పేరుకే అది శాంత మహాసాగరం!

అది మాకు గొప్ప విజయమేగానీ, ఎవరికి చెప్పినా ‘మీ డ్యూటీ మీరు చేశారు, అదేమన్నా గొప్ప విషయమా? జీతాలు తీసుకోవడం లేదా?’ అనే అంటారు. ఎవరికీ చెప్పని, చెప్పుకోలేని గాథలు నావికులందరీ జీవితాల్లోనూ దాగి ఉంటాయి.

సముద్రమైనా ఋతువునుబట్టి మారుతూనే ఉంటుంది. వర్షాకాలంలో హిందూ మహాసముద్రం, చలికాలంలో మిగతా అన్ని సముద్రాలూ అల్లకల్లోలంగా ఉంటాయి. చెప్పాపెట్టకుండా వస్తూపోయే తుఫానులు సరేసరి. ప్రపంచాన్ని మొదటిసారిగా చుట్టివచ్చిన బుడతకీచు (పోర్చుగీసు) నావికుడు ఫెర్డినాండ్ మగెల్లన్, 1520లో ఆ మహాసముద్రానికి ‘మేర్ పాసిఫికో’ అని పేరుపెట్టాడు. అతను, అతని సహచరులు ఆ సముద్రాన్ని దాటినపుడు అది చాలా ప్రశాంతంగా ఉందట. అయితే అది ఎల్లప్పుడూ అలానే ఉంటుందనుకుంటే అంతకన్నా పొరబాటు మరొకటి ఉండదు. ఈ సంగతి నేను స్వానుభవం ద్వారా తెలుసుకున్నాను.

ఛీఫ్ ఇంజినీరుగా బాధ్యతలను చేబట్టిన మొదటి ఓడలో, వాన్‌కూవర్ (కెనడా) నుండి సింగపూర్ మీదుగా బోంబే వెళుతున్నాం. అది చలికాలం. పసిఫిక్ మహాసముద్రాన్ని దాటుతూండగా భయానకమైన సముద్రంలో చిక్కుకున్నాం. అప్పుడు నా వయసు 28 ఏళ్లు. ఆనాటికి కంపెనీలో పనిచేస్తూన్న ఛీఫ్ ఇంజినీర్‌లలో అతి చిన్న వయస్కుడిని.

మంగుళూరు రేవులో ఆ బల్క్ కేరియర్‌లో జాయిన్ అవుతున్నప్పుడే ఏజెంటు ఆఫీసులో, నన్ను కేడెట్ అనుకొని బయట వరండాలో కూర్చోబెట్టారు. కనీసం మంచినీళ్లయినా ఇచ్చేవాడు లేడు. నేనే బయటకుపోయి, టీ తాగి వచ్చి, ఏజెంటుతో మాట్లాడదామని ప్రయత్నిస్తే, అతడు, ఫోనులో ఎవరిపైనో కేకలు వేస్తున్నాడు; నన్ను బయట కూర్చోమని సైగ చేశాడు. మరో గంటయ్యాక ఆ కేడెట్ రానే వచ్చాడు. వాడు స్థానికుడు కావడంచేత బంధుమిత్రులకు వీడ్కోళ్లు చెప్పి, సావకాశంగా, రెండు గంటలు ఆలస్యంగా చేరుకున్నాడు. వాడిని చూడడంతోటే – నేనే ఛీఫ్ ఇంజినీర్‌ని అని గ్రహించిన ఏజెంటు, గాభరాపడుతూ బయటకువచ్చి, నాకు క్షమాపణలు చెప్పి, తన కేబిన్‌లోకి తీసికెళ్లి మర్యాదలు చేశాడు. ప్రక్కనే కూర్చున్న ఎలెక్ట్రికల్ ఆఫీసర్ నాయర్‌కి పరిచయం చేశాడు.

“మీరు ముగ్గురూ ఇవాళ జాయిన్ అవుతున్నారు, కారు రెడీగాఉంది. ఈ కేడెట్ ఆలస్యం చేసాడు; ఈ రోజుల్లో యువతరం ఎంత బాధ్యతారహితంగా ఉంటారో మీకు తెలియంది కాదు. మిమ్మల్ని అనవసరంగా ఇంతసేపు కూర్చోబెట్టాను. అయినా తెలియక అడుగుతాను, మీరు మరీ ఇంత చిన్న వయసులో ఛీఫ్ ఇంజినీరయ్యారంటే,  అబ్బో! అది చాలా గొప్ప విషయమే!” అన్నాడు, నన్ను కుషామత్ చెయ్యడానికి.

“ఏముంది? పరీక్షలన్నీ గట్టెంకించాను, అదృష్టం బాగుండి,” అన్నాను, విసుగ్గా.

“బడాసాబ్‌కి కంపెనీలో చాలా మంచి పేరుంది,” అన్నాడు నాయర్.

పరీక్షలు ఎలానూ పాసవ్వాలిగానీ, కేప్టెన్, ఛీఫ్ ఇంజినీర్‌ల ప్రొమోషన్‌లు పూర్తిగా కంపెనీ యాజమాన్య నిర్ణయాలు. ఈ విషయం అందరికీ తెలుసు.

కారు బయలుదేరింది. మంగుళూరు ఊరికి రేవు బాగా దూరం; మధ్యలో అంతా అడవిలా ఉండేది. ఉన్నట్టుండి ఒక ముంగిస, రోడ్డుని దాటి తుప్పల్లో మాయమయింది.

“ఇది శుభ శకునం; ఈ షిప్పులో మనకి అంతా మంచే జరుగుతుంది,” అన్నాడు నాయర్.

మొదటిసారిగా ఛీఫ్ ఇంజినీరు బాధ్యతలను చేబడుతున్నందున నేను లోలోపల నెర్వస్‌గా ఉన్నమాట వాస్తవమే. ఒక షిప్పుకు కేప్టెన్‌గా, లేదా ఛీఫ్ ఇంజినీరుగా వ్యవహరించడమంటే అది చాలా పెద్ద బాధ్యత. తప్పుచేస్తే అందరి ప్రాణాలూ పోవచ్చు.

“నాకలాంటి మూఢ నమ్మకాలు లేవు,” అని నాయర్‌తో అన్నాను గానీ – ఆ ముంగిస నాకు ఎక్కడో చిన్న ధైర్యాన్ని కలిగించిందని చెప్పకతప్పదు. చారిత్రక, సంప్రదాయ కారణాలచేత, సముద్రయానంలోని అనిశ్చితి వలన – నావికులలో ఎన్నో నమ్మకాలు పేరుకుపోతాయి. వాటిని వివరిస్తూపోతే ఒక పెద్ద వ్యాసం అవుతుంది.

షిప్పులోకి వెళ్లగానే, సెలవుమీద వెళ్లిపోతూన్న ఛీఫ్ ఇంజినీరు, చావు కబురు చల్లగా చెప్పాడు. మూడు జెనరేటర్లలోనూ ఒకటి సరిగ్గా పనిచేయడం లేదు; ఎప్పుడు చేతులెత్తేస్తుండో చెప్పలేం. స్పేర్ పార్ట్స్ కోసం ఇండెంటు పెట్టాడుగానీ, ఇంకా రాలేదు. పోర్టులోకి వచ్చేటప్పుడూ, కార్గో గేర్ (క్రేన్‌లు) పనిచేసేటప్పుడూ రెండు జెనరేటర్లు అవసరం. సెయిలింగులో ఒకటి సరిపోతుంది. అయినప్పటికీ, మూడూ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి.

కొంత మంగళూరులోనూ, మరి కొంత మద్రాసులోనూ ఇనుప ఖనిజం లోడు చేసుకొని జపాన్ బయలుదేరాం. అక్కడినుండి  స్టీల్ రోల్స్ తీసుకొని వాన్‌కూవర్ చేరుకున్నాం. జెనరేటర్ స్పేర్స్ కోసం పదేపదే రేడియో మెసేజిలు పంపుతూనే ఉన్నాను. మొదట సింగపూర్‌లో సప్లై చేస్తామన్నారు కంపెనీవారు; తరువాత జపాన్ అన్నారు. జపాన్ నుంచి బయలుదేరుతూనే ఆ బిమారీ జెనరేటర్, చేతులెత్తేసింది. రెండు జెనరేటర్లతోనే పసిఫిక్ దాటి, వాన్‌కూవర్ వరకూ లాక్కొచ్చాం. అదృష్టవశాత్తూ, పసిఫిక్ మా పట్ల చాలా రోజులపాటు దయగానే ఉంది. కానీ రెండు రోజుల్లో కెనడా తీరం చేరుతాం అనగా తడాఖా చూపించింది.

రేవులో తలదాచుకొని సేదతీరాం. ‘ఇప్పుడైనా మేము అడిగిన పార్ట్స్ వస్తాయో రావో?’ అనే ఆందోళన కొనసాగింది. ఒకసారి సముద్రంలోకి అడుగుపెడితే స్పేర్‌లూ ఉండవు, సర్వీస్ ఇంజినీర్‌లూ ఉండరు మా పాట్లేవో మేమేపడి షిప్పుని నడిపించాలి. అందుకే, ‘విరామెరుగక పరిశ్రమించే,….యంత్రభూతముల కోరలు తోమే,’ మెరైన్ ఇంజినీర్లంటే నాకు ఎనలేని గౌరవం. ‘టైటానిక్’ సినీమా పుణ్యమా అని ఆ విషాదం గురించి అందరికీ తెలిసింది. కానీ ఆ షిప్పులోని 24 మంది ఇంజినీర్లు, 10 మంది ఎలెక్ట్రీషియన్లు, తదితర సిబ్బంది తుది వరకూ ఎలెక్ట్రిక్ పవర్‌ని అందజేస్తూ ప్రాణాలు విడిచారని చాలామందికి తెలియదు. ఆఖరి నిమిషం వరకూ లైట్లు వెలుగుతూండడం వలన ఎంతోమంది ప్యాసెంజర్లు, సిబ్బంది లైఫ్‌బోట్‌లను చేరుకోగలిగారు.

ఎట్టకేలకు, వాన్‌కూవర్ పోర్టునుంచి బయలుదేరుతామనగా స్పేర్‌పార్ట్స్ వచ్చాయి. రోడ్డుకి అడ్డంగా పరుగెత్తిన ముంగిస తెచ్చిపెట్టిన అదృష్టం, కంపెనీలో నాకు ఉందని అనుకున్న పలుకుబడి – కలసికట్టుగా పనిచేశాయన్నమాట! మా కార్గో – పొడి రూపంలో ఉండే మ్యూరియేట్ ఆఫ్ పొటాష్ (MOP) అనే  రసాయన ఎరువు. 30 రోజులలోపు సింగపూర్, మరో 10 రోజుల్లో బోంబే చేరుకోగలం అనే అంచనాతో బయలుదేరాం. ‘సముద్రం మరీ అల్లకల్లోలంగా ఉంటే మరో మూడు రోజులు’ అనుకున్నాం. మర్నాడు బయలుదేరుతామనగా మా ఏజెంటు, పోర్టు విడుదల చేసిన   తుఫాను హెచ్చరికను మా కేప్టెన్‌కి అందజేశాడు. ముందుజాగ్రత్తలు తీసుకోమని కేప్టెన్ నాకూ, ఛీఫ్ ఆఫీసర్‌కీ తెలిపాడు. సముద్రంలోకి అడుగు పెట్టడంతోనే మా కష్టాలు మొదలయ్యాయి. రేడియో ద్వారా వచ్చే వాతావరణ సూచనలు, హెచ్చరికలుగా మారాయి. అందరి దృష్టి, బ్రిడ్జ్ మీద ఉండే బెరామీటర్ పైనే; నానాటికీ అది పడిపోతూనే ఉంది. డెక్ ఆఫీసర్ల వదనాలలోంచి నవ్వు మాయమైంది. అనుభవశాలి అయిన మా గోవన్ కేప్టెన్, ఫెర్నాండెజ్ ముఖంలో కూడా ఆందోళన కనిపించింది. సెలూన్‌లో బిగ్గరగా ధ్వనించే అతని జోకులు, నవ్వులు ఆగిపోయాయి. చూస్తూండగానే ఉత్తర పసిఫిక్, ఉగ్రరూపం దాల్చింది. ఆనాటికి నా సముద్రయాన అనుభవం ఏడేళ్లు మాత్రమే. కానీ మా కేప్టెన్‌కి ముప్ఫై అయిదేళ్ల అనుభవఙ్ఞుడు. పెద్ద ప్రమాదం ముంచుకు రాబోతున్నదని నాకు అర్థం అయింది.

ఓడ ఊగిసలాటలు శృతిమించాయి. రోలింగ్, పిచింగ్ పరాకాష్టకు చేరుకున్నాయి. ఎంత జాగ్రత్తగా పెట్టినా, కేబిన్‌లో వస్తువులు చిందరవందర అయ్యాయి. గాజు, పింగాణీ వస్తువులు విరిగి ముక్కలయ్యాయి. షిప్పు ఫుల్ లోడులో ఉన్నా ప్రొపెల్లర్ ఒక్కోసారి నీళ్లల్లోంచి బయటకువచ్చేస్తూ, ఇంజిన్ ఓవర్‌స్పీడ్ (‘హార్స్-రేసింగ్’ అంటారు; దౌడుతీస్తున్న గుర్రంమీద కూర్చున్నట్లు అనిపిస్తుంది.) చికాకు పుట్టిస్తోంది. నిద్రపోయేందుకు ప్రయత్నిస్తూండగా, బంక్ మీదనుండి క్రింద పడిపోవడం మొదలైంది. ఎవరికీ సరైన నిద్ర లేదు. సపోర్టు లేకుండా నాలుగడుగులు వెయ్యలేకపోతున్నాం. జారిపడతామనే భయంతో స్నానాలకు స్వస్తి చెప్పాం; గెడ్డాలు మాసిపోతున్నాయి.

ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న నావికులకు కూడా వాంతులయ్యాయి; అందరిలోనూ తిండి అంటే ఏవగింపు కలిగింది. కోడిగుడ్లు ఉడికిస్తూండగా, ఛీఫ్ కుక్ మీద మరుగుతూన్న నీళ్లు పడి వొళ్లు కాలింది; అదృష్టవశాత్తూ పెద్ద గాయాలు కాలేదు. పొయ్యమీద గిన్నెలు నిలవడంలేదనీ, వంట చెయ్యలేమనీ, వంటవాళ్లు చేతులెత్తేసారు. తుఫాను రోజుల్లో ఉడకబెట్టిన కోడిగుడ్లూ, (అన్నం, పప్పు, కూరలూ ఒకేసారి ఉడికించి చేసే) కిచిడీ మాత్రమే వొండుతారు. కిచిడీని ఆవకాయలతో తినడం సర్వసాధారణం. అదికూడా తినబుద్ధి కాలేదు. రెండో రోజుకల్లా అంతా నీరసించిపోయారు. నిద్రలేక అందరికీ చిరాకులూ, కోపాలూ ఎక్కువయ్యాయి. “కౌన్ సాలా పన్‌వతీ ఛడాహై, జహాజ్ మే?” (‘ఎవడు ఈ ఓడమీద తన ఐరన్ లెగ్ మోపాడు?’) అని సిబ్బంది తిట్టుకున్నారు.

హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు – ఎవరి ప్రార్థనలు, వేడుకోళ్లు వారు మొదలుపెట్టారు; మొక్కుకున్నారు. ఒకరిద్దరు కుర్ర స్ట్యూవర్డ్‌లు ఏడ్చేశారు. నా స్ట్యూవర్డ్ డిసూజా – సురక్షితంగా బోంబే చేరుకుంటే, ఇంకెప్పుడూ షిప్పులో అడుగుపెట్టనని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రతిఙ్ఞ చేశాడు. అతని భుజం తట్టి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను.

తుఫాను వాతావరణం సాధారణంగా రెండు-మూడు రోజుల్లో కుదుటపడుతుంది. ఆ సారి మాత్రం, వారం రోజులైనా ఇంకా అలాగే ఉంది. 40-50 అడుగుల ఎత్తైన కెరటాలు, రాత్రనక, పగలనక నిరంతరంగా ఢీకొడుతున్నాయి. బ్రిడ్జ్ మీదకి వెళితే మహావేగంగా వీచే గాలి; అది చేసే వింత ధ్వనులను ఎంత ధైర్యవంతులైనా తట్టుకోలేరు. ఒక్కొక్క కెరటం నెమ్మదిగా పైకి, ఇంకా పైకి, ఏభై అడుగులవరకూ లేస్తూ, దభీమని షిప్ మీద పడడం; గాలి వెదజల్లే ఉప్పునీళ్లు; ఊదారంగు కెరటాలమీద తెల్లటి చారికలు; కెరటాల నెత్తిన గాలికెగిరిపోతూ నురుగు; విభ్రమ కలిగించే సమ్మోహకశక్తి ఏదో ఆ బీభత్సంలో ఉందనిపిస్తుంది. సముద్రుడి విశ్వరూపాన్ని గుడ్లప్పగించి చూస్తూ నిలిచిపోతాం. కెరటం ఢీకొట్టినప్పుడల్లా షిప్పంతటినీ కుదిపివేసే ప్రకంపనలు మనల్ని విహ్వలితులను చేస్తాయి. మానవ నిర్మాణాల అల్పత్వాన్ని అవహేళన చేస్తాయి. ప్రకృతి శక్తి షిప్పుని ఎత్తి కుదేస్తూంటే అందరిలోనూ ఒకే ఆలోచన: ఎప్పటికీ విషమపరీక్ష ముగుస్తుంది? ఇంకా ఎన్ని రోజులీ యాతన? ప్రాణాలతో బయటపడతామా? ఇప్పుడు ఇంజినుగాని ఆగిపోతే?….

బోఫోర్ట్ స్కేల్ (సముద్ర స్థితిని కొలిచే కొలమానం – Beaufort Scale) ప్రకారం నెంబర్ 10కి చేరుకున్నామని కేప్టెన్ ప్రకటించాడు. అంతకన్నా ఎక్కువే ఉంటుందంటాడు, ఛీఫ్ ఆఫీసర్.

ఇంజినీర్‌లకి ఒకటే చింత. జెనరేటర్లుగానీ మొరాయిస్తే? మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది. కెరటాల ఉధృతి ఎటు తిప్పితే షిప్పు అటు తిరిగిపోతుంది. కెరటాలకు ఎదురుగా పోవడమే ఉత్తమం (‘రైడింగ్ ద వేవ్స్’). అంత పెద్ద కెరటాలు షిప్పుకి ఎదురుగా కాకుండా పక్క నుంచి వచ్చి తగిలాయో…ఇంతే సంగతులు; తిరగబడిపోవచ్చు. ఎట్టి పరిస్థితులలోనూ ఇంజిన్ ఆగకూడదు; ప్రొపెల్లర్ తిరుగుతూనే ఉండాలి. స్పేర్స్ ఉన్నాయిగానీ, ఇంజిన్‌రూములో ఎలా పనిచేస్తాం? అన్నీ ఊగిపోతున్నాయి; ఇంజినీర్లకీ, సిబ్బందికీ దెబ్బలు తగలే అవకాశాలు ఎక్కువ. పైగా తిండి, నిద్ర లేక అంతా నీరసించి ఉన్నారు.

ఇంతలో మా రేడియో ఆఫీసర్ ఒక దుర్వార్తను మోసుకొచ్చాడు. మాకు సుమారు 100 మైళ్ల దూరాన ఒక ఓడ మునిగిపోయింది; అంతే కాదు, అది ఇండియన్ ఆఫీసర్లు, సిబ్బందితో కూడిన షిప్. అంతర్జాతీయ నియమాల ప్రకారం, ఆ వార్తను అందుకున్న ఓడలన్నీ వెళ్లి మునిగిపోయిన ఓడ సిబ్బందిని రక్షించేందుకై తమ సంసిద్ధతను తెలియజెయ్యాలి. ‘మనం వెళ్లాల్సిందే,’ అన్నాడు కేప్టెన్. ఈలోగా ఒక నార్వీజియన్ ఓడ, నీళ్లల్లో ఉన్నవారినందరినీ రక్షించిందని వార్త వచ్చింది. ఛీఫ్ ఇంజినీర్ మాత్రం, రెస్క్యూ ఆపరేషన్‌లో గుండెపోటుతో మరణించాడు. అటువంటి తుఫాను నడుమ, అత్యంత సాహసోపేతంగా, సమర్థవంతంగా ప్రాణాలను కాపాడిన నార్వీజియన్ ఓడ కేప్టెన్‌కి, మా కేప్టెన్‌ అభినందన సందేశం పంపాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఓడలన్నీ ప్రతీ గంటకీ స్టేటస్ తెలియజెయ్యాలని అమెరికన్ కోస్ట్‌గార్డ్ ఆదేశించింది.

సెకండ్ ఇంజినీర్‌ని పిలిచి జెనెరేటర్ రిపేర్ విషయం చర్చించాను. మరో మార్గం లేదని అతడు అంగీకరించాడు. వెంటనే పని మొదలుపెట్టాం. ఒక రోజులో అయిపోయే పనికి మూడు రోజులు పట్టింది. అందరికీ చిన్నా పెద్దా దెబ్బలు తగిలాయిగానీ, ఏమంత ప్రమాదకరమైనవి కాదు. ఎముకలు విరగడంలాంటివి జరిగితే ఏమవుతుందో అని నేనూ, సెకండ్ ఇంజినీరూ భయపడ్డాం. అదృష్టవశాత్తూ అంతా సవ్యంగా ముగిసిపోయింది. కేప్టెన్, ఇంజినీర్‌లకు అభినందనలు తెలిపాడు. ‘వాతావరణం బాగుపడగానే పార్టీ చేసుకుందాం,’ అన్నాడు.

ఎట్టకేలకు తుఫాను ఉధృతం తగ్గి తెరిపి ఇచ్చింది. కేప్టెన్, ఛీఫ్ ఆఫీసర్, నేను, సెకండ్ ఇంజినీర్ కలసికట్టుగా డెక్ ఇన్స్‌పెక్షన్ చేసి, రిపోర్టు తయారుచేశాం. దాన్ని హెడ్ ఆఫీసు (బోంబే)కి పంపాలి. రిపేర్లకీ, ఇన్సూరెన్స్ క్లైమ్స్‌కీ అదే ఆధారం. ఇన్స్‌పెక్షన్‌లో చాలా విధ్వంసం వెలుగులోకి వచ్చింది. అన్నిటికనా తీవ్రమైనది – కెరటాల తాకిడికి ఒకటి, రెండు, మూడు కార్గో హ్యాచ్ కవర్లు (కార్గో లోడ్ చేసిన కుహరపు పైకప్పు) అన్ని లాక్‌లూ ఊడిపోయి ఉన్నాయి. భగవంతుడి దయవల్ల, లేదా అదృష్టవశాత్తూ – స్టీలు హ్యాచ్ కవర్లు మాత్రం వాటి స్థానంలోనే ఉన్నాయి. అవి పక్కకు జరిగిపోయి ఉంటే నీళ్లు కార్గో హోల్డ్‌స్‌లోకి ప్రవేశించి, షిప్పు మునిగిపోయే ప్రమాదం ఏర్పడేది. ఎందుకంటే ఒకటి, రెండు కంపార్ట్‌మెంట్లలో నీళ్లు నిండినా తట్టుకొని తేలగలిగే ప్లవనశక్తి డిజైన్‌లో ఉంటుంది. మూడు లేదా అంతకన్నా ఎక్కువ కంపార్ట్‌మెంట్లు నీళ్లతో నిండితే, స్థిరత్వం ప్రమాదస్థాయికి చేరుకుంటుంది. నెంబర్ వన్ హోల్డ్ పూర్తిగా నీటితో నిండిపోయింది. ఫలితంగా ఓడ ముందుకు ఒరిగిపోయింది (Down by head).

మరో రెండు రోజుల్లో సముద్రం పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. తుఫాను మూలంగా డేమేజి అయిన మెషీనరీని మరామ్మత్తు చేసే పనిలో పడ్డాం. లంగరుని ఎత్తే విండ్‌లాస్ పూర్తిగా చెడిపోయింది. ఎలెక్ట్రికల్ ఆఫీసర్ సహాయంతో పదిరోజుల పాటు  శ్రమించి, ఆ పని పూర్తిచేశాను. మిగిలిన ఇంజినీర్లు, ఇంజిన్‌రూమ్‌లోని రిపేర్లు చేబట్టారు.

తుఫాను తాకిడి తగ్గాక, సెక్స్‌టంట్ సాధనాన్ని ఉపయోగించి సూర్యుడినీ, తారలనూ చూసి, మా నిజస్థానాన్ని నిర్ధారించుకునేటప్పటికి  మరో విషయం బయటపడింది; మేము అనుకున్న దూరంలో నాలుగవ వంతు కూడా ముందుకి సాగలేదు! శాటలైట్ నేవిగేషన్‌లేని ఆరోజుల్లో నౌక స్థానాన్ని నిర్ధారించడం సెక్స్‌టంట్ ద్వారానే సాధ్యపడేది. మేఘాలు కమ్ముకుంటే, షిప్పు ఊగిసలాడుతూంటే, సెక్స్‌టంట్ అక్కరకు రాదు.

మా నత్తనడక మూలంగా, దూరం అలానే ఉందిగానీ ఇంధనం బాగా ఖర్చయింది. అంటే సింగపూర్ చేరుకోలేం అన్నమాట. దాటుతున్నది పసిఫిక్ మహాసముద్రమాయె! దారిలో ఎక్కడా ఫ్యూయెల్ తీసుకొనే (దీన్నే ‘బంకరింగ్’ అంటారు; తగినన్ని ఇంధన నిల్వలు ఉండేలా చూసుకోవడం ఛీఫ్ ఇంజినీరు బాధ్యత) అవకాశమే లేదు. దారి మళ్లిస్తే, మిగిలి ఉన్న ఇంధనంతో గువామ్ ద్వీపం చేరుకోవచ్చని కేప్టెన్ కనుగొన్నాడు. కానీ అది అమెరికన్ సైనిక స్థావరం. అక్కడ సోవియట్ యూనియన్, చైనాలపై సంధించిన అణ్వాస్త్ర క్షిపణులుంటాయి. వాళ్లేమో మీరిక్కడకి రావడానికి వీల్లేదంటారు. కంపెనీ మీద ఒత్తిడి తెచ్చాడు మా కేప్టెన్. చాలా రేడియో మెసేజిలు వెళ్లాయి; జవాబులు వచ్చాయి. కొన్ని రోజులపాటు నాకూ, కేప్టెన్‌కీ టెన్షన్. చిట్టచివరికి అమెరికన్ అధికారులు ఒప్పుకున్నారు. కొన్ని షరతులు విధించారు. ఫ్యూయెల్ టాంకులు ఖాళీ అవుతూండగా గువామ్ చేరుకున్నాం. ఆ విధంగా ఆ సమస్యనుండి బయటపడ్డాం.

మర్నాడు సింగపూర్ చేరుతామనగా, మా డెక్ ఫిట్టర్ త్రాగేనీరు నిల్వచేసే టాంక్ ఒకదాని మ్యాన్ హోల్ కవర్ తెరిచి ఉంచి, టీ తాగడానికని వెళ్లిపోయాడు. ఆ మూత స్టీరింగ్ గేర్ (చుక్కాని యంత్రం) ఉండే కంపార్ట్‌మెంట్‌లో ఉంది. ఛీఫ్ ఇంజినీరుగా రోజూ బ్రేక్‌ఫాస్ట్ కాగానే ఇంజిన్‌రూమ్‌ను ఒకసారి చుట్టిరావడం నాకు అలవాటు. తెరచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో జారి పడబోయాను. ఎలాగో బయటపడ్డాను. ముప్ఫై అడుగుల లోతు కలిగిన ఆ టాంక్‌లో పడిపోయి ఉంటే, ఏమి జరిగేదో ఊహించడం ఏమంత కష్టం కాదు. గుండె వేగంగా కొట్టుకుంది; వొళ్లంతా చెమటలు పట్టాయి; కాళ్లూ చేతులూ వణికాయి; అక్కడే కాసేపు కూర్చుండిపోయాను. టీ తాగి వచ్చాక ఆ ఫిట్టర్, టాంకు మూతను బిగించి వెళ్లిపోయేవాడు. నేను లోపల పడిఉన్న విషయం ఎప్పటికోగానీ ఎవరికీ తెలిసే అవకాశంలేదు. కేప్టెన్ ఫెర్నాండెజ్, ఫిట్టర్‌ని ఉద్యోగంలోంచి తీసేస్తానంటే అడ్డుకున్నాను. ఈ దుర్ఘటనను ఇప్పటికీ కుటుంబసభ్యులకు వెల్లడించలేదు.

మొత్తం రెండు నెలలకు పైగా సాగిన నౌకాయానం ముగించుకొని బోంబే చేరుకున్నాం.  కొస మెరుపుగా – పోర్ట్ పైలట్ షిప్పులో ఉండగానే ఇంజిన్ రూములో ప్రేలుడు సంభవించింది. బాగా సీనియర్ అయిన మా కేప్టెన్, ఆ కుర్ర పైలట్‌ని విస్కీ పోస్తూ ఎంటర్‌టైన్ చేశాడు. ఈలోగా తాత్కాలికంగా రిపేర్‌చేసి, ఇంజిన్ స్టార్ట్ చేశాం. షిప్పుని సురక్షితంగా జెట్టీకి  కట్టినప్పుడు అంతా సంబరపడ్డాం! ఎక్కడెక్కడ తిరిగినా, మనదేశానికి తిరిగివచ్చినప్పుడు కలిగే ఆనందమే వేరు.

అది మాకు గొప్ప విజయమేగానీ, ఎవరికి చెప్పినా ‘మీ డ్యూటీ మీరు చేశారు, అదేమన్నా గొప్ప విషయమా? జీతాలు తీసుకోవడం లేదా?’ అనే అంటారు. ఎవరికీ చెప్పని, చెప్పుకోలేని గాథలు నావికులందరీ జీవితాల్లోనూ దాగి ఉంటాయి. బహుశా అందుకే నావికుల మధ్య బలమైన అనుబంధం ఉంటుంది. ఒకే ఓడపై పనిచేసిన నావికుల మధ్యనైతే – కలసికట్టుగా పనిచేయడం, సంక్షోభాలను ఉమ్మడిగా ఎదుర్కోవడం – వీటిమూలాన సంఘీభావం, సాన్నిహిత్యం ఏర్పడతాయి. అయితే ఒక్కోసారి తగవులూ, స్పర్థలూ ఏర్పడే అవకాశం ఉంటుంది; నెలల తరబడి ఒకే చోట ‘బంధింపబడి’ ఉండటం, ప్రైవసీ లోపించడం ఇందుకు కారణాలు. కొందరు హాస్యంగా అనేవారు: ‘ఓడ అనేది నీటిమీద తేలే జంతు ప్రదర్శనశాల. సందర్శకులెవరూ అక్కడ అడుగు పెట్టరు గానీ, ప్రతీ జంతువూ, ఇతర జంతువుల్ని బాగా దగ్గరగా కనిపెట్టి చూస్తూనే ఉంటుంది!’

మొన్నమొన్నటి వరకూ సభ్యసమాజం నావికులని తాగుబోతులుగానూ, తిరుగుబోతులుగానూ చూసింది. మనదేశానికి గొప్ప నౌకారంగ చరిత్ర ఉన్నదిగానీ, ఎక్కడో ఆ గతంతో బంధం తెగింది. సముద్రప్రయాణం పాపం, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే దుస్థితికి చేరుకున్నాం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత భారతీయ నౌకారంగానికీ, (యుద్ధనౌకలతో మొదలుపెట్టి) నౌకలకూ, నావికులకూ గౌరవం ఏర్పడసాగింది. నేడు నౌకలలో వినియోగించే టెక్నాలజీ అత్యంత ఆధునికమైనది. వాటిని నడిపించేందుకు ఉన్నత విద్యార్హతలు, కఠినమైన శిక్షణ అవసరం. అంతేకాదు, వాణిజ్య నౌకారంగం, ఎన్నో శతాబ్దాలకు ముందుగానే ‘గ్లోబలైజ్’ అయిన అంతర్జాతీయ వ్యవస్థ. ఆ రంగంపై ఖండితమైన నిబంధనల నియంత్రణ ఉంటుంది.

***

మరుసటి సంవత్సరం, కంపెనీ ఆఫీసులో స్ట్యూవర్డ్ డిసూజా ఎదురై, ఆప్యాయంగా పలకరించాడు. అతడు మరో ఓడలో జాయిన్ అవుతున్నాడు. టీ తాగుతూ, పసిఫిక్ అనుభవాన్ని గుర్తుచేసుకున్నాం.

“మళ్లీ షిప్పులో అడుగుపెట్టనని ప్రతిఙ్ఞ చేశావు, మర్చిపోయావా?” అన్నాను, నవ్వుతూనే.

“అవును బడాసాబ్! గుర్తుంది. ఇదిగో, అబ్బాయి కాలేజీ చదువు వచ్చే ఏడాదితో అయిపోతుంది. వాడికో ఉద్యోగం దొరికిపోతే, నా మీద భారం తగ్గిపోతుంది. మా అమ్మాయి పెళ్లి కాగానే మానేస్తాను.”

అతడు ఎన్నటికీ ఆ ఉద్యోగం మానుకోలేడని నాకు తెలుసు.

[గమనిక: ఆధునిక నౌకలలో సాధనాలు, భద్రతా ప్రమాణాలు చాలా మెరుగుపడ్డాయి] [చిత్రాలు: వీకీపీడియా]

ఉణుదుర్తి సుధాకర్

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు