పేక మేడలు

“దుబాయ్ వచ్చి కూడా ఈ స్విఫ్ట్, బలెనో కార్లు ఏంటి బ్రో, చీప్‌గా… ఇక్కడ టాక్సీ వాళ్లు కూడా లెక్సస్, బెంజ్ నడుపుతారు,” అంటూ నా కలీగ్ పగలబడి నవ్వాడు.

“హహహ, అవును బ్రో… ‘బీ ఏ రోమన్ ఇన్ రోమ్’,” అంటూ మరో కలీగ్ అతనికి వంత పాడాడు.

వాళ్లతో పాటే టీ తాగుతున్న నా ముఖంలో రంగులు మారుతున్నాయని నాకే అర్థమవుతోంది. ‘వీళ్లు మాట్లాడేది నా గురించేనా?’

“హే విజయ్, నువ్వు ఏ కారు వాడుతున్నావ్?” ఇంకో కలీగ్ అమాయకంగా అడిగాడు.

“స్విఫ్ట్ డిజైర్,” అన్నాను. నా గొంతు నాకే కొత్తగా వినిపించింది.

ఒకరిద్దరు కళ్లతోనే నవ్వుకున్నారు. ఆ రోజు బ్రేక్ టైమ్ మొత్తం వాళ్లు వాడే పెద్ద పెద్ద కార్ల గురించి, వాటి పెర్ఫార్మెన్స్ గురించే మాట్లాడుకున్నారు. ఆ సంభాషణలో నేను ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోయాను.

సాయంత్రం ఆఫీసు నుంచి బయలుదేరి పార్కింగ్ వైపు వెళ్తున్నప్పుడు మొదటిసారిగా, మా ఆఫీస్ పార్కింగ్‌ను శ్రద్ధగా గమనించాను. బీఎండబ్ల్యూ, బెంజ్, లెక్సస్, ఆడి… అన్నీ లగ్జరీ కార్లు. ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు నిలబడి ఉన్నాయి. వాటి మధ్య, నా ఐదేళ్ల పాత కారు… రిమోట్ బటన్ నొక్కగానే వచ్చిన ఆ “కి, కి, కి” శబ్దం, నన్ను నేనే ఎగతాళి చేసుకుంటున్నట్లు అనిపించింది. ఆ లగ్జరీ కార్లన్నీ నన్ను చూసి నవ్వుతున్నాయనిపించింది.

ఆఫీసు నుంచి ఇంటికి రోజూ సాగే సాధారణ నలభై ఐదు నిమిషాల డ్రైవ్, ఈరోజు మాత్రం ఏదో కొత్తగా ఉంది. రోజూ తెలుగు పాటలు వింటూ, స్నేహితులతో మాట్లాడుతూ డ్రైవ్ చేసే నేను, ఈరోజు షేక్ జాయద్ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి కారునూ వింతగా గమనిస్తున్నాను. ‘కారులో ఉన్నవాళ్లు నన్నే చూస్తున్నారా? నా కారును చూసి నవ్వుతున్నారా?’ నాకు తెలియకుండానే వేల ఆలోచనలు నా మెదడును తినేస్తున్నాయి.

ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎప్పుడూ లేనిది ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నాను. ప్రతిరోజూ నా కారు పక్కన ఆగిన కారులోని మనిషి వైపు చూసి చిరునవ్వుతో పలకరించే నేను, ఈరోజెందుకో తలదించుకుని ఫోన్‌లో మునిగిపోయాను.

నా జీవితమంతా ఒక షార్ట్ ఫిల్మ్‌లా నా కళ్ల ముందు విండ్‌షీల్డ్‌ మీద నడుస్తున్నట్లుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని, దేవుడి దయవల్ల ఇవాళ ఒక మంచి పొజిషన్‌లో ఉన్నాను. అమ్మానాన్నల కష్టం ఎప్పుడూ మర్చిపోలేదు. వాళ్లకు ఇంటి దగ్గర ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాను.దేవుడు నాకు విన్నీని భార్యగా ఇచ్చాడు. విన్నీ వచ్చాక నా జీవితంలోకి పరిపూర్ణత వచ్చింది. ఆమె నా సపోర్ట్ సిస్టం. మాకు రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఇంకేం కావాలి? అంతా బాగుంది కదా? జీవితం ఆటోపైలట్‌ మీద సుఖంగా సాగిపోతోంది.

కానీ, ఉదయం ఆఫీసులో సహోద్యోగులతో జరిగిన చర్చ ఎందుకో మనసులోంచి పోవట్లేదు. నా ఈ ముప్పై ఏళ్ల జీవితంలో, నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించుకోలేదు. చిన్న చిన్న సంతోషాలు ఎన్నో వదులుకున్నాను, కొన్నిసార్లు వదులుకోవాల్సి వచ్చింది. చిన్నప్పటి నుంచీ డబ్బుతో నాకు ఒకరకమైన లవ్- హెట్ రిలేషన్షిప్. బహుశా, ‘డబ్బు’ అనే రెండక్షరాల వస్తువు లేకపోవడం వల్ల ఇంట్లో అమ్మానాన్నలు పడిన ఇబ్బందులు, వారు గడిపిన నిద్రలేని రాత్రులను దగ్గరగా చూడటమే దానికి కారణమేమో.

 

 

ఇప్పుడేమైంది? బాగానే సంపాదిస్తున్నాను కదా! దుబాయ్ వచ్చి రెండేళ్లు అవుతోంది. పన్నులేని ఆదాయం (ట్యాక్స్-ఫ్రీ ఇన్‌కమ్), చిన్న చిన్న పెట్టుబడులు (ఇన్వెస్ట్‌మెంట్స్) కూడా చేస్తున్నాం. మరి, ఇప్పుడు కూడా ఎందుకు కోరికలు చంపుకోవాలి?

ఇలా కోరికలన్నీ చంపుకుంటూ పోతే, ఇక బతకడం ఎందుకు? ఈ సంపాదన, ఈ పొదుపు (సేవింగ్స్), ఈ పెట్టుబడులు… అన్నీ దేనికి? మహా అయితే, నేను బతికేది మరో ఇరవై, ముప్పై ఏళ్లే కదా?

ఇలాంటి ఏవేవో ఆలోచనలతో పోట్లాడుతూ ఇంటికి చేరుకున్నాను.

అపార్ట్‌మెంట్ పార్కింగ్‌లో కూడా అదే దృశ్యం; ఎటు చూసినా లగ్జరీ కార్లే.దించిన తల ఎత్తకుండా నా ఫ్లాట్ ముందు వచ్చి నిలబడ్డాను. కాలింగ్ బెల్ కొట్టగానే, నా భార్య విన్నీ నవ్వుతూ తలుపు తీసింది. నా రెండేళ్ల కొడుకు బోసి నవ్వులతో పరుగెత్తుకుంటూ వచ్చి నా కాళ్లకు చుట్టుకున్నాడు. కానీ నేను, రోజూలా వాడిని ఎత్తుకోలేదు; విన్నీని కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టనూ లేదు.

నా చేతిలోని లంచ్ బాక్స్ అందుకుంటూ విన్నీ, “ఏమైంది? ఆఫీసులో ఏమైనా సమస్యా?” అని అడిగింది.

నేను ఏమీ మాట్లాడలేదు. షూస్ తీయకుండా నేరుగా వెళ్లి హాలులో ఉన్న సోఫాలో కూలబడ్డాను. నా ప్రవర్తనలోని మార్పును గమనించిన విన్నీ, రోజూలాగే నా కోసం అల్లం టీ పెట్టడానికి వంటగదిలోకి వెళ్లింది.

నేను టీవీలో యూట్యూబ్ తెరిచి, “నిస్సాన్ పెట్రోల్ 2025 – టాప్ ఎండ్ మోడల్ రివ్యూ” అని వాయిస్ సెర్చ్ చేసి, వీడియో చూడటం మొదలుపెట్టాను. నా కళ్లు వీడియోపైనే ఉన్నా, నా మనసు మాత్రం ఆఫీసులో జరిగిన చర్చ చుట్టూనే తిరుగుతోంది. రోజూ ఇంటికి రాగానే విన్నీ టీ చేస్తుంటే కొడుకును ఎత్తుకుని కబుర్లు చెప్పే నేను, ఇవాళ మాత్రం ఏదో పట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాను.

కాసేపట్లో విన్నీ టీ తీసుకుని హాలులోకి వచ్చింది. నేను ఆమెను గమనించలేదు. “విజయ్, నాకు భయమేస్తోంది. ఏమైంది?” అంటూ విన్నీ కంగారుగా అడిగింది.

“విన్నీ, నేను కొత్త కారు కొనాలనుకుంటున్నాను,” అన్నాను, టీవీ పైనుంచి కళ్లు తిప్పకుండా. “కొత్త కారా? ఎందుకు? మన కారు బాగానే ఉంది కదా,” అంది ఆశ్చర్యంగా.

“లేదు విన్నీ. ఐ వాంట్ యాన్ అప్‌గ్రేడ్,” అన్నాను నేను.

“అదేంటి విజయ్? ఎప్పుడూ నాతో చర్చిస్తావు కదా? ఏమైందో చెప్పు,” బతిమాలింది.

“ఆఫీసులో అందరూ లగ్జరీ కార్లు వాడుతున్నారు. నా ఒక్కడిదే పాతస్విఫ్ట్ డిజైర్ కారు. నాకు సిగ్గుగా ఉంది.” నాలోని ఆవేదనంతా ఒక్కసారిగా బయటకొచ్చింది.

“అయ్యో… సిగ్గెందుకు విజయ్, డోంట్ బి సిల్లీ… అయినా ఎవడో ఏదో అన్నాడని మనం లక్షలు ఖర్చుపెట్టాలా? ఈ దుబాయ్ ట్రాఫిక్‌లో ఏ కారైతే ఏంటి? మనల్ని ఒకచోట నుంచి మరోచోటకు తీసుకెళ్లడమే కదా దాని పని,” విన్నీ నన్ను సముదాయించడానికి ప్రయత్నించింది.

నేనేమీ మాట్లాడలేదు.

“అయినా, ఇప్పటికప్పుడు కొత్త కారంటే ఫైనాన్షియల్‌గా ఎలా విజయ్? మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితి తెలుసు కదా?” అని మళ్లీ అడిగింది.

“లోన్ తీసుకుంటాను విన్నీ,” అన్నాను మొండిగా.

“లోనా? విజయ్, లేనిపోని ఒత్తిడి కొని తెచ్చుకోకు. ఇది నీ ఆలోచన కాదు, నీ గురించి నాకు బాగా తెలుసు. ప్లీజ్, ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించు,” ఆమె గొంతులో ఆందోళన స్పష్టంగా ఉంది.

“అసలు, నీకు ఈ దుబాయ్ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ అంటేనే చిరాకు కదా విజయ్? బయటికి వెళ్లిన ప్రతిసారీ ఆ ట్రాఫిక్‌లో నువ్వు ఎత్తుకునే తిట్ల దండకం గుర్తులేదా? అలాంటిది, నువ్వు సడెన్‌గా కొత్త లగ్జరీ కారు, అదీ లోన్ మీద కొనడమా? ప్లీజ్ విజయ్…”

ఆమె గొంతు వినిపిస్తూనే ఉంది, ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ… కానీ, ఆమె మాటలేవీ నా చెవికి ఎక్కలేదు. నా మెదడుకు నేను అప్పటికే తాళం వేసేశాను.ఆ తర్వాత కొన్ని రోజులు మా మధ్య యుద్ధమే జరిగింది. చివరికి, నేనే గెలిచాను.

ఎంతైనా మొగుడిని కదా!

 

*

ఒక నెల తర్వాత, షోరూంలో నా కొత్త నిస్సాన్ పెట్రోల్ కారు తాళాలు అందుకుని ఒంటరిగానే ఇంటికి బయలుదేరాను.

ట్రాఫిక్‌లో ఎవరైనా నన్ను, నా కొత్త కారును చూస్తున్నారేమోనని గర్వంగా అటూ ఇటూ చూశాను. అందరూ కారును చూస్తున్నారు కానీ, లోపల ఉన్న నన్ను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు.

ఇంటికి రాగానే బిల్డింగ్ వాచ్‌మెన్ మాత్రం ఉత్సాహంగా…

“సార్ కొత్త కారా? సూపర్ కలర్! మీకు బాగా సూట్ అయ్యింది సార్,” అన్నాడతను. ఆ మాటకు కాస్త గర్వపడ్డాను. కాసేపటికి, “సార్, కొత్త కారు కొన్నారు, మరి మామూలు సంగతేంటి సార్?” అని చేయి చాపాడు.

అప్పు చేసైనా పెద్ద కారు కొన్నానన్న దర్పం, జేబులోంచి వంద దిర్హామ్‌ల నోటు తీసేలా చేసింది. ఆ నోటు చూడగానే సెక్యూరిటీ గార్డు ముఖం లైట్ షోలోని బుర్జ్ ఖలీఫాలా వెలిగిపోయింది.

ఆఫీస్ వాట్సాప్ గ్రూప్‌లో కారు ఫోటోలు పెట్టాను. ఒకరిద్దరు లైకులు, హార్ట్ సింబల్స్‌తో అభినందనలు తెలిపారు. మరుసటి రోజు ఆఫీసులో కలీగ్స్ అందరూ కొత్త కారు కొన్నందుకు పార్టీ అడిగారు (అడగడం కన్నా బలవంతం చేశారనాలి). రెస్టారెంట్ కూడా వాళ్లే నిర్ణయించారు, అదీ ఖరీదైన జపనీస్ రెస్టారెంట్. కనీసం ‘కంగ్రాట్స్’ అని కూడా చెప్పనివాళ్లు, ఫ్రీ లంచ్ అనగానే వచ్చి వాలారు.

అలా కొత్త కారుతో నా జీవితంలో ఎటువంటి మార్పూ లేకుండా, అంతా ముందులానే నడుస్తోంది. రోజూ అదే ట్రాఫిక్, అవే రోడ్లు, అదే ఫ్రస్ట్రేషన్. ప్రతి రోజూ విన్నీతో, “మన కొత్త కారులో డెసర్ట్ సఫారీకి వెళదాం, క్యాంపింగ్‌కు వెళదాం, ఆఫ్‌రోడింగ్ చేద్దాం,” ఇలా ఏదో ఒకటి చెబుతూనే ఉంటాను. కానీ వీకెండ్ వచ్చేసరికి అలసిపోయి, ఆ ట్రాఫిక్‌కు భయపడి ఇంట్లోనుంచి కదిలేవాడిని కాదు.

ఈ కొత్త కారు వల్ల ఏమైనా మారిందా అంటే ,నెల నెలా నా అకౌంట్ నుంచి డెబిట్ అయ్యే EMI, అమాంతం పెరిగిన కారు మెయింటెనెన్స్ ఖర్చులు.

ఈ అనవసరపు అతిథి వల్ల మా జీవనశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు బయటికి వెళ్లినప్పుడు కొడుకు ఏదైనా కావాలని అడిగితే ఆలోచించకుండా కార్డు స్వైప్ చేసే నేను, ఇప్పుడు రెండు మూడు సార్లు విన్నీ వైపు ‘అవసరమా?’ అన్నట్లు దీనంగా చూస్తున్నాను. నెలాఖరులో ఎక్సెల్ షీటులో డబ్బుల లెక్కలు తేలక విన్నీపై చిరాకు పడుతున్నాను.

మొదటిసారిగా నా భుజాలపై ఒక అనవసరపు బరువును మోస్తున్నానన్న భావన కలిగింది. ఆ బరువును మూడేళ్లు మోయాలి. పాపం, నాతో పాటు నా భార్య, కొడుకు కూడా…

అలా ఒక సంవత్సరం గడిచింది. ప్రతినెలా కట్ అయ్యే ఈఎంఐకి మేమూ మెల్లగా అలవాటు పడుతున్నాం .అలా అన్నీ సర్దుకుంటున్నాయి అనుకుంటున్న తరుణంలో, ఒకరోజు మేము ఊహించనిది జరిగింది.

నేను పనిచేస్తున్న ఆఫీసులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మా పాలిట యముడిలా మారింది. దానివల్ల మొదలైన డౌన్‌సైజింగ్‌లో నా ఉద్యోగం కూడా పోయింది. చేతిలో రెండు నెలల నోటీసు పీరియడ్ లెటర్ పెట్టారు. ఆ క్షణం నా కాళ్ళ కింద భూమి కంపించినట్లయింది.

నాకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయడం మొదలుపెట్టాను. నా కాంటాక్ట్స్, నా రెఫరెన్సులు అన్నీ వాడేశాను. ఒకటి రెండు చోట్ల జాబ్  ఆఫర్ వచ్చేలానే ఉంది, కానీ వాళ్లకు సమయం కావాలి. నా దగ్గర మాత్రం సమయమే లేదు.దుబాయ్‌లో జిందగీ జాబ్ ఉన్నంతసేపు మాత్రమే. జాబ్ పోతే రెసిడెన్సీ వీసా రద్దు అవుతుంది, పెట్టేబేడా సర్దుకుని తిరిగి ఇండియా వెళ్ళిపోవాలి, ఈ నోటీసు పీరియడ్ లోనే కొత్త జాబ్ ఆఫర్ లెటర్ చేతిలో ఉండాలి, వీసా ట్రాన్స్‌ఫర్ జరగాలి. అది అసాధ్యమని నాకు అర్థమైపోయింది. ఇక లాభం లేదని, ఫైనల్ ఎగ్జిట్… అంటే, ఇండియా తిరిగి వెళ్ళిపోవడమే ఇక మిగిలిన దారి అని నిశ్చయించుకున్నాను.

నిజానికి, ఇలాంటి రోజు ఒకటొస్తుందని మాకు తెలుసు . దానికి తగ్గట్టుగానే మాకంటూ ఒక ప్లాన్ కూడా ఉంది. నాకున్న ఎక్స్‌పీరియన్స్, టెక్నికల్ నాలెడ్జ్‌కి ఇండియాలో ఒకట్రెండు నెలల్లో జాబ్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మళ్ళీ అక్కడ కొత్తగా జీవితం మొదలుపెట్టొచ్చు. ఇల్లు, సంసారానికి కావాల్సినవన్నీ సర్దుకోవడం కొంచెం తలనొప్పి అయినా, ఎలాగోలా మేనేజ్ చేసుకోగలం…

నార్మల్ గా ఐతే మా ప్లాన్ అంతా పర్ఫెక్ట్‌గా పని చేసేదే, కానీ నేను కొన్న కొత్త కారు నాకు ఒక పెద్ద తలనొప్పిలా తయారైంది. ఆ కారు కొని సంవత్సరమే అవుతోంది. ఇంకా రెండేళ్ల లోన్ మిగిలే ఉంది. ఇప్పుడు ఈ దేశం విడిచి వెళ్లాలంటే, ఆ లోన్ మొత్తం ఒక్కసారిగా కట్టేయాలి. అదీ మామూలు కారు కాదు, ఖరీదైన లగ్జరీ కారు. ప్రీ-క్లోజర్ ఛార్జీలు, మిగిలిన మొత్తం అన్నీ కలిపి ఇప్పుడు నేను కట్టాల్సిన మొత్తం… దాదాపు 18 లక్షలు. అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు. నా భవిష్యత్ మొత్తం ఇప్పుడు ఆ కారు చక్రాల కింద నలిగిపోతున్నట్లు అనిపిస్తోంది.

దుబాయ్, గల్ఫ్ దేశాల చట్టాల ప్రకారం, దేశం విడిచి వెళ్ళేముందు మన పేరు మీద ఉన్న ప్రతీ అప్పు తీర్చేయాలి. బ్యాంకు అకౌంట్లు, సిమ్ కార్డులు, ఇంటర్నెట్ కనెక్షన్లు… ఇలాంటివన్నీ క్లోజ్ చేసుకుంటే గాని ఫైనల్ వీసా ఇవ్వరు, అదంతా ఈ అరవై రోజుల్లో జరిగిపోవాలి .

అదే  విషయం విన్నీకి చెప్పాను.

ఆమె నవ్వాలో, ఏడ్వాలో తెలియని స్థితిలో, “అనుకున్నాను… మన జీవితం బాగున్నప్పుడే, ఒక వేళ ఏదైనా జరగరానిది జరిగి మనం కింద పడితే మళ్ళీ లేచి నడవడానికి కావాల్సినవి సిద్ధం చేసుకోవాలని ఎప్పుడూ అనుకునేవాళ్ళం కదా? అలాగే చేసుకున్నాం కూడా … కానీ నీ ఒక్క తప్పుడు నిర్ణయం మనల్ని ఎక్కడికి తెచ్చిందో చూశావా? అసలు ఆ కారు కొనకపోయి ఉంటే ఎంత బాగుండేది?… ఎలాంటి  ఇబ్బందీ  లేకుండా.  ఇండియా వెళ్లి పోయే వాళ్ళం.” ఆమె ప్రతీ మాట, ఒక తూటాలా నన్ను తాకుతుంది. తలెత్తి ఆమె ముఖంలోకి చూసే ధైర్యం కూడా నాకు లేదు.

“ఐ యామ్ సారీ విన్నీ,” అనడం తప్ప నేనేం చేయలేకపోయాను.

“సరేలే. ఇప్పుడు  ప్లాన్ ఏంటి?” అంది, తన కోపాన్ని, బాధను అణుచుకుంటూ.

“18 లక్షలు కట్టి ఆ లోన్ క్లియర్ చేయాలి. మన బాబు చదువు కోసం దాస్తున్న నా పాత కంపెనీ ESOPs ఉన్నాయి కదా… అవి అమ్మేయడం తప్ప మరో దారి కనిపించడం లేదు,” అన్నాను నిస్సహాయంగా.

“వద్దు విజయ్. ఇప్పుడు ఆ కంపెనీ స్టాక్ ధర ఆల్-టైమ్ లో లో ఉంది. ఈ సమయంలో అమ్మితే మనకు వచ్చేది నష్టమే. దానికి బదులు… నా బంగారం మీద లోన్ తీసుకుందాం. ఎలాగూ బ్యాంక్ లాకర్‌లోనే ఉంది కదా? దాని మీద ప్రీ-అప్రూవ్డ్ లోన్ కూడా ఉంది. ఆ డబ్బుతో ముందు ఈ గొడవ వదిలించుకుందాం. ఎలాగూ కారు అమ్మాలి కదా వచ్చిన డబ్బుతో దాన్ని మళ్ళీ తీర్చేయొచ్చు,” అంది, చాలా స్పష్టంగా, నిలకడగా.

ఆ మాటలు వింటుంటే, నా అహంకారం, నా తెలివితక్కువతనం నాకు స్పష్టంగా కనిపించాయి. నేను నా కొడుకు భవిష్యత్తును నాశనం చేయబోతుంటే, ఆమె తన విచక్షణ  అడ్డువేసి ఆపింది. ఆ క్షణంలో ఆమెపై నాకున్న ప్రేమ మరింత పెరిగింది.

“సరే విన్నీ, అలాగే చేద్దాం… థాంక్స్,” అన్నాను. నా గొంతులో, ‘విన్నీ, నీ మాటే వినాల్సింది!’ అన్న పశ్చాత్తాపం స్పష్టంగా ధ్వనిస్తోంది.

“ఇక చాలులే, నేనేం చేశానని… మళ్లీ ఇలాంటి తెలివితక్కువ నిర్ణయాలు మాత్రం తీసుకోకు, బాబూ. ఈసారి ఈ ఒత్తిడికి నా గుండె ఆగిపోతుందేమో,” అంది.

నేను వెళ్లి తన ఒడిలో వాలిపోయాను.

“సర్లే , ఇంతకీ కార్ సేల్ కి పెట్టావా” నా తల నిమురుతూ అడిగింది.

“అవసరం లేదు, ఆఫీస్‌లో అందరికీ విషయం తెలిసిపోయింది. చాలా మంది కార్ కావాలని అడుగుతున్నారు , కొత్త కారు కదా .”అన్నాను.

“లెట్ మీ గెస్… సగానికి సగం రేటుకు అడుగుతున్నారు కదా?” అని నవ్వింది.

“హహహ ! నువ్వు జీనియస్ విన్నీ”అంటూ  అవునన్నట్లు తలూపాను.

“బ్లడీ లీచెస్! మన అవసరాన్ని వాళ్లు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు,” అంది విన్నీ అసహనంగా.

వెల్కమ్ టు దుబాయ్, హబీబీ… అయినా, ఇదంతా నాకు ఒక కలలా ఉంది విన్నీ. నమ్మలేకపోతున్నాను. చూడు, మనం చూస్తుండగానే, ఎంతో ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకున్న ఈ ఉద్యోగం, ఈ లైఫ్‌స్టైల్… అన్నీ ఒక్కసారిగా ఎలా మాయమైపోయాయో!

మన ప్రవాస బతుకులు ఎంత  ఫ్రాజైల్ గా (fragile )ఉంటాయో కదా? ఏదో కొత్త టెక్నాలజీ వస్తుంది, మన ఉద్యోగం పోతుంది. ఎవరో కొత్త మేనేజర్ వస్తాడు; వాడికి మనమో, మన రంగో, మన మాట తీరో, మన మతమో నచ్చదు… ఉద్యోగం పోతుంది. లేదా, ఆ మేనేజర్ మనలాంటి ప్రవాసే అయితే, వాడి ప్రాంతంవాళ్లకో, కులంవాళ్లకో, తెలిసినవాళ్లకో ఉద్యోగాలిప్పించడం కోసం, ప్రమోషన్ల కోసం మనల్ని బలిపశువుల్ని చేస్తారు. ఏ రాజకీయ నాయకుడికో మూడ్ బాగోలేక, లేదా లోకల్ సపోర్ట్ కోసమో అప్పటిదాకా ఉన్న మైగ్రెంట్ పాలసీ మార్చేస్తాడు.

ఇలాంటివి ఒకటా రెండా?…మన ప్రవాస బతుకులు ఎలాంటివో తెలుసా విన్నీ? పిల్లలు కట్టే పేకమేడల్లాంటివి. ఎంత ఎత్తుగా, ఎంత అందంగా, ఎంత గొప్పగా  కట్టినా, ఏదో ఒక రోజు వాటన్నింటినీ కూల్చి, ఆ ముక్కల్ని డబ్బాలో సర్దుకుని వెళ్లిపోవాల్సిందే. ఈరోజు మనం, రేపో ఎల్లుండో మిగతా వాళ్లు… అంతిమంగా అందరూ సర్దుకుని వెళ్లాల్సిన వాళ్లే.

*

సంజయ్ ఖాన్

నా పేరు సంజయ్ ఖాన్. ప్రస్తుతం రియాద్, సౌదీ అరేబియా లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ప్రోడక్ట్ మేనేజర్‌గా పని చేస్తున్నాను. స్వస్థలం తెలంగాణలోని ఖమ్మం జిల్లా, మధిర మండలం, ఖాజీపురం గ్రామం.

చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , కథలు , కవిత్వం ఇష్టంగా చదువుతున్నాను, ఇవి నా జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించాయి. ఎప్పుడు కథలు చవడమే గాని రాయాలని అనుకోలేదు . అనుకున్న నేను రాయలేను ,లేదా రాసేంత సాహిత్య జ్ఞానం నాకు లేదులే అని తప్పించే వాడిని. కానీ గల్ఫ్ దేశాల్లో నేను చూసిన , మాట్లాడి తెలుసుకున్న మన తెలుగు వాళ్ళ వ్యధలు, కథలు నన్ను కదిలించి ఈ కథలు రాయడానికి నన్ను ప్రేరేపించాయి. పుస్తక పఠనంతో పాటు ట్రావెలింగ్, రన్నింగ్ నా హాబీస్.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Beautifully written! The way you connected personal emotions with larger realities is very touching. Truly thought-provoking.

  • Gulf దేశాల లోని peer pressure and other side of the coin .. దాని వల్ల వచ్చే మనసు మెదడు మధ్య సంఘర్షణ , తీసుకునే నిర్ణయాలు … బాగా వివరించారు Sanjay Garu… Gulf జీవితం స్థిరమైనది కాదు … ఒక పేక మేడ లాగ “అంతిమంగా అందరూ సర్దుకుని వెళ్లాల్సిన వాళ్లే ” అని మంచిగా ముగించారు .It was a realistic and impactful story. Keep Writing.. awaiting more of your stories. 😇🫡💫.

  • గల్ఫ్ జీవితాలు ఎంత దుర్భరంగా ఉంటాయో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఖాందాన్‌లో, చుట్టుపక్కల ఊళ్లల్లోంచి, చుట్టాలు, బంధువుల్లోంచి ఎంతోమంది అరబ్ కంట్రీస్‌కు వెళ్లారు. అలా వెళ్లి అక్కడ వాళ్లు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఈ కథలో కాస్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు కథానాయకుడు. వేరే కథల్లో చాలామంది కార్మికులుగా అక్కడ జీవితాలను చాలా నిస్సారంగా వెళ్లదీస్తున్న కథనాలు కోకొల్లలు. ఈ కథకు పెట్టిన టైటిల్ చాలా యాప్టెడ్ గా అనిపించింది. ఎప్పుడు తట్టాబేడా సర్దుకుని స్వదేశానికి వెళ్లిపోతామో తెలియని అధూరీ జివితాలు. పైకి కనిపించేంత దర్పం లోపల ఉండదు అని చెప్పిన కథ. పక్కవాళ్లను చూసి మన తహతుకు మించి అప్పులు చేసి షోకులు చేస్తే తర్వాత ఆ షోకులే బుసకొడతాయని, జీవితాలను ఆగం చేస్తాయని చెప్పారు. అక్కడి ప్రాంతీయత, జెండర్, జాతి వివక్షలు సమయాను సారం ఎట్లా పడగ విప్పుతాయో సుస్పష్టంగా చెప్పారు. మంచి కథ. చదువుతున్నంత సేపూ అక్కడి దుర్భర జీవితాలు కళ్లకు కట్టాయి. ఇక్కడ కూడా హైవేలా పుణ్యమా అని భూములకు అమాంతం రేట్లు వచ్చేశాయి. దీంతో చాలామంది బిల్డింగులు కట్టుకుంటున్నారు. వాళ్లను చూసి డబ్బు లేనివాళ్లు సైతం బ్యాంకు లోన్లు తీసి ఇళ్లులు కట్టుకుంటున్నారు, కార్లు కొంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా బ్యాంకులకు తమ జీవితాలను ఫణంగా పెడుతున్నవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. సంజయ్ ఖాన్ మంచి కథా రాశావ్ భాయ్. ఇంకా అక్కడి మనవాళ్ల జీవితాలను కథలుగా రాయి భాయ్. అక్కడివాళ్ల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా కథులుగా రికార్డు చేస్తున్న మీకు ధన్యవాదాలు అండ్ అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు