పక్షులు పిలుస్తున్నాయి…

పుస్తకం పేజీలు మూసేసినట్లు కనురెప్పలు మూసేసుకుంటే లోకాన్ని చదవడం మానేయగలమా?  కళ్లు మూసుకున్నప్పుడల్లా పుటలు గాలికి కొట్టుకున్న చప్పుడులా పక్షుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది. పక్షుల శబ్దాల్లో ధ్వనులు ఏ భాషను వ్యక్తం చేస్తున్నాయి?

ఎందుకో అవి నన్నే పిలుస్తున్నట్లు అనిపిస్తున్నది. వాటి పిలుపులో అనంత వాయువుల్లో కలిసిపోయిన మిత్రులు,సన్నిహితుల పలకరింపులు ధ్వనిస్తున్నాయేమో! సమీపించేసరికి అవి ఎగిరిపోయి నీలి ఆకాశంలో కలిసిపోయాయి.

నగరంలోకి అడుగుపెట్టినప్పుడల్లా  ఒక స్నేహితుడు పక్షిలా గాలిలోకి ఎగిరిపోయాడేమో అన్నఆలోచన వస్తోంది. చిన్నప్పుడు పక్షిలా గాలిలో ఎగిరి విహరిస్తే ఎంత బాగుండును అనుకునే వాడిని. స్వేచ్ఛా పిపాసిని కదా.. మనుషులు పక్షులుగా మారే సమయం కోసం జీవితాంతం నిరీక్షిస్తారేమో!

అమ్మ ను చూసి అప్పుడే ఏడాది దాటిపోయింది. ఒక రోజు ఆకులు రాలే వేళ  ఉదయం బాల్కనీలో అమ్మ నాతో మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది. ఎందుకో అప్పుడే పక్షులు శబ్దాలు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. అవి అమ్మను ఆహ్వానించాయని తర్వాత అర్థమైంది.ఇప్పుడు పక్షుల ధ్వనుల్లో అమ్మ స్వరాన్ని పోల్చుకుంటున్నాను.

స్వేచ్ఛకూ, విముక్తికీ తేడా లేదా? అన్న ప్రశ్న తాత్వికమైనది. ఏది స్వేచ్ఛ, ఏది విముక్తి అన్న ప్రశ్న పురాతనమైనది. అన్ని ఆందోళనలు,భయాలనుంచి విముక్తి చెందడమే ఆనందకరమైన జీవనానికి మార్గమని, అవిద్యనుంచి నివృత్తి చెందడం జననమరణాలకు అతీతమని తైత్తిరియోపనిషత్ లో  చెప్పిన తిత్తిరి పక్షులు ఇంకా మన చుట్టూ ఎగురుతూనే ఉన్నాయా?

పక్షుల చిన్న బుర్రల్లో ఉంది కేవలం స్వేచ్ఛ

పక్షుల చిన్న రెక్కల్లో  ఉన్నదీ స్వేచ్ఛే

పక్షుల చిన్న ముక్కుల్లోనూ, అల్పదేహంలోనూ

ఉన్నది స్వేచ్ఛే కదా..

పక్షులు మొత్తం ఆకాశానికి ఎగిరిపోతే

మొత్తం స్వేచ్ఛే వాటితో పాటు పైకి లేస్తుంది కదా!

అన్నాడు ప్రముఖ హిందీ కవి అవధేశ్ కుమార్.

స్వేచ్ఛను వెతుక్కుంటూ ఎగిరిపోయిన పక్షుల్లో  నేను ప్రేమించిన ఎందరికోసం

అన్వేషించాలి?

 

నేను చితాభస్మాన్ని

ఆమె ఫీనిక్స్

అన్నాడు శివసాగర్

బూడిదైపోయిన చితాభస్మాల్లోంచి  లేచి పక్షుల స్వరాల్లో నిన్నటి నినాదాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైంది.

చెట్లు కూలిపోయినప్పుడు

పక్షులు ఎక్కడ నివసిస్తాయి?

అని ఆవేదన చెందుతారు ఛాయావాద కవయిత్రి మహదేవి వర్మ.

కవి మరణిస్తాడు

పక్షి మరణించినట్లు

సంధ్యలో విలీనమవుతూ..

కవులూ, పక్షులూ

మళ్లీ రాని ప్రపంచం

ఏమైనా వస్తోందా?

అని భయపడతాడు మరో హిందీ కవి అలోక్ ధన్వీ.

ఆరేళ్ల క్రితం మరణించినా ఇంకా మన మధ్యే ఉంటున్నట్లు కనిపించే అద్భుత కవి కేదార్ నాథ్ దీ అదే భయం.

నాకేదీ గుర్తుండడం లేదు

పక్షుల పేర్లను

ఎంత సులభంగా మరిచిపోతున్నాను..

అంటారాయన.

అవును. నిద్రలోనూ, మెలకువ లోనూ, వేకువలోనూ, సంధ్యాసమయంలోనూ

పక్షుల కిలకిలా రావాలు జీవితాల్ని గుర్తు చేయకపోతే, జీవితంపై ఆశలు రేకెత్తించకపోతే, స్వేచ్ఛనూ, విముక్తినీ సార్థకం చేయకపోతే, మనతో కలిసి జీవించి పక్షులై పోయిన వారి జ్ఞాపకాలను మరిచిపోతే మనకూ రోడ్డుపై నడిచే వాహనానికీ తేడా ఏముంది?

అసలు పక్షుల్లేని ప్రపంచంలో మనుగడ ఒక జీవితమా?

అందుకే ఉదయమే పక్షులు తలుపు తట్టాలని ఆశపడతాను. బాల్కనీలో సూర్యకిరణంతో పాటు భూపాల రాగంలోనో, పంచమంలోనో  పిలిచే పక్షులకోసం తాపత్రయపడతాను. వాటి స్వరాల్లో, రెక్కల చప్పుడులో అమ్మా, నాన్నా,అమరులైన మిత్రులు పలకరించినట్లే భావిస్తాను.

పక్షులు దేవుడి పోస్ట్ మెన్

ఒక గోళం నుంచి మరో గోళంకు వెళతాయి

చెట్లూ, మొక్కలూ, నీరూ, పర్వతాలు మనను కాపాడతాయి

ఒక నేల తన పరిమళం మరో నేలకు పంపుతుంది.

ఆ పరిమళం గాలితో పాటు  పయనిస్తూ

పక్షుల రెక్కలపై తేలుతుంది

ఒక దేశంలో ఆవిరి మరో దేశంలో నీరుగా,

జలపాతంగా మారుతుంది..

అన్నాడు ప్రసిద్ద కవి దినకర్ ఒక కవితలో.

పక్షులు మరణించడానికి జన్మించలేదు..అంటాడు జాన్ కీట్స్ ‘ఓడ్ టు ద నైటింగేల్’ లో.  ప్రాచీన రాచరికపు రోజుల్లో విన్న స్వరాలే ఈ గతిస్తున్న రాత్రి వింటున్నాను అని చెబుతాడు కీట్స్.

అవును. పక్షులు మరణించవన్నదే నా నిశ్చితాభిప్రాయం కూడా. ఒంటరిగా గూడులో, చిమ్మ చీకటిలో కూర్చుని,చిక్కుకుపోయిన భావాల మధ్య దహించుకుపోయి ధగ్దమైనప్పుడు ఒక పక్షి నాలోంచి నిద్ర లేస్తుంది. తెరిచిన కిటికీల్లోంచి వినపడే పక్షుల పిలుపు నాకు నిన్నటి ఆత్మీయులను గుర్తు చేస్తుంది.

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ‘అవును. పక్షులు మరణించవన్నదే నా నిశ్చితాభిప్రాయం కూడా. ఒంటరిగా గూడులో, చిమ్మ చీకటిలో కూర్చుని,చిక్కుకుపోయిన భావాల మధ్య దహించుకుపోయి ధగ్దమైనప్పుడు ఒక పక్షి నాలోంచి నిద్ర లేస్తుంది. తెరిచిన కిటికీల్లోంచి వినపడే పక్షుల పిలుపు నాకు నిన్నటి ఆత్మీయులను గుర్తు చేస్తుంది.”

    మిత్రులు కృష్ణుడు గారు చాలా బాగా రాసారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు