కిందినుండి పైకి చూస్తే అది శిఖరం.. పైనుండి కిందికి చూస్తే అది లోయ.
ఎంత లోతు.. ఎంత ఎత్తు.
ఎటు చూచినా ఎడతెగని ఎత్తు.. ఎంత తొంగిచూచినా అంతుతెలియని లోతు
గాలిలో.. శూన్యంలో.. జారి.. అంచుపైనుండి పడిపోయి.. ఉక్కిరిబిక్కిరౌతూ.. ఊపిరాడక.. తన్నుకుంటూ.. కిందికి.. యింకా కిందికి.. ఒక రాతిగుండువలె.. దూసుకుపోతూ.. అగాథాల్లోకి.. పాతాళంలోకి.. యింకా యింకా.. రివ్వున రాలిపోతూ.,
చటుక్కున.. ఉలిక్కిపడి.. కళ్ళు తెరిచింది సుభద్ర.. ముప్పయ్యారేళ్ళ సుభద్ర.. బీద సుభద్ర.. ఎప్పుడో ఎనిమిదవ తరగతి చదువుకుని.. చదువు మానేసి.. గూడు విడిచిన పక్షయి.. నికరంగా ఫలానా ఊరు.. ఫలానా కుటుంబం.. ఫలానా చిరునామా.. ఫలానా ఉనికి.. అని ఏవీలేక.. దారం తెగిన గాలిపటమై.. ఎటు గాలి వీస్తే అటు.. అలపై ఎండుటాకు ఎటు కొట్టుకుపోతే అదే తీరమై.. జీవితంలో నడచి నడచి.. చిలికి చిలికి.. అలసి అలసి.. ఒంటరిగా మిగిలిన సుభద్ర.. భయంతో ఒంటిని జలదరింపజేసిన కలలోనుండి తేరుకుని.,
దడదడ కొట్టుకుంటున్న గుండెలతో చుట్టూ చూచింది ఈలోకంలోకి జారిపడ్తూ.
ఒళ్ళంతా చెమట.. తడిచిపోయింది..శరీరం కంపిస్తోంది.. భయం.. చుట్టూ ఎవరూ లేకపోవడం.. భయం. జీవితంలో ఎప్పుడూ ఎవరూ వెంటలేకపోవటం భయం.. బతుకంతా ఒంటరిగా మిగిలిపోవడం.. భయం. భవిష్యత్తు ఏనాడూ స్పష్టంగా కనబడకపోవడం.. భయం.. ఒడ్డు దొరికినట్టే దొరికి చేయిజారి.. అగాథంలోకి ఎప్పటికప్పుడు కూలిపోతూండడం.. భయం.
సుభద్ర బ్రతుకంతా భయమే.
సిమెంట్ గచ్చునేలపై.. ప్లాస్టిక్ చాపపై నిద్రా, దుఃఖం ముంచుకొచ్చి తనకు తెలియకుండానే నిద్రలోకి జారిపోయిన సుభద్ర ఉలిక్కిపడి పరిసరాలను గమనించింది పూర్తి స్పృహలోకొస్తూ.,
గదినిండా చిక్కగా చీకటి.. గడ్డకట్టిన నిశ్శబ్దం.. గాలినిండా తేమ.. నవంబర్ నెల శీతాకలాపు చలి.. కడుపులోనుండి తన్నుకొస్తూ ఏదో తెలియని వణుకు.
వణుకు భయంవల్లనా.. చలివల్లనా.
వ్చ్.. ఏమో.. భయంతో వణికిపోతోంది సుభద్ర.
ఎదురుగా.. గోడనానుకుని.. చెక్కపీటపై దీపాంత.. వత్తి వెలుగుతోంది.. ఎర్రగా.. సన్నగా, గదినిండా నిండిఉన్న చిక్కని చీకటిని.. కాలుస్తూ, విఫలమౌతూ, వణుకుతూ.. దీపం.. నూనె దీపం.
ఆ దీపాన్ని తనే వెలిగించింది.. రాత్రి పదిగంటలప్పుడు.. చటుక్కున కరెంటుపోతే.. మట్టి దీపాంతలో చిన్నపావెడు పల్లినూనె పోసి, దూదివత్తిని తడిపి అగ్గిపుల్లతో తనే వెలిగించింది.
గదినిండా చీకటి.. చిరుదీపాన్ని భయపెడ్తూ ఎంత చిక్కగానో.,
నిజానికి సుభద్ర.. ఆ దీపాన్ని ఆ రోజు సాయంకాలం.. ఏడు గంటలప్పుడు..శీతాకాలపు చీకటి ముసురుకుని విస్తరిస్తున్నప్పుడు.. కన్నీళ్ళు నిండిన కళ్ళతో.. పీటపై గోడకానించి మొగిలి ఫోటోనూ, ముందర ఐదారు ఎర్రని గులాబి పూలను ఉంచి.. దుఃఖంతో పగిలిపోతున్న గుండెలతో.. ఆ దీపాన్ని వెలిగించింది.
దీపపు చిరువెలుగులో.. పద్దెనిమిదేండ్ల మొగిలి ముఖం.. చిర్నవ్వుతో వెలిగిపోతూ.. మిలమిలా మెరుస్తూ కళ్ళు.. ముఖంనిండా కరంటు బల్బులో కాంతి పొంగిపొర్లుతున్నట్టు.. వర్చస్సు.. జీవం.
”అమ్మా..మ్మా..మ్మా..” అని పిలుస్తున్నట్టు.,
ఉరికొచ్చి ఉరికొచ్చి.. తనను చుట్టుకుని.. అల్లుకుని.. హత్తుకుని.. తన కళ్ళలోకి చూస్తూ.. తను కరిగిపోతూ.. తనను కరిగిస్తూ.,
‘ఒట్టి కొవ్వొత్తినిరా తండ్రీ.. నీ స్పర్శతో ద్రవించి.. కరిగి.. ప్రవహించి.. నేను దహించుకుపోతూ వెలుగునౌతా.. కాని నాలోని ప్రాణానివీ చమురువూ నువ్వేకదరా తండ్రీ..’
మొగిలి ముఖంలోకి.. ఫోటో లోకి చూస్తూ ఎంతసేపు ఉండిపోయిందో అలా తను.
చూస్తున్నకొద్దీ దుఃఖం.. పొగిలి పొగిలి.. పొర్లి పొర్లి.. పొంగి పొంగి.. తుఫాన్లు.. గుప్పెడు గుండెలో కోటి తుఫాన్లు.. పిడికెడు హృదయంలో శతకోటి ప్రళయాలు.. ఉప్పెనలుగా ఎగసి ఎగసి.,
అసలు ఎందుకిలా జరిగింది.
ఒక్క తనపట్లనే.. తన మనుషుల పట్లనే.. తన జీవితంపట్లనే.. ఎందుకు విధి యిలా వికృతమైన క్రీడను రచిస్తోంది. ఎన్నడూ తెల్లవారని అనంతరాత్రిని విధి ఎందుకు తనకు మిగులుస్తోంది.
చాపపై లేచి కూర్చుంది సుభద్ర.
ప్రక్కన చాట.. చాటలో పొగాకు, ఒక మూలకు కత్తిరించిన బీడి తునికాకు. పొగాకు కుప్పపైన తెల్లని దారపు పొట్టె.. సన్నని బీడీల మూతులొత్తే కట్టెపుల్ల. అటుప్రక్క స్టీలుగ్లాసులో సగం నీళ్ళు.
జీవితమంతా.. బుద్ధి తెలిసిన నాటినుండి.. బీడీలు చేయడం.. బీడీలు చేయడం.. బీడీలే చేయడం. బీడీలు చేసీ చేసీ ఒళ్ళంతా పొగాకు వాసన. బీడీ మూతులు ఒత్తీ ఒత్తీ కాయలుకాసిన వ్రేళ్ళు.. తునికాకు కత్తిరించీ కత్తిరించీ కాయలుకాసిన బొటనవ్రేళ్ళు.. చాచిన కాళ్ళపై చాటను రాత్రింబవళ్ళు మోసీ మోసీ బండబారిన తొడలు.
వెయ్యిబీడీ చేస్తే పదిహేను రూపాయలనుండి.. యిప్పుడు వెయ్యి బీడీకి నూటపదిరూపాయలదాకా.. ఏండ్లకు ఏండ్లు.. ఖార్ఖాన్లకు ఖార్ఖాన్లు.. ప్రాంతాలకు ప్రాంతాలు.. కరీంనగర్, జగిత్యాల.. మెట్‌పల్లి .. కమ్మర్‌పల్లి.. మళ్ళీ, జగిత్యాల.. ఎన్ని ఊళ్ళు.. ఎన్ని కంపెనీలు.. ఎన్ని వలసలు.. ఎన్ని దుఃఖాలు.. ఎన్నీ కన్నీళ్ళు.,
ప్రాంతాలు వేరే.. మనుషులు వేరే.. కంపెనీలు వేరే.. కాని.. అదే తునికాకు.. అదే పొగాకు.. అదే కత్తిరింపు.. అవే బీడీలు.. అదే ఘాటు.. అవే మోసాలు.. అవే దోపిడీలు.. అవే చాలీచాలని బతుకులు.. అదే దుఃఖం.. అవే ఎవరికీ కనబడని కన్నీళ్ళు.. అదే కుమ్ములో కందగడ్డ కుమిలిపోయినట్టు కుమిలిపోవడాలు.,
టైం చూచింది, సుభధ్ర..
మూడు గంటల పదినిముషాలు.. రాత్రి.
మూసిన కిటికీ సందుల్లోనుండి, తలుపు చెక్కలనడుమ చీలికల్లోంచి సర్‌ర్‌న.. కత్తిలా దూసుకొస్తూ చలి.. వణుకు.
చీరను సవరించుకుని, కాళ్ళను చకిలంమొకిలం పెట్టుకుని చాటను తొడల పైన పెట్టుకుంది సుభద్ర. తడిగుడ్డ చుట్టలో మర్తగా పేర్చిపెట్టుకున్న కత్తిరించిన బీడీ ఆకుకట్టను సవరించుకుని.. ఒకటి తీసి.. చిటికెడు పొగాకు పోసి.. చకచకా బీడీగా చుట్టి తోకదగ్గర దారంకట్టి.. పుల్లతో మూతిఒత్తి.. ప్రక్కనపెట్టి.. మరో ఆకును తీసుకుంది.
క్షణంలో ఒక బీడీ.. మరో లిప్తలో మరో బీడీ.. ఆమె వ్రేళ్ళు చకచకా యాంత్రికంగా కదుల్తున్నాయి.. అసంకల్పిత నైపుణ్యం.. మనసు అవసరంలేని.. ఒట్టి మనిషి మాత్రమే మరమనిషివలె చేయగల పని.,
చుట్టూ చీకటి.. నిశ్శబ్దం.. చలి.
లోపల దుఃఖం.
చూపులు.. ఎదురుగా.. గోడనానుకుని ఉన్న మొగిలి ఫోటో.. ముఖంపై.. ముందున్న మట్టిదీపపు వెలుగుతున్న వత్తిపై,
నిలకడగా.. నిట్టనిలబడి.. ఎర్రగా.. మంట.. చుట్టూ.. గూడుకట్టినట్టు వెలుగు.. వెలుతురు క్రమక్రమంగా పల్చబడ్తూ.. అంచులనుండి చీకటి.
‘అమ్మా.. మనిషి జీవితంలో చీకటే శాశ్వతమమ్మా.. వెలుగే మధ్యలో వచ్చీపోయే అతిథి.. కాబట్టి మనమెప్పుడూ శాశ్వతంగా చీకటిని జయించే ప్రయత్నం చేయాలె ‘ అన్నాడొకరోజు మొగిలి ఆమెతో.
సుభద్రకు అస్సలే అర్థంకాలేదు.
‘నాకేమీ అర్థం కాలేదురా’ అందామె.
‘అర్థంకావాలంటే.. చదువుకోవాలమ్మా.. చదువుకోవడమంటే చీకట్లో కూర్చున్న మనిషి దీపాన్ని వెలిగించుకుని ఆ వెలుగులో చుట్టూ పరిసరాలనూ, తననుతాను చూచుకుని తెలుసుకోవడం వంటిది’ అన్నాడు మళ్ళీ.
ఆ మాటలూ అర్థంకాలేదామెకు. కాని మాటల్తో చెప్పలేని ఆనందమేదో కల్గింది సుభద్రకు. అంది ‘నువ్వు మాట్లాడ్తాంటే దేవుడేవచ్చి నా ముందట కూసొని మాట్లాడ్తున్నట్టనిపిస్తదిరా’ అని.
మొగిలి మొగలిపువువ్వలె నవ్వి.. వచ్చి తల్లి తలను కడుపుకు అనించుకుని, హత్తుకుని తలనిమిరాడు.,
‘నీకు బాలల బొమ్మలు రామాయణం, భారతం తెస్తనే లైబ్రరీలనుంచి.. చదువు..’ అన్నాడు.
మర్నాడు తెచ్చాడు.
వెంటపడి చదివించాడు. ఆమె బీడీలు చేస్తూంటే ప్రక్కనే కూర్చుని బీడీలకు దారంకడ్తూ, మూతులొత్తుతూ పుస్తకాల్లోని విషయాలపై ఎన్నో ప్రశ్నలడిగాడు.. ఆ తర్వాత.. మరో పుస్తకం బేతవోలు రామబ్రహ్మం శ్రీమద్రామాయణం.. దేవీభాగవతం.. తెచ్చిస్తూ,
‘ఒక్కో మెట్టే ఎక్కాలమ్మా’ అన్నాడు.
‘ఎక్కడికి’ అంది సుభద్ర.
‘ఎక్కడికైనా’ అన్నాడు మొగిలి నవ్వుతూ.
సుభద్రకూడా నవ్వింది.. సముద్రంలా.
గత సంవత్సరం మొగిలి బి.టెక్ మూడవ సంవత్సరంలో ఉన్నాడు.
సుభద్రకు తెలిసి మొగిలి చిన్ననాటినుండీ చేసేవి మూడు పనులే.. ఒకటి ఎప్పుడూ చదువుకోవడం.. అది బడా లైబ్రరీనా, ఇంట్లోనా.. ఎక్కడైనా.. రెండవది.. యింట్లో తన జీవనోపాధియైన బీడీలు చేసే పనిలో సహాయంచేస్తూ తల్లిగా తనకు ఆనందాన్ని పంచడం.. మూడవది.. ఎప్పుడూ తనలోతాను గాఢంగా లోతుగా.. ఒంటరిగా.. మౌనంగా ఆలోచిస్తూండడం.
చదువుకుంటున్నకొద్దీ మొగిలి చెప్పినట్టుగానే తనలో ఏదో తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం, ప్రశ్నించే తత్వం, ఎదుటి మనిషిని నిలదీసే చొరవ పొటమరిస్తున్నట్టు తెలుస్తూండేది సుభద్రకు.
ఒకసారి సుభద్ర మొగిలిని ఆశ్చర్యపర్చాలని గోపిగారి ‘వేమన్న వెలుగులు’ పుస్తకంలోని ఒక పద్యాన్ని తను నోటికి చదివి వినిపించింది. మొగిలికి అన్నం వడ్డించి.. తింటూండగా.,
‘చదవ చదవ చదవ సభలందు రంజిల్లు
పెనగ పెనగ సతికి ప్రేమ పుట్టు
వినగ వినగ మాట విశ్వాసమై యుండు
విశ్వదాభిరామ వినురవేమ’
మొగిలి.. అప్రతిభుడై చటుక్కున తలెత్తి.. ‘అమ్మనీయమ్మ.. ఎంత ఎదిగిపోయినవే నువ్వు’ అన్నాడు కొయ్యబారిపోయి.,
‘మరేమనుకున్నావ్‌రా.. నీతల్లినా మజాకా.’
‘దీన్నే వేలు జూపితే కొండబాకుడంటరే అమ్మా.. శభాష్ నీకు మంచి ఫ్యూచరున్నదే..’ అన్నాడు అన్నం తినుడాపి.. కౌగిలించుకుంటూ.
‘ నా ఫ్యూచరూ, ప్రజంటూ.. పాస్టూ.. అన్నీ నువ్వే.. అసలు నా జీవితమే నువ్వుగదరా నాన్నా’ అంది సుభద్ర.. ఆ క్షణం ఉక్కిరిబిక్కిరయ్యే సంతోషంతో.,
కాని.,
కాని.,
మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది సుభద్రకు.,
సరిగ్గా అప్పుడే.. భళ్ళున లైటు వెలిగింది గదిలో.. కరెంటొచ్చింది. గదినిండా కాంతి.. ఒంటరి కిరాయి గది.. పైన ఆజ్‌బెస్టస్ సిమెంట్ రేకులు.. పొగచూరిన గోడలు.. సిమెంట్ గచ్చు.. యిటు పొయ్యి.. అటు షాబాద్ బండల అరల్లో ఐదారుగిన్నెలు.. ఆ మూల ఒకపాత చెక్క బీరువా.. అందులో బట్టలు. ఈ మూల.. ఒక ఫోల్డింగ్ మంచం.. తనకు నేలపై పాత ప్లాస్టిక్ చాప.
గోడకు.. మోకాళ్ళపై కూర్చుని.. భుజంపై గదతో భీకరాకారంలో ఉన్న హనుమంతుని క్యాలెండర్ బొమ్మ.
మొగిలి ఆంజనేయునికి వీరభక్తుడు.
‘అమ్మా.. రాముడు అజ్ఞాపించి ఫలానావాని సంగతి చూచిరాపో అని తోల్తే.. హనుమంతుడు వెళ్ళి వాన్ని హరీమనిపించడమే. అరే బై ఎందుకు నన్ను కొడ్తున్నావని వాడడిగితే.. పోయ్ రామున్నడుగు పో.. నిన్ను తన్నుమన్నాడు తంతానంతే నాకేందెల్వది అంటడు.. హైలీ సీన్సియర్ అండ్ ఒబిడియంట్ టు రామా.. అట్లుండాలె’ అన్నాడొకసారి మొగిలి.. నవ్వింది తను. సుభద్ర పగలబడి మొగిలి మొకంలోకి చూస్తూ.
ఉన్నట్టుండి దుఃఖం కట్టలుతెగి ముంచుకొచ్చింది సుభద్రకు.. తట్టుకోవడం వశంకాలేదామెకు. కాళ్లమీదున్న బీడీల చాటను ప్రక్కనబెట్టి.. చేయి చాపి కొడుకు ఫోటోను తీసుకుని గుండెలకు హత్తుకుంది. అంతే.. యిక ఆమె హృదయంలో కోటిప్రళయాలు పోటెత్తినయ్.
‘ఎందుకు.. ఎందుకిట్ల జరిగిందిరా తండ్రీ.. యింత ధైర్యవంతునివి.. గిట్లెందుకు చేస్తివికొడ్కా..’
రాత్రంతా మౌనంగా ఏడుస్తూనే ఉన్న సుభద్రకు పెయ్యి తిర్గుతున్నట్టనిపించి.. ప్రక్కకొరిగింది.. చాపపైన.
మగత మగతగా.. మసక మసగ్గా.. ఏదో ఆలాపనవలె.. సన్నని మంచుతెరవలె.,
రాజేశం నడచి వస్తున్నట్టు.,
ఎడారిలోనుండి.. మబ్బుల్లోనుంచి.. సముద్రంపైనుంచి.. నవ్వుతూ.. పాలపువ్వువలె.. నడచివస్తూ..చేతులుచాపుతూ.,
రాజేశంకూడా అంతే.. తనవాడేనా.. ఔను.. తనవాడే.. ఐతే.. దుబాయ్‌లో ఎందుకు. మస్కట్ లో ఎందుకు.. అబుదాబిలో ఎందుకు.. ఎమిరేట్స్ లో రెక్కలు తెగిన పక్షిలా.. ఎడారిదేశాల్లో తరుమబడి తరుమబడి.. అలసి సొలసి.. నేలకొరిగి.. ముక్కలు ముక్కలుగా తెగి.. మాంసపు ముద్దలుగా మిగిలి.. ఖండఖండాలై చచ్చిపోవుడెందుకు.
తను ఎనిమిదవ తరగతిలో ఉన్నపుడు.. జగిత్యాలలో.. రాజేశం పదవ క్లాస్.. తనకు తండ్రి లేడు. రాజేశంకు ఎవ్వరూలేరు.. మేనమామ యింట్లోఉండి చదువుకునేటోడు. మేనమామ భీవండీకి మొగ్గాలు నేయబోతే రాత్రుళ్ళు పెట్రోల్‌బంక్‌ల పనిచేసుకుంట, తెల్లారగట్ల న్యూస్‌పేపరేసుకుంటు.. అదీ రాజేశం బతుకు.
పరిచయం.. ఒక్కటే వాడ.. దగ్గర్దగ్గర్నే యిండ్లు.,
తనకు ఎనిమిదైపోయి.. రాజేశంకు ఎస్సెస్సీ ఐపోయి.. యిగ ఏంజేద్దామనుకుంటూండగానే తన తల్లికి పొలంల పాము కరిచి చచ్చిపోయి.,
రోడ్డుమీద.. యిద్దరు మనుషులు.. తను.. రాజేశం.
వెనుకా.. ముందూ.. ఎవరూలేని బతుకు.. యిద్దరూ నర్సింహస్వామి గుట్టమీద ఒక రోజంతా ఆలోచించి ఆలోచించి.. ‘జై హనుమాన్’ అని.. సూరత్‌కు వలస.
సాంచెలు నడిపి.. ఉప్పరి పన్కిపోయి.. తను బీడీలు చేసి.. రాజేశం లారీ క్లీనర్‌గా చేసి.. హోటళ్ళల్ల పనిచేసి.. కార్ఖాన్లల్ల ఏ పనిచేప్తే అదిచేసి.,
ఏడాది.. రెండేండ్లు.,
‘నీతిగ బతుకుడు నా పద్ధతి.. రీతి తప్పినోళ్ళకే ఈ దేశంల బతుకున్నది. మేం ఐదార్గురం కల్సి దుబాయ్ పోతం సుభద్రా.. చూస్త. ఓ రెండుమూడేండ్లు పనిచేసి నాల్గుపైసల్ సంపాదించస్త.. అప్పుడు పెండ్లి చేసుకుని ప్రశాంతంగ బత్కుదం..’ అని.
ఆకాశంల ఒక చుక్కతెగిపోయింది.
రాజేశం ఎడారిలో బడ్డడు.
తను.. మెట్‌పల్లి .. మళ్ళీ బీడీలు.. సింగిల్‌రూంల బతుకు.
రాజేశం ఎవరు.. తనకు మొగుడా. కాదు.. కలిసున్నరు.. రెండేండ్లు.. గంతే.. పెండ్లి షోకులేవీ లేవు. చేయి వదిలేసి.. దేశాలపట్టి పోయిండు.
కాని రాజేశం నిప్పువంటి మగాడు. నీతి, రీతి, రివాజు.. ధర్మం, న్యాయం.. అన్నీ ఉన్న మనిషి.. కాని జీవితమేది.?
మెట్‌పల్లిలో..లోకం దృష్టిలో ‘..పెనిమిటి దుబాయ్‌లున్నడు.. వస్తడు.. యిప్పుడేమో ఒంటరిగా బీడీలు చేస్కొని బత్కుతాంది.’ అని ముద్ర.
ఏడాది.. రెండేండ్లు.మూడు.,
రాజేశం ప్రతివారం మాట్లాడ్తడు టెలిఫోన్ల.. ఐఎస్‌టిడి
‘ఎప్పుడస్తవ్’
‘కోశిస్ చేస్తాన సుభద్రా.. కొల్వు నికరంగలేదు.. వస్త..’
ఉండి ఉండి చిన్న పిల్లవానివలె ఏడ్చేటోడు ఫోన్ల.. తనక్కూడా దుఃఖమొచ్చేది.
ఏంజేయాలె
కళ్ళ ముందట ఏమీలేని ఒట్టి ఖాళీ.. కళ్ళనిండా, గుండెనిండా.. నీళ్లు.
ఒకరోజు.. ప్రొద్దున్నే.. ఊరి బైటికి చెంబు పట్టుకుని తుమ్మతుప్పలలకు దొడ్డికిపోతే.. చెత్తకుప్ప బొందల చిన్నపోరని ఏడ్పు. దగ్గర్కిపోయి చూస్తే.. అప్పుడే పుట్టినబాబు.. ఎవరో పారేసిపోయిండ్లు.
ఏమాలోచించలే.. పిల్లవాన్ని తీసుకుని.. పరుగెత్తుకొచ్చి.. సందుగ సదుర్కొని.. బస్సెక్కి.. ఎవరూ తెలియని కొత్త ఊరు.. జనగాం.. వరంగల్లు జిల్లా.
సుభద్ర తల్లి.. మొగిలి.. ఆమె కొడుకు.
పెళ్ళిచేసుకోని భర్త.. రాజేశం.. కడుపున పుట్టని కొడుకు మొగిలి.
గుండెలో అగ్ని.. కడుపునిండా శోకం.
వారం వారం ఫోన్ రావడం ఆగిపోయింది. పదిహేను రోజులు.. యిరవై.. నెల.. రాజేశం దుబాయ్ వెళ్ళిన తర్వాత వచ్చి వెళ్ళింది ఒక్కసారే.. మెట్‌పల్లి లో ఉన్నపుడు పన్నెండు రోజులు ఉండి.
ఆ రోజులే.. స్వర్గం.. నరకం.. సుఖం.. దుఃఖం.. కలిసి ఉండి.. విడిపోయి కలిసి.. మనిషితో మనిషి.. మనిషిలో మనిషి.. మనిషికోసం మనిషి.
ఒకరోజు వచ్చింది వార్త.. పిడుగు పడ్డట్టు.. ఆడెపు కొంరెల్లి అనే రాజేశం దోస్త్‌ద్వారా. వర్క్ పర్మిటయిపోయి దుబాయ్‌నుండి మస్కట్ కు దొంగతనంగా కాంక్రీట్ మిక్సర్ టాంకర్‌లో బార్డర్ దాటుతూండగా సెక్యూరిటీ చెక్‌లో సైనికులు అనుమానంతో లారీని ఆపి.. ఋజువుకోసం ఖాళీ మిక్సర్ టాంక్‌ను త్రిప్పి ట్రయల్ చేస్తే.. రహస్యంగా లోపల నక్కి దాక్కున్న రాజేశం బ్లేడ్స్ నడుమ రోల్ ఐ.. శరీరం ముక్కలు ముక్కలై.. మాంసం ముద్దలుగా మిగిలాడనీ.. నాల్గురోజుల తర్వాత.. అక్కడి కరీంనగర్ తెలుగు కూలీల సంఘం ఆ అవశేషాలను ప్రభుత్వంతో కొట్లాడి తీసుకుని దహనసంస్కారాలు జరిపారని.,
రాజేశం చరిత్ర ముగిసింది.
లోకం దృష్టిలో తన భర్త రాజేశం.. మొగిలి తండ్రి.. లేడిక.
అప్పుడే ప్రవేశించింది సుభద్ర శరీరంలోకి ఒక ఎడారి.. యిసుక.. యిసుక తుఫాను
ప్రవేశించిన ఎడారి.. పెరుగుతూ.. విస్తరిస్తూ.. ఆక్రమిస్తూ.. దేహంనిండా వ్యాపిస్తూ.,
జీవితం చాలా చిన్నదైపోయింది. ప్రపంచం కుంచించుకుపోయింది. పరిధులన్నీ సంకోచించుకుపోయాయి.
సుభద్రను.. మూడే లోకాలు.. బతుకుతెరవుకోసం తెలిసిన విద్య.. బీడీలు చేయడం.. అద్భుతమైన అలవాటును మొగిలి నేర్పింది.. పుస్తకాలు చదవడం.. కొడుకుకాని.. తన కడుపున పుట్టిన కొడుకుకాని మొగిలికి అసలు విషయం తెలియని.. స్వంత కొడుకుకన్నా ఎక్కువైన మొగిలినే ప్రాణంగా భావించి బతుకడం.,
యిక మిగిలిదంతా శూన్యం.. ఖాళీ. ఒట్టి ఎడారి.. అనంతమైన ఎడారి.. చుట్టూ.
అటువంటి జీవితంలో.,
ఎస్సెస్సీలో రాష్ట్రంలో రెండవ ర్యాంక్ సాధించిన మొగిలి.. ఇంటర్ జూనియర్, సీనియర్ తరగతుల్లో రాష్ట్ర మొదటిర్యాంక్ పొందిన మొగిలి.. ఎమ్సెట్ లో.. వందలోపు ర్యాంక్.. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ ఇంజినీరింగ్ సీటు.,
ఉస్మానియా అంటే.. పోరాటం.. ఉస్మానియా అంటే ఉద్యమం.. ఉస్మానియా అంటే యుద్ధం.. ఉస్మానియా అంటే ఉప్పెన.,
‘ తెలంగాణ.. తెలంగాణ..’కోటిగాయాల వీణ.. తెలంగాణ’.. ‘వందల వీరుల త్యాగాల యుద్ధభూమి తెలంగాణ..’ ‘శతాబ్దాల పీడననుండి విముక్తి రణ తెలంగాణ’
ఎప్పుడు.. ఏ రాత్రి జనగాంకు వచ్చినా.. అన్నంతిని.. పక్కపై చేరినప్పట్నుండి.. తెల్లవారేదాకా చెప్పేవాడు.. తెలంగాణా శతాబ్దాలుగా ఎలా ఆంధ్రోళ్ళతో దోచుకోబడిందో.. విశ్లేషణాత్మకంగా.. సవివరంగా.. గణాంకాలతోసహా.
శ్రీకాంతాచారి.. ఒంటిపై పెట్రోల్ పోసుకుని..రోడ్డుపై పరుగెత్తుతూ ఆత్మాహుతి.. యాదయ్య.. పార్లమెంట్ ముందు చెట్టుకు ఉరి.,
ఎన్నో దుఃఖసందర్భాలు.. ఎన్నో అమరుల త్యాగాలు.,
‘అమరులకూ జోహార్.. వీరులకూ జోహార్’
ఆకాశం.. దిక్కులు పిక్కిటిల్లే ఉద్యమగీతాల రణగర్జనలు.
ఆంధ్రనాయకుల రెచ్చగొట్టే ప్రకటనలు.. ప్రేలాపనలు.. తెలంగాణా నాయకుల బాధ్యతారాహిత్య పోకడలు.. నిర్లజ్జ ప్రవర్తనలు.
బిక్కచచ్చిన ముఖంతో.. మౌనంగా కూర్చునేవాడు మొగిలి ఒక్కోసారి రాత్రంతా.
ఆరోజు.,
ఆగస్ట్ 15.,
యింట్లో బీడీలు చేసుకుంటోంది సుభద్ర.. ఒక్కతే.. మొగిలి హైద్రాబాద్‌లో ఉన్నాడు హాస్టల్‌లో జెండావందనంరోజు.. రావాలి కొడుకు.ఎదురు చూస్తోంది.. ఆతురతగా.. ఉత్సుకతతో.
పన్నెండు గంటల యిరవై నిముషాలు.,
టివి. చూస్తోంది.. టిన్యూస్ చానల్‌లో బ్రేకింగ్ న్యూస్..’తెలంగాణ కోసం మరో యువకుని ఆత్మబలిదానం జనగాం రైల్వేస్టేషన్‌నుండి దూసుకువస్తున్న షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా ‘జై తెలంగాణ’ అని నినదిస్తూ ఆత్మహత్య.. తుత్తునియలైపోయిన అమరుని శరీరం.. మృతునిపేరు.. ఆర్. మొగిలి.. బి.టెక్ మూడవ సంవత్సరం.. ఉస్మానియా ఇంజినీరింగ్ కాలేజ్‌లో..’
ఐపోయింది.,
సుభద్ర కళ్ళముందు ప్రపంచం బ్రద్దలై.. తునాతునకలై.. విస్ఫోటించి.,
అపస్మారకమైపోయి.. స్పృహకోల్పోయి.,
‘ వీరులకూ జోహార్.. అమరులకూ జోహార్’.. ఎక్కడో ఆత్మాంతరలోకాల్లో.. కొండల్లో నుండి వందలవేల గొంతులు నినదిస్తూ.,
మొగిలి.. మొగిలి.. ‘ మొగిలీ నా తండ్రీ.,’
ఎక్కడ..? నువ్వెక్కడ..,
- * *
బైటినుండి.. హారన్ వినబడింది.
తలుపు చప్పుడు.,
అతనొచ్చిండు.. ‘అమరుల సంఘం’ బాధ్యుడు.
‘అమ్మా.. బయల్దేర్దామా..’
హైద్రాబాద్.. నిజాం కాలేజి మైదానంలో ‘తల్లుల కడుపుకోత సభ’
మొగిలి చెప్పిన.. హక్కులు.. బాధ్యతలు.. పౌరవిధులు.. మనిషి ధర్మాలు.. దేశస్పృహ.. జన్మభూమి ఋణం.,
సుభద్ర.. మెల్లెగా లేచి.. పీటపై.. ముఖంపై కుంకుమబొట్టుతో ఉన్న మొగిలి ఫోటోను తీసుకుని.. గుండెలకు హత్తుకుని.. గదినుండి బైటికి నడిచి.,
అప్పటికే.. అక్కడ ఆగి ఉన్న టాటా ఏస్ ఆటో.,
ఎక్కి కూర్చుంది. గత ఆరునెలలుగా.. అటువంటి అమరవీరుల తల్లుల సభలకు.. ఎన్నింటికో వెళ్ళింది సుభద్ర.
ప్రతి సభా ఒక శోకసముద్రం.. కన్నతల్లుల కన్నీటి కడలి.. ఎవరిని కదిలించినా ఒక అశ్రుఉప్పెన.,
ఐతే.. ఏ సభలోనైనా అందరూ.. అమరులూ.. అమరుల కుటుంబాలూ.. వాళ్ళ తల్లిదండ్రులూ., ప్రాణాలర్పించిన వాళ్ళందరూ.. ఒట్టి సామాన్యులు.. పేదలు.. గరీబులు.. రైతులు.. కూలీలు.. బహుజనులు.. దళితులు.
వీళ్ళకే.. సమాజ స్పృహ.. దేశ స్పృహ ఎక్కువా.?
వీళ్ళకే.. ఈ నేలపట్ల.. తల్లి భూదేవి పట్ల మక్కువా.?
‘తెలుసుకోవాలమ్మా.. చదువుకుని ఈ మనుషుల గురించీ, సత్యం గురించీ, కుట్రల గురించీ, మాయల గురించీ, మర్మాల గురించీ..’
మొగిలి నవ్వు ముఖం మెరిసింది సుభద్ర హృదయంలో.
ఎందుకో.. ఆమె మూసిన కళ్ళలోనుండి.. వెచ్చగా రెండు కన్నీటి ధారలు జారాయి జలజలా.
(ఇంకా వుంది)
బొమ్మలు: మిత్ర
Excellent Sir. 🙏🏼🙏🏼🙏🏼👌👌👌
Dhanyavaadaalu sir
yellaareddy garu,
dhanyavaadaalu sir
prof.mouli
Very nice sir
madam,
thank you very much.
mouli