నిత్య జ్వలన పోరాట గీతం సాయిబాబా జీవితం

ఉద్యమమే ఊపిరిగా బతికిన సాయిబాబా ఇక లేరు. ఈ సందర్భంగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వానికి ఆయన చేసిన అనువాదాలకు అఫ్సర్ రాసిన ముందు మాటలోని కొంత భాగాన్ని మీకు అందిస్తున్నాం.

క్కడ మొదలెట్టాలీ అన్న ప్రశ్న నిలదీస్తోంది నన్ను-

కచ్చితంగా సాయిబాబా జైలు లోంచి బయటికి ప్రపంచంలోకి అడుగు పెట్టిన రోజున చదవడం పూర్తిచేశాను ఆయన అనువాదంలో ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వ అనువాదాలు. చాలా యాదృచ్ఛికంగా జరిగింది ఇది. ఫైజ్ కి నివాళిగా మరో ప్రసిద్ధ కవి ఆఘా షహీద్ అలీ రాసిన కవితతో సాయిబాబా అనువాద సంపుటి ముగిసింది. ఆ కవిత చదివి, ఆ అశాంతిని నిలవరించుకోవడం కష్టంగా అనిపించి, కాసేపలా బయటి గాలి పీల్చుకుందామని గదిలోంచి బయటపడ్డాను.

మార్చి 9, శనివారం పొద్దున- మాడిసన్ చలిలో గదిలోనే వుండిపోవాలి నిజానికి! బయట ఎండగా కనిపించినా, అది మోసపు మెరుపే అని తెలుసు.

కానీ, ఫైజ్ ని చదివిన ఉద్వేగం గదిలో వుండనివ్వలేదు. బయటికి అడుగు పెట్టానో లేదో సాయిబాబా విడుదల వార్త నా మొబైల్ ఫోన్లో-

నిద్రపోయే సమయాలో, చదువుకుంటూ రాసుకుంటూ వుండే వేళలో మినహాయిస్తే, వొక గదిలో ఎన్ని గంటలు స్థిమితంగా వుండగలం?! మరీ ఎక్కువసేపు వుంటే వూపిరాడడం కష్టమే అవుతుంది. అందుకే, బయటి గాలి కోసం శరీరమూ మనసూ మెదడూ వొక్కసారిగా ముప్పేట దాడి చేస్తాయి. అలాంటిది- సాయిబాబా పదేళ్లుగా అనుభవిస్తున్న నరకాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?! అసలు ఆ నరకం వెనక కుట్రని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిత్యం విద్యార్ధుల మధ్యా, ఉద్యమ జీవుల మధ్యా విరామమెరుగక పనిచేసే ఆచరణవాదికి ఈ జైలు గది ఎలాంటి ప్రపంచం?!

సాయిబాబా అనువాదాలు చదువుతూ ఫైజ్ గురించి ఆలోచిస్తూనే వున్నా. నిజానికి వాళ్ళిద్దరి జైలు జీవితాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నా. 1951- 55 మధ్య అప్పటి పాకిస్తానీ ప్రభుత్వాన్ని కూల్చివేసే కుట్ర కేసులో  ఫైజ్ జైల్లో వుండాల్సి వచ్చింది. రావల్పిండి కుట్ర కేసుగా ఇది ప్రసిద్ధం. ఫైజ్ లాహోర్ జైలు నుంచి భార్యకి రాసిన ఉత్తరాలు ఈ మధ్యనే అచ్చయ్యాయి. వొక వుత్తరంలో ఆయన అంటారు:

From early morning till late evening one hears nothing but tales of horror and even though one ties shut one’s mind and one’s ears tight against them there is no escape from the horror or tragedy that surrounds one from every side. To be alone and ponder over it all is an unbearable pain and one has conceived a horror of being alone with one’s thoughts. It is difficult to see a path or a light in the gloom but one has to maintain one’s reason and one’s courage and I shall certainly maintain.

అదే స్థితిలో నేను సాయిబాబా గారిని వూహించుకుంటే, కాసేపటి వూహ కూడా అశాంతితో వుడికిపోతుంది. ఆ వుత్తరంలో ఫైజ్ చెప్తున్నాడు – చుట్టూరా అన్ని వైపులా విషాదాలే, అహింసే వినిపిస్తున్నప్పుడు ఆ స్థితిలో మనసుని కుదుటపరచుకోవడం ఎంత కష్టమో! అయినా సరే- one has to maintain one’s reason and one’s courage and I shall certainly maintain- అని  వొక వాక్యంలో అంటున్నంత తేలిక కాదు. ఫైజ్ అయినా, వరవర రావు అయినా, సాయిబాబా అయినా అలాంటి మనఃస్థితిని ఎలా దాటుకొచ్చారా అన్నది ఇవాళ మనం నేర్చుకోవాల్సిన జీవన పాఠం. జైలు గదులు వాళ్ళ ప్రపంచాన్ని ఏమాత్రం ఇరుకు చెయ్యలేదనీ, అవి మరింత విశాలమై, కొత్త రెక్కల్ని కట్టుకున్నాయని తెలిసినప్పుడు వాళ్ళని బంధించిన ప్రభుత్వాల మీద జాలేస్తుంది.

ఇందాక ఫైజ్ వుత్తరాల్లోని reason/ courage/ maintenance అనే మూడు పదాలు అవి కేవలం పదాలు కాదనీ, వాటి మూలాలు అలాంటి వ్యక్తిత్వాల మూలనదులని తెలిసి, జీవితం కొత్త రెపరెపలతో జెండా ఎగరేసినట్టే అనిపిస్తుంది.

*

అఫ్సర్

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • రాజ్యం ను ఎదిరించిన గుండె ఆగిపోయింది
    సామాజిక వ్యవస్థ ఓ ధీరుడిని కోల్పోయింది
    జోహార్ కామ్రేడ్ సాయిబాబా

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు