అవుతున్నాయి.  నా వరకూ ఏదైనా విషయాన్ని తప్పని సరిగా రాయాలని అనుకోవడమే ప్రేరకం. అలా అనిపించినపుడల్లా రాసాను. ఏదో ఒకటి రాస్తుండాలి కదా అని రాయలేదు.  గ్రామాల్లో కనిపించని కట్టుబాట్లు.. అణచివేతలు   జీవితాలను ఎలా అతలాకుతలం  చేస్తాయో రాయాలనుకున్నప్పుడు మైల పడ్డ న్యాయం కథ వెలుగు చూసింది.  స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం ఒక్కటే కాదు జీవిక  వ్యూహం కూడా అవసరం అని రాయాలనిపించి గాజుగులాబీ అనే కథ రాసా. పల్లెల పరాయీకరణపై రాయాలని  ఉజ్జిడి, సోంపేట పవర్ ప్లాంట్ పోరాటం గురించి  కంబస్తం, కిడ్నీ వ్యాధి బాధితుల మరణవేదనపై   దగ్ధం యిలా కొన్ని  కథలు రాసా. కథలు పుస్తకంగా రావాల్సి వుంది. మీడియా పోకడలపై రాయాలనుకున్నపుడు బుల్లెపెట్టె  బూచాడు అనే నాటకం రాసా. ఇటీవల  సినిమా రంగంలో అవకాశం రావడంతో  సల్వాజుడుం ప్రేరణతో కథ రాసి ఆ  ఫిల్మ్ కు  దర్శకత్వం వహించా. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో వుంది. ఆయా సందర్భాల్లో కళింగాంధ్ర -ఉద్దానం సమస్యల  పై రాసిన వ్యాసాలు అలా తప్పనిసరి  రాయాలనిపించి రాసినవే . అవన్నీ కలపి  ఉద్దానం పేరిట పుస్తకం వచ్చింది. ముఖ్యంగా  సాహిత్య కళా  సృజనాత్మక రంగాల్లో ఏదైనా చెప్పాలని అనిపిస్తే   గొంతు విప్పాలని అనుకోవడమే ప్రేరకం కావాలి.
3  సాహిత్యం ఎలాంటి ప్రశ్నలను మీలో రేకిత్తించింది?ఎలాంటి సమాధానాలను మీకు ఇచ్చింది?
జవాబు:  ప్రశ్నలు రేకెత్తించడం .. సమాధానాలు ఇవ్వడం వంటివి సాహిత్యంలో ఉండవు.  సాహిత్యం సమాజాన్ని బాగుచేస్తుంది అనే భ్రమల్లో కూడా చాలామంది  వుంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ సాహిత్యాన్ని తప్పుగా అర్ధం చేసుకోవడమే అని భావిస్తాను. ఆలా అయితే  సాహిత్యం ఏం చేస్తుంది అని అడగొచ్చు. ఒక కోణం లో చెప్పాలంటే   సమాజంలో చలామణి  అవుతున్న  పనికిమాలిన విలువల్ని సాహిత్యం పరీక్షిస్తుంది. వాటి లోని డొల్లను  సృజనాత్మకంగా విమర్శిస్తుంది.  పరోక్షంగా  మంచి విలువల్ని ప్రతిపాదిస్తుంది. ఇది కూడా ఒక దశ వరకే. చివరిగా సాహిత్యం చేసే మేలు ఏమిటంటే ఏదైనా  ఒక విషయాన్ని మానవీయ అనుభూతిలోకి తీసుకురావడమో లేదా  పరివర్తనం చేయడం మాత్రమే.
4. తెలుగు సాహిత్యానికి, ప్రపంచ సాహిత్యానికి  మధ్య తేడాలు మీరు ఏమి గమనించారు?
జవాబు: ప్రపంచం లో ఉత్తమ సాహిత్యం అని చెప్పదగ్గ సృజన తెలుగులో వచ్చింది. సాహిత్య ప్రక్రియల్లో కథ ముందంజలో వుంది. నవలా సాహిత్యం కూడా తక్కువేమి  కాదు. వీటితో పోల్చితే  కవిత్వం మాత్రం పై కెగసి కింద  పడిందని చెప్పాలి. అయితే అదొక నిరంతర ప్రక్రియ.  ప్రపంచ సాహిత్యం వివిధ వాదాలకు గురైనా తనకు తానుగా పరిమితులను విధించుకోలేదు. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. ఉదాహరణకు యూరప్ దేశాల్లోని సాహిత్య కారులు   ట్రాన్స్ జెండర్స్, హోమో సెక్సువల్స్, హిజ్రాలు, ఎయిడ్స్ రోగులు వంటి వారికి  మద్దతుగా, సానుకూలంగా రచనలు చేస్తుంటారు. వాళ్ళ సమస్యల పట్ల సానుభూతి చూపిస్తూ  సృజనాత్మకంగా అక్షరీకరిస్తారు. మన దగ్గర అస్తిత్వ వాదాలే ఒకరకమైన వెనుకబాటు తనం అని భావించే   సాహిత్య కారులు వున్నారు. వాళ్లంతా పరిమితులు లేకుండా రాయాలంటే మరికొంత దూరం వెళ్లాలేమో. ఇక అస్తిత్వ వాదుల విషయానికి వస్తే   కొన్న్నిటిని వీళ్ళు  సాహిత్యంగా అంగీకరించట్లేదు. ఇలాంటివి  చాలా తేడాలున్నాయి. సూటిగా చెప్పాలంటే ప్రపంచ సాహిత్యం సాహిత్యానికే ప్రాధాన్యత ఇచ్చింది. ఇక్కడ అలా జరగడం లేదు.  సాహిత్యం పై,  సాహిత్య కారులపై ఎక్కువ ఆశలు పెట్టుకుని మొత్తంగా  నిరాశ చెందడం చూస్తాము.
5  మానవ జీవన గమనానికి సాహిత్యం ఎలాంటి ఇంధనాన్ని ఇచ్చింది అనుకుంటున్నారు?
జవాబు: సమాజ సున్నితత్వాన్ని   మేల్కొల్పడానికి సాహిత్యం దోహద పడుతుంటుంది. అయితే అది ఆయా సమాజ స్పందనలపై ఆధారపడి మాత్రమే. సాహిత్యం తనంతట తాను సంజీవనేమి కాదు. అయితే అమృత లక్షణాలున్న ఫలం లాంటిది సాహిత్యం. దానిని సమాజం ఎలా అయినా స్వీకరించ వచ్చు. సాహిత్యం అధ్బుతాలు చేస్తుందని నమ్మడం ఎంత తప్పిదమో.. సాహిత్యం తో మేలు లేదననుకోవడం అంతే పొరపాటు. సాహిత్య పరిమితులు అర్థం చేసుకోగలగాలి. అప్పుడే మానవాళికి, సాహిత్యానికి మేలు.
6  మీ దృష్టిలో ఏది అత్యుత్తమ సాహిత్యం?
జవాబు: పరిమితులు లేని సృజన ఉత్తమ సాహిత్యం అంటాను. కొన్ని వాదాలు కొన్ని రచనలనే అనుమతిస్తాయి. కొన్ని అస్తిత్వాలు ఒక రకమైన సాహిత్యాన్నే  కోరుకుంటాయి. సాహిత్యంలో ఈ రేఖలు ఉత్తమ సాహిత్య సాధనకు  అడ్డంకి అంటాను. ఇవన్నీ సాహిత్యం నుంచి ఎక్కువ ఆశించడం వలన జరిగే ప్రమాదాలు. సాహిత్యానికి  మానవ జీవితమే కొలమానం అనేది  నిజమే. అయితే  దానిని ఎంత సృజనాత్మకంగా, సున్నితంగా చిత్రీకరిస్తే అంత మేలు. సమాజ  సున్నితత్వాన్ని అనుభూతిలోకి తెచ్చేదే అత్యుత్తమ సాహిత్యం. ముందు చెప్పినట్టు సమాజ విలువల్ని సాహిత్యం ఎలా పరీక్షిస్తుందో ఇక్కడ సాహిత్యం కూడా పరీక్షకు గురవుతుంది.

7. సాహిత్యం అంతిమ లక్ష్యం?

జవాబు:  ఏ సృజనాత్మక ప్రక్రియ లోనూ  అంతిమ లక్ష్యం అంటూ ఉండదు. సాహిత్య కారులకు అవార్డులో, కీర్తి, డబ్బు, హోదా వంటివి అంతిమ లక్ష్యాలు ఉంటాయి. అందరూ ఇలా ఉంటారా  అంటే చెప్పలేను. ఎక్కువ మంది ఇదే కోవలోకి వస్తారు. సాహిత్యానికి మాత్రం  ఇలాంటి లక్ష్యాలు ఉండవు. మానవీయ అనుభూతి మాత్రమే సాహిత్య ప్రాధాన్యం. ఆ అనుభూతి కలిగించే స్పందనలు ఒక్కొక్కరిలో  ఒక్కో విధంగా ఉంటాయి.  అవి వారి వారి అవగాహన సామర్ధ్యం,  అనుభూతుల కలబోతపై ఆధారపడి ఉంటాయి.  అయితే ఆ అనుభూతులు, స్పందనలు ఏ సమాజానికైనా అవసరమని భావిస్తాను.
*

సత్యోదయ్

15 comments

Leave a Reply to satyoday Cancel reply

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు