ఎలా ఉన్నావని ఒక ఫోనైనా చేసి అడుగుతావనుకున్న
ఒకసారి కలుద్దామని చెప్పి అలాయిబలాయి ఇస్తావనుకున్న
ఆనందమేసినా దు:ఖమొచ్చినా నన్ను తలుచుకునే నువ్వు
ఇవాళ మొఖం చాటేయడం తట్టుకోలేకున్నరా
దోస్త్!
నన్ను చూడగానే మెరుపుల కెరటాలు దూకే నీ కన్నులు
రెప్పల కవాటాలు దించుకుంటాయనుకోలేదు
రంగుల దృశ్యాల నావిష్కరించే నీ మనసు
మౌన ముద్ర వేయడం నన్ను అమితంగా బాధిస్తున్నది
ఇవాళంటే ఇక్కడ కలిశాం
మరి రేపు???
అన్యాయమని తెలిసీ స్పందించని మనుషుల్లో
రకరకాల జంతు సంచారం కనిపిస్తోంది
-చెయ్యుండీ పిడికిలి బిగించలేని వాళ్లల్లో
-నోరుండీ నినదించలేని వాళ్లల్లో
-కాళ్లుండీ నిరసన ర్యాలీలో పాల్గొనని వాళ్లల్లో
-కవో రచయితో అయి ఉండి కలం కదలని వాళ్లల్లో
నిజమైన అవిటివాళ్లను చూస్తున్నాను
నువ్వలా కాదనుకున్న రా!
నీ మౌనం నన్ను బాధిస్తున్నది!
వాడు చూపమన్న ఆధారాలు ఇద్దరమూ చూపకున్నా
నువ్వు బొట్టు చూపించి వాణ్ని మచ్చిక చేసుకోవచ్చు
చూపించడానికి వాడికి కావలసింది నా దగ్గర ఏముందిరా!
నిన్ను అమితంగా ప్రేమించే నా హృదయం తప్ప!
నీకు తెలుసు, నా దేహంపై మత వేషధారణను అంగీకరించనివాన్ని
కానీ ఇవాళ కోట్ల మంది బాధితుల
టోపీలు, తెల్లని లాల్చీ పైజామాలు, మొఖంపై గడ్డాలు
నాకు ధిక్కార పతాకల్లా కనిపిస్తున్నాయి!
ఆత్మగౌరవ సూచికల్లా ఎగుస్తున్నాయి రా!
నాకు తెలుసు నువ్వు తేరుకుంటావని
సూర్యచంద్రులను మరిచి మనం ఈదిన చీకట్లను తడుముకొని
వెజ్ నాన్ వెజ్ మరిచి ఎద్దుదో మేకమాంసమో మరచి
తునకలు మజా చేసిన మన దోస్తానాను తలుచుకొని..
మజీదో గుడో మరిచి
అల్లుకున్న ఆలింగనాల గుండె బరువులు గుర్తొచ్చి
నన్ను చూడ్డానికి నువ్వొస్తావని తెలుసు
అప్పటికే సమయం మించి పోతుంది మిత్రుడా!
చిక్కి శల్యమైన నన్ను చూసి నువ్వు కుమిలిపోతావు
సందర్భం దాటిపోయాక నువ్వు పడే పశ్చాత్తాపం మీద
నాకేం స్పందనలు మిగిలి ఉంటాయి చెప్పు!
నిరందిగా నా మొఖమ్మీద ఒక సూఫీ నవ్వు విరుస్తుంది
కాకపోతే రాలిపోబోతున్న పుష్పమది
నేను సావర్కర్‌ను కాను రా..
రాజ్యానికి క్షమాపణ కోరి సాగిలపడడానికి
భగత్ సింగ్ అష్ఫాఖుల్లా ఖానుల్లా
ఉరికంబాన్ని ముద్దాడే వారసత్వం నాది!
వాడెవడో అడిగాడని
ఇప్పుడు నా పుట్టుకను అవమానించుకోలేను
ఎవడు గుర్తింపు పత్రాలు అడిగినా
గుప్పెడు మట్టి తీసి చూపిస్తాను!
ఈ మట్టి బిడ్డను నేను!
మరణం గురించి నాకే చింతా లేదు
నా చింతంతా నీ గురించే
చివరికి నీకు మిగిలే పశ్చాత్తాపం గురించే!
*
Painting: Pathan Mastan Khan

        		 
        	






Superb
స్కై,
బాగుంది. కనబడని జంతు సంచారం, నిశ్శబ్ద చీకటి.
Sky
Very much balanced & good poem
thank you anna! spandinche gunam kolpoyina friends ni chusthe jaalesthondi…
బాగుంది
వట్టిగా నిల్చున్న వాళ్లను నిలబెట్టినట్లుంది