ప్రవాస జీవన వైవిధ్యం ‘క్విల్ట్’ 

లస వెళ్ళిన దేశం నుండి, తన తెలుగుతనాన్ని నిలుపుకుంటూ –  విరివిరిగా అనేక ప్రక్రియలలో విభిన్న తీరులలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన, చేస్తున్న ప్రముఖ రచయిత సాయి బ్రహ్మానందం గొర్తి. తానా పత్రికకు సుదీర్ఘకాలంగా సంపాదకునిగా వ్యవహరిస్తున్న సాయి బ్రహ్మానందం గొర్తి గారు ఇప్పటి వరకూ నేహల, యథార్థ చక్రం, అంతర్జ్వలన అనే నవలలు – సరిహద్దు, కోనసీమ కథలు, క్విల్ట్ అన్న పేర్లతో కథలూ – నాటకాలు, ‘మనకి తెలియని మన త్యాగరాజు’ అన్న ప్రముఖ వ్యాసంతో పాటు రచయితల రచనలకు తోడ్పడే మరెన్నో వ్యాసాలు రాసారు.

ఎప్పటికప్పుడు సాహిత్యంలోకి కొత్త రచయితలు, కొత్త పాఠకులు వస్తూనే వుంటారు. అలాంటి వారికి ఇదిగో ఇక్కడ ఈ రచయిత, ఇవి వారి చదవాల్సిన సాహిత్యం  అంటూ చెప్పగలిగే సమీక్షలు, వ్యాసాలు ఎంతో అవసరమని, తిరిగి ఆ రచనలని ఒక కొత్త దృక్పథంతో పరిచయం చేయడం అందరికీ ఉపయోగపడుతుందని మా నమ్మకం.

అందుకే – గొర్తి గారి రచనలతో చాలా కాలంగా పరిచయం వున్న వారి నుండి ఇప్పుడిప్పుడే పరిచయం అయిన వారి వరకూ వున్న మా గ్రూపు సభ్యులం వారి కథా సంపుటి  ‘క్విల్ట్’ ని ఎంచుకుని సమీక్ష చేశాం. ఆ రకంగా మేము ఈ రచయిత సాహిత్య దృక్పథాన్నీ, వ్యక్త పరచిన అంశాలలోని ప్రత్యేకతని తిరిగి ఈ సమీక్ష ద్వారా చర్చించుకున్నాం.

విజయ కర్రా:

క్విల్ట్ పేరుకి తగ్గ కథా సంపుటి. వైవిధ్యంతో  కూడిన రంగురంగుల వస్త్రాలవంటి కథా వస్తువులు వాటిపైన కథా గమనానికి  తోడ్పడే  సంభాషణల రంగు దారాల అల్లిక. ఎక్కువ శాతం కథలకి  సంభాషణలే ఆయువుపట్టు, కథలలో విలీనమై నడుస్తున్న పాఠకుడిని ఆపి ఆలోచింపచేసేవి కూడా అవే.

ఈ సంపుటిలో నాకు చాలా నచ్చిన కథలు – గలుబె, లవ్ ఆల్, అహిగా, ఆఖరి చూపు, ఊర్మిళ రేఖ, అతను, చినిగిన చిత్తరువు, బ్లాక్ పెరల్, పార్డన్  మీ ప్లీస్.

లోకో భిన్న రుచి: కదా! ఆ లెక్కన – సైన్యం, మామూలు మనుషులు, ఆయన, వానప్రస్థం కథలు నన్ను అంతగా ఆకట్టుకోలేదు.

వీరి కథలలో పాత్రలు ఎవరినో మెప్పించడానికి పూనుకోవు. నిజాయితీగా అవి వ్యక్తపరిచే విషయాలు కొన్ని కొన్ని సార్లు చేదునిజాలలాంటివి. ఒక వేలితో తప్పుని ఎత్తి చూపించేవారికి, తక్కిన నాలుగు వేళ్ళు  తమనే చూస్తున్నాయన్న గ్రహింపు లేకపోవడం – తమదాకా వస్తే కానీ బయటపడని సంకుచిత స్వభావాలు – క్విల్ట్, థాంక్స్ గివింగ్, ఐ హేట్ మై లైఫ్, ఒంటరి విహంగం వంటి కథలలో మనకి కనిపిస్తాయి.

చిరుత, థాంక్స్ గివింగ్, బతుకాట, నేను అహల్యను కాను – కథల పాత్రలలో లోపించిన సంస్కారం, మరి విలువలు మనిషి ఎలా వుండకూడదో చెపుతాయి. ప్రస్తుత వర్తమానంలో ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్  ఎదురుకుంటున్న  పరిస్థితులు మనకి సరిహద్దు కథని తిరిగి తిరిగి గుర్తు చేస్తాయి.

ప్రస్తుత కాలగమనంలో – నా జీవితంతో పాటు చుట్టూ వున్నవారిని గమనిస్తూ వస్తున్న నాకు ఇంకా ఈ విధంగా ఆలోచించే వాళ్ళు వున్నారా అనిపించిన కథలు అతను, ఐ హేట్ మై లైఫ్,  ఒంటరి విహంగం. ఒంటరి విహంగం కథపైన వచ్చిన కామెంట్స్ చూస్తే వున్నారని నిరూపణ అయింది. మనిషి ప్రాపంచిక దృక్పథం, అవగాహన ఒకేలా వుండాలని లేదన్న సత్యాన్ని నాకు గుర్తుచేసిన కథలు ఇవి.

ఈ సంపుటిలో కొన్ని  కథల ముగింపులో ఇచ్చిన కొసమెరుపులాంటి వాక్యాలు –  తెర మరుగున దాగివున్న  జీవిత సత్యాలను తేటతెల్లం చేస్తాయి. ఉదాహరణకి: మనుషుల్ని ద్వేషించినంత సులభంగా వస్తువుల్నీ, ఆస్తుల్నీ ద్వేషించలేం (ఆఖరి చూపు). ఆకలితో ఉన్నవాడికి కొత్త చొక్కా కడుపు నింపదు (బతుకాట).   ఐ లాస్ట్ ఆల్ ది ఫన్ యాజ్ ఎ చైల్డ్! (గలుబె)

క్విల్ట్ లోని కొన్ని కథలలో ఈ రచయిత నీడల పైన ఫోకస్ చేస్తూ వెలుగుని చూపే ప్రయత్నం చేస్తారు (గలుబె, లవ్ ఆల్, అహిగా, సరిహద్దు, థాంక్స్ గివింగ్, చినిగిన చిత్తరువు, నీడ, పార్డన్  మీ ప్లీస్). మరికొన్ని కథలలో వెలుగు దారులలో ప్రయాణిస్తున్న మనిషికి చీకటి కోణాలను పరిచయం చేస్తారు (చిరుత, బతుకాట, ఆయన). ఈ రచనలలో మనం ప్రత్యేకంగా, సాంస్కృతిక వైరుధ్యాలతో వచ్చిన ఇబ్బందులు, వాటిపై పాత్రల వ్యక్తీకరణలు, అపోహలు, వారి సెంటిమెంట్స్, ఒకరినొకరు అర్థం చేసుకోలేని భిన్న మనస్తత్వాల నుండి వచ్చే ఘర్షణలు (క్విల్ట్ , సరిహద్దు, ఆ ఇంట్లో ఒక రోజు, ఆఖరి చూపు, పార్డన్  మీ ప్లీస్ ) చూస్తాం.

క్విల్ట్ కథలలో కనిపించే మరో కలనేత భారత అమేరికన్ జీవితాలు, వాటి మధ్య తారతమ్యాలు – ఎన్నో ఏళ్లుగా ప్రవాసంలో జీవిస్తున్న రచయిత మాత్రమే చెప్పగలేగే కథలు. చిత్రలేఖనం మరి టెన్నిస్ ఆట, రచయితకి ఇష్టమైన అభిరుచులు. అందుకే వాటిని మాధ్యమంగా చేసుకుని రాసిన కథలు వాటికవే ప్రత్యేకం.  అందరూ రాయలేరు. అందుకే ప్రస్తుత తెలుగు రచనా కాలానికి,  గొర్తి గారి రచనలు చదవడం, ముఖ్యంగా కొత్త రచయితలకి ఎంతో అవసరం.

 

కొత్తావకాయ సుస్మిత:

గొర్తి సాయిబ్రహ్మానందం గారి కథలు చదువుతూంటే సులువుగా అనిపిస్తుంది. చదివేవాడి ప్రజ్ఞతో కానీ, వాడివ్వబోయే తీర్పుతో కానీ సంబంధం లేకుండా ఫలానా చోట ఫలానా కథ ఇలా జరిగింది అని మాత్రమే చెప్పడమనే ఉత్తమమైన కథకుడి లక్షణమొకటి గొర్తిగారికి ఎలాగో అబ్బింది .  ఆయన కథల పుస్తకం అట్ట మీద రెడ్ ఇండియన్ టోపీ మీదుండే పక్షి ఈకలాంటి అలవోకదనమేదో ఆ లక్షణమే ఆయన కథలకి తెచ్చిపెట్టింది. సులువుగా చదువుకుంటూ వెళ్లిపోవచ్చు. అలా అని మర్చిపోదగ్గ కథావస్తువులేమీ కాదు .  ఏర్పోర్ట్ లోనో ఫ్లయిట్ లోనో ఉత్పల గుర్తొస్తుంది. నిఖార్సైన వానప్రస్థం అమెరికాలో ఎలా ఉంటుందో ,  అదే ఇండియాలో ఎలా ఉంటుందో పోల్చి చూసేందుకు అవకాశమిచ్చే నాణానికి రెండువైపులా అనిపించే కథలు కొన్నేళ్ల పాటో, కలకాలమూనో గుర్తుండిపోతాయి.

కథా వస్తువులు, అందులోని భావనలూ సార్వజనీనంగానూ ఉన్నప్పుడు ఇవి ఒక ప్రాంతపు కథల్లా అనిపించనే అనిపించవు.  క్లిష్టమైన మానసిక సంఘర్షణల్నీ, మనస్తత్వాలనీ పాఠకుడికి అందించేందుకు కథలోని టెక్నీక్ నో ,  ఒక మెరుపునో తోడు తీసుకోడం ముచ్చటగా అనిపించింది .  క్విల్ట్ కథలో టెక్స్ట్ మెసేజ్ లు ఇవెందుకా అని ఆలోచించేలా చేస్తూనే కథలో అంతర్భాగంలా ఒదిగిపోవడం ఒక ఉదాహరణ మాత్రమే. రాశిలోనూ వాసిలోనూ మెండుగా కథలని ఉత్పత్తి చెయ్యగలిగిన సాయి బ్రహ్మానందం గారు అమెరికా నేపథ్యాన్ని, కథల్ని రికార్డ్ చేసిన విధానం బావుంది. అవి కాస్త సీరియస్ పాఠకులేదేశం వారైనా అర్ధం చేసుకోడానికి ఇబ్బంది పడాల్సిన అవసరమేమీ ఉండదని నాకనిపించింది .  అమెరికా వాసైన ఒక తెలుగు రచయిత సక్సెస్ కి ఇంతకంటే కొలమానమేముంటుంది?

 

శివ సోమయాజుల:  క్విల్ట్ – ఇరవై ఏడు విభిన్న కథల  సమాహారం.

గొర్తి సాయి బ్రహ్మానందం గారితో నాకు ఒక దశాబ్ద కాల పరిచయం. ఒకరి కథలనొకరు నిర్మొహమాటంగా విమర్శించుకోవటం మాకలవాటు. ఈ సంపుటి పైన కూడా నా అభిప్రయాన్ని కుండబ్రద్దలు కొట్టినట్టుగా చెప్తానని ఆయనకి నేను మాటిచ్చాను.

ఈ కథలన్నిటికీ ఒక అంతర్ సూత్రం – వైవిధ్యం! వస్తు వైవిధ్యం, శిల్ప వైవిధ్యం, భాషా వైవిధ్యం(కుండ సంగతి మర్చిపోకండి), నేపధ్య వైవిధ్యం – ఇలా అనేక రకాలు. ఆయన ఈ కథలలో చేసిన ప్రయోగాలెన్నో. ఆయనకి కథా సాహిత్యం తో పాటు, టెక్నాలజీ, సంగీతం, నాటకం, చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, టెన్నిస్  రంగాలలో పరిచయం ఉండటంతో అవన్నీ కూడా మనకి ఈ కథలలో ఎదో రూపంలో కనపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయనకి మన చుట్టూ జరిగే మామూలు సంఘటనలలో మానవ ప్రవర్తనని నిస్పక్షంగా చూసే సునిశిత దృష్టి ఉంది. అమలాపురంలో పుట్టి, పెరిగి, అక్కడి పల్లె జీవితాన్నీ, అమెరికాని  కర్మభూమిగా  చేసుకొని ఇక్కడ అనేక దేశీకుల జీవితాలనీ దగ్గరగా చూసిన అనుభవం ఉంది. అవన్నీ కూడా మనకి ఈ కథలలో పరిచయం అవుతాయి.

అమెరికాలో నల్ల వారి జీవితాలు(లవ్ – ఆల్, గులుబే, బ్లాక్ పెరల్) , మెక్సికన్ల జీవితాలు (సరిహద్దు, థాంక్స్ గివింగ్) , అమెరికన్ ఇండియన్ జీవితాలు (ఆహిగా, చిరిగిన చిత్తరువు)  – ఇలా వివిధ జీవితాల వెతలని మన తెలుగు వారికి (ముఖ్యంగా ఇండియాలో ఉన్న తెలుగువారికి) ఇంతలా దగ్గరకి తీసుకువచ్చిన రచయిత మరొకరు లేరనడంలో అతిశయోక్తి లేదు!

నాకు “బాఘా” నచ్చిన కథ – “అహిగా” – ఒక అమెరికన్ ఇండియన్ చిత్రలేఖనా ఆర్టిస్ట్ కథ. అద్భుతమైన వర్ణ చిత్రాలని వేయగలిగే ఈ కళాకారుడు ఒక యాక్సిడెంట్లో రంగులు చూసే శక్తి కోల్పోయి, బ్లాక్ & వైట్ చిత్రాలని మాత్రమే చిత్రిస్తూ ఉంటాడు. ఏస్థటిక్స్, భాష, వర్ణనలు – ఒక బాపూ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది మనకి ఈ కథ చదువుతుంటే.

వృద్ధాప్యం గురించి చెప్పకనే అద్భుతంగా చెప్పిన కథ “ఆ ఇంట్లో ఒక రోజు”. ఇది ఒక అమెరికన్ వైట్ ఫ్యామిలీ కథ – కానీ ఈ కథలోని సార్వజనీనత మనని మన రూట్స్ లోకి తీసుకెళ్తుంది. “అతడు” – ఒక టైంలెస్ కథ. విమానయానంలో అపరిచుతులతో, మనసు విప్పి మాట్లాడుకున్న, ఒక ఇద్దరి కథ. “ప్రయాణాల్లో అపరిచుతులతో మన గురించి మనం చెప్పుకోవడమనేది మనకి మనం ఉపశమనం కలిగించుకోవటానికి తప్ప దాన్నుంచి ఇంకేదో ఆశించి కాదు. అందుకే మన పరిచయం పొడిగించటం నాకిష్టం లేదు, సారీ!” – ఆధునిక అమెరికన్ స్టొరీ టెల్లింగ్ టెక్నిక్ వాడి రాసిన అచ్చ తెలుగు కథ ఇది.

“రంగు ముక్కల దుప్పటి బొంత” – క్విల్ట్ – గొర్తి గారికి ఇష్టమైన కథనుకుంటా, ఈ సంకలనానికి శీర్షికగా పెట్టేంతగా. ఒక ఇండో-అమెరికన్ జంట కథ. ఇదొక కె విశ్వనాధ్  సెంటిమెంట్ సినిమా లాంటి కథ. నా వరకూ ఇది “పెద్దగా” అనిపించిన కథ, అనాసక్తిగా ఉండే వివరాలతో నిండిన కథ.

టెన్నిస్ కథలు – “డ్యూస్”, “బతుకాట”, “లవ్ – ఆల్” . బతుకాట నాకు “బాగా” నచ్చిన కథలలో ఒకటి. గొర్తి గారు ఎంతో సంయమనంతో తూచి తూచి రాసిన కథ అని నాకనిపించింది. ఈ కథ ముగింపు నాకు చాలా గొప్పగా అనిపించింది – “మాకు బ్రతకటమే పెద్ద ఆట” అనే చిన్న వాక్యంతో చాలా భారీ ముద్ర వేస్తాడు రచయిత ఇక్కడ.

అమెరికాలో తెలుగు కుటుంబాలు ఎదుర్కొనేటటువంటి “కల్చర్  క్లాషెస్” గురించి వ్రాసిన కథలు “ఐ హేట్ మై లైఫ్”, “బ్లాక్ పెరల్”, “గులుబె” వంటివి. రచయిత ఎక్కువ ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక ఆబ్జెక్టివ్ అబ్జర్వర్ లాగా వ్రాసిన కథలు.

“నీడ” – మధ్యమ పురుషలో మనుషుల కాంప్లెక్స్ మనస్తత్వాలను చిత్రిస్తూ రాసిన కథైతే, సినిమా స్క్రీన్ప్లే ఫార్మాట్లో వ్రాసిన ప్రయోగాత్మక కథ “పార్డన్ మి ప్లీజ్”, ఈమైల్ డైరీ గా “ఆయన”, కథలో సినిమా కథగా “కథాకలహం”, ప్రాణం లేని వస్తువుల సంభాషణలతో “సైన్యం”  – ఇవన్నీ శిల్పంతో చేసిన ప్రయోగాలే.

“ఊర్మిళ రేఖ” – ఈ సంకలనంలో ఉన్న ఒకే ఒక పౌరాణిక పాత్ర ఉన్న కథ. నేను ఈ సంకలనంలో “బాఘా” ఇష్టపడిన కథలలో ఇది ఒకటి. రామాయణంలో భర్త మాట జవదాటక అంత:పురం లోనే ఒంటిరిగా కుమిలిపోయిన ఊర్మిళకీ, ఈ రోజున, భర్త వద్దంటే, దుబాయి వెళ్ళకుండా, అత్త మామలకి సేవలు చేస్తూ ఆగిపొయిన నిర్మలకీ పెట్టిన లంకె బలంగా పడింది. దీనిలో వాడిన భాష కూడా మిగిలిన వాటికి భిన్నంగా, బరువైన వాక్యాలు ఉంటాయి.

ఎప్పుడో అడపా దడపా చదవటం కాకుండా, ఈ ఇరవై ఏడు కథలు ఏక బిగిన చదివిన తరవాత నాకు రచయిత మీద మరింత గౌరవం పెరిగింది. ఇన్ని విషయాల మీద, ఇన్ని విభిన్న ప్రయోగాలు చేస్తూ వ్రాసిన ఇన్ని కథలు, ఆయన రచనా ప్రస్థానం ఎంత గొప్పగా సాగిందో చెప్తాయి.

కానీ నాకున్న ఒకే ఒక ఫిర్యాదు – “లేజీ రైటింగ్”, చాలా కథలలో. పాత్రల మధ్య సంభాషణలలో కాదు, రచయిత ప్రధమ పురుషలో కథ చెప్పేటప్పుడు. “ఊర్మిళ రేఖ”, ఇంకా మరి కొన్ని కథలలో కనిపించిన వాక్యాలకున్న బరువు, మిగిలిన కథలలో కనపడదు. అది ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే అనుసరించిన స్టైల్ కావచ్చు. నా వరకూ ఆ శైలి, ఆ కథలు చేరుకోవాల్సిన ఎత్తులకీ, కథకుడిగా ఆయన అధిరోహించగల శిఖరాలకీ చేరకుండా అడ్డుపడ్డ అవరోధం.

కానీ ఇది పూర్తిగా నా వైయక్తిక ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం. అది పక్కన పెడితే, ఇంత వైవిధ్యభరితమైన సంకలం చదివిన తరవాత గొర్తి సాయి బ్రహ్మానందం రచయితగా ఒక పూర్తి “ఆల్ రౌండర్”, ఈ సంకలనం అమెరికన్ తెలుగు కథని పది మెట్లు పైకెక్కించినదని నిర్ద్వంద్వముగా చెప్పగలను.

 శ్రీనిధి: 

27 కథలు ఉన్న ఈ క్విల్ట్ సంకలనం వైవిధ్యమైన కధాంశాలతో అమెరికా ప్రవాస జీవితాలతో పాటు, మన లాగే ఇక్కడి వచ్చిన ఇతర దేశపు వారి జీవితాలను అలాగే ఇక్కడి వారి జీవితాలను కూడా వివిధ కోణాలలో మనకు చూపుతాయి. చివరికి ఎక్కడి వారైనా మానవ సంబంధాలు, బలహీనతలు , మనోభావాలు ఒకే విధంగా ఉంటాయేమో అనిపిస్తుంది.

కధాంశాలు అన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. గలుబె, బ్లాక్ పెర్ల్, ఐ హేట్ మై  లైఫ్ లో ఇక్కడి టీనేజ్ పిల్లల మనస్తత్వాలని వారు ఎదిగే క్రమంలో ఎదుర్కొనే ఒత్తిడిని చక్కగా చూపగలిగారు. చినిగిన చిత్తరువు, అహిగా రెండూ కూడా కళాకారుల జీవితాలను, వారికంటూ ఉండే వేరే ప్రపంచాన్ని, వారు ఎదుర్కొనే సంఘర్షణని చూపిస్తాయి.

ఆ ఇంట్లో ఒక రోజు, వానప్రస్థం రెండు కథలు తూర్పు అయినా పడమర అయినా తల్లితండ్రులుకి పిల్లలకి మధ్య బతుకు పోరులో పెరిగే దూరాలు ఒకేలా ఉంటాయేమో అని చూపించాయి. థాంక్స్ గివింగ్, బతుకాట కథలు రెండూ సమాజంలో మనం మార్చలేని వివక్షలు, మనుషుల అస్సహాయత చాలా చక్కగా చూపగలిగారు. ఇలా ఒక్కో కథ విభిన్నమైన దృక్కోణంలో మనకి రకరకాల జీవితాలని చూపిస్తాయి. అచ్చంగా డియాస్పోరా కథలు అని చెప్పవచ్చు.

*

యాజి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు