బివివి ప్రసాద్ కవితలు రెండు

ప్రేమ ఉంటే.. 
1
ప్రేమ ఉంటే పెద్దగా చెప్పటానికేమీ ఉండదు
మాటలన్నీ మంచు ముక్కల్లా
ప్రేమలో కరిగిపోతాయి
పూలరంగులు వెలుగుతాయి,
నక్షత్రాలు అనంతాన్ని విరబూస్తాయి,
స్పర్శ జీవితాన్ని సారవంతం చేస్తుంది
ప్రేమ ఉంటే ఇదంతా బాగుంటుంది
బాగోనిది చూపులకి దూరంగా జరుగుతుంది
2
ఇంతా చేసి సూర్యోదయంలోకి
కనులు తెరిచినప్పుడు
ఇవాళైనా ప్రేమలోకి తెరుచుకుంటానా అని
ఊరికే దిగులు పడతావు
జీవుల చూపుల సారం
ప్రేమ కోసం ఎదురుచూపు,
భయాలూ, కోరికలూ
ప్రేమ దక్కక చేసే వెర్రి పనులు
3
ఈ రాత్రి ఆమె అతన్ని ప్రేమిస్తే,
ఈ పగలు అతను ఆమెని మోహిస్తే
అంతకన్నా ఉదయాస్తమయాలకి అర్థమేమిటి
కాలం చేసే పలురకాల ధ్వనులు
కలవర పెడుతున్నపుడు
కాలంగా ప్రవహించే మౌనం
నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది
కాస్త ప్రేమించు, అంతా సర్దుకుంటుందని
కాలం చెప్పకనే చెబుతుంది
4
ప్రేమ ఉంటే లోపలేదో నిండుతుంది
దూరరేఖపై వాలే సూర్యకాంతి
“జీవితం ఎంత అందమైనదో
ఇవాళైనా నీకు అర్థమయిందా” అని
దయగా, లాలనగా అడుగుతుంది
నిర్మోహం
1
మనుషులతో నీకెలాంటి బంధం లేని క్షణాల్లో
నీ ప్రపంచం తటాలున విశాలమౌతుంది
దారిన పోయే మనుషుల్ని,
బజారులో నడకలో, పనుల్లో, మాటల్లో
మునిగిన మనుషుల్ని
ఊరకనే గమనిస్తున్నపుడు నీకు
వారిపై వాలే దీపాల వెలుగునీడలు కనిపిస్తాయి
వెలుగునీడల్ని పొదువుకొన్న గాలీ,
గాలిని పొదువుకున్న ఆకాశమూ,
ఆకాశాన్ని పొదువుకున్న జీవితమూ
కనుల ముందు సాక్షాత్కరిస్తాయి
మనుషులు నీకేమీ కాని క్షణాలు
ఎవరూ వారి చేతనలోకి నిన్ను లాగని,
నీ చేతనలోకి చొరబడని క్షణాలు అద్భుతం
2
ఆ కొండ చుట్టూ నడిచే సమయాల్లో
బాటప్రక్క బైరాగులని చూసినప్పుడు
నీలో సోదరభావం కలిగేది
వాళ్ళకి మనుషులతో బంధమేమీ లేదు
నువు చూసినా, లేకున్నా,
ఇచ్చినా, ఇవ్వకున్నా
వారికేమీ పట్టింపులేదు
కొండని చూస్తూ వాళ్ళు
పావనజలాల్లో మునిగినట్టు
కొండలో మునిగి వుంటారు
3
ఏదీ పట్టని క్షణాలు అద్భుతం
నీ ఊరిలోనూ, ఇంటిలోనూ
నువ్వొక బైరాగిలా తిరుగాడే సమయాలుంటే,
ఇతరులలోకీ నువ్వూ, నీలోకి వారూ
చొరబడని సమయాలుంటే
నీకు తొలిసారి తెలుస్తుంది
ఇతరుల్ని నువు ఎంతగా ప్రేమిస్తున్నావో,
వారిలోపలి సుతిమెత్తని జీవనానందాన్ని
మృదువుగా తాకుతున్నపుడు తెలుస్తుంది
నీకు జీవితమంటే ఎందుకింత మోహమో!
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం 

బివివి ప్రసాద్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు